ఇంట్లో ప్రేమ్‌చంద్‌-2 ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్ర

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌.శాంతసుందరి

(గత సంచిక తరువాయి)
ఐదు రూపాయలకి బెల్లం
”ఏడాది గడిచాక నేను బెనారస్‌ వెళ్ళవలసి వచ్చింది. నాకప్పుడు పదిహేనేళ్లు, తొమ్మిదో క్లాసు చదివేవాణ్ణి. నాన్న ఖర్చులకి ఎంత డబ్బు కావాలని అడిగితే ఐదు రూపాయలిమ్మని అన్నాను. చాలా చవకలో పోయిందని నాన్న ఆనందించాడు. కానీ బెనారస్‌కి వెళ్ళాక ఫీజుకే రెండురూపాయలు ఖర్చు పెట్టాలని తెలిసింది. మిగిలినవి మూడు రూపాయలు. పాలఖర్చు రూపాయి. అన్ని ఖర్చులకీ ఈ డబ్బు ఏం సరిపోతుంది , అనిపించింది. ఇంట్లో వాళ్ళ దగ్గర సాయం దొరుకుతుందనే ఆశ లేదు. ఇంట్లో పేదరికం తాండవిస్తూ ఉంటుంది. చాపవేసుకుని బుడ్డీ దీపం ముందు కూర్చుని రాత్రిళ్ళు చదువు కునేవాణ్ణి.
”పరీక్షలు దగ్గర పడ్డాయి. నాన్న ఐదు రూపాయలు నాకు పంపించి, ఆ ఐదు రూపాయలతో బెల్లం కొనమని చెప్పాడు. ఎందుకంటే నా పెళ్ళి నిశ్చయమైంది. ఐదు రూపాయల పెట్టి బెల్లం కొనేసాను, కానీ నేనూ, నా స్నేహితులు, అందరం కలిసి ఆ బెల్లమంతా కొద్ది కొద్దిగా తినసాగాం. ముందు బెల్లం తరిగిపోతుంటే ఇక రేపట్నించీ తినకూడదని అనుకునేవాణ్ణి, కానీ బెల్లం పిచ్చి బాగా పట్టుకోటంతో, అదంతా ఖాళీ అయిపోసాగింది. ఒకసారి బెల్లం ఉంచిన పెట్టె తాళం వేసి, తాళం చెవిని సొరుగులో పడేసి, మళ్లీ బెల్లం ముట్టుకోనని ఒట్టుపెట్టుకున్నాను. చివరికి ఆ తాళం చెవిని బావిలో పడేశాను. బెల్లం సగానికి సగం తగ్గిపోయింది. తీరా ఇంటికి తీసుకెళ్లేసరికి, ఆపెట్టె తెరిచి చూసి, నాన్నా, పిన్నీ కోపగించుకున్నారు.
”నా పెళ్ళి జరిగింది. నేను చాలా సంతోషించాను. ఆ ఉత్సాహంలో పెళ్ళి పందిరి వెయ్యటానికి వెదురు నేనే తెచ్చాను.”
వివాహం
”నా వివాహం రామాపూర్‌ అనే గ్రామంలో జరపటానికి పెద్దలు నిశ్చ యించారు. వాళ్లది కూడా జమీందారీ కుటుంబం. తూర్పు ప్రాంతం వాళ్ళ ఆచారం ప్రకారం నన్ను వాళ్లు ఇంట్లోకి పిలిచినప్పుడు అక్కడ వందలమంది ఆడవాళ్లున్నారు. సరదాగా వేళాకోళాలు, ఆటపట్టించడాలు తారాస్థాయిలో ఉన్నాయి. అక్కడ నేనొక్కడినే మగవాణ్ణి. నాకు కూడా అలా సరదాగా నవ్వుకోవటమంటే చాలా ఇష్టం. ఆడ వాళ్ళందరూ కలిసి నన్ను చుట్టు ముట్టేసరికి కాస్త ఇబ్బంది పడ్డాను. ఎలాగోలాగ వాళ్ళని వదిలించుకున్నాను. చివరికి చాలా రోజుల తరువాత నా భార్యని ఇంటికితీసుకెళ్లే సమయం వచ్చింది. మేం ఒంటె బండీలో ఇంటికి చేరాం. బండి దిగగానే నా భార్య నా చెయ్యి పట్టుకుని నడవటం మొదలు పెట్టింది. నేను అలా చేస్తుందని అను కోలేదు. నాకు సిగ్గేసింది. ఆమె నా కన్నా వయసులో పెద్దది. ఆమె ముఖం చూడగానే నేను మూర్చపోయినంత పని చేశాను!” అన్నాడు మా ఆయన.
”ఏమయింది?” అని అడిగాను నేను.
”ఏం కాలేదు. అలా సిగ్గులేకుండా ప్రవర్తించడం నాకిష్టం లేదు. దూరంగా ఉన్నప్పుడే ఒక మనిషిిని చూడాలనే కుతహలం కలుగుతుంది” అన్నారాయన.
”అయితే ఆడవాళ్లు మొగాళ్ళ కన్నా చురుకున్నవాళ్ళన్నమాట! మంచిదే,” అన్నాను.
”సర్లే, నీతోనే మొదట్లో నా పెళ్ళయుంటే నా జీవితం ఇంకా బావుండేది,”అన్నారాయన.
”మనిషి చీకటి రాత్రిని చూసేదాకా వెల్తురంటే ఏమిటో ఎలా తెలుసు కోగలుగుతాడు? అయినా మీరు మాత్రం నాకు ఎక్కడ సహకరించారు? మీ పిన్నితో కలిసి నన్ను అణగదొక్కేసేవారే. నేనే ఎలాగోలాగ ఈ ఇంట్లో నా స్థానాన్ని పటిష్టం చేసుకున్నాను. నా కోసమే కాదు. మీ కోసం కూడా, మీరే నా భార్య అయిఉంటే ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో చెప్పేదాన్ని.”
”ఓహో! అయితే నాకు నా మొదటి భార్యతో ఎలా ప్రవర్తించాలో తెలీలేదని అంటున్నావా?”
”మగాడు పెళ్లాన్ని ఇంటికి తెచ్చుకున్నాక, ఆమె మీద పెత్తనం చెయ్యటం నేర్చుకోవాలి.
”కానీ ఇప్పుడు పెత్తనం చేస్తున్నది నువ్వేగా?” అన్నారాయననవ్వుతూ.
”అవును నాకుపెత్తనం ఇచ్చారు. మొదటావిడ జీవితం నాశనం చేశారు. ఆ బాధ నన్ను ఎప్పుడూ తొలుస్తూనే ఉంటుంది. దేన్త్నెతే నేను చెడుఅని భావిస్తానో, దాన్ని నా ఇంట్లో వాళ్లే, తమ చేతుల మీదుగా చేయ టం.. నేను ఎంత కష్టాన్నైనా భరిస్తాను, కానీ సాటి స్త్రీ కష్టపడడం చూడలేను. నా తప్పేమీ లేనప్పటికీ మీరు చేసిన పనికి నేనే ప్రాయశ్చిత్తం చెయ్యలేమొ! మా నాన్నకి ఈ సంగతి తెలిస్తే మీకిచ్చి చూస్తే పెళ్లి చేసేవాడు కాదు!”
”ఆమె అందవిహీనంగా ఉండడమే కాక, ఆమె నోరు కూడా మంచిది కాదు అలాంటప్పుడు ఆమెకి దగ్గరవ్వాలని ఎవరికైనా ఎలా అనిపిస్తుంది?”
”మీరు బల్లగుద్ది, మీ నడవడి చాలా మంచిదని చెప్పగలరా? ఊర్కోండి, మీలోనే మంచి గుణాలు లేనప్పుడు అవతలి వాళ్లనించి దాన్నిఆశించటం సరికాదు.”
”నేనామెని పుట్టింట్లో దిగబెట్టి వచ్చాను. అంతేగా, ఇందులో నేను చేసిన నేరం ఏమిటి?”
”మీరు మగవాళ్లు. మళ్లీ నన్ను పెళ్లి చేసుకుని తెచ్చుకున్నారు. ఆవిడ పుట్టింట్లో ఉండిపోయిందే! ఇది ఆడవాళ్ల పట్ల అన్యాయంకాదా. నేనుకూడా అందవికారం గా ఉంటే నన్ను కూడా వదిలేసేవారేగా? అసలు ఊరంతా దండోరా వేసి మిమ్మల్ని ఎవరూ పెళ్లి చేసుకోకూడదని చెప్పాలని ఉంది, కానీ నాకా స్వేచ్ఛ లేదు!”
”అందుకే నీకు నా గురించి తెలీలేదు. ముందు నేచెప్పేది విని, తరువాత కోపతాపాలు చూపించు. మేము ఇల్లు చేరాక నా భార్య అందంగా లేదన్న విషయం నాన్నకి తెలిసింది. ఆమె సిగ్గులేని ప్రవర్తనని ఆయన దూరంనించే చూశాడు. నా పెళ్లి కుదిర్చింది మా పిన్నివాళ్ల నాన్న. నాన్న పిన్నితో, ”మీ నాన్న నా కొడుకు జీవితం నాశనం చేశాడు. ఎంత ఘోరం! గులాబిపువ్వులాంటి నా కొడుక్కి ఇటువంటి పెళ్లామా? నేను వాడికి ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా! అన్నాడు పిన్ని, ‘చూద్దాం! అంది.
‘మా పిన్ని జమనియకి వెళ్లేప్పుడు నా భార్యని కూడా వెంటపెట్టుకెళ్లింది. అక్కడ ఆర్నెల్లు కూడా ఉండకుండానే నాన్నకి లక్నోకి బదిలీ అయింది. నేనింకా తొమ్మిదోక్లాసు చదువుతున్నాను. నాన్న లక్నోకి వెళ్తూ మా అందర్నీ మండ్యాకి పంపించేశాడు. నేను ముందునించీ అక్కడే ఉండేవాణ్ణి. ఇప్పుడిక ఈ సంత వచ్చి నా నెత్తి మీద పడింది! పిన్ని నా భార్య మీద పెత్తనం చేసేది. ఆమె లేకుండా చూసి ఆమె మీద నాకు చాడీలు చెప్పేది. నా పెళ్లాం మరోపక్క తన తలరాత ఇలా ఏడ్చినందుకు శోకాలు పెట్టేది. మధ్యలో నాకు చావొచ్చి పడింది. మధ్యలో పిన్ని తలదూర్చకుండా ఉంటే, మేమిద్దరం కలిసి ఎలాగోలాగ బతికేసే వాళ్లమే.”
”అయితే మీరు దమ్మిడీకి పనికిరాని మనిషన్నమాట!”
”అలా అని నేనే ఒప్పుకున్నాను కదా! నేనెవ్వరిమీదా పెత్తనం చెలాయించ లేను.”
”అందుకేగా ఆమె జీవితం బుగ్గిపాలయింది!”
చునార్‌గఢ్‌
తన తండ్రి పోయక జీవితం ఎలా గడిచిందో ఆయన మాటల్లోనే కింద రాస్తున్నాను.
”చలికాలంలో నేను చునార్‌గఢ్‌నించి ఇంటికొచ్చాను. మా పిన్ని తమ్ముడు, విజయ్‌ బహదూర్‌ కూడా నాతో పాటే వచ్చాడు. అతని తండ్రి బతికే ఉన్నప్పటికీ అతని బాధ్యతకూడా నానెత్తినేవేశాడు. నేను ట్యూషన్‌ చెప్పి ఐదు రూపాయలు సంపాదించేవాణ్ణి, వంటా అదీ విజయ్‌ బహాదరే చేసేవాడు. చేతికొచ్చిన డబ్బు నెలారంభంలోనే అయిపోయేది. ఆ తరువాత అప్పుచేసిన డబ్బుతోనే గడిచేది. రూపాయి పెట్టి పళ్ళు కొంటే నాలుగైదు రోజుల్లో అయిపోయేవి. మళ్లీ అప్పు పెట్టటం, బోర్డింగ్‌ హౌస్‌ కోమటి దగ్గరే రొట్టెలకి కూడా అప్పు పెట్టేవాళ్ళం. ఒకసారి ఇంటి కొచ్చి నాలుగైదు రోజులున్నాను. వెళ్లేటప్పుడు పిన్నిని డబ్బడిగాను. డబ్బుల్లేవంది ఆవిడ. ఊళ్లో ఎవర్ని అప్పడగాలి? రైలుకింకా చాలా టైముండగానే నేనూ, విజయ్‌ బహాదూర్‌ వెళ్లిపోయం. ఏడాది క్రితం నేనెంతో కష్టపడి కుట్టించుకున్న ఉన్ని కోటుని పట్నంలో రెండ్రూపాయలకి అమ్మేశాను. చలికాలం, ఉన్ని కోటు, నూలు షర్ట్‌ వేసుకుని, దాన్ని చాలా భద్రంగా వాడుకుంటున్నాను!”
అలహాబాద్‌
”నేను అలహాబాద్‌లో ఉండగా నాకు పది రూపాయలు జీతం వచ్చేది. వాటిలో ఏడు రూపాయలు ఇంటికి పంపేవాణ్ణి. ఐదు రూపాయలు ట్యూషన్‌ చెప్పి, ఎనిమిది రూపాయలతో జీవితం గడిపేవాణ్ణి. పొద్దున్నే లేచి, మొకం కడుక్కుని రొట్టెలు చేసి, స్కూలుకెళ్లేవాణ్ణి. ఆ రోజుల్లోనే ‘కృష్ణ ‘ అనే చిన్న నవలని రాశాను. ఇండియన్‌ ప్రెస్‌ దాన్ని ప్రచురించింది. రెండేళ్లు అప్పు చేసే బతికాను. 1904లో నేను పాసయను.. సెలవుల్లో ఇంటికొచ్చాను.నా భార్యకీ నాకూ పోట్లాటయింది. అంతేకాక పిన్ని కూడా మా ఆవిడ మీద బోలెడన్ని చాడీలు చెప్పింది. కోపం వచ్చి నేనామెని తిట్టాను. ఆమె కూడా నా మీద కోపం చూపించింది. ‘నువ్వు మీ ఇంటికి పో. అదే మంచిది’ అన్నాను. విజయ్‌ బహాదూర్‌ని పిలిచి ఆమెని పుట్టింట్లో దింపి రమ్మన్నాను.
శివరాణీదేవి
నా మొదటి పెళ్లి ఆమె నాకు పదకొండేళ్లప్పుడు జరిగింది. ఆ పెళ్లి ఎప్పుడు జరిగిందో నాకు గుర్తు లేదు. నేను ఎప్పుడు వితంతువునయనో కూడా గుర్తు లేదు. బహుశా పెళ్లయిన మూడు నాలుగు నెలలకే నా భర్త పోయాడనుకుంటా.
మా నాన్న మున్షీ దేవీ ప్రసాద్‌, ఫతేపూర్‌జిల్లాలోని ఒక గ్రామంలో పోస్టాఫీీసులో పనిచేసేవాడు. నా పరిస్థితి చూసి బాధ పడేవాడు. తన సంగతి ఎలా ఉన్నా నేను సుఖంగా ఉండాలని అనుకునే వాడు. ముందుగా ఆయన పురోహితులు సలహా తీసుకున్నాడు. ఆ తరువాత పేపర్లో ప్రకటన ఇచ్చాడు. దాన్ని మా ఆయన కూడా చదివాడు. తరువాత చాలా మంది అబ్బాయిల్ని చూశాడు, కానీ మా నాన్నకి ఎవరూ నచ్చలేదు. ఆ సమయంలోనే మా ఆయన నాన్నకి ఉత్తరం రాశారు. ‘నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను. నా చదువు ఇది, నా సంపాదన ప్రస్తుతం ఇంత’ మా నాన్న ఉత్తరానికి జవాబిస్తూ, మీరు ఫతేపూర్‌కి రండి. మనిద్దరం అక్కడ కలుసుకుందాం , అన్నాడు.
నాన్న ఫతేపూర్‌కి వెళ్లాడు, మా వారికి టిక్కెట్టు డబ్బులు ఇచ్చాడు. నాకు ఎవరితో పెళ్లి కాబోతోందో కూడా తెలీదు. నన్ను పెళ్లి చేసుకోవడం గురించి ఆయన పిన్నీ వాళ్ళతో కూడా సంప్రదించలేదు. అది ఆయన సాహసమే అనాలి. ఆయన సామాజిక నియమాలని పాటించక్కల్లేదను కున్నారు. చివరికి ఇంట్లో వాళ్ళకి కూడా ఈ పెళ్లి సంగతి చెప్పలేదు. మా పెళ్లి జరిగింది. పెళ్లైన వెంటనే నేను అత్తారింటికి వచ్చి పధ్నాలుగు రోజులున్నాను. నాకక్కడ ఉండటం నచ్చేది కాదు. ఎందుకంటే నాకు అమ్మ లేదు, చనిపోయింది. ఐదేళ్ల తమ్ముడు, వాడిని నేను కన్నతల్లి లాగే ప్రేమించేదాన్ని. నాకు పధ్నాలుగు నిండగానే అమ్మ పోయింది. నా తమ్ముడికి అప్పుడు మూడేళ్లు. అంత చిన్నతనంలోనే నాకు బాధ్యతలన్నీ తెలిసి వచ్చాయి.
ఫాల్గుణ మాసంలో నా పెళ్లయింది. చైత్రంలో ఆయన (స్కూళ్ల), సబ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ అయ్యారు. నేను నెలరోజులు అత్తారింట్లో ఉంటే పదినెలలు పుట్టింట్లో ఉండేదాన్ని. ఇక్కడ రోజూ పొట్లాటలు జరుగుతూ ఉండటంచేత నాకిక్కడ ఉండాలనిపించేది కాదు.
కాన్పర్‌లో జీవితం
ఆయన పొద్దున్నే నాలుగ్గంటలకి లేచేవారు. హుక్కాతాగి, బాత్‌రూమ్‌కి వెళ్లేవారు. మొహం కడుక్కున్నాక ఏది పెడితే అదే తినేవాడు. ఆ తరువాత కూర్చుని రాసుకునేవారు. కూలీల పారలా ఆయన కలం వేగంగా కదిలేది. ఆ తరువాత స్నానం, భోజనం. టూర్లకి వెళ్లినపుడు కూడా ఆయన రాతపని ఆపేవారు కాదు. ఇన్‌స్పెక్షన్‌ చెయ్య వలసివచ్చినపుడు, ఆ పనిని ఉపాధ్యా యులకు అప్పజెప్పేవారు. ”ఏం చెయ్యను? నేను ఇన్‌స్పెక్షన్‌కి వెళ్తే టీచర్లు పిల్లల ముందు కొశ్చన్‌ పేపర్లు పెట్టేవాళ్లు. అందుకే ఆ పని వాళ్ళకే అప్పగించేస్తున్నాను. పాపం వాళ్లూ సంతోషిస్తారు. ఇన్‌స్పెక్షన్‌ బాగా అయినందుకు వాళ్ళకి ప్రమొషన్లు కూడా వస్తాయి.” అన్నారాయన.
”అయితే గవర్నమెంటు మీకు ఉద్యోగం ఎందుకిచ్చినట్టు?” అన్నాను.
”దాని పని అది చేస్తే, నా పని నేను చేస్తున్నాను. ఈ పెద్ద పెద్ద ఆఫీసర్లు ఏమైనా దేవుళ్లా?”
”ఏమైనా ,మన పనులన్నీ మనమే చేసుకోవాలి.”
”చేస్తూనే ఉన్నాగా? నేను చేసే పనివల్ల ఎవరికైనా లాభం కలిగితే తప్పేమిటి? ఈ లోకంలో పనులన్నీ ఇలాగే అవుతాయి.”
ఆయనకి ఆఫీసర్ల సానుభూతి దొరకలేదు. కానీ తన కింద పనిచేసే వారితో ఎప్పుడూ స్నేహంగా ఉండేవాడు. ఆయనకి ఇంకొకరి మీద ఆఫీసరు గిరీ చెయ్యటం నచ్చేదికాదు.
ఆఫసరయ్యక మనిషి మానవత్వం కోల్పోతాడని ఆయన ఎప్పుడూ అంటూ ఉండేవారు.దేవుడు ఎప్పటికీ నన్ను ఆఫీసరుని చెయ్యకూడదని కోరుకుంటు న్నాను. ఆయన ఎప్పుడూ ఆనందంగానే ఉండేవారు. లౌకికవిషయలు గురించి అసలు పట్టింపే ఉండేది కాదు. కానీ తల్లి ప్రేమ కోసం మొహం వాచిపోయి ఉండేవారు. ఆయన కళ్ళుఎప్పుడ తల్లి ప్రేమనే వెతికేవి. ఎవరైనా తమ తల్లిని ప్రేమించకపోవడం చూస్తే, ఆయనకి కోపం వచ్చేసేది.తల్లిని ప్రేమించని పిల్లల మనసు రాయికన్నా కఠినం అని ఎప్పుడూ అంటూ ఉండేవారు.
ఒకరోజు, ”మీరు మీ అక్కయ్యని పదిహేనేళ్ల తరువాత ఇంటికి రమ్మని పిలిచారేమిటి? ఇదేనా ప్రేమంటే? తల్లికోసం మీరు ఏడవండి, కాదనను,” అన్నాను.
”దీనివెనక ఉన్న కారణం నువ్వు అర్ధం చేసుకోలేదు, అందుకే అలా అంటున్నావు. మా అక్కకీ, మా పిన్ని తమ్ముడికీ ఎప్పుడూ పోట్లాటే, ” అని జవాబిచ్చారు. నాకూ ఆయనకి ఎనిమిదేళ్లు సయెధ్య కుదరలేదు. అత్తారింట్లో ఎప్పుడ గొడవలు, పోట్లాటలు ఉంటండేవి. నాకు అవి అలవాటు లేదు. ఆయన నా మానాన నన్ను ఉండమనేవారు. ఆయన భార్యగా నేనీ ఇంటికి యజవనురాలిని అని అనేవారు. నాకు మాత్రం ఈ గొడవల్లో తలదూర్చటం ఇష్టం ఉండేది కాదు. నాకు నాలుగు ప్రదేశాలు తిరిగి చూడాలని ఉండేది. మా అత్తగారు నా సవతితో ఎలా ప్రవర్తించేదో, ఆవిడే నాకు చెప్పింది. అప్పుడు ఆయన ఏమీ అనేవారు కాదట. బహుశా నాతో కూడా అలాగే ప్రవర్తిస్తారేమొ! నన్నేకోప్పడతారేమొ! ఈ ఇంటి వాళ్ల మీద అధికారం చెలాయించటానికి నాకేం పట్టింది? నేను పుట్టింట్లో హాయిగా ఉండేదాన్ని.
”ఒకసారి మానాన్న నన్ను పుట్టింటికి రమ్మని ఉత్తరం రాసాడు. పంపటం వీలుకాదని ఈయన జవాబిచ్చాడు. ఈయనగారు పంపనంటారని నాకు ముందే తెలిసిపోయిది. నేను చాలా విసుక్కున్నాను. ఈయన నా గదిలోకి వచ్చారు. నేనులేచి బైటికెళ్లబోయను. ”ఎక్కడికెళ్తున్నావు?” అన్నాడు.
”నేను బైటికెళ్తున్నాను.”
”ఎక్కడికి వెళ్దామని ఉద్దేశం?”
”సరే, నేను వెళ్లను,మీరే వెళ్లండి ఇక్కణ్ణించి.”
”అరె! నెనెక్కడికి పోను?”
”వెళ్లటానికి మీకు చోటేది లేకపోతే నేనే వెళ్తాను.”
”లేదు, నువ్వీ ఎండలో వెళ్లటానికి వీల్లేదు.
నేనూ మొండికేశాను.
నా మొండితనం చూసి కోపగించుకుని రెండు దెబ్బలు వేశారాయన. వెంటనే బైటికెళ్లిపోయారు. సాయంత్రం మళ్లీ ఆయన వచ్చేసరికి నేను అలిగి కూర్చున్నాను. అప్పుడు చాలా నెమ్మదిగా, ”అంత గొడవ చేశావెందుకు?” అన్నారు.
”నేనెం గొడవ చేశాను?”
”కాకపోతే ఏమిటి? ఎవరితోను మాట్లాడకుండా, మాట వినిపించు కోకుండా…”
”నేను మాట్లాడకపోతే ఎవరికి నష్టం? నన్ను బాధపెట్టాలనేగా పుట్టింటికి పంపలేదు? ఖైదీలు ఆనందంగా ఎలా ఉంటారు?”
”చాలా పొరపాటుగా ఆలోచిస్తున్నావు. నేను నిన్ను బాధ పెట్టాలని ఆపలేదు. కానీ నిన్ను పంపించకూడదని అనుకున్నాను. నిన్ను బాధ పెడితే నాకేం ఒరుగుతుంది, చెప్పు? నిజంగా చెపుతున్నాను, నువ్వు పుట్టింటికి పోతే నాకు అస్సలు బావుండదు.”
”కానీ నాకిక్కడ బావులేదే?”
”నీ ఇంట్లో నువ్వు సుఖంగా ఉండాలనేది నా కోరిక, ఈ ఇల్లు నీది ఎందుకు కాకూడదు?”
”ఇంకోరింట్లో పెత్తనం చెలాయించే ఖర్మ నాకేమిటి?”
”నిజంగా చెపుతున్నాను, ఇదే నీ ఇల్లు. ఇంకెలా చెప్పాలో నాకు తెలీటం లేదు!”
”చెంపదెబ్బ కొట్టి చెప్పండీ!” అన్నాడు.
”నేనేం చెంపదెబ్బ కొట్టలేదు.”
”ఏం ఇంకా కొట్టాలని కోరిగ్గా ఉందా?” అన్నాను.
”అబ్బ, నీతో ఎలా వేగేది? నువ్వు ఇంట్లోంచి తరిమేస్తే ఎక్కడికి పోను?”
”నీకు అవతలి మనిషిని బంధించి ఉంచటంలో ఆనందం దొరుకుతుంది.”
”నిజంగానే నిన్ను బంధించి ఉంచే ఉద్దేశం నాకు లేదు. అందుకని నిన్ను ఆపలేదు. ఈ ఇంటి యజమానురాలివై నా మీద కూడా ”పెత్తనం చెలాయించమని చెపుతున్నాను.”
”నేనలాంటి దాన్ని కాను.” అన్నాను.
”అయితే నేనేం చెసేది?”
”మరి నేను మాత్రం ఏం చెయ్యను?” అన్నాను.
ఆ సమయంలోనే ఆయన పిన్ని నా మీద ఆయనకి ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పింది. ఆయనకి నా మీద కోపం వచ్చింది. నేను కోపం పోగొడితే తన మనసులో మాట నాకు చెప్పాలని ఆయన అనుకునేవారు. కానీ నేను ఆయన్ని ఏమాత్రం ఖాతరు చెయ్యకుండ, ఏమీ పట్టనట్టు ఉండేదాన్ని. చాలా రోజుల తరువాత ఆయనే స్వయంగా నా దగ్గరకొచ్చి, ”నువ్వు నన్నెందుకలా అన్నావు?” అన్నారు.
”నేనేం అనలేదే!” అన్నాను.
”లేదు నువ్వేదో అనే ఉంటావు, అందుకే పిన్ని నాతో అలా చెప్పింది.”
”మీకు నా మాటల మీద నమ్మకం ఉంటే నేను చెప్పేది వినండి. నేను మీ గురించి ఏమి అనలేదు. మీరు నమ్మకపోతే నేను చెయ్యగలిగింది. ఏమీ లేదు.”
”నేను ఏమీ అనలేదని ఆయనకి నమ్మకం కలిగింది.”చూడూ, మా పిన్నికిది ఒక పెద్ద చెడు అలవాటు. ఇంతకు మునుపు కూడా ఇలాగే చెప్పేది. బహుశా నా మీద నీకు కూడా ఏమైనా చెపుతూ ఉండచ్చు. అందుకేలాగుంది, ఎప్పుడ నా మీద కోపంగా ఉంటావు!”
”నాకు కోపం వస్తే మాత్రం ఏం లాభం? మీకు కోపం వచ్చిందేం? మీరు చాలా బుద్ధిమంతులు కదా?” అన్నాను.
”నువ్వెందుకలా ఎప్పుడ ముసుగులో ఉంటావు? నువ్వేం చిన్న పిల్లవా? నేను పదేళ్ళవరకూ అలా నక్కి నక్కి బతికాను. పదేళ్లయక ఇక పిన్నికి భయపడవలసిన పని లేదు!”
”నేనలా విచ్చలవిడిగా ఉండలేను,” అన్నాను.
”నువ్విలాగే అణిగి మణిగి ఉంటే రోజూ ఇంట్లో మహాభారత యుద్ధం జరుగుతూనే ఉంటుంది.”
”మనం సరిగ్గా ఉంటే లోకమంతా సరిగ్గా ఉంటుంది. మీరు చిన్న పిల్లాడు కాకపోతే ఆవిడ చెప్పే మాటలెందుకు వింటారు? విన్నా వాటిని ఎందుకు పట్టించుకుంటారు? మీరలా విన్నంతకాలం నేనేమీ చెయ్యలేను. మనని మనం సరిదిద్దుకోవటమే వీలుకానప్పుడు, ఇంకొకర్ని సరిద్దిడం ఎలా వీలుపడు తుంది?”
”నువ్వేమీ చెయ్యకు! తప్పంతా నా నెత్తినే రుద్దు!”
”ఇదంతా మీ వల్లే జరిగింది. ముందు నుంచే మీరు ఆవిడ విషయంలో ఖరాఖండిగా ఉండి ఉంటే ఇలా ఎందుకు ఉండేది?”
”ఏం చెయ్యను , నా ఖర్మ, అంతే!”
”చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా!”
”నిజంగా, నువ్వెంత నిష్టూరంగా మాట్లాడతావు! నీక్కూడా నా మీద జాలి లేదు.’
”అరె, జాలి పడాల్సినదేమైనా ఉంటే కదా? నేచెప్పేది విను. నువ్వు కాస్త అన్ని విషయల్లో జోక్యం చేసుకో!”
”అంటే మీ నెత్తినున్న శనిని నా నెత్తికెత్తుకోమంటారా?”
”అయితే మరి సంసారం ఎలా చేస్తాం? నాకేం అర్ధం కావటం లేదు.”
”ఇన్నాళ్ళూ చేస్తున్నట్టే. నేనావిడతో పెట్టుకోదల్చుకోలేదు. అయినా మీరంటే ఆవిడకి చాలా ప్రేమేగా! నా సంగతి వదిలెయ్యండి. ఎలాగైనా బతికేస్తాను”.
”నువ్వు ప్రేమ అనుకుంటున్నది నిజంగా ప్రేమ కాదు. తల్లి ప్రేమలో స్వార్ధం ఉండదు. నాకది దొరకనే లేదు. ఇంక దానికోసం వెంపర్లాడి ఏం లాభం?” అని అంటూ౦టే ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ రోజు నుంచీ ఆయన మీద నాకు జాలి వెయ్యడం ప్రారంభమైంది. ఆయనతోనే ఎప్పుడూ ఉండాలనే కోరిక కలగసాగింది.
ఆయన లేచి వెళ్తూ,”నిజం చెపుతున్నాను, నేను ఎప్పటికీ నీవాడినే” అన్నారు.
ఆ రోజు నుంచీ నేను నిజంగానే ఆయన మీద పెత్తనం చెలాయించటం మొదలు పెట్టాను. అప్పట్నించీ ఆయన ఇంటిని నాఇల్లు అని కూడా అనుకోవడం ప్రారంభించాను.
(ఇంకా వుంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.