భారతీయ చలన చిత్ర సీమ చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క భారతీయ చలన చిత్ర సీమ చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క గురుదత్‌ -భార్గవి రొంపిచర్ల

నా అభిమాన దర్శకుడూ, నా అబ్సెషన్‌ గురుదత్‌. ఇవ్వాళ్టికి సరిగ్గా 53 ఏళ్ళ క్రితం ఇదే రోజు అంటే అక్టోబర్‌ 10వ తేదీన 1964వ సంవత్సరంలో ఈ లోకంతో నాకేమి పని అని నిష్క్రమించాడు గురుదత్‌. అది హిందీ చిత్రసీమకు అత్యంత విషాదకరమయిన రోజు.

గురుదత్‌ ఎవరని ఈ తరం ప్రేక్షకులనడిగితే ఏం చెప్పాలి? కేవలం అతనొక నిర్మాత, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ అని చెబితే చాలదు. అతను పనిచేసిన 13 సంవత్సరాలలో తీసిన సినిమాల సంఖ్య యాభైలోపే అయినా ”క్లాసిక్స్‌” అనదగిన చిత్రాలు తీశాడు. 1951లో ”బాజీ”తో చిత్ర రంగ ప్రవేశం చేసి 1964లో తనువు చాలించేవరకూ గడచిన 13ఏళ్ళలో హిందీ చిత్రరంగాన్ని ఒక కుదుపు కుదిపాడు, ఒక కొత్త ఒరవడి సృష్టించాడు. అందుకే ఈ నాటికీ అతని చిత్రాలు చిత్ర సీమలో ప్రవేశించే విద్యార్థులకు పాఠాలుగానూ, స్ఫూర్తిగానూ నిలుస్తున్నాయి. కొంతమంది అతన్ని ”ఇండియన్‌ ఆర్సన్‌ వెల్స్‌” అంటారు. ఆయన సినిమాలలో ”ప్యాసా”, ”సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌”లు టైమ్‌ మ్యాగజైన్‌ ఎన్నుకున్న వంద ఉత్తమ ప్రపంచ చిత్రాల జాబితాలో చేరాయంటే ఆయన ప్రతిభను గురించి వేరే చెప్పాలా? అయితే ఒక విషయం ఆయన సినిమాలలో కమర్షియల్‌ విలువలు లేవా? అంటే ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే ఆయన సినిమాలు కళాత్మక విలువలున్న కమర్షియల్‌ చిత్రాలని.

అంతేకాదు సాంకేతికంగా, భావోద్వేగాల పరంగా, నటనాపరంగా, సంగీత పరంగా, తీసుకునే థీమ్‌ పరంగా ఉన్నత ప్రమాణాలు సాధించినవి గురుదత్‌ సినిమాలు. ఆయన సినిమాలలో కొన్ని ముఖ్యమైనవి ”బాజీ, జాల్‌ బాజ్‌, ఆర్‌ పార్‌, మిస్ఠర్‌ అండ్‌ మిసెస్‌ 55, ప్యాసా, కాగజ్‌ కే ఫూల్‌, సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌”. సాంకేతికంగా ఈనాడు ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ నాకు గురుదత్‌ సినిమాలలో కనిపించే ”క్లోజప్‌”ల లాంటివి ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించలేదు. ముఖ్యంగా ”ప్యాసా”లో వహీదావి కావచ్చు… జానీవాకర్‌వి కావచ్చు. మనలో మన మాట నాకు ”ప్యాసా”లో కనిపించినంత అందంగా వహీదా ఇంకే సినిమాలోనూ కనపడలేదు. వ్యక్తిగా గురుదత్‌ గురించి చెప్పాలంటే ఆయనొక అంతర్ముఖుడు, మితభాషి, పర్‌ఫెక్షనిస్ట్‌, కావలసిన ఎఫెక్ట్‌ కోసం ఎన్ని టేకులు తీయడానికైనా వెనకాడడు. తన దగ్గర పనిచేసేవారి నుండి క్రమశిక్షణనూ, విశ్వాసాన్నీ కోరుకుంటాడు. సున్నిత మనస్కుడూ, పని రాక్షసుడూ.

ప్రతి మనిషీ వ్యక్తిగతంగా కానీ, వృత్తి పరంగా కానీ ఎదగడానికి అతను పుట్టి పెరిగిన వాతావరణం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ పరిస్థితులూ ప్రభావం చూపుతాయనిపిస్తుంది. అలా ఆయన జీవన గమనాన్ని పరిశీలిస్తే ఒక దిగువ మధ్యతరగతికి చెందిన కొంకణి మాట్లాడే బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినవాడు. ”సారస్వత” అనేది సరస్వతీ నది నుండి వచ్చింది. వీరు ఉత్తర భారతీయులైనప్పటికీ మంగుళూరు ప్రాంతంలో విస్తరించి ఉన్నారు. వీరిలో కళాకారులూ, విద్యావేత్తలూ ఎక్కువట. అన్నట్టు శ్యామ్‌బెనగళ్‌ గురుదత్‌కి తల్లి తరఫు బంధువు. గురుదత్‌ తండ్రి శివశంకర్‌ పదుకోనే, తల్లి వాసంతి. గురుదత్‌ అసలు పేరు ”వసంతరావు శివశంకర్‌ పదుకోనే”. ఆయన 1925 జులై 9న గురువారం బెంగుళూరులో జన్మించాడు. తండ్రికి చాలాకాలం స్థిరమైన ఉద్యోగం లేదు. కొన్నాళ్ళు టీచర్‌గానూ, బ్యాంక్‌లోనూ, ప్రెస్‌లోనూ పనిచేసి చివరికి కలకత్తాలో ”బర్మా షెల్‌” కంపెనీలో గుమస్తాగా దాదాపు 30 సంవత్సరాలు పనిచేశాడు. తల్లి టీచర్‌. ఆమెకు బెంగాలీ, కన్నడ సాహిత్యాలతో పరిచయం ఉండేది. తల్లిదండ్రుల మధ్య సయోధ్య ఉండేది కాదు.

గురుదత్‌ – రెండో భాగం

గురుదత్‌ పేరు వెనక చిన్న కథ ఉంది. అతను పుట్టినపుడు అతని మేనమామ రెండు పేర్లు సూచించారట. ఒకటి వసంతకుమార్‌, రెండోది గురువారం పుట్టాడు కాబట్టి గురుదత్‌ అని. వసంతకుమార్‌ అనే ఖాయం చేశారట. అయితే అతని రెండో పుట్టినరోజు చక్కగా ముస్తాబయి ఆడుకుంటూ ఒక బావి దగ్గర పడిపోయి రెండు వారాలు మూసిన కన్ను తెరవకుండా జ్వరం తెచ్చుకున్నాడట. ఇదంతా చూసి భయపడిన తల్లి వాసంతి ఎవరో జ్యోతిష్కుడిని అడిగితే అతని నిజమైన పేరుతో కాకుండా మార్చి పిలవమన్నాడట. అలా అప్పటినుండి అతని రెండో పేరు గురుదత్‌గా స్థిరపడిపోయింది. అతని పేరు విని అతను బెంగాలీ అని భ్రమపడతారు చాలామంది. అయితే చిన్నతనమంతా కలకత్తాలో గడపడంతో అతనికి బెంగాలీ కల్చరన్నా, ఆ ప్రాంతాలన్నా చాలా ఇష్టం. చాలా సినిమాల్లో కథకి అవసరం లేకపోయినా కలకత్తా పరిసర ప్రాంతాలలో షూటింగ్‌ చేయడానికి ఇష్టపడేవాడని రచయిత అబ్రార్‌ అల్వీ చెబుతారు. ఆయన చిన్నతనంలో చాలా చిలిపిగా ఉండేవాడట, తల్లిని ప్రశ్నలతో వేధించేవాడట. త్వరగా కోపం వచ్చేదట. బెంగుళూరులో కొద్దికాలం గడిపి తండ్రికి స్థిరమైన ఉద్యోగం దొరికాక కలకత్తాలో ఎక్కువ కాలం గడిపారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కుటుంబమంతా బొంబాయికి మకాం మార్చింది. గురుదత్‌ ఆ ఇంట్లో పెద్ద కొడుకు. అతని తర్వాత శశిధర్‌ అనే బాబు పుట్టి ఏడు నెలల వయసులో చనిపోయాడట. ఇది గురుదత్‌ని చాలా బాధించిందట. తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు ఆత్మారామ్‌, దేవీదత్‌, విజయ్‌దత్‌, ఒక చెల్లెలు లలితా లాజ్మీ. అందరికీ సినిమాతో కొద్దో గొప్పో సంబంధముంది. తమ్ముడు ఆత్మారామ్‌ అంటే గురుదత్‌కి చాలా ఇష్టం. అతను గురుదత్‌ దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేశాడు. గురుదత్‌ చనిపోయాక ఆయనమీద ”శ్రద్ధాంజలి” అనే డాక్యుమెంటరీ తీశాడు. గురుదత్‌, గీతాదత్‌ ఇద్దరూ చనిపోయిన తర్వాత వారి పిల్లలు ఆత్మారామ్‌ దగ్గర, గీతాదత్‌ సోదరుడు ముకుల్‌ రాయ్‌ దగ్గరా పెరిగారు. లలితా లాజ్మీ పెయింటర్‌. ఆమె కూతురు కల్పనా లాజ్మీకి కూడా చిత్రసీమతో సంబంధాలున్నాయి. పైన ఉన్న ఫోటోలో గురుదత్‌ తండ్రి శివశంకర్‌ పదుకోనే, వాసంతి పదుకోనే, గురుదత్‌, ఆత్మారామ్‌, లలితా లాజ్మీ ఉన్నారు.

గురుదత్‌ మంచి విద్యార్థి. మెట్రిక్యులేషన్‌ పాసయ్యాడు. అయితే కాలేజి ముఖం చూడలేదు. కానీ బెంగాలీ, ఇంగ్లీష్‌, హిందీ బాగా వచ్చు. ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడేవాడట, సాహిత్యం బాగా చదివేవాడట. ఈ విషయంలో అతనిది తండ్రి పోలిక అంటారు. తండ్రి కొన్నాళ్ళు జర్నలిస్ట్‌గా పనిచేశాడట. ఇంగ్లీషులో మంచి కవిత్వం, వ్యాసాలు రాసేవాడట. అయితే అవేవీ వెలుగు చూడలేదట. అతని తండ్రి ఎక్కువ చొరవగా ఉండేవాడు కాదట. ఆర్థిక సమస్యలు, కుటుంబ భారం అతన్ని అలా తయారుచేసి ఉండవచ్చు అంటాడు అతని బంధువు బి.బి. బెనగల్‌. గురుదత్‌ తల్లి మాత్రం ఆయనకు విరుద్ధంగా చాలా చలాకీగా, కలుపుగోలుగా ఉండేదట. ఆమెకి హిందీ, బెంగాలీ, కన్నడ, ఇంగ్లీష్‌, మరాఠీ భాషల్లో చదవడం, మాట్లాడడం వచ్చట. ఆమె కన్నడంలో గురుదత్‌ గురించి పుస్తకం రాసిందట. ఒక స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ ఇంట్లో ట్యూషన్లు చెప్పేదట. ఆమె గురుదత్‌ని ఎక్కువ అభిమానించేదట. అతనికి కూడా తల్లి అంటే ప్రత్యేక అభిమానం. తన మొదటి సినిమా ”బాజీ” హిట్టవగానే ఆమె కోసం ఒక సీలింగ్‌ఫ్యాన్‌ బహుమతిగా ఇచ్చాడట. గురదత్‌ మీద తల్లిదండ్రులిద్దరి ప్రభావమూ పడినట్టు కనబడుతుంది. సాహిత్యం చదవడం, రాయడంలో తండ్రి పోలిక వచ్చిందని బి.బి.బెనగల్‌ చెబుతారు. బెనగల్‌ అనే ఆయన గురుదత్‌ జీవితంలో చాలా దశలలో ప్రభావం చూపాడు. ఆయన వాసంతి పదుకోనేకు వరుసకు సోదరుడు. ఆయన పెయింటర్‌, సినిమాలకు హోర్డింగ్స్‌ రాసేవారు. ఆయనకొక స్టూడియో ఉండేది కలకత్తాలో. వాసంతి కుటుంబం ఆర్థిక సమస్యలతో ఉన్నప్పుడు, ఇతర సమస్యలలోనూ అనేక రకాలుగా తన పరిధిలో సాయం చేసేవాడు. ఆయనకు గురుదత్‌ అంటే ప్రత్యేకాభిమానం. గురుదత్‌ ఆయన వేసిన ”జీవన పోరాటం (Struggle for existence) చూసి చాలా ఇష్టపడి తనకు తానే డాన్స్‌ కంపోజ్‌ చేసేవాడట. అప్పుడే అతనికి కళల పట్ల ఉన్న అభిరుచి అర్థమయిందట. అలా అతనిలో ఉండే కళాకారుడు బయటకొచ్చాడు. ఆ తర్వాత అతను ఉదయశంకర్‌ (రవిశంకర్‌ సోదరుడు) నడుపుతున్న ”ఇండియా కల్చరల్‌ సెంటర్‌”లో చేరి డాన్స్‌ నేర్చుకోవాలనుకున్నపుడు ప్రోత్సహించి సహాయం చేశాడు. ఈ సెంటర్‌ నైనితాల్‌ దగ్గర అల్మోరాలో విదేశీ నిధులతో నడుస్తూ ఉండేది. అందులో నటన, నాట్యం, సంగీతంలో అంతర్జాతీయ స్థాయిలో శిక్షణనిస్తూ ఉండేవారు. ఉద్దండులైన గురువులుండేవారు. ఉస్తాద్‌ అల్లావుద్దీన్‌ ఖాన్‌ (అన్నపూర్ణాదేవి, అలీ అక్బర్‌ ఖాన్‌లకు తండ్రి, రవిశంకర్‌కి గురువు), శంకరన్‌ నంబూద్రి లాంటి వారు కొంతకాలం అక్కడ పనిచేశారు. గురుదత్‌ సుమారు రెండు సంవత్సరాలు అక్కడ శిక్షణ పొందాడు. అది అతనికి తర్వాత చలన చిత్ర జీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడి ఉంటుందనిపిస్తుంది.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో విదేశీ నిధులు అగిపోయి ఆ సెంటర్‌ మూతపడింది. గురుదత్‌ తిరిగి ఇంటికి వచ్చేసరికి కుటుంబమంతా బొంబాయి చేరుకుంది. అక్కడ మాతుంగా ప్రాంతంలో ఉండేవారు. ఒకటి, రెండు సంవత్సరాలు నిరుద్యోగం. ఆ సమయంలోనే ”కష్మ కష్‌” అనే కథ రాసుకున్నాడు. అదే తర్వాత ”ప్యాసా”గా రూపుదిద్దుకుంది. అలా కొంతకాలం గడిచాక పూనాలోని ప్రభాత్‌ స్టూడియోలో అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేరడంతో అతని జీవితం ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది.

గురుదత్‌ – మూడో భాగం

గురుదత్‌ ప్రభాత్‌ స్టూడియోలో బి.బి.సెనగల్‌ సహాయంతో ప్రవేశించాడు. ఆయన తనకున్న పరిచయంతో అక్కడ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న బాబూరావ్‌ పాయ్‌కి గురుదత్‌ని రికమెండ్‌ చేశారు. ”ప్రభాత్‌ ఫిల్మ్‌ కంపెనీ”ని ప్రఖ్యాత దర్శకుడు వి.శాంతారామ్‌, వి.జి.దామ్లే, యస్వీ కులకర్ణిలతో స్థాపించి కొన్నేళ్ళ తర్వాత బొంబాయికి మకాం మార్చి తన సొంత కంపెనీ ”రాజ్‌ కమల్‌ కళా మందిర్‌”ను స్థాపించినప్పటికీ ప్రభాత్‌ స్టూడియో ఉన్నత ప్రమాణాలతో నడుస్తూ ఉండేది. అక్కడ గురుదత్‌ కొరియోగ్రాఫర్‌గానే కాక అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అప్పుడప్పుడూ నటుడిగా కూడా పనిచేసేవాడు. అక్కడ అతనికి అమూల్యమైన స్నేహితులు దేవానంద్‌, రహమాన్‌ కూడా దొరికారు. గురుదత్‌కు దేవానంద్‌తో పరిచయం విచిత్రంగా జరిగింది. అక్కడ ఉండే ఒక దోభీ ఒకరి షర్టులు మరొకరికి మార్చి ఇవ్వడంతో జరిగిన పరిచయం గాఢమైన స్నేహంగా పరిణమించింది. దేవానంద్‌, రహమాన్‌, గురుదత్‌లు ముగ్గురూ కలిసి పూనా రోడ్లమీద సైకిళ్ళమీద తిరిగేవారట.

అప్పుడే దేవానంద్‌, గురుదత్‌లు ఒక ఒప్పందం చేసుకున్నారట. ఎవరికి ముందు ఛాన్స్‌ వస్తే వారు మరొకరిని ప్రమోట్‌ చేయాలని. అలాగే దేవానంద్‌ మాట తప్పకుండా తన సినిమా ‘బాజీ’కి గురుదత్‌ని డైరెక్టర్‌గా పెట్టుకున్నాడు. ఆ సినిమా చాలామంది జీవితాలలో చాలా ముఖ్యమయిన మార్పులు తీసుకొచ్చింది. ఆ సినిమాలో ”తడ్‌ బీర్‌ సే బిగడీ హుయీ” పాటతో గురుదత్‌, గీతాదత్‌ల మధ్య ప్రేమ అంకురించింది. రచయితగా సాహిర్‌ లూథియాన్వీని, సంగీత దర్శకుడిగా యస్‌.డి.బర్మన్‌ని ఒక స్థాయిలో నిలబెట్టింది ఈ సినిమా. గజల్‌కు అనుగుణంగా రాసిన పాటను కేబరే పాటగా మార్చిన ఘనత బర్మన్‌ది. వి.కె.మూర్తిలోని ప్రతిభని గురుదత్‌ కనిపెట్టింది ఈ సినిమాలోనే.

గురుదత్‌ – నాల్గవ భాగం

ప్రభాత్‌ స్టూడియోలో రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత, బాబూరావ్‌ పాయ్‌ బొంబాయిలో సొంతగా స్టూడియో ప్రారంభించేటపుడు ఆయనతోపాటు తల్లి అభ్యర్థన మేరకు బొంబాయి చేరుకుని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేయడం ప్రారంభించాడు గురుదత్‌. అలా 1947 నుండి 1950 వరకు అమియా చక్రవర్తి దగ్గర, జ్ఞాన్‌ ముఖర్జీ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు చాలా

ఉపయోగపడింది. ముఖ్యంగా జ్ఞాన్‌ ముఖర్జీ అంటే అతనికి చాలా గౌరవాభిమానాలు. జ్ఞాన్‌ ముఖర్జీ బాగా చదువుకున్నవాడు, సైంటిస్ట్‌గా పనిచేసినవాడూ. ముఖర్జీ దగ్గర పెద్ద లైబ్రరీ ఉండేదట. అప్పటికే ఆయన ‘కిస్మత్‌’ అనే సినిమా తీసి పేరు గడించాడు. ఆయనమీద ఉన్న అభిమానానికి నిదర్శనంగా ”ప్యాసా” సినిమాను ఆయనకు అంకితం చేశాడు గురుదత్‌. 1950లో దేవానంద్‌ సినిమా ”బాజీ”తో దర్శకుడిగా మారాడు. అది సూపర్‌ హిట్టయింది. సినిమా అంటే సమష్టి కృషి కాబట్టి మంచి టీంను ఏర్పాటు చేసుకోవాలనే విషయాన్ని గురదుత్‌ బాగా గ్రహించి ఉండాలి. అతని దగ్గర చాలా మంచి టీమ్‌ ఉండేది. ప్రతిభను కనిపెట్టడంలో అతన్ని మించినవారు లేరు.

”బాజీ” తీసే సమయంలో ఆ కథా రచయిత బలరాజ్‌ సాహ్ని ద్వారా పరిచయమైన బద్రుద్దీన్‌ జమాలుద్దీన్‌ ఖాజీలో ఉన్న కమెడియన్‌ను గుర్తుపెట్టుకుని అతని పేరు ”జానీవాకర్‌”గా మార్చి తాను తీసిన ప్రతి సినిమాలోనూ స్థానం కల్పించడమే కాక అతనితో చాలా స్నేహంగా ఉండేవాడట. ”బాజీ” సినిమా తీసే సమయంలో పరిచయమైన అబ్రార్‌ అల్వీలో అద్భుతమైన రచనా ప్రతిభ దాగుందని కనిపెట్టి అతన్ని ప్రోత్సహించి చివరి వరకూ తన చిత్రాలకు రచయితగానూ, ”సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌” చిత్రానికి దర్శకుడిగానూ అవకాశమిచ్చాడు. ”బాజీ” సినిమాలో ఒక కష్టమైన షాట్‌ను ఉపాయంగా తీసిన అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌ వి.కె.మూర్తిని గుర్తించి నా తర్వాతి సినిమాకి నువ్వే సినిమాటోగ్రాఫర్‌వి అని చెప్పడమే కాక ఆ ప్రామిస్‌ను నిలబెట్టుకుని తన సినిమాలన్నింటిలో మూర్తికి అవకాశమిచ్చాడు. ”కాగజ్‌ కే ఫూల్‌”లో సినిమాటోగ్రఫీకి చాలా పేరొచ్చింది. ఇక మ్యూజిక్‌ డైరెక్టర్లలో సాధారణంగా యస్‌.డి.బర్మన్‌, ఓ.పి.నయ్యర్‌, హేమంత్‌ కుమార్లను ఇష్టపడేవాడు. ”చౌదవీ కా చాంద్‌”కి మాత్రం రవిని తీసుకున్నాడు.

గురుదత్‌ సినిమాలలో పాటల చిత్రీకరణ చాలా ప్రత్యేకంగా

ఉంటుంది. అవి సన్నివేశానికి పరిపుష్టత చేకూర్చడానికీ, ఒక మూడ్‌ని సృష్టించడానికీ ఉపయోగించాలే కానీ పాట వచ్చినపుడు ప్రేక్షకుడు బయటకు లేచి వెళ్ళేట్టుగా ఉండకూడదని శ్రద్ధ తీసుకునేవాడట. తన చిత్రాలు ఇతరులెవరైనా డైరెక్ట్‌ చేస్తే వాటిలో పాటలు మాత్రం తానే డైరెక్ట్‌ చేసేవాడని అబ్రార్‌ అలీ చెబుతాడు. అతని ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా గురుస్వామి అనే అతను ఉండేవాడట. అతనితో స్నేహం బాంబే స్టూడియోస్‌ నాటినుంచీ చివరివరకూ కొనసాగింది. పాటల రచయితలుగా కొనసాగినవారు సాహిర్‌ లూథియానీ, కైఫీ అజ్మీ, మజ్రుహ్‌ సుల్తాన్‌ పురీ. వీరిలో సాహిర్‌ ”బాజీ” నుండి ”ప్యాసా” వరకు అద్భుతమైన పాటలందించాడు. ”ప్యాసా”లో ఉపయోగించిన కవితలన్నీ సాహిర్‌ రాసిన ”తలాఖియా” అనే పుస్తకంలో నుండి తీసుకున్నవి. ఇక గాయనీ గాయకులుగా రఫీ, గీతా, హేమంత్‌లు చూపిన ప్రతిభ మాటలకందనిది. గురుదత్‌ సినిమాలలోని పాటలలో రఫీ ప్రాణ ప్రతిష్ట చేశాడనిపిస్తుంది. గీతా, హేమంత్‌లు అందుకేమీ తీసిపోలేదు. అలాంటి మంచి టీమ్‌తో కావలసిన ఎఫెక్ట్‌ కోసం ఎక్కడా రాజీపడకుండా ఆణిముత్యాల్లాంటి సినిమాలను మనకందించాడు గురుదత్‌. ఇక ”బాజీ”లో అంకురించిన ప్రేమ పండి పెళ్ళికి దారితీయడానికి రెండు సంవత్సరాల కాలం పట్టింది. ఆ సమయం కూడా గీతా తల్లిదండ్రులను ఒప్పించడానికే. సంపాదనాపరురాలయిన ఆమెను వదులుకోవడానికి వారు తొందరగా ఇష్టపడలేదట. వారి పెళ్ళి సమయానికి ఆమె పేరొందిన గాయని, అతను అప్పుడే పరిశ్రమలో ప్రవేశించి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న యువ దర్శకుడు. అతను ఆమెని సంపాదన కోసమే పెళ్ళి చేసుకున్నాడని చాలామంది మొదట్లో చెవులు కొరుక్కున్నారట. అతనికి ప్రభాస్‌ స్టూడియోలో ఉన్నప్పుడే ఒకటి, రెండు చిన్న చిన్న ప్రణయాలున్నా అవి పెళ్ళికి దారితీసేంత గాఢమైనవి కాదు. 1953లో జరిగిన పెళ్ళిలో ఇద్దరూ ఎంత ఆనందంగా ఉన్నారో పైన ఫోటోలు చూస్తే తెలుస్తుంది. పెళ్ళయ్యాక కొంతకాలం వారి జీవితం సాఫీగా ఆనందంగానే సాగింది. అయితే నెమ్మదిగా వారి స్వభావాల మధ్య వైరుధ్యం వారి వివాహ జీవితంమీద ప్రభావం చూపసాగింది. అసలు ఇద్దరు గొప్ప ఆర్టిస్టులు పెళ్ళి చేసుకోకూడదేమో అనిపిస్తుంది నాకు. గురుదత్‌ అంతర్ముఖుడు, సోషల్‌ ఫంక్షన్స్‌ని ఇష్టపడడు, వృత్తి జీవితంలో ఎంత క్రమశిక్షణగా ఉంటాడో, వ్యక్తిగత జీవితంలో అంత అరాచకంగా ఉంటాడు, కుటుంబాన్ని పట్టించుకోడు అంటాడు అతని తమ్ముడు ఆత్మారామ్‌. గీతా చాలా కలుపుగోలు మనిషి. ఎప్పుడూ చుట్టూ స్నేహితులుండాలి. సరదాలు, సంతోషాలు, సోషల్‌ పార్టీలు… స్వభావరీత్యా ఇద్దరికీ పడకపోవడం మొదలయి వారి వివాహ జీవితం బీటలు వారడం మొదలుపెట్టింది.

గురుదత్‌ – అయిదవ భాగం

1953 మే 26వ తేదీన పెళ్ళాడిన గురుదత్‌, గీతాదత్‌లకు 1954 జులై 9వ తేదీన సరిగ్గా గురుదత్‌ పుట్టిన రోజునే తరుణ్‌ జన్మించాడు. అందుకేనేమో తండ్రికి ఆ కొడుకంటే ఎక్కువ ఇష్టం. 1956లో అరుణ్‌ జన్మించాడు. తర్వాత ఆరేళ్ళకి ఆడపిల్ల కోసం తపించిపోతున్న గురుదత్‌కి 1962 ఆగస్ట్‌ 19వ తేదీన నీనా జన్మించింది. ఆ మధ్యకాలంలో వారి వివాహ జీవితంలో అనేకసార్లు తగాదాలు, విడిగా ఉండడాలూ జరుగుతూనే ఉన్నాయి. వారి మధ్య విభేదాలకు గురుదత్‌కీ, వహీదా రెహమాన్‌కీ ఉన్న అనుబంధమే కారణమనే ఒక అభిప్రాయం కూడా బలంగా ఉంది. అసలు వహీదాతో పరిచయమే అతి విచిత్రంగా జరిగిందంటాడు రచయిత అబ్రార్‌ అల్వీ.

అదెలా అంటే ”బాజీ” విజయం సాధించాక అదే బాటలో ఇంకో రెండు రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్ల్లర్స్‌ ”జాల్‌”, ”బాజ్‌” తీశాడు గురుదత్‌. మొత్తం మూడు సినిమాలలోనూ గీతాబాలి హీరోయిన్‌. ”బాజ్‌” సినిమాకి ఆమె సోదరి హరిదర్శన్‌ కౌర్‌ గురుదత్‌కి సహ నిర్మాత. హెచ్‌.జి.ఫిల్మ్స్‌ పేరుతో తీశారు. ఆ సినిమా తీసే సమయంలో ఆమె ప్రేమికుడు, నటుడు అయిన యశ్వంత్‌కి బంధువయిన అబ్రార్‌ అల్వీ షూటింగ్‌కి చూడడానికి వస్తుండేవాడు. గురుదత్‌ అతనిలో మంచి రచయిత దాగున్నాడని గ్రహించి తన తదుపరి సినిమా ”ఆర్‌ పార్‌”కి రచయితగా నియమించుకున్నాడు. అది సూపర్‌ హిట్టయింది. అప్పటినుండి అతను చివరివరకూ గురుదత్‌కి ఆస్థాన రచయితగానూ, ఆంతరంగిక మిత్రుడిగానూ ఉన్నాడు. అబ్రార్‌ రాసిన ”మోడ్రన్‌ మేరేజ్‌” అనే కథ ఆధారంగా మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55 సినిమా రూపొందింది. అందులో హీరో కార్టూనిస్ట్‌. ఆ సినిమాలో వాడిన కార్టూన్లన్నీ ప్రముఖ కార్టూనిస్ట్‌ ఆర్కే లక్ష్మణ్‌వే. అందులో చిత్రాలు గీస్తున్నట్లు కనిపించే చెయ్యి కూడా ఆయనదే. ఈ కామెడీ పిక్చర్లో హీరోయిన్‌ మధుబాల హాస్యాన్ని అందంగా పండించింది. హీరో పాత్రని కూడా చక్కటి కామెడీ టచ్‌తో తీర్చిదిద్దాడు అబ్రార్‌ అల్వీ. అది ఘన విజయం సాధించింది. తర్వాత సినిమా సబ్జెక్ట్‌ కోసం వెతుకుతుంటే తెలుగునాట ”మిస్సమ్మ” అనే సినిమా సంచలనాలు సృష్టిస్తోందనీ, అది చూసి దాన్ని హిందీలో రీమేక్‌ చేస్తే బాగుంటుందనీ గురుదత్‌కి హైద్రాబాద్‌ ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్‌ సూచించాడు. అబ్రార్‌ని హైద్రాబాద్‌ వెళ్ళి చూసి రమ్మన్నాడు గురుదత్‌. అయితే ఫ్లయిట్‌కీ, ట్రెయిన్‌కి కూడా టికెట్లు దొరక్కపోవడంతో కారులో బయల్దేరిన అబ్రార్‌ గురుదత్‌ని కూడా తోడు రమ్మన్నాడు. అలా బయల్దేరిన వారి కారుకి ఒక ఎడ్లబండి అడ్డు వచ్చి కారు యాక్సిడెంటవడంతో అది బాగవడానికి రెండు, మూడు రోజులు పట్టింది. ఆ సమయంలో వారు ‘మిస్సమ్మ’ చూశారు కానీ ఎందుకో గురుదత్‌కి ఆ సినిమా నచ్చలేదు. ఈలోగా వారు మాట్లాడుకుంటున్న ఆఫీసు ఎదురుగా బిల్డింగ్‌లోకి ఒక తార కారులో రావడం, ఆ వీథిలో పిల్లలు ఆమె కారు వెంట పడడం చూసి ‘ఎవరామె’ అని అడుగగా, ఆమె ఒక వర్ధమాన నృత్య తార అని ”రోజులు మారాయి”లో ఆమె చేసిన నృత్యం ప్రజలకు వెర్రెక్కిస్తోందనీ, ఆమె పేరు వహీదా రెహమాన్‌ అనీ చెప్పారట. అంతేకాక ఆమెను ఆఫీసుకి పిలిచి వీరికి పరిచయం చేశారట. ఆమె సాదా సీదాగా ఉండి ముక్తసరిగా దక్షిణాది యాసతో హిందీ మాట్లాడిందట. తర్వాత ”రోజులు మారాయి”లో ఆమె డాన్స్‌ చూసి గురుదత్‌, అబ్రార్‌ ఆమె ముఖం ఫోటోజెనిక్‌గా ఉందని అభిప్రాయపడ్డారట. బొంబాయి వెళ్ళాక ”సిఐడి” సినిమా నిర్మాణ సమయంలో ఒక వాంప్‌ కారెక్టర్‌కి వహీదాని గుర్తు చేసుకుని తమ డిస్ట్రిబ్యూటర్‌ ద్వారా మూడేళ్ళకు కాంట్రాక్ట్‌ రాయించుకుని బుక్‌ చేయమన్నాడట గురుదత్‌. అది ఆ తర్వాత అయిదేళ్ళయింది. ఆమెను సినిమా కోసం పేరు మార్చుకోమన్నా, ఆమెకు ఇష్టంలేని దుస్తులు వేసుకోమన్నా ఖరాఖండిగా తిరస్కరించింది వహీదా. ఇది ఆమె రాజీపడని స్వభావాన్నీ, దృఢ నిర్ణయాన్నీ సూచిస్తోంది.

గురుదత్‌ ఆదేశం ప్రకారం ”సిఐడి”లో ఆమెకు నటన విషయంలోనూ, డైలాగులు పలకడంలోనూ శిక్షణ ఇచ్చింది అబ్రార్‌ అల్వీనే. ఆమె చాలా పట్టుదలగా నేర్చుకుని మంచి నటిగా పరిణతి చెందింది. ఆమె పెర్ఫార్మెన్స్‌ చూసి ”ప్యాసా”లో ”గులాబ్‌” రోల్‌ ఇచ్చారు. ఆ సినిమాలో కూడా అబ్రార్‌ తర్ఫీదు కొనసాగింది. ”ప్యాసా” గురుదత్‌ నిరుద్యోగ పర్వంలో, నిరాశగా ఉన్న రోజుల్లో రాసుకున్న ”కష్మ కష్‌” ఆధారంగా రాసుకున్న దానికి అబ్రార్‌ కథ, మాటలు సమకూర్చాడు. ఇది గురుదత్‌ ”మాగ్నమ్‌ ఓపస్‌”గా చెబుతారు. సాహిర్‌ లూథియాన్వీ పాటలు, బర్మన్‌ దా సంగీతం, గాయనీ గాయకులు రఫీ, గీతా, హేమంత్‌ పాడిన విధానం, నటీనటులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేయడం (ముఖ్యంగా వహీదా నటన, అందం ఈ సినిమాలో వంకపెట్టలేనట్లుగా ఉన్నాయి) ఈ సినిమాను అజరామరమైన కళాఖండంగా మలిచాయి. మన తెలుగులో వచ్చిన ”మల్లెపూవు” దీనికి పేలవమైన అనుకరణ. ”సిఐడి” సమయంలోనే వహీదా, గురుదత్‌ల గురించి సినీ జీవులు చెవులు కొరుక్కున్నారు. ”ప్యాసా” సమయానికి గురుదత్‌కీ, ఆయన భార్యకీ గొడవలు తారస్థాయిలో ఉన్నాయి. అతను మొదటిసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసి అదృష్టవశాత్తు బయటపడ్డాడు.

గురుదత్‌ – ఆరవభాగం

గీతాదత్‌ పరిణతి చెందని ప్రవర్తనా, అనుమానించే స్వభావమూ గురుదత్‌ని వహీదాకి మరింతగా దగ్గర చేశాయేమోనని భావించేవారట. అబ్రార్‌ అలీ కానీ, గురుదత్‌ తల్లి, ఇతర కుటుంబసభ్యులు కానీ గురుదత్‌కి వహీదానే ఇంటల్లెక్చువల్‌గా తగిన జోడీ అని భావించేవారట. అయితే అంతర్ముఖుడూ, గుట్టు మనిషీ అయిన గురుదత్‌ ఎక్కడా ఎవరి దగ్గరా తమ సంబంధం గురించి మాట్లాడలేదట. చివరికి ఎంతో ఆంతరంగిక మిత్రుడయిన అబ్రార్‌ దగ్గర కూడా. అతని సోదరుడు ఆత్మారామ్‌ ఏమంటాడంటే గీతా, గురుదత్‌లిద్దరూ గొప్ప ఆర్టిస్టులూ, మంచివాళ్ళే కానీ వారి ఇంటల్లెక్చువల్‌ లెవల్స్‌ వేరు అని. అబ్రార్‌ అలీకి, వహీదా తల్లితో కూడా పరిచయముండేదట. వహీదా తల్లి అబ్రార్‌తో ‘మా అమ్మాయి జీవితం ఏం కాబోతోంది. అతను పెళ్ళాం, పిల్లలున్నవాడు. మా అమ్మాయి కోసం ప్రాణాలయినా ఇస్తానంటున్నాడట. మా అమ్మాయి ఇవ్వాళొకళ్ళనీ, రేపొకళ్ళనీ మార్చే మనిషి కాదు” అందట. గీతా కూడా అబ్రార్‌ దగ్గరికొచ్చి ”నీ స్నేహితుడికి చెప్పు అతను వహీదా పిచ్చిలో ఉన్నాడు” అని బాధపడిందట. ఇంట్లో కోల్పోయిన సుఖం, శాంతి గురుదత్‌కి వహీదా దగ్గర దొరికాయేమో అనుకున్నాం, మేమెవ్వరమూ దాన్ని తప్పుగా భావించలేదు అని అబ్రార్‌ అన్నాడట. కానీ వారిద్దరి మధ్యా ఉన్నది మానసిక బంధమేనని, శారీరక సంబంధం లేదని, వహీదా వైపు నుండి ఆలోచిస్తే ఒక చిన్న టౌన్‌ అయిన బెజవాడ నుండి (అలా అని అబ్రార్‌ పుస్తకంలో ఉంది) గురుదత్‌ని నమ్ముకుని తల్లి, సోదరి సయీదాలతో బొంబాయి చేరుకుంది. అతనే ఆమెకు మార్గదర్శి, గురువు, తనను మంచి నటిగా తీర్చిదిద్దినవాడూ. హఠాత్తుగా తల్లి మరణించి ఒంటరితనంలో ఉంటే తోడుగా నిలిచాడు. సహజంగా ఆకర్షణ ఉంటుంది కానీ వహీదా ఈనాటి వరకూ తానిచ్చిన ఏ ఇంటర్వ్యూలోనూ తమ మధ్య అనుబంధం ఉన్నట్టు ధృవీకరించలేదు. ”ఆయనొక గొప్ప డైరెక్టర్‌. నన్ను హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి నటిగా మంచి అవకాశాలిచ్చారు. అంతకు మించి మా మధ్య ఏ సంబంధం లేదు” అంటుంది. గురుదత్‌ సినిమాలలో వేసిన పాత్రలు అతని నిజ జీవితంమీద ప్రభావం చూపాయనీ, వాటిలో ఉండే నైరాశ్యం అతన్ని నిజజీవితంలో కూడా వెంటాడిందనీ అతని సోదరి లలితా లాజ్మీ అంటారు. అందుకు ఉదాహరణగా ”ప్యాసా”, ”కాగజ్‌ కే ఫూల్‌” పాత్రలను చెప్పుకోవచ్చు. ”కాగజ్‌ కే ఫూల్‌” సినిమాకు గురుదత్‌ జీవితమూ, అతని రోల్‌ మోడల్‌ జ్ఞాన్‌ ముఖర్జీ జీవితమూ ఆధారమంటారు. అది భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి స్కోప్‌ సినిమా. దానికోసం వి.కె.మూర్తిని విదేశాలకు కూడా పంపాడు గురుదత్‌. బెస్ట్‌ సినిమాటోగ్రఫీ అవార్డు కూడా గెలుచుకుంది. కానీ బాక్సాఫీసు వద్ద చతికిలపడింది. ఆ సినిమా ఫ్లాపవడం గురుదత్‌ని బాగా కృంగదీసింది. మళ్ళీ ఇక డైరెక్షన్‌ చేయనని తీర్మానించాడు, చెయ్యలేదు కూడా. విచిత్రంగా ఆ సినిమా తర్వాత్తర్వాత గొప్ప క్లాసిక్‌గా పేరొందింది. తర్వాత తీసిన ”చౌదవీ కా చాంద్‌” దర్శకుడిగా సూపర్‌ హిట్‌ దర్శకుడైన ఎం.సాదిక్‌ను ఎంపిక చేసుకున్నప్పటికీ పాటలను మాత్రం తనే చిత్రీకరించాడు, వహీదాను తన మనసుతీరా అందంగా చూపెట్టాడంటారు. 1962లో వచ్చిన ”సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌” ఒక రకంగా అతని చివరి చిత్రం. దీనికి బిమల్‌ మిత్రా కథ ఆధారం. దర్శకుడు అబ్రార్‌ అల్వీ. మీనాకుమారి హీరోయిన్‌. ఆమె నిజ జీవితం మీద ఈ పాత్ర ప్రభావం ఉందంటారు. ఈ సినిమా దర్శకుడిగా అబ్రార్‌ మంచి ప్రతిభ చూపాడు. పాటలు మాత్రం గురుదత్‌ చిత్రీకరించాడు. అయితే చాలామంది అబ్రార్‌ అల్వీ పేరుపెట్టి గురుదత్తే దర్శకత్వం వహించాడని అపోహ పడతారని అబ్రార్‌ చాలా వాపోయాడు. నాకు గురుదత్‌ సినిమాలన్నింటిలో ఇష్టమయిన సినిమా. ఈ సినిమాలో గీతాదత్‌ వహీదాకు ప్లేబ్యాక్‌ పాడనందట. అందుకే ఆశాభోంస్లేతో పాడించారు. గీతా పాడిన రెండు పాటలూ మీనాకుమారి మీదే చిత్రీకరించారు. ఈ సినిమాకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు, ప్రెసిడెంట్‌ అవార్డూ కూడా వచ్చాయి. ఇది బెర్లిన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు అర్హత పొందింది. ఈ సినిమా చిత్రీకరణ చివరి రోజులలో గురుదత్‌, గీతాదత్‌, వహీదాల మధ్య ఉన్న ముక్కోణపు ప్రేమకథ ముగిసిపోయింది. ఎలాగంటే వహీదా, గురుదత్‌లను అనుమానించిన గీతాదత్‌ ఏదో ప్రోగ్రామ్‌కి లండన్‌ వెళ్ళి తిరుగు ప్రయాణంలో కాశ్మీర్‌ వెళ్ళిపోయిందట. ఎంతకూ రాని గీతా కోసం కబురు చేస్తే గుర్రం మీదనుండి పడ్డాననీ, కాలర్‌ బోన్‌ ఫ్రాక్చరయిందనీ తెలిపిందట. తన అసిస్టెంట్‌ని పంపి ఆమె వేరొకరితో స్నేహంగా మెసులుతున్నట్లు తెలుసుకున్న గురుదత్‌ ఈగో హర్టయిందట. వెంటనే తన ప్రవర్తనలో మార్పు వచ్చిందట, వహీదాను దూరం పెట్టాడట. తన స్టూడియోలో ఆమెకు ఒక మేకప్‌ రూమ్‌ ఉండేదట. అందులో అడుగు పెట్టడానికి వీల్లేదని ఒక మనిషితో చెప్పించాడట. అలా రెండురోజులు జరిగేటప్పటికి ఆమె కళ్ళనీళ్ళతో తిరిగి వెనక్కు వెళ్ళిపోయిందట. ఇదంతా అబ్రార్‌కి చెప్పి బాధపడిందట. మళ్ళీ స్టూడియోలో అడుగు పెట్టడానికి ఇష్టపడలేదట. మళ్ళీ ఆఖరి సీన్లో ఆమెతో అవసరం పడి అడిగితే ఎంతకీ ఒప్పుకోలేదట. చివరికి ఎంతో బతిమాలగా ఎన్నో షరతులు పెట్టి షూటింగ్‌కి వచ్చిందట. అవి అతనితో మాట్లాడను, అతను నన్ను ముట్టుకోకూడదు, ఇలా.. అబ్రార్‌ గురుదత్‌ని ఈ విషయమై నిలదీశాడట. ”పెళ్ళాం, పిల్లలున్నవాడివి నిన్ను ఇంకో సంబంధం పెట్టుకోమని ఎవరం ప్రోత్సహించం. ఏదో ఓదార్పు కోరుకుని ఆమెకు దగ్గరయ్యావని మేమంతా అనుకున్నాం. అలాంటిది ఆమెకు కారణం చెప్పకుండా కఠినంగా దూరం పెట్టడం న్యాయమా” అని అడిగినా గురుదత్‌ ఏమీ చెప్పలేదట. అప్పటినుండీ ఒకరినొకరు కన్నెత్తి చూసేవారు కాదట, పన్నెత్తి పలకరించేవారు కాదట. ఆ తర్వాత గురుదత్‌ కాశ్మీర్‌ వెళ్ళి గీతాను ప్రసన్నం చేసుకుని అక్కడే కొంతకాలం గడిపి వచ్చారట. అప్పుడే అతను కోరుకున్నట్లుగా 1962 ఆగస్టు 19న అమ్మాయి పుట్టింది.

గురుదత్‌ – ఒక తిరిగిరాని వసంతం

1961లో ”సాహెబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌” నిర్మాణం చివరి దశలో దూరమైన వహీదా, గురుదత్‌ మళ్ళీ కలవలేదు. వారి మధ్య దూరం అలాగే ఉండిపోయింది. ఆ సినిమాలో బాకీ ఉన్న సీన్‌లో నటించడానికి వహీదాని ఎంతో బతిమాలవలసి వచ్చింది దర్శకుడయిన అబ్రార్‌ అలీకి అని చెప్పుకున్నాం కదా. విచిత్రంగా ఆ కాంబినేషన్‌ సీన్లో నటించడానికి గురుదత్‌ కూడా ఆసక్తి చూపలేదట. ఆమె లేకుండా కుదరదా అని అడిగాడట. ఆ తర్వాత రెండేళ్ళకి 1963లో బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కలిసినపుడు కూడా ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదట. ఎడమొహం పెడమొహమేనట. అటునుండీ లండన్‌ వెళ్ళిపోయిన వహీదాకి ఏమైనా సహాయం అవసరమైతే చేయమని అబ్రార్‌ అల్వీ తనకూ, గురుదత్‌కూ తెలిసిన కామన్‌ ఫ్రెండ్‌ లండన్‌లో ఉండే ఒకాయనకి లేఖ రాస్తే, దాన్ని కూడా తప్పు పట్టాడట గురుదత్‌. ”నీకా లండనాయన్ని పరిచయం చేసింది అందరికి ఉత్తరాలు రాసిమ్మనా” అని కోప్పడ్డాడట. గీతా, గురుదత్‌ల సమస్యలు సమసిపోయి సయోధ్య నెలకొన్నట్లే కనపడింది. కాశ్మీర్‌ నుంచి వచ్చాక ఇద్దరూ కలిసి జీవించసాగారు. 1964 మొదట్లో మళ్ళీ తగాదాలతో విడిపోయి ఇద్దరూ విడివిడిగా నివసించసాగారు. గీతా ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి దగ్గర శాంతాక్రజ్‌ ప్రాంతంలోనూ, గురుదత్‌ తన నమ్మిన బంటు రతన్‌తో కలిసి పొద్దార్‌ రోడ్‌లోని ఆర్క్‌ రాయల్‌ అనే ఫ్లాట్‌లోనూ ఉండేవారు. గురుదత్‌ నిర్వేదంగా ఉంటున్నాడని తెలిసి అబ్రార్‌ అలీ సాయంత్రాలు తప్పకుండా అక్కడే గడిపేవాడు. గురుదత్‌ సొంత సినిమా ”బహారే ఫిర్‌ భీ ఆయేగీ” లతీఫ్‌ దర్శకత్వంలో తనూజ, మాలాసిన్హా హీరోయిన్లుగా, గురుదత్‌ హీరోగా మొదలయింది. అబ్రారే రచయిత. స్టూడియో నడవడానికీ, కంపెనీ ఖర్చుల కోసం గురుదత్‌ బయటి చిత్రాలలో కూడా నటించడం మొదలుపెట్టాడు. అందులో కొన్ని దక్షిణాది వారి చిత్రాలు కూడా ఉన్నాయి. కె.ఆసిఫ్‌ ”లవ్‌ అండ్‌ గాడ్‌” నిర్మాణంలో ఉంది. గురుదత్‌లో గూడుకట్టుకున్న నిర్వేదం అతన్ని అతిగా మద్యం సేవించడానికి, నిద్రమాత్రలకీ అలవాటు పడేలా చేసింది. ”ఇంకా ఏమి చూడాలి, జీవితంలో విజయాన్నీ చూశాను, ఓటమినీ చూశాను. అనుకున్నవన్నీ జరిగాయి” అంటూ ”యే దునియా అగర్‌ మిల్‌ భి జాయెయేతో క్యా హై” అనే ”ప్యాసా”లోని పాటను ఉదహరించేవాడని అతని సినిమాటోగ్రాఫర్‌ వి.కె.మూర్తి చెబుతాడు. 1964 అక్టోబర్‌ 9వ తేదీ మధ్యాహ్నం గురుదత్‌ ”బహారే ఫిర్‌ భీ ఆయేగీ (వసంతం తిరిగి మళ్ళీ వస్తుంది)” షూటింగ్‌లో చాలా ఉల్లాసంగా కనిపించాడు. అతనికి పిల్లలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆడపిల్ల నీనా అంటే. షూటింగ్‌కి పిల్లలని పంపమని కబురు చేస్తే గీతా వారిని పంపింది. వారితో కలిసి తనకెంతో ఇష్టమయిన గాలిపటాలెగరేశాడు. తనూజ, మాలాసిన్హా, తన సోదరుడు దేవీదత్‌లతో కలిసి భోంచేశాడు. పిల్లలను షాపింగ్‌కి తీసుకెళ్ళి వాళ్ళకు కావలసినవి, తమ్ముడు దేవీదత్‌కు కావలసినవీ కొనిపెట్టాడు. సాయంత్రం పిల్లలను తల్లి దగ్గరికి పంపించివేశాడు. సాయంత్రం ”ఆర్క్‌ రాయల్‌” నివాసానికి చేరుకున్న అబ్రార్‌కి గురుదత్‌ చాలాసేపటినుండీ తాగుతున్నట్లు కనపడ్డాడు. సాయంత్రం ఐదున్నర నుంచీ తాగుతున్నారని సహాయకుడు రతన్‌ చెప్పాడు. అబ్రార్‌తో గురుదత్‌ తనకు ఒక స్నేహితుడు పిచ్చాసుపత్రి నుండీ రాసిన లేఖ చదివాననీ, అది తనను కలచివేసిందనీ, అసలు అతను పిచ్చిలో రాసాడంటే నమ్మేట్టుగా లేదనీ, అప్పుడప్పుడూ తనకు కూడా పిచ్చెక్కుతుందేమోనని భయంగా ఉంటుందనీ చెప్పాడు. కాసేపటికి తనకు తోడుగా ఉన్న తమ్ముడితో బయటికి వెళ్ళి గీతాకి పిల్లలని పంపమని ఫోన్‌ చెయ్యమన్నాడు. అతను ఫోన్‌ చేసి తిరిగి వచ్చి ”పిల్లలు మధ్యాహ్నమంతా తిరిగి అలిసిపోయారని, రేపు పంపుతానని చెప్పిందని” చెప్పాడు. దాంతో చిరాకుపడ్డాడు గురుదత్‌. కాసేపటికి దేవీదత్‌ వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. టాక్స్‌ కన్సల్టెంట్‌ మిస్టర్‌ గోల్‌ అనే ఆయన కూడా వచ్చి చేరాడు, మద్యం సేవించసాగారు. అబ్రార్‌ షూటింగ్‌ జరుగుతున్న సినిమాలో ఆఖరి సీన్‌లో మాలాసిన్హా చనిపోయే సీన్‌ రాస్తున్నాడు. అతనికి అప్పుడు తెలీదు తన ముందు జరిగేది గురుదత్‌ జీవితంలో ఆఖరి సీనని. మళ్ళీ గురుదత్‌ కిందకు వెళ్ళి పిల్లల కోసం ఫోన్‌ చేసి ”పిల్లలను ఇప్పుడు పంపకపోతే రేపు నా శవాన్ని చూస్తావు” అని బెదిరించినట్లు అతని మాటల వలన అబ్రార్‌కి తెలిసింది. మిస్టర్‌ గోల్‌ వెళ్ళాక గురుదత్‌, అబ్రార్‌ కలిసి డిన్నర్‌ తీసుకున్నారు. గురుదత్‌ సరిగ్గా తినకుండానే లేచి ”అబ్రార్‌ నువ్వేమనుకోకపోతే నేనిక పడుకుంటాను” అన్నాడు. అవే అతని ఆఖరి మాటలు. అబ్రార్‌ తిరిగి తను పనిచేస్తున్న వేరే సినిమా ఆఫీసుకి వెళ్ళిపోయాడు. అతని సహాయకుడు రతన్‌ చెప్పిన ప్రకారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో లేచిన గురుదత్‌ అబ్రార్‌ వున్నాడా అని అడిగి తాగడానికి ఒక సీసా వెతుక్కుని తీసుకుని తిరిగి మళ్ళీ తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఉదయం అనేకసార్లు ఫోన్‌ చేసిన గీతా 11 గంటల ప్రాంతంలో తలుపులు పగలగొట్టించి చూస్తే గురుదత్‌ తిరిగిరాని వసంతంలా విగతజీవుడై పడిఉన్నాడు. ఎదురుగా టీపాయ్‌ మీద ఖాళీ గ్లాసు, పక్కమీద సగం చదివిన హిందీ నవల. గ్లాసులో ఉన్న ద్రవాన్ని పరీక్షించి నిద్రమాత్రల అవశేషాలున్నాయనీ, తెల్లవారుజామున అయిదూ, ఆరు గంటల మధ్య మరణం సంభవించి ఉంటుందనీ నిర్ధారించారు డాక్టర్లు. అలా 39 ఏళ్ళకే దర్శక మేధావి గురుదత్‌ శకం ముగిసిపోయింది.

గుండె పగిలిన గీతా ఆర్నెల్లవరకూ కన్నబిడ్డలను కూడా గుర్తుపట్టలేదంట. తన జ్యుయలరీ అమ్మి కొంతవరకూ అప్పులు తీర్చిందట. కోల్పోయిన కెరీర్‌ పొందడానికీ, ఆర్థికావసరాల కోసం ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరకు సినిమాలలో నటించడానికి కూడా సిద్ధపడింది. ఆఖరికి తను కూడా అతిగా మద్యం సేవించిన కారణంగా వచ్చిన లివర్‌ సమస్యతో 1972లో ఈ లోకం నుండీ శాశ్వతంగా సెలవు తీసుకుంది. వారి పిల్లలు తల్లిదండ్రుల స్మృతికి నివాళిగా ‘మాసూమ్‌’ అనే సినిమా సమర్పించారు. కొన్ని కుటుంబాలను విధి వెంటాడుతూనే ఉంటుంది. తరుణ్‌ చిన్నవయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అరుణ్‌ అతిగా మద్యం సేవించి లివర్‌ సమస్యతో మరిణించాడు. కూతురు నీనా నటుడు మహమూద్‌ సోదరి కొడుకు నౌషద్‌ను పెళ్ళి చేసుకుని గాయనిగా తన తల్లికి ”శ్రద్ధాంజలి”గా ఒక ఆల్బమ్‌ రిలీజ్‌ చేసింది. గురుదత్‌ భౌతికంగా మన మధ్య లేకపోయినా అతని చిత్రాలు మనకు అతనేమిటో చెబుతాయి. అలా అతన్ని ప్రేక్షకుల మదిలో చిరంజీవిని చేశాయి. అందుకే నేనంటాను అతనికి మరణం లేదని. ఒక ”ప్యాసా”, ఒక ”కాగజ్‌ కే ఫూల్‌”, ఒక ”సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌” తీయాలంటే ఇంకో గురుదత్‌ పుట్టాల్సిందే.

 

Share
This entry was posted in సినిమా లోకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో