ఒకానొక స్వప్న సాక్షాత్కారం : ఐదవ భాగం

వెదురు పువ్వులకు వాళ్ళు నిర్ణయించిన ధరని ఏమాత్రం బేరాల్లేకుండా మా బృందం అన్నింటినీ కొనేసుకోవడం ఒక విశేషమయితే… ఆ పువ్వులు తయారు చేయడంలోని వారి సృజనాత్మకతకు ముగ్ధులం కావడం మరోవిశేషం.

ఆ క్రమంలో ఎంతకీ లాంచిలోకి రాకుండా వెదురుపువ్వులతోనూ, గిరిజనులతోనూ కబుర్లాడుతూ గడుపుతోన్న కొందరిని మా మిలిటరీమేన్ సత్యవతి ప్రేమగా నోరు చేసుకోవడం మరో సరదా సన్నివేశం… అప్పటిగ్గాని అంతా లాంచి ఎక్కారు కాదు.

లాంచిలో వున్న చక్కటి డైనింగ్ హాల్లో మా అందరికీ ఆ మధ్యాహ్న భోజనం వడ్డించబడింది… పడవ సిబ్బంది అంతా కూడా మమ్మల్ని ఎంతో ఆదరంగా చూసుకున్నారు…

భోజనాల తరువాత మళ్ళీ మా తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. పేరంటపల్లినుండి పట్టిసీమకు…

మళ్ళీ ఆటలూ, పాటలూ, కబుర్లూ, దృశ్యాదృశ్యాలను తిలకించడాలూ, కెమెరాలకు పనిచెప్పడాలూ వంటి క్రమంలో నుండి మెల్లిగా సీరియస్ డిస్కషన్ లోకి జారుకున్నాం మేము…

“కలవడం, కలబోసుకోవడం కోసమే నేను ఈ ట్రిప్ ఆర్గనైజ్ చేసాను. తరచుగా మనం కలవాలి… ఇదివరకు ఏర్పాటయిన రసం, భూమిక రచయిత్రుల వేదిక వంటివి ఎందుకు కొనసాగలేదు… ఎక్కడుంది లోపం? రాష్ట్రంలోని రచయిత్రులందరినీ కలుపుకుంటూ ఒక లూస్ నెట్వర్క్‌గా తయారవడం అవసరం. ప్రతీ ఆర్గనైజేషన్ మనల్ని సంప్రదించే స్థాయికి మనం ఎదగగలగాలి.. అంతటి శక్తిగా మనం ఎదగగలం… ప్రతి సమస్యా, ప్రపంచీకరణ, రైతు సమస్యలు వంటి వాటిపై కూడా మనం ఇంకా ఎక్కువగా మాట్లాడాలి… మనం ఏదయినా చేయగలం. ఉదా- శిలాలోలిత పుస్తకంపై చెడుగా, తీవ్రంగా విమర్శించారు ఒకాయన..మనలో ఒకరిపై అంత దాడి జరిగినపుడు తక్షణ స్పందన కావాలి… మనం రచయిత్రులుగా ముద్ర వేసుకున్నాం కాబట్టి ఆ బాధ్యత కూడా మనం నెరవేర్చాలి…” అంటూ సత్యవతి ప్రారంభించింది.

శారదా శ్రీనివాసన్ అందుకుని మనమంతా కల్సుకోవడం ముఖ్యమనీ… ఇన్నాళ్ళకు ఒకసారి కలవాలి అన్న ఎజండా ఏర్పాటు చేసుకోవాలనీ జాతీయస్థాయిలో ఉమెన్ నెట్వర్క్‌ని ఏర్పాటు చేసుకోవాల్సివుంది.. అందరూ మెంబర్షిప్ తీసుకుని పార్టిసిపేట్ చేయాల్సివుంటుంది… యిది భూమిక చేయగల్గుతుందాని ప్రశ్నించారు…

‘తప్పకుండా…భూమికని ఒక వేదిక చేసుకోండి… మీ సొంతం చేసుకోండి అని సమాధానమిచ్చింది సత్యవతి…

కొండేపూడి నిర్మల మాట్లాడుతూ ‘రచయిత్రులుగా మనం పూర్తి స్థాయిలో కలవలేకపోవడానికి కారణం… కొద్దిమంది మాత్రమే అందులో పూర్తిగా నిమగ్నమవుతారు… ఉమెన్ జర్నలిస్ట్‌ల నెట్వర్క్‌లో ఏమేం చేయాలనేవి వుంటాయి… తప్పకుండా రచయిత్రులకు కూడా ఇలాంటి నెట్వర్క్‌ అనేది వుండాలి… మా నెట్వర్క్‌ యిలా వుంది.. ఇంతమంది రచయిత్రులం వున్నాం అనే ఇన్ఫర్మేషన్ చెప్పగలగాలి’ అన్నారు.

కె.బి. లక్ష్మి ‘మనం ఏమేం చేయాలనేది వర్క్‌ప్లాన్ చేసుకుని దాని ప్రకారం.. ముందు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ యివ్వాలి అనేది నిర్ణయించుకోవాలి… ఒకనెల రెండు నెలలు భూమికలో మీటింగ్ వున్నా లేకపోయినా వెళ్తూంటే అలవాటయిపోతుంది… ఎంత మందికి దీనిమీద ఇంట్రెస్ట్ వుందో అర్ధమైపోతుంది’ అని అభిప్రాయపడ్డారు.

సుజాతా పట్వారీ మాట్లాడుతూ నెలకో, రెండునెలలకో ఒకసారి ‘భూమిక’ ఆఫీసుకి వచ్చి అభిప్రాయాలు చెప్పాలి… ఒక ట్రాన్స్‌లేషన్స్ కమిటీ వేసుకోవాలి… ప్రతీ రచయితకీ కూడా తమ రచనలు యితర భాషల్లోకి వెళ్ళాలని వుంటుంది.. అయితే అనువాదకులు చాలా తక్కువమంది వున్నారు. ప్రొఫెషనల్ గా ఎవరయినా చేస్తే వారికి పేమెంట్ చేయడం.. ఇదంతా భూమిక ద్వారా చేస్తారా అన్నది చర్చించాలి’ అన్నారు.

“భూమిక రచయిత్రుల వేదిక అన్నదే బావుంది… దాన్నే కొనసాగిద్దాం” అని శారదా శ్రీనివాసన్ గారు అభిప్రాయపడ్డప్పుడు రెంటాల కల్పన మాట్లాడుతూ “ఆర్గనైజేషన్ అయితే అవసరం… కానీ ‘భూమిక’ రచయిత్రుల వేదిక అన్నపుడు భూమిక ఇంపాక్ట్ వుంటుంది కదా అలా కాకుండా కన్‌ఫ్యూజన్ లేకుండా రచయిత్రుల వేదిక అన్నా ఇబ్బంది లేదు. భూమికని కూడా నిలబెట్టుకోవాల్సి వుంది మనం… అందరం భూమిక సభ్యులం అయినపుడు మనం కూడా రచయిత్రులమే… భూమిక తరఫున పెడ్తూ డబ్బు మనం పేమెంట్ చేయాలి… అట్లా అయితే భూమికను నిలబెట్టుకోవచ్చు…” అని అన్నారు.

‘అసలు మెయిన్ రచయిత్రుల వేదిక… భూమిక అందులో భాగం… మన కార్యక్రమాలకు భూమిక వేదిక… ఆంధ్రదేశంలోని రచయిత్రులందరూ ఒక్కటైతే బలంగా తయారవుతుంది… బలమైన వేదికగా వుంటుంది… వుండాలి’ అని అన్నారు శారదాశ్రీనివాసన్. ఎస్. జయ మాట్లాడుతూ ‘భూమిక’ ఏర్పడి పదమూడేళ్ళవుతోంది ఒకరకంగా అది నిలదొక్కుకున్నట్లే… రచయిత్రులం మనం భూమికనుండి ఆశిస్తున్నది ఎక్కువగా వుంది… రచయిత్రులుగా మనం ఒక సంఘం ఏర్పాటు చేసుకుని ఆ సంఘం ‘భూమిక’ది అని చెప్పుకోవచ్చు… బయట రచయిత్రులమీద ఏదయినా జరిగినపుడు ఒక్కరే రెస్పాండ్ కావొద్దు. అందరం కలిసి స్పందించాలి….అని అన్నారు.

కొండేపూడి నిర్మల మరో సందేహాన్ని వ్యక్తపరిచారు.

‘కొన్నిసార్లు మన ఐడియాలజీతో భిన్నమైన అంటే స్త్రీవాద వ్యతిరేకమైన రచనలుచేసే రచయిత్రులు వుండొచ్చు… వారిని కూడా కలుపుకోవాలా?’ అని.

శిలాలోలిత స్పందిస్తూ స్త్రీవాదంతో సంబంధం వున్నవారికే సభ్యత్వం వుంటుంది.. అని ముందుగా చెప్పాలి.. కమిట్మెంట్ అనేది వుండాలి. రచనలు కూడా ఒక ఇన్వాల్వ్‌మెంట్ తో బాధ్యతగా చేయగలగాలి… కాబట్టి మన ఐడియాలజీతో సంబంధం వున్న వాళ్ళనే తీసుకోవాలి… ఇష్టంలేని వాళ్ళని బలవంతం చేయొద్దు… అన్నారు.

పి. సత్యవతి మాట్లాడుతూ ‘ఈ సంవత్సరానికి ఏం ప్రోగ్రామ్స్ తీసుకోవాలి అనేది నిర్ణయించుకోవాలి… ఎన్ని పనులు చేయగల్గుతాం. వాటికి వాలంటీర్స్ ఎవరు అనేదాన్ని గూర్చి తెలుసుకోవాలి.

చంద్రలత.. ఇంగ్లీష్ లిటరేచర్ తెల్సినవారిని గ్రూప్ లోకి తీసుకోవాలి… నవలలు రాసేవాళ్ళు తక్కువగా వున్నారు…

కె. రామలక్ష్మి తప్పకుండా మనకోవేదిక కావాలనీ… అందరమూ కలిసి మన భావాలు పంచుకోవాలనీ అభిప్రాయపడ్డారు.

విష్ణుప్రియ మాట్లాడుతూ భూమికలో రచనలు చేయడం, చందాదారులుగా వుండడం.. భూమికను నడిపేవారు యివన్నీ వేరువేరు అనుకుంటాను. భూమికలో రాసేవాళ్ళు కాకుండా యితరులు కూడా పార్టిసిపేట్ చేయగల్గాలి… ఇది భూమిక పెడుతోన్న రచయిత్రుల సంఘం కానపుడు… కేవలం రచయిత్రుల సంఘం అని పెడ్తే బావుంటుంది అని అన్నారు.

‘విష్ణుప్రియ చెప్పింది బావుందంటూ నాగలక్ష్మి మొత్తం మీద ‘తెలుగు రచయిత్రుల వేదిక’ అంటే బావుంటుందనీ… దీని మీద ఇంక చర్చించాల్సిన అవసరం వుందనీ అభిప్రాయపడ్డారు.

‘నెట్వర్క్‌ స్టార్ట్ అయితే నావంతు కార్యక్రమాలు నేను చేస్తాను’ అంటూ రజిత ‘తెలుగు రచయిత్రుల వేదిక’ బాగానే వుంటుంది… ఐడియాలజీకి దగ్గరగా వున్నవాళ్ళే వస్తారు… వేరే వాళ్ళు వస్తారేమోనని వెనకడుగు వేయవద్దు’ అని అన్నారు.

కె. సత్యవతి స్పందిస్తూ ‘రజిత చెప్పినట్లు వేరే వాళ్ళు రారు అనుకోవడానికి వీల్లేదు.. ఇప్పుడు చాలా మంది రచయిత్రులు స్త్రీవాద భావజాలానికి సంబంధం లేని విరుద్ధమైన రచనలు పంపిస్తున్నారు… అవి నేను భూమికలో వేయలేదనీ, వేయనన్నాననీ నామీద రకరకాలుగా దాడి చేస్తున్నారు. ఒక రచయిత్రి అయితే ఒకచోట కలిసినపుడు పుస్తకాల్ని నా మీదికి విసిరికొడుతూ దాడి చేశారు… ఇవి రకరకాలుగా వుంటాయి…’ అన్నారు.

కొండేపూడి నిర్మల ‘మనం అందరినీ చేర్చుకోకపోవడం వల్ల విశాలంగా ఆలోచించట్లేదసేది అందరికీ వుండొచ్చు కానీ అలా అనుకోడానికి లేదు… అన్నారు.

‘భూమిక’కి ఆల్‌రెడీ ఒక దృక్పధం వుంది కాబట్టి… రచయిత్రుల వేదిక కూడా ఒక ప్రత్యేకమైన ధృక్పధంతో, భావజాలంతో వుండాల్సిన అవసరముందని అంతా నిర్ణయించారు…

భూమికకి రివ్యూలు వ్రాసేవాళ్ళు కావాలి, స్త్రీలకు సంబంధించి ఏ వార్త ఎక్కడ చూసినా భూమికకి పంపాలి… జీవితానుభవాలు కూడా వ్రాసి పంపమని కోరింది సత్యవతి.

అంతా కూడా తాము ఏమేం చేయగలమనేది కమిటయ్యారు.

‘చాలామంది ఎన్.జి.వో లు ఉన్నారు. మనకి వాళ్ళనుంచి ఏమయినా సపోర్ట్ వుందా గిరిజ చెప్పాలి’ అంటూ ఆక్స్‌ఫామ్ గిరిజని అడిగారు.

“నేషనల్ ఆర్గనైజేషన్స్’ కి సంబంధించి చాలా తక్కువమంది వున్నారు ఎవరెవరు చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ యివ్వడానికి నేను సిద్దంగా వున్నాను. అయితే చాలా తక్కువగా వున్నారు.. మనం జుబాన్, రీతూమినన్ వంటి వారితో మాట్లాడితే వాళ్ళేమంటారో చూడాలి” అన్నారు గిరిజ.

ఇలా అంతా తమ తమ అభిప్రాయాలనూ, ఆలోచనలనూ పంచుకుంటూండగానే మెలిమెల్లిగా పట్టిసీమ వద్దకి లాంచి చేరుతున్నట్లుగా మాకు అర్థమయింది. టీతోపాటు పకోడీలు కూడా వచ్చాయి. వేడి వేడి పకోడీలు ఆరగించాక మళ్ళీ పాటలు కావాలన్పించింది.

అంతా శారదా శ్రీనివాసన్ని పాట పాడమని కోరారు.

‘ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబాలనమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో’

అన్న దాశరథి గీతాన్ని ఆలపించారు. అంతా ఆతాదాత్మ్యంలో నుండి… గోదావరి జలాలతో గుసగుసల అనుబంధం నుండి మేమంతా తేరుకోకముందే, బయటపడకముందే నిర్దాక్షిణ్యంగా మా లాంచి పట్టిసీమ చేరుకున్నది… దిగిపోతూ, దిగిపోతూండగా విష్ణుప్రియ వీడ్కోలు చెప్తున్నట్లుగా ఒక మంచి పాట పాడింది.

ఒడ్డుకి చేరుకుని పొద్దున మేము ఆకులన్నీ కోసి పీపాయిలు ఊదిన రావిచెట్టు చాలా తడితడిగా అన్పించింది… ‘ఒక్కొక్క ఆకే కదిలి, అన్ని ఆకులూ కలిసి నిలువునా పాట అయిన రావిచెట్టులా వుండేవాడు’ అని ఎవరిగురించో కృష్ణశాస్త్రి అన్న మాటలు పదే పదే గుర్తొచ్చాయి.

‘బ్యాక్ టు ది పెవిలియన్’ – మళ్ళీ బస్సులో మా తిరుగుప్రయాణం రాజమండ్రికి మొదలయింది… ఈసారి బస్సులో గిరిజ మా అందరికీ ఒక కొత్త గేమ్ నేర్పించింది. “ఫిష్ మార్కెట్” అని…. అందరమూ కూడా ఆ ఆటని బాగా ఎంజాయ్ చేశాము… బస్సునిండా నవ్వులే నవ్వులు కానీ ఈసారి ఆ నవ్వుల వెనకాల ఎక్కడినుండో శ్రావణమేఘాలు కమ్ముకొస్తున్నట్లుగా దిగులు….అంతా విడిపోతున్నామన్న దిగులు… పోలవరం ప్రాజెక్టు వల్ల ధ్వంసం కాబోతున్న పాపికొండల మీద దిగులు, ముంపులో సర్వస్వం కోల్పోబోతున్న గిరిజనుల మీద దిగులు, ఈ అద్భుత సౌందర్యమంతా నాశనమై పోతోందన్న దిగులు, ఆదివాసీల అంతం చూస్తోన్న అభివృద్ధి నమూనా మీద కోపం, జలయజ్ఞం పేరుతో గిరిజనుల్ని జలసమాధి చెయ్యడానికి సిద్ధమౌతున్న ప్రభుత్వ మొండి విధానం మీద కోపం… ఎన్నో భావాలు… ఉద్వేగాలు… దిగుళ్ళు అందరిలో ముప్పిరిగొన్నాయి. భారమైన మనస్సులతో అందరం మళ్ళీ బస్సెక్కాం.

రాజమండ్రిలో అద్దేపల్లి వివేకానందా దేవి మనవడు శ్రీధర్ గారు మమ్మల్ని తమ యింటికి ఆహ్వానించారు… దానవాయిపేటలోని వారింటికి చేరుకునేటప్పటికి ఏడుగంటలయింది. వారు మా అందరికీ డిన్నరిచ్చారు. సత్యవతికి మిత్రులైన శ్రీధర్ గారి ఆతిధ్యం చాలా ఆత్మీయంగా వుంది. చాలా తక్కువ వ్యవధిలో ఆయన మా కోసం చక్కని ఏర్పాట్లు చేయడమే కాక రాజమండ్రి స్టేషన్‌కొచ్చి మమ్మల్ని రైలెక్కించారు. అద్దేపల్లి వివేకానందదేవి ఫోటో చాలాపెద్దది వారింట్లో చూసి అప్పుడే తెలుసుకున్నాము వారెంతో బాగా రచనలు చేసేవారని… అక్కడ భోజనాలయ్యాక మళ్ళీ మా బస్సు మమ్మల్నందరినీ స్టేషనుకు చేర్చింది… మూడురోజుల్నుండీ యిల్లు కూడా గుర్తు రానివ్వకుండా రాజభోగాలనందించి, అద్భుతమైన అనుభవాన్నివ్వడమే కాకుండా… మమ్మల్నంతా ఎంతో పదిలంగా చూసుకున్న సత్యవతితో అందరం ప్రేమలో పడిపోయాం.

సత్యని వదిలివెళ్తూంటే.. అందరం ఒకరినొకరం విడిచి పెడుతూంటే దిగులు మేఘాలు కమ్ముకుని గొంతుకేదో అడ్డం పడ్డట్టుగా అయింది… ఎప్పుడో రావలసిన పాడురైళ్ళు ఒక జీవితకాలం ముందుగానే వచ్చేశాయి…

మనిషి జీవితంలో కొన్ని కొన్ని క్షణాల్లో మాత్రమే నిజంగా జీవిస్తాడు. ఈ మూడు రోజులు బహుశా మా జీవితాల్లో నిజంగా జీవించినవి కావొచ్చు.

 

<< నాలుగవ భాగం  ( 1 2 3 4 5 )

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to ఒకానొక స్వప్న సాక్షాత్కారం : ఐదవ భాగం

  1. Swathi says:

    మీ ప్రయాణం ఆద్యంతం అద్భుతం గా సాగింది. నాకు కూడా పాపికొండలు చూసి వచ్చినంత సంతోషం, ఉద్వేగం కలిగాయి. ఆత్మీయ స్నేహితుల సంగమం ఎంతో మధురం గా వుంటుంది. రమణీయమైన పాపి కొండలు ఇక కొన్నాళ్ళకి కనిపించవు అనే విషయం గుర్తు వచ్చినప్పుడు మనసంతా భారం గ అయిపోతుంది.

    అనుకోకుండా “భూమిక” బ్లాగు లో మీ సంపుటి చదివాను. చక్కగా రాసారు. ఇలాంటివి మరిన్ని రాయాలని, మీరు మరింత తరచుగా కలవాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో