ఆడబ్రతుకు (అనువాదం: చిమ్మపూడి శ్రీరామమూర్తి) – ప్రేమ్‌చంద్‌

అయోధ్యనాధ పండితుడు అకస్మాత్తుగా స్వర్గస్థులయిన మాట విని అందరూ అనుకున్నారు ”భగవంతుడిస్తే మనిషికలాటి చావే ఇవ్వాలి” అని. అయోధ్యనాధులకు నలుగురు కుమారులూ, ఒక్క కూతురు! మగవాళ్ళు నలుగురికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఇహ ఏమైనా, ఆడపిల్ల కుముద మాత్రం పెళ్ళికి ఎదిగి ఉంది. ఆస్తీ తగినంత ఉండనే ఉంది. చక్కని విశాలమైన భవంతి, రెండు పెద్ద తోటలు, ఐదారువేల ఖరీదైన నగలు, ఇరవై వేల నగదు చూపించి మరీ కన్నుమూశాడా పుణ్యాత్ముడు.

భర్తను కోల్పోయిన తరువాత ఫూల్‌మతికి అంతా అంధకారమే కళ్ళకెదురైంది. చాలారోజుల వరకు నిద్రాహారాలే జ్ఞాపకం రాలేదామెకు. కాలక్రమంగా, చేతికందిన నలుగురు కొడుకుల్నీ చూసుకుని వాళ్ళ భవిష్యత్తును గూర్చిన ఆలోచనలలో పడి కొంత దుఃఖాన్ని దిగమింగుకోగలిగింది. ఒకరికన్నా మరొకరు యోగ్యులనిపించుకునే వాళ్ళే ఆ నలుగురు కుమారులూనూ. ఇహ, కోడళ్ళందరూ అత్తగారే పని చెబుతుందా, ఎప్పుడు చేసి ఆమె మెప్పు పొందుదామా అని ఎదురు చూసేవారే! అందుచేతనే ఆ ఊళ్ళో సుఖపడే తల్లి అయినా, అత్త అయినా ఫూల్‌మతీ దేవి తరువాతనే అని అందరూ అనుకునేవారు.

ఫూల్‌మతీదేవి పెద్దవాడు ”కామతా”. ఏదో ఆఫీసులో యాభై రూపాయల క్లర్కు. రెండోవాడు

ఉమానాధుడు డాక్టరీ ప్యాసయి, ఎక్కడైనా ఆసుపత్రి తెరిచే ప్రయత్నంలో ఉన్నాడు. మూడోవాడు దయానాధుడు బి.ఎ. తప్పి పత్రికలకు కథలు వ్రాస్తూ అంతో ఇంతో సంపాదిస్తున్నాడు. ఇహ చివరివాడు సీతానాధుడు అందరిలోకీ తెలివైనవాడూ, చురుకైనవాడూ! ఈ సంవత్సరమే బి.ఎ. ఫస్టు క్లాసులో ప్యాసయి ఎం.ఎ.కు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. ఎవరిలోనూ సంకుచితత్వమూ, స్వార్థమూ మచ్చుకైనా కనిపించవు. తండ్రి మాట వినపడితేనే గడగడలాడిపోయేవారు. ఆయన మరణానంతరం స్వేచ్ఛను బాగా ఉపయోగించుకోసాగారు. తిజోరి తాళపు చెవులు పెద్ద కోడలి దగ్గర ఉన్నా ఫూల్‌మతి దేవే ఆ ఇంటికి యజమానురాలు. ఆమె ఆజ్ఞ లేనిదే ఆ ఇంట్లో ఎవరికీ మిఠాయైనా కొని ఇవ్వడానికి వీలులేదు.

…….ఙ…….

ఆ రోజు, అయోధ్య నాధులు గతించిన పన్నెండవ రోజు. సాయంత్రమైంది. మర్నాడే సంతర్పణ జరగవలసి ఉంది. బజారునుంచి లోపలికి మనుషులు తెస్తున్న సామాను చూస్తూ నిలుచుంది ఫూల్‌మతి. నేతి డబ్బాలు, పంచదార బస్తాలు, కూరగాయల బుట్టలు, పప్పులూ, ఉప్పలూ, వంట పాత్రలు, కొత్త బట్టలు… కావలసిన సామానంతా లోపలికి వస్తోంది. కాని మునుపటిలా తనకు చూపకపోవడంతో ఫూల్‌మతికి అమితమైన ఆశ్చర్యం కలిగింది. భవిష్యత్తును గూర్చిన అమంగళప్రదమైన సూచన ఏదో ఆమె మనస్సులో ఉత్పన్నమైంది. మొదటినుంచి పద్ధతి ప్రకారం, ఆమె చెప్పిన మేరకే సామాను తేవలసి ఉంది. ఆమెకు నచ్చని వస్తువులకా ఇంట్లో స్థానంలేదు. నలభై యేండ్లుగా స్వల్ప విషయం దగ్గర్నుంచీ అన్ని పనులూ ఫూల్‌మతి అంగీకారం పొంది మరీ జరుగుతున్నాయి ఆ ఇంట్లో! ఆమె వందా అంటే వందా, ఒకటీ అంటే ఒకటీ ఖర్చయ్యేది. ఆఖరికి అయోధ్యనాధులు కూడా ఆమె గీసిన గీటు దాటేవాడు కాదు. అటువంటిది – ఈ రోజు అకస్మాత్తుగా ఎందుకిలా విరుద్ధంగా జరుగుతూంది? తను చెప్పిన సామానంతా రావడమే లేదు, అన్నీ సగం సగమే వస్తున్నాయి. తన ఆజ్ఞను అభ్యంతరపరచినదెవ్వరు? ఎందుకు ఈ వాతావరణం ఏర్పడింది? చూస్తూ, చూస్తూ ఈ పరాభవతాపాన్ని ఎలా భరించగలదు? ఎక్కువసేపక్కడ నిలుచోలేకపోయింది. లోపల దహించుకుపోతున్న కోపాన్ని అణచుకోలేక వెంటనే కామతా వద్దకు వచ్చి అంది – ”గోధుమపిండి నేను ఐదు బస్తాలు చెబితే మూడు బస్తాలు తెచ్చారేంరా? నెయ్యి ఐదు డబ్బాలు తెచ్చారు – రెండు పూటలకైనా రాదు. ఏమిటీ దారుణం! బావి తవ్వుకున్నవాడే మంచినీళ్ళు నోచుకోలేకపోయాడురా! ఛీ! తండ్రి పేరును చెడగొడుతున్నారర్రా!”

కామతా చలించలేదు. తన తప్పు ఒప్పుకోలేదు కూడా! ”మేమంతా మూడు బస్తాల గోధుమపిండే చాలనుకున్నాము. ఆ ప్రకారంగానే మిగతావి కూడా తెప్పించాము” అన్నాడు.

తన మాటలు విని తప్పును సర్దుకోకపోగా అవాంఛనీయ ఈ సమాధానం కామతా నుంచి వచ్చేసరికి ఫూల్‌మతి క్రోధంతో కంపించిపోయింది.

”ఎవరి అభిప్రాయానుసారం జరిగిందిది?”

”మా అభిప్రాయాను సారం”.

”అయితే నన్నడగవలసిన అవసరమే లేదనుకున్నారా?”

”ఎందుకు లేదూ! …అమ్మా! అయినదానికీ, కానిదానికీ ఎందుకలా అనవసరంగా ఆవేశపడతావు? మా లాభనష్టాలు మాకు మాత్రం తెలియవా చెప్పమ్మా!”

ఈ మాటలకు ఫూల్‌మతి నిశ్చేష్టురాలైంది. అర్థంలేని చూపులు చూస్తూ నిరుత్తరియై కొంతసేపలాగే ఉండిపోయింది… ”లాభనష్టాలు!!” తమ లాభనష్టాలకు ఈ రోజు తాము బాధ్యులైనారు కాబోలు! నాటి నుంచీ ఇంత ఆస్తిని కళ్ళల్లో పెట్టుకుని, నిలుపుకొని, ఇన్నాళ్ళదాకా బాధ్యత వహించిన తన అవసరం, ఆదేశం నేటికి ఆ ఇంట్లో ఎవరికీ గుర్తింపు లేకుండా అదృశ్యమైపోయాయి. అయినా వాళ్ళకేం తెలుసు? కుర్ర వెధవలు! వాళ్ళ మాటలు పట్టించుకొని తనొక మూల కూర్చుంటే ఉన్న ఆస్తిని అవివేకంతో హారతి కర్పూరంలా హరించివేసి చివరికి వాజమ్మలై వీథులవెంట తిరగవలసింది వాళ్ళు! కన్నందుకు ఆ చెడ్డ పేరు ఇక తల్లిదండ్రులకు చుట్టుకుంటుంది-

ఫూల్‌మతి కొంచెం ఆవేశం తగ్గించుకుని అంది – ”ఈ సంసారం లాభనష్టాలు మొదటి నుంచీ నేను చూస్తున్నాను. నాకు తెలియకుండా ఏమీ జరగడంలేదు. ఈ విషయాల్లో నాకు మీకంటే అనుభవం ఎక్కువే ఉన్నదన్న మాట మాత్రం మరిచిపోవద్దు. అనుచితమైన ఆలోచన, పని ఎప్పుడూ నేను చేయను. అనవసరంగా జోక్యం కలుగజేసుకుని ప్రసంగాన్ని పెంచకు. వెళ్ళి మరో రెండు బస్తాల పిండి, ఐదు డబ్బాల నెయ్యి పట్టించుకు రా! ఇలాంటి సందర్భాలలో కక్కుర్తి పడితే నలుగురిలో రేపు తలెత్తుకుని తిరిగే యోగమే ఉండదు. ఇకముందిలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం వేయకు” అంటూ తన గదిలోకి వచ్చేసింది.

తానన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని అనవసరంగా ఆవేశపడ్డానేమో ననిపించింది ఫూల్‌మతికి. అన్నిటికీ అమ్మనెందుకు అడిగి విసిగించాలని వాళ్ళే ఆ పని చేసి ఉంటారనుకుంది. అంతటితో ఆ సంబంధమైన ఆలోచనలు చేయడం మానుకుంది.

కానీ, కాలం గడిచినకొద్దీ, ఫూల్‌మతికి తన పరిస్థితి అవగతం కాసాగింది. మొదట తనకున్న అధికారమూ, ప్రాముఖ్యత ఎవరూ గుర్తించుతున్నట్లు ఆమెకు తోచలేదు. తన సలహా లేకుండానే ఇంట్లోకి వస్తోంది, ఖర్చవుతోంది. పెద్ద కోడలీ వ్యవహారమంతా చూసుకుంటోంది. తననెవరూ పలకరించరు. బయటినుంచి ఎవరైనా అతిథులు, మిత్రులు వచ్చినా కామతాతోను, పెద్ద కోడలితోను మాట్లాడి వెళ్ళిపోతారు. తన అవసరం ఎవ్వరికీ లేదు. ఏమిటీ నిర్లక్ష్యం? ఎందుకీ మార్పు? ఫూల్‌మతికేమీ అర్థం కాలేదు. ఆమెలో రేగిన ప్రతి ప్రశ్నా ప్రశ్నగానే

ఉండిపోయింది.

ఒకరోజు పెద్ద కోడలు ఒక్కతే తిజోరి తెరిచి డబ్బు తీసి లెక్కపెడుతోంది. పెద్ద మొత్తం కావలసి వచ్చినప్పుడే అది తెరవడం జరుగుతూ ఉంటుంది. ఫూల్‌మతి అది చూసి ఉండలేక దగ్గరికి వచ్చి – ”డబ్బుతో ఇప్పుడేమి పని వచ్చిందమ్మా” అంది ప్రశాంతంగానే.

”బజారు నుంచి సామాను, బట్టలు వచ్చాయి. వాటికయిన ఖర్చు ఇవ్వక్కర్లేదూ!” అంది కోడలు.

”సామానెంత వచ్చింది? వాటి ఖరీదులెలా వేశారు? వచ్చిన సామాను సరియైనదేనా? – ఇవన్నీ చూసుకోకుండా డబ్బిచ్చేస్తే సరా?”

”అవన్నీ అప్పుడే చూసుకున్నారు. లెక్క కూడా చేశారు”

”ఎవరు చేశారు?”

”అదంతా నాకేం తెలుసు? వెళ్ళి మగవాళ్ళనడగండి. డబ్బు తెమ్మన్నారు. తీసుకువెడుతున్నాను” అంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది పెద్ద కోడలు. ఫూల్‌మతి నోట మాట రాలేదు. ఆ రోజు తన భర్త సంవత్సరీకం. ఇంటినిండా చుట్టాలు, అతిథులు కిటకిటలాడిపోతున్నారు. ఏమన్నా మాట్లాడితే వాళ్ళు బయటికి వెళ్ళి ఇంటాయన పోగానే ఆ ఇంట్లో ఆడవాళ్ళు రోజూ పోట్లాడుకుని చస్తున్నారని ప్రచారం చేస్తారు, ఇలా ఆలోచించి ఆమె తన గదిలోకి వెళ్ళి మౌనంగా కూర్చుంది. కానీ ఆమె మనస్సు మనస్సులో లేదు. మంచి మనస్సుకు క్షణం తీరిక ఉండదు. శత్రువుల కోసం కూడా తాపత్రయపడుతూనే ఉంటుంది. మనస్సులో తనవాళ్ళంతా తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆవేదన – తన ఇంటికి వచ్చేవాళ్ళందరికీ మర్యాదలలో ఏ లోపం జరుగుతుందోనన్న ఆందోళన. ఎక్కడ వంట పదార్థాలు కుదరవో, వచ్చిన వాళ్ళందరికీ కూర్చునే ఏర్పాట్లు ఎక్కడ చేశారో, ఇదే ఆమె దుగ్ధ. అంతవరకూ తన ఇంటికి వచ్చి వేలు ఎత్తి చూపిన వాళ్ళొక్కరూ లేరు. ఇకముందు ఏమవుతుందోనని ఆమె బాధ.

వరండాలోను, పందిరి కిందను వచ్చిన బంధువులంతా కూర్చున్నారు. ఐదు వందల మందికి ఆ చోటు చాలలేదు. ఒకళ్ళ పక్క ఒకళ్ళు ఒదిగి కూర్చున్నారు. విస్తళ్ళు ఒకటినంటి ఒకటి వేయబడ్డాయి. వడ్డించిన పదార్ధాలన్నీ చల్లారిపోతున్నాయనీ, కూరలలో ఉప్పులూ, కారాలూ సరిపోలేదనీ, ఎక్కువయ్యాయనీ ఇష్టం వచ్చినట్లు కేకలేస్తున్నారు. అవి వినిపించుకునే వారొక్కరూ లేరక్కడ. చివరికి విసుగేసి అతిథులంతా భోజనాలు పూర్తి చేయకుండానే చేతులు కడుక్కుని లేచి చక్కా పోయారు. ఆ దృశ్యం ఫూల్‌మతి హృదయాన్ని కలచివేసింది.

ఇక ఫూల్‌మతి అలా కూర్చోలేకపోయింది. వెంటనే బయటకు వచ్చి కామతాను అడిగింది – ”ఏం జరిగింది కామతా? వాళ్ళెందుకలా కేకలేస్తూ వెళ్ళిపోయారు?!” కామతా ఏమీ మాట్లాడకుండా అక్కడినుండి మెల్లగా జారుకున్నాడు. మిగతా వాళ్ళంతా ఒకరిమీద ఒకరు నేరాలు మోపుకుంటున్నారు. పెద్ద కోడలు చిన్న కోడలి మీద అరిచింది. చివరికి అంతా కలిసి ఆడబిడ్డ కుముద మీద విరుచుకుపడ్డారు. కుముద యజ్ఞం ముందు బలిపశువులా నిల్చుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూంది. ఫూల్‌మతి హృదయాన్ని ఎవరో బల్లాలతో పొడిచి వేస్తూన్నట్లయింది. లోలోపల రగులుకుంటున్న క్రోధానలాన్ని ఒక్కసారిగా బయటికి వెడలగ్రక్కింది – ”మీ నోట్లో దుమ్ము పడిపోను! బయట మరెక్కడా ఎవరికీ ముఖం కనిపించకుండా చేశారు. పోయి ఆ యేట్లో పడి చావండి. పరువును పోగొట్టుకున్న ప్రాణం ఉంటే యేం? పోతే యేం? దద్దమ్మలు! సిగ్గూ ఎగ్గూ ఉంటేనా? ఒకప్పుడు ఘనంగా బతికి అతిథుల సుఖమే తన సుఖముగా భావించిన మహానుభావుడి కడుపున మీలాంటి పశువులు పుట్టినందుకు కుమిలి ఛస్తున్నాను. ఇహ ఈ ఇంటి గడప కూడా ఎవడూ తొక్కడు.”

ఈ మాటలు బయట నిలుచుని వింటున్న కామతా తిరిగి లోపలికి వచ్చి ”అబ్బబ్బ ఊరుకో అమ్మా! ఏదో పొరపాటు జరిగిపోయింది. అంత మాత్రం చేత ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోవాలా? తప్పులు చేయడం సహజమే ఎవరికైనా!” అన్నాడు.

మళ్ళీ కోడళ్ళంతా కుముద మీద నేరాలు మోపబోతూ ఉంటే కామతా వాళ్ళను మందలించాడు – ”ఇందులో ఏ ఒక్కరిదో తప్పు కాదు. అందరూ తప్పు చేశారు. ఎవరూ తమ బాధ్యతలను సరిగ్గా గుర్తించలేదు. అలాంటప్పుడు ఒకరినొకరు అనుకోవలసిన పనేముంది? మీరిహ లోపలికి వెళ్ళండి” అన్నాడు అంతటితో ఆ ప్రసక్తిని ఆపుజేయ ప్రయత్నిస్తూ.

ఫూల్‌మతి మరేమీ మాట్లాడ కుముదను దగ్గరకు జేర్చుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది.

…….ఙ……..

రెండు నెలలు గడిచాయి. ఆ రోజు రాత్రి భోజనాలు చేసి అన్నదమ్ములు నలుగురూ వరండాలో కూర్చుని కుముద వివాహం విషయం మాట్లాడుకుంటున్నారు. ఒకరి మాట మరొకరికి సరిపడడం లేదు.

కామతానాధుడు కనీసం ఐదువేల కట్నమైనా ఇవ్వడానికి సుముఖంగా లేడు. ఉమానాధ్‌కు ఆసుపత్రి కట్టించడానికి అయిదువేలు కావాలి. చెల్లెలి పెళ్ళికి తన వంతు ఇచ్చేందుకు ససేమిరా ఒప్పుకోలేదు. దయానాధ్‌కు పెద్ద పత్రిక ఒకటి సొంతంగా తీయాలని ఉంది కనుక తనేమీ ఇవ్వలేనన్నాడు. పెద్ద కోడలు వచ్చి తమలపాకులు చుట్టి కామతాకు అందిస్తూ- ”అదృష్టమున్న పిల్ల దరిద్రుల ఇళ్ళల్లో ఉన్నా సుఖపడుతుంది” అంది. కామతా భార్య మాటలను వెంటనే సమర్థించాడు. ”మా బాగా చెప్పావు. ఇంకా సీతానాధ్‌ పెళ్ళి కావలసి ఉంది. ఈ ఖర్చింతటితో ఆగేదా?” చివరి వాడు సీతానాధ్‌ కొంచెం ఎడంగా కూర్చుని అన్నల అసహ్యకరమైన చర్చలు వింటూనే ఉన్నాడు. చర్చలో తన పేరు రాగానే అన్నాడు – ”నా పెళ్ళి గురించి మీరెవరూ ఆలోచించనక్కర్లేదు. ఉద్యోగంలో చేరిందాకా నాకు పెళ్ళి అక్కర్లేదు. ఆ మాటకొస్తే నేను పెళ్ళే చేసుకోను. నాకు వచ్చే భాగమంతా కుముద వివాహానికి ఖర్చు పెట్టండి. చెల్లెల్ని మురహరిలాల్‌ గారికి ఇద్దామనుకున్న తరువాత ఆ సంబంధం విరమించుకోవడం మంచిది కాదు.”

”మరి పదివేలెక్కడ తేవాలి?” అన్నాడు ఉమా ఆవేశంగా.

”నేను నా వాటా ఇస్తున్నాగా?” అన్నాడు సీతానాధుడు.

”అయితే మిగతా డబ్బు?”

”కట్నం కొంచెం తగ్గించమని మురహరిని ప్రాధేయపడితే కాదనడు”.

”సీతా! నీకు ముందుచూపు లేదురా! వచ్చే ఐదువేలూ దాని పెళ్ళికి ఖర్చు పెడితే రేపు నీవు పారిస్‌ వెళ్ళడానికి డబ్బెలాగ?” అన్నాడు కామతా.

”అన్నయ్యా! నేను విదేశాలకు వెళ్ళడమైనా మానుకుంటాను గాని ఒక్కగానొక్క ఆడకూతురి వివాహం ఇలా సామాన్యంగా జరిగిపోవాలనేది మాత్రం హర్షించలేను” అన్నాడు సీతానాధుడు.

”మంచి కట్నమిచ్చి పెద్ద ఇంటి కోడల్ని చేయగానే మన పిల్ల సుఖపడుతుందనుకోవడం వట్టి భ్రమరా సీతా! …నువ్వు లక్ష చెప్పు. ఈ పెళ్ళికి అన్నీ కలిపి వెయ్యి రూపాయలకు మించి ఖర్చు పెట్టడం ఏ మాత్రం ఉచితం కాదు.”

”అమ్మ సలహా కూడా అడిగితే మంచిదేమో” అన్నాడు దయానాధుడు.

వెంటనే కామతా అందుకున్నాడు-”చాల్లే, నీదంతా చాదస్తం! నాన్నగారు పోయినప్పటి నుంచీ అమ్మకసలు మతే పోయింది. మురహరి తప్ప కుముదకు తగిన వరుడు లోకంలోనే లేడనుకుంటూంది. ఇల్లు గుల్లయినా సరే, ఆ సంబంధమే చేయాలని ఆమె పిచ్చి”.

”మరేం లేదు… అలాగైతే అమ్మతో సంప్రదించినట్టూ ఉంటుంది. పదివేల ఖరీదైన నగలూ వస్తాయి అని” అన్నాడు దయానాథుడు యుక్తిగా. ఈ మాటలు వినేసరికి కామతా ముఖంలోకి కొత్త కాంతి వచ్చి చేరింది. కానీ కుముద పెళ్ళి విషయం తల్లితో చర్చించడం మాత్రం అతనికి సుతరామూ ఇష్టం లేదు. తరువాత వ్యవహారం తనే చెబుతానన్నటు ఉమానాధునీ, దయానాధునీ వెంటబెట్టుకుని సీతవంకనైనా చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు కామతా!

…….ఙ……..

ఆ రాత్రి ఫూల్‌మతి భోజనం చేసి మంచంమీద మేనువాల్చగానే ఉమానాధుడు, దయానాధుడు వచ్చి ఆమె ప్రక్క చెరొకవైపు కూర్చున్నారు. వాళ్ళ ముఖకవళికలను చూసి ”ఏమిటో అలా ఉన్నారు?” అంది ఫూల్‌మతి.

పత్రికల్లో వ్యాసాలు రాయడమంటే కత్తిమీద సామేనమ్మా. ఎక్కడ ఏ లోపం కనిపించినా పట్టుకుని జైలులోకి నెడతారు. మన దయా మొన్న ఏదో వ్యాసం వ్రాశాడట. పోలీసుల దృష్టిలో పడనే పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నదట. ఐదువేల జమానతు రేపటిలోగా చెల్లించకపోతే వీడిని అరెస్టు చేసి తీసుకువెడతారట. పదేండ్లకు తక్కువ శిక్ష పడేట్టు లేదు” అన్నాడు నెమ్మదిగా ఉమానాధుడు.

ఫూల్‌మతి గుండెల్లో రాయిపడినట్లయింది. అకస్మాత్తుగా వచ్చి పడిన ఈ అవాంతరానికామె ఎంతో దుఃఖించింది. ఎంతపని చేశావురా నాయనా! అసలే మన రోజులు బాగుండలేదు అంది దయాను దగ్గరికి తీసుకుని.

”నేనేమంత చెడ్డగా వ్రాయలేదమ్మా… అయినా ఇప్పుడేమనుకుంటే యేం? నా కర్మ ఇలా

ఉన్నపుడు” అన్నాడు దయానాధుడు తలవంచుకుని.

”మరయితే కామతాకు చెప్పావా ఈ సంగతి?”

”అన్నయ్య సంగతి నీకు తెలియనిదేముందమ్మా? ఆయనకు ధనం ముందు మాన ప్రాణాలు లెక్కలోనివి కావు”.

ఆ మాటలలో అసత్యమేమీ గోచరించలేదు ఫూల్‌మతికి. కొంచెంసేపాలోచించి ఒక నిర్ణయానికి వచ్చి – ”ఈ నగలు తాకట్టు పెట్టి జమానతు ఇచ్చేసిరా!” అంటూ తన మెడలోని నగలు తీయడం మొదలుపెట్టింది.

దయా తల్లిని వారిస్తూ – ”అమ్మా! ఏమిటీ పని? నీ వంటిమీద నగలు తీసుకువెళ్ళమంటావా? వద్దమ్మా వద్దు! పడితే పడింది శిక్ష. ఆ పని మాత్రం చేయనమ్మా!” అన్నాడు దయానాధుడు లేని దుఃఖం ప్రకటిస్తూ.

”ఏం మాటలురా అవీ? ఇంక నువ్వేమీ మాట్లాడకు. ముందివి తీసుకుపో. కన్నబిడ్డను కాపాడలేని సొమ్మును ఏ తల్లీ ఆశించదురా!” అంటూ మొత్తం నగలన్నీ మూటగట్టి అందించింది. దయా ఎంతోసేపటికి గాని ఆ మూట తీసుకోలేదు. సొమ్మును చేజిక్కించుకోవాలన్న తాపత్రయంతో తల్లి దగ్గర అపరిమితమైన సహృదయతనూ, దైన్యమునూ ప్రదర్శిస్తున్నాడు. చెమర్చిన అతని కనులలోని విషాదం వెనుక విషసర్పాలు బుసలు కొడుతున్నాయన్న సంగతి అమృతమూర్తియైన ఫూల్‌మతి మాతృ హృదయానికి సహజంగానే తెలియలేదు మరి. ఫలవంతమైన వృక్షం రాళ్ళు రువ్వే వాడికి పళ్ళనే ఇచ్చినట్లు శిష్టులతో సమానంగా దుష్టులైన బిడ్డలకు కూడా తల్లి తన అమృతాన్ని అందిస్తుందన్న విషయం మూర్ఖుడైన దయానాధుడికి కూడా సహజంగానే తెలియలేదు.

తల్లి ఇచ్చిన నగలను చేతపట్టుకుని తీయని కలలు కంటూ ఉమానాధుడు, దయానాధుడు వడివడిగా బయటికి వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళుగా తన ఉనికినైనా గుర్తించని తన బిడ్డలకీ నాటికైనా తన అవసరం కలిగిందన్న సంతృప్తితో, తేలికపడిన హృదయంతో నిట్టూర్చి ఫూల్‌మతి ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది.

…….ఙ……..

మరో మూడు నెలలు గడిచాయి. తల్లి ఇచ్చిన నగలనమ్మి వచ్చిన డబ్బుతో నలుగురు అన్నదమ్ములూ చేతులు కడుక్కున్నారు. మళ్ళీ కొంత డబ్బు కావలసి వచ్చింది. అందుకు ఈ సారి మరో ప్లాను వేశారు. తల్లి మనసు నొప్పించవద్దనీ, కొంతకాలంపాటు ఆమెపట్ల వినయమూ, భక్తీ ప్రదర్శించమని భార్యలకు చెప్పారు. ఈ ప్రయత్నమంతా తల్లిచేత ఒక తోట అమ్మించడానికి! చివరికెలాగైతేనేం? యుక్తిగా నాటకమాడి ఫూల్‌మతి చేత తోట అమ్మించనే అమ్మించారు.

ఒకరోజు ఫూల్‌మతి కొడుకులను పిలిచి అంది ”తల్లిదండ్రుల సంపాదనలో కొడుకులతో పాటు కూతుళ్ళకి కూడా భాగముంటుంది కదా! మీకు 16 వేల ఖరీదైన తోట, 25 వేల విలువ చేసే ఇల్లు ఉన్నాయి. 20 వేల నగదు ఉంది. వీటిలో కుముదకు భాగమే లేదర్రా?”

ఈ మాటలు విని కామతా వినయం తెచ్చిపెట్టుకుని పలికాడు. ”అమ్మా! కుముద నీకు కూతురైతే మాకు చెల్లెలు కాదా చెప్పు! ముందు ముందు దానితో మాకు సంబంధ బాంధవ్యాలెక్కువుంటాయి. సాధ్యమైనంత వరకు దానికే ఇబ్బందీ రానీయము. కుముదకు ఆస్తిలో భాగం ఎలా ఉంటుంది? అయినా ఇప్పుడా ప్రసక్తి దేనికి? ఐదువేలు దాని పెళ్ళికి ఖర్చు పెట్టడమే అనవసరమని గానీ-”

”ఐదువేలు కాదు పదివేలయినా సరే ఖర్చు కావలసిందే”-ఫూల్‌మతి కోపాన్ని అణచుకోలేకపోయింది – ”కుముద పెళ్ళి మురహరిలాల్‌తో జరిగి తీరవలసిందే! ఇది నా భర్త సంపాదించిన ఆస్తి. దీన్ని చచ్చి చెడి చెదిరిపోకుండా నిలుపుకున్నాను. నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతాను. మీరు వచ్చిన గర్భంలోనుంచే కుముదా వచ్చింది. నాకు మీరొకటీ, కుముద ఒకటీ కాదు. ఇరవై వేల నగదులో ఐదువేలు తీసి దాని పెళ్ళి చేస్తాను. చూస్తూండండి”.

ఇహ కఠినంగా మాట్లాడవలసిన సమయం వచ్చిందనుకున్నాడు కామతా. మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పివేశాడు, బయటపెట్టాడు – ”అమ్మా! నీవనవసరంగా మొండి పట్టుదల పడుతున్నావు. నీదని భ్రమపడుతున్న ఈ ఆస్తిలో నుంచి చిల్లిగవ్వయినా నీవు మా అంగీకారం లేకుండా ఖర్చు పెట్టలేవు”.

”అవును ఈ ఆస్తి మీదే! కాని నేను చచ్చిన తరువాత”.

”కాదు” వెంటనే ఉమా అందుకున్నాడు. ”నాన్నగారు పోయిన మరుక్షణం నుంచీ ఇది మాదే! అసలు చట్ట ప్రకారమూ అంతే!”

ఫూల్‌మతి కళ్ళనుండి అగ్నికణాలు కురుస్తున్నాయి. ఆమె శరీరంలోని అణువణువునా ప్రవహిస్తున్న ఆవేశమునూ, క్రోధమునూ ఇక ఆపుకోలేకపోయింది –

”ఈ ఇల్లు నాది, సంపద నాది, ఈ సంసారాన్ని ప్రశాంతంగా ఒడిదుడుకులు లేకుండా పెంచింది నేను. మిమ్మల్ని కని, పెంచి పెద్ద జేసింది నేను. ఈ రోజు నేను మీకు భారమైపోయాను, చేదైపోయాను. మీ తోడబుట్టిన చెల్లెలు పరాయిదై పోయింది. పైగా చట్టం కూడా అదే చెబుతూందిట… సరే! మంచిది… మీ వాటాలు మీరు తీసుకోండి. ఇంత బ్రతుకు బ్రతికీ ఈనాడింత గంజికోసం మీ పంచన పడిగాపులు గాయవలసి వచ్చిందన్నమాట! భవిష్యత్తును ఏ మాత్రం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు కొడుకులు ఆస్తిని అమ్మి సర్వనాశనమవుతూంటె, ఆ ఆస్తిని చెమటోడ్చి సంపాదించిన తల్లిదండ్రులకు కేవలం చూస్తూ కూర్చునే అధికారమే ఇస్తే ఆ చట్టం ధ్వంసమైపోవాలనే కోరుకుంటారెవరైనా!” అంటూ ఆమె అక్కడినుంచి లోపలికి వచ్చేసింది. కొడుకుల మనసులను గప్పిన స్వార్థ వచాలను ఫూల్‌మతి మాటలిసుమంతైనా కదిలించలేకపోయాయి. ఆమెలో గల వాత్సల్యమయ మాతృత్వమామె పట్ల మొదటిసారిగా ఘోరమైన అభిశాపమై అవమానంతో ఆమెను నిలువునా దహించివేస్తూంది. ఏనాటికైనా భర్తలాగే తనూ గౌరవంగా, ఘనంగా కన్ను మూయాలనుకుంది. కాని భగవంతుడు మృత్యువుకు ముందే ఈ దురవస్థ కలిగించినందుకు లోలోపల అనుక్షణం కుమిలిపోసాగింది.

ఇక ఆ రోజు నుంచి, ఫూల్‌మతి తన పనేదో తను చూసుకోవడం, సాధ్యమైనంత వరకు ఎవరితోనూ మాట్లాడకపోవడం, ఏ విషయంలోనూ జోక్యం కలుగజేసుకోకపోవడం అలవాటు చేసుకుంది. ఆమెలోని ఆత్మగౌరవపు దాహం ఇప్పుడు అపరిమిత పరితాప స్వరూపం దాల్చింది.

అన్నదమ్ములు నలుగురూ కలిసి కుముద వివాహం సామాన్య కుటుంబీకుడైన దీనదయాల్‌తో స్థిరపరిచారు. అతి త్వరలో ముహూర్తం పెట్టించి ఎంతో సామాన్యంగా, గుట్టుగా వివాహం జరిపించి వేశారు. ఆ తల్లీ బిడ్డల హృదయాలలో ఎన్ని అగ్ని పర్వతాలు బ్రద్దలయిపోతున్నాయో ఆ స్వార్థపరులకేమీ పట్టలేదు. పెళ్ళి కావడంతో వాళ్ళకో పెద్ద భారం తొలగించుకున్నట్లయింది.

కుముద ఆ రోజు మొదటిసారిగా అత్తవారింటికి వెడుతూ తల్లి దగ్గరికి వచ్చింది. గదిలో ఒంటరిగా మూర్తీభవించిన శోకదేవతయై కూర్చుని ఉన్న తల్లిని చూసేసరికి కుముదకు పుట్టెడు దుఃఖం వచ్చింది. ”అమ్మా!” అంటూ వచ్చి తల్లిని గట్టిగా కౌగలించుకుంది. తల్లిబిడ్డలు కొన్ని క్షణాలు అలాగే దుఃఖాతిరేకం చేత మాటలు పెగలక మాన్పడిపోయారు.

కొంతసేపటికి – ”నేవెళ్ళొస్తానమ్మా!” అన్నది కుముద వెక్కి వెక్కి యేడుస్తూ. ఫూల్‌మతి ప్రక్కనే ఉన్న పెట్టి తెరిచి ఏనాటినుంచో ఉంచిన యాభై రూపాయలను, ఏవో కొద్దిపాటి నగలను బయటకు తీసి కుముద చేతిలో పెడుతూ – ”తల్లీ! నా కలలు కలలుగానే మిగిలిపోయాయి. లేకపోతే నీ వివాహం నేవుండగా ఈనాడింత హీనంగా జరిగేదా? ఈ రూపంతో అత్తవారింటికి వెళ్ళవలసి వచ్చేదా? భగవంతుడు మనిద్దరి నొసటన ఇలాగే వ్రాశాడమ్మా!” అంది.

”అలా అనకమ్మా! నీ ఆశీర్వాదమే నాకు కోటి రూపాయల విలువ చేస్తుందమ్మా!”

ఫూల్‌మతి ఏమో చెప్పాలనుకునేసరికి ఉమానాధుడు ”కుముదా” అంటూ బయటినుంచి కేకవేశాడు.

”నీ పసుపు కుంకుమ పదికాలాలపాటు చల్లగా నిలిచి ఉండాలని దేవుణ్ణి వేడుకుంటాను తల్లీ! వెళ్ళిరా అమ్మా!” అంటూ మనసులో గూడుకట్టుకుని ఉన్న మాతృవాత్సల్యం పొంగులు వారగా కుముద కన్నీటిని తుడిచి బయటికి పంపింది ఫూల్‌మతి.

…….ఙ……..

ఒక సంవత్సరం గడిచింది. ఫూల్‌మతి ఆ భవనం ప్రక్కనే సామానుంచబడే కొట్టులో ఓ మూల ఉంటోంది. కోడళ్ళు, కొడుకులూ ఆమెను పలకరించడం పూర్తిగా మానివేశారు. అయోధ్యనాధుడు గతించడంతో క్షీణించిపోయిన ఆ భవనపు కళాకాంతులు ఫూల్‌మతితో బాటు పూర్తిగా భవనాన్ని విడిచిపెట్టాయి. లోకుల దృష్టిలో ఆమెకా ఇంటితోను, ఫూల్‌మతి దృష్టిలో తనకు లోకంతోనే రుణం తీరిపోయింది. మృత్యువు కోసం ఆమె క్షణక్షణమూ వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తోంది. ఈ ఒక్క సంవత్సరంలో ఆ భవనంలో అనేకమైన మార్పులు జరిగాయి.

ఉమానాధుడి ఆసుపత్రికి ప్రారంభోత్సవం జరిగింది. దయానాధుడు ప్రెస్‌ ఒకటి పెట్టాడు. సీతానాధుడు స్కాలర్‌షిప్‌ మీద విదేశాలకు వెళ్ళాడు. కామతా కొడుకు ఉపనయనం మహా వైభవంగా జరిగింది. కానీ ఫూల్‌మతి వదనంలో ఏ సందర్భంలోనూ, ఆనందరేఖ యీషణ్మాత్రమూ పొడసూపలేదు ఆ తరువాత. మరికొన్ని నెలలకు కామతా టి.బి. వచ్చి చిక్కి శల్యమైపోయాడు. దయానాధుడు సొంత పత్రిక ద్వారా దుష్ప్రచారాలు చేసినందుకు ఆరునెలలు కఠిన కారాగార శిక్ష పొందాడు. ఉమానాధుడు ఒక కేసులో లంచం తీసుకున్న నేరంమీద జైలు శిక్ష అనుభవించడమేగాక శాశ్వతంగా ఉద్యోగానికి దూరమైపోయాడు. కాని, ఫూల్‌మతి వదనంలో ఏ సందర్భంలోనూ విషాదరేఖ యించుకయినా పొటమరించలేదు. సుఖదుఃఖాలకూ, కోరికలకూ, సానుభూతికీ యే మాత్రం తావీయకుండా తన హృదయాన్ని శూన్యం చేసేసుకుందామె. తైల సంస్కారమూ, వస్త్ర సంస్కారమూ లేని ఆమె కళావిహీనయై, చైతన్యరహితయై నిర్లిప్తంగా జీవించడం నేర్చుకుంది.

…….ఙ……..

శ్రావణం వచ్చింది. వారం నుంచి దినకరుని దయార్ద్ర దృష్టిని కానలేక తహతహలాడిపోతోంది లోకం. తారుణ్యంలో భర్తను కోల్పోయిన వితంతువులా గగన దేవత నిర్విరామంగా శోకిస్తోంది. ఎడతెరిపిలేని ముసురు, ఆ కారణంగా పని మనిషి రాకపోవడం చేత పనంతా కోడళ్ళ సాధింపు వినలేక ఫూల్‌మతే నిర్వహించుకొనవలసి వచ్చింది. ఇంట్లో పని అంతా పూర్తిచేసి, మంచినీళ్ళ బిందె తీసుకుని కాలువ గట్టుకు బయలుదేరింది. బయట ముసురు ఉన్నట్లుండి ఒక్కసారిగా ధారాపాత వర్షంగా మారింది.

శుష్కించిపోయి నీరసంతో మంచంలో పడుకున్న కామతా అది చూసి – ”పోనీలే అమ్మా! కాలువకు వెళ్ళకు, పైగా వర్షం పెద్దదయింది కూడా! ఇంట్లో నీళ్ళు తాగవచ్చులే ఈ పూటకు. వర్షంలో తడిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది” అన్నాడు.

ఫూల్‌మతి నిర్జీవంగా నవ్వి – ”పిచ్చి నాయనా! నా ఆరోగ్యం పాడవుతుందా? దేవుడు నాకు అమరత్వం ప్రసాదించాడురా. నేనిప్పుడే చావనులే” అంటూ నెమ్మదిగా బయటకు కదిలింది.

ఆ పక్కనే కుర్చీలో కూర్చున్న ఉమానాధుడు ”పోనీ అన్నయ్యా! తీసుకురానీ! ఇన్నాళ్ళు కోడళ్ళ మీద రాజ్యం చేసి కాల్చుకు తిన్నదిగా. అనుభవించనీ పాపఫలం?” అన్నాడు.

ఆ మాటలు విన్న ఫూల్‌మతికి క్రోధమూ రాలేదు, దుఃఖమూ కలుగలేదు. అవును, పాపఫలం! తను చేసింది పాపమే. పుట్టిన బిడ్డల్ని కళ్ళలో పెట్టుకుని పువ్వుల్లా పెంచినందుకు తన సంపదననుభవించి, సకలసౌఖ్యాలూ చవిచూస్తూ వాటికి కారణభూతురాలైన కన్నతల్లికి కనీసం సానుభూతి అయినా చూపని బిడ్డల్ని నోచుకోవడం పాపమే! అందుకనే కాబోలు అన్నారు మనిషి బ్రతుకు సంపదవల్ల కాక సంతతివల్ల సార్థకమవుతుందని. చివరికి తన బ్రతుకిలా అయిపోయింది. అపరిమిత నిర్వేదం అణువణువునా ప్రాకిపోతున్న ఈ శరీరపు భారాన్ని ఇంకా ఎన్నాళ్ళిలా మోస్తూ ఈ జీవితం లాగాలో! ఎప్పటికీ ఋణం తీరిపోతుందో! తీరని వ్యధతో బరువైన అడుగులు వేసుకుంటూ ఫూల్‌మతి కాలువ గట్టు ఎక్కింది. కాలువలోకి దిగి బిందె ముంచి చంకన బెట్టుకుని వెనుదిరుగుతూండగానే బురదలో కాలుజారి, సంభాళించుకోలేక నీటిలో పడిపోయింది. కాలువ గంభీరంగా ప్రళయ ఘోషతో ప్రవహిస్తోంది. ఫూల్‌మతి ఆ ప్రవాహంలో పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకోసాగింది. కాని పెద్ద పెద్ద అలలు వచ్చి ఆమెను ఇంకా లోపలికి తీసుకెళ్ళి సుడిగుండాలలో ముంచివేశాయి. అది దూరం నుంచి చూసి కొందరు పల్లెవాళ్ళు కేకలు వేసుకుంటూ వచ్చి కాలువలో దూకారు. ఫలితం లేకపోయింది. ఫూల్‌మతి మరి కనిపించలేదు. వెనకనుంచి మరి కొందరు పల్లెవాళ్ళు అడిగారు.

”ఎవర్రా ఆ మునిగిపోయిందీ?”

”పండితులోరి భార్యలాగుందిరా!”

”ఎట్టా! నిజంగా ఆ పండితులోరు దరమాత్తుడేరా! ఏ లోకంలో యాడున్నాడో గాని శేయెత్తి దండం పెట్టొచ్చురా!”

”అయితే యేవి నాబం! ఈ యమ్మ కర్మ ఇట్టా కాలింది.

అత్తీ గిత్తీ బాగనే వుండదంట గదట్రా! ఈ యమ్మ కేం కట్టవొచ్చి పడిందో వొచ్చి కాలువలో దూకిందీ”

”ఆ… ఎంత ఆత్తుంటే యేందిలే, అనుబగించే రాతంటూ లేకపోయాక” – ఇలా అనుకుంటూ పల్లెవాళ్ళు అక్కడి నుండి వెనుదిరిగి పోయారు.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.