రచ్చ గెలిసి, యింటి మొగోల్లకు బలైన శక్తిశాలి ఎల్లమ్మ -జూపాక సుభద్ర

మొన్నీమధ్య మా మేనత్తవాల్లు ‘ఎల్లమ్మకు జేస్తున్నం, ఎల్లమ్మ బోనాలెత్తుతున్నమ్‌ ఓ పాలి రా బిడ్డా’ అని మనుమన్ని దోలిచ్చింది తీస్కరమ్మని. ఎందుకు ఫోను జేసినా వస్తముగదా మనిషినెందుకు తోలినవత్తాంటే, ఫోనుమీద బిలిత్తె మర్యాదగుంటదాంటది. అయినా బోనాలు ఆషాడంలనే అయిపొయినయిగదా మల్లేం బోనాలంటే… గయి సర్కారు బోనాలు బిడ్డా మనం ‘సావునం (శ్రావణం)’లనే జేత్తమన్నది. గుడులు లేని పల్లె నేపద్యాల నుంచి వచ్చిన మాకు దేవుడు భక్తి పూజలేముండయి, నమ్మకాలు గూడ లేవు. యీ పేరు మీద అందర్ని జూడొచ్చు, కలువొచ్చు, కలుబోసుకోవచ్చు అనే సంబురాల కోసం బొయిన.

మేము ఎల్లమ్మలోల్లము అని మా ముసలవ్వ (తల్లితల్లి) చెప్పేది. మా ముసలవ్వనే గాదు వూర్లె శూద్ర కులాలు గూడ మా యింటి యిలవేల్పు ఎల్లమ్మని చెప్పుకుంటరు. తెలంగాణంత ఎల్లమ్మకు బోనం జేస్తరు, కత జెప్పిస్తరు. డక్కలి, చిందు, ఒగ్గు, బైండ్లోల్లంత ఎల్లమ్మకతను జెప్తరు. అయితే శ్రావణం బోనాలప్పుడు బైండ్లాయినతోని కతజెప్పిస్తరు ముఖ్యంగా మాదిగలు. బైండ్లాయిన ‘డుబ్బు’ వాయిద్యంతోని ఎల్లమ్మ కతజెప్తడు. సీత కష్టాలు, చివరికి పీత కష్టాలు కూడా ఏకరువు బెట్టే ప్రధాన స్రవంతిలో ఎల్లమ్మ యెతలకు జాగుండది.

ఎల్లమ్మ బహుజన కులాల మహిళల బలాలకు, విలువలకు, శక్తియుక్తులకు ప్రతీక. ఉత్పత్తి కులాల మహిళల దుక్కాలకు, కష్టాలకు నిదర్శనం ఎల్లమ్మ. అణగారిన మహిళలు సామాజికంగా, కుటుంబపరంగా ఎదుర్కొనే జెండర్‌ వివక్షలకు ప్రతిబంబము ఎల్లమ్మ కత. హింసలు, ఆధిపత్యాలు, జులుంలు మగ సమాజం నుంచి ఎదుర్కొనే నిత్య యుద్ధాలు ఎట్లుంటయో చెప్పిన కత యెల్లమ్మ కత. గ్రామ దేవతల కతలని చెప్పే కతలు పుక్కిడి కతలు యివి చరిత్రలే.

పురాణంలో విన్న రేణుక ఎల్లమ్మ, పరశురాముడి కతకన్నా ఊల్లల్ల చెప్పే ఎల్లమ్మ కత భిన్నమైనది. యుద్ధంలో బాణాలు దిగి కొడిప్రాణంతో ఉన్న జమదగ్ని తన భార్య ఎల్లమ్మతో ‘ఎల్లమ్మా నన్ను బత్కించు కోవాలంటే ఏడంత్రాల బోనం వండుకొని రావాలె, మోచేతులతో దంచి కంటిరెప్పలతో చెరిగి, మోకాల్ల కుడుకుల మీద వండి, ఏడంత్రాల బోనాన్ని మద్యల యెక్కడ దించని, యెంగిలిగాని బోనం దెస్తే… యీ బాణాలనుంచి నా ప్రాణం బైటపడ్త, ఆ నిష్టలు లేని బోనం వ్యర్ధం, పనిజేయదని ఆంక్షలు బెడ్తడు. ఎల్లమ్మ జమదగ్ని బెట్టిన అలివిగాని షరతులకు, కష్టానికి ఓర్చి మోచేతులతో దంచి, కనురెప్పల్తో చెరిగి, మోకాళ్ళ కుడుకులమీద వండి ఏడంత్రాల బోనం జేసి తీస్కబోతుంటే భర్త జమదగ్ని ఒంటిల బాణాలు దించిన శత్రువులు ఆ నిష్ట చెడగొట్టనీకి పసిపిల్లల వేషాలతో ఆకలి, ఆకలని ఏడుస్తూ ఎదురొస్తే… బోనం దించగూడదు, బోనం కుండల అన్నందీసి పెడితే… ఎంగిలయితది, నిష్ట చెడుతది కాని ఆకలితో ఏడిచే పిల్లల్ని దాటుకొని రాలేదు. భర్త ప్రాణాలా, పసిపిల్లల ఆకలి తీర్చడమా అని చాలా మదనపడి సంఘర్షించి చివరికి సామాజికమైన మానవతనే చాటుకొని బోనం దించి పిల్లలకు అన్నంబెడ్తది. దానివల్ల జమదగ్నితో చాలా చీవాట్లు అవమానాలు పడ్తది. ఎంగిలి బోనం దెచ్చి వ్యర్థం జేసినవు నా ప్రాణాలు కాపాడలేకపోయినవు. నా వొంటిల దిగిన బాణాలు లాగి అయిదు దోసిల్ల నా రక్తం తాగి అయిదుగుర్ని సంతానంగా పొందు. అయితే పెద్ద కొడుకు పరశురాముడు పన్నెండేండ్లు వచ్చేదాకా తండ్రెవరో చెప్పొద్దు. బోనంలాగ నిష్ట తప్పి తండ్రెవరో చెప్తే నీ సంతానం సర్వనాశనమైతదని చెప్తడు ఎల్లమ్మకు.

భర్త కొడుకులు యెములై ఎల్లమ్మను బెట్టిన చిత్రవధలు, హింసల్ని బైండ్లాయిన చెప్తాంటె ఊరు వాడ ఆడోల్లు కంటికి మింటికి ఏకదారగా ఏడుస్తుంటరు. కొడుకు పరశురాముడు కొంత జ్ఞానమొచ్చిన్నుంచే మా తండ్రెవరో చెప్పు

‘ఉప్పు మిరపకాయ కోసం కోన్టోనిగ్గన్నవా, సీరెసారెల కోసం సాలోనిగ్గన్నవా, సొమ్ములకోసం అవుసలోనిగ్గన్నవా, కిర్రుచెప్పుల కోసం మాదిగోనిగ్గన్నవా ఎవరు మా తండ్రి’ అని కుళ్ళబొడిచే హింసలకు, అవమానపు మాటలకు తిట్లకు కత వినే ఆడోల్లంత శోకాల్దీసి ఏడుస్తరు.

తండ్రెవరో చెప్తే అదీ 12 సం||లు నిండకుండా చెప్తే… బాణాలు దిగి కొడిప్రాణాలతో ఉన్న తండ్రి పరిస్థితిని, ఆ పరిస్థితి కల్పించిన శత్రువుల్ని చెప్పాల్సి వస్తది. యుద్ధంచేసే వయసుకాదు అందికే కొడుకు బెట్టే మానసిక హింసను భరించలేక ఇల్లొదిలి పారిపోయి ఊర్లో వున్న సబ్బండ వృత్తి కులాల ఇండ్లకు బోతది. మీ సాకిరేవుల దాక్కుంటనని సాకలోల్లను, కుమ్మరి వాముల దాక్కుంటనంటది, సాలెం మగ్గంగుంటల, గౌండ్లతాల్లల్ల, కమ్మరి కొలిమిల, మంగలి పొదిల ఇట్లా పదకొండు కులాల శరణుకోర్తది. కాని ఎవరు కూడా ఆమెను దాసెదానికి భయపడ్తరు… ఆకరికి మాదిగింట్లకు బోతె… తోళ్ళు నానబెట్టే గోలెం (లంద)ల దాచిపెడ్తరు. పరశురాముడు వెంటాడి వేటాడి లందకాడికొస్తడు కాని ఎల్లమ్మ లందల్నించి బైటికి రాదు. చివరికి బైండ్ల డుబ్బు వాయిద్య పాటల్ల ఎల్లమ్మ లంద నుంచి విశ్వరూపంగా బైటకొచ్చే ఘట్టాన్ని చాలా ఉద్విగ్నంగా ఊగిపోయేటట్టు చెప్తరు కత. తర్వాత 12 సం||దాకా కొడుకుతో హింసలు బడి 12 సం||లు నిండినంక తండ్రెవరో చెప్తది ఎల్లమ్మ. కొడుకు, తండ్రి శత్రువుల్ని ఒక్కన్ని చంపితే వేలమంది పుడుతుంటే కొడుకు పరశురాముని బలం చాలకుంటే యుద్ధంజేసి వాల్లందర్ని మట్టుబెట్టిందట శక్తిగా విజృంభించి. శత్రుసంహారం జరిగినంక కొడుకుని పరీక్షించడానికి ‘నీ తల్లిని చంపి ఆమె తలని నా పాదాల దగ్గర బెట్టమంటడు’ తండ్రి జమదగ్ని. నిమిషాల మీద అట్లనే చేస్తడు కొడుకు పరశురాముడు.

ఎల్లమ్మ కత విన్నంక, ఎల్లమ్మ యెంత శారీరక, మానసిక దృఢత్వముగల మహిళగదా అనిపిచ్చింది. యుద్ధంల శత్రువుల్ని చంపి బైటి రాజ్యంలో గెలిచింది, కొడుకుని గెలిపిచ్చింది. కాని యింటి రాజ్యంలో, కుటుంబ రాజ్యంలో ఆమె శక్తియుక్తుల్ని కంట్రోలు చేసే మొగని కొడుకు జెండర్‌ ఈర్శాగ్నికి బలైపోయింది. ఆకలిగొన్న పిల్లల ఆకలి తీర్చి మానవోన్నతికి, బాధ్యతగా నిలిచింది. శత్రుసైన్యాన్ని మట్టి కరిపించిన మహా బలశాలి. యీ బలాలు కావాలిప్పుడు ఆడవాల్లకి.

 

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో