తెలంగాణలో మహిళల కవిత్వం – వికాసం (విస్తృతి – వైవిధ్యం) – డా|| కరిమిళ్ళ లావణ్య

మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్న మహిళలలో స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపి సమానతను సాధించే క్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ”తెలంగాణలో మహిళల కవిత్వం – వికాసం (విస్తృతి – వైవిధ్యం)” అనే అంశంపై ఫిబ్రవరి 21,22 తేదిల్లో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించింది. పలువురు సాహితీ రంగ ప్రముఖులు ఇందులో పాల్గొని పత్ర సమర్పణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య జయప్రకాష్‌ రావు మహిళా సదస్సు ఆవశ్యకతను తెలియచేస్తూ గంగాదేవి అనే కవయిత్రి ‘మధురా విజయం’ అనే కావ్యాన్ని సంస్కృతంలో రాసిందని, ఆమె కాకతీయుల ఆడపడుచని వెల్లడించారు. గంగాదేవి లాంటి మహిళా మూర్తులు కవిత్వంలో తమదంటూ స్థానం ఏర్పరచుకున్నారన్నారు.

సదస్సు సంచాలకులు డా|| లావణ్య జాతీయ సదస్సు యొక్క లక్ష్యాలను వివరించారు. తెలంగాణలో మహిళా కవిత్వం ప్రచారంలోకి రాకుండా ఉండిపోయిందని, మహిళల రచనలు మరింతగా వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు. 1935-40 కాలంలో త్రిభువన సుందరి అనే కవయిత్రి నిజామాబాద్‌ జిల్లాలో ఉండేవారని ఆమె ఆశు కవిత్వం చెప్పేవారని… ఇట్లా ఎన్నో వినూత్న అంశాల్ని వివరించారు. కళల విభాగ పీఠాధిపతి ఆచార్య కనకయ్య మాట్లాడుతూ ”ఏదో చెయ్యాలని, ఎంతో అందించాలని, ఆవేదన చెందే మాతృమూర్తి, నిస్వార్థ దేవతా రూపం” అంటూ మాతృమూర్తి తన బిడ్డకోసం పడే తపన, వాళ్ళ ఎదుగుదల కోసం ఆమె శ్రమించే తీరును వివరించారు. ”పుత్రుల కోసం తన సర్వస్వాన్ని అర్పించేది తల్లే” అని తన తల్లిని స్మరించుకుంటూ మహిళా ఔన్నత్యాన్ని తన కవితతో వివరించారు. అరణ్యపర్వంలో కౌశికుడికి ఒక స్త్రీ మూలంగానే జ్ఞానోదయం అయ్యిందని, ధర్మాధర్మాలు తెలిసి వచ్చాయన్నారు. పండితులు విషయం తెలిసినవారని, జ్ఞానులు తెలిసిన విషయాన్ని అమలు చేసేవారని, స్త్రీలు రెండవ కోవకు చెందినవారన్నారు. విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అత్తర్‌ సుల్తానా మాట్లాడుతూ గతంలో తెలంగాణ సాహిత్యానికి ప్రముఖ పాత్ర లభించలేదని, నేడు స్వరాష్ట్రంలో పరిశోధనలు చేసేందుకు అవకాశం లభించిందన్నారు.

కీలక ప్రసంగాన్ని చేసిన డాక్టర్‌ ముదిగంటి సుజాతారెడ్డి ”తెలంగాణలో మహిళల కవిత్వం – వికాసం” అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించడం సముచిత నిర్ణయమని అన్నారు. తెలంగాణలో మహిళల కవిత్వం ఉందా? కవయిత్రులు ఉన్నారా? అనే సందేహం ఇకపై ఉండరాదన్నారు. ”తెలంగాణలో ప్రాచీన కాలం నుండి కవయిత్రులు ఉన్నారు. క్రీ.శ.2 కు చెందిన శాతవాహన రాజైన హాలుని సంకలనం గాథా సప్తశతిలో కవయిత్రులు కథా కవిత్వం రాశారు” అని సుజాతారెడ్డి చెప్పారు. కాకతీయుల కాలంలో విరియాల కామసాని భేతయ్య అనే బాలుడ్ని సంరక్షించి కాకతీయ సామ్రాజ్యాన్ని అధిష్టింపచేసింది. ఆమె గూడూరు శాసనం వేయించింది. ఈ శాసనం నన్నయకంటే ముందుగానే వెయ్యబడిందని, ఇందులోని వృత్తపద్యాల్లో శాసనకర్త పేరు విరియాల కామసాని. ”ఈ గూడూరు శాసనాన కర్త్రి తెలంగాణలో మొదటి కవయిత్రి” అని అన్నారు సుజాతారెడ్డి. బూతపూరు శాసనం వేయించిన కుప్పాంబిక గురించి వెల్లడిస్తూ ఆమె రంగనాథ రామాయణ కర్త గోనబుద్ధారెడ్డి కుమార్తె అని, ఆమె రచించినట్లు ఏ కావ్యం లభించకున్నా ఆమె రచించిన ఒక పద్యం ఒక సంకలన గ్రంథంలో ఉందని, అందుకే ఆమెను కవయిత్రిగా పేర్కొన్నారని అన్నారు. మధురా విజయం రాసిన గంగాదేవి ఏకశిలానగర తొలి కవయిత్రిగా కనిపిస్తారన్నారు. అగస్త్యుడి శిష్యుడైన విశ్వనాథుడికి ఈమె శిష్యురాలని, ఆమె రాసిన మధురా విజయం మొట్టమొదటి సంస్కృత రచనగా పేర్కొన్నారు.

”తెలుగులో స్త్రీల సృజనాత్మకతతో ఎంతో సాహిత్యాన్ని ఏర్పరచారు. అందులో దంపుడు పాటలు, కలుపు పాటలు, విసురాత్రి పాటలు, జోలపాటలు, గొబ్బిపాటలు, బొడ్డెమ్మ పాటలు, బతుకమ్మ పాటలు ముఖ్యం, అవి అనుభూతి నుండి వచ్చాయి” అన్నారు. సాయుధ పోరాటంలో కూడా స్త్రీలు పాల్గొన్నారని, స్వతహాగా పాటలు కట్టి పాడారని పేర్కొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి ”గోల్కొండ కవులు” సంచికలో 354 మంది కవులను ప్రస్తావించగా, అందులో 8 మంది కవయిత్రులు తెలంగాణ నుంచి ఉన్నారని పేర్కొన్నారు. నేడు అస్థిత్వ వాదం కారణంగా ఎందరో కవయిత్రులు కవితలు రాస్తున్నారన్నారు. ఇందులో ”నీలిమేఘాలు” కవితా సంపుటిలో వంటిల్లును ప్రముఖంగా పేర్కొన్నారని, ఇది వంటింట్లో మహిళా వివక్షత గురించి, స్త్రీలపై పురుషుల గుత్తాధిపత్యాన్ని తెలియచేస్తుందన్నారు. స్త్రీలు దళిత వాద కవిత్వంలో కూడా తమదైన శైలిలో రచనలను సాగించారని, అందులో గోగు శ్యామల, జాజుల గౌరి ముఖ్యులన్నారు. బహుజన వాదంలో అనిశెట్టి రజిత, లావణ్య కలిసి సంకలనంగా తెచ్చిన ”జిగర్‌” అనే కవితా సంకలనం విశిష్టమైనదన్నారు.

శాతవాహన విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా|| సూరేపల్లి సుజాత మాట్లాడుతూ ”బతుకమ్మ బోనాలకే పరిమితమైన మేము ఈ రాష్ట్రంలో వివక్షతకు గురయ్యామని, చట్టసభ అయిన కేబినెట్లో మహిళలు లేని ఏకైక రాష్ట్రం మనది” అన్నారు. తెలంగాణలో మహిళల కవిత్వమే కాకుండా, గోల్కొండ కవుల సంచిక వెలువడేవరకూ మగవారు కూడా రచనలు చేసినట్లుగా, కవులు ఉన్నట్లుగా తెలిసేది కాదు. తెలంగాణలో ఎక్కడైనా మహిళలు తమ కవిత్వాన్ని సమకాలీన సమాజంలోకి తేవడానికి ఆలోచించారని, ఎవరు ఏమనుకుంటారో అన్న ఆలోచన, ఇందుకు కారణం, పితృస్వామ్మ సమాజమని అన్నారు. ”అవును నిజమే. మేం ఆకాశంలోనే సగం, భూమి మీద మనుషులే లేరు. అవును మేం ఆడవాళ్ళమే” అంటూ స్త్రీ సాధికారతను దెబ్బ తీస్తున్న సమాజాన్ని గురించిన తన కవితను చదివారు.

తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి డా|| ఎం.గీతావాణి ”తెలంగాణ మహిళల వచన కవిత్వం”పై మాట్లాడారు. నేడు తెలంగాణ మహిళలు సాహితీ దుందుభులను వినిపిస్తున్నారన్నారు. తెలంగాణలో ”తొలిపొద్దు” కవితా సంకలనం ప్రకారం 78 మంది కవయిత్రులున్నారన్నారు. ప్రత్యేకంగా ఉద్యమ కాలంలో స్త్రీలు రచనా వ్యాసంగాన్ని, ఉద్యమాన్ని సమానంగా నడిపారన్నారు. మహిళలు తమ శక్తిని అన్ని విధాలుగా చాటుకున్నారన్నారు. అనిశెట్టి రజిత – ”నేనొక నల్లమబ్బునౌతాను”, ”లచ్చమ్మ” మొదలగు కవితల్లో స్త్రీ అంతరంగ మథనాన్ని వినిపించే ప్రయత్నం చేశారని, ”నేనొక నల్లమబ్బునౌతాను – బడబాగ్నిని దాచే నల్లమబ్బునౌతాను” అనే కవిత మహిళల అంతరంగ మథనాన్ని తెలుపుతుందన్నారు.

దళిత కవిత్వం, ముస్లిం, మైనారిటీ కవిత్వం వైపు కూడా మహిళల కవితా యాత్ర సాగిందని చెప్పారు. దళిత కవిత్వంలో గోగు శ్యామల దళిత మహిళలపై జరుగుతున్న అన్యాయాలను, అత్యాచారాలను ప్రకటించారన్నారు. ముస్లిం కవిత్వంలో షాజహానా రాకతో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలకు, వారి జీవన చిత్రణ గురించి వివరించబడిందని అన్నారు. తొలి మహిళా సంకలనంగా పేర్కొనబడే ”గాయాలే గేయాలై”లో ఒక విషయంపై అరవై మంది కవయిత్రులు తమ కవితలను వెలువరించారన్నారు. తెలంగాణా అవసరాన్ని, పౌరుషాన్ని, ధీమాను తెలియజేస్తూ ”తెగించి కొట్లాడుడే” అని తెలియజేశారు. డా. లావణ్య సమ్మక్క సారక్కల విశిష్టతను, త్రివేణి బ్రతుకమ్మ విశిష్టతను, నెల్లుట్ల రమాదేవి, జూపాక సుభద్ర, విజయలక్ష్మి, రాధిక మొదలగువారు తెలంగాణ విశిష్టతను తెలియచేశారన్నారు.

ప్రముఖ రచయిత్రి జాజుల గౌరి ”మౌఖిక సాహిత్యం ప్రాముఖ్యత – సమకాలీన పాటలు” అనే అంశంపై మాట్లాడుతూ మౌఖిక సాహిత్యం ప్రాముఖ్యత అంతా మహిళలదే అన్నారు. జానపద సాహిత్యం విస్తృత ప్రచారాన్ని పొందిందని, ప్రతి పండగకి ఒక పాట

ఉంటుందని అన్నారు. పాట విస్తృతం కావడానికి కారణం పాటలో జీవితం ఉండడమేనన్నారు. నేటి సాహిత్యానికి మూలం మౌఖిక సాహిత్యం అన్నారు. ప్రజలు నిత్యం పాడుకునే ఏతం పాటలు, మోట పాటలు, మట్టి పాటలు, పని పాటలు మౌఖిక సాహిత్యంలో

ఉన్నాయని, తెలంగాణలో పాటలు అనుబంధాల నుండి వచ్చాయని, అవి తల్లీ బిడ్డల్లాగా సంబంధం కలిగి మనసును హత్తుకుంటాయని అన్నారు జాజుల గౌరి.

అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి డా.ఎన్‌. రజనీ ”తెలంగాణ మహిళల కవిత్వం – అభ్యుదయ విప్లవ దృక్పథాలు” అనే అంశంపై మాట్లాడారు. ”స్త్రీలు రచనలు చేస్తున్నారంటే వాళ్ళ అభ్యుదయం ప్రారంభం” అని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో సాహిత్యం, అభ్యుదయం కోసం విప్లవ పంథాలో వచ్చిందనీ, ఇక్కడి స్త్రీలు రాశిలో తక్కువ రాసినా వాసిలో అది బలంగా రాశారని అన్నారు. మహిళల్లో ఒక అభ్యుదయ దృక్పథం ఉందన్నారు. జాజుల గౌరి, అనిశెట్టి రజిత, జూపాక సుభద్ర, ఎన్‌.అరుణ, బండారు విజయ, వడ్డాది సూర్య వంటి కవయిత్రుల కవిత్వాన్ని ప్రస్తావించారు.

విప్లవ కవిత్వంలోని విశిష్టతను విమల వివరించారు. డా.వారిజా రాణి ”తెలుగు మహిళల కవిత్వం-లఘు ప్రక్రియలు” అనే అంశంపై మాట్లాడుతూ తక్కువ అక్షరాల్లో అనంత భావాన్ని తెలియచేసేవే లఘు ప్రక్రియలు అన్నారు. లఘు ప్రక్రియలు ప్రజల హృదయాల్లోకి త్వరగా చొచ్చుకొని పోతాయన్నారు. హైకూలు రాసిన అనిశెట్టి రజిత, రెక్కలు రాసిన ఇందిర వీటిలో ప్రముఖులన్నారు. లఘు ప్రక్రియా రచనలో నానీల గురించి మాట్లాడుతూ ”చూడడానికి చిన్నగా ఉన్నా ఎంతో తాత్వికత ఉండేవి నానీలు” అన్నారు. చిల్లర భవానీదేవి, అడువాల సుజాత, అనిశెట్టి రజిత, షహనాజ్‌ ఫాతిమా, ఆచార్య విజయశ్రీ, సూర్యా ధనుంజయ్‌, త్రివేణి, వారిజా రాణి వంటి పలువురు కవయిత్రుల కవితా విశేషాలను వివరించారు.

డా. లక్మణ చక్రవర్తి ”తెలంగాణ మహిళల కవితం – పద్య కవిత్వం”పై మాట్లాడుతూ మహిళా కవిత్వం తక్కువగా వచ్చిందని, ఇందుకు కారణం మహిళల్లో నిరక్షరాస్యత అని చెప్పారు. అందువల్ల వారు కవిత్వాన్ని మౌఖిక రూపంలోనే భద్రపరుచుకున్నారన్నారు. ప్రాచీనాంధ్ర కవిత్వంలో కవయిత్రులు ఐదారుగురే కనిపిస్తున్నారని ఇందుకు కారణాలు విశ్లేషించారు. ”కవయిత్రులు తక్కువగా రాసినా, రాసినవారు శతక సాహిత్యంలో ఎక్కువగా రాసారు. ఇందులో అభినవ మొల్లగా పిలవబడే చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ తమిళ కవిత్వాన్ని అనువాదం చేసి భద్రాద్రి పాటలను ప్రచారం చేశారు. ఆతుకూరి అన్నపూర్ణమ్మ ”పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం”, తల్లా ప్రగడ విశ్వసుందరమ్మ పద్మ సాహిత్యాన్ని చాటువుల రూపంలో రాశారని పేర్కొన్నారు.

డా.కరిమిళ్ళ లావణ్య తెలంగాణా మహిళల గేయ సాహిత్యంపై మాట్లాడుతూ పల్లవి, చరణాలు లేకుండా, నిర్దిష్ట పాదసంఖ్య లేకుండా సాగిపోయేది గేయమన్నారు. గేయాలను రాసిన కవయిత్రులను ప్రస్తావిస్తూ 1945 కాలంలోనే త్రిభువన సుందరి అనే కవయిత్రి నిజామాబాద్‌లో గేయాలు రాసేదని పేర్కొన్నారు. రూప్ఖాన్‌పేట రత్నమాంబ దేశాయ్‌ స్త్రీ సంబంధిత గేయాలు, లక్ష్మీ నరసమ్మ భద్రాచలం రాముడిపై గేయాలు రాశారన్నారు. ప్రస్తుతం చాడ లలితాదేవి ”ఏ సిరాతో రాయాలి” అనే గేయ కవితా సంకలనం, మల్లు స్వరాజ్యం ”జానపద గేయాలు” వెలువరించారన్నారు. గరిశకుర్తి ”కోవెల దీపాలు” రాశారని. మహిళలు గేయాలను రాయడం ఒక ఎత్తైతే, వాటిని పుస్తకం రూపంలోకి తేవడం మరొక ఎత్తని అన్నారు. అయితే ఈ విధంగా పుస్తక రూప గేయ రచనలలో సస్య అనే కవయిత్రి ”మంచెపాటలు” ప్రముఖమైనవన్నారు.

మహిళలు కాలానుగుణ మార్పులను గుర్తెరిగి గేయాలను రాస్తున్నారని, అందులో జొన్నవాడ రాఘవమ్మ ”స్వాతంత్య్ర కాంక్ష”పై ”నా దేశ సౌభాగ్య సంపదలు తిలకించి, నవ్య భావాలతో నాట్యమాడాను” అనే గేయాన్ని, ”పరువాల చిలకమ్మా” గేయంలో ”ఒక్కమాటు పలికితే ఒలుకునా ముత్యాలు; విరిసిన గులాబీ ఎదపై విలయం; త్యాగం ధైర్యం చెదరని నిలయం” అంటూ పండుగ గేయాలు, భక్తి గేయాలు, ప్రకృతి గేయాలు కూడా రాశారన్నారు.

ఆచార్య సూర్యా ధనుంజయ్‌ మహిళల కవిత్వం – పరిశోధన అనే అంశంపై మాట్లాడుతూ ”స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారని, మన దేశంలో స్త్రీలకు గౌరవ స్థానం ఉందని” అన్నారు. తెలంగాణ మహిళల కవిత్వం – పరిశోధన అనే అంశాలు దగ్గరగా కనిపించినా చాలా గొప్ప విషయాలను వెల్లడిస్తాయన్నారు. స్త్రీల భావాలను, భావనలను స్త్రీలే అర్థం చేసుకోగలరని, ఆ అవకాశం, ఆదరణ వారికే ఉంటుందని అన్నారు. మహిళల పాత్ర

ఉనికి కోసం నేటి సమాజం పరిశోధిస్తోందన్నారు. ”ఒక స్త్రీ విద్యావంతురాలైతే తన కుటుంబంతో పాటు సమాజాన్ని నిర్మిస్తుంది” అన్నారు. ఎంతో మంది స్త్రీలు కవిత్వంలో తమ ఆవేదనను, ఆలోచనలను ప్రతిబింబిస్తూ రచనలు చేస్తున్నారని, నేటి సమాజాన్ని సినిమా, రాజకీయం, ఆట ఏలుతున్నాయని, ఆ రంగాలవైపు మహిళలు అడుగులేస్తున్నా ఆదరణ కరువైందని, ఈ విధమైన ఆలోచనా దృక్పథం మారాల”ని కాంక్షించారు.

ప్రముఖ కవయిత్రి గోగు శ్యామల ”తెలంగాణ కవిత్వంలో మహిళల దృక్పథం” అనే అంశంపై మాట్లాడుతూ తెలంగాణలో కవిత్వం రాస్తున్న వారెవరైనా తెలంగాణ తల్లి అని సంభోదించడం, తెలంగాణను స్త్రీతో పోల్చడాన్ని బట్టి కవిత్వంలో మహిళల దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణలో మహిళా కవిత్వంపై పరిశోధనలు లోతుగా చేయవలసిన అవసరం ఉందని, ఫలితంగా మహిళల దృక్పథంపై ఎలాంటి అభిప్రాయాలున్నాయో తెలుస్తుందన్నారు. మహిళలు నిత్య జీవితంలో, కుటుంబంలో పొయ్యి దగ్గర, చేను దగ్గర మొదలైన నిత్యకార్యక్రమాల్లో మహిళల అనుభవాలను కవిత్వంలోకి చూపించాలన్నారు.

డా. జి.బాలశ్రీనివాసమూర్తి ”తెలంగాణ మహిళల కవిత్వం – గోల్కొండ కవుల సంచిక వరకు” అనే అంశంపై మాట్లాడుతూ చరిత్రను చరిత్రగా మాట్లాడుకున్నప్పుడు కొన్ని సత్యాలు, ఆవిష్కరణలు బయటపడతాయన్నారు. 12వ శకంలో లల్లాదేవి అనే కవయిత్రి సంస్కృత, సాహిత్యంలో ఉన్నారన్నారు. ప్రాచీన, మధ్యయుగ భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ ఉన్నందువలన కవయిత్రులకు సరైన గుర్తింపు లభించలేదని, తంజావూరు నాయకరాజుల యుగంలో కవయిత్రులకు సరైన స్థానం లభించిందని పేర్కొన్నారు. గోల్కొండ కవుల సంచిక కంటే ముందు ఇద్దరు రచయిత్రులున్నారని, అందులో రూప్కాన్‌ పేట రత్నమాంబ దేశాయ్‌ అనే పరిగి ప్రాంత కవయిత్రి 1924లో తెలుగు పత్రికలో గాంధీ ప్రతిష్టను వివరించారన్నారు. ”మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ పరాక్‌ బహుపరాక్‌” అని పద్యం సాగుతుందని, రెండవ కవయిత్రి మెదక్‌ పాపన్నపేట రాణీ వెంకటలక్ష్మమ్మ గోవధపై వేదాంతపరమైన పద్యాలు రాశారని చెప్పారు. టి.వరలక్ష్మమ్మ, యల్లాప్రగడ సీతాకుమారి తొలితరం కవయిత్రులన్నారు. గోల్కొండ కవుల సంచిక ప్రచురణకు ఆర్థిక సహాయం చేసిన అమరచింత సంస్థానం రాణీ భాగ్యలక్ష్మమ్మ కవిత్వం రాయకపోయినా సాహిత్యానికి కృషి చేశారన్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన శ్రీమతి లక్ష్మీబాయ్‌ ”దార సుతాదివర్గము తల్లడమల్లడవడుతుండగా; అధిక భావవర్థిల్లుతుండ నాయనా! అయ్యో నా తండ్రి నారాయణా నావనీశా” అనే స్మృతి కవిత్వాన్ని రాశారన్నారు. కావున స్మృతి కవిత్వాన్ని రాసిన మొట్టమొదటి కవయిత్రి లక్ష్మీబాయి అన్నారు. జ్ఞానమాంబ, వి.లక్ష్మీ నరసమ్మ, గోళ్ళ ఆండాళమ్మ, లక్ష్మీదేవమ్మ, పునుగోటి ఆనందమాంబ గోల్కొండ సంచికలో కవయిత్రులని చెప్పారు.

ప్రముఖ కవయిత్రి షహనాజ్‌ ఫాతిమా ”మైనార్టీ కవిత్వం”పై మాట్లాడుతూ శంషాద్‌ బేగం, జవేరియా, మహేజబీన్‌, షాజహానా, ఫరీదా ఫారక్‌ లాంటి వారిని పేర్కొన్నారు. వీరు మైనార్టీ మహిళల ఇబ్బందికరమైన జీవితాల గురించి, వారి జీవితాలలో బయటపడని ఎన్నో సాధక బాధకాలను బహిర్గతం చేశారన్నారు. ప్రధానంగా బురఖా, తలాఖ్‌, బహు భార్యత్వం, బాల్య వివాహాలు, డబ్బుకోసం బాలికలను విదేశాలకు అమ్మడం, ఇట్లా ఎన్నో విషయాలను ప్రస్ఫుటించేలా రచనలు చేశారన్నారు.

డా|| కొండపల్లి నీహారిణి ”మహిళా కవిత్వం ప్రాంతీయత” అనే అంశంపై మాట్లాడుతూ ”ఒక మనిషి పుట్టుక, జీవన విధానం, ప్రదేశ స్థితిగతులను ప్రాంతీయత అంటారు” అని చెప్పారు. ఒక వ్యక్తిని నీవెవరు అనగానే తన ప్రాంతీయత గుర్తుకు వస్తుందని, ప్రాంతాలు, యాసలు వేరైనా తెలుగు భాష మాత్రం ఒక్కటేనని ఆమె అన్నారు.

డా|| వి.త్రివేణి బి.సి. దృక్పథంపై మాట్లాడుతూ తెలంగాణా సాహిత్యంలో అనేక అస్తిత్వవాదాలలో బి.సి. దృక్పథంపై సాహిత్యం తక్కువగా వచ్చిందని, ఇప్పుడు బి.సి. దృక్పథంపై కవిత్వాలు, పరిశోధనలు రావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థలోని శూద్ర వర్ణమే వృత్తి చైతన్యమని, అందులో మహిళలు తమ వృత్తినే అంటిపెట్టుకుని ఉన్నారని అన్నారు. ప్రపంచీకరణ ప్రభావంతో వృత్తి నైపుణ్యకారులు (బి.సి.) అల్లాడారని ఆమె పేర్కొన్నారు. 2000 సంవత్సరం నుండి మహిళలు కవిత్వం రాయడం మొదలు పెట్టారన్నారు. మొట్టమొదటి బి.సి. కవయిత్రిగా జ్వలితను పేర్కొన్నారు. అనిశెట్టి రజిత, నాంపల్లి సుజాత, జ్వలిత, త్రివేణి వంటి కవయిత్రుల కవిత్వంలోని విశేషాలను ఆమె తెలియచేశారు.

సదస్సులో భాగంగా జరిగిన కవిసమ్మేళనంలో ప్రముఖ రచయిత్రి డా|| అమృతలత మాట్లాడుతూ ”కూలి” కవితతో తన సాహితీ ప్రస్థానం మొదలైందని, తన దృష్టిలో కవితలు సరళంగా ఉంటే పాఠకుల మనస్సులను ఆకర్షిస్తాయని అన్నారు. అలాగే రచయిత్రులందరూ కలిసి ఒక పత్రికను స్థాపించుకుంటే తమ రచనలన్నింటినీ ప్రచురణ చేసుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. ప్రముఖ కవయిత్రి రాజీవ ”భావ రూపంలో వచ్చేదే కవిత్వం” అన్నారు. ఈ సందర్భంగా తన ”అమ్మ” కవితలో ‘అమ్మా తెలంగాణ తల్లి; బంగారు మా తల్లీ మా కల్పవల్లీ; కూలీలుగా వచ్చి రైతులయ్యారంటూ సకల జనులు కల్సి నిన్ను తెస్తిమి” అంటూ మహిళలకు 33% ఇచ్చామంటూ సంబరపడిపోతున్నా, 1% మహిళలు కూడా చట్టసభల్లో లేరని, మహిళలను మభ్యపెడుతున్న తీరును వెల్లడించారు. ప్రముఖ కవయిత్రి కిరణ్‌ బాల ”పలకరింపు” అనే తన కవితలో ”ఒక జననం తొలికేక అమ్మతనాన్ని పలకరించింది; ఇవికావు పలకరింపులు; ఒక్కమాట పలకరింపు; ఒక్క స్పర్శ పలకరింపు; నిద్ర పలకరింపు; మెలకువ పలకరింపు” అని వినిపించారు.

కవయిత్రి శారదా హనుమాండ్లు ”కాళి” అనే కవితలో భగవంతుడి సృష్టి అందమైనదని, పచ్చని చీరకట్టు ముత్తైదువులా మురిసిపోతున్న భూమాతను చూడాలనుకున్నాను; అణచబడ్డ మనస్సు కన్నీటి చెమ్మైంది; ఎవరి ఉక్కు పిడికిలి గుండెల్ని పిండింది; ఒక్కసారి అమ్మతనాన్ని వీడు; కాళిగా మారు; రాక్షస మస్తిష్కాలను నీ మెడలో ధరించు” అంటూ స్త్రీ ఒక్కసారి అమ్మతనం అనే బంధాన్ని వీడి కాళికగా మారితే వారిపై ఈ రాక్షసత్వం సమసిపోతుందన్నారు. కవయిత్రి పొద్దుటూరి మాధవీలత ”పరిభ్రమణ చట్రంలో” అనే కవితలో ”దుఃఖం నదిలా సాగిపోతున్నపుడు నరనరాల్లో ప్రవహిస్తున్న ఆవేదన; నిరంతరం సంఘర్షిస్తూనే నేడు గులకరాళ్ళ సవ్వడి వణికిస్తుంది” అని స్త్రీలు అనుబంధాలనే పరిభ్రమణ చట్రంలో నిరంతరం సంఘర్షిస్తూనే ఉన్నారన్నారు. కవయిత్రి తుర్లపాటి లక్ష్మి ”అమ్మకు జ్వరమొస్తే” అనే కవితలో ”అమ్మకు జ్వరమొస్తే; లేలే ఎంతసేపు పడుకుంటావ్‌; నాన్న గాండ్రింపు” అంటూ స్త్రీలకు అనారోగ్యంలో కూడా చేయూతనిచ్చేవారు లేరని బాధపడ్డారు. కవయిత్రి గిరిజా గాయత్రి ”అక్షరాభివందనం” అనే కవితలో ‘అమ్మ అమ్మతనానికి చిరునామా; అమ్మను మించినవారు ఈ జగాన లేరు; అమ్మకు అనుబంధాల విలువ తెలుసు” అంటూ ఈ జగత్తులో అమ్మను మించిన వారు లేరనే సత్యాన్ని తన కవిత ద్వారా వినిపించారు. ప్రముఖ కవయిత్రి పూదోట శౌరీలు ”కథల గంప”, ”పూదోట శౌరీలు”, ”మేడలకు ఆవల” అనే సంకలనాల్లో, ”ఓ సంచారి అంతరంగం” అనే కన్నడ పుస్తకంలో స్త్రీ అంతరంగాన్ని చిత్రించే ప్రయత్నం చేశానన్నారు. ప్రముఖ కవయిత్రి డా||ఆరుట్ల శ్రీదేవి ”ఒక మహిళా కవితా సౌందర్యం; ఓ మహిళా నీ రచనా హృదయం; ఏ రవివర్మకూ వర్ణింప సాధ్యంకాదు” అంటూ మహిళా సౌందర్యాన్ని, అంతరంగాన్ని వర్ణించడానికి ప్రముఖ కవి రవివర్మకే సాధ్యం కాలేదని అభిప్రాయపడ్డారు.

ప్రముఖ కవయిత్రి సుమిత్రానంద తనోబా ”నిన్నైనా నేడైనా” అనే కవితలో ”నిన్నైనా నేడైనా; జరిగేది ఇదేనా; కోరే కూర్పులో వెలిగే మార్పులో; పూజింపబడే స్త్రీలెక్కడ; ఎక్కడ దేవతలు నాట్యం ఆడుతున్నారు; ఆంక్షలు తొలగేదెప్పుడు; హక్కులకు హమేషా బందేనా?; రామ రాజ్యమా రావణ రాజ్యమా; రామరాజ్యం నుండి మోడీ రాజ్యం దాకా; కాలమేగా కరిగింది స్త్రీలకు ఏం ఒరిగింది; ప్రశ్నే ప్రాణవాయువు ఉనికికి” అంటూ పూర్వం నుండి నేటిదాకా స్త్రీల హక్కులకు భంగం కలుగుతూనే ఉందన్నారు.

ప్రముఖ కవయిత్రి దత్తశ్రీ ”క్షణక్షణం యుగంయుగం; గతమంతా గతమే కాదు; గతంలోనూ వర్తమానంలోనూ; తానే మొదటగా ఉండాలనే మగాడు” అంటూ గతంలోలాగే పురుషులు స్త్రీలను వెనక్కు నెడుతున్నారనే సత్యాన్ని తన కవిత ద్వారా వెల్లడించారు. ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి ”జాదూ” అనే కవితలో ”కాలం పెద్ద జాదూ; ప్రకృతే అసలైన జాదూ; ఎన్కట్ల దొంగలు పొట్ట కోసం దొంగాలిస్తుండ్రి కానీ; ఇప్పట్ల పొట్టమీద కొట్టి కండ్లల్ల నీళ్ళు దెప్పిస్తున్నరు” అని నేడు సమాజంలో బ్రతకాలంటే ప్రతి ఒక్కడు ఇంకొకడిని మోసం చేసి బ్రతుకుతున్నారనే సత్యాన్ని తెలంగాణ యాసలో వినిపించింది. కవయిత్రి సునీతారాణి ”వనితా ఓ వనితా” అనే కవితలో ”లోకం పొగడ్తలతో మభ్యపెట్టడం; గగనతలంలో విజయకేతనం; తరాలు మారినా; తరుణుల తలరాతలు మారలేదు” అంటూ గగనతలం దాకా ఎగురుతున్న ఈ రోజుల్లో కూడా స్త్రీల తలరాతలు మారడం లేదని, ఇకనైనా స్త్రీలు ముందడుగు వెయ్యాలని ఆకాంక్షించారు. కవయిత్రి వెంకన్నగారి జ్యోతి ”సిరులు కురిపించే కన్నతల్లీ; నీ ఆరోగ్యానికి ఉండదు ఏ లొల్లి” అనే కవిత ద్వారా నిరంతరం అన్ని పనులు చేసిపెట్టే అమ్మ ఆరోగ్యం గురించి ఎవరికీ పట్టదని, తల్లిని గౌరవంగా చూసుకోవాలని పేర్కొన్నారు. మరొక రచయిత్రి టి.వి.రమాదేవి ”ఆమని కోయిల” అనే గేయ కవిత్వంలో ప్రకృతి వర్ణన చేశారు. ఇంకా రచయిత్రి కాట్రగడ్డ భారతి ”అమ్మకు ప్రాణం విలువ తెలుసు” అనే కవితను వినిపించారు. ఇందులో కవయిత్రి వేలేటి బాల సరస్వతి మరుగున పడి ఉన్న మహిళల నిద్రాణమైన కవితలు బయటికి రావాలని తన కవిత్వం ద్వారా పేర్కొన్నారు. పరిశోధక విద్యార్థిని పద్మారాణి ”మంచి రోజులు వస్తున్నాయ్‌” అనే కవితలో ”వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌; మంచి రోజులు వస్తున్నాయ్‌” అంటూ స్త్రీలలో భవిష్యత్తుపై ఆశాభావ దృక్పథాన్ని నింపారు. పరిశోధక విద్యార్థిని శమంత ”తెలంగాణ తేజోవంతం” అనే కవితలో ”ఏ పురుషుడు సాటిరాడు; మహిళతో పోటీ పడితే” అంటూ స్త్రీల ఆత్మ స్థైర్యాన్ని మరొకసారి గుర్తుకు తెచ్చారు.

ముగింపు సమావేశపు అధ్యక్షులు డా||జి.బాల శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ అనేక సంవత్సరాల పాటు మనల్ని మనం గుర్తించుకోలేకపోయామన్నారు. ఇప్పుడు రాష్ట్రం వచ్చినవేళ మనం చైతన్యంతో మన చరిత్రను సమీక్షించుకోవాలన్నారు. కరిమిళ్ళ లావణ్య మాట్లాడుతూ సమావేశాలు, సదస్సుల ద్వారా మహిళా కవయిత్రుల ఆలోచనా సరళిని వినిర్మింపవచ్చని పేర్కొన్నారు. కవితలో ఒక పదం పడాలంటే దానిలో ప్రసవ వేదన పడాల్సి ఉంటుందని, తల్లి ప్రసవించి ఆరోగ్యమైన బిడ్డను పొందినట్లే, కవయిత్రులు కూడా సమాజానికి ఉపయోగపడే మంచి కవితలు రాయాలని అన్నారు.

పాలమూరు విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్‌ గూడూరి మనోజ మాట్లాడుతూ మనుషులందరూ పంచుకునేవి మనసులోని మమతలు, ఆవేదనలని అన్నారు. అందుకే నిత్య జీవితంలోని భావాలు ప్రస్ఫుటమయ్యే కవిత్వం రాయాలన్నారు. మన మంచి గతాన్ని వెస్టర్న్‌ కల్చర్‌తో పోల్చుతున్నామని, సమాజపు మూలంలో మార్పులు వస్తున్న ఈ రోజుల్లో వెస్టర్న్‌ కల్చర్‌ వైపు పోకుండా మరచిపోయిన, మరుగునపడ్డ మన చరిత్రను, చరిత్రకారులను బయటకు తీసి కొత్త ఒరవడిని సృష్టించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం తెలంగాణలో వినూత్నమైన పరిశోధనలు జరగాలన్నారు. ప్రముఖ మళయాళ రచయిత్రి కమలాదాస్‌ రాసినట్లు ”సంఘర్షణ మొదలైంది మహిళల్లో; పితృస్వామ్యం అనే మాటకు మరో పర్యాయ పదం రావాల్సి ఉంది” అని, మహిళలు తాము గీసుకున్న పరిధిని దాటి కవితాలోచనలను చేయాలన్నారు. చుట్టూ వేసుకున్న పదబంధాలనుండి బయటికి వచ్చి మన కవిత్వాన్ని సమాజానికి ఇవ్వాలన్నారు.

అనేక అంశాలపై ప్రత్యేకీకరణతో కూడిక అధ్యయనాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో మహిళా కవితా వికాసం –

ఆ కవిత్వంలోని వైవిధ్యంపై జరిగిన ఈ సదస్సు ప్రత్యేకమైన ప్రాసంగికతను సాధించిందని పలువురు సాహితీ రంగ ప్రముఖులు వ్యాఖ్యానించారు.

(ఎడిటర్స్‌ నోట్‌ :- ఈ రిపోర్ట్‌లోని వాస్తవాలలో కొన్ని తప్పులు దొర్లినాయని గుర్తించి వాటిని సరిచేసి ప్రచురించడమైనది.)

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.