కూటికి లేని కూలి గర్భాలు – జూపాక సుభద్ర

ఓ పది పదేనేండ్ల కింద అద్దెకు గర్బాలు (సరోగసి) వార్తలు విని, వాటి మీదొచ్చిన సినిమాలు జూసి ‘యిదేం పోయే కాలం, ఎవరు పోయే కాలం, ఏమి వైపరీత్యాలివి అనీ, వీటిని నిషేధించాలని మహిళా సంగాలు నినదించినయి. కిరాయికి పిండాన్ని మోసుడేంది. కన్నతల్లి, కడుపు కోత, పేగు బంధం, కడుపు తీపి అనే ఫిలాసఫీకి, నవమాసాలు మోసి కన్న హక్కు లు, ప్రేమకు మారుపేరు, మాతృమూర్తని, దేవతని, కన్నతల్లిని మించిన దైవం లేదనీ, అర్థం లేదనీ ఓ….వేల తరాల నుంచి కన్న తల్లి చుట్టు బోలెడు సాహిత్యం, తాత్వికాలు, విలువలు, నిర్వచనాలు అన్నిటిని సరోగసి వ్యాపారం తలకిందులు చేసింది. శిశువుల్ని సరుకులు జేసి అణగారిన మహిళల పిల్లల సంచుల్ని కిరాయి కార్ఖానాలుగా జేసింది. వీరి పెట్టుబడికి అణగారిన మహిళలే టార్గెటైండ్రు.

ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్‌లో భాగంగా ‘కిరాయికి పిల్లల సంచి’ లేదా అద్దె గర్భాలు ఇండియాకొచ్చినయి. ఇక్కడ అణగారిన కులాల గర్బాలు చవక, ఇక్కడ వ్యాపారం బాగా సాగుతదనీ ఇక్కడి తాబేదారులైన రాజకీయ నాయకులతో మిలాఖతై కార్పొరేట్‌ సంతాన సాఫల్య కేంద్రాలు కోట్ల వ్యాపారం జేస్తున్నయి. సరోగసిని నిషేధించాల్సింది బోయి ఏకంగా 2016లో పార్లమెంటులో బిల్లు కూడా పెట్టినయి మన ప్రభుత్వాలు. ఎందుకంటే సవర్ణ సంపన్నుల కోసం యిక్కడి అణగారిన కులాల ప్రాణాలకు, ఆరోగ్యాలకు ఏమి నష్టం, ఎంత నష్టం జరిగినా ఎవరికీ పట్టదు. అణగారిన కులాల పేదరికం, నిరక్షరాస్య తను ఆసరా చేసుకొని వారిని ప్రలోభపెట్టి వారి గర్భాలకు వెలలు కట్టి వారి గర్భాలకు పరాయి పిండాలను కూరి, అవి నిలవకపోతే, నిలిచేదాకా వారి శరీరాల్ని ఫ్యాక్టరీలలాగనే చూస్తున్నారు గానీ, వారు మనుషులు, వారి శారీరక హింసలు, వ్యాపారులకు పట్టవు. శిశువును కనేదాక మందులతో, టెస్టులతో ఆ మహిళ శరీరాన్ని కెమికల్‌ కార్ఖానాగానే చూస్తున్నరు. పిండం దశలో నుంచి బిడ్డ దశదాకా కడుపులో ఉన్నంతవరకే ఆ తల్లి బిడ్డ. కడుపుల్నించి బైటకొచ్చినంక, ఆ బిడ్డ పట్ల ప్రేమ, కన్న ప్రేమలు, స్పర్శలు ఉండొద్దు, అసలే హక్కులుండొద్దు. చాలా ఇతర దేశాల్లో కన్నతల్లి హక్కులున్నాయి. కాని మన దేశంలో అవేమి లేవు. సరోగసి బిల్లులో కూడా అంతా వ్యాపారం జేసే వాల్ల ప్రయోజ నాలకే ఎక్కువ అనుకూలతలున్నాయిగానీ, నవమాసాలు మోసి, మోసే క్రమంలో ఎదురయ్యే శారీరక మానసిక బాధల్ని, మందుల సైడ్‌ ఎఫెక్ట్‌లని, అసహజ పిండాల్ని శరీరం తీసుకోనప్పుడు కృత్రిమంగా శరీరాన్ని మలిచే క్రమంలో జరిగే హింసల్ని, ధ్వంసాల్ని ఎవరు పట్టించుకుంటారు.

సంపదలున్న సంపన్నులు గ్లోబల్‌ జీవనసరళులు, సుకుమారమై, తొమ్మిది నెలలు మోసే బాధలు, ప్రెగ్నెంట్‌ బాధలు, కనే నొప్పుల బాధల్ని భరించలేని సవర్ణ మహిళలకు సరోగసి ఒక రిలీఫ్‌ అయింది. భారత్‌లో వేల సరోగసి సెంటర్లు సంవత్స రానికి వందల కోట్ల టర్నోవర్లతోని నడుస్త న్నయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వందదాకా ఈ సరోగసి దందా సెంటర్లు నడుస్తున్నయట.

అణగారిన మహిళలు ఎంత ఆగర్భదరిద్రులైతే… తమ గర్భాన్ని అనేక శ్రమలకోర్చి, ప్రాణాలను పనంగా బెట్టి అద్దెకిచ్చే ఆ దయనీయమైన వాల్ల జీవన పరిస్థితులకు ఎవరు కారణం? ఏ వ్యవస్థల వైఫల్యాలు? ప్రమాదకరమైన ప్రసవాల క్కూడా వారిని ప్రలోభపెట్టే వ్యాపార సంస్థలకు శిక్షలేమిటి బిల్లులో. చాలా దేశాల్లో సరోగసికి అనుమతి లేదు. ఈ దేశంలో అణగారిన కులాల ఆర్గాన్సే వ్యాపారమై ఆ మధ్య కిడ్నీ రాకెట్‌ దందా బైటకొచ్చి కొన్ని రూల్స్‌ తీసుకొచ్చింది ప్రభుత్వం. కాని అవన్ని అమలవుతున్నాయా అనే చెకింగు లేదు. సరోగసిక్కూడా అణగారిన తల్లుల పిల్లల సంచులే టార్గెట్‌ అయినయి. వాల్ల ప్రాణాలు, వాల్ల తల్లి హక్కులే గల్లంతయినయి. కూలి గర్భాన్నే కుల్లబొడుస్తున్నయి సంతాన సాఫల్య కేంద్రాలు, వాటి ప్రయోజనాలు, సంపన్నుల సంతాన కొరతలు తీర్చే ప్రభుత్వాలు.

ఈ సరోగసి కూలి గర్భాల సంగతులు మా ‘మేపుకూలిగొడ్డు’ను యాద్దెచ్చింది. యిప్పుడు లేదు గానీ, నా చిన్నప్పుడు ఆసాములు, పటేండ్లు గొడ్లను, బర్రెల్ని సాదలేక గూడేలల్లకు తోలేటోల్లు. సాది సంబాలిచ్చితే మేపుకూలి యిచ్చెటోల్లు పటేండ్లు. అట్లా మా ఇంటికి ఒక పెయ్యావును తోలిండు పటేలు. దాన్ని మా అవ్వ, అన్న పగలంత మేపి, యింటికి తోల్కొచ్చేటప్పుడు మంచిగా సెర్ల తానం జేయిచ్చి ఇంటికాడ మంచిగ సొప్ప, నీల్లు బెట్టి, దాని పెండరొచ్చంత సాపుజేసి సమాలిచ్చేది. ఆ పెయ్యావు పెరిగి సూడి దైంది. సూడిదని మంచి పచ్చిమేత మేపిచ్చి, యింటికాడ కూడ పచ్చిమేతేసి పాణమోలె జూసుకునేది మా అవ్వ.

అది యీనేనాడు యింటిల్లాదు లంత దాని సుట్టే ఉండేది. ఆవు మామూలప్పుడు ఎంత సాదువుగుంటదో, యీనినప్పుడు సూడాలె దాని వుగ్రరూపం. తను కన్న దూడను ఎవ్వర్ని తాకనియ్యది, దగ్గెరికి రానియ్యది. మా అవ్వ దానికి అనుకూలంగనే ఉండి బాగా మలితమయింది. దాని మాయిరొచ్చు సాపుజేసుడంతా దాన్ని శాంత జేస్కుంట చేసింది. అయితే అట్లా తీస్కపోనీకొస్తే పటేలు తరిమి తరిమి కొట్టింది. దాని యీనిన కోపం సల్లారేదాక మా ఇంటికాన్నే ఉంచిండ్రు. తర్వాత తోలిండ్రు. ఒక పశువు కూడా తన కన్నహక్కును సాదిచ్చుకుంటది. అణగారిన మహిళలు అంతకన్నా తీసిపోతరా….

 

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో