వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన జానకీ బాల గార్కి,

నమస్తే. ఎలా

ఉన్నారు? ‘అపు రూప అవార్డ్స్‌’ ఫంక్షన్‌లో మిమ్మల్ని చూసి చాలా సంతోషించాను. మనం కలిసి కూడా ఏడాది దాటినట్లుంది. ఈ సంవత్సరం ఎండలు అగ్ని శరీరాన్ని తొడుక్కొని కూర్చున్నాయి. రోళ్ళే కాదు మనుషులు కూడా బద్ధలైపోయేంతటి ఎండ. దేహమంతా చెమట వర్షం కురుస్తూనే ఉంది.

మిమ్మల్ని నేను తొలిసారి చూసింది. ‘అస్మిత’లోనే అప్పట్లో ‘రసం (రచయిత్రుల సంఘం)’ బాధ్యతలు చూసే వారు. రచయిత్రులం ఒకరికొకరం దగ్గరయ్యేందుకు కొంతమేరకు ఉపయోగ పడింది. మీ పొడవాటి తెల్ల జడ ఎంతో నచ్చింది నాకు. మీ చిర్నవ్వు, ఆత్మీయత, అమాయకత్వం, భోళాతనం, కలుపుగోలుగా ఉండే మీ మాటలు నచ్చాయి. హాస్యాన్ని కలగలిపి గమ్మత్తుగా ఉండేవి మాటలు. సన్నటి మెత్తటి మీ స్వరం కూడా బాగా ఆకర్షించింది. ఎన్నెన్ని పాటలో మీ నోట విన్నాను. ఆ తర్వాత ‘భూమిక’ తరఫున ‘వాకపల్లి’ వెళ్ళినపుడు, అక్కడ స్త్రీల సామూహిక దుఃఖాన్ని చూసి మనమంతా సముద్రాలైపోయాము. తలకోనలో మనం నడిచినంత మేరా, పరచుకున్న నిశ్శబ్దపు ఆనవాళ్లింకా మిగిలిపోయే ఉన్నాయి. మా అమ్మ పోలికలు మీలో కొన్ని కన్పించడం వల్ల కూడా మీకు దగ్గరైనట్లున్నాను.

స్వాతంత్య్రం ఇంకో రెండేళ్ళకు వస్తుందనే ఆశతో ముందే రాజమండ్రిలో పుట్టారు. తణుకులో ఎస్‌.ఎస్‌.ఎల్సీ, పీయూసీ తో పాటు ’95లో తెలుగు ఎం.ఏ. కూడా చదివారు. 70ల్లో ఆంధ్రప్రభలో ‘మనిషికి మరో మలుపు’ అనే కథ మొదటిది కదా! ’66, ’67 ప్రాంతాల్లో ‘జగతి’లో కొన్ని స్కెచ్‌ల రూపంలో రాశారు అప్పట్లోనే. 2000 సంవత్సరం వరకు అనుకుంటా, ‘ఆకాశ వాణి’ విజయవాడ కేంద్రం నుంచి లలిత సంగీత కళాకారిణిగా ఆడిషన్‌లో పాసై పాడుతూనే ఉన్నారు. అలా మీ గొంతు చిరపరిచితమే చాలామందికి. పాత హిందీ, తెలుగు పాటలు ఇష్టమంటూండేవారు. కథల పుస్తకాలు కూడా ఆరు వరకూ వేశారు కదూ! వాటన్నింటినీ కలిపి 2014లో ఒకే పుస్తకంగా ప్రచురించారు కూడా. మళ్ళీ ఇంకొక పుస్తకానికి సరిపడా కథలు కూడా రాశారు. ‘కరిగిన హరివిల్లు’ నుంచి ‘పంజరం కోరిన మనిషి’ వరకు మొత్తం 12 నవలలు రాశారు. ఎక్కువగా సాహిత్యాన్ని అధ్యయనం చేయడమే మీకిష్టం. ‘కనిపించే గతం’ నవల ‘వార్త’ పత్రికలో సీరియల్‌గా వచ్చింది. తెలంగాణ యూనివర్శిటీ అవార్డు కూడా వచ్చింది కదా దానికి. లేఖిని, జ్యోత్స్నపీఠం, తెలుగు సమితి, పట్టాభి కళాపీఠం, రంగజ్యోతి, జీవిత సాఫల్య పురస్కారం, నెమలీక వంటివెన్నో మీ సాహిత్య వ్యవసాయాన్ని గుర్తించి గౌరవించాయి. సినిమా పాటమీద ‘చినుకు’ పత్రికలో ‘రాగరంజితం’ రెండేళ్ళుగా రాస్తున్నారు, నేను చదువుతూనే ఉన్నాను. క్లాసికల్‌ పాటల బేస్‌తో ఆధునికంగా పాటల్ని ఎలా మలుస్తున్నారన్నదాన్ని విశ్లేషణాత్మకంగా రాస్తున్నారు. రంగనాయకమ్మ రచనలు చాలా చాలా ఇష్టమని అంటుండేవారు. ’91లో అనుకుంటా ‘మనశ్శల్యాలు’ అనే కవిత్వ పుస్తకం వేశారు. అప్పటికింకా మీరు విజయవాడలోనే ఉన్నట్లున్నారు. ‘చేరాత’ల్లో కూడా మంచి కవిత్వమని ప్రశంసించారు. నాయని కృష్ణకుమారి గారు కూడా ముందు మాట రాశారు.

మీ బాబు మోహనకృష్ణ తీసిన ‘అష్టాచెమ్మ’ సినిమాను సంధ్య టాకీస్‌లో ఫ్రెండ్స్‌ అందరం కలిసి చూశాం. బాగా ఎంజాయ్‌ చేశమప్పుడు. అందరికీ టిక్కెట్లు పంపి మీ ఆప్యాయతను చూపించారప్పుడు. అలాగే మీ పాప కిరణ్మయి నాకిష్టం కూడా. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌ని బాగా తీసింది. ముఖ్యంగా కవి ‘ఇస్మాయిల్‌’గారి మీద తీసిన డాక్యుమెంటరీ అద్భుతం. మరపురానిది కూడా. తనిప్పుడు బెంగళూరులో ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది కదూ! కుటుంబ బరువు బాధ్యతలతో పాటు ‘ఆర్‌.టి.సి.’లో అకౌంట్స్‌ సెక్షన్‌లో చిరకాలం పనిచేసి రాయాలన్న కాంక్ష ఎక్కువగా ఉండడంతో, సమయం సరిపోవడం లేదని వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసేసుకున్నారు. ‘కొమ్మా కొమ్మా కోయిలమ్మ’ పేరుతో నేపధ్య గాయనిల జీవిత విశేషాలు సేకరించి ‘అస్మిత’ తరఫున ప్రాజెక్టు కూడా చేశారు. 2003లో అనుకుంటా పుస్తక రూపంలో వచ్చింది. మీరు రచనని మీ శరీరంలో ఒక భాగమనే అనుకున్నారు. మీ హృదయాన్ని కదిలించిన విషయాల్నే రాశారు. ఎవరూ స్పృశించని కొత్త విష యాల్ని, కోణాల్ని రాయాలన్న తపనే మీ రచనల్లో విభిన్నతకు కారణం, పేరుకోసం మీరెప్పుడూ రాయలేదు. అవార్డుల వెంట పడనూ లేదు. ఒక నిశ్శబ్ద చలనచిత్రం మీరు నా దృష్టిలో. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారూ, మీరూ కలగలసిన జీవితంలో ఎంత స్వేచ్ఛను పొందారో అంత నష్టమూ జరిగింది. నిజానికి మీరిద్దరూ స్వయం ప్రకాశకులే. కానీ ఒకరికి మరొకరు

ఉపగ్రహంలా మారాల్సిన సామాజిక స్థితీ కొనసాగుతోందింకా – అందుకే మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. స్త్రీలకు జరిగే నష్టాల్లో ఇదొకటి. ఒకే ఇంట్లో రచయిత లుంటే చాలావరకూ ఇలాగే ఉంటోంది. మీలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న సంగీతం, మీలో దాగున్న రీసెర్చ్‌ స్కాలర్‌, జీవనానుభవంతో వెలువడిన కథలు, నవలలూ సదా నిలిచిపోతాయి.

మళ్ళీ మీ పాటలు వినాలని ఉంది. ఒకసారి తప్పకుండా కలుద్దాం. జలపాతపు హోరులా కాకుండా, గులకరాళ్ళ మీద మెత్తగా ప్రవహిస్తున్న నీటి తునకలు, మీ పాటలు. చుట్టూ ఉన్న శబ్ద ప్రపంచాన్ని మరచిపోయి, అంతరంగ నిశ్శబ్దలోకంలో ప్రయాణం చేసి, సమయపాలన చట్రాన్ని చేధించుకొని, చుట్టూ స్వరమే ఉన్న వాతా వరణంలో పరిమళించే రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మీతో స్నేహం నిజంగా ఎంతో విలువైంది. ఒక మంచి రచయిత్రిగా, గాయనిగా, స్నేహశీలిగా నాలో ఎప్పటికీ నిలిచిపోయే ఉంటారు. మనం త్వరలో తప్పకుండా కలుద్దాం. లేదా ఈ అక్షరాలతో నైనా రాయబారాలు పంపుకుందాం. తీగల గొంతు నుంచి కూడా మీ మధురస్వరాన్ని వినొచ్చు కదా!

ప్రస్తుతానికి సెలవా మరి.

మీ స్నేహితురాలు

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.