వేతన వ్యత్యాసాలు పి. దేవి

ఏ రకమైన ఉపాధి లభిస్తుంది, ఎంత వేతనం దొరుకుతుంది అనేది ఎక్కువ భాగం నిర్ణయించేది జెండర్‌. స్త్రీ, పురుషులు ఏ పని చేయగలరు, ఏది చేయలేరనేది వారి నైపుణ్యం, శక్తి, సామర్ధ్యాల వలన కాక ఆడ పనులుగా, మగ పనులుగా ముందే నిర్ధారించడం వలన ఆ దృష్టితోనే చూసి నిర్ణయిస్తారు. వ్యవసాయంలో నాట్లు, కలుపులు, కోతలు, శుభ్రం చేయడం, జల్లించడం వగైరాలు స్త్రీల పని. నారు కట్టలు వేయడం, దమ్ము, దుక్కి, కుప్ప వేయడం వంటివి మగ పనులు. వృత్తి పరిశ్రమల్లో, కుటీర పరిశ్రమల్లో అధికభాగం శ్రమ ఆడవాళ్ళది. యజమానులు మాత్రం పురుషులు. అలాగే హోం బేస్డ్‌ పనులన్నీ… బీడీలు, అగరొత్తులు, కొవ్వొత్తులు, మాలలు కట్టడం, ఎంబ్రాయిడరీ, గుండీలు, ప్లాస్టిక్‌ బుట్టలు, వెదురు వస్తువుల తయీరీ వంటి వాటన్నింటిలో స్త్రీలు మాత్రమే ఉంటారు.

బట్టీలు, నిర్మాణ పరిశ్రమలో నైపుణ్యంగల పని మగవారికి మాత్రమే. అత్యధిక శారీరక శ్రమ అవసరమైన నైపుణ్యంలేని బండ పనులు స్త్రీలవి. యంత్రాలతో పనిచేయించే ”టెక్నీషియన్స్‌” అంటే పురుషులే… కంప్యూటర్‌… అంటే అతని మేధోశక్తి… స్త్రీలు షరా మామూలే… ”చిప్స్‌” తయారీ లేదా చిల్లర పనులు లేదా సరఫరా, అమ్మకం వైపు ఉంటారు.

ఒకే పనికి సమాన వేతన చట్టాలు పనినిబట్టి వేతనాన్ని నిర్ణయించాయి. కానీ పని ఆడపని, మగపనిగా ఎంతోకాలంగా విభజించబడి ఉంది. కాబట్టి అధిక శ్రమ, తక్కువ వేతనం గల ఉపాధులు స్త్రీలవైపు వచ్చాయి. ఒకే పనిచేసినా మగవాళ్ళంత దేహ దారుఢ్యం లేదు కనుక అమితంగా శారీరక శ్రమ చేసిన ‘అబల’కు అతనంత వేతనం ఇవ్వరు. సాంప్రదాయక వృత్తులలో అంటే అలా జరిగింది, కానీ నేటి సాంకేతిక యుగం అలా కాదని ఎవరయినా అనుకుంటే వారు అమాయకులు లేదా అజ్ఞానులు అనుకోవచ్చు.

దుక్కి దున్నడం పోయి ట్రాక్టర్‌తో దున్నడం, దమ్ము చేయడం వచ్చాక ట్రాక్టర్‌ ఎవరు నడిపినా ఒక్కటే కదా! అసలు ట్రాక్టర్‌ నడిపే నైపుణ్యం స్త్రీలకు దొరికితే కదా. యంత్రాలు రాగానే అవి పురుషుడికి సొంతమయ్యాయి. స్త్రీలు శారీరక శ్రమలోనే ఉండిపోయారు. అందరూ కంప్యూటర్‌ కోర్సులు చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో చేరినా అమ్మాయిలకు అబ్బాయిలకంటే 22 శాతం తక్కువ వేతనం… కారణాలు అనేకం.

సత్య నాదెళ్ళ ”కర్మ చేస్తూ ఉంటే వెంటనే కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు గుర్తింపు వస్తుందని” మహిళా

ఉద్యోగులపై సానుభూతి కురిపించారు. అంటే మగవాళ్ళయితే చేసిన పనికి వెంటనే సరైన వేతనం, ఇతర సదుపాయాలు, ప్రమోషన్లు ఆశిస్తారు, డిమాండ్లు చేస్తారు, పొందుతారు. కానీ మహిళల్లారా! మీరు ఓర్పుగా ”ఫలితం” ఆశించకుండా పని చేస్తూ ఉంటే యాజమాన్యం దయతలచి మీకింత పడేస్తుంది… (మగాళ్ళలాగ) మీరు డిమాండ్లు చేయని బుద్ధిమంతులు అని మెచ్చుకున్నారన్నమాట. మగాళ్ళ పని ఎప్పుడయినా స్త్రీలకంటే నాణ్యమైంది, ప్రాధాన్యత కలది అని ‘జెండర్‌ మూస’ని మళ్ళీ వేరే దారిలో ప్రతిపాదించారన్నమాట.

స్త్రీలను తక్కువ చేసి రెండవ జాతి పౌరులుగా చూడటం ఆనవాయితీగా అలవాటయిన మన సమాజం స్త్రీల శ్రమను, సామర్ధ్యాన్ని తక్కువగా చేయడంలో ఆశ్చర్యం లేదు. వారి సామాజిక తక్కువతనం ఉపాధినిచ్చే వారికి లాభంగా మారుతుండడం వల్ల ‘జెండర్‌ మూస’ను వారు పెంచి పోషిస్తుంటారు.

మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు పురుషులకంటే 34 శాతం తక్కువ వేతనం పొందుతున్నారు. ఐటి రంగంలో ఇది 22 నుంచి 29 శాతం దాకా ఉంది. అసంఘటిత రంగంలో 73 శాతం దాకా ఉంది. వేతన వ్యత్యాసాలు ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో పరిమితమై లేవు. వ్యత్యాసం ఎంతస్థాయిలో ఉందనే దాంట్లో తేడాలు ఉన్నాయి. ప్రతిచోటా వ్యత్యాసాలు ఉండడమే కాదు అవి ఎక్కువవుతున్నాయని ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు కూడా గొంతు కలిపింది.

అతి తక్కువ వేతన వ్యత్యాసాలు గల దేశాలు – లాటిన్‌ అమెరికా 19 శాతం, మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా 14 శాతం… ఈ దేశాల్లో గత 15 సంవత్సరాలుగా మహిళా శ్రామికుల సంఖ్య పెరుగుతోంది.

స్త్రీలకు కుటుంబంలో ఉండే అదనపు బాధ్యతల వలన, చాకిరీ వలన సమాజంలోని వివక్షత వలన వారు గుమస్తా, టీచర్లు, నర్సులు, ఇతర సహాయ ఉద్యోగాల్లో, సేవా రంగంలో పరిమితమైన పని గంటలు ఉండే ఉపాధుల్లో 60 శాతంగా ఉన్నారు. మేనేజ్‌మెంట్‌ స్థాయిలో కేవలం 10 శాతమే ఉన్నారు. ప్రతి కంపెనీ తన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో కనీసం ఇద్దరు స్త్రీలను నియమించాలనే నియమం వచ్చింది. ఆ ఇద్దర్నీ కూడా కుటుంబాల నుంచే నియమించుకుంటున్నారు తప్ప కంపెనీలోని మహిళలకు పదోన్నతులు కల్పించడం లేదు.

సామాజిక వివక్షతలు సామర్ధ్యంపై, మూఢనమ్మకాలుగా స్థిరపడ్డాయి. దాంతో ఒకే పనికి సమాన వేతనం లభించకపోవడమే కాదు వారి సామర్ధ్యానికి, నైపుణ్యాలకు తగిన ఉపాధి లభించని స్థితి ఏర్పడింది.

సమాన పనికి సమాన వేతనం నినాదం రావడానికే కార్మిక సంఘాలకు చాలా కాలం పట్టింది. సాధారణ కూలీలకు ఇది ఇంకా జీర్ణం కానేలేదు.

స్త్రీల శ్రమ, ఉపాధి, ఉద్యోగ నైపుణ్యాల అవసరం ఎంతున్నా ఆర్థిక విలువ మాత్రం తక్కువగానే లెక్కగడతారు. దాంతో వేతన అంతరాలు కొనసాగుతుంటాయి.

ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వంటి ప్రభుత్వ పథకాల్లో పనిచేసే స్త్రీలు 50 లక్షలకు పైగా ఉంటారు. వారికి గౌరవ వేతనం పేర చెల్లించేది కనీస వేతనం చూడా కాదు. రెండో ఉపాధి రంగంగా ఉన్న చేనేతను పక్కనపెట్టి ఆ స్థానాన్ని ఇప్పుడు ఇంటి పనివారు ఆక్రమించారు. వీరి వేతనాలకు ఏ రకమైన ప్రామాణికతా లేదు. అడ్డా కూలీలతో మాదిరిగానే వీరితో బేరాలాడి పనిలో పెట్టుకుంటారు. విచిత్రం ఏమంటే అవే పనులు మగవాళ్ళు (చాలా తక్కువ మంది చేస్తారు) చేరితే వారికి ఎక్కువ చెల్లిస్తారు. ఎవరికయినా ఈ వేతనాల చెల్లింపునకు గ్యారెంటీ ఉండదు. పని భద్రత, హింస నుండి భద్రత ఉండదు.

అగరొత్తుల పరిశ్రమంతా స్త్రీలే. అగరొత్తులకు చెల్లించే ప్రతి వంద రూపాయల్లో 30 పైసలు మాత్రమే ఆ అగరొత్తులు తయారుచేసే స్త్రీలకు చేరుతుంది. కొన్న వారు చెల్లించే ప్రతి వంద రూపాయల్లో జర్దోసి (బంగారు ఎంబ్రాయిడరీ) చేసే స్త్రీలు కేవలం 15 రూపాయలు, బీడీలు చుట్టేవాళ్ళు 17 రూపాయలు పొందుతారు. యంత్రాలు కుట్టలేని గుండీలను కుట్టే స్త్రీలు ప్రతి గుండీకి 10 పైసలు సంపాదిస్తారు. వట్టణ ప్రాంతాల శ్రామిక స్త్రీలలో 30 శాతం వీరే. చిన్న వ్యాపారులు, గంపలతో అమ్మకాలు చేసేవారు, ఇంటి పనివారు, కుటీర పరిశ్రమల్లోని దినసరి కూలీలు కూడా ఇదే ఆదాయ వర్గంలో కలిసి ఉంటారు.

వీరిలో ఎక్కువ భాగం నిరక్షరాస్యులుగానో, సంతకం వచ్చినవారిగానో, ప్రాథమిక విద్యతో ఆపేసిన వారిగానో ఉంటారు. 20-30 సంవత్సరాల వయస్సు వారు 40 శాతం పైగానే ఉన్నారు. 30-40 సంవత్సరాల వయసువారు 29 శాతం ఉంటారు. 80 శాతం మంది వివాహితలు. 54 శాతం మందికి ముగ్గురు పిల్లలుంటే, 26 శాతం మందికి నలుగురు లేదా ఎక్కువ మంది పిల్లలున్నారు.

ఈ కుటుంబాల్లో ఇద్దరూ కూలీకి వెళ్ళేవారు 20 శాతం, పిల్లలతో సహా కూలికి వెళ్ళేవారు 74 శాతం. నెలకు రూ.2500 కంటే తక్కువ సంపాదనగల కుటుంబాలు 27 శాతం, ఐదు వేలు, ఆ పైన సంపాదించేది 51.7 శాతం.

దళితులు, ఆదివాసీలు, బాగా వెనుకబడిన కులాల మహిళలు, అసంఘటిత రంగంలో ఉన్నవారు 90 శాతం మంది. వీరిలో అందరూ దాదాపు నైపుణ్యం లేనివారని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

వీరిలో అద్దె ఇళ్ళల్లో, గుడిసెల్లో ఉండేవారు 91.8 శాతం, రోజుకి పది గంటలకు పైగా కూలి పని చేసేవారు 48.3 శాతం, కనీస వేతనానికి పది గంటలకంటే ఎక్కువగా పనిచేసేవారు 71.7 శాతం మంది ఉన్నారు. అసంఘటిత రంగంలో మహిళల పనిదినం అంటే కనీసం 9 గంటల పని. అయినా వేతనం మాత్రం 43 శాతం వరకూ తక్కువ ఉంటుంది.

మా దేశంలో శ్రమ కారుచౌకగా లభిస్తుంది, ప్రజల వనరులన్నీ భూమి, నీరు, గాలి… అన్నీ అప్పనంగా ఇస్తాం రండి, పరిశ్రమలు స్థాపించండని ప్రభుత్వాలు విదేశాలకు వెళ్ళి ఆ కార్పొరేట్ల కాళ్ళా వేళ్ళా పడుతున్నాయి. దాంతో ఉపాధి భారీగా పెరిగిపోతుందని పాతికేళ్ళుగా ప్రచారం చేస్తున్నారు. రెండున్నర కోట్ల ఉద్యోగాల ఆశ చూపి అధికారం పొందిన ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఇప్పటికి ఐదు లక్షల

ఉద్యోగాలు కూడా రాలేదు. ఏటా కార్పొరేట్లకు 48 వేల కోట్ల రాయితీలను కట్టబెడుతున్నారు. కానీ కార్పొరేట్లు ఎక్కువ ఆదాయం ఇచ్చే నైపుణ్యం గల ఉద్యోగాలు వారి దేశస్థులకు ఇచ్చి కొన్ని మాత్రం ఈ దేశస్థులకు విదిలిస్తున్నాయి. ఎక్కువ భాగం మానవ శ్రమ అవసరమయ్యే పనినంతా క్యాజువల్‌ పీస్‌ రేట్‌ పద్ధతిలో మహిళలతో చేయిస్తున్నాయి.

ఇలా ఇంట్లోనే పనిచేయడం అంటే స్త్రీల ఇంటిపని భారం వారిపై కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయం లేకపోవడం, ఇంటి పని అంటే ఆడపని అని నిర్ధారించబట్టి స్త్రీలు వేరే దారిలేక ఇంటిలో చాకిరీకి అదనపు చాకిరీగా ఈ గృహాల్లోనే ఉండి చేసే వేతన శ్రమ చేస్తున్నారు. దీనిలో వేతనం చాలా తక్కువ. ఏ రకమైనా నమోదు ఉండదు. పైగా ఏ ఉద్యోగ భద్రత, కనీస వేతనం, ఆరోగ్య భద్రత, ఇతర ఏ సదుపాయాలూ ఉండవు. ఇవన్నీ ఈ పీస్‌రేట్‌ మహిళా కార్మికులకు ఇవ్వకపోవడం ద్వారా కార్పొరేట్లకు కోట్లాది రూపాయలు ఆదా అవుతాయి.

80వ దశకంలో విద్యా వైద్యరంగాల్లో పబ్లిక్‌ సెక్టార్‌లో స్త్రీలకు చాలా ఎక్కువ ఉపాధి లభించింది. ఇవి పర్మినెంటు ఉద్యోగాలు. ప్రభుత్వం కాబట్టి ఉద్యోగాన్ని బట్టే వేతనం లభించింది. కాని ఇప్పుడు ప్రభుత్వం తన సాంకేతిక పనులకు కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవటం లేదా అవుట్‌సోర్సింగ్‌ను ఇవ్వడం ప్రారంభించింది. సాధారణంగా ఈ పనిచేసే స్త్రీలకు అదే రంగంలో అదే పనిచేసే పురుషుల కంటే తక్కువ ఆదాయం ఎక్కువ పనిగంటలు ఉంటాయి.

పైగా భారతదేశంలోని కార్పొరేటు యాజమాన్యాలు స్వదేశీవైనా, విదేశీవైనా సాధారణంగా మిగిలిన దేశాల్లో స్త్రీలు చేసే ఉద్యోగాలలో కూడా ఇటీవల మగవాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దాంతో వారికంటే తక్కువ జీతానికి పనిచేయడానికి అదే అర్హతగల స్త్రీలు సిద్ధపడక తప్పడం లేదు. ఈ ఐటీ రంగంలో కూడా ఆదాయం తక్కువ లభించడానికి కారణం ఉద్యోగంలో చేరిన కొంత కాలానికే మహిళలు పెళ్ళి, తర్వాత సంతానం అని సెలవులు పెడతారు లేదా మానేస్తారు కనుక వారి కాంట్రాక్టులో ఈ షరతు ఉంటోంది. ప్రసూతి సౌకర్యాలు ఎగ్గొట్టడానికి కంపెనీలే టెర్మినేట్‌ చేయడం మామూలే. ఈ మహిళలు మళ్ళీ

ఉద్యోగంలోకి వచ్చినపుడు ”గ్యాప్‌” వచ్చిందనే పేరుతో మళ్ళీ మొదట చేరిననాటి జీతం కానీ, అప్‌డేట్‌ కావాలనే పేరుతో అంతకంటే తక్కువ వేతనంతో కానీ తీసుకుంటారు.

మొత్తంగా చూసినపుడు దక్షిణాసియా దేశాల్లో వేతన వ్యత్యాసం 33 శాతం అయితే, అభివృద్ధి చెందిన దేశాల్లో 23 శాతం. అయితే ఇది తూర్పు ఆసియాలో 20 శాతం. అతి తక్కువ వేతన వ్యత్యాసం

ఉన్నది మధ్య ఉత్తర ఆఫ్రికా… ఈ దేశాల్లో అత్యధిక శాతం మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉండడం గమనార్హం. అలాగే ఇవి ప్రధానంగా ”వెనుకబడిన” తెగల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే దేశాలు. ఆదివాసీ తెగలలో స్త్రీల శ్రమ పట్ల గౌరవం, ప్రాధాన్యత దీనికి కారణం కావచ్చు.

ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ఈ సంవత్సరం మార్చిలో జరిగిన చర్చా వేదికలో స్త్రీలకు ప్రాధాన్యమిచ్చే దిశగా ఆర్థిక వ్యవస్థలను మార్చాలని పిలుపునిచ్చింది. ఆర్థిక విధానాలను నిర్ణయించే ప్రభుత్వాలలో స్త్రీల ప్రాతినిధ్యం పెంచాల్సిన అవసరాన్ని మళ్ళీ నొక్కి వక్కాణించింది. విధాన నిర్ణయాలలో సంక్షేమం, ఉపాధి అవకాశాలు, ఉపాధి భద్రత ఇతర సదుపాయాలకు పెద్ద పీట వేయాలని సభ్యదేశాలను కోరింది. స్త్రీల హక్కుల పత్రంపై సంతకం చేయడంద్వారా స్త్రీలపై అన్ని రకాల వివక్షతలను నిర్మూలిస్తామని యిచ్చిన హామీలో వ్యత్యాసాలు తొలగించడం కీలక కర్తవ్యంగా పేర్కొంది. ఆయా దేశాలు దీన్ని ఎంతవరకూ పట్టించుకుంటాయో వేచిచూడాల్సిందే.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.