మల్లెతీగ మీంచి పువ్వులేరుకున్నంత కుశలం -వాడ్రేవు చినవీరభద్రుడు

డా. చంద్రశేఖరరావుని నేను మొదటిసారి చూసింది 1995లో. అప్పుడు నేను పాడేరులో పనిచేస్తున్నాను. ఎలమంచిలిలో ఒక సాహిత్యాభిమాని ప్రతి ఏటా ఇచ్చే సాహిత్య పురస్కారాలు ఆ ఏడాది చంద్రశేఖరరావు ‘జీవని’ కథాసంపుటి (1994)కి ఇచ్చాడు. పద్మ రాసిన కథలకు కూడా ఇచ్చినట్టు గుర్తు. ఆ సభలో పాల్గొనడానికి అక్క, పద్మ, చంద్రశేఖరరావు వస్తే నేను కూడా వెళ్ళాను. అప్పటికే నేను జీవని కథలను అక్క దగ్గర చదివాను. అవి చాలా ఆరోగ్యవంతమైన కథలు. మనుషులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ఒక వైద్యుడు రాసిన కథలు.

మా మొదటి పరిచయంలోనే చంద్రశేఖరరావు నేను చాలా ఏళ్ళుగా తెలిసి ఉన్నట్లే మాట్లాడాడు. ‘మీ గృహోన్ముఖంగా’ కథ చదివాకనే నాకు కథలు రాయాలనిపించింది అన్నాడు. ఆ రాత్రంతా మేం ఎలమంచిలిలోనో లేదా కాకినాడ ప్రయాణంలోనో ఎక్కడ గడిపామో గుర్తులేదు కానీ, ఆ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. ఎంతో సౌజన్యం, మృదుత్వం కూడుకున్న మనిషి. అతడు మాట్లాడుతుంటే, మల్లెతీగమీంచి పువ్వులేరుకున్నంత కుశలంగానూ, సున్నితంగానూ ఉండింది. ఒక కవినో, రచయితనో చూస్తుంటే, ఇప్పుడే దేవలోకంలోంచి దిగారా అన్నట్టు ఉంటుంది అన్నారొక సాహిత్యాభిమాని ఒకప్పుడు. ఆ రోజు చంద్రశేఖరరావుని చూస్తే నాకట్లానే అనిపించింది.

ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్‌లో అక్క కథల సంపుటి ‘ఉత్సవ సౌరభం’ ఆవిష్కరణ సభ. బహుశా, 1997 అయి ఉండాలి. కృష్ణారావుగారింట్లో ఆవిష్కరణ. ఆ మీటింగుకి వచ్చిన చంద్రశేఖరరావు, ఆ రాత్రి ఇంటికి వచ్చాడు. మాతో పాటే కలిసి భోంచేశాడు. అదొక పండగలాంటి సాయంకాలం. మరపురానిది.

నేను శ్రీశైలం వెళ్ళాక, ఒకరోజు ఎక్కడ కలిశామో గుర్తులేదు, తన ‘లెనిన్‌ ప్లేస్‌’ (1998) కథాసంపుటి ఇచ్చి సమీక్ష రాయమని అడిగాడు, రాశాను.

వాసుదేవగారు సుప్రభాతంలో ప్రచురించారు (1999). కానీ ఆ కథలు, అంతకుముందు చదివిన ‘జీవని’ కథలకన్నా భిన్నంగా కనిపించాయి. అతడు ఏ దారిలో నడుస్తాడని నేనూహించానో, ఆ దారికన్నా వేరైన మరొకదారిలో అతడు నడుస్తున్నాడనిపించింది. కానీ లెనిన్‌ ప్లేస్‌ హ్యూమన్‌ ప్లేస్‌ అయి ఉండవచ్చనుకున్నాను. అందుకని నా సమీక్షకి ‘హ్యూమన్‌ ప్లేస్‌ వైపు’ అని పేరు పెట్టాను. కానీ, ఇలా రాయకుండా ఉండలేకపోయాను.

”…ఈ ‘జెల్లి’ స్థితికవతల ఒక పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన దేశకాలాలున్నాయని కథకుడు ఉండబట్టలేక చెప్తున్నప్పుడల్లా ఈ స్పష్టత బలంగా బయటపడుతూనే ఉంది. ‘ఎక్కడికి పోతావీ రాత్రి’లో శంకరం బయటపెట్టినట్లుగా ‘నాకో శుద్ధమైన, సాంప్రదాయబద్ధమైన, ఆరోగ్యకరమైన ప్రపంచం కావాలి! నాకో అమ్మ కావాలి! నాకో గృహం కావాలి! ఒకరికొకరు బందీలై ఉండే పురాతన సమాజం కావాలి..”

”కత్తులు, గొడ్డళ్ళతో నరకబడ్డ శరీరాల్ని చూపిస్తున్నప్పటికీ, అతడు కలలుగంటే, ‘పూలతోటలు, తెల్లని కొంగలు, సన్నని వానతుంపరలు, గుట్టలు గుట్టలుగా పరిచిన చామంతి పూలు, పాలు ప్రవహించే పిల్ల కాలువలు, ధాన్యపు కల్లాలు పరిచిన ఆకాశం” కనిపించడంలోనే ఈ విశేషం ఉంది. అంతేకాదు, తనని వెన్నంటి ఉండేవేవో రచయితకి తెలుసు. ”పాలపీకా” ఉగ్గిన్నెడు ఆముదం, ఉడకబెట్టిన కారెట్‌ ముక్కలు, చుక్కల మందు, ఒంటిపై సుగంధాలు విరజిమ్మే టాల్కం పౌడరు, లైఫ్‌బాయ్‌ నురుగు, చలువచేసిన నిక్కరు వాసన, అన్నం బాక్స్‌ సర్దిన సంచి అందించే అమ్మ చేతులు, ఆ చేతులకు పూసిన పరిమళాలు”.

”తన చుట్టూ చెలరేగుతున్న మంటలూ, ఆ మంటల్లో మానవుడూ చంద్రశేఖర్‌ని విచలితుణ్ణి చేస్తున్నారు. జీవితజ్వరం పట్టుకుంది ఆయన్ని. కానీ ఆయన హృదయంలోని వెన్నలాంటి జీవశక్తికి ఆ మంటల వేడి సోకనివ్వకుండా కాపాడి పెట్టుకుని అక్కడక్కడా, అప్పుడప్పుడూ తెరిచి చూపిస్తున్నాడు..”

నేను శ్రీశైలంలో ఉండగానే ఒకసారి గుంటూరు వెళ్ళినప్పుడు వాళ్ళింటికి వెళ్ళాను. లతా పాటల కేసెట్ల సెట్టు ఒకటి, ఎందుకివ్వాలనిపించిందో తెలీదు గానీ, ఇచ్చాను. ఒకసారి విశాఖపట్టణం వెళ్ళినపుడు త్రిపుర ‘కాఫ్కా కవితలు’ అనే తన కవితాసంపుటి ఇస్తూ, అది చంద్రశేఖరరావే పట్టుబట్టి ప్రచురింపచేసాడని చెప్పారు.

ఆ తర్వాత అతడూ, నేనూ కలుసుకున్నవి బహుశా క్షణాలే కావచ్చు. అవి కూడా రాను రాను మరింత అరుదుగా, వేళ్ళమీద కూడా లెక్కపెట్టడానికి చాలనంతగా అయిపోతూ వచ్చాయి. ఆ తర్వాత ఆయన రాసిన కథలు నాలుగైదు చదివానేమో. అవి నాకు పరిచయమైన చంద్రశేఖరరావు రాసినవి కావు. మరొక దారి, మరొక వేదన. కానీ ఆశ్చర్యంగా, అవే చంద్రశేఖరరావు మార్కు కథలుగా మారిపోయాయి. ఆయన రాసిన నవలలేవీ నేను చదవలేదు. ‘ఆకుపచ్చని దేశం’ అనే నవల్లో ‘వెలిగండ్ల రిజర్వాయర్‌ కింద ముంపునకు గురైన చెంచు గ్రామాల గురించి రాసాను. ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మీ గురించి తలచుకున్నారు’ అన్నాడొకసారి నాతో. కానీ, ఆ నవల కూడా చదవాలనిపించలేదు.

ఎప్పుడో అనుకోకుండా ట్యూన్‌ చేస్తూ ఉంటే, ఏదో పేరు తెలియని రేడియో స్టేషన్‌ నుంచి చక్కటి పాటలు వినిపించి, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ట్యూన్‌ చేసినా ఆ స్టేషన్‌ ఎక్కడుందో దొరకనివాడిలాగా ఉంది చంద్రశేఖరరావుతో నా పరిచయం. మధ్యలో హఠాత్తుగా ఏ గాలివాటునో ఒకటీ, అరా సిగ్నల్స్‌ తగిలేవి కానీ, ఊహించని పాటలతో నన్ను మైమరిపించిన ఆ రాత్రి నాకు మళ్ళీ తారసపడలేదు.

నిన్న అక్క చెప్తోంది. అతడు తన నవలలన్నీ ఒక సంపుటిగా తేవాలనుకున్నాడనీ, దానికి నాతో ముందుమాట రాయించుకోవాలని అనుకున్నాడనీ. ఏమో, బహుశా నేను నా ఆంటెన్నాను సరిచేసుకుని ఉండవలసిందేమో. మరింత శ్రద్ధగానూ, మరింత సున్నితంగానూ ట్యూన్‌ చేసుకుని ఉండవలసిందేమో. మనుషులు ఎంత విలువైనవాళ్ళో మరణం ద్వారా తప్ప మనకి తెలిసే మరో మార్గం లేదా!

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో