నాచి భండారు అచ్చమాంబ – సరళీకరణ: పి.ప్రశాంతి

ఈ విద్వాంసురాలు, ఏలేశ్వరోపాధ్యాయుల రెండో కూతురు. ఏలేశ్వరోపాధ్యాయులు ఆంధ్ర బ్రాహ్మణుడు. గొప్ప విద్వాంసుడు. ఈయన నివాస స్థలము ఏలేశ్వరపురము. ఈ ఏలేశ్వరపురం శ్రీశైలానికి పశ్చిమాన ఉంది. ఈయన విద్యార్థులకు చెప్పే సంస్కృతాన్ని రోజూ విని ఇతని ఇంటివారందరూ సంస్కృతం అతి స్వచ్ఛంగా మాట్లాడుతుండేవారు. ఈయనే మన ఆంధ్ర దేశమంతటా నాడుల భేదం ఏర్పరచి ఆయా నాడులలోనే వివాహాలయ్యేట్లు నిబంధన చేశాడని చెప్తారు. ఆ విభాగాలు నేటికి కూడా మన దేశంలో ప్రచారంలో ఉన్నాయి. ఈయనకు కొడుకులు లేరు. ముగ్గురు కూతుళ్ళు మాత్రం ఉన్నారు.

ఏలేశ్వరోపాధ్యాయులు శాలివాహన శకం 7వ శతాబ్దంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి నాచి కూడా ఆ శతాబ్దంలోనిదేనని ఊహించుకోవాలి. ఈమె ఆంధ్ర బ్రాహ్మణ స్త్రీ అయినా కూడా ఈమె చరిత్రకు సంబంధించి ఆంధ్ర దేశంలో ఎక్కడా వివరాలు దొరకకపోవడం వల్ల ఎంతో విచారిస్తూ మహారాష్ట్రలో దొరికిన ఆధారాల వలన ఈమె చరిత్రను వ్రాయాల్సి వచ్చింది. ఈమె బాలవితంతువు కాబట్టి తండ్రి ఈమెకు దుఃఖం తెలియకుండా ఉండడానికి గాను ఈమెను విద్వాంసురాలిగా చేయదలచాడు. ఇలా తలచి ఏలేశ్వరోపాధ్యాయులవారు ఆమెకు విద్య నేర్పడం మొదలుపెట్టారు. కానీ విద్య త్వరగా రాకపోవడంతో ఆమె చాలా చింతించి విద్యార్థులక బుద్ధి వైభవం కలగడానికి గాను తండ్రి చేసి ఉంచిన జ్యోతిష్మతి అనే తైలాన్ని ఎవ్వరికీ చెప్పకుండా త్రాగింది. దాంతో ఆమెకి దేహ తాపం విపరీతమవడంతో ఇంట్లో ఉన్న బావిలో దూకింది. తర్వాత ఇంట్లోని వారు ఆమెకోసం వెతికి ఎక్కడా కనబడక చివరికి బావిలో చూశారు. అప్పటికి ఆమె తాపం కొంత చల్లారినందున ఆమెకు తెలివి వచ్చి వారికి తన వృత్తాంతమంతా చెప్పింది. అది విని తండ్రి ఆమెను ఆ బావిలో మరికొన్ని ఘడియలుంచి బైటికి తీశాడు. ఆనాటినుండి ఆమెకు విశేషమైన తెలివి, జ్ఞాపకశక్తి కలిగినందున నాచి తన తండ్రి వద్ద ఉన్న విద్యనంతా నేర్చుకుంది.

విద్యావతి అయిన పిదప ఈమెకు తీర్థయాత్రలు చేయాలని బుద్ధిపుట్టగా తండ్రి అందుకు అంగీకరించి ఆమెను యాత్రలకు పంపాడు. నాచి కూడా దీర్ఘకాల పర్యటన చక్కగా చేసుకుని వస్తుండేది. అప్పుడు కాశి మొదలైన స్థలాలలో ఈమె పండితులతో వాదం చేయడం సంభవించింది. అప్పుడు ఆ విద్యావతి వారిని ఓడించి ఎంతో మెప్పు పొందింది. ఇదిగాక ఈ పండిత ఢిల్లీ, ఆగ్రా మొదలైన స్థలాలకెళ్ళి రాజసభలలో విద్వాంసులతో వాదన చేసి విశేష బహుమతులూ అందుకునేది. ఆమె ఆ కానుకలన్నీ తీసుకువచ్చి తండ్రికి చూపించి అతనికి తన యాత్రా వృత్తాంతమంతా వినిపించేది. బ్రాహ్మణుడు కుమార్తెకు గల వైధవ్య దుఃఖాన్నంతా మరచిపోయి తన కూతుర్ని పుత్రుడిగా భావించి ఆమె ఇటువంటి విద్యాసంపన్నురాలు కావడంతో ఎంతో సంతోషించాడు. ఈమె తన చరిత్రననుసరించి నాచి నాటకమనే ఒక నాటకాన్ని సంస్కృతంలో రచించింది. ఈ విద్యాసంపదలతో గొప్ప పేరు పొందినందువలన ఏలేశ్వరోపాధ్యాయులకు పుత్రులు లేని కొరత తెలియకపోయేది.

జిజాబాయి

ఈమె మహారాష్ట్ర రాజ్య సంస్థాపకుడైన శివాజీకి తల్లి. ఈమె శాలివాహన శకం 1518వ సంవత్సరంలో జన్మించింది. ఈమె భర్త పేరు శహాజీ. ఈయన జిజాబాయిని అంతగా గౌరవించక తుకాబాయి అనే ఆమెను మరలా వివాహమాడాడు. జిజాబాయికి శివాజీ, సంభాజీ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. కానీ సంభాజీ ఒక యుద్ధంలో చనిపోయాడు. భర్త అనుకూలతలో లేకున్నా కానీ జిజాబాయి కుమారుడైన శివాజీ యొక్క తెలివితేటలకు ఆనందిస్తూ అతనికి స్వదేశ, స్వమతముల పట్ల అభిమానాన్ని పెంపొదిస్తుండేది. ఆమె భర్త తురక ప్రభువుల వద్ద సర్దారుగా ఉన్నా ఆమెకు ఆ మ్లేచ్ఛ ప్రభుత్వం పట్ల అధిక ద్వేషం కలిగి ఉండేది. ఆమె సద్బోధ వలనే శివాజీ గొప్ప శూరుడై తమ దేశంలోని తురక ప్రభుత్వాన్ని రూపుమాపి మరాఠీ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన చేసిన పరాక్రమానికంతటికీ జిజాబాయియే మూలం అనడానికి సందేహం లేదని న్యాయమూర్తులైన మహాదేవ గోవిందరావు రానడే గారు వ్రాశారు. శివాజీ తాను ఏ పనిని చేసినా తల్లి అనుమతి తీసుకోనిదే చేసేవాడు కాదు. శివాజీ మ్లేచ్ఛులతో వైరం చేయడం అతని తండ్రికి ఎంత మాత్రం సమ్మతి లేదు. కానీ తల్లి సహాయం వలననే శివాజీ గొప్ప ఖ్యాతిని పొందాడు. జిజాబాయి తానేమీ మహాకార్యం చేయకపోయినా తనకు గల స్వదేశ స్వమతాభిమానాలను కొడుకుకి బోధించి తనకు గల ఉద్దేశాలను అతని ద్వారా నెరవేరచేసింది. ఈ వీరమాత ఎనభైరెండు సంవత్సరాలు జీవించి శా.శ.1600 సంవత్సరంలో కాలం చేసింది.

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో