తలపుల తోవ-షౌకత్‌ కైఫీ – ఉమా నూతక్కి

1947 సంవత్సరం!!!

విలాసవంతమైన బంగళా. కారు, టెలిఫోన్‌, ఇంట్లో 12 మంది నౌకర్లను ఉంచుకునే సౌకర్యం ఉన్న ఒక ఉన్నతాధికారి కూతురు ఆ అమ్మాయి.

కమ్యూనిస్టు. బొంబాయి కమ్యూన్‌లో ఒక ఒంటరి గదిలో ఉండే అబ్బాయి…

ఆమె సున్నీ, అతను షియా. ఆ రోజులలో ప్రేమ ఊహించడానికే ఒక విప్లవం లాంటిది.

అయినా వాళ్ళ హృదయ గంటలు మోగాయి. గుండెల్లో ప్రేమ మొలకెత్తింది. హైదరాబాద్‌ అభ్యుదయ రచయితల సంఘం ముషాయిరా సందర్భంగా మారాకు తొడిగింది. రోజుకి ఆరేడు ఉత్తరాల సాక్షిగా బొంబాయికీ, హైదరాబాద్‌కీ వారధి కట్టింది.

అన్ని ప్రేమ కథల్లో లాగానే ఇక్కడా కొన్ని ఒడిదుడుకులు…. ఆమె కన్నీళ్ళు కార్చింది.

అతను రక్తంతో ఉత్తరం రాశాడు. ”ఏమో! రచయితలు ఏమన్నా చేయగలరు. అది మేక రక్తం కావచ్చు” ఆమె అబ్బాజాన్‌ అనుమానం.

”ఈ ప్రేమ ఎన్ని రోజులు ఉంటుంది… మహా అయితే ఒక నాలుగు నెలలు…” కాకలు తీరిన ఒక సీనియర్‌ కమ్యూనిస్టు యోధుని నమ్మకం.

కానీ…

వాళ్ళిద్దరూ తమ ప్రేమనే కాదు, తామేమిటో కూడా ప్రపంచానికి ఋజువు చేసుకున్నారు. దాదాపు 55 సంవత్సరాలు కలిసి జీవించారు.

ఉర్దూ సాహిత్య ప్రపంచంలో ధృవతారలా వెలిగిన కైఫీ, పలు హిందీ సినిమాలలో నటించిన ”సలాం బాంబే” ఫేం షౌకత్‌ సాహెబాల ”తలపుల తోవ” ఇది.

ఇది కేవలం ప్రేమ కథ అనుకోకండి. ఇద్దరు ప్రేమ మూర్తులు నిస్వార్థంగా ఈ సమాజానికి ఏం చేయగలరో చూపించే ఒక దర్పణం ఈ పుస్తకం.

”మన కాలపు కవి వేనవేల జీవితాలు జీవిస్తాడని” పాబ్లో నెరుడా అంటాడు. తలపుల తోవ చదువుతుంటే అది అక్షరాలా నిజం అనిపిస్తుంది. కైఫీ అజ్మీ పేరుతో ఉర్దూ సాహిత్య ప్రపంచంలో సుప్రసిద్ధమైన అక్తర్‌ హుస్సేన్రిజ్వీ, హిందీ నటి షౌకత్‌ సాహెబా జీవిత ప్రయాణం ఈ పుస్తకం.

1947లో అప్పటికే యువకవిగా ప్రసిద్ధుడైన కైఫీ అభ్యుదయ రచయితల ముషాయిరాలో పాల్గొనడానికి వచ్చి షౌకత్‌ ప్రేమలో పడతాడు. షౌకత్‌ది సంపన్న కుటుంబం. కైఫీది కూడా జమిందారీ కుటుంబమే అయినా అన్నీ వదిలి కమ్యూనిస్టు పార్టీలో పూర్తి కాలపు కార్యకర్తగా ఉంటూ నెలకు 30 రూపాయలతో ఒక కమ్యూన్‌లో ఉంటున్న పరిస్థితి. పైగా అతను సున్నీ, ఆమె షియా. షౌకత్‌ తండ్రి తప్ప వేరెవరూ ఆమె ప్రేమని ఆమోదించరు.

కైఫీ, షౌకత్‌ల మధ్య నడచిన ప్రేమలేఖలు మనల్ని మల్లెపూల తోటలో విహరింపచేస్తాయి.

”నా రాత్రులన్నీ చంద్రుడి కోసం తపన

నీ కనుబొమ మీద ఒట్టు, నువ్వే ఆ చందమామ

ఒక పువ్వు కోసం వెతుకుతూ తోటలన్నీ తిరిగాను

ఎర్రబారిన నీ కనుబొమ్మ మీద ఒట్టు, నువ్వే ఆ పువ్వువు

నా కవిత ఒక మాంత్రిక గీతం కోసం అన్వేషించింది

సమ్మోహనపరిచే నీ చూపుల్లో ఆ గీతం నాకు దొరికింది”

ఎలా ఉందీ కవిత. ఇలా ఒక అబ్బాయి, అదీ అప్పటికే తన మనసులో తిష్ట వేసుకున్న ఒక అబ్బాయి రాస్తే ఎలా ఉంటుంది? షౌకత్‌ కూడా అలాగే ప్రతిస్పందించింది.

కైఫీ…

మిమ్మల్ని అపారంగా ప్రేమిస్తున్నాను. నన్ను మీ దగ్గరికి రాకుండా ఆపగల శక్తేదీ ప్రపంచంలో లేదు. ఏ పర్వతమూ… ఏ నదీ… ఏ సముద్రమూ… ఎంత మంది జనాలూ… ఏ ఆకాశమూ… ఏ దేవతా… ఏ భగవంతుడూ, ఇంకా భగవంతుడికి తెలిసిన ఏదైనా నన్ను ఆపలేదు.

మీ,

మీకు మాత్రమే చెందిన

షౌకత్‌

అని ఆమె సమాధానం ఇచ్చింది.

నిజంగా అదే జరిగింది. అందరినీ ఎదిరించి ఆమె తండ్రి సహకారంతో వాళ్ళిద్దరూ ఒకటయ్యారు.

”తలపుల తోవ”లో షౌకత్‌, కైఫీల ప్రయాణంతో పాటు, కొన్ని దశాబ్దాల కమ్యూనిస్టు పార్టీ ప్రయాణం కూడా అంతర్వాహినిలా వర్ణింపబడుతుంది. కమ్యూనిస్టు పార్టీ చీలికను వ్యక్తిగత విషాదంగా భావించి కవిత్వంలో వ్యక్తీకరించినప్పటికీ, కైఫీ చివరి వరకూ కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం ఒక గర్వకారణంగా భావించే విలువలతోనే జీవించాడు. అయితే ఈ ప్రస్థానంలో ఎంత దుఃఖం, ఎంత ఉత్తేజం, ఎన్ని అనుభవాలు… 30 రూపాయిల కోసం వాళ్ళు పడిన కష్టం ఎంత చెప్పినా తక్కువే. వైద్యం చేయించలేక కొడుకు ఖయ్యూంని పోగొట్టుకున్నారు. కొడుకు పోయిన విషయం కూడా కైఫీకి చేరవేయలేని పరిస్థితి. ఎందుకంటే కైఫీ అప్పటికే పార్టీ కార్యకర్తగా అజ్ఞాతంలో ఉన్నాడు. అన్నీ తట్టుకుని ఎన్నోసార్లు పడిలేచారిద్దరూ.

సినిమా రంగంలోకి వెళ్ళినా ఆ జిలుగు వెలుగులు అంటకుండా చివరివరకూ నిరాడంబరంగానూ, కార్మిక వర్గ స్నేహితుడిగానూ గడిపాడు కైఫీ. తాను ఎదిగాక సమాజానికి తనకు వీలైన చిన్న సహాయమైనా చెయ్యాలని తపించాడు. తన గ్రామానికి వెళ్ళి అక్కడ విద్య, వైద్య చైతన్య కార్యక్రమాలు ప్రారంభించాడు.

ఇక షౌకత్‌ పృథవి థియేటర్లో పేరుపొందిన కళాకారిణి. వీరిద్దరూ తమ కలల పంటలైన షబానా, బాబీలని కూడా అంతే ఆదర్శంగా పెంచారు. ఈ ప్రయాణం అంతా తలపుల తోవలో వర్ణింపబడింది. ఉర్దూలో ”యాదోం కి రెహ్‌ గుజార్‌”గా షౌకత్‌ రాశారు దీన్ని. కైఫీ భౌతికంగా దూరమయ్యాక రాసిన పుస్తకం ఇది. తర్వాత ‘Kaifi & 1-A Memoin”గా ఇంగ్లీష్‌లోకి అనువాదమయింది. ఇప్పుడు ”తలపుల తోవ”గా తెలుగులోకి వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాలరావు గారు అనువదించారు. ఇన్ని భాషలు మారినా ఎక్కడా తన సహజత్వాన్ని కోల్పోయినట్లు అనిపించని రచన ఇది. అసలు షౌకత్‌ భావ వ్యక్తీకరణలోనే అంత శక్తి ఉందా అనిపిస్తుంది. తన భావాలు, అనుభవాలు వ్యక్తీకరించేటప్పుడు ఎక్కడా కూడా అతిశయోక్తిగా అనిపించదు.

ఈ పుస్తకాన్ని కేవలం ఒక అర్థ శతాబ్దపు ప్రేమకథా ప్రయాణంగా అనుకుంటే చాలా తప్పు చేసినట్లే. వారి ప్రయాణంతో పాటు కమ్యూనిస్టు పార్టీ ప్రస్థానం కూడా సమాంతరంగా పాఠకులతో ప్రయాణం చేస్తుంది. కమ్యూనిస్టు పత్రికలూ, కార్మిక సంఘాలూ, అభ్యుదయ రచయితల సంఘం, Indian Peoples Theatre, తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం నుండి పార్టీ చీలిక, దేశంలో జరిగిన మత కల్లోలాలు, వర్గ పోరాటంలో మధ్య తరగతి విచికత్స… ఇలాంటి ఎన్నో రాజకీయ, సామాజిక అంశాలు కదంబమాలలా అల్లుకుని మనతో ప్రయాణం చేస్తాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే ”తలపుల తోవ” ఒక ప్రేమ, జీవితం, అంకిత భావం, ఉత్కృష్టమైన జీవనం గడిపే విధానం… వీటన్నింటినీ మనకి బోధించే పాఠ్యపుస్తకం.

ఒక తెల్లటి మెత్తని పరుపు మీద కూర్చుని, వెండి పాత్రల్లో నింపిన మల్లెపూల సువాసనని పీలుస్తూ ఒక ప్రణయ భావాల గాథని రెండు స్వచ్ఛమైన మనసులు కలిసి ఈ సమాజానికి పంచిన ప్రేమని చూసుకున్నట్లుంటుంది ”తలపుల తోవ” చదువుతుంటే.

కావాలంటే కైఫీ తమ పెళ్ళి రోజున షౌకత్‌కి అంకితమిచ్చిన ఈ కవిత చదవండి…

స్త్రీ…

ప్రియతమా, లే, నాతో కలిసి నడవాల్సిన సమయమిదే

యుద్ధజ్వాలలు మన లోకాన్ని ముంచెత్తుతున్నాయి

కాలమూ విధీ ఒక ఆకాంక్షని ప్రకటిస్తున్నాయి

మన కన్నీళ్ళివాళ వేడి వేడి లావాలా ప్రవహిస్తాయి

అందానికీ ప్రేమకూ ఇవాళ ఒకటే జీవితం, ఒకటే ఆత్మ

నువ్విక నాతో కలిసి స్వేచ్ఛాజ్వాలలో కరిగిపోవలసిందే

లే నా ప్రియతమా, నాతో కలిసి నడవాల్సిన సమయమిదే

జీవన పోరాటంలో ఓరిమికి చోటు లేదు

జీవనాడి స్పందించేది కన్నీటితో కాదు, నెత్తురుతో

స్వేచ్ఛతోనే ఎగిరిపోగలవు, ప్రేమపాశంతో కాదు

నీ చెలికాడి కౌగిలిలో మాత్రమే కాదు స్వర్గం ఉన్నది

సంకెళ్ళు తెరుచుకుని నడువు, నాతో కలిసి స్వేచ్ఛాపథాన నడువు

లే నా ప్రియతమా, నాతో కలిసి నడవాల్సిన సమయమిదే

ఎక్కడికి వెళ్ళినా త్యాగం నీ కోసం వేచి ఉంటుంది

లొంగిపోవడమే నీ జీవిత మార్గాల్లో ఒకటి

నీ ఆకర్షణే నీ బంధం, లోకరీతులే నీ విషపాత్ర

ఈ రుతువులను మార్చెయ్యి, స్వేచ్ఛగా ఎగిరిపో

లే నా ప్రియతమా, నాతో కలిసి నడవాల్సిన సమయమిదే

అర్థమయింది కదా! కైఫీ తన ప్రేమ నుండి ఏమి ఆశించాడో… ఇద్దరూ కలిసి అది సాధించారు కూడా. కైఫీ తన ప్రపంచంలో షౌకత్‌కు ఇచ్చిన స్థానం, తమ ప్రయాణం గురించిన ఆశలు… తాము చేరుకోవలసిన గమ్యం… వీటన్నిటికీ దర్పణం ఈ కవిత.

‘తలపుల తోవ’ ద్వారా షౌకత్‌ చెప్పదలచుకున్నది ఇదే.

ఒక మనిషిని మరో మనిషి… ముఖ్యంగా ఒక స్త్రీని పురుషుడు చూసే విధానం చాలావరకూ తనకున్న అన్ని సదుపాయాలలాగా… తనూ ఒక సదుపాయమే అన్న భావనతోనే ఉండడం తరతరాల చారిత్రక సత్యం. మామూలు మనుషుల మధ్యనే కాదు ఇద్దరు ప్రేమికుల మధ్యన కూడా ఇది ఇలానే కొనసాగుతూనే ఉంటుంది. నాకు నచ్చినట్లుగా తానుండాలి అనే అభిప్రాయానికి పునాది ఈ భావనే. ఇది కాదు ప్రేమంటే…

ప్రేమంటే తాను నువ్వుగా, నువ్వు తానుగా మారటం కాదు. ప్రేమంటే తనని తనగానే… నిన్ను నిన్నుగానే ఉంచుకుంటూ ఒకరిలో ఒకరు ఐక్యం అవ్వడం.

అవును… ఎవరిని వారిగానే ఇష్టపడడంకన్నా ప్రేమకి నిర్వచనం ఏముందని?

ప్రొఫెట్‌లో ఖలీల్‌ జిబ్రాన్‌ అక్షరాలుగా చెప్పినదాన్ని చేతలుగా మనకి ఆవిష్కరించిన జంట కైఫీ… షౌకత్‌.

ఈ పుస్తకం నిజంగా ఒక అద్భుతం. ఆర్ద్రమైన స్పందనలున్న ప్రతి మనిషీ చదివి తీరాల్సిన గొప్ప పుస్తకం ”తలపుల తోవ”.

 

 

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో