వంశాన్ని నిలబెట్టేది కొడుకులేనా? బి. విజయభారతి

పితృస్వామ్య సమాజం తన అధికారాన్నీ, నియంతృత్వాన్నీ నిలబెట్టుకోవడానికి ఎన్నెన్ని కథలు చెప్పిందో తెలుసుకునే కొద్దీ ఆశ్చర్యమూ, అసహనమూ కలుగుతాయి. వంశాన్ని నిలిపేవాడూ, ఉద్ధరించేవాడూ కొడుకు; పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు; పితృదేవతలకు పుత్రుడు చేసే తర్పణాలతోనే కాలం గడుస్తుంది; కొడుకు తలకొరివి పెడితేనే పుణ్య లోకాలకు వెళ్ళగలుగుతాం-అనే నమ్మకాలు ఈనాటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే అందుకు మూలాలు మతవిశ్వాసాలతో బలంగా ముడిపడి ఉన్నాయనేది నగ్నసత్యం. ఏ వంశాంకురానికైనా జన్మనిచ్చేది స్త్రీయే. ఆ విషయాన్ని అతి తెలివిగా మరుగుపరచి పురుషుల గొప్పదనాన్నే ప్రచారం చేస్తూ ఉన్న కథలను విశ్లేషించి చూస్తూ స్త్రీల అణచివేత ఎంత పటిష్టంగా అమలు జరుగుతూ వచ్చిందో అర్థమవుతుంది. పూర్వ వాంగ్మయంలో స్త్రీలను కులసతులుగా, కులధర్మపత్నులుగా పేర్కొన్నారు. కులాన్ని విస్తరింపచేసేవారు వారే అని ఒప్పుకుంటూనే పురుషులను-పుత్ర సంతానాన్ని వంశోద్ధారకులుగా కీర్తించారు. ప్రవర్తనా నియమాలలో పురుషులకు స్వేచ్ఛ ఉంది. కానీ స్త్రీ స్వాతంత్య్రానికి అర్హురాలు కాదన్నారు. వంశ ప్రతిష్ట స్త్రీల మీదనే ఆధారపడి ఉండగా ఆమెకు కఠినమైన నియమాలు, నిబంధనలు విధించారు.

వంశాన్ని నిలిపేవారూ, వంశక్షయాన్ని ఆపేవారూ కూతుళ్ళే అనే విషయం చరిత్రలోనూ, పురాణ కథలలోనూ కనిపిస్తున్న వాస్తవం. యుద్ధ సందర్భాలలో రాజులు తమ శత్రువు బలమైన వాడైనప్పుడు అతనికి తమ కూతురినో, సోదరినో ఇచ్చి పెళ్ళిచేసి బంధుత్వం కలుపుకునేవారు. ఆ విధంగా తమ రాజ్యాన్ని, కులాన్ని వంశాన్నీ నిలబెట్టుకునేవారు. ఆ సందర్భాలలో స్త్రీలు తమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పితృస్వామ్యానికి తలవంచి పుట్టింటిని కాపాడవలసి వచ్చేది. అలాంటి ఒక కథాంశాన్ని పరిచయం చేయటం ఈ వ్యాసం ఉద్దేశ్యం. ఇది మహాభారతం-ఆదిపర్వం-ద్వితీయాశ్వాసంలో ఉన్న జరత్కారువు కథ. ‘జరత్కారువు’ నాగుల చెల్లెలు. మున్ముందు నాగ కులానికి సంభవించబోయే ఆపదను జరత్కారువుకు కలగబోయే కుమారుడు నివారించగలడని తెలుసుకుని నాగులు ఆమె వివాహాన్ని అందుకు అనుకూలంగా జరత్కారునితో జరిపించారు. ఆ భర్తతో ఆమె కాపురం కత్తి అంచుమీద నడిచినట్టుగా సాగుతుంది. తన వారి కోసం ఆమె అన్నిటినీ సహిస్తుంది. ఆ వివరాలు ఆసక్తికరమైనవే.

పురాణాల ప్రకారమూ, చరిత్ర ప్రకారమూ కూడా ఇండియాలో పూర్వం చిన్న చిన్న రాజ్యాలు, సంస్థానాలు, జనపదాలు చాలా ఉండేవి. జాంబ పురాణం 56 రాజ్యాలను పేర్కొన్నది. వీటిలో గోండుల రాజ్యాలు, నాగుల రాజ్యాలుఉన్నాయి. నాగుల తల్లి కద్రువ. తండ్రి కశ్యపుడు. కశ్యపునికి ఇరవై ముగ్గురు భార్యలు. ఒక్కో భార్యకు ఒక్కో జాతి జీవులు పుట్టారంటారు. దితి అనే ఆమెకు దైత్యులు, అదితికి ఆదిత్యులు, కద్రువకు నాగులు, వినతకు పక్షి జాతులు-ఇలా భిన్న జాతుల వారు కలిగారట. జీవ పరిణామ క్రమంలో తాము చూసిన విశేషాలను-పక్షులు గుడ్లు పెట్టడం-పొదగడం- వాటినుండి పిల్లలు రావడం వంటివి గమనించి ఆ క్రమంలోనే తొలి మానవులు కథలు అల్లుకుని చెప్పుకున్నారు. కద్రువ వేయి గుడ్లు (అండాలు) ముందుగా పగిలి వాటిలోంచి నాగులు వచ్చారు. వినత రెండు గుడ్లు ఎంతకూ పగలలేదు. ఆమె ఒక గుడ్డు బలవంతాన పగలగొట్టింది. అందులోంచి అవయవాలు పూర్తిగా ఏర్పడని కుమారుడు (అసూరుసు) బయటకు వచ్చాడు. తనను వికలాంగుడిగా చేసిన తల్లిని కోప్పడి ”నీవు నీ సవతికి దాసీగా అవుతావు” అని శపించి-సూర్యుని రధసారధిగా వెళ్ళిపోయాడు. (వికలాంగుడైనా రథసారధిగా వెళ్ళాడు) రెండో గుడ్డును రక్షించుకోవలసిందనీ, అందులోంచి వచ్చే కొడుకు ఆమెకు దాస్య విముక్తి కలిగిస్తాడనీ చెప్పాడు.

ఇదిలా ఉండగా కద్రువ, వినత ఒకనాటి సాయంకాలం సముద్ర తీరం వద్ద షికారుగా వెళ్ళారు. అక్కడ వారికి ఒక అందమైన గుర్రం కనబడింది. దాని రంగు ఏమిటా అని తర్కించుకుంటున్న సందర్భంలో అది తెల్లగా ఉందని వినత అంది. ”కాదులే తోక దగ్గర నల్లగా ఉంది” అంది కద్రువ. ఇద్దరూ పందెం వేసుకున్నారు. ఓడిన వారు గెలిచిన వారికి దాసీగా ఉండాలనేది పందెం. వినత మాటను ఖండించడానికే కద్రువ అలా మాట్లాడింది కానీ, గుర్రం మొత్తం తెల్లగా ఉందని ఆమెకు తెలుసు. దగ్గరగా వెళ్ళి చూద్దామంది వినత. ”చీకటి పడబోతున్నది. రేపు చూద్దాంలే” అని కద్రువ అంది. ఇంటికి వెళ్ళి ఆలోచనలో పడింది. తన పరువు నిలవాలంటే ఏదో ఉపాయం చెయ్యాలి. కొడుకులను పిలిచి ”మీరు కామరూపులు-గుర్రం తోకకు నల్లగా చుట్టుకుని దాన్ని నల్లగా కనిపించేట్టు చేయండి” అని అడిగింది. ”అధర్మం చేయము” అన్నారు వారు. ఆమెకు ఒళ్ళు మండింది. ”జనమేజయుని సర్పయాగంలో మీరు మాడి మసి అయిపోతారు” అని శపించింది. తల్లి శాపానికి భయపడి కర్కోటకుడు అనేవాడు గుర్రం తోకకు నల్లగా చుట్టుకుని ఆమె పందెంలో నెగ్గేలాగ చేశాడు. వినత కద్రువకు దాసి అయింది.

కద్రువ శాపానికి కారణం మరోచోట మరోలాగ చెప్పారు. నాగులు తల్లి దగ్గరకు వచ్చి ఆకలిగా ఉంది, ఆహారం కావాలన్నాయట. వెయ్యిమందికి ఆవిడ తిండి పెట్టలేక, ”నన్నే తినండి” అని విసుక్కున్నది. ”సరే, నిన్నే తింటాము” అన్నారు వారు. ”తల్లిని తింటామంటారా” అని తండ్రి కోప్పడ్డాడు. ఎక్కువ మంది సంతానం ఉన్న తల్లులకు ఎదురయ్యే సాధారణ పరిస్థితి ఇదే.

నాగులను పాములుగా చెప్పడం ప్రతీకాత్మకం. వారూ మానవ జాతులే. మహాభారతం ప్రకారం నాగులు శౌర్యవంతులు. నర్మదా తీరం నాగుల ప్రాంతం అని రామాయణం చెప్పింది. నాగులకూ, ఆర్యులకూ మత సంబంధమైన విశ్వాసాలలో భేదాలున్నాయి. అయినా వారి మధ్య వివాహ సంబంధాలున్నాయి, ఘర్షణలూ ఉన్నాయి. నాగరాజులు మహిమాన్వితులుగా పేరొందారు. నాగపూజలు మత విశ్వాసాలలో చోటు చేసుకున్నాయి.

కద్రువ తన కొడుకులను శపించిన ఆ సందర్భంలో కశ్యపుడు ఒక మాట అన్నాడట. ”భూమికి భారం ఎక్కువయిపోయింది. ఆ భారం తగ్గవలసిందే. అందుకే ఈ శాపం ఆమె నోట వెలువడింది. దుష్టులైన నాగులు కొందరు నశిస్తారు-తప్పదు. అయినా నాగకులం రక్షింపబడుతుంది-నాగుల చెల్లెలయిన జరత్కారువుకు కలిగే పుత్రుడు ఆస్తీకుడు నాగకులాన్ని రక్షిస్తాడు” అని. నాగుల వంశ రక్షణకు సంబంధించిన ఈ మాటలు తల్లి ఒడిలో పడుకుని ఉన్న ఒక నాగకుమారుని చెవిలో పడ్డాయి. వంశక్షయం తలచుకుని బాధపడుతూ ఉన్న అన్నలకు అతడు ఆ సంగతి చెప్పాడు. ఈ విధంగా జనమేజయుని సర్పయాగం ముందే నిర్ణయమైపోయి ఉన్నది. ఉదంకుని కథ-పరీక్షన్మహారాజు మరణం-జరత్కారుని కథ-ఈ సర్పయాగంతో ముడిపడి ఉన్నాయి.

పరీక్షిత్తు పాండవుల వంశానికి చెందినవాడు; అభిమన్యునికీ, ఉత్తరకూ పుట్టిన కొడుకు. ఒకప్పుడు ఆయన వేటాడుతూ ఒక మృగాన్ని తరుముకుంటూ వెళ్ళి శమీక మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ధ్యానంలో ఉన్న మహర్షిని చూసి, ”ఒక

మృగం ఇటుగా వచ్చిందా?” అని అడిగాడు. మహర్షి తపోధ్యానంలో ఉన్నాడు. రాజు మాటలు ఆయన వినలేదు. రాజుకు కోపం వచ్చి దగ్గర్లో పడి ఉన్న చచ్చిన పామును తన వింటినారితో ఎత్తి ముని మెడలో పడేలాగ విసిరి వెళ్ళిపోయాడు. కాసేపటికి ముని కొడుకు శృంగి అనే అతను వచ్చి, తండ్రి మెడలో పామును చూసి ఆ పాము వేసిన వాడు వారం రోజుల్లో తక్షకుని విషాగ్నితో మరణిస్తాడని శాపం పెట్టాడు. ఆ తర్వాత శబాకుడు ధ్యానం నుంచి బయటపడి కొడుకు తొందరపాటుకు నొచ్చుకున్నాడు. శాపం సంగతి రాజుకు తెలియపరచి జాగ్రత్తలు చెప్పాడు.

శాపం అనేది ఒక శిక్ష-సాధారణంగా శాపాలు ఇచ్చేవారు విప్రులు-అంటే వేదాధ్యయనం చేసిన వారన్నమాట. శిక్ష అమలు పరచే యంత్రాంగం సందర్భాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఇక్కడ శిక్ష అమలు పరచవలసిన బాధ్యత తక్షకునికి ఇవ్వబడింది. తక్షకుడు నాగరాజు. విప్రుని ఆదేశం తప్పనిసరి అయినందున దాన్ని అమలుపరచాడు. ఫలితంగా పరీక్షిత్తు మరణించాడు. (ఆ వివరాలలోకి వెళ్ళడంలేదు.)

పరీక్షిత్తు తర్వాత అతని కొడుకు జనమేజయుడు రాజు అయ్యాడు. ఒక సందర్భంలో ‘ఉదంకుడు’ జనమేజయునికి పరీక్షిత్తు మరణం ఎలా సంభవించిందో చెప్పి తక్షకుని మీద ద్వేషం కలిగించాడు. తక్షకుని మీద ఉదంకునికి అంతకు ముందే కోపం ఉంది. అదో కథ –

ఉదంకుడు ‘పైల’ మహాముని శిష్యుడు. విద్యాభ్యాసం అయ్యాక గురుదక్షిణగా పౌష్య మహారాజు భార్య చెవి కమ్మలు (కర్ణాభరణాలు) తేవలసి వచ్చింది. వాటిని జాగ్రత్తగా తీసుకువెళ్ళాలనీ తక్షకుడు వాటి కోసం చూస్తున్నాడనీ ఆమె ముందే ఉదంకునికి చెప్పింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా తక్షకుడు వాటిని దారిలోనే ఎత్తుకుపోయాడు. ఉదంకుడు నాగలోకానికి వెళ్ళి నాగరాజులను స్తుతించి వాటిని తిరిగి పొందవలసి వచ్చింది. ఈ విధంగా తక్షకునిపై-నాగులపై ఉదంకునికి కోపం ఉంది. అందుకే సర్పయాగం చెయ్యవలసిందిగా జనమేజయుడిని ప్రోత్సహించాడు.

సర్పయాగం అంటే పాములను బలి ఇవ్వడం కాదు. నాగులను ఆహుతి చేయటం. ఒక్కొక్కరినీ లాక్కు వచ్చి హోమగుండంలో వేయడం. ఆర్యజాతిని మాత్రమే నిలపడం కోసం. జర్మనీలో హిట్లర్‌ చేసిన మారణహోమం ఇలాంటిదే. దీనిని ఆపడానికి జరత్కారువుకు పుట్టబోయే కుమారుడే సమర్ధుడని ముందే నిర్ణయమైపోయింది. జరత్కారుడనే మహా తపస్వి, తన పితరుల రుణం తీర్చుకోవడానికి తన పేరు గల అమ్మాయి దొరికితేనే పెళ్ళిచేసుకుంటానని వెదుకుతున్నాడట. ఆ అవకాశం తీసుకుని నాగులు తమ చెల్లెల్ని అతనికిచ్చి పెళ్ళిచేశారు. అతడు భార్యకు బోలెడు షరతులు పెట్టాడు. తనపట్ల ఏ అపరాధం జరిగినా వెంటనే ఆమెను వదిలివేస్తానన్నాడు. ఆమె ఎంతో జాగ్రత్తగా ఆయనను సేవిస్తూ ఉంది. ఒకరోజు అతను ఆమె ఒడిలో తలపెట్టి నిద్రపోయాడు. సంధ్యా సమయం దాటిపోతుందేమో – ”నన్నెందుకు లేపలేదు” అంటాడేమో అని భయపడుతూ ఆమె భర్తను నిద్రలేపింది. అదే ఆమె అపరాధమైపోయింది. ”నేను సంధ్య వార్చకుండా సూర్యుడు అస్తమిస్తాడనుకున్నావా?” అంటూ ఆయన కోప్పడ్డాడు. అప్పటికి ఆమె గర్భవతి. ”నీకు పుట్టబోయే కొడుకు గొప్ప తపశ్శాలి అవుతాడు. నీవు నీ అన్నల దగ్గరికి వెళ్ళు. నేనిక నీతో ఉండను” అంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఆమె కొడుకు ఆస్తీకుడు-మేనమామల దగ్గర పెరిగాడు.

జనమేజయుడు సర్పయాగం చేస్తున్నప్పుడు సరిగ్గా తక్షకుడిని మంటల్లో వేయబోతున్న సమయంలో ఆస్తీకుడు అక్కడికి వెళ్ళి శాంతవచనాలతో రాజునూ, సభాసదులనూ మెప్పించి వారికి నచ్చచెప్పి గొప్ప మారణకాండను ఆపాడు. నాగ కులాన్ని రక్షించాడు.

అన్నలు నిర్ణయించిన వివాహం చేసుకుని భర్త పెట్టిన షరతులన్నీ భరించి అతనితో కాపురం చేసి కొడుకును కని పెంచిన జరత్కారువు ఆస్తీకుని తల్లిగానూ, నాగుల చెల్లెలిగానూ మిగిలిపోయింది. నాగ వంశాన్ని రక్షించిన ఘనత వాస్తవానికి ఆమెకు చెందవలసిందే గదా-

ఈ సర్పయాగంతో ముడిపడి ఉన్న ఈ కథలలో సామాజిక, రాజకీయ అంశాలనేకం కనిపిస్తాయి. నాగులకూ,

ఆర్యులకూ జరగబోయిన ఒక మహా సంగ్రామం చర్చలతో సామరస్యంగా పరిష్కారం కావటం; వర్ణాంతర వివాహాలు (నాగజాతి కన్యను ముని కుమారుడు పెళ్ళి చేసుకోవడం); పెళ్ళి చేసుకుని సంతానం పొందని పక్షంలో పితృదేవులకు మోక్షం కలగకపోవడం; స్త్రీలను అత్యంత విధేయులుగా పరిగణిస్తూ వారి సేవలు పొందటం-పితృస్వామ్యం-పురుషులు తల్లినైనా శపించగలిగి ఉండటం-పందాలు వేసుకునే సంస్కృతి-రాజుల దానధర్మాలు-ఉదంకుని దగ్గర నుండి కర్ణాభరణాలు ఎత్తుకుపోయిన తక్షకుని కారణంగా నాగులను నేరస్థ జాతులుగా, కఠినులుగా ప్రచారం చెయ్యటం వంటి అనేక అంశాలను కథలలో పొందుపరచి స్థిరీకరించటం జరిగింది.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో