ఈ కూతలు రాతలు ఇంకెన్నాళ్ళు? – కె.శాంతారావు

స్త్రీ – పురుషుల మధ్య గౌరవప్రదమైన లైంగికేతర సంబంధాలు ఉండవా? ఆధునిక స్త్రీ అన్ని రంగాలలో అంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో పురుషులతో సమానంగా ముందుకు దూసుకువస్తున్న తరుణంలో స్త్రీల పట్ల ఇంకా నీచ దృక్పథంతో వ్యవహరించాలా?

శాస్త్రీయమైన, వాస్తవమైన విషయాలు వెలుగులోకి వచ్చేలా కాకుండా అధికారులు, మీడియా వారు (సోషల్‌ మీడియాతో సహా) చాలామంది ఎందుకు హుందాగా ప్రవర్తించలేకపోతున్నారు?

ఇటీవల రాజధాని హైద్రాబాద్‌లో శిరీష, ఎస్‌.ఐ. ప్రభాకరరెడ్డివి హత్యలా – ఆత్మహత్యలా? అనే అంశంపై పతాక శీర్షికలుగా మీడియాలో ప్రముఖంగా వచ్చిన తీరుపై ప్రశ్నలు ఉదయించేలా చేస్తున్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే…

అనుమానాస్పదంగా మృతి చెందిన బ్యూటీషియన్‌ శిరీషది ఆత్మహత్యగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు పోలీస్‌ కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి జూన్‌ 16న మీడియా వారికి తెలిపారు.

ఫిల్మ్‌నగర్‌లోని ఆర్‌.జె. ఫోటోగ్రఫీ స్టూడియోలో మేనేజర్‌-కమ్‌-బ్యూటీషియన్‌గా, మేకప్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది శిరీష. ఆ స్టూడియో అధిపతి రాజీవ్‌. అయితే రాజీవ్‌కు తేజశ్వని అనే స్త్రీతో ప్రేమ సంబంధం ఉంది. ఈ ప్రేమ వ్యవహారం స్టూడియో నిర్వహణకు అడ్డుగా ఉందని భావిస్తూ శిరీష, రాజీవ్‌లు శ్రావణ్‌ అనే ఇంకో మిత్రునితో కలిసి పరిష్కారానికి కుకునూరుపల్లి ఎస్‌.ఐ. ప్రభాకర్‌రెడ్డి వద్దకు వెళ్ళారు.

అక్కడ ఆ నలుగురూ కలిసి మద్యం సేవించారని, ఆ మత్తులో శిరీషపై ప్రభాకరరెడ్డి అత్యాచార యత్నం చేసినట్టు తేలిందని, అది భరించలేకనే శిరీష ఆత్మహత్యకు ఒడిగట్టిందని, ఈ ఘటనలో తను ఎక్కడ నిందితుడిగా దొరికిపోతానేనన్న భయంతో ప్రభాకరరెడ్డి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని మహేందర్‌రెడ్డి తెలిపిన సమాచారం. ఇదంతా రిమాండ్‌ డైరీగా నమోదయినట్లు పత్రికలు పేర్కొన్నాయి.

 

వివరాలలోకి వెళితే…

శిరీష అసలు పేరు విజయలక్ష్మి. ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమగోదావరి జిల్లా ఆచంట గ్రామం. వృత్తి బ్యూటీషియన్‌. 13 ఏళ్ళ క్రితం సతీష్‌ చంద్రతో ఆమె వివాహం జరిగింది. 12 ఏళ్ళ పాప కూడా ఉంది. తన బ్యూటీ పార్లర్‌ నష్టాలు రావడం కారణంగా, ఇతరత్రా ఆర్థిక ఇబ్బందుల వలన అప్పటికే ఫేస్‌బుక్‌లో పరిచయమైన రాజీవ్‌ స్టూడియోలో మేనేజర్‌-కమ్‌-మేకప్‌ ఆర్టిస్ట్‌గా ఉద్యోగానికి చేరింది. గత నాలుగేళ్ళుగా ఆమె ఈ ఉద్యోగం చేస్తోంది.

ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం (కొన్నిచోట్ల శారీరక సంబంధం) ఏర్పడిందని పత్రికల్లో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో కమిషనర్‌ తెలిపినట్లు వార్తలు వచ్చాయి.

ఇది అభ్యంతరకరమైన విషయం- వారి మధ్య అలా సంబంధం ఉన్నట్లు ఏ ఆధారాలతో నిర్థారణకు వచ్చి మాట్లాడుతున్నారు? శిరీష చనిపోయింది. మరణ వాంగ్మూలం లేదు. ఇక మిగిలిన వ్యక్తి రాజీవ్‌. అతను ఆ విధంగా తెలిపినట్లు వార్త లేదు. ఒకవేళ తెలిపితే నిజం ఎంత? సమాధానం లేదు.

‘భలేవారండి. ఇలాంటి విషయం ఎవరైనా బయటకు చెప్తారా?’ అని చాలామంది చాలా తేలిగ్గా (క్యాజువల్‌గా) కొట్టిపారేస్తున్నారు. మరి శిరీషకు ఒక గౌరవప్రదమైన కుటుంబం ఉంది. ఈ రకమైన మాటలతో వారి జీవితాలతో చెలగాటమాడే అధికారం వీరికెవరిచ్చారు? ఆ ప్రభావం పడిన నష్టాన్ని పూడ్చ సాధ్యమా? మరివి బాధ్యతా రాహిత్య కూతలు రాతలు కావా? సభ్యసమాజం ఎంతకాలం భరించాలి వీటిని? ఇవీ ఉత్పన్నమయ్యే ప్రశ్నలు.

సరే! మళ్ళీ కథలోకి వస్తే… రాజీవ్‌కు బెంగుళూరు యువతి తేజశ్వినితో ఫేస్‌బుక్‌ ద్వారానే పరిచయం ఏర్పడింది. ఆమె తరచుగా హైదరాబాద్‌ వచ్చి రాజీవ్‌ను కలిసేది. ఇది ప్రేమగా మారింది అని రాస్తూనే కొనసాగింపుగా వారు శారీరకంగా ఒకటయ్యారు అని కూడా రాసేస్తున్నారు.

ఈ నొక్కుడు వక్కాణింపు అంత అవసరమా? అజ్ఞానమా? లేక కేసును ప్రక్కదారి పట్టించడమా? అన్నీ ప్రత్యక్షంగా చూసినట్టు అధికారులు చెప్పడం, మీడియాలో రావడం యాదృశ్చికం అని అనుకోగలమా?

రాజీవ్‌ అనే వ్యక్తిది ఫేస్‌బుక్‌ల ద్వారా అమ్మాయిలను వలలో వేసుకునే స్వభావం అని చెప్పదలచుకున్నారా? లేదా రాజీవ్‌ అనే వ్యక్తి మగవాడు కనుక అలా స్త్రీలతో సంబంధాలు కలిగి ఉండడం సర్వసాధారణ విషయం అని పాఠకులు/శ్రోతలు భావించాలా? అనేది అర్థం కాదు.

కథలో… ఆ తర్వాత తేజశ్విని బెంగుళూరు నుండి హైదరాబాద్‌కు బదిలీ చేయించుకుని రాజీవ్‌, శిరీషలను బెదిరించింది. అభ్యంతరకర వాట్సప్‌ మెసేజ్‌లను పంపింది. విసిగిపోయిన శిరీష తన మిత్రుడు శ్రవణ్‌కుమార్‌ను ఆశయ్రించింది. రాజీవ్‌, శిరీషలను శ్రవణ్‌ తనకు పరిచయం ఉన్న కునూర్‌పల్లి ఎస్‌.ఐ. ప్రభాకరరెడ్డి వద్దకు తీసుకువెళ్ళాడు. అలా జూన్‌ 12 రాత్రి 9.30 గంటలకు రాజీవ్‌ కారులో బయలుదేరారు. మధ్యలో స్నాక్స్‌, మద్యం కొనుక్కుని వెళ్ళారు. 11 గంటలకు కుకనూర్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రక్కన ఉన్న ఎస్‌.ఐ. క్వార్టర్స్‌కు చేరుకున్నారు. నలుగురూ కలిసి అర్థరాత్రి 2 గంటల వరకు మద్యం త్రాగారు.

సమస్యను పరిష్కరిస్తామని ఆ సందర్భంగా ప్రభాకరరెడ్డి వారికి హామీ ఇచ్చాడు. మధ్యలో శిరీషను విడిచి ముగ్గురు మగవాళ్ళు బయటకు వచ్చారు. శిరీష కూడా వారితో కలిసి వస్తుండగా రావద్దు, సెంట్రీ చూస్తే ఇబ్బంది, లోపలే ఉండు అని చెప్పారు.

కొంతసేపటికి లోపలికి వస్తూ… ”దగ్గర్లో రెండు కి.మీ. దూరంలోనే అందమైన సెక్స్‌వర్కర్లు

ఉన్నారు, ఎంజాయ్‌ చేసి రండి” అని ప్రభాకరరెడ్డి వారితో అన్నాడు. ఈ మాటలు విన్న శిరీష కీడును శంకిస్తూ తనను విడిచి వెళ్ళవద్దని ప్రాధేయపడింది. వాట్సప్‌ మెసేజ్‌లు పంపించింది. అయినా వారు బయటే ఉన్నారు. అదే సమయంలో ఆందోళనతో తన భర్తకు కూడా రెండుసార్లు వెంటవెంటనే మెసేజ్‌లు పెట్టింది.

ప్రభాకరరెడ్డి అత్యాచార యత్నంతో శిరీష రోదిస్తూ ”నేను అలాంటిదాన్ని కాదు” అంటూ బిగ్గరగా కేకలు వేసింది. ఆ గొడవకు ఇతరులు మేల్కొంటారనే ఉద్దేశ్యంతో ఆమెను రాజీవ్‌, శ్రవణ్‌లు బయటకు తీసుకువచ్చారు. చేసేదిలేక ఇక మీరు వెళ్ళండి అని ప్రభాకరరెడ్డి అన్నాడు. దాంతో తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో వారు కుకునూర్‌పల్లి నుండి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

అప్పుడు శిరీష మీరు నన్ను వ్యభిచారిణిగా చూస్తున్నారని ఆరోపించింది. కారు దిగి పారిపోయే ప్రయత్నం చేసింది. రాజీవ్‌ ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కొట్టుకుంటూ కారు ఎక్కించాడు. ఈ ఘర్షణలో శిరీషకు బలమైన గాయాలయ్యాయి. తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో కారు ఫిల్మ్‌నగర్‌లోని రాజీవ్‌ స్టూడియోకు చేరుకుంది.

స్టూడియో లోపలికి వెళ్ళిన శిరీష అకస్మాత్తుగా తన స్కార్ప్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. అది చూసిన రాజీవ్‌ వెంటనే శ్రవణ్‌కు ఫోన్‌ చేశాడు. అప్పటికే కారులో వెళ్తున్న శ్రవణ్‌ వెనక్కి తిరిగి వచ్చాడు. అంబులెన్స్‌కు కబురు పెట్టడంతో వచ్చిన ఆ పారా మెడికల్‌ స్టాఫ్‌ శిరీష అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.

అయితే ఈ వివాదంలోకి ప్రభాకరరెడ్డి పేరు బయటకు తీసుకు రావద్దని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారు. శిరీష భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు. రాజీవ్‌, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. కేసులో ఎక్కడ తన పేరు బయటకు వస్తుందోనన్న భయంతో ప్రభాకరరెడ్డి పిస్తోలుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదంతా ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా తెలుసుకున్నట్లు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి చెప్పిన విషయం. పత్రికల్లో వచ్చింది. రిమాండ్‌ డైరీగా గంటలు, నిమిషాలతో సహా పత్రికల్లో వివరంగా పేర్కొనబడింది. ఒక సినిమాకు సరితూగేలా కథ, కథనం ఊపిరి బిగించి ఉత్కంఠలా సాగింది.

మద్యం సీసాలు కొనుక్కోవడం, తీసుకువెళ్ళడం, కలిసి త్రాగడం, వ్యభిచార గృహాలు ఉన్నాయని పోలీసు అధికారే స్వయంగా చెప్పడం, అత్యాచార యత్నం, కారు దిగి పారిపోతుంటే కొట్టి లాక్కొచ్చి కూర్చోబెట్టడం, ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం… అంతా సినిమా దృశ్యంలా కళ్ళముందు కదలాడుతుంది విన్నవారికి, చదివిన వారికి కూడా.

మరో ప్రక్క శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికి మనిషి కాదని, శిరీషది ముమ్మాటికీ హత్యేనని ఆమె తండ్రి రవీందర్‌, అక్క భార్గవి అంటున్నారు. వివాదాన్ని పరిష్కరించమని కోరుతూ పోలీసుల వద్దకు వెళ్తే పోలీసులే ఈ విధంగా ప్రవర్తిస్తే, ఎవరికి ఎలా చెప్పుకోవాలో అర్థం కావడంలేదని వారు వాపోయారు.

రాజీవ్‌తో వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని కూడా ఖండించారు. దగ్గరుండి చూసినట్లుగా పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని వారు పేర్కొన్నారు.

తమ కుమార్తె ఎంతో ధైర్యవంతురాలని, ఆరడుగుల ఎత్తు, 80 కిలోల బరువుతో జమానుగా

ఉన్న శిరీష ఆత్మహత్య చేసుకుంటే ఫ్యాన్‌ అసలు చెక్కుచెదరలేదని, పైగా శిరీష గొంతుపై ప్లాస్టిక్‌ వైరుతో బిగించినట్లు గుర్తులున్నాయని, శిరీష హత్య కేసును తారుమారు చేసేందుకే పోలీసులు ఈ విధంగా మాట్లాడుతున్నారని శిరీష తల్లి రామలక్ష్మి పేర్కొంది.

కాగా, ఇందులో సత్యాసత్యాలు ఎలా తెలియాలి? వాస్తవాల నుండి సత్యాలను రాబట్టడమే పరిశోధనా సామర్ధ్యం. చట్టం కానీ, మీడియా కానీ ఆ విధంగా ప్రయత్నించాలి. అందుకే అంటారు సత్యాన్ని శోధించడమంటే చీకట్లో నల్లపిల్లిని బంధించడం అని. అలాగాక ఇతరుల వ్యక్తిత్వానికి, హక్కులకు భంగం కల్పించేలా కూతలు కూస్తే… రాతలు రాస్తే అసత్యం కాస్తా సత్యం అయిపోతుందా?

ఆలోచించాలి…

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.