ఆటవిక న్యాయం – సౌజన్య కిరణ్‌

(భూమిక నిర్వహించిన కథ, వ్యాసం, కవితల పోటీల్లో రెండవ బహుమతి పొందిన కథ)

”ప్రముఖ సంగీత విద్యాంసుడి హత్య”… రెండు రోజుల క్రితం హత్యకు గురైన సంగీత విద్యాంసుడి హత్య కేసులో నిందితురాలి అరెస్ట్‌ ”… వివరాలు బ్రేక్‌ తర్వాత”! ఇలాంటి వార్తలు టీవీలో కొత్త కాదు కానీ అక్కడ నిందితురాలి ఫోటో చూసినప్పుడు నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఒక నిమిషం కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాను. నాకు అప్పుడు తగిలినంత షాక్‌ ఇంతవరకూ ఎప్పుడూ కలగలేదు. ఇక మీద కలగదు కూడా. వెంటనే ఫోన్‌ తీసుకుని అత్తయ్యకు ఫోన్‌ చేశాను. నేను చూసింది నిజమైతే తను మా అక్క.. మా అక్కే ఆ హత్య చేసిందని అరెస్ట్‌ చేశారు. తను చెప్పొద్దనేసరికి అత్తయ్య నాకు చెప్పలేదంట. ఇది చెప్పొద్దంటే చెప్పకుండా ఉండే విషయమా? బొద్దింకకు కూడా భయపడే అక్క ఒక మనిషిని చంపడమా… ఎందుకు? ఎలా? అన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే.

సమాధానం కోసం దొరికిన ఫ్లైట్‌ పట్టుకుని ఇండియా వచ్చాను. ఈ హత్య చేసింది అక్క కాదు వేరే ఎవరో అయి ఉండాలని ఈ 24 గంటల్లో ఎందరు దేవుళ్ళకు ఎన్ని మొక్కులు మొక్కానో లెక్కలేదు.

ఫ్లైట్‌ దిగి నేరుగా అక్కను ఉంచిన పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళాను.

మన ఆప్తులు కష్టంలో ఉన్నారని వినడం వేరు, అది ప్రత్యక్షంగా చూడడం వేరు. అక్కను కటకటాల వెనుక చూసేసరికి ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా వస్తోంది కన్నీరు. కానీ నన్ను చూసిన అక్కలో ఎలాంటి భావాలు లేవు. ఎప్పుడు నన్ను చూసినా ఎంతో ఆప్యాయతతో దగ్గరకు తీసుకునే అక్కేనా తను… ఇంత భావరహితంగా ఎప్పుడు మారింది?

నేను దగ్గరికెళ్ళి రెండు మూడు సార్లు పలకరిస్తే కానీ పలకలేదు. ఏదో వేరే లోకంలో ఉన్నట్లు ”నువ్వా శ్రీ.. ఇక్కడికి ఏదన్నా పనిమీద వచ్చావా?” అంది.

”అదేంటక్కా! అలా అంటావు. నీ కోసమే. అయినా నువ్వు హత్య చేయడమేంటి? ఇది అబద్ధమని చెప్పు అక్కా… వీళ్ళేదో పొరపాటు పడ్డారని చెప్పు”.

”ఎవరూ ఏమీ పొరపాటు పడలేదు. ఇది నిజమే. నువ్వు అంత దూరం నుంచి అనవసరంగా వచ్చావు. నేను నా నేరం ఒప్పేసుకున్నాను. అవునూ… అరుణ, చిన్ని, రాహుల్‌ ఎలా ఉన్నారు?”

”అవన్నీ పక్కనపెట్టు. ఈ పని నువ్వెందుకు చేశావో చెప్పు. అది ముఖ్యం ఇప్పుడు”.

”చెప్తే తట్టుకోలేవు శ్రీ. నేను చెయ్యాల్సిన పని చేసేశాను. నేను చేసిన పనికి ఫలితం నాకు తెలుసు. అన్నింటికీ సిద్ధపడే ఈ పని చేశాను. ఇంతకన్నా నేను చెప్పడానికి, నువ్వు వినడానికి ఏమీ లేదు.”

”ఎందుకు చెప్పలేవు? చెప్తే ఏమవుతుంది? నువ్వు ఇప్పుడే చెప్పాలి. నాకే చెప్పాలి. నాకు నీకన్నా ఎవరున్నారు ఈ లోకంలో. నువ్వు చెప్పకుండా ఉంటే నేను చచ్చినంత ఒట్టు.”

”ఇలాంటి ఒక ఒట్టే అమ్మ నా దగ్గర వేసి నన్ను ఏమీ మాట్లాడొద్దని చెప్పింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఒట్టు వేసి నన్ను జరిగింది చెప్పమంటున్నావు. నేను ఎవరి మాట వినాలి శ్రీ.”

”అక్కా! ఒట్టు పెట్టిన అమ్మ ఇప్పుడు ఈ లోకంలో లేదు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నీ జీవితంలో ఏం జరిగినా తెలుసుకునే హక్కు నాకుంది. నాకు నువ్వు… నీకు నేను తప్ప ఇంకెవరున్నారు మనకు చెప్పక్కా… నువ్వు ఇప్పుడు చెప్తేనే నాకు ప్రశాంతత లేకుంటే మనలో మనం బాధపడుతూనే ఉంటాం. నువ్వు చెప్పేవరకూ నేను ఇక్కడే ఉంటాను, ఎంతకాలమైనా సరే” అక్కడే కదలకుండా ఒక రెండు గంటలపాటు ఉన్నాక ఒక నిర్ణయానికి వచ్చినట్లు నావైపు తిరిగింది.

”ఒట్టు పెడితే నాకు సెంటిమెంట్‌ అని తెలిసి నువ్విలా చెయ్యటం ఏమీ బాగోలేదు. నా బీరువాలో ఒక సీక్రెట్‌ లాకరుంది. దాని కోడ్‌ ూ = జు జు దాంట్లో ఒక లెటరుంటుంది. అది చదువు. చదివేముందు ఒక మాట… అది చదివాక నీ జీవితం ముందులాగా

ఉండదు. మళ్ళీ నన్ను తప్పు పట్టకూడదు”.

అక్క చెప్పడానికి ఒప్పుకున్నందుకు సంతోషమనిపించింది. ”ముందు నేను లాయర్‌తో మాట్లాడి నీకు బెయిల్‌ తెస్తాను”.

”అవన్నీ తర్వాత ముందు నువ్వు చదువు”.

”అంతవరకు నువ్వు ఇక్కడే ఉంటావా? ఎలా?”

”నాకేం ఫర్వాలేదు. నాకొచ్చిన కష్టమేమీ లేదు. నువ్వు ఇంటికి వెళ్ళు. తాళాలు పక్కింట్లో ఉన్నాయి”.

ఇక చేసేదేమీలేక ఇంటికొచ్చాను. అందరూ నన్నొక వింత జంతువును చూసినట్లు చూశారు. ఒక నిమిషం చాలా బాధనిపించింది. కాని ”జనాలే అంత…వాళ్ళను పట్టించుకోకూడదు” అని చెప్పే అరుణ మాటలు గుర్తుకువచ్చాయి.

లాకర్‌ ఓపెన్‌ చేసి ఉత్తరం బయటకు తీశాను. మొదట ఉత్తరం చదవాలన్న కుతూహలాన్ని అణచి ఒకరోజు ఫ్లైట్‌ జర్నీ అలసట తీరిపోయేలా స్నానం చేసి ఉత్తరం పట్టుకుని కూర్చున్నాను.

”శ్రీ! నువ్వు ఈ ఉత్తరం చదువుతావో లేదో తెలియదు. ఇది చదివేసరికి నేను ఈ లోకంలో

ఉంటానో, ఉండనో కూడా తెలియదు. కానీ కొద్దిగా పెద్ద మనసు చేసుకుని చదువు. ఇది చదివాక నీ జీవితం మునుపటిలా ఉండదు.

నాకు పదేళ్ళు ఉన్పప్పుడు నాన్న గుంటూరులో పనిచేసేవారు. నాన్నకు సంగీతం మీద ఉన్న ఇష్టం కారణంగా అమ్మ నాకు సంగీతం నేర్పించేది. సంగీతం టీచర్‌ మా ఇంటికి నాలుగిళ్ళ అవతల

ఉండేవాడు. వాళ్ళ అమ్మగారు అమ్మతో చాలా స్నేహంగా ఉండేవారు.

ఒకసారి నానమ్మకు చాలా సీరియస్‌గా ఉందని టెలిగ్రాం వచ్చింది. అందరం వెళ్ళడానికి వీల్లేకుండా నాకు ఫైనల్‌ పరీక్షలు. నాన్నకు నేను చదువు మానడం అస్సలు నచ్చదు. అమ్మ లేకుంటే అక్కడ నాన్నకు కష్టం. సంగీతం టీచర్‌ వాళ్ళమ్మగారు నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటానన్నారు. అమ్మ వాళ్ళు మొదట ఒప్పుకోలేదు. ఆవిడ ”నా కొడుకు కూడా లేడు. ఇంట్లో నాకు తోడుగా ఉంటుంది. మీరు వెళ్ళిరండి” అని బలవంతం చేసింది. అమ్మ నాన్న ఇక వేరే దారిలేక అలాగే చేశారు. అలా వెళ్ళినవాళ్ళు పదిరోజుల వరకు రాలేకపోయారు. వాళ్ళు వచ్చేసరికి నాకు ఒళ్ళు తెలియని జ్వరం. అమ్మ వాళ్ళు వాళ్ళ మీద బెంగతో జ్వరం వచ్చిందనుకున్నారు. ఆ విషయం అంతటితో అయిపోలేదు.

ఆ తర్వాత పదిరోజులకు నాన్నకు బొంబాయి బదిలీ అయింది. ”అక్కడికి వెళ్ళినప్పటినుంచి నాకు ఒంట్లో బాగుండేది కాదు. నాన్నగారి ఫ్రెండ్‌ ఒకాయన డాక్టర్‌. నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆయన నన్ను పరీక్షించి చెప్పిన విషయం విన్న నాన్నగారి కాళ్ళకింద భూమి కదిలిపోయింది, నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

డాక్టర్‌ అంకుల్‌ నేను ప్రగ్నెంట్‌ అని చెప్పారు. నాన్న ”పదేళ్ళ పిల్ల ప్రగ్నెంట్‌ ఏంటి? నువ్వు సరిగ్గా చూశావా? ప్రగ్నెంట్‌ అంటే ఏంటో కూడా తెలియదు దానికి? మళ్ళీ ఇంకోసారి పరీక్ష చెయ్యి” అన్నారు.

”లేదురా! నువ్వు విన్నది కరక్టే. ఇది నిజమని నమ్మలేక మళీ మళ్ళీ పరీక్ష చేశాను. ఐదో నెల కూడా దాటిపోయింది. ఇప్పుడు అబార్షన్‌ చేస్తే పాపకు చాలా ప్రమాదం. ముందు నువ్వు పాపను తీసుకుని ఇంటికి వెళ్ళు. ఇది ఎలా జరిగి ఉంటుందని కనుక్కునే ప్రయత్నం చేయండి. అలా అని తనను బలవంతపెట్టొద్దు.”

ఇంటికి వచ్చి అమ్మతో విషయం చెప్తే అమ్మ నిలువునా కుప్పకూలిపోయింది. ఆ రోజు తర్వాత అమ్మ, నాన్న నన్ను చాలారకాలుగా అడిగారు కానీ ఏం జరిగిందో నాకు మాత్రం గుర్తులేదు.

రెండు రోజుల తర్వాత డాక్టర్‌ అంకుల్‌ ఇంటికి వచ్చారు. నాన్నతో ”రెండు రోజుల నుంచి సుమతి ముఖమే నా కళ్ళముందు కనబడుతోంది. మీరు ఎలా తట్టుకుంటున్నారో, ఇంత కష్టం? నేను చాలా ఆలోచించాను. దీనికి పరిష్కారం తోచింది. మీరిద్దరూ ఏమీ అనుకోనంటే చెప్తాను” అన్నారు.

”అదేంట్రా అలా అంటావు. మాకు కాళ్ళు, చేతులు ఆడడంలేదు. బుర్ర అసలు పనిచేయడం లేదు. నువ్వు ఒక దారి చెప్తానంటే ఎందుకు వద్దంటాను?”

”తనకు డెలివరీ అయ్యేవరకు ఎక్కడికీ పంపకండి. నేను ఇంట్లోనే డెలివరీ చేస్తాను. ఈ బొంబాయిలో మనిషికి మనిషికి మధ్య అంత సంబంధాలు ఉండవు కాబట్టి విషయం బయటకు పొక్కదు. డెలివరీ అయ్యాక పుట్టే బిడ్డను మీ బిడ్డగా పెంచండి. అలా చేస్తే విషయం బయటకు తెలియదు. ఎంతయినా పుట్టిన బిడ్డను అనాధగా వదిలేయలేం కదా. నువ్వు ఆలోచించు. తను ఇంకా చిన్నది కాబట్టి చదువు, ఆటపాటల్లో జరిగిన ఈ విషయాన్ని మర్చిపోగలదు.”

”నువ్వు చెప్పింది బానే ఉంది, అంతా నువ్వే చూసుకోవాలి. నువ్వు ఎలా జరిగుంటుందని అడిగావు కదా? నేను, మా ఆవిడ ఎంత ఆలోచించినా ఇది జరగడానికి ఒక అవకాశం మాత్రమే కనిపిస్తోంది. మేము మా పాపను వాళ్ళ సంగీతం టీచర్‌ ఇంట్లో వదిలి వెళ్ళాము. మేము వదలి వెళ్ళినపుడు ఆ టీచర్‌ ఇంట్లో లేడు, ఏదో ఊరెళ్ళాడు. చాలా నెమ్మదస్థుడిలా కనిపిస్తాడు. చాలా మంచివాడు అనుకున్నవాడు ఇంత పనిచేస్తాడని కలలో కూడా అనుకోలేదు. అయినా పదేళ్ళ పిల్లమీద అఘాయిత్యం చేస్తాడని ఎవరనుకుంటారు. కాలర్‌ పట్టుకుని నిలదీద్దామనుకుంటే పోయేది నా ఇంటి పరువే. విషయం బయటపడితే దాని జీవితం ఎటూ కాకుండా అయిపోతుంది. నా కుటుంబం నలుగురిలో తలెత్తుకోలేదు. ఇప్పుడు నాకొచ్చే కోపానికి వాణ్ణి చంపినా చంపేస్తాను. అప్పుడు నా కుటుంబం దిక్కులేనిది అవుతుంది. కన్నతండ్రిగా నా కూతురికి రక్షణ కల్పించలేకపోయాను. నేను తండ్రిగా ఫెయిలయ్యాను. అందుకే దాని జీవితం ఇలా అయిపోయింది. మా ఖర్మ ఇలా ఉంది.”

నాన్న నా గదిలోకి వచ్చారు. ”తల్లీ నీకు ఏం జరుగుతోందనేది అర్థమయ్యే వయసు కాదు నీది. కానీ ఏం భయంలేదు, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు కొన్ని రోజులు స్కూలుకి వెళ్ళలేవు. ఇంట్లోనే చదువుకో. నేను అన్నీ ఇంటికే తెచ్చిస్తాను. వచ్చే ఏడాది నువ్వు మామూలుగా స్కూలుకు వెళ్ళొచ్చు” అని ఏవేవో చెప్పారు. నాకు అర్థమయ్యీ కాక తల ఊపాను.

నాన్న తనలో తాను ఎంత కుమిలిపోయారో కానీ ఎప్పుడూ బయటపడేవారు కాదు. అమ్మకు మాత్రం నన్ను చూడగానే ఏడుపొచ్చేసేది. ఆవిడ నన్ను చూసి ఎందుకు అలా ఏడుస్తోందో నాకు అర్థమయ్యేది కాదు. నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం మానేసింది. నాకు చాలా అన్యాయం జరిగింది. దానికి ఎలా రియాక్టవ్వాలో తెలియక ఆవిడ నాకు కొద్దికొద్దిగా దూరమవుతూ వచ్చింది. ఆ తర్వాత నాకు ఎప్పుడూ దగ్గర కాలేకపోయింది.

నెలలు నిండేకొద్దీ ఏమీ తినబుద్దయ్యేది కాదు. ఒక్కదాన్నే ఇంట్లో ఉండలేకపోయేదాన్ని. అది నరకం శ్రీ. నాన్న మాత్రం రకరకాల పుస్తకాలు తెచ్చేవారు. హిందీ, ఇంగ్లీష్‌ నేర్పించారు. మెల్లిమెల్లిగా నేను పుస్తకాల ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. అవే నాకు ఫ్రెండ్సయ్యాయి. ఇప్పటికీ అవే నాకు లోకం.

ఒకరోజు నాకు నొప్పులు మొదలయ్యాయి. డాక్టరంకుల్‌ వచ్చారు. ఒకరోజంతా కష్టపడ్డాక నాకు ఒక బాబు పుట్టాడు. అంకుల్‌ ఆ బాబును అమ్మ చేతిలో ఉంచేశారు. ఆ బాబు ఎవరో నీకు అర్థమై

ఉంటుంది. బంధువులందరికీ నాకు తమ్ముడు పుట్టాడని ఉత్తరాలు రాశారు. ఎవ్వరికీ వీసమెత్తు అనుమానం కూడా రాలేదు. కానీ అంత పెద్ద నిజం మా మనసుల్లో ఉండి మమ్మల్ని లోపల్లోపలే తినసాగింది కానీ బయటికి నవ్వుతూ బ్రతకడం నేర్చుకోవాల్సి వచ్చింది. నువ్వు మాకు ఆనందాన్ని తెచ్చావు. అది మాత్రం నిజం.

నేను మళ్ళీ స్కూలుకి వెళ్ళడం మొదలుపెట్టాను. వయసు పెరిగినకొద్దీ నాకు జరిగిందేమిటన్నది అర్థం కాసాగింది. ఆ ఆలోచనలు నన్ను పిచ్చిదాన్ని చేసేవి. నాకే ఎందుకు ఇలా జరిగింది? అన్న ప్రశ్నకు సమాధానం దొరికేది కాదు. నేను ఏదో పాపం చేసుకుని పుట్టాను కాబట్టే నాకు ఇలా జరిగిందన్న నిర్ణయానికి వచ్చేశాను.

నాన్న నాకు చాలా సపోర్టుగా ఉన్నారు. ఆయనే నాకు అండగా లేకపోతే పిచ్చిదాన్నయ్యేదాన్ని లేకపోతే ఆత్మహత్య చేసుకునేదాన్ని. చదువు తప్ప వేరే ఆలోచనలు మనసులోకి రాకుండా జాగ్రత్త పడేదాన్ని. అమ్మ నిన్ను పెంచడంలో బిజీ అయిపోయింది. నాతో తీరలేని ముచ్చట్లన్నీ నీతో తీర్చుకుంది. నీకు తెలుసు అంతకన్నా మంచి అమ్మ ఉండదని.

నేను డిగ్రీ పూర్తి చేశాను. అమ్మ నా పెళ్ళి మాటలు మొదలు పెట్టింది. నేను తెగేసి చెప్పాశాను. పెళ్ళి మాటెత్తితే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానని అమ్మ వాళ్ళు డాక్టరంకుల్‌ని పిలిపించారు. ఆయన చాలా చెప్పారు కానీ నేను నా పట్టుని విడవలేదు. నా జీవితంలో జరిగిన ఇంత పెద్ద విషయాన్ని దాచి పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేకపోయింది. ఒకవేళ చెబ్దామంటే అది నీ జీవితంలో పెద్ద అలజడిని రేపుతుంది, అది నాకు అస్సలు ఇష్టం లేదు. ఒకరకంగా నాకు మగవాళ్ళంటేనే ఏవగింపు వచ్చింది. నేను మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టాను.

అమ్మ ఆ నిమిషంలో జరిగిన విషయం ఎక్కడన్నా, ఎవరికన్నా చెప్పేస్తానేమోనని భయపడి ఈ విషయం ఎవరికి చెప్పినా తను చనిపోతానని ఒట్టు వేయించుకుంది. నాకు మగవాళ్ళను చూస్తే ఒంటిమీద తేళ్ళు, జెర్రులు పాకేవి. ఎవరికీ చెప్పుకోలేని ఒక బరువును నాలోనే మోస్తూ గడిపాను. ఈ బాధ ఎవరికీ వద్దు.

నీ తల్లిగా నన్ను నేను చెప్పుకోలేను, అలా అని నీ మీద తల్లిగా ఉండే మమకారం పోదు. నేను పోయేలోపల నీతో ఒక్కసారి అమ్మా అని పిలిపించుకోవాలని ఎంతగా అనుకున్నానో? ఇంత నిస్సారమైన జీవితంలో నేను చేసే ఈ టీచర్‌ ఉద్యోగం మాత్రం నా జీవితానికి ఒక ప్రయోజనం ఇచ్చింది. కొద్దిమందినన్నా మంచివాళ్ళుగా తీర్చిదిద్దానన్న తృప్తి.

నేను ఇక్కడికి వచ్చాక ఆ సంగీతం టీచర్‌ మళ్ళీ కనబడ్డాడు. నా జీవితాన్ని అల్లకల్లోలం చేసేసిన వ్యక్తి నన్ను చూసి కూడా గుర్తుపట్టలేదు. అతనికి చాలా పెద్ద పేరు ఉంది. ఇక్కడ అపార్ట్‌మెంట్‌లో చాలామంది పిల్లలు అతని దగ్గర సంగీతం నేర్చుకునేవాళ్ళు. అందులోనే మా ఎదురింట్లో ఉండే నిషా ఒకతి. తను చాలా చలాకీగా ఉంటుంది. చాలా బాగా పాడుతుంది. లేక లేక పుట్టిందని ఆమె తల్లిదండ్రులు చాలా గారాబంగా చూసేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులకు తనే సర్వస్వం. పిల్లను అంత ప్రేమగా చూసే తల్లిదండ్రులను నేను వాళ్ళనే చూశాను.

కొద్దికాలంలోనే నాకు చాలా మచ్చిక అయింది. పడుకునే టైంలో తప్పితే నా దగ్గరే ఉండేది. తను, చిన్ని, రాహుల్‌ కన్నా చేరిక అయ్యింది. గత ఆరేడు నెలలుగా ఆ పాప చాలా డల్‌గా అయిపోయింది. ప్రతి చిన్న విషయానికి భయపడడం, తిండి తినకపోవడంతో పాటు స్కూల్‌ నుంచి కూడా కంప్లెయింట్స్‌ వస్తున్నాయని వాళ్ళ అమ్మ, నాన్న చెప్పడంతో వాళ్ళ కంగారు చూసి నేను ఆ పాపను బతిమాలి, ఎన్నో రకాలుగా అడిగిన తర్వాత చెప్పిన విషయం విని నేను మ్రాన్పడిపోయాను. నాకు జరిగిన అన్యాయం మళ్ళీ ఇంకొకరికి జరుగుతుందని నేను ఊహించలేదు. అదీ అభం శుభం తెలియని ఆరేళ్ళ పాపకి.

ప్రపంచంలో నాకే ఇంత అన్యాయం జరిగిందని బాధపడే నాకు ఆ పసిదాని ముఖం చూస్తే ఎంత బాధ అనిపించిందో. వాడు నా మీద మటుకే అత్యాచారం చేశాడని అనుకున్నాను నేను ఇంతకాలం. కానీ ఇలాంటివి మరిన్ని జరగవచ్చన్న ఆలోచన నాకు రానందుకు నన్ను నేను ఎంత నిందించుకున్నానో.

మన దేశంలో ఏడాదికి 7200 అత్యాచారాలు జరిగితే అందులో ముగ్గురిలో ఒకరు చిన్నపిల్లలే. ఈ లెక్కలు ఫిర్యాదు చేసినవి మాత్రమే. చెయ్యనివి అంతకు రెండింతలు ఉండొచ్చు లేదా మూడింతలు ఉండొచ్చు. అదీ చిన్నపిల్లల్లో మరీ ఎక్కువ. వాళ్ళకు ఏం జరిగిందనేది అర్థం కాని వయసు, అది ఆడపిల్లలకే అనుకుంటే మన పొరపాటు. వివరాలన్నీ తెలుసుకునే కొద్దీ వాడు ఎంత నీచుడో తెలియసాగింది. తన గుట్టు బయటపడేలోపు ఆ ఊరు వదిలేయడం. అలా నాలాంటి వాళ్ళు ఒక వందమందిదాకా ఉన్నారని తెలుసుకున్నాను. అరవై దాటినా వాడు ఆరేళ్ళ పాప మీద అత్యాచారం… అదీ నమ్మించి మోసం చేసి… పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఇలాంటి పనిచేస్తే ఇక ఎవరిని నమ్మగలం? ఇలాంటి వాళ్ళు ఉంటారని కూడా చాలామందికి తెలియదు. అది వాళ్ళ తప్పు కాదు. ఇలాంటివి ఎవరూ బయటికి చెప్పరు. చెప్తే విన్నవాళ్ళు తమ గురించి ఏమనుకుంటారోనని భయం.

గాంధీగారు ”ఆడది అర్థరాత్రి ఒంటరిగా తిరిగితే దేశానికి నిజమైన స్వాతంత్య్రం” అని అన్నారు కానీ అభం శుభం తెలియని పసిపిల్లల గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు, అంటే ఆయన ఇలాంటివి జరుగుతాయని ఊహించి కూడా ఉండరు పాపం. అందరూ ఏదో భయానికి వాడిమీద ఫిర్యాదు ఇవ్వలేదు. చాలామందికి వాళ్ళ పిల్లలకు ఇలా జరిగిందని తెలియదు కూడా. మనుషులకు ఉండే బలహీనతలను క్యాష్‌ చేసుకోవడం ఇలాంటివాళ్ళకు తెలిసినట్లు ఇంకెవరికీ తెలియదు.

నా తర్వాత ఇలాంటి అన్యాయం ఇంతమందికి జరిగిందంటే దానికి నేను పరోక్షంగా కారణం అనిపించింది. మన దేశంలో పిల్లలకు న్యాయం జరగడంకన్నా తమ పరువు ముఖ్యం. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? అనే చింతనే ఎక్కువ. అలాగే నాన్న తప్పు చేశారు. ఆ రోజు నాన్న ఇంటి పరువు పోతుందని, నా విషయం అందరికీ తెలిస్తే నా జీవితం ఏమైపోతుందోనని ఆలోచించి వాడ్ని వదిలేయబట్టేకదా వాడు రెచ్చిపోయి ఇంతమందిపై అత్యాచారం చేయగలిగాడు. ఆ రోజే వాడ్ని జైలుకు పంపించి ఉంటే ఇంతమందికి ఈ బాధ తప్పేది కదా అని ఎంత ఏడ్చానో, ఎంత క్షోభ అనుభవించానో నీకు చెప్పలేను శ్రీ.

మనం పత్రికల్లో అత్యాచారాలు జరిగాయని చదివి అయ్యో పాపం! వాళ్ళకు ఎంత కష్టం అనుకుంటాం కానీ తెలియని మనుషులు ఇలాంటివి చేస్తే ఒక రకం కానీ, మనం నమ్మిన మనుషులు మనను దగా చేస్తే కలిగే బాధ సామాన్యంగా పోయేది కాదు. మనుషులన్న వాళ్ళమీద నమ్మకం పోతుంది. చిన్నపిల్లలపై అత్యాచారం జరిపే ఇలాంటివాళ్ళను ఏమి చెయ్యాలి. వాళ్ళ జీవితంలో ఆ గాయం ఎప్పటికీ మానదు. వాళ్ళు ఎప్పటికీ మామూలుగా ఉండలేరు. వాళ్ళ జీవితాన్ని మొగ్గలో తుంచేయడమే. దానికి నేనే ఒక నిదర్శనం.

ఇంతలో నా జీవితాన్ని మలుపు తిప్పే మరో దుస్సంఘటన జరిగింది. అది నిషా మరణం. వాళ్ళ అమ్మ ఎవరితోనో మాట్లాడుతూ ఛస్తే కానీ ఈ బాధలు పోవు అన్న మాటలు విని ఎలాంటి బాధయినా పోగొట్టే మార్గం చావు అని నిర్ణయం తీసుకుని ఇంట్లో ఎలుకల మందు మింగేసి ప్రాణం తీసుకుంది. అది పడిన బాధ కళ్ళారా చూసిన వాళ్ళకెవరికైనా రక్తం మరుగుతుంది. ఆరేళ్ళ పిల్ల జీవితాన్ని మొగ్గలో తుంచేశాడు వాడు. ఆ పాప తల్లిదండ్రుల దుఃఖం తీరేదెలా? వాళ్ళ ఆశలన్నీ అడియాసలు చేసేశాడు. వాళ్ళు తమను తాము దోషులుగా నిందించుకుంటున్నారు.

నిషా వాళ్ళ నాన్న ”వాడ్ని నేను చంపేస్తాను. అదే వాడికి తగిన శిక్ష” అన్నాడు. ఆ నిమిషానికి ఏదో సర్ది చెప్పి నేను అతన్ని ఆపాను. కానీ అతను ఆ పని చేయకుండా ఎక్కువ కాలం ఆపలేనని అనిపించింది. కేసు పెడదామని అనుకున్నాను. కానీ వాళ్ళ కడుపు కోత, వాళ్ళ బాధ చూశాక పోలీసులు… చట్టం… వాడికి శిక్ష పడేవరకు వాళ్ళకు మనశ్శాంతి లేదు. అది జరగడానికి ఎన్ని రోజులన్నా పట్టొచ్చు. మన దేశంలో ఇలాంటి కేసులో శిక్షపడిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. వాడికి శిక్ష వేసేవరకు నాలా ఛస్తూ బ్రతకడం అవసరమా? అనిపించింది.

”కన్నుకు కన్ను… పన్నుకు పన్ను” అనే ఆటవిక న్యాయమైతేనే వాళ్ళకి సరైనది అనిపించింది. నాలాంటి వాళ్ళందరికీ మనసు కుదుటపడుతుందని నేనే వాడిని చంపేశాను. కసితీరా చంపేశాను. ఒకవేళ నేను ఈ పని చేయకపోతే నిషా వాళ్ళ నాన్న చేస్తాడు. అది నేనే చేసి వాళ్ళ జీవితంలో ఇంకో తుఫాను రాకుండా ఆపాను. నిషా మరణానికి నేనే పరోక్షంగా కారణమని నేను ఈ పని చేశాను, అంతే. కానీ అందరూ ఇలా చెయ్యాలని నా ఉద్దేశ్యం ఎంత మాత్రమూ కాదు.

నన్ను అందరూ ”ఒక ముసలివాడిని ఎందుకు చంపాల్సి వచ్చింది?” అంటే నేను నాపై వాడు చేసిన అత్యాచారం గురించి చెప్పాలి. అంటే నీ జీవితంలో ఒక పెద్ద తుఫాను వస్తుంది. అందుకే నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు. వాడు చేసిన మోసం బయటకు రావాలంటే నీ జన్మ రహస్యం బయటకు రావాలి. అది నీ కుటుంబంలో అలజడి రేపుతుందని తెలుసు. నువ్వు ఈ విషయాన్ని ఎవరికన్నా చెప్పాలంటే చెప్పొచ్చు, లేకుంటే లేదు. శ్రీ! నిన్ను కన్న సందర్భం నేను ఊహించినది కాకపోయినా నువ్వు మా జీవితంలో ఎప్పుడూ ఆనందం నింపావు. మంచి కొడుకుగా తల్లిదండ్రులను బాగా చూశావు. ఆడవాళ్ళను గౌరవంగా చూస్తావు. నీకు ఈ చేదు నిజం చెప్పకుండా ఉంటే బాగుండేది, కానీ నేను పోయాకయినా నువ్వు నన్ను అమ్మ అనుకుంటే పై నుంచి చూసి సంతోషిద్దామని ఒక ఆశ.

ఇట్లు

ఇన్ని రోజులూ నీ అక్కగా ఉంటున్న నీ అమ్మ

ఒక్కసారి నా కాళ్ళకింద భూమి కదలిపోయింది. నన్ను ఎక్కడో అనాథలా వదిలేయకుండా, వాళ్ళ కష్టాన్ని నేను గుర్తు చేస్తున్నా నాకు ప్రేమను పంచిన మంచి మనుషులు వీళ్ళు. ఏమిచ్చి వీళ్ళ రుణం తీర్చుకోగలను. నా జీవితంలో ఎలాంటి అలజడి ఉండకూడదని తన జీవితాన్ని త్యాగం చేసింది. నేను తన కడుపున పుట్టినందుకు గర్వపడుతున్నాను.

వెంటనే అరుణకు ఫోన్‌ చేసి విషయం చెప్తే తను నమ్మలేకపోయింది. ”ఇలాంటి విషయం అందరికీ తెలియాలి లేకుంటే వదిన చేసినదానికి ప్రయోజనమే లేదు. ఇది చదివి తెలుసుకుని ఒక్కరికైనా, తనకు జరిగిన అన్యాయం జరగకుండా ఉంటే తను చేసిన ఈ పనికి ప్రయోజనం” అంది. వెంటనే పిల్లలను తీసుకుని అమెరికా నుంచి వచ్చింది.

అక్క కోసం ఒక లాయర్‌ని మాట్లాడాను. బెయిల్‌పై ఇంటికి వచ్చింది. అక్క చేసింది చట్టం దృష్టిలో తప్పు. దానికి శిక్ష కూడా పడుతుంది. కానీ దాని గురించి అక్కకు వీసమెత్తు బాధ కూడా లేదు. వాడి చేతిలో అత్యాచారానికి గురైన

వాళ్ళు ఎంతోమంది వచ్చి అక్కతో ”మీ వల్ల మేము చాలా ఏళ్ల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాం. ఎవరేమనుకున్నా మీరు చేసిన పని చాలా కరెక్ట్‌. అలాంటి వాళ్ళకు మీరు చేసిన ఆటవిక న్యాయమే సరైనది” అన్నారు.

”అలా కాదు. ఇది అందరినీ చెయ్యమని కాదు. కానీ నేను ఎప్పుడో వాడ్ని జైలుకు పంపి ఉంటే మీకెవ్వరికీ ఈ బాధ ఉండేది కాదు. పిల్లల విషయంలో మనం వాళ్ళకు మంచి జరుగుతుందని అనుకున్న ప్రతిసారీ అది మంచిది కాకపోవచ్చు. ఇది కలికాలం… రాక్షసులు మన మధ్యే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ నుంచి మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి. ఇది మనకు జరగలేదని, మనకెందుకులే అని అనుకోకూడదు. అన్యాయం ఎక్కడ ఉన్నా దాన్ని ఎదిరించాలి. నాకు జరిగింది ఎవరికీ జరగకూడదు. అదే నా కోరిక”.

అక్కకు… కాదు కాదు… మా అమ్మకు నాలుగేళ్ళు జైలు శిక్ష పడింది. దానికి తను ఏ మాత్రం బాధపడలేదు. ఇది చదివిన తెలుసుకున్న వాళ్ళు ఇలాంటివి తమ చుట్టుపక్కల ఎక్కడా జరగకుండా చూస్తే అదే చాలు అని నేను రోజూ అనుకుంటూనే ఉంటాను.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో