కటకటాల కరకు దారుల్లోంచి… కొండవీటి సత్యవతి

జైలు అంటే చాలామంది భయపడతారు. జైలు పురాణాల్లో వర్ణించిన నరకంలా, భయానకంగా ఉంటుందని అనుకుంటారు. నిజమే… జైలు మనిషి ప్రాథమిక హక్కులన్నింటినీ రద్దు చేస్తుంది. ఏదో ఒక నేరం చేసిన వాళ్ళే జైలుకొస్తారు. కానీ చాలాసార్లు ఏ నేరం చేయకుండా నేరంలో చిక్కుకునో, ఇరికించబడో జైలుకెళతారు. రాజ్యాన్ని ధిక్కరించి జైలుకొచ్చే రాజకీయ ఖైదీలు చాలామంది ఉంటారు. ఫలానా నేరం చేసినవాళ్ళు సమాజంలో స్వేచ్ఛగా తిరగడానికి అనర్హులు అంటూ భారతీయ శిక్షా స్మృతిలో పేర్కొన్న శిక్షల్ని విధించి జైలుకు పంపడం సహజంగా జరుగుతున్న విధానం. అయితే ఈ శిక్షలకి కులం, మతం, జెండర్‌ వాసన కూడా ఉంటుంది. ఆధిపత్య వర్గాలు, కులాలు, ధనంతో సమస్తాన్ని కొనగలిగిన ధనవంతులు ఎంతటి నేరం చేసినా, అరెస్టులు జరిగినా తమ ధనబలం, పలుకుబడి, రాజకీయ జోక్యాలతో బెయిల్‌ పొంది సమాజంలో కాలరెత్తుకుని మరీ తిరగగలుగుతుంటారు. ఇలాంటి వాళ్ళు జైల్లోకి అడుగుపెట్టే అవసరమే

ఉండదు. ఒకవేళ వచ్చినా బయట పొందే సకల సౌకర్యాలు జైల్లో కూడా పొందగలుగుతారు. అందుకే జైళ్ళనిండా ఉండేది అట్టడుగు, అణచివేతకు గురయ్యే వర్గా ప్రజలే. ఎస్‌.సి, ఎస్‌.టి, మైనారటీ మతాలకు చెందిన వారే అధికం.

జైలు లోపల ఎలా ఉంటుందో చూడాలనే గాఢమైన కోరిక నాకెందుకు కలిగిందో నాకు కూడా తెలియదు. జైల్లో వివిధ శిక్షలు అనుభవించే మహిళలతో మాట్లాడాలనే తపన ఉండేది. కరణం మురళితో కలిసి ‘లాడ్లీ’కి సంబంధించిన పనిచేసినప్పుడు ఆయన ఎప్పుడూ జైళ్ళ గురించి మాట్లాడేవాడు. తన పిహెచ్‌.డి నో, ఎం.ఫిలో ఈ అంశం మీదే చేశానని చెప్పినట్టు గుర్తు. అంతేకాదు ఖైదీల హక్కులకు సంబంధించిన ఒక పుస్తకాన్ని తప్పొప్పులు సరిచేసి ఇవ్వమని అడిగినప్పుడు, ఆ పుస్తకం చదివినప్పుడు ఖైదీలకు ఎలాంటి హక్కులున్నాయో వివరంగా అర్థమైంది. చంచల్‌గూడా మహిళా కారాగారానికి వెళ్ళాలనే కోరిక మరింత బలపడింది.

2008 లోనో, 2009లోనో గుర్తు లేదు కానీ జైళ్ళ శాఖ ఐజికి ఒక లెటర్‌ రాశాను. నేను భూమిక అనే పత్రిక ఎడిటర్‌నని, మహిళా కారాగారం సందర్శించాలనుకుంటున్నానని అందులో రాసాను. ఓ పది రోజుల తర్వాత పర్మిషన్‌ ఇవ్వడం కుదరదు అని సమాధానమొచ్చింది. ఒకసారి మురళితో చంచల్‌గూడా జైలుకెళ్ళగలిగాను. కానీ ఎవ్వరితోనూ మాట్లాడే అవకాశం రాలేదు. రెండు నెలల తర్వాత అనూహ్యంగా ఐజి, ప్రిజన్స్‌ నుంచి ఒక లెటర్‌ వచ్చింది. రెగ్యులర్‌గా జైలును సందర్శిస్తూ, ఖైదీలకు కౌన్సిలింగ్‌ చేయాలని, వారికి న్యాయపరమైన సహాయం అందించాలని కోరుతూ ఒక గవర్నమెంట్‌ ఆర్డర్‌ వచ్చింది. అడ్వయిజరీ కమిటీలో మెంబర్‌గా నియమించారు. నా ఆనందానికి అంతులేకుండా అయ్యింది. అప్పటినుండి రెగ్యులర్‌గా మహిళా కారాగారం సందర్శిస్తూ, వారి సమస్యలు వినేదాన్ని. ఈ కమిటీలో రెండుసార్లు నియమించబడి ప్రస్తుతం మూడోసారి కూడా నియమించడానికి ప్రపోజల్స్‌ వెళ్ళాయని తెలిసింది.

ఇంతకుముందు చాలాసార్లు వివిధ సందర్భాలలో జైళ్ళు చూసాను కానీ పనిచేయలేదు. ఢిల్లీలోని విశాలమైన తీహార్‌ జైలు, రాజమండ్రి మహిళా, పురుష కారాగారాలు, విశాఖలోని మహిళా కారాగారం చూసాను. వారి సమస్యలను లోతుగా అర్థం చేసుకునే అవకాశం రాలేదు.

2014లో జైళ్ళతో నా అనుభవాలను గుర్తించారా అన్నట్టుగా సింక్రనీ ఫైనాన్స్‌ అనే ఒక కార్పొరేట్‌ కంపెనీ చంచల్‌గూడా వుమన్‌ ప్రిజన్‌లో మీరు పనిచేస్తారా? మేము ఆర్థికంగా సపోర్ట్‌ చేస్తామని ముందుకొచ్చింది. వెదకబోయిన తీగ కాళ్ళకు అడ్డం పడినట్టయింది. సంతోషంగా ఒప్పుకున్నాం. దేశం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా జైలు లోపల ఇద్దరు కౌన్సిలర్‌లతో ఒక సపోర్ట్‌ సెంటర్‌ ప్రారంభించాం. రోజంతా జైలులో ఉంటూ మహిళా ఖైదీలకు కౌన్సిలింగ్‌ ఇవ్వడం, వారి సమస్యలు వినడం కౌన్సిలర్ల ముఖ్యమైన బాధ్యత. వారితో మాట్లాడుతున్న క్రమంలో వారి వారి కుటుంబ విషయాలు, కుటుంబ సమస్యలు, పిల్లల అంశాలు, వారి చదువులు, సంరక్షణ లాంటి విషయాలన్నీ కౌన్సిలర్లు వింటారు. ఒక మహిళ అరెస్టై, జైలుకి రావడం జరిగిన తర్వాత పిల్లలేమయ్యారో తెలియక ఆమె పడే దుఃఖాన్ని, వేదనని చాలా దగ్గరగా చూడడంతో వారి వారి పిల్లల ఆచూకీకై వివిధ పోలీస్‌స్టేషన్లను సంప్రదించడం, పిల్లలను తీసుకెళ్ళి తల్లులకు చూపించడం చాలా తరచుగా చేయడం జరుగుతోంది. పిల్లలతో తల్లులు గడిపే ఆ కాస్త సమయం చాలా ఎమోషనల్‌గా, దుఃఖంతో, సంతోషంతో కలగలిసి ఉంటుంది. పిల్లల్ని హోమ్స్‌లో, స్కూళ్ళలో చేర్పించడం కోసం చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలతో కలిసి పనిచేస్తాం.

ఇక మహిళా ఖైదీల దుఃఖగాధలు మనసును మెలిపెట్టేస్తాయి. వారిని ఉల్లాసంగా, సంతోషంగా ఉంచడానికి, మోటివేట్‌ చేయడానికి వారానికొక సమావేశం ఏర్పాటు చేస్తాం. వివిధ రంగాల నుండి వచ్చినవారితో సెషన్స్‌ ఏర్పాటు చేయడంవల్ల ఖైదీలు చాలా ఉత్సాహంగా కనబడతారు. నవ్వుతారు, ఏడుస్తారు, డాన్సులేస్తారు, పాటలు పాడతారు. జైలులో ఉన్న సమయంలో ఎలా నడుచుకోవాలి, విడుదలయ్యాక మళ్ళీ జైలుకు తిరిగి రాకుండా, తిరిగి నేరం చెయ్యకుండా ఎలా మారాలి లాంటి విషయాలన్నీ మేం మాట్లాడతాం. క్రమశిక్షణని పాటించకపోతే ఎలాంటి శిక్షలకు గురికావలసి వస్తుంది లాంటి అంశాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం గురించి కూడా మాట్లాడతాం.

ఖైదీలతో సెషన్స్‌లో కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ముఖ్యంగా భర్తల్ని హత్య చేసో / చెయ్యకో జైలుకొచ్చి, శిక్ష అనుభవిస్తున్నవారితో మాట్లాడేటప్పుడు వారు అనుభవించిన కుటుంబ హింస గురించి వివరిస్తున్నప్పుడు తట్టుకోవడం, వారి దుఃఖాన్ని వినడం చాలా కష్టం. రోజుల తరబడి అది నన్ను వెంటాడుతుంది. ఎన్నో సంవత్సరాలుగా భర్తల హింసల్ని సహించి, వారి తాగుళ్ళని, తన్నుల్ని భరించి ఒకానొక ఉద్రిక్త వాతావరణంలో ప్రాణరక్షణ కోసం మాత్రమే చాలామంది స్త్రీలు హత్యలకి పాల్పడతారు. వారికి ఆ సమయంలో వేరే దారిలేక తిరగబడకపోతే తాను చావాల్సి వస్తుంది కనుక ఆ నేరానికి పాల్పడతారు. ఆ భయానక హింసలో భర్తల్ని, పిల్లల్ని కోల్పోయినవాళ్ళు, ఒక్కోసారి నేరం చెయ్యకపోయినా ఇరికించబడి జైలు పాలవుతారు.

జైలులో ముఖ్యంగా శిక్షలు పడినవాళ్ళు, శిక్షల కోసం ఎదురు చూస్తున్నవాళ్ళు (under trails) ఉంటారు. తీవ్రమైన నేరాలలో కేసులెదుర్కొనే వాళ్ళకి అదే స్థాయిలో శిక్షలు పడతాయి. రెండు సంవత్సరాలుగా వీళ్ళందరితో అతి సమీపం నుండి పనిచేయడం వల్ల, కౌన్సిలర్‌లు రోజంతా వారితో గడపడం వల్ల ఖైదీలందరిలో మా పట్ల గొప్ప భరోసా ఏర్పడింది. వాళ్ళ క్షేమం, సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని అవగతమైంది. ఎంతోమంది ఖైదీల ఊళ్ళకి, ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు విడుదలయ్యే నాటికి, వారిని కుటుంబాల్లోకి తిరిగి తీసుకునే విధంగా కుటుంబ సభ్యులతో, వారి కమ్యూనిటీలతో మాట్లాడడం వల్ల ఎంతోమంది విడుదలైన ఖైదీలు సంతోషంగా ఇళ్ళకెళ్ళగలిగారు. వారు విడుదలైన తర్వాత కూడా వారి బాగోగులను, మంచి చెడ్డలను పరిగణనలోకి తీసుకుంటూ వారితో ప్రత్యక్ష సంబంధంలో ఉండడం, వారికేదైనా కష్టమొచ్చినప్పుడు వారికి తోడుగా నిలవడం జరుగుతోంది. ఉపాధి అవసరమైన వారికి ఉద్యోగాలు చూపించడం కూడా జరిగింది.

గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం శిక్షలు పూర్తి చేసుకుంటూ, మంచి నడవడికతో ఉన్న 28 మంది మహిళా ఖైదీలను విడుదల చేస్తూ జి.వో. ఇచ్చింది. వారిలో కొంతమంది వారి కుటుంబాలకే తిరిగి వెళ్ళారు. అంతకుముందే కౌన్సిలర్‌లు వారి కుటుంబ సభ్యులను కలిసి నచ్చచెప్పడం వల్ల ఇది సాధ్యమైంది. కొంతమందికి ఎవరూ లేకపోవడంతో హోమ్స్‌లో పెట్టాం. కొంతమందికి ఫ్రెండ్స్‌ ఇళ్ళలోనే ఉద్యోగాలిప్పించాం. జైలుకెళ్ళారు, నేరస్తులు వీళ్ళు అనే మూస ధోరణిలోంచి బయటకొచ్చి తమ ఇళ్ళల్లో ఉంచుకుని

ఉద్యోగాలిచ్చిన మిత్రులు అభినందనీయులు. హత్యలు చేసారు, నేరాలు చేసారు అంటూ తరచుగా విడుదలైన ఖైదీలు ఎందుర్కొనే ఛీత్కారాలు, చీదరింపులు మాత్రమే కాక పోలీసులు మళ్ళీ మళ్ళీ వీరి జోలికెళ్ళకుండా కట్టడి చేయగలిగాం. తెలంగాణ పోలీసులతో చాలా అంశాల్లో కలిసి పనిచేయడం వల్ల ఇది సాధ్యమైంది. విడుదలైన ఖైదీలలో సంపూర్ణ ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, తాము ఖైదీలమనే భావననుండి బయటకు తీసుకురావడం వల్లనే ఈ రోజు తెలంగాణ జైళ్ళ శాఖ దేశంలోనే తొలి ప్రయత్నంగా మొదలుపెట్టిన మహిళలచేత నడపబడే గ్యాస్‌ స్టేషన్‌లో వీరంతా సగౌరవంగా ఉద్యోగాలు పొందారు.

విడుదలైన మహిళా ఖైదీలకు ఉద్యోగాలిస్తూ అత్యంత అభినందనీయంగా ప్రారంభమైన మహిళల గ్యాస్‌ స్టేషన్‌ ప్రయత్నం చాలా గొప్ప విషయం. గత రెండు సంవత్సరాలుగా జైలులో వీళ్ళందరితో పనిచేస్తూ వాళ్ళల్లో వారిపట్ల వారికి నమ్మకం కలిగించడంవల్లను, జైలు అధికారులు కూడా వారి సంక్షేమం గురించి ఆలోచించడం వల్లనే ఇది సాధ్యమైంది. పెట్రోల్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవం రోజున విడుదలైన ఖైదీల ముఖాల్లో కన్పించిన సంతోషం, జీవితం పట్ల ధీమా మాకు చాలా తృప్తిని, ఆనందాన్ని కలిగించాయి. ఈ ఒక్క కార్యక్రమం ద్వారా జీవితం ధన్యమైన భావం కలిగింది.

జైళ్ళు, జైళ్ళతో కలిగిన అనుభవాలతో భవిష్యత్తులో కూడా మరింత నిబద్ధతతో పనిచేయాలనే సంకల్పం విస్తృతమైంది. ఖైదీల చుట్టూ, వారి జీవితాల చుట్టూ అల్లుకుని ఉండే stigma ని బద్దలుకొట్టి, వారు సంపూర్ణంగా, స్వేచ్ఛగా, సమాజంలో మిళితమయ్యేలా ఇంకా కృషి చేయాల్సి ఉంది. భూమిక టీం అందరం ఆ కృషిని కొనసాగిస్తామని హామీనిస్తూ…

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో