సగటు మహిళ ఆవేదన పసుపులేటి రమాదేవి

ఆడవాళ్ళు సమన్యాయం పొందాలంటే ఈ వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. మన ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ముఖ్యంగా పిల్లలను పెంచే విధానంలో శాస్త్రీయపరమైన ఆలోచనా విధానంలో ఆలోచించగలగాలి. అలాంటి ఆలోచనలు మచ్చుకైనా రాని విధంగా మన చుట్టూ వాతావరణం తయారుచేసి పెట్టారు. ఎంతో ఆదర్శభావాలతో తీసిన సినిమాలలో కూడా కొన్ని పాటలు వింటుంటే ఉదా:- ”బలిపీఠం” సినిమాలో హీరో ఎంతో అభ్యుదయంగా హీరోయన్‌ని పెళ్ళి చేసుకుంటాడు. కానీ ఒక సన్నివేశంలో మన కవులు రాసిన పాటలో అబ్బాయి పుడితే ఎలాగా అని భార్య పాడితే గొప్పవాడ్ని చేయాలి ఇలాగా అని, అమ్మాయి పుడితే ఎలాగా అని పాడితే పెళ్ళి చేసి పంపాలి ఇలాగా అని అంటాడు. అంటే ఇలాంటి వ్యత్యాసంతో కూడిన ఆలోచనలు మన బుర్రలో బాగా నింపి పెట్టారు. అలాగే ”మీనా” సినిమాలో ఒక పాట ‘మల్లెతీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను’ అంటూ పాడుతూ ఆడవాళ్ళకి చిన్న వయసులో తండ్రి లాలన, పెళ్ళి అయ్యాక భర్త తోడు, వృద్ధాప్యంలో పిల్లల ఆదరణ అవసరమని మన కవులు రాశారు. అంటే ఎప్పుడూ ఎవరో ఒకరి ఆదరణ, దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిందే తప్ప వాళ్ళకి ఒక గుర్తింపు ఉండకూడదా? ఆ పాట విన్నప్పుడల్లా నాకు మల్లె తీగ వంటిది మనిషి జీవితం అని ఆ పాట మొత్తం మార్చి రాయాలని అనిపిస్తుంది. అలాగే ఇంకొక సినిమాలో ”ఇల్లే ఇలలో స్వర్గమని ఇల్లాలే ఇంటికి దేవతని రుజువు చేశావు, నువ్వు రుజువు చేశావు” అంటూ ఒక పాట. అంటే ఆడవాళ్ళను మన వ్యవస్థలో దేవతలుగానే పూజిస్తారు తప్ప, మనసున్న మనుషులుగా గుర్తించడంలేదు. అంటే దేవతలకి ఏమీ ఆలోచనలు ఉండవు (దేవతలను పూజించడమంటే పండగలకి ఏవో కొన్ని వంటలు చేసి, చివరికి కొత్త బట్టలు, బంగారు నగలు కొన్నప్పుడు కూడా దేవతల ముందు కాసేపు ఉంచి తర్వాత వాటిని భుజిస్తారు. నగలు, బట్టలు ధరిస్తారు. అదే మనం పెట్టినవన్నీ దేవతలు తినేయడం, నగలు, బట్టలు వాళ్ళే ధరించడం మొదలుపెడితే అసలేమీ వాళ్ళముందు పెట్టరు). కాబట్టి మనం కోరుకునేది దేవతలుగా పూజించవద్దు, ఆరాధించవద్దు. ఆడవాళ్ళను మనసున్న మనుషులుగా గుర్తించి, వాళ్ళ ఆలోచనలను గౌరవించగలగాలి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఆలోచన అంటే, తను కూడా కొంతమేరకు అభ్యుదయంగానే ఆలోచించే అమ్మాయే అయినా ఆమె ఎదుర్కొంటున్న సమస్యలతో విసిగిపోయి, ప్రస్తుతం మహిళలపై వయస్సుతో నిమిత్తం లేకుండా జరుగుతున్న అత్యాచారాలు, దాడులు… అన్నీ చూసి అసలు ఆడపిల్లలను కనాలంటే భయం వేస్తుందని చెప్పింది. వాస్తవానికి ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు. పెళ్ళి కాకముందే ఆడపిల్లని కనాలంటే భయం అనే భావన ఎందుకు వచ్చిందంటే… ఆమెకు తండ్రి లేడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. తల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. ఆ అమ్మాయి బాగా చదువుకుని ఉద్యోగం చేస్తోంది. పెళ్ళి చేసుకుందామంటే అవతలివారు మొట్టమొదటిగా పెట్టే కండిషన్‌ పెళ్ళయ్యాక మీ అమ్మ, తమ్ముడి బాధ్యతలు నీవు పెట్టుకోకూడదు. అంటే మరి వారిని ఎవరు చూడాలి? అలాంటి అనేక సమస్యలను ఆ అమ్మాయి ఎదుర్కొంటోంది.

స్త్రీని ఒక వస్తువులాగా, ఒక ఆస్తిలాగా చూస్తున్నారే తప్ప మనుషుల్లాగ చూడడంలేదు. ఉద్యోగం చేయని ఆడవాళ్ళంటే భర్త, అత్తమామలకి, బంధువులకి సేవ చేయాలని, ఉద్యోగం చేసే స్త్రీ అయితే ఆమె మీదే కాక, ఆమె సంపాదించే జీతంపై కూడా సర్వ హక్కులు భర్తవే అనే భావన బాగా నిండిపోయింది ఈ సమాజంలో.

ఇటీవల ఒక మహిళతో సంభాషణ జరిగింది. ఆమెకు దాదాపు 60 సంవత్సరాలకు పైనే ఉంటాయి. మేకప్‌, హెయిర్‌ డై వేసుకుని చూడడానికి ఆధునికంగా ఉంది. కానీ ఆమె మాత్రం ఆడపిల్లకు పెళ్ళయాక వారి ఇంటికి తల్లిదండ్రులు వెళ్ళకూడదు. కేవలం చూడడానికి వెళ్ళాలే తప్ప వాళ్ళ దగ్గర ఉండకూడదు. అది అల్లుడి ఇల్లు, అల్లుడి ఇంట్లో ఉండకూడదు అనే బలమైన ఆలోచనలో ఉంది. ఇప్పుడు కొంతమంది అభ్యుదయంగా ఆలోచించే వాళ్ళు అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఒకటే అనే ఆలోచనలో ఉంటున్నారు. ఇద్దరూ ఆడపిల్లలే అయినా ఇక పిల్లలు వద్దనుకుని, ఇద్దరినీ మంచి వ్యక్తిత్వంతో బాధ్యతలు గల పౌరులుగా, వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడేలా పెంచుతున్నారు. అయితే ఆడపిల్లలు ఇంకా కొంతమందిని పోషించే హోదాగల ఉద్యోగంలో ఉన్నాసరే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించకూడదు, వారి బాగోగులు చూడకూడదనే ఆలోచనలోనే చాలామంది మగవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు ఎంతసేపూ మా తల్లిదండ్రులు వృద్ధులైపోతున్నారు, వాళ్ళను చూసుకోవాలి అనుకుంటారు, ఆ ఆలోచనలో తప్పు లేదు. మరి వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద వాళ్ళు అవుతున్నప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా అంతేకదా! మరి నా భార్యకు కూడా తన తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఉంటుంది కదా అని ఆలోచించలేకపోతున్నారు. అంటే, ఒకసారి పెళ్ళి చేసి అప్పగింతలు చేసిన తర్వాత ఆ అమ్మాయి మా అమ్మాయే మీకు ఇక సంబంధం లేదు అనే ఆలోచన. అలాగే ఆ అమ్మాయి సంపాదించేవన్నీ మావే, అంటే భర్త, అత్త మామలకే సర్వహక్కులూ అనే ఆలోచనల్లోనే ఉంటున్నారు.

వివాహ సమయంలో కన్యాదానం అనే కార్యక్రమంలో అల్లుడికి కాళ్ళు కడిగి పిల్ల తండ్రి తన బిడ్డను దానం చేయడం, అంటే అదే అర్థం ఆపాదించుకుని అవే ఆలోచనల్తో చిన్నప్పటినుంచి పిల్లలను పెంచుతున్నారు. అయితే ఆ అమ్మాయికి డెలివరీ సమయంలో కానీ, ఇంకా ఏ ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినా భర్త కానీ, అత్త మామలు కానీ, మరే ఇతర కుటుంబ సభ్యులకు కానీ ఏమీ పట్టదు. మళ్ళీ ఆమెకు సేవలు చేయాల్సింది, డబ్బులు ఖర్చు చేయాల్సింది ఆమె తల్లిదండ్రులే. అదేంటంటే ఎవరికోసం చేస్తారు అంటారు. ఆమెచేత చాకిరీ చేయించుకుని, ఆమె జీతం మీద కూడా సర్వహక్కులూ తమకే అని ఆలోచించే భర్త, అత్తమామలు, బంధువులు ఈ విషయంలో మాత్రం ఏమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఇప్పుడున్న ఈ వివాహ విధానంలో మార్పు రావాలి. అసలు కన్యాదానమంటే ఏమిటి? ఆ అప్పగింతలేంటి? ఆ అమ్మాయి ఏమన్నా ఒక వస్తువా? గతంలో బాల్య వివాహాలు, అంటే రజస్వల కాకముందే పెళ్ళి చేసి కన్యాదానం చేసి అప్పగింతలు చేసేవారు. బహుశా చిన్నపిల్ల కాబట్టి జాగ్రత్తగా చూసుకోమని పిల్లకు తెలిసీ తెలియని వయస్సు కాబట్టి అలా చేసేవారేమో! మరి ఇప్పుడు ఆడపిల్లలు బాగా చదువుకుని, తన కాళ్ళమీద తాను నిలబడి తనను తాను పోషించుకోవడమే కాకుండా ఇతర కుటుంబ సభ్యులను కూడా పోషించే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కన్యాదానం ఎందుకు? ఆ అప్పగింతల అవసరమేంటి? కాబట్టి మారుతున్న కాలం, పరిస్థితులతో పాటు వివాహ విధానంలో కూడా మార్పులు రావాలి.

అలాగే భార్యాభర్తలిద్దరూ తమ ఇద్దరి తల్లిదండ్రులను బాధ్యతలను ఇద్దరూ బాధ్యతగా స్వీకరించాలి. అలాగే ఆ ఇద్దరి తల్లిదండ్రులు కూడా అల్లుడిని కొడుకులాగా, కోడలిని కూతురిలాగా స్వీకరించగలగాలి.

అసలు పిల్లల్ని మనం చిన్నప్పటినుంచి ఎలా పెంచుతామో అలాగే పెరుగుతారు. ఇటీవల వచ్చిన ‘రుద్రమదేవి’ సినిమాలో మనకు ఆ విషయం చాలా స్పష్టంగా కనిపించింది. ఆ సినిమాలో ఆడపిల్లలకి రాజ్యాధికారం ఉండదు కాబట్టి పుట్టింది అమ్మాయని ఎవరికీ తెలియకుండా ఒక అబ్బాయిలాగా అంటే రుద్రమదేవిని, రుద్రమదేవుడిలాగా పెంచి అన్ని విద్యలు నేర్పిస్తారు. ఆమె ఎంతో వీరోచితంగా యుద్ధాలు కూడా చేయగలుగుతుంది. అయితే ఇప్పుడు ఆడపిల్లలను చిన్నప్పటి నుంచి కొన్ని కట్టుబాట్లతో నువ్వు ఆడపిల్లవు నువ్వు ఆ పని చేయలేవు, బయటికి వెళ్ళకూడదు అని చెబుతూ పెంచుతుంటారు. 12 ఏళ్ళు వచ్చాయంటే చాలు కనీసం పెద్దగా నవ్వితే కూడా ఏంటా నవ్వు మొగరాయుడిలాగా అంటారు, తల పైకెత్తి నడుస్తుంటే ఏంటా నడవడం మొగరాయుడిలాగా, ఆడపిల్లవు తలొంచుకుని ఒద్దికగా నడవాలి అంటుంటారు. అలాగే మగ పిల్లలను చిన్నప్పుడు, పెద్దయ్యాక కూడా ఎప్పుడైనా ఏడిస్తే ఏంట్రా ఆ ఆడంగి ఏడుపు అంటారు. దీంతో వారికి తెలియకుండానే వారి మనసులో ఏడవడం ఆడవాళ్ళ పని అని, మగపిల్లలు కాబట్టి వారు ఏదైనా చేయవచ్చని, ఏమి చేసినా తప్పులేదనే విషయాలను వారి బుర్రలో పెడుతోంది మనమే.

ఒక ఇంట్లో ఒక కొడుకు, కూతురు ఉంటే కొడుకు పెద్దవాడు, కూతురు చిన్నది అయినా సరే ఇద్దరికీ పెట్టే ఆహారం, చదువు విషయంలో కూడా వ్యత్యాసం చూపిస్తున్నాం. అలాగే భోజనమయ్యాక ఆడపిల్ల చిన్నదని లేకుండా అన్నయ్య పళ్ళెం కూడా తీసుకెళ్ళు అంటారు కానీ చెల్లి చిన్నది చెల్లి కంచం కూడా నువ్వే తీసి క్లీన్‌ చెయ్యి అని మగపిల్లలతో ఎందుకు చేయించలేకపోతున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి.

ఇటీవల ఒకరి ఇంటికి వెళ్ళినపుడు వాళ్ళ అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఏమి చదువుకున్నావంటే ఎం.టెక్‌ అని చెప్పింది. మరి ఉద్యోగం కోసం వెదుకుతున్నావా అని అడిగితే ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ అమ్మ మాత్రం లేదండీ, వాళ్ళ నాన్నగారు వద్దన్నారు. ఒక సంవత్సరం రఘు కాలేజీలో ఫ్యాకల్టీగా చేసింది. పెళ్ళి చేయాలనుకుంటున్నాము, ఇప్పటినుండి కష్టపడడం ఎందుకని మాన్పించేశాము. పెళ్ళయ్యాక వాళ్ళు ఉద్యోగం చేయిస్తారో లేదో వాళ్ళ ఇష్టం అని చెప్పింది. అంటే చదువుకున్న ఆ అమ్మాయి ఉద్యోగం చేయాలా వద్దా అనేది పెళ్ళయ్యాక వాళ్ళు చెయ్యమంటే చేయడం లేకపోతే లేదు అని వాళ్ళ నాన్న నిర్ణయిస్తాడు తప్ప ఆ అమ్మాయి నిర్ణయంతో పనిలేదు.

అలా కాకుండా ఆడపిల్లలు వాళ్ళ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళే తీసుకుని ధైర్యంగా చెప్పగలిగేలా, వాళ్ళ వ్యక్తిత్వాలను వాళ్ళు నిలుపుకునేలాగా తయారు కావాలి.

చాలామంది చదువుకున్న ఆడవాళ్ళు కూడా పెళ్ళయ్యాక ఇంటిపని, బయటి పని, వంటపని వత్తిడితో కనీసం ఇంటికి వచ్చే పేపర్‌ కానీ ఇతర ఏ పుస్తకాలు కానీ చదవరు. కానీ, పనికిరాని టీవీ సీరియల్స్‌ మాత్రం చూడడం పరిపాటి అయిపోయింది.

అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మన ఇంటికి వచ్చే పేపర్‌లోని విషయాలు కానీ, ఏదైనా పత్రిక లేదా ఇతర పుస్తకాలు కానీ చదువుతూ అందులోని మంచి విషయాలను మన పిల్లలకు, కుటుంబసభ్యులకు చదివి వినిపిస్తే మంచిది. ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అనే సూక్తి అక్షరాలా నిజం. సమయాన్ని సద్వినియోగం చేసుకుని నిత్య అధ్యయనాన్ని అలవాటుగా చేసుకోవాలి.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో