ఆ చంద్ర తారార్కం – వి. ప్రతిమ

‘ఒక స్వప్నం ఇంకా మిగిలి ఉంది

వేసవిలో మొలిచే పచ్చికలా

రండి పావురాల్ని పెంచుదాం’

పట్టపగలు వీథులన్నీ నిశ్శబ్దంగా ఉండి, పెనుశోకమేదో వెంటాడుతున్నట్లుగా ఉన్నవేళ, బజారులన్నీ భయాన్నీ, దిగులునీ మొఖాన తొడుక్కున్న సమయంలో ఒక పన్నెండేళ్ళ స్కూలు పిల్లవాడు రంగుల డబ్బాతో గోడమీద రాసిన నినాదమిది… ఆ పసివాడని బాల్యం మీద పడిన లాఠీ దెబ్బలు ఆ అందమైన దృశ్యాన్ని చెరిపి వేయడం మనం ఎన్నటికీ మరిచిపోలేం. ఛిద్రమైపోతోన్న ఆత్మల గానాలని గురించి ఆవేదన చెందుతూనే కలల్ని మొలకెత్తించుకోవాల్సిన అవసరాన్ని గురించి చెప్తాయి డా||వి.చంద్రశేఖర్రావు కథలు.

అసలు మొత్తంగా చంద్రశేఖర్రావుగారి జీవన, సాహిత్య జీవన సారాంశమంతా ఇదేనేమో అన్పిస్తుంది. ఇటువంటి యుద్ధ వాతావరణంలో కాకుండా మనుషులంతా శాంతియుత, ప్రేమపూరిత సమాజాన్ని నిర్మించుకోవాలన్నదే వారి అభిలాష, ఆకాంక్ష. ఆయనే ఒక హైకూ…

కష్టం… మామూలుగానే ఈ లోతయిన రచయిత గురించి ఆయన లోలోపలి సంచలనాల గురించి మాట్లాడ్డం కష్టం. అందునా నాలుగైదు రోజులుగా హఠాత్తుగా ఆయన మాయమైపోయిన దుఃఖంలోంచి తేరుకుని మాట్లాడ్డం మరింత కష్టం.

మేమంతా కొంచెం అటు, ఇటుగా ఒక్కసారిగా రాయడం మొదలుపెట్టినవాళ్ళం. దయానంద్‌, ఆరెమ్‌ ఉమామహేశ్వర రావు, పద్మాకర్‌, నేనూ, చంద్రలత, చంద్రశేఖరరావు అంతా… అప్పటికే నరేంద్ర, మహేంద్ర, పాపినేని శివశంకర్‌, అటు

ఉత్తరాంధ్ర నుంచి అప్పల్నాయుడు, అనంతపురం నుండి స్వామి, శాంతి నారాయణ యింకా తెలంగాణ ప్రాంతం నుంచి అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటివారు బలమైన కథలు రాస్తున్నారు. వాళ్ళ కథలంటే మాకు అత్యంత అభిరుచి… కాట్రగడ్డ దయానంద్‌ అప్పుడు మాకు దగ్గరగా పెళ్ళకూరులో ఉండేవాడు. మేం తరచుగా కలుస్తుండేవాళ్ళం. కలిసినప్పుడల్లా ఈ రచయితలందరి కొత్త కథలమీద, పాత కథల మీద చర్చించుకునేవాళ్ళం. అప్పుడప్పుడూ పద్మాకర్‌ కూడా వచ్చేవాడు. ఈ సమాజంలోని వర్గ తారతమ్యాల గురించి చాలా విషయాలు మాట్లాడేవాడు. ఆరుబయట ఇసుకలో కూర్చుని మేమంతా కబుర్లు కలబోసుకునేప్పుడు మా మధ్య చంద్రశేఖర్రావుగారి కథలు చాలా నలుగుతుండేవి. ఆ విధంగా లోతయిన ఆయన కథాసాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి దయానంద్‌ ఎంతో సహకరించాడు. అదంతా ఒక రంగుల కల…. ముప్పైయేళ్ళ వాన మనుషుల్ని గడ్డ కట్టించిపోయాక ఎంత మందిమి ఆగిపోయాము, ఎంతమందిమి కొనసాగాము అన్నది బేరీజు వేసుకుంటే ఒక్క చంద్రశేఖరరావు గారు మాతమ్రే అంత బదిలీలలో నుండి, అంత అనారోగ్యంలో నుండి కూడా సమాజం పట్ల తపననీ, సాహిత్యంపట్ల ప్రేమనీ చివరిదాకా వదులుకోలేదేమో అన్పిస్తుంది.

కష్టం… ఈ రచయిత గురించి మాట్లాడ్డం కష్టం… అయినా ఇష్టం. నిలవనీయని ఉద్వేగాలూ, ఛిద్రమవుతోన్న ఆత్మల గానాలూ, మొలకెత్తుతోన్న కలలూ, ప్రవాహస్థితిలో ఉన్న సామాజిక సంచలనాలూ, సందర్భాలూ అవన్నీ ఒక కధాభాషగా, వర్ణనలుగా, చిత్రణగా మారి తాను నడిచి కాలాన్ని, గాధల్ని, ఆ మనుషుల గాయాల్ని నమోదు చేస్తాయి. వాటిల్లో వాస్తవికతతో పాటు మిత్‌ కూడా ఉంటుంది. తాను చెప్పదలచుకున్న విషయాన్ని బలంగా పాఠకులకి అందించడం కోసమే ఆయన మిత్‌ని వాడుకుంటారు. ఆయన కథల్లో మార్మికత ఉంటుంది. మెటఫర్‌ ఉంటుంది. అర్థం కానిదేమీ ఉండదు… ఈ అర్థం కాకపోవడమన్నది సమాజం పట్ల పాఠకుడికున్న బాధ్యతారాహిత్యాన్ని, అశ్రద్ధన్నీ తెలియచేస్తుంది తప్ప అది చంద్రశేఖరరావు కథల్లోని అస్పష్టత కాదు. తాను చెప్పదలచుకున్న విషయం కోసం గొప్ప మార్మిక శిల్పాన్ని విజయవంతంగా వాడుకున్న రచయిత చంద్రశేఖరరావు.

మనుషుల్లో, వాళ్ళలోపలి ప్రపంచంలో జరుగుతోన్న సమస్త చర్యలకి మోస్ట్‌ సెన్సిటివ్‌గా ఉండడమే కాకుండా ఆ సున్నితమైన స్పందనలని ఆ సెన్సిటివ్‌నెస్‌ని పోగొట్టుకోకుండా ఏళ్ళ తరబడి తనలో రిటెయిన్‌ చేసుకోగలగడమే చంద్రశేఖర్రావుగారు సాధించిన విజయం. లేదంటే పాతిక, ముప్ఫయ్యేళ్ళ కాలంలో నాలుగు కథా సంపుటాలూ, మూడు నవలలూ ప్రచురించడం చిన్న విషయం కాదు. అంటే సమాజాన్ని తన లోలోపలికి ఆవహింపచేసుకుని ఆ నొప్పులన్నింటినీ తాను స్వయంగా అనుభవించి, తన శరీరం మీద తానే గాయాలు చేసుకునేటువంటి రచయిత నిజానికి ఎక్కువ సాహిత్యాన్ని వెలువరించలేడు. కానీ అందుకు భిన్నంగా చంద్రశేఖర్రావుగారు తనని తాను గాయపరచుకుంటూనే తగినంత సాహిత్యాన్ని వెలువరించారు. ఆ సాహిత్యం మీద లోతయిన చర్చ జరగాలని ఆశించారు. అందుకు మిత్రులంతా ప్రయత్నాలు చేస్తుండగానే బాధాకరంగా మిత్రులెవ్వరికీ ఒక్క మాటయినా చెప్పకుండా హఠాత్తుగా మాయమైపోవడం విషాదాల్లో విషాదం. ‘ఆ గుంటలో, ఆ చీకట్లో, ఆ కాఫిన్లో చంద్రశేఖర్రావు ఒక్కడే ఎలా ఉంటాడు భయమేయదూ?’ అంటూ కథలరాణి సత్యవతి కన్నీళ్ళు పెట్టుకుంటోంది. ఏం చెప్పాలి ఆమెకు. ఎవరికీ మాట పెగలడం లేదు.

తన లోలోపలి స్పందనలను సజీవంగా ఇముడ్చుకోవడం మూలాన్నే ఒక దృశ్యం కడితే, ఒక సమస్యని విప్పడం మొదలుపెడితే దానికి ఎంతెంత విస్తృతి ఉందో పాఠకుడి కళ్ళముందు పరచగల చతురత చంద్రశేఖర్రావు సొంతం.

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణక్రమంలో ముంపుకు గురవుతోన్న చెంచుగూడాలు… అంతరించిపోతోన్న చెంచు జాతుల చరిత్ర, సంస్కృతి వారి ఆహార ఆరోగ్యాలూ, పట్టుదల, ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు తరలించబడుతున్నప్పుడు శిక్షణ పొందిన సైనికుల్లా ఏకతాటిన వారు నడిచిన తీరు.. ఆ జీవితాలను దగ్గరగా పరిశీలించి అర్థం చేసుకుని వ్యక్తపరచడానికి రచయిత పడిన ఆవేదన, తనను తాను గాయపరచుకున్న తీరూ చదువుతున్నంతసేపూ ఉద్వేగపూరితంగా ఒక చరిత్రలోకి నడుచుకుంటూ వెళ్తాడు పాఠకుడు.

ఒక జాతి మొత్తం ఉన్నట్టుండి తాము ఉన్న చోటుని వదిలిపెట్టి మరో చోటుకి, తమదైన చోటుకి ఆ అడవిలోనే వెతుకులాడ్డం, ఒక కొత్త గూడాన్ని నిర్మించుకోవాలని తపన పడ్డం… ఆ ప్రయాణంలో వేల ఏళ్ళుగా జాతిని నడిపిస్తోన్న వృద్ధుల మరణాలు… ఒక గుంపు తమ జాతికి సంబంధించిన పాట ఏదో గానం చేసుకుంటూ వెళ్తున్నట్లుగా నవల చదువుతున్నంతసేపూ మనకా గానం విన్పిస్తూనే

ఉంటుంది. అదిగో సరిగ్గా ఆ గానమే గత వారం, పది రోజులుగా మిత్రులందరి చెవుల్లో గింగురుమంటూ, హృదయాలను దుఃఖభరితం చేస్తోంది…

శివారెడ్డి గారన్నట్లుగా అది అనంత సౌందర్యంతో విరాజిల్లిన ఒక జాతి చరిత్ర… రచయిత అనంత వ్యామోహంతో, ప్రేమతో, గొప్ప ఆరాధనతో, ఆశతో తవ్వుకుంటూ వెళ్లాడు… బంగారం లాంటి జీవితాలు, వజ్రాల్లాంటి మనుషులు బయటపడ్డారు. ఒక జాతి జీవించడానికి సంబంధింత సంస్కృతీ నాగరికతలకు సంబంధించిన ఒక బాలెట్‌, ఒక ఓద్‌, సమీప గత చరిత్రని ఒక మిత్‌లాగా, ఒక ఇతిహాసంలాగా సంభావించి నిర్మించిన కావ్యాలు చంద్రశేఖర్రావు రచనలు… పాఠకులకు యిన్ని ప్రమాణాలు చేసి పెద్దలు శివారెడ్డి గారికయినా చెప్పకుండా వెళ్ళిపోవడం భావ్యమేనా మిత్రుడా!

తీవ్రమైన అభ్యుదయ భావాలనూ, సామాజిక చైతన్యాన్ని ప్రజలకందేలా చూచే ఒక మార్గంగా మాత్రమే ఆయన రచనని తీసుకున్నారేమో అన్పిస్తుంది. ఒక డాక్టరుగా నగరాల్లో జీవితం మొదలుపెట్టిన చంద్రశేఖర్రావు గారికి మట్టితో సంబంధముందా?, మట్టి మనుషుల కథలు ఇతడికి ఎరుకేనా? అన్న పాఠకుల సందేహాన్ని తీరుస్తూ అతడు ‘నీటి పిట్టల కథలు’, ‘ఆవు, పులి’ మరికొన్ని కథలు’ వంటివి పాఠకులకందించారు.

నీటిపిట్టల కథల్లో పతనమైపోతోన్న రైతు జీవితాన్ని అద్భుతమైన శిల్పంతో కథల తాత కథ చెప్తున్నట్లుగా మొదలుపెట్టి ఆ కథని వెనుకనుంచి ముందుకు బిట్లు బిట్లుగా నడిపిస్తారు. కథ చెప్తోన్న కథల తాత టోన్‌ చాలా కూల్‌గా ఉన్నప్పటికీ ఆ రైతు నిస్సహాయత, ఆక్రోశం, వ్యథ… సమాజ పరిస్థితులకి, సమాజపు ఎదుగుదలకి తగినట్లు తమ ఆదాయ వనరుని పెంచుకోలేకపోవడంలోని అసహాయత, కోపం, నెగటివ్‌ అప్రోచ్‌వంటివన్నీ పాఠకునికి లోతుగా తాకుతాయి.

ఎందుకు చెప్తున్నానంటే చంద్రశేఖర్రావుగారి అక్షరాలు ఆయుధాలుగా పైకి కన్పించినప్పటికీ అంతరంగంలో అన్నీ పావురాలే… ఆయన కథలెంత పోరాట పటిమతో ఉంటాయో, మనిషిగా ఎంతో మృదు స్వభావి…

భీకరమైన వేసవి ఎండల్లో ఎర్రని బండరాళ్ళపై దొర్లడంలాంటి నిద్రని జీవితకాలం అనుభవించిన చంద్రశేఖర్రావుగారిని ఆ

ఉదయం (8-7-2017) ఒక నిద్రమేఘం నిర్దయగా చుట్టుముట్టింది… దయా మేఘమల్హారంపై మోహలోకాల్లో సంచరించమని ఆహ్వానించి మిత్రులందరినీ, పాఠకులనీ మోసం చేసి తీసికెళ్ళిపోయింది…

అతడి కలల్ని, అభిలాషలని, ఆకాంక్షలనీ సాకారం చేసే బాధ్యతని మనమంతా కలిసి పంచుకుందాం రండి…

‘ఒక స్వప్నం యింకా మిగిలి ఉంది

వేసవిలే మొలిచే పచ్చికలా

రండి పావురాల్ని పెంచుదాం’.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>