బీహారు విధాన పరిషత్‌ – విధాన సభలో వివాదాలు రాజనైతిక సంస్మరణలు – నిర్ణయాలు రమణిక గుప్తా (అనువాదం: సి. వసంత)

స్త్రీ అయినందుకే…

స్త్రీల పట్ల రాజకీయ నేతల దృష్టి వింతగా ఉంటుంది. ఒకవేళ స్త్రీ వాళ్ళని కాదన్నా, చెంపపెట్టు సమాధానం చెప్పినా వాళ్ళు భరించలేరు. ఆమె శీలం లేనిదని ప్రచారం చేస్తారు. రాజకీయాల్లో మహిళలను అవమానించే పరంపర ఉండనే ఉంది. ఒకవేళ ఆమె వాళ్ళకు లొంగకపోతే – ”నా వెనకపడింది. అబ్బ ఎలాగోలా వేరేవాళ్ళకు అప్పగించి దాన్ని వదిలించుకున్నాననుకో” అంటూ ప్రచారం చేస్తారు.

ఈ నేతల దగ్గర ఆడవాళ్ళని మంచిమాటలు చెప్పి వలలో వేసుకోవడానికి కొందరు దళారులు ఉంటారు. వీళ్ళు కేవలం స్త్రీలను డీమోరలైజ్‌ చేయడానికి, నిరుత్సాహపడడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. దీనివల్ల రాజకీయాలలో ప్రవేశించే మహిళలు ఇక తప్పదని వీళ్ళ షరతులకి ఒప్పుకుని తొత్తుల్లా పడి ఉంటారని వాళ్ళ ఉద్దేశ్యం.

స్త్రీ అయినందుకు విధాన పరిషత్‌లో, విధాన సభలో ఎన్నోసార్లు కఠిన సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నన్ను అణచివేయాలని చూసే వాళ్ళు, భయపెట్టేవాళ్ళు. అయినా నేనెప్పుడూ తలవంచలేదు, భయపడలేదు. అసలు స్త్రీ అయినందుకే నేను మాఫియాని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను. పురుషుడు ఈ విధంగా చేయడం కష్టం. ప్రజలు పురుషుల ఫిర్యాదులను అంత గంభీరంగా పట్టించుకోరు. పురుషుడ్ని చంపడానికి మాఫియా వెనుకాడదు. నేను స్త్రీని, నన్ను చంపితే పెద్ద దుమారం రేగుతుంది. స్త్రీ పైన దాడి చేస్తే పురుషుడి ఇమేజ్‌ బయట ఎలాగూ పాడవుతుంది, బహుశా అంతరంగంలో కూడా. తనను తాను తక్కువ చేసుకుంటాడు. ప్రజలు అతని పురుషత్వాన్ని, శౌర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో ప్రశ్నలు వేస్తారు. ”ఎలాంటివాడివిరా? ఆడదానిపై దాడి చేస్తావా? చెయ్యెత్తుతావా?” అని అంటారు. ఒకసారి సూరజ్‌ దేవ్‌ సింహ్‌ ఎవరితోనో అన్నారు – ”రమణికా గుప్తా ఆడదయింది. లేకపోతే నేను గుణపాఠం నేర్పేవాడిని”. ఒకవేళ ఆ స్త్రీ భర్తతో కనుక ఉండకపోతే ఎదుటి వాడి సంగతి ఇక చెప్పనవసరమే లేదు.

…. …. ….

ఎత్తైన కొండలా ఉన్న కండలు తిరిగిన నల్లరాయి

ఎమ్మెల్సీ వినోద్‌ సింహ్‌, ఆయన కాంట్రాక్టర్‌ హరవంశ సింహ్‌లు పలామ్‌ అడవుల నుండి కట్టెలు దొంగతనం చేసి అమ్మేవాళ్ళు. నేను విధాన పరిషత్‌లో ప్రశ్నవేసి ఆయనని గూండా యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేయమని డిమాండ్‌ చేశాను. ఆయన విధానసభ బయటే నన్ను ఆపి బెదిరించడం మొదలుపెట్టారు.

ఆయన విధానసభ కారిడార్‌ బయట నేను వెళ్తుంటే నా దారికి అడ్డువచ్చి బెదిరించడం మొదలుపెట్టారు – ”నన్ను గుర్తుపట్టావా? నేనెవరిని?”

నేను తల ఎత్తి చూశాను. ఎత్తైన కొండలా ఉన్న కండలు తిరిగిన నల్లరాయిలా ఉన్న ఒక పురుషుడు నా ఎదురుగుండా నిల్చున్నాడు.

”మీరు వినోద్‌ సింహ్‌ కదూ” అడిగాను నేను.

”చాలా ప్రశ్నలు వేస్తున్నావే! నీ ప్రశ్నని వెనక్కి తీసుకో. ఇదంతా తప్పుడు పని” అన్నారు. నేను ఆయనను కిందనుండి మీదదాకా చూసి దృఢంగా అన్నాను. – ”మీరు వినోద్‌ సింహ్‌ కదా! నేరారోపణ తప్పు కాకపోతే మీకెందుకు భయం. ప్రభుత్వం ఈ నేరారోపణని తప్పని నిరూపిస్తుంది. అంతేకాని నేను ఛస్తే నా ప్రశ్నని వెనక్కి తీసుకోను” అన్నాను.

”అయితే సిద్ధంగా ఉండు. నేనేమిటో నీకు చూపిస్తాను” – ఇలా బెదిరిస్తూ విధాన సభకు వచ్చారు.

నేను అధ్యక్షుడి వద్దకు వెళ్ళి జరిగిన సంఘటనను గురించి ఫిర్యాదు చేశాను.విధానసభలో హంగామా మొదలయింది. నన్ను వ్యతిరేకించే పురుష నేతలు సైతం ఆ రోజు దీన్ని రాజకీయ ప్రశ్న అంటూ నన్ను సమర్థించారు. స్త్రీని బెదిరించడాన్ని వ్యతిరేకిస్తూ నాకు సహాయం చేయాలనుకున్నారా లేక ఎమ్మెల్సీ హక్కులని అవమానించడంగా భావించి బాధపడి సహాయం చేశారో తెలియదు. లేకపోతే రెండూనా! కొన్ని ప్రతి క్రియలు రాజకీయ లబ్ది కోసం అయితే కొంత మీడియాని ప్రభావితం చేయడం కోసం. కానీ ఆ రోజు విధానసభ అంతా నా పక్షం వహించింది. విపక్షం కూడా… ప్రభుత్వం కూడా… అధ్యక్షుడు కూడా…

…. …. ….

నాకు నా ప్రాణాలు ఎక్కువ కాదు

ధన్‌బాద్‌కి చెందిన పేరొందిన సూరజ్‌దేవ్‌ సింహ్‌ మనుషులు శంకర్‌ దయాళ్‌ సింహ్‌ మద్దతుదారుడ్ని బహిరంగంగా కతీరాస్‌ బజారు మధ్యలో హత్య చేశారు. నేను విధాన పరిషత్‌లో ఈ సంఘటన గురించి మాట్లాడాను. దీనిపై ధన్‌బాద్‌కి చెందిన ప్రసిద్ధి చెందిన కాంగ్రెస్‌ కార్మిక నేత వి.పి.సిన్హాకి నా మీద కోపం వచ్చింది. ఆ రోజుల్లో సూరజ్‌దేవ్‌ సింహ్‌ ఆయన గ్రూపులో ఉండేవారు. శంకర్‌దయాల్‌ సింహ్‌ మాజీ మంత్రి. ఆయన సోదరుడు సత్‌దేవ్‌ సింహ్‌ ఆయనకి వ్యతిరేకం. నేను అప్పుడే డోరథీ (వి.పి.సిన్హా భార్య)తో అన్నాను – ”సిన్హా సాహెబ్‌కి సూరజ్‌ దేవ్‌సింహ్‌ సహాయం చేస్తే చాలా గొడవ అవుతుంది. శంకర్‌దయాల్‌ సింహ్‌, సత్‌దేవ్‌ సింహ్‌లు చెప్పడంవల్లే ఆ సూరజ్‌ సింహ్‌, వి.పి.సిన్హాని ఇంటక్‌ జనసభలో కాలర్‌ పట్టుకుని అవమానించాడు.”

నా ఈ భవిష్యవాణి నిజమయింది. సూరజ్‌దేవ్‌ సింహ్‌, వి.పి.సిన్హాని హత్య చేయించాడు. వి.పి.సిన్హాని చంపినవారి దగ్గర రైఫిల్స్‌ దొరికాయి. ఆ రైఫిల్‌ లైసెన్స్‌లో ఎవరి పేరు ఉందో దాని గురించి ఎమ్మెల్సీ వైద్యనాథ్‌ పాండే (ఈయన తర్వాత బీహార్‌ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు) విధానపరిషత్‌లో మాట్లాడుతూ ”అందరి పేర్లూ నా దగ్గర ఉన్నాయి. చెబితే నా ప్రాణాలకే ముప్పు, అందుకే నేను చెప్పను” అన్నారు.

”నాకు నా ప్రాణాలు ఎక్కువ కాదు. అందుకే నేను చెబుతాను. ఈ రైఫిల్స్‌ ఉన్నవాళ్ళందరి అడ్రస్సులకూ ఒక వ్యక్తి కేరాఫ్‌ అడ్రస్‌ ఉంది. అన్నింటిలోను ఇలా రాసి వుంది. కేరాఫ్‌ సూరజ్‌ సింహ్‌…” నేను నిలబడి చెప్పాను. ప్రభుత్వం నాకు ధన్యవాదాలు చెబుతూ అందరినీ అరెస్ట్‌ చేస్తామని హామీ ఇచ్చింది.

ఇంకేముంది నేను తేనెతుట్టెలో చేయి పెట్టినట్లే అయింది. ఒకరిమీద ఒకరు బురద చల్లుకోసాగారు. నిందలు, గొడవలు మొదలయ్యాయి. నాకు ఫోన్‌లో బెదిరింపులు మొదలయ్యాయి. నేను విధానసభలో దీని గురించి చెప్పాను. కానీ ఫోన్‌లో బెదిరించేవారిని ఎలా పట్టుకోవాలి? నేను ఫోన్‌ను గంటలకొద్దీ పక్కకి పెట్టేసేదాన్ని. అయినా ఎప్పుడైనా ఒకసారి ఎత్తితే తిట్లు వినబడేవి. నా బాడీగార్డు శివమునిరామ్‌ (దళితుడు) ఒక ఉపాయం ఆలోచించాడు. అతను మా దగ్గర ఉన్న పాకీ ఆమె కూతురి (9 సంవత్సరాల పాప)తో అన్నాడు. ”పాపా! నువ్వు ఈ ఫోన్‌ దగ్గర కూర్చో. ఫోన్‌లో తిట్లు తిట్టేవాడిని నువ్వు కూడా ఇష్టమొచ్చినట్లు తిట్టు. అసలు వాడు నోరెత్తకుండా తిడుతూనే ఉండు. నీకు ప్రతిరోజూ రసగుల్లాలు ఇస్తాను”.

అంతే ఆ పాప ఫోన్‌లో తిట్లు తిట్టేవాడిని తిడుతూనే ఉంది. ఆ తిట్ల ప్రవాహం ఆగేది కాదు. మూడోరోజు నుండి వాడు ఫోన్లు చేయడం మానేశాడు. ఆ పిల్ల బెరుకు లేకుండా తిడుతూనే ఉండేది. ఈ రకంగా ధారా ప్రవాహంగా తిట్టే తిట్లు అన్యాయానికి విరుద్ధంగా ఒక అహింసాయుతమైన పద్ధతి. దీంతోపాటు రహస్యంగా ఛాలెంజ్‌ చేయడానికి అభివ్యక్తి కూడా.

ఆ రోజుల్లోనే హజారీబాగ్‌కి వెనక్కి వచ్చేటపుడు మా పైన ఎవరో పిస్తోలు పేల్చారు. కారుకి గుళ్ళు తగిలాయి. మేమందరం ఎలాగోలా మమ్మల్ని మేము రక్షించుకున్నాం. ఈ సంఘటన మొదటిసారి వరహీ-హజారీబాగ్‌ల మధ్య మార్గంలో జరిగింది. రెండోసారి ధన్‌బాద్‌ నుండి వెనక్కి వస్తుంటే బేగోదర్‌ తర్వాత టాటీ ఝరియాకి ముందు, గుండు కారు బంపర్‌కి తగిలింది. వారంలో ఒక్కసారైనా కారులో రాత్రిపూట హజారీబాగ్‌కు వెళ్ళి వస్తుండేదాన్ని. బెదిరింపులు వచ్చినా నా రాకపోకలు సాగుతూనే

ఉన్నాయి. ఒకవేళ నన్ను చంపాలనుకుంటే ఫ్లాట్‌లో కూడా చంపేయవచ్చు. ఈ రాకపోకలను ఎందుకు ఆపేయడం? పనులు ఎందుకు ఆగిపోవాలి? ఈ సంఘటనలన్నీ 1974 నుండి 1979 మధ్యలో జరిగాయి. అప్పుడు నేను విధాన పరిషత్‌లో సభ్యురాలిని.

…. …. ….

విధానసభలో జరిగిన అవమానం

1980వ సంవత్సరంలో కాంగ్రెస్‌కి చెందిన తాపేశ్వర్‌దేవ్‌, జనతా పార్టీకి చెందిన గోపాల శరణ సింహ్‌ (ఈయనే నన్ను కచ్‌ వెళ్ళకుండా ఆపేవారు)ని ఓడించాక మాండూ క్షేత్రం నుండి లోక్‌దళ్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడి గెలిచాను. ఆ సమయంలో కూడా లోక్‌దళ్‌కి చెందిన కతిపయ యాదవ్‌, కుర్మీ, ఎమ్మెల్సీల ఒక గ్రూప్‌ నాకు విరోధులు. విధానసభలో నేను ఎప్పుడు ఏ ప్రశ్న వేసినా అందరి హితం కోసమే. చాలామంది సభ్యులు అధికారుల బదిలీలను ఆపాలనో లేక బదిలీలు చేయాలనో, ఇంకా ఇలాంటి వాటిపై ప్రశ్నలు వేస్తారు. 1980లో విస్థాపితుల కోసం ఉద్యమం నడిపించి నేను, లాల్‌చంద్‌ గారు దాదాపు రెండువేల మందితో పాటు రెండు నెలలు జైల్లో ఉన్నాము. తర్వాత ప్రభుత్వం అన్ని కేసులను వెనక్కి తీసుకుని మమ్మల్ని వదిలేయాల్సి వచ్చింది. బీహార్‌ ప్రభుత్వం విస్థాపితుల డిమాండ్లు సరైనవేనని చెప్పింది. దీని తర్వాత నేను సుప్రీంకోర్టులో విస్థాపితుల విషయంలో కోల్‌ ఇండియాకు వ్యతిరేకంగా ఒక పిటిషన్‌ వేశాను. స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నాను. హజారీబాగ్‌ జిల్లాలో బొగ్గు గనుల క్షేత్రాలలో ఉద్యమం నడిపించాను. నా ప్రశ్నకు రాష్ట్ర మంత్రి లహటన్‌ చౌధరి జవాబిచ్చారు. – ”సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున విస్థాపితుల కోసం ఇచ్చిన హలఫ్‌నామా చాలా పెద్దది. అందువల్ల నేను చదివి వినిపించలేను. చిన్నదైతే సభ్యులు సంతృప్తి చెందరు”.

దీనిపై ఎమ్మెల్సీలు పెద్దది, చిన్నది అన్న శబ్దాలకు కుత్సితమైన అర్థాన్ని ఆపాదిస్తూ పెద్దగా అట్టహాసం చేయసాగారు. నేను అధ్యక్షుడు రాధానంద్‌ ఝా గారి దృష్టిని ఇటువైపు మళ్ళించాను. ఆయన నవ్వి దాటేయడానికి చూశారు. కానీ నేను ససేమిరా ఒప్పుకోలేదు. జవాబు ఎంతో విలువైనది. అందుకే నేను దాన్ని చదవాలని పట్టుబట్టాను. దీనివల్ల ఈ సందేశం రైతులదాకా వెళ్తే వాళ్ళలో ధైర్యం పెరుగుతుంది. బీహార్‌ ప్రభుత్వ వైఖరి కూడా విధాన సభలో స్పష్టమవుతుంది. ఈ జవాబు అన్ని పత్రికలలో ముఖ్యమైన వార్తలలో ప్రచురితమవుతుందని అందరికీ తెలుసు. కానీ మాండీలాల్‌ రామ్‌, వృషిణ్‌ పటేల్‌లకు ఎంత మాత్రం ఇష్టం లేదు. కాంగ్రెస్‌ వాళ్ళు ఎటూ ఒప్పుకోరు, అది తెలిసిన విషయమే. ఈ వార్త వలన వాళ్ళ ఇంటక్‌ యూనియన్‌పై ప్రభావం పడుతుంది. ఒక మహిళకు పేరు ప్రతిష్ఠలు రావడం ఎవరూ సహించలేరు. అందువల్ల వాళ్ళిద్దరూ మంత్రికి అడ్డుపడడం మొదలుపెట్టారు. నేను చెప్పడానికి లేస్తే అధ్యక్షుడు నన్ను కూర్చోబెట్టేవారు. నేను ఆయన ఆదేశం మేరకు కూర్చుండిపోయేదాన్ని. కానీ కాసేపయ్యాక తిరిగి లేచి నిల్చునేదాన్ని. చివరికి నేను బెంచిపైన నిలబడి చెప్పడం మొదలుపెట్టాను. బీహార్‌ ప్రభుత్వం బొగ్గు గనుల విస్థాపితుల పునరావాసం కోసం ఒక ప్రణాళికను తయారుచేసి ఇవ్వాలి. దీనివల్ల వేలమందికి ఉద్యోగాలు దొరుకుతాయి. రైతులకు నష్టపరిహారం రేటు కూడా పెరుగుతుంది. కావాలని

మంత్రి ఉపయోగించిన ఈ మాటలకు ”జవాబు పెద్దది, కొంచెం సమయంలో గౌరవనీయురాలైన సభ్యురాలు తృప్తి చెందదు” అంటూ అశ్లీలమైన అర్థాన్ని ఆపాదించి ఎమ్మెల్సీలు అరవడం మొదలుపెట్టగానే మంత్రి ఏమీ చెప్పకుండా కుర్చీలో కూర్చున్నారు. దీంతో నాకు చాలా కోపం వచ్చింది. ఉద్రేకంతో ఏడ్చేశాను కానీ పట్టుదలగానే ఉన్నాను. సభని వాయిదా వేశారు. తర్వాత నేను ప్రొసీడింగ్‌ కటింగ్‌లను ఇస్తూ అధ్యక్షుడికి ఒక పెద్ద ఉత్తరం రాశాను. ఒక మహిళా ఎమ్మెల్సీని హేళన చేస్తూ శీలంపై బురద చల్లడం సబబేనా అని అడిగాను. అదేరోజు సాయంత్రం ఆ వివాదాస్పదమైన భాగాన్ని లిఖిత రూపంలో సభ ప్రొసీడింగ్‌ నుంచి తొలగించారు. కానీ నేను ప్రొసీడింగ్‌ మూల ప్రతిని ముందే తీసుకున్నాను. సెక్రటరీ నుండి నా ప్రశ్నకి జవాబు లభించింది. ప్రభుత్వ ప్రణాళిక కూడా లభించింది. అయినా అధ్యక్షుడికి రాసిన లేఖలో ఎమ్మెల్సీల ప్రవర్తన గురించి ప్రశ్నలు వేశాను. నా ఈ లేఖను ”రవివార్‌”లో హరివంశ్‌గారు (ప్రస్తుతం ప్రభాత్‌-ఖబర్‌కి సంపాదకుడు) యథాతథంగా ప్రచురించారు. ఈ లేఖని కవి జ్ఞానేంద్రపతి సహకారంతో తయారుచేశాను. ఆ రోజుల్లో ఆయన మా ఇంట్లోనే ఉండేవారు. నా మీద, ”రవివార్‌” సంపాదక వర్గంపై డిఫమేషన్‌ కేసు వేయవచ్చు. కానీ నేను ఈ విషయంలో ఎప్పుడూ చింతించలేదు. ఎందుకంటే నేను ఒక మహిళా ఎమ్మెల్సీ గౌరవం కాపాడడం కోసం పోరాటం చేస్తున్నాను. కర్పూరీగారు మనస్ఫూర్తిగా నా పక్షం వహించేవారు. కానీ అప్పుడప్పుడూ ఆయన కూడా ఎమ్మెల్సీల ఒత్తిడికి లోనై మౌనంగా ఉండాల్సి వచ్చేది.

”చిన్న మాటను భూతద్దంలో ఎందుకు చూస్తారు? నవ్వుతూ అన్న మాటలను సీరియస్‌గా తీసుకోకండి” అని అందరూ అనేవారు.

కానీ నా ఉద్దేశ్యంలో విలువైన ప్రశ్నలను నవ్వు-సరదాగా అంటూ తీసిపడేయలేము. అశ్లీలానికి సభలో స్థానం ఇవ్వకూడదు. కేవలం నేను మహిళనైనందుకు ఇదంతా సహించాలా? ఆ ఎమ్మెల్సీలకు గుణపాఠం నేర్పాను. వాళ్ళు డీమోరలైజ్‌ అయ్యారు. విధానసభలో నా మీద దాడులు కూడా ఆగిపోయాయి. ప్రమీలా దండావతే ఈ ప్రశ్నని తన ఆర్టికల్‌లో విశ్లేషణ చేశారు. పత్రికలలో కూడా రాశారు. నేను ఏ పోరాటాన్నీ తక్కువ చూపు చూడలేదు. సగంలో కూడా ఆపేయలేదు. పోరాటాన్ని లాజికల్‌ కన్‌క్లూజన్‌దాకా తీసుకువచ్చాను. గెలిచినా సరే, ఓడినా సరే మధ్యలో నిరాశతో ఎక్కడికీ పారిపోలేదు. ఓటమిని సహించే ధైర్యం నాలో ఉంది. సామాన్యంగా మహిళలలో సహనశక్తి ఉంటుంది. దేన్నయినా స్వీకరించే అలవాటు ఉంటుంది, తలవంచుతుంది కూడా . కానీ నేను మాత్రం ఎక్కడా తలవంచడం నేర్చుకోలేదు.

…. …. ….

గోవా ప్రయాణంలో గొడవలు

మేము ముంబై పిటిషన్‌ సమితితో కలిసి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు హత్యలు, దోపిడీ కేసులు ఎదుర్కొంటున్న రామనరేష్‌ సింహ్‌ అనే ఒక ఎమ్మెల్సీ మద్యం తాగడం మొదలుపెట్టాడు. దీంతో నేను ఆయనతో పోట్లాడాను. ఎమ్మెల్సీ వ్రజకిషోర్‌ సింహ్‌ తన భార్యతో వచ్చారు. మా లోక్‌దళ్‌ పార్టీ నుండి నేను, మున్షీలాల్‌ రాయ్‌, వృషిణ్‌ పటేల్‌ చౌధరి, గణేష్‌ సింహ్‌ తదితరులు వచ్చారు. గోవా వెళ్ళడానికి మాకు ముంబై నుండి ప్రభుత్వం బస్సు పంపింది. ఒక మహిళా అధికారిని కూడా మాతో పంపారు. రామ్‌ నరేష్‌ సింహ్‌ ముందు సీటులో కూర్చోగా ఆయన వెనుక సీటులో నేను కూర్చున్నాను. ఆయన మద్యం తాగడం ప్రారంభించగానే నేను అభ్యంతరపెట్టాను. మర్యాదగల, ధనవంతులైన, సంస్కారవంతమైన కుటుంబాల నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు ఆయన అసహ్యమైన చేష్టలను, తిట్లను సహిస్తూ కూర్చున్నారు. ఆయనతో వద్దని చెప్పి పోట్లాడే సాహసం ఎవరిలోనూ లేదు. నేను ఒక్కదానినే ఆయనను ఎదురించాను. ఆయన తిట్లకు నేను కూడా తిట్లతోనే జవాబిచ్చాను. కానీ తిట్లు ఆయనకు, ఆయన తండ్రికి తగలాలి, ఆయన తల్లికి మాత్రం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరీ నేను తిట్టాను. ఉన్నత కులాలకు చెందిన క్షత్రియ ఎమ్మెల్సీలు మాట్లాడడానికి పెద్ద మాటలు మాట్లాడతారు, తమ శౌర్యాన్ని గురించి గొప్పలు చెప్తారు. సతీసహగమనాల గురించి వేనోళ్ళ పొగుడుతారు. స్త్రీలను రక్షించే బాధ్యత మాదే అనే వీళ్ళందరూ ప్రస్తుతం ఎందుకు నోరు మూసుకుని ఉన్నారో అర్థం కాదు. చరిత్రే దీనికి సాక్ష్యం. సమయం వచ్చినపుడు ఈ దురహంకారులు పంచ పాండవులైపోతారు. తమ అసమర్థతను దాచుకోవడానికి తమ తమ స్త్రీలను సతీసహగమనాలు చేయించి, పేరు ప్రతిష్ఠలకు దెబ్బతగలదని అనుకుంటూ తమ అహంకారానికి దెబ్బ తగలలేదని సంతోషపడతారు. మరి అప్పుడు వీళ్ళ ప్రతాపాలు ఏమయ్యాయో. చరిత్రలో నేరస్థులలో ఈ అహంకార జాతి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వీళ్ళే ఎప్పుడూ సమాజంలో పేరు ప్రతిష్ఠలు కలవారు, అత్యాచార బాధిత స్త్రీలను వదిలేసేది వీళ్ళే, వాళ్ళు వేశ్యలయినా ఫర్వాలేదు కానీ వీళ్ళు మాత్రం వారిని స్వీకరించరు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం కూడా వీళ్ళే. వేరే ప్రాంతాల అధికారుల దగ్గర, అందరి ముందు మద్యం తాగడం బీహార్‌ ఎమ్మెల్సీల గౌరవ మర్యాదలను మంట కలపడమే అని నేను వాదించాను. అందువలన బస్సులో తాగకూడదన్నాను. నా పట్టుదలను చూసి ఆయన తాగడం మానేశాడు. ఆయన బస్సులో మద్యం తాగేవారు కాదు కానీ, ప్రతి బస్టాండు దగ్గర బస్సును ఆపి కిందికి దిగి తాగేవాడు. ఆయన నడుంకి కట్టుకున్న పిస్తోలుపై మాటిమాటికీ చేయి వేస్తూ ఉండేవాడు. నేను భయపడతానని ఆయన ఉద్దేశ్యం.

ఉన్నత కులాల ఎమ్మెల్సీలు దళిత ఎమ్మెల్సీల పట్ల ప్రవర్తించే తీరు చాలా అవమానంగా ఉంటుంది. దారిలో సింహ్‌ మా తోటి ఎమ్మెల్సీ జమునారాయ్‌ (ఈయన దళితుడి)ని ‘ఓ చమర్‌వా (ఓ మాదిగాడా)’ అని పిలిచాడు. నేను అలా పిలవడం తప్పన్నాను. రామ్‌ నరేష్‌ నన్ను తిట్టాడు. మిగిలిన ఉన్నత కులాల వాళ్ళుకానీ, దళితులు కానీ నోరెత్తలేదు. జమునారాయ్‌ ఈ అవమానాన్ని నవ్వుతూ సహించడమే నయం అని ఎందుకనుకున్నాడో తెలియదు కానీ నేను సహించలేకపోయాను. నేను రామ్‌నరేష్‌ ప్రవర్తన చాలా అవమానకరమైనదని ఆయనకి వ్యతిరేకంగా గోవాలోనే గోవా విధానసభ స్పీకర్‌కి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంతులేకి, ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి లేఖలు రాశాను. గోవా స్పీకర్‌ , మహారాష్ట్ర ముఖ్యమంత్రులు నా రాకపోకలకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. గోవా స్పీకర్‌ నేను రైలులో ముంబై తిరిగి వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. ఆయన నా కోసం స్టేషన్‌లో ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం నా కోసం ప్రత్యే వాహనాన్ని ఏర్పాటు చేసింది. మేము గోవానుండి ముంబైకి వెళ్ళాము. మర్నాడు నేను వెళ్ళేసరికి జార్జి ఫెర్నాండెజ్‌ విలేకరుల సమావేశంలో ఉన్నారు. అప్పుడు నేను వాళ్ళకి గోవా స్పీకర్‌కి, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రధాని ఇందిరాగాంధీకి అందించిన లేఖలను ఇచ్చాను. అక్కడ జరిగిన సంఘటనల గురించి విలేకరులకు తెలియచేశాను. మర్నాడు ముంబైలోని అన్ని ప్రముఖ హిందీ, మరాఠీ పత్రికలలో మొదటి పేజీలో ఫోటోలతో సహా వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అవి చూసి అవాక్కయ్యారు. లోక్‌దళ్‌ ఎమ్మెల్సీలు కూడా వాళ్ళకే మద్దతు పలికారు. కేవలం ఒక్క ఝా గారు మాత్రం నన్ను సమర్ధించేవారు. ఆయన కూడా కాంగ్రెస్‌ పార్టీనే. ఆ సమయంలో క్షత్రియుడైన వృజనందన్‌ సింహ్‌కు ఎందుకో కోపం రాలేదు. అప్పుడు సమాజ న్యాయం అనే నినాదాలు అంతగా వినిపించేవి కాదు. లోహియాగారి ”పిఛడే పావేం సౌ మే సాఠ్‌” (వెనకబడ్డ చరణాలు, వందమందిలో అరవై మంది) నినాదం బాగా వినిపించేది. సోషలిస్ట్‌ మహిళలను కూడా వెనుకబడిన కేటగిరీలోనే లెక్కించేవారు. కానీ లోక్‌దళ్‌ చౌదరీ చరణ్‌ సింహ్‌ నేతృత్వంలో వీళ్ళందరూ పురుషాహంకార వాదులుగా తయారయ్యారు. చౌదరీ చరణ్‌సింహ్‌ ఆర్య సమాజానికి చెందినవారు. ఆయనకి లోహియా అంటే పడదు. ఆయన రైతుల విషయం మాట్లాడేవారు కానీ స్త్రీని గౌరవించాలన్న ఉద్దేశ్యం వాళ్ళలో ఉండేది కాదు. వీళ్ళ పిటిషన్‌ సమితిలో ఎక్కువగా సంయుక్త సోషలిస్టు పార్టీ నుండే వచ్చేవారు. కానీ వీళ్ళందరూ లోహియాగారి ”స్త్రీని గౌరవించాలి” అన్న నినాదాన్ని పట్టించుకునేవారు కాదు. సామాజిక న్యాయం గురించి మాట్లాడేవారు కాదు. జయప్రకాష్‌ నారాయణ ‘సంపూర్ణ క్రాంతి’ విఫలం కావడానికి వీళ్ళే కారణం. వీళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటి. లోహియాగారిపై దళిత లాబీ ప్రభావం ఎంతో ఉంది. జయప్రకాష్‌ పైన కాయస్థులు, రాజ్‌పుత్‌ల ప్రభావం ఉంది. ఇందిరాగాంధీ గారు నా ఫిర్యాదుని దృష్టిలో పెట్టుకుని వెంటనే రామ్‌నరేష్‌ సింహ్‌పై విచారణ జరిపించి ఆయనను పార్టీ నుంచి తొలగించారు. కానీ చౌధరి చరణ్‌సింహ్‌ నా ఫిర్యాదు విషయంలో జవాబు కూడా ఇవ్వలేదు. కర్పూరీ ఠాకుర్‌ గారు ఆయన విషయంలో విచారణ జరిపించాలని సిఫార్సు చేస్తూ ఉత్తరం పంపించారు.

ఈ సందర్భంలోనే ఒక సంఘటన గురించి చెప్పాలని ఉంది. మమ్మల్ని అంతులే గారు ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఉంచారు. ”నాకు ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఉండడం ఇష్టం లేదు. నేను మరోచోట మామూలు హోటల్‌లో ఉండవచ్చా” అని నేను జార్జిని అడిగాను. ‘అసలు నీవు అక్కడ ఉంటే ఎలా

ఉంటుందో ముందు తెలుసుకో. ఇప్పుడు నీవు వాళ్ళ-వీళ్ళ మాటలను బట్టి అలా ఆలోచిస్తున్నావు’ అని ఆయన అన్నారు.

నేను ఇంతకుముందు ఎప్పుడూ భారతదేశంలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఉండలేదు. కానీ ఆయన చెప్పాక జార్జి యూనియన్‌ ఆఫీసు నుంచి హెటల్‌కి సామాను తెచ్చాను. నేను జార్జిని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడే యూనియన్‌ ఆఫీసులో ఉండడానికి నిర్ణయించుకుని వెళ్ళాను. ఆ హోటల్లో కప్పు టీ రూ.27. ఏ డిష్‌ అయినా రూ. 175. బట్టలు ఎంతకు ఉతుకుతారో మాకు తెలియదు. అక్కడ ఉన్న ఎమ్మెల్సీలందరూ తమ బట్టలను ఉతకడానికి చాకలికి ఇచ్చారు. నేను నాది ఒక చీర, ఒక జాకెట్టులను ఉతకడానికి ఇచ్చాను. సాయంత్రం బిల్లు వచ్చింది. బ్లౌజ్‌కి రూ.18, చీరకు రూ.40. ఆ రోజుల్లో ముంబై ఫుట్‌పాత్‌పై, ఇంకా మరికొన్ని దుకాణాలలో మంచి హ్యాండ్లూమ్‌ చీరలు 30, 35 రూపాయిలలో, 8, 9 రూపాయలలో దొరికేవి. నేను ఈ రేటులోనే రెండు చీరలు కొనుక్కున్నాను. ఆ రోజు నేను ఆ బిల్లు చెల్లించాను. కానీ ఆ తర్వాత ఇక బట్టలు ఉతకడానికి ఇవ్వలేదు. ధర ఎక్కువగా ఉందని మిగిలిన అందరికీ చెప్పాను. అయినా తర్వాత కూడా అందరూ బట్టలు ఉతకడానికి ఇచ్చేవాళ్ళు. కానీ ఎవరూ బిల్లులు చెల్లించలేదు. మహారాష్ట్ర ప్రభుత్వ మహిళా అధికారి నాతో ఇలా అన్నారు. – ”మీరు మీ బిల్లు చెల్లించారు, మిగిలిన వాళ్ళకు కూడా చెప్పండి బిల్లులు కట్టమని”. నేను ఆవిడ చెప్పిన విషయాన్ని వాళ్ళకి చెప్పి ఆ లెటర్‌ని కూడా చూపించాను. వాళ్ళు ఒక్క పైసా కూడా ఇవ్వమన్నారు. ”బిల్లు పాట్నాకి పంపించండి, మహారాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది” అని కోపంగా అన్నారు. బహుశా వీళ్ళందరూ బిల్లుని పాట్నాకి పంపిస్తారని అనుకోలేదు. హోటల్‌లో

ఉండడానికి, భోజనానికి మాత్రమే ప్రభుత్వం బిల్లు ఇస్తుందని మాటి మాటికీ సూచనలు ఇచ్చేవారు. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళలో భూస్వాముల మనస్తత్వం ఉండడంవలన అలా ప్రవర్తించారు. మేము పాట్నాకి తిరిగి వచ్చాము. రెండు నెలల తర్వాత మహారాష్ట్ర విధాన సభ నుండి నాకు తప్ప మిగిలిన అందరికీ చాకలి బిల్లులు వచ్చాయి. వాళ్ళు దానిపై ఎంతో చర్చ జరిపారు. కానీ వాళ్ళ జీతాల్లో ప్రభుత్వం దానిని కట్‌ చేసింది. నేను బిల్లు చెల్లించడంవల్ల నాకు ఆ అవమానం జరగలేదు. చట్టాలు చేసేవాళ్ళు తమ స్వార్ధం కోసం చట్టాన్ని ఏ విధంగా తమవైపు తిప్పుకుంటారో ఇది ఒక ఉదాహరణ. …. …. ….

స్త్రీ వైపు

ఒకసారి విధానసభలో జరిగిన సంఘటన నాకింకా గుర్తుంది. కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సి.పి.ఎం.)కు చెందిన ఎమ్మెల్సీ అజిత్‌ సర్కార్‌ ఎంతో ధైర్యస్థుడు. తన నియోజకవర్గంలో జరిగిన ఒక దుర్ఘటన గురించి మాట్లాడారు. ఒక చిన్నపిల్లపై అత్యాచారం జరగడంపై ప్రశ్నించారు. మహిళా డాక్టర్‌ ఈ అత్యాచారంపై తప్పుడు నివేదిక ఇచ్చిందని, నిందితుడిని తప్పించాలనే ఇలా చేసిందని ఆరోపించారు. ఆమెకు విరుద్ధంగా ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. కుముద్‌ రంజన్‌ ఝాకు ఆ మహిళా డాక్టర్‌ సోదరి. ఆమె సభలో అడ్డదిడ్డమైన సమాధానాలిస్తోంది. దీనిపై అజిత్‌ సర్కార్‌ పట్టుబట్టారు. ఆడపిల్ల విషయం కాబట్టి ఆయనకు నేను తోడుగా నిలబడ్డాను. నాకు అసలు రహస్యం తెలుసు.

అజిత్‌ సర్కార్‌ ఎన్నిసార్లడిగినా ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదు. ఆయన కోపాన్ని తట్టుకోలేక షర్టు చింపేసుకున్నారు. ”నేను నా ప్రజలకు ఏమి సమాధానం చెప్పగలను. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు” అంటూ ఆయన పైజామాని కూడా చింపుకునేందుకు సిద్ధపడగా నేను ఉండలేకపోయాను. అయితే వెనుకనుండి సి.పి.ఎం. నేత, కార్యదర్శి గణేశ్‌ శంకర్‌ విద్యార్థి వచ్చిన నన్ను ఆపాడు. అయితే నేను బెంచి ఎక్కి అరవడం మొదలుపెట్టాను – ”ప్రభుత్వం ఆ మహిళా డాక్టర్‌కి శిక్ష వేయాలి. రెండో కమిటీ వేసి ఆ బాలికకు మళ్ళీ పరీక్ష చేయించాలి” అని డిమాండ్‌ చేశాను.

అధ్యక్షుడు రాధానందన్‌ ఝా నన్ను కూర్చోమని చెబుతూనే ఉన్నారు. నేను కూర్చునేదాన్నే కానీ వెంటనే లేచి మళ్ళీ నిల్చునేదాన్ని. ఆ రోజు సభలో చాలా గందరగోళం జరిగింది. నేను అధికార పార్టీ మహిళా ఎమ్మెల్సీని అడిగాను. – ”పార్టీ సభ్యురాలిగా ఆలోచించకండి. మహిళా కోణంలో ఆలోచించండి. మంత్రిని సమాధానమడగండి”.

ఒక్క తారాగుప్తా తప్ప ఏ మహిళా ఎమ్మెల్సీ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. తారాగుప్తా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీ. అన్ని పార్టీల వాళ్ళ ఒత్తిడి ఉంది. నేను బెంచ్‌మీద నుండి కిందికి దిగి సభ మధ్యలోకి వచ్చి టేబుల్‌పైకి ఎక్కడానికి ప్రయత్నించాను. ఇంతలో ప్రతిపక్ష పార్టీ నేత కర్పూరీగారు లేచారు. – ”ఇంతసేపటి నుంచి నేను వింటూనే ఉన్నాను. రమణికగారు చెబుతున్నది సబబుగా ఉంది. సభలో అధ్యక్షుడు ఈ విషయంలో ఏమి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం” అన్నారు.

తర్వాత మిగిలినవాళ్ళు కూడా ఇదే డిమాండ్‌ చేయసాగారు. దీంతో అధ్యక్షుడు ”సరే సభ అయిపోయాక నా ఛాంబర్‌లో అసోసియేట్‌ పార్టీ అధ్యక్షుడు కర్పూరీగారు, ముఖ్యమంత్రి, గణేష్‌ శంకర్‌ విద్యార్థి (సి.పి.ఎం. నేత) కలవండి. కుముద్‌ రంజన్‌ ఝా గారు కూడా రావాలి. అక్కడే ఏం చేయాలో నిర్ణయిద్దాం” అన్నారు.

తర్వాత సభ ప్రశాంతంగా సాగింది. నన్ను, అజిత్‌ సర్కార్‌ను ఆ సమావేశానికి పిలవకుండా అసలైన విషయాన్ని మలుపు తిప్పి ఎటువంటి కుట్ర పన్నారో అర్థమయింది. ఎవరూ ఫిర్యాదు చేయరు. చర్య తీసుకున్నట్లే కనిపిస్తుంది, రాజనీతి అంటే ఇదే. రాజకీయ రంగంలో పైకి రావాలంటే అసలైన విషయాన్ని పోటీగా మార్చడం ముఖ్యం. అసలైన ప్రశ్న ముఖ్యం కాదు, పోటీ ముఖ్యం. కమిటీ తయారయింది. నేను, అజిత్‌ సర్కార్‌ సంతోషపడ్డాము. తర్వాత ఈ అజిత్‌ సర్కార్‌ని పప్పు యాదవ్‌ హత్య చేయించాడు.

నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఎమ్మెల్సీలందరూ పార్టీకి వెట్టిచాకిరీ చేసే బానిసలని. ఎన్నోసార్లు ఎమ్మెల్సీలకు ఇష్టం లేకపోయినా సత్యంవైపు మాట్లాడరు. పార్టీ చేస్తున్న తప్పులపై పరదా వేయడంలో సహాయం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్సీలకు క్రమశిక్షణ అనే ముసుగును వేసుకోవాల్సి వస్తోంది. నిజానికి పరివర్తనకు ఇది అడ్డు. నేను ఉద్యమాల ద్వారా చేయించగలిగిన పనులను విధానసభ స్టేజిపైన నుండి చేయించలేమని నాకు అనిపిస్తుంది. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా అధికార పార్టీనే తీసుకోగలదు. తక్కినవాళ్ళు ఏమీ చేయలేరు. సభలో పార్టీ క్రమశిక్షణతో ఉండాల్సి వస్తుంది. పార్టీవాళ్ళ తీరుతెన్నులను బట్టే ఏ ప్రశ్నలకైనా సమాధానాలు ఉంటాయి. ఎమ్మెల్సీ అయినందుకు ఏదైనా మంచి పని చేయాలనుకుంటే అన్ని సరిహద్దులను దాటాలి. ఒకవేళ ఏ పార్టీ నేత అయినా (ఎమ్మెల్సీ గ్రూపునకు చెందిన) ఎమ్మెల్సీకి మద్దతు ఇవ్వకపోతే ఎమ్మెల్సీ వికలాంగుడైపోతాడు. ఒకవేళ ఎమ్మెల్సీ వ్యక్తిత్వం ఆయన పార్టీ నేతకన్నా బలంగా ఉంటే అతడు దేన్నీ లెక్క చేయడు, వెట్టి చాకిరీ చేయడు. బూర్జువా పార్టీలలో పార్టీ క్రమశిక్షణ ఎమ్మెల్సీల మీద అంతగా పడదు. లెఫ్ట్‌ పార్టీల నేత పార్టీ కార్యదర్శి స్వీకృతి తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీవాళ్ళతో, పార్టీ కార్యదర్శితో సమయానికి కాంటాక్ట్‌ చేయలేకపోతే, వాళ్ళ దృష్టి కోణాలలో అభిప్రాయ భేదాలు ఉండడంవలన లెఫ్టిస్టులు కల్పించుకోలేకపోతారు. దానివల్ల అతను చేసిన పనిపై ప్రభావం పడుతుంది. వాళ్ళు ఎంతగా తమ బాధ్యతలను నిర్వహిస్తారన్నది, ఆ ఎమ్మెల్సీల అనుభవం, శిక్షణ, శక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఎమ్మెల్సీలయినా పనులు చేయించలేకపోవడానికి కారణం, పాలసీల కార్యాచరణ అంతా అధికారుల చేతులో ఉండడమే. వీళ్ళమీద నేరుగా ప్రభుత్వం కల్పించుకుంటేనే ఫలితముంటుంది. లేకపోతే ఉద్యమాల వల్ల కూడా ఫలితముంటుంది. బూర్జువా పార్టీల సభ్యులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. కానీ ఓటింగ్‌ సమయంలో వాళ్ళు కూడా పార్టీల ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. వాళ్ళు అప్పుడప్పుడూ తమ పార్టీలకు వ్యతిరేకంగా కూడా ప్రవర్తిస్తారు.

 

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.