‘సుస్వరాల లక్ష్మి సుబ్బులక్ష్మి’ పద్మావతి బోడపాట

ఎప్పుడయినా రేడియోలో వస్తుంటే అనుకోకుండా విని ఆ క్షణానికి బావుంది, బాగోలేదు అన్పించడం తప్ప శాస్త్రీయ సంగీతం గురించి నాకేమీ తెలియదు. అలాగే వీూ ూబపపబశ్రీaసరష్ట్రఎఱ గురించి కూడా ఎప్పుడైనా రేడియోలో విన్పించే వెంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం వినటం తప్పించి ఎక్కువేమీ తెలియదు. వీూ ూబపపబశ్రీaసరష్ట్రఎఱ ని నెహ్రు మెచ్చుకున్నాడని, గాంధీజీ అడిగి పాటలు పాడించుకున్నాడని అందరికీ తెలిసినట్లే నాకూ తెలుసు.

‘సుస్వరాల సుబ్బులక్ష్మి’ అనే ఈ పుస్తకం పల్లవి గారు ఎంత బాగా రాసారంటే ఈ పుస్తకం రాసిన పల్లవి గార్ని, ఎవరి గురించయితే రాసారో ఆ సుబ్బులక్ష్మి గారిని ఈ పుస్తకం చదవటం అయిపోయేలోపు ప్రేమించటం మొదలుపెడతాం. మామూలుగా కాదు, అయ్యో సుబ్బమ్మా అనుకుంటాం, పిచ్చి సుబ్బమ్మా అని బుగ్గలు పుణుకుతాం, గడుసు సుబ్బమ్మా అని మెచ్చుకుంటూ అనుకుంటాం. మనింటి మనిషి గురించి అనుకున్నట్లే ఎవరి జీవితం మీదయినా నిర్ణయాధికారం ఎవరిది అనే ప్రశ్న ఈ బుక్‌ చదువుతున్నంతసేపు వస్తూనే ఉంది.

వైణికురాలైన మధురై షణ్ముఖవడివు అక్కమ్మకి తనకు ఆడపిల్ల పుడితే ఎలా పెంచాలనే తన కలలు తనకున్నాయి. సుబ్బులక్ష్మి పుట్టిన దగ్గర్నుంచి ఆ కలల్ని సాకారం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. తన కూతురు కుంజమ్మ (ముద్దు పేరు) వీణ ధనమ్మలాగాపేరు తెచ్చుకోవాలని, బెంగుళూరు నాగరత్నమ్మ లాగా డబ్బు సంపాదించాలని కలలు కంది. తన కూతురు కుంజమ్మకి కర్నాటక సంగీతంతో పాటు, తన భోషాణంలో ఉన్న జావళులూ, పదాలూ, ఇంటి పక్కనే ఉన్న మధుర మీనాక్షి కోవెలలో దేవదాసీలు పాడే మేలుకొలుపు గీతాలతో పాటు తనకందుబాటులో ఉన్న సంగీతానికి సంబంధించిన అన్నిటినీ పరిచయం చేసింది.

తన పోషకుల ద్వారా, వైణికురాలిగా తనకున్న విద్వత్తు ద్వారా తన మేనమామ, తన తమ్ముళ్ళ కుటుంబాలతో పాటు, తనకు పుట్టిన పిల్లల్ని పోషించే మధురై షణ్ముఖవడివు అక్కమ్మ తన కుంజమ్మని ఎనిమిదవ ఏట నుండి తనతో పాటు వేదికలెక్కించింది. 1930ల్లో వేరే ఏ కులపు స్త్రీకి లేని, కేవలం దేవదాసీ స్త్రీలకి మాత్రమే సాధ్యమయిన, తమ ప్రతిభ ద్వారా గుర్తింపు తెచ్చుకునే అరుదయిన అవకాశం తన కుంజమ్మకి కల్పించడం కోసం తన సర్వశక్తులూ ఒడ్డి కొంతకాలం మద్రాసులో, కొద్దికాలం మధురైలో ఉంటూ కుంజమ్మకి 19 ఏళ్ళు వచ్చేవరకు తనకు సాధ్యమయినన్ని ప్రయత్నాలు చేసింది షణ్ముఖవడివు. కర్నాటక సంగీత విద్వాంసుల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది సుబ్బులక్ష్మి.

తన కూతురు పోషకుల్ని నిరాకరించి పెళ్ళి గురించి కలలు కని తన జీవితాన్ని ఎందుకూ కాకుండా చేసుకుంటుందేమో అనే భయమే షణ్ముఖవడివు కైనా. ‘మనల్ని ఎవరూ పెళ్ళి చేసుకోరమ్మా, ఒకవేళ చేసుకున్నా రెండవ పెళ్ళి వాళ్ళే చేసుకుంటారు. మేము నీకు చేస్తుంది అలాంటిదేనమ్మా. ఇలా అయితే నువ్వు సంగీత సాధన, కచేరీ బ్రహ్మాండంగా ఆపకుండా చేసుకుపోవచ్చు. నువ్వనుకున్న పెళ్ళితో ఇవి అసలు కుదరవు. సంసారం ఈదడానికే సరిపోతుంది. సంగీతంలో ఇంత ఎత్తుకు ఎదిగావు, దాన్ని వదిలేయకు. పోషకుల అండతో, మనకున్న కళతో మా అమ్మమ్మ, అమ్మ, నేను మా గౌరవానికి ఎటువంటి లోటు లేకుండానే బతికాము. నిన్ను అలాగే బతకమంటున్నాము’ అని కుంజమ్మకి పోషకుడ్ని వెదికిన వాళ్ళమ్మ అక్కమ్మకి నచ్చచెప్పింది.

ఇరవై ఏళ్ళ కుంజమ్మకి తన జీవితం గురించి తనవైన కలలున్నాయి. అందులో డబ్బుకీ, సంగీతానికీ, సంగీతం ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతలకి రెండో స్థానమే. తను పెళ్ళి చేసుకోవాలి. పోషకులుండడం ద్వారా వచ్చే ఎగతాళి తనకొద్దు. తండ్రి ఫలానా అని చెప్పినా అవునో, కాదో అనే అనుమానపు గుర్తింపు తన పిల్లలకొద్దు. ‘చిన్ని మా రాణీ’ అని తండ్రి తనని రహస్యంగా ముద్దు చేసినట్లు కాకుండా తన పిల్లల తండ్రి వాళ్ళని బహిరంగంగా ముద్దు చేయాలి అనుకుంది కుంజమ్మ.

మన జీవితం మీద నిర్ణయాధికారం మనదే అని మనందరికీ ఏదో ఒక సమయంలో అన్పించినట్లే సుబ్బులక్ష్మికి కూడా అన్పించింది. ‘నాకు సంగీతం వద్దు, పెళ్ళి చేసుకుని పిల్లల్నే చూసుకుంటా’ అని వాళ్ళమ్మకి తెగేసి చెప్పినా, వాళ్ళమ్మ మాత్రం తన ప్రయత్నాలు మానకపోవడంతో అంతకుముందే కచేరీలు చేసి తనకు పరిచయమున్న మద్రాసుకి తన తల్లి నుండి, తన అన్న నుండి, తన బంధుమిత్రుల నుండి, తను పుట్టి పెరిగిన మధురై నుండి పారిపోయి వచ్చింది.

అప్పటికే దేవదాసీల రీహాబిలిటేషన్‌ కోసం ముత్తులక్ష్మీ రెడ్డి స్థాపించిన ఆశ్రమంలో తలదాచుకుని తన కాళ్ళమీద తాను బతికి తను కలలు కనే పెళ్ళి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళను పెంచుతూ కోట్లమందిలాగా సాదాసీదా బతుకు గడపాలని ఆమె కోరుకుంది. మధురై నుండి పారిపోయి ఆశ్రయం కల్పిస్తాడని కాంగ్రెస్‌ నాయకుడు సాంబమూర్తి (బులుసు?) ఇంటికి వస్తుంది. దేవదాసీ పిల్లని చేరదీసి ఆశ్రయం కల్పిస్తే వచ్చే అపవాదుకి భయపడి ‘ఆనంద వికటన్‌’ లో పనిచేస్తున్న సదాశివం దగ్గరికి సుబ్బులక్ష్మిని పంపిస్తాడు సాంబమూర్తి.

అప్పటికే సుబ్బులక్ష్మి మీద మనసుపడ్డ సదాశివం, పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న సదాశివం కుటుంబ సభ్యుల అభ్యంతరాల్ని లెక్కచేయకుండా సుబ్బులక్ష్మి అలియాస్‌ కుంజమ్మకి ఆశ్రయం కల్పిస్తాడు.

సదాశివం తనను ఇష్టపడుతున్నాడని తెలిసి తనంతట తాను వెతుక్కుంటూ సదాశివం దగ్గరికి వచ్చుంటే సుబ్బులక్ష్మి ఎలా ఆలోచించేదో గానీ తనకు ఆశ్రయం కొరకు, తన తల్లి తనను బలవంతంగా తీసుకెళ్ళకుండా ఉండడం కోసం సదాశివం ఇంట్లో ఉన్న సుబ్బులక్ష్మి సదాశివం ఏమి ఆశపడుతున్నాడో తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. తన ఆశ్రయంలో ఉన్న సుబ్బులక్ష్మికి సంగీత కచేరీలు ఏర్పాటు చేసిన సదాశివం ఆమె తల్లి, మేనమామలు బలవంతంగా తీసుకెళ్ళకుండా రక్షణ కోసం, సుబ్బులక్ష్మిని తనమీద ఎక్కువ ఆధారపడి ఉండేలా చేయడం కోసం సినిమాలలోకి దించాడు సదాశివం.

సదాశివం రక్షణలో ఉంటూ తన మానసిక ప్రపంచం తప్ప ఇంకొకటి పట్టని సుబ్బులక్ష్మి శకుంతల సినిమాలో సహ నటుడూ, అప్పటికే బాగా పేరున్న నాయకుడు, కర్ణాటక విద్వాంసుడు జి.ఎన్‌.బాలసుబ్రహమణ్యం పట్ల ఇష్టం పెంచుకుంటుంటుంది. 1938లోనే అత్యంత ఆధునికంగా తను ఇష్టపడ్డ వ్యక్తికి తన ఇష్టాన్ని ఉత్తరాల ద్వారా తెలియచేస్తుంది. అతన్నే పెళ్ళి చేసుకోవాలని కలలు కంటుంది. నన్నేమన్నా సొంత మేనమామ అనుకుంటుందా తనిష్టపడ్డవాడికి ఇచ్చి పెళ్ళిచేసి పంపడానికి అనుకుంటాడు సదాశివం.

ఇక్కడ మళ్ళీ తను ఎంచుకునే స్వేచ్ఛకీ, దాని అమలుకీ మధ్య మళ్ళీ తన దేవదాసీ కులమే అడ్డుపడుతుంది కుంజమ్మకి. కుంజమ్మని ఇంట్లోనుండి పంపడం కష్టమని అర్థమయిన సదాశివం భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. పెళ్ళెప్పుడు చేసుకుంటారని అడిగిన సాటి కులస్థులైన వీణధనమ్మ కూతుళ్ళు జయమ్మకీ, కామాక్షికీ దాక్షీకం చేసే సదాశివాన్ని పెళ్ళాడడం తనకిష్టం లేదని చెబుతుంది కుంజమ్మ. సదాశివం పంచన రెండు సంవత్సరాలున్న కుంజమ్మని వేరే ఎవరూ పెళ్ళి చేసుకోరనీ, తనని దేవదాసీలాగే చూస్తారని, సదాశివం తనను పెళ్ళి చేసుకుంటానంటే ఒప్పుకొమ్మని తలలో నాటుకునేలా చెప్తారు వీణ ధనమ్మ కూతుళ్ళు.

తను ఎంచుకునే స్వేచ్ఛకి స్వస్తి చెప్పి తనను ఎంచుకునే స్వేచ్ఛని సదాశివానికిస్తుంది సుబ్బులక్ష్మి. బ్రాహ్మణ, దేవదాసీ కులాలకి చెందిన వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగానే భార్యాభర్తలయ్యారు.

”నాన్నా నువ్వు అమ్మ కోసం నీ కులాన్ని త్యాగం చేశావు, నీ బంధు మిత్రులందరికీ దూరమయ్యావు, నువ్వెంత చేశావు నాన్నా అమ్మకోసం” అంటుంది కొ.కు. ‘కులంలేని మనిషి’లో అమ్మాయి. ‘నేను నా కులాన్ని వదిలేసి ఎంత నష్టపోయానో మీ అమ్మ తన కులాన్ని వదిలేసి అంతే నష్టపోయింది. నాకు నా కులమెంతో మీ అమ్మకు తన కులమంత. తనకోసం తెరుచుకున్న ఏడుగురి నోట్లో మట్టిగొట్టి వచ్చిందమ్మా మీ అమ్మ నాకోసం’ అంటాడు అదే కథలో తండ్రి. ఇది కథ కాదు. సదాశివం అలా అనుకోవడానికి కొ.కు. కాడు.

అడుగడుగునా సుబ్బులక్ష్మి కుటుంబం అంటే చులకన, ఎంత దూరంలో పెట్టాలో సుబ్బులక్ష్మిని తన పుట్టింటికి అంత దూరంలో పెడతాడు. పుట్టబోయే ఏ పిల్లల గౌరవం కోసమయితే తల్లినీ, అన్ననీ, బంధువులనీ కాదనుకుని వస్తుందో ఆ పిల్లలే లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకుంటాడు సదాశివం. తన అన్న శక్తివేలుకి తన బాధ చెప్పుకుని ఏడుస్తుంది సుబ్బులక్ష్మి. సుబ్బులక్ష్మికి అప్పటికే జీవితం అర్థం చేయించి ఉంటుంది తనకి పోషకుల్ని ఎంచుకునే స్వేచ్ఛ మాత్రమే ఉందని, మిగిలింది ఏది ఎంచుకోవడానికైనా సదాశివానికే స్వేచ్ఛ ఉందని.

సదాశివం సుబ్బులక్ష్మిని ఊహించని అందలాలకెక్కిస్తాడు. తమిళంలో, హిందీలో ‘మీరా’ సినిమా తీస్తాడు. స్వాతంత్య్రం వచ్చిన దేశంలో సుబ్బులక్ష్మి పేరు ఏ మూల చూసినా మారుమోగిపోయింది. నెహ్రు అంతటివాడు నేను ఈ దేశానికి కేవలం ప్రధాన మంత్రిని, ఆమె సంగీత సామ్రాజ్యానికి రాణి అని ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు, మూడు సందర్భాలలో చెబుతాడు. ఆ సంగీత సామ్రాజ్యానికి రాణికి తను పిల్లల్ని కని పెంచే హక్కు లేదు. ఇక్కడ కూడా సుబ్బులక్ష్మి అసాధారణ వ్యక్తిత్వమే చూపిస్తుంది. సదాశివం పిల్లల్ని, సదాశివం అక్క పిల్లల్ని తన సొంత పిల్లల్లాగా పెంచుతుంది. సదాశివం పిల్లలకి చాలా సంవత్సరాలు సుబ్బులక్ష్మి స్వంత తల్లి కాదని కూడా తెలియదు. సతీ సావిత్రి సినిమాకి సుబ్బులక్ష్మికి వచ్చిన డబ్బులతో ‘కల్కి’ పత్రిక ప్రారంభిస్తాడు సదాశివం. ‘మీరా’ సినిమాకి వచ్చిన డబ్బులతో మద్రాసులో తన నివాసము, ‘కల్కి’ పేపర్‌ నడుస్తున్న భవనం, రెండెకరాల తోట, ఒక బంగ్లా కొంటాడు.

సదాశివం అఖండమైన మేధావి. సుబ్బులక్ష్మిని ఇంటి, వంట పనికి కూడా దూరంగా ఉంచడమే కాకుండా, ఇంటి నిర్వహణ బాధ్యతల నుండి కూడా దూరంగా పెడతాడు. గవర్నర్‌ జనరల్‌గా ఉన్న రాజాజీ సలహా, కోరిక మేరకు సుబ్బులక్ష్మిని ‘మీరా’ తరువాత సినిమాలకి దూరంగా ఉంచుతాడు. సుబ్బులక్ష్మికి ఉన్న అన్ని సాంఘిక సంబంధాలు సదాశివం కనుసన్నల్లోనే. సుబ్బులక్ష్మిని ఎవరు కలవాలన్నా సదాశివం అనుమతి ఉండాలి, సుబ్బులక్ష్మి ఎవరికయినా ఇంటర్వ్యూలు ఇవ్వదు. సదాశివమే ఇస్తాడు. ఏమి కట్టాలి, ఏమి తినాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం పాడాలి అనేది నిర్ణయించేది సదాశివమే. సుబ్బులక్ష్మి చుట్టుపక్కల అందరూ సదాశివం బంధువులే. సుబ్బులక్ష్మి తల్లి షణ్ముకవడివు తన కూతుర్ని తనకు దూరం చేశారన్న కోపంతో ఎలాగూ రాదు, పోషకుడి ఆశ్రయంలో ఉన్న సుబ్బులక్ష్మి చెల్లెలికి ఇంట్లో ప్రవేశం నిషిద్ధమే. ప్రేమను చంపుకోలేక ఎప్పుడయినా వచ్చే అన్న శక్తివేలుతో సదాశివం సరిగ్గా మాట్లాడడు. శక్తివేలుకి పరాయివాడిలాగా చెల్లితో మాట్లాడుకుని ఒక పూట అన్నం తిని వెళ్ళేవరకే అనుమతి.

పది సంవత్సరాలు సినిమాల వల్ల కర్ణాటక సంగీతానికి కొద్దిగా దూరంగా ఉన్న సుబ్బులక్ష్మి నైపుణ్యం పెరగడకోసం అప్పటికే ప్రముఖులైన సెమ్మంగుడి శ్రీనివాస్‌, ముసిరి, అరియక్కుడిలతో శిక్షణ ఇప్పిస్తాడు. సుబ్బులక్ష్మి కీర్తిప్రతిష్టలు ఖండాంతరాలకు పాకుతాయి. ఏడింబరో, ఐక్యరాజ్యసమితి, యూరప్‌, ఫిలిప్పిన్స్‌ వంటి ఎన్నో దేశాలు పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, రామన్‌ మెగనెసే అవార్డులు, డాక్టరేట్‌లు ఎన్నో. చిన్నా చితకా అవార్డులకయితే లెక్కే లేదు. వీటన్నిటి వెనకాల ఉంది సదాశివమే. సుబ్బులక్ష్మి జీవితాన్ని అంగుళం అంగుళం ప్లాన్‌ చేసి నడిపించాడు.

ఆ జీవితంలో సుబ్బులక్ష్మి ఎక్కడుందో, ఎంతుందో సుబ్బులక్ష్మికే తెలియాలి. కానీ సుబ్బులక్ష్మి పుట్టింటి వాళ్ళు మాత్రం నిషిద్ధులు. అవసానదశలో ఉన్న తల్లిని, అన్ననీ చూసుకోవడానికి ఒకసారి మాత్రం అనుమతి దొరుకుతుంది. తల్లి అంత్యక్రియలకి అతి కష్టమీద సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌ సదాశివానికి నచ్చచెప్పడంతో పంపిస్తాడు. అన్న శక్తివేలు అంత్యక్రియలకి కూడా పంపనే పంపడు సదాశివం. ఇదంతా ఎందుకో అర్థమయ్యేదే. సుబ్బులక్ష్మిలో ఉన్న మధురై అస్థిత్వాన్ని తుడిచెయ్యాలి. ఒకసారి షణ్ముఖవడివు వీణ రికార్డుని ఎవరో ఇంటికి తెచ్చిస్తారు. ఆ లం…లకి సంబంధించినదేదీ వద్దనేస్తాడు. మరి ఆ లం…….. కూతురు ఇంట్లో ఉంది. ఆమెనేం చేస్తాడు?

‘కల్కి’ని నడవలేని పరిస్తితుల్లో కల్కి కోసం చేసిన అప్పుల్ని తీర్చడం కోసం అంతపెద్ద బంగ్లాని సుబ్బులక్ష్మికి 60 ఏళ్ళ వయసులో సుబ్బులక్ష్మికి ఒక్క మాట కూడా చెప్పకుండా అమ్మేస్తాడు. ఆ బంగ్లాని నిలబెట్టడానికి ఎవరు చేస్తానన్నా సహాయం స్వీకరించడు. ఈ రకంగా తన 95వ ఏట తను చనిపోయేవరకు జరిపించుకుంటాడు సదాశివం.

ఆ సేతు హిమాచలం తన కీర్తి ప్రతిష్టలను దశాబ్దాల తరబడి అప్రతిహతంగా వ్యాపిస్తున్నప్పుడు అసలు సుబ్బులక్ష్మి ఎక్కడ ఉంది, నిజ సుబ్బులక్ష్మిని ఎవరిలో చూసుకుంది.

సుబ్బులక్ష్మి పుట్టుకతో దేవదాసి. ఏ దేవదాసికైనా రెండు ముఖాలు… ఒకవైపు పోషకులు, వాళ్ళనుండి ఆర్థిక, మానసిక, అభద్రత, తన విద్యత్‌ తనకన్నా రేపటికి భరోసా లేకపోవడం. ఇంకోవైపు తన జీవితానికి తాను కర్త అయ్యే స్వాతంత్య్రం… తన పోషకుల మంచి చెడ్డలకు అతీతంగా తననుతాను దర్శించుకునే అరుదైన అవకాశం.

ఇరవై సంవత్సరాలు దేవదాసి కులస్థురాలిగా పెరిగిన సుబ్బులక్ష్మి, మనసుతో బతకాలనుకున్న సుబ్బులక్ష్మి దేవదాసీ కులపోషకుల రూపాన్ని తిరస్కరించింది. సారం, దేవదాసీ కుల సారం, తనకు తానే కర్తనయ్యే సారం నిలుపుకుంటుంది. ఆ ప్రయాణంలో సదాశివం, నెహ్రు, గాంధీ, ఐక్యరాజ్యసమితి నిమిత్తమాత్రులు.

సుబ్బులక్ష్మి పుట్టుకతోనే నెమ్మదస్తురాలు, శాంతమూర్తి. తల్లిచాటు పిల్ల. ఆలంబన దొరికితే ఆధారపడి హాయిగా బతికేయాలనుకుని కలలు కన్న మామూలు ఆడపిల్ల. తల్లిద్వారా రేపటి గురించిన అభద్రత, ఎంత విద్వత్తు ఉన్నా పోషకుల్ని వెతుక్కుంటే తప్ప నాలుగు వేళ్ళూ నోట్లోకి పోవన్న నిజం తెలిసిన ఆడపిల్ల. తన కలలూ, భయపెట్టే నిజాలు, తన విద్వత్తు, తన కీర్తి ప్రతిష్టలు వీటన్నిటి మధ్య ఏ మాత్రం బెసగకుండా తన ప్రయాణం సాగించటం నేర్చుకున్న మహోన్నత పధికురాలు. ఆ ప్రయాణంలో తటస్థపడినవారంరూ నిమిత్తమాత్రులు. తన ప్రయాణమొకటే నిజం.

తన జీవితాంతం భర్త చాటు భార్యగా తన భార్యా ధర్మం నెరవేర్చింది. భర్త చాటు భార్యగా ఇమిడిపోవడానికి తనవైన కారణాలు తనకున్నాయి.

స్త్రీ స్వేచ్ఛ గురించి ఎవరో అడిగిన ప్రశ్నకు –

”ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. ఎవరికి వారు వారికున్న కష్టాలు, బాధలను బట్టి, వారి సమస్యలను పరిష్కరించుకోవాలి. నేను యుక్తవయసులో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చే మగవాళ్ళు నన్నెప్పుడెప్పుడు వాళ్ళ వశం చేసుకుందామా అనే దృష్టితో చూసేవాళ్ళు. అందుకని నాకు ఎప్పుడెప్పుడు పెళ్ళి చేసేసుకుందామా అనిపించేది. భగవంతుని దయవల్ల అలాగే జరిగింది. పెళ్ళిలో సుఖమో, దుఃఖమో ముందు నేను భద్రంగా ఉంటాను కదా, రాచనాగువలే కాపాడారు నన్ను మామ” అంటుంది సదాశివం గురించి.

మ్యూజిక్‌ అకాడమీ అధ్యక్షురాలి హోదాలో మాట్లాడుతూ ”నా విషయంలో నా తల్లి కేవలం నాకు మాతృమూర్తే కాకుండా నా సంగీత గురువు కూడా. మా అమ్మ మధురై షణ్ముగవడివు అనుగ్రహమే ఈ రోజు ఈ సంగీత జ్ఞానం. నా తల్లిగా, నా సంగీత గురువుగా ఆమె ఆత్మ ఎక్కడున్నా నన్ను కాపాడుతూనే ఉండాలని ప్రార్థిస్తున్నాను”.

తన మధురై అస్థిత్వాన్ని జీవితాంతం ప్రేమించి, తనను తాను గౌరవించుకుంది సుబ్బులక్ష్మి.

భర్తకు ‘అధీన’ స్త్రీలాగా ఆయన పూర్తి పెత్తనం చేయడం వల్ల సమస్యలేమీ లేవని, ఆయన ఎప్పుడు ఏమి చెప్పినా సరైనదేననిపించేదని చెప్పింది. భర్త పాడకుండా కట్టడి చేసివుంటే పెళ్ళి చేసుకుని, పిల్లల్ని చూసుకోవడంలోనే తృప్తి పడేదాన్ని. మామ పాడమంటేనే పాడేదాన్ని అని చెప్పింది సుబ్బులక్ష్మి.

సదాశివం చనిపోయాక కేర్‌టేకర్‌ అయిన ఆత్మానాధన్‌ టి.ఎస్‌.జార్జ్‌ ”అమ్మా! ఇతను చూడు ఏం రాసాడో, మీకూ జి.ఎన్‌.బాలసుబ్రహ్మణ్యంకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లు రాసాడు. ఇలా రాయొచ్చా, ఏం చేద్దాం?” అన్నాడు.

సుబ్బులక్ష్మి స్థిమితంగా విని ”నిజమే కదా మరి, నిజమే వ్రాశాడు” అంది.

ఏ ”కుల స్త్రీ” అయినా భర్త పోయాక అతని స్మృతికి విఘాతం కలిగిస్తూ, అప్పటివరకూ ఏ మచ్చా లేని (అప్పటికి ఆమెకి 80 ఏళ్ళు) తన శేషజీవితానికి మచ్చని ఆమోదమిస్తూ ఇంకే కుల స్త్రీ అయినా అలా ఒప్పుకోగలదా అన్పించింది. ఇది చదవగానే నాకు మెరుపు కొట్టినట్లు ఇంకొకటి కూడా అన్పించింది. దేవదాసీ స్త్రీలకుండే స్వతంత్రత, ఎవ్వరికీ స్వాధీనపడని స్వతంత్రత సుబ్బులక్ష్మిలో భాగమయిందని, తనకు స్వాధీనం కాని ఆ స్వతంత్రురాలితో పేచీ పడుతూ, పెత్తనం చేస్తూ సదాశివం తన అశక్తతని ప్రదర్శించుకున్నాడని.

సుబ్బులక్ష్మి ఆర్థికంగా, సామాజికంగా తానెక్కిన అందలాలలో తానెప్పుడూ భాగం కాలేదు. గర్వమూ, సంపదా తనని స్వాధీనం చేసుకోనీయకుండా, ఎదుటి వ్యక్తుల పట్ల అనుకంపనలతోనే బతికింది. ‘భారతరత్న అంట, అదేందో వచ్చిందంటున్నారు’ అనగలిగింది. తన పాట వినేది అయిదేళ్ళ పాపయినా, ఒక కూలి అయినా, ఈ దేశ ప్రధానమంత్రి అయినా ఒకే ఇష్టంతో, తన్మయత్వంతో పాడేది సుబ్బులక్ష్మి.

ఉండడానికి, తినడానికి సరిపోయేంత డబ్బుంటే చాలనుకుంది సుబ్బులక్ష్మి. అన్నింటికంటే ముఖ్యం ఎదుటి వ్యక్తి ఆకలి గుర్తించడం, అందరికీ కడుపునిండా అన్నం దొరకాలనుకుంది. చిన్నప్పుడు పప్పు, అన్నం రోజూ తినాలని కలలు కన్న సుబ్బులక్ష్మి తనకు తెలిసి ఎవరి గురించీ ఏ చెడూ మాట్లాడని సుబ్బులక్ష్మి, ఎవ్వరికీ ఏ అపకారం చెయ్యని సుబ్బులక్ష్మి, అలా వుండడమే తన సంగీతం కన్నా గొప్పనుకున్న సుబ్బులక్ష్మి.

తేజోరూపమయిన ఆమె మోము, ఆ వర్ఛస్సు ఆమెకు తన సంగీతమే ఇచ్చింది. సంగీతంలో శ్రమించి, సంగీతంలో సేదదీరి, సంగీతమే తలపు, వలపై, ప్రయాణమూ సంగీతమై, ఆ సంగీతమే పరమావధియై సిద్ధి పొంది, ఆమె తనువు తేజరిల్లి, ‘అమ్మా, నాన్నా, అన్నా’ అని కడసారిగా తన వాళ్ళని గుర్తుచేసుకుంటూ వేల సంఖ్యలో తనవాళ్ళందరూ వెంట రాగా ఈ భారత రత్న ”మధురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి” ఆఖరి ప్రయాణం చేసింది.

 

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో