రిజర్వేషన్లుండాలె -రాజమణి

”మా అమ్మకి గానీ, మా నాన్నకి గానీ అసలే విషయాలు తెలీదు. నేను, మా చెల్లె. మాకు ఎట్లనో స్కూలులో జాయిన్‌ చేసిచ్చిన్రు. అప్పుడు ఒక రూపాయి ఫీజుండె. ఎన్ని సంవత్సరాలో డేటాఫ్‌ బర్త్‌ తెలవది. అమ్మకి తెల్వది నాన్నకి తెల్వది. ఎంత ఏజుంటదిరా ఈమెకి, అంటే… ఆ… ఆరు ఏడు ఏడ్లుండచ్చు దొరా అంటుండె మా నాయన. అట్లా జెయిను చేసిండు స్కూల్ల. ఇద్దరికి కల్పి రెండు రూపాయలు. కాకపోతే అప్పుడు మా నాయన దగ్గర ఒక్క రూపాయే ఉండె. నాక్కొంచెం గుర్తు. ఒక్క రూపాయితోనే జెయిను చేసిండు. అప్పుడు మా చెల్లి చిన్నగుండె. రాలేదు తను. నేను టూ ఇయర్సు పోయిన తర్వాత అప్పుడు మా చెల్లొచ్చింది. అప్పుడు బాగ చిన్నగుండి ఏడుస్తుండె బాగ. మాకు డ్రసెస్‌ గూడ సరిగ్గుండక పోతుండె. బట్టలేవో ఉంటుండె. చెప్పులయితే ఫిఫ్తుక్లాసుదాక లేవు. నిజంగ చెప్తున్న. ఉట్టి బాగు, పుస్తకాలు డ్రెస్‌ తెస్తుండె. చెప్పులంటె ఇంట్రస్టు లేకుండె. మేం కూడా అడిగేటోల్లం కాదు. మా కస్సలేం తెలియదు కద! బస్తీలో ఉన్నం. ఏం తెల్వదస్సలు. ఇక్కడనే, ఫస్టుక్లాసుకి నెస్లీ స్కూలు పోతుంటిని కానీ ఏం తెల్వదస్సలు. స్కూలుకి పోతుంటిమి, వస్తుంటిమి. హబ్సిగూడా పక్కకి చుట్టూ ఏం తెల్వదస్సలు. టెన్త్‌దాకా పోయిన ఉట్టి స్టేషను సికింద్రాబాదు మాత్రం తెలుస్తుండె నాకు. సెవెన్త్‌, ఎయిత్‌ క్లాసయిందాక ఎప్పుడు దసరా పండగకన్నా, పుస్తకాలు తేవడానికన్నా, అప్పుడప్పుడు పోయి బజారుకెళ్ళి మా అమ్మతో కానీ నాన్నతో కానీ పోయి తెచ్చుకుంటుంటిమి. అక్కడెవ్వరూ చెప్పేటోళ్ళు లేకపోతుండె. మాకేం తెల్వకపోతుండె. అట్లాట్లా కొన్నిరోజులు పోయిన తర్వాత మా అమ్మమ్మొస్తుండె. మా అమ్మ డ్యూటీకి పోతుండె. అమ్మమ్మొచ్చి, వారానికి రెండుసార్లొచ్చి తలస్నానం చేయించి బట్టల్నుతికి ఇంత పచ్చడి చేసిపెట్టి పోతుండె మాకు. వారమంత అమ్మకు కూరొండడానికి టైముండదు. పాపం. ఏదో ఇంత పచ్చడీ… పప్పు తెస్తుండె హాస్టల్ల చేస్తుంది కదా? అట్లా చేసి ఇట్లయిందన్న మాట. ఇగ మా బస్తీల ఏంది. నలుగురైదుగురు రెడ్డీస్‌

ఉన్నరు. వాళ్ళు కొంచెం నల్ల (పంపు) దగ్గర గడ్‌బడ్‌ చేస్తుండె. నీళ్ళు పట్టనియ్యకపోతుండె. కొంచెం అట్ల చేస్తుండెనన్నమాట. తర్వాత ఇంకో అమ్మమ్మ ఉంది. చిన్నమ్మమ్మ. ఆమెనయితే అస్సలు ముట్టుకోనియ్యకపోతుండె. తర్వాత కాలేజికి పోయిన తర్వాత కొంచెం తెల్సింది. అక్కడక్కడా కొంచెం ఎస్‌.సి. అని తెల్సిన తర్వాత ఫ్రెండ్సుంటారుగద, వాళ్ళు కొంతమంది అర్థం చేసుకునేటోళ్ళు మాత్రం కల్సి మాట్లాడుతుండె. తర్వాత మనమే ఫ్రీ అయితుంటిమి వాళ్ళతోని. కొంచెం కల్సి తిరగాలె, మాట్లాడాలె అనేది… మా ఆఫీసులో ఒకామె కొంచెం డామినేట్‌ చేస్తది. ఆమెకు తెలుసు ఎస్‌.సి. అని. కొంచెం డామినేట్‌ చేసి మాట్లాడతది. కొంచెం గట్టిగా బెదిరించినట్టు చెప్తుంది. నువ్విది జేయి, అది జేయి. అట్లంటది. నేను జేస్త. మనం జేసెటోల్లం. మన పనికి మనకు తప్పేంది గాని. కానీ ఆమె పర్టిక్యులర్‌గా నాకే జెప్తదన్నమాట. మన పన్లు ఇంట్ల జేసుకోనూ, అన్ని పన్లు జేసుకుంట నేను. జేసుకుంట బాగానే కానీ కొంచెం గట్లనిపిస్తది. కొంచెం మంచిగనే మాట్లాడతది అప్పుడప్పుడు. ఆఫీసుల ఉంటం గద. ఇంకెవ్వరులే. అడ్డగుట్టలో మాత్రం చాలా ఉన్నరు వీల్లు (ఎస్‌.సి.లు). వాళ్ళకే వాళ్ళు గూడ అసలు వాళ్ళకేం లేకుంటనే ఉంది. ఆనీ ఎస్‌.సి. అని తెలిస్తే వాళ్ళకి కోపమన్నమాట. వాళ్ళు మాలమాదిగోళ్ళకేం తెలుస్తది వాళ్ళట్లనే ఉంటరు అంటరు. మరి వాళ్ళకే పూటకి అన్నం లేదు. మరి ఇప్పుడు నేను ఈ కులం అని జెప్పి వాళ్ళ దగ్గర బోయి కూర్చున్నననుకో, ఇంట్లకు కూడ రానిస్తరో లేదో. వాళ్ళు కొంచెం రెడ్డీస్‌, కమ్మవాళ్ళు ఉంటరు గదా. ఉన్నరు వాళ్ళు గొల్లోల్లు, కుర్మోల్లు ఇటువంటివాల్లు కూడుంటరు. ఆడ ఆల్లు మా ముందే జెప్పేస్తరు వాళ్ళు. ఇప్పుడు నేను ఎస్‌.సి.నే గద. నేను పోయి వాళ్ళింట్ల కూర్చుని రాసుకుంటుంట. ఇప్పుడు అండ్లగూడ రిక్షా తొక్కెటోల్లు, షాపుల మామూలు రోజుకూలి, దొర్కుతే దొర్కుతది, లేకపోతే లేదు. అయినా వాళ్ళింట్లకెల్లి నేను ఎస్‌.సి. అని చెప్పిన్ననుకో, ఆ వాల్లకేందమ్మా మాలోల్లు మాదిగోల్లు వాళ్ళకస్సలేం దెల్వదు. వాళ్ళని ఇంట్లకి కూడ రానియ్యద్దు. టాప్‌ దగ్గర్నయితే నీళ్ళు కూడా తీసుకోనివ్వరంట. ఎక్కువ లేరు, ఇద్దరు ముగ్గురే ఉన్నారు. అంతెక్కువ లేరు అంటరు. ఏం జేయాలి బిడ్డ. మాకు నీల్లు దొర్కనీయరు. ఇట్ల మా మోరీగిట పోనియ్యరు. కష్టం. వీల్లొచ్చి ఇక్కడ మధ్యలో ఇల్లు కట్టుకున్నరు. మానీల్లు పోనీకి కష్టం ఉన్నది. మేం ఇక్కడనే బట్టలుతుక్కోని ఇక్కడ నుంచే మోసుకెళ్ళి అక్కడ తీసుకోవాలి. మోరీలు కొన్నున్నయ్యా అక్కడనే గుంట తోడుకోని ఆ కడిగిన నీల్లు తీసి మళ్లీ బకెట్ల తీస్కపోయి అటుపడేస్తరు. అట్లున్నయ్యన్నమాట కొంతమందిండ్లు. వాళ్ళ వాకిళ్ళ ముందునుంచి వీల్లు పోనీయరు. అంటే మోరీ కొంచెం దూరముందన్నమాట. అందరూ కూలీపనే. అయినా రానీయరు, అట్ల. అడ్డగుట్టలో అట్లున్నది. అంతెందుకు సిటిలనే ఉన్నది. అట్లంటే మా బస్తీలగూడ ఉన్నది. బస్తీల ఏమన్న ఫంక్షన్లయితయి గద. పిల్లల్ని ముందు పంపకపోతుండె. ఇప్పుడొస్తరు, పిల్లలొస్తరు. వాళ్లింట్ల ఏమయినా ఫంక్షన్‌ అయినపుడు వాళ్ళింటికిపోయి అన్నీజేస్తం కద. వాళ్ళు మాత్రం ముందు వచ్చెటోల్లు గాదు. మిగతావాళ్ళు ఫరవాలేదు. వాళ్ళందరొస్తారులే. మేం పోతం. కొంచెం తెల్పిందిగద బస్తీలో.

మా పిల్లలకిప్పటికి ఎస్‌.సి, ఎస్‌.టి. అంటే తెలవది. ఏంటి మమ్మి అని అడుగతరు. మనమీ కులమని తెల్వది వాల్లకి. మా కిరణ్‌ మొన్న జెప్పిండన్నమాట. ఎవరున్నరు చేతులెత్తండని అడిగిన్రట స్కూల్ల. అడుగుతే నాకు తెల్వదు కద మమ్మీ నేను కూర్చున్న నాకు తెల్వది. నేనేం జేయాలి అంటే ఫర్వలేదులేరా అన్న. సర్టిఫికేట్‌ ఏదో డేటాఫ్‌ బర్త్‌కి రాసిమ్మన్నరంట. వాళ్ళ డాడీ రాసిచ్చిన్రన్నమాట. వాళ్ళకస్సలు తెల్వది. ఎస్‌.సి., ఎస్‌.టి. ఇంక కమ్మాస్‌ బ్రాహ్మిన్స్‌ వల్లంతున్నరని కులాల గురించి తెల్వది మా పిల్లలకింకా.

మొన్నజెప్పిన మన కులం అంటే మననెవరూ ముట్టుకోనియ్యరు నాయనా ఇప్పుడు మరి బ్రాహ్మిన్సే ఉన్నరనుకో రెడ్డిస్‌ ఉన్నరు వాల్లు మననస్సలు దగ్గరికి రానియ్యరు. మనం బీదోల్లం, తర్వాత అంటరానోల్లవాల్లలాగ జూస్తరు, అని ఇట్ల క్లియర్‌గా జెప్పే సెయ్యాలె. మనమంత ఒక జాతికి చెందినోల్లమని హరిజన్స్‌ అని పెట్టేస్తరు మనల్ని, వాల్లనస్సలు ముట్టుకోనియ్యరు. అని చెప్పేసిన.

అట్లెందుకు మమ్మీ అని మా పెద్దోడడిగిండు. మనం కూడ మనుషులేకదా వాళ్లలాగా అని. మా పెద్దోడి క్వెశ్చన్స్‌ ఇట్లుంటయ్యన్న మాట. అంటే కరక్టే నాన్నా వాల్లు బాగా డబ్బున్నోల్లు. మొదట్నుంచొస్తుంది చాల ఏండ్ల నుంచి అట్లనే వస్తుంది. మనల్నెప్పుడు మన ఊళ్ళల్ల గూడ మనల్ని సదువుకోడానికి దేనికి పైకిరానియ్యరు. ఈ భూస్వాముల దగ్గర మనం పాలేర్లలాగా పనిజేయాలి. వాల్లెంతిస్తే అంతనే తినాలె. ఇంక మనకేమో…. మనం చదువుకోవద్దనే ఉందన్న మాట. కొన్నేండ్లనుంచి మనకి కొంచెం ఇదొచ్చింది. ఆ అంబేద్కర్‌ కోసం ఆయన ఫిలిం ఒకటి మనకి టెలిఫిల్మ్‌ ఏదో చూపించిన్రు గద. అంబేద్కర్‌ది. మాస్టర్‌జీ తీసిండది. ఆ రోజు హబ్సిగూడలో ఎక్కడనో పెడితే తీసుకెళ్ళిండు. అప్పుడు మహారాష్ట్రనా? ఆ.. మహారాష్ట్ర ఆయననే… ఆయన కూడా మన కులానికి చెందిన ఆయన. అప్పుడు మనకు చదువుకోవడానికి కూడా కష్టం ఉండె. క్లాసు బయట ఉంచిన్రు. నాన్నా నువ్వు చూపినవుగదా. అందుకే ఆంటరు ఆంటరానివాళ్ళని. మనల్నొకటి చేసేసిన్రు వీళ్ళు. వీళ్ళెక్కువ జాతోల్లే చదువకోవాలె. మనం చదువుకోవద్దు. మనం వాళ్ల చేతికింద పనిజేయాలె. వాళ్ళింట్ల పనిజేయాలె. ఇట్ల తరతరాల్నించి చేస్తనే పోతుండాలె. మన తాతలు ముత్తాతలు వాళ్ళంత పనిజేస్తనే ఉన్నరు. అది చాలా ఏళ్ళనుంచి వస్తుంది. అంతే. ఇంతే జెప్పిన.

స్కూల్లో టీచరడిగిందంట, మీరు ఎస్‌.సి.లు, ఎస్‌.టి.లు ఎంతమందున్నరూ అని, ఇంతే క్వెశ్చన్‌ ఎసిందంట. ఇద్దరో ఒక్కరో ఉన్నరంట. వాళ్ళు చేయెత్తిన్రు. మనం ఎస్‌.సినో, ఎస్‌.టినో తెలవదుకద. అందుకని వీడు చెయ్యెత్తలే. మాట్లాడకుండా కూర్చొని పోయిండు క్లాసుల. అంటే ఇట్లా అడిగిన్రు మమ్మీ అంటే చెప్పినన్నమాట. లేకపోతే తెల్వది.

ఇప్పుడు మాదగ్గర ఆఫీసులో కొంత మంది ఏం మాట్లాడరు. ఎస్‌.సి.లను ఎస్‌.టి.లను ఎట్ల తీసిపడేస్తరు. ఎట్ల మాట్లాడతరంటే అట్ల మాట్లాడతరు. అంటే ఒక దగ్గర డిస్కషన్‌ అన్నమాట. ఎమ్‌.ఎస్‌.సి వాళ్ళకి పోస్ట్‌లు పడ్డయి. కాని ఎస్‌.సి.లు, ఎస్‌.టిలు చదువుకున్నోల్లు లేరుగదా. అవి ఖాళీగనే ఉన్నయి. ఒకామంటది, ఎవ్వరు ఉండనే ఉండరు. వీళ్ళకోసం అనవసరంగా రిజర్వేషన్లు పెట్టి…. ఒక్కడన్నా చదువుకున్నోడుండడు. అనవసరంగా వాళ్లకు రిజర్వేషన్లు పెట్టి ఆ… మనోళ్ళకేమో ఇవ్వరు. ఇట్లా… డిస్కషన్‌ అన్నమాట. మరి ఆర్థికంగా వాళ్ళకు డబ్బుందా లేదా ఆలోచించాలి కద. చదువుకున్నరు మనం ఎట్లున్నం. ఏం ఆలోచించరు. ఎట్ల అంటే… మనం కొంచెం మంచి చీరేసుకోని పోయినం అనుకో. మొన్న నేను వుట్టిదే, కాటన్‌ది, చెమ్కీ చెమ్కీ ఉంది 125 రూపీస్‌ది ఆ చీర. కాటన్‌ది. అంత జరీలాగ చెమ్కీ. ఉట్టిదే. అదేసుకోని పోయిన. వెంటనే పోయిన. అంతకు ముందు రోజు నేను సంతకం పెట్టలేదు. అక్కడనే వెహికలుంటే సక్కగపోయిన. కోపానికొచ్చింది. రాజమణీ నేను చెప్తున్న, రోజూ తొందరగొచ్చి సైను పెట్టాల. కోపం గుంది మొఖం. నేను సరే మేడం నిన్కొక్కరోజే పెట్టలేదు. అసన్న, అని ఇంకెల్లిపోయినా, ఉండలే ఆ రూముల. ఎల్లండెల్లండి వెహికిలెల్లిపోతుందీ అంటే ఎల్లిపోయిన. ఎల్లిపోయిన తర్వాత ఇంకొక మేడం కొంచెం ప్రీగుంటది. మంచిగుంటది. ఏం రాజమణీ ఏదో మెరిసే చీరకట్టుకున్నవటగద, అంటే ఏం లేదు మేడం ఏదో చెమ్కీ ఉన్నది. 125 రూపీసే. అంత చెమ్కీ ఉన్నది. కోటీల తీస్కున్న. సంవత్సరంనరయింది తీసుకోని. ఇప్పుడుగూడకొనలే. ఎప్పుడో కొన్న, అంటే ఆమె చెప్పింది. ”జరీ చీర కట్టుకున్నవని పెళ్ళికెక్కడనన్న పోయినవేమోనని”.

ఆమెప్పుడు రోజు మంచి చీరలే కట్టుకుంటది. అంటే ఉట్టిగ నేనెప్పుడూ ఇటువంటివే ఉన్నయి అన్నీ నావి ఇట్లనే ఉన్నయిగద. కాకపోతే ఆ రోజు కట్టుకున్నవని అనిపించిందో ఏమో. ఫంక్షన్‌ గిట్ట ఏం లేదు. వట్టిగనే. అది నేను జెప్పిన ఆ మేడంకు. అది ఉట్టిది. జరీకాదు. పిచ్చి చెమ్కీ ఉంది. ఎప్పుడయిన చిన్న చిన్న ఫంక్షన్లయితే కట్టుకుంట. జరీ మంచిగుందని పెట్టేసుకున్న. అంటే ఆట్ల. కొంచెం ఉంటది వాళ్ళకి. ఇక వేరోల్లయితే ఒక ఐదారొందల చీరలేకడ్తరు. ఎక్కడయిన దానికి తక్కువున్న చీరలే ఉండవు వాల్ల దగ్గర. అంటే అటువంటి ఫీలింగ్సుంటయి. కొంతమంది పట్టించుకుంటరు, కొంతమంది పట్టించుకోరు. ఇంకోరెడ్డి అమ్మాయిన్నది. వాల్లయితే కొంచెం డబ్బున్నోళ్ళే ఉన్నట్టున్నరు. వాల్లు బాగానే కట్టుకుంటరు చీరలు. కాని నన్నయితే ఏమనరు. కొంచెం ఫ్రీగా మాట్లాడతరు.

అంటే వాళ్ళు కొంచెం చిన్న పిల్లలు గద. నేను మాట్లాడత. ఫ్రీగుంట. చాల ఫ్రీగుంట. అయినగానీ ఇంకొకామె ఉంది. ఆ అమ్మాయి బ్రాహ్మిను. కూరలందరివీ తింటది. నేనెప్పుడయిన కూరేస్తాననుకో, భాగ్యమ్మగానీ, నేనుగానీ వద్దంటే వద్దని ఖచ్చితంగాచెప్తుంది. అస్సలు తినది. ఇప్పటికీ నాదిగానీ, భాగ్యది గానీ ఇంత కూర తినలే. పెరుగయితే తింటది. ఎప్పుడయినా టిఫిను బాక్సులో ఉంటే ఒక స్పూను తీసుకుంటది. అల్లం, ఎల్లిపాయి ఏస్తామని అట్లంటది. ఏయకపోయినా కూడ తినదసలు. అదే ఇంకొకామె ఉంది. ఆమె దగ్గర తింటది. మేం కూడా ఎయ్యం. ఏమన్ననుకుంటరేమోనని. అల్లం, ఎల్లిపాయ పప్పులో ఎయ్య. అయినా తీసుకోదు. మొహంలో ఉంటుంది శాన. ఎంత సీరియస్‌ పెడుతుందో మొహం అసలు. పైగా వాళ్ళ డబ్బాల్లోది మనకు పెడ్తరు. వద్దన్నాగానీ మనకు బెడ్తరు. మేడం పెడుతుందిగదా వద్దంటే ఏమన్నా అనుకుంటదేమో అని. ఆ అమ్మాయికి అసహ్యం. ఇట్ల ముట్టుకోను కూడా ముట్టుకోదు. కూరలుగానీ, మా గిన్నెలు గానీ ముట్టుకోను కూడా ముట్టుకోదు. పెరుగుమాత్రం ఒక్కటే స్ఫూను తీసుకుంటది.

ఇంటర్‌కి నేను ఆంధ్రమహిళాసభలో జాయినయిన. ఇద్దరో ఏమో ఉండె ఎస్‌.సి. అంటే, మొత్తం క్లాసు మ్తొతంల. మిగతా అంత ఎక్వకులమోళ్ళే. రెడ్డిస్‌, బ్రాహ్మిన్స్‌ అంతా వీళ్ళే. ఇప్పుడు మన బెంచీ వాళ్ళం కొంచెం క్లోజుంటాంకదా. వాళ్ళు కూడా ప్చ్‌. కొంచెమట్లనే ఉంటుండె. ఇక్కడిద్దరు యూనివర్సిటీ పిల్లలున్నర్నమాట. వాళ్ళు ఫరవాలే. బాగనే ఉన్నరు. వాళ్ళు బ్రాహ్మిన్స్‌. వాళ్ళ అమ్మకి నాన్నకి తెల్వదు. ఇంటికి పోతే బాగానే చూస్తుండె. టిఫిన్సు అవీ. కొంచెం చదువుకున్నోల్లు కాబట్టి కొంచెం ఇదన్నమాట. అది కూడా వాల్లకు తెల్వక. ఇప్పుడెక్కడ కల్సిన కానీ కొంచెం బాగానే మాట్లాడతరు. ఫర్వాలేకుండె. కాని తప్పకుండా కాస్ట్‌ ఫిలింగుంటది. ఇప్పుడు వేసుకునే డ్రస్‌, నాకు రెండు మూడు లంగాలే ఉండె. అంతెక్కువ లేవు. నాన్న పనిజేస్తుండె. తాగుతడు కద. ఇక అమ్మ జీతంతోనే బట్టలకీ, పుస్తకాలకీ అట్లుండె. అప్పుడు బాగనే అయింది. తినటానికి మంచిగ. బట్టలు అంత మంచిగనే అయింది.

ఆ ఒకామె ఉండె. లెక్చరర్‌, ఇకనామిక్స్‌లో, ఇప్పటికీ ఉంది. తను ఎక్కువ క్వశ్చన్సు అడక్కపోతుండె. ఇప్పుడు మా బెంచ్‌ ఉందనుకో. ఇప్పుడు నన్నడగాలె కద. కొంచెం తెలివిగున్నోళ్ళనే అడుగుతుండె. కొంచెం నన్ను కూడా తెలుసుకోవాలె కద. కొంచెం హాండ్‌రైటింగును బట్టి నన్ను కూడా కొంచెం అడిగి ప్రోత్సహించాలె. అట్లుండకపోయేవాళ్ళం. ఇప్పటికే మన యూనివర్సిటీల కూడ అట్లనే ఉందంట. మా ఆయన చెప్తడు కద. మా ఆయనకి సెకండ్‌ క్లాస్‌ మార్కులకి కిందమీద జేసిన్రట. చెప్తడు మా ఆయన. నాలుగయిదు సంవత్సరాలయింది ఎమ్‌.ఏ. చేసి. తెలుగు, అయినా లిస్ట్‌ ప్రకారం చూసి, అదంత ఎందుకు నాకూతురికి, ఎల్‌కెజి సెంట్‌ ఆన్స్‌లో, ఫామంతా ఫిలప్‌ చేసినం. జేసిన తర్వాత కాస్ట్‌ దగ్గర ఎస్‌.పి అని రాసినం. ఉన్నదే రాసినం గద. రాస్తే వాళ్ళు సీటియ్యలె. మరి మా కాలనీల ఉండెటోల్లకి ఇద్దరు ముగ్గురుకి వచ్చింది సీటు. పోయి మా ఆయన ప్రిన్సిపల్‌ నడుగుతే మీరంత దూరం నుంచి పిల్లల్ని తేగల్గుతార అనడిగింది. శోభ అంత బాగా చెప్పింది అన్నీ, టేబిలు మీద బొమ్మలు పెట్టి అన్ని కరెక్టుగ అన్సరు చేసింది ఎనభై రూపాయల ఫిజిచ్చి, నర్సరీ, ఎల్‌.కె.జి చదివిపిచ్చిన, ఆ టీచరు మంచిగ నేర్పించింది. ఆట్ల మంచిగ జెప్పిన గానీ సీటియ్యలె. నువ్వెందుకు రాసినవే ఎస్‌.సి. అని, మంచిగ క్రిష్టియను అని రాయనుంటివి అన్న. అయితే తొందరగిస్తరు ఆ స్కూల్ల-సెంట్‌ ఆన్స్‌ల, దాని కోసమే రాలేదు. మనం అన్నం గద. ఫీజు కడ్తమన్నం. డొనేషన్‌ ఫైవ్‌ హండ్రడ్‌ అయినా, వన్‌తౌజండ్‌ అయినా ఇస్తమని చెప్పినం. లేదంటే లేదంది ప్రిన్సిపాలు. మా చిన్న బాబుకు స్కూలుందంటే సోషల్‌ వెల్‌ ఫేరు నుంచి సీటు సంపాదించినం. పబ్లిక్‌ స్కూలు, ఎస్‌.సి. కోటా మీదనే వచ్చింది. ఆ కోటా లేకపోతే సీటురాదు. ఎంత చదువుకున్నా ఇవ్వరు. అంతెందుకు మా పద్దెబాబుకు ఫిప్తు క్లాసుకు, ఇద్దరు ఒకేదిక్కుపోతరని, ట్యూషనుకి ప్రిపేరు చేసినం. రెండు వెయిలిచ్చినం టీచర్‌కి. బాగ చేసిండు. ఫస్టాచ్చిండు. మా దగ్గరసీట్లు లేవు. వనస్థలిపురంలో ఒక బ్రాంచి ఉన్నది. ఇక్కడ కొంతమందిని, వనస్థలిపురం కొంత మందిని పంచినం అని జెప్పిండు ప్రిన్సిపలు. మీరు సెలెక్షను లొస్తె మాకేంది అని ఈ సంవత్సరం సోషల్‌ వెల్‌ ఫేరులొచ్చిన వాళ్ళందర్ని కాన్సిలు జేసేసిండు. దొరకలే ఇంక. మా ఆయన తిరిగీ తిరిగీ కొట్లాడైగూడ రాలే. మేమే మానేసుకున్నం. ఇగపోనీ అని. టైమ్‌ లేదు తిరగనీకి అటిటు మొత్తం బాగచేసినంక కూడ సీటివ్వలే. ఫిప్త్‌క్లాసు ఇప్పుడు సెవెన్త్‌ చదువుతున్నడు. మల్లా ఇప్పుడు తీసినా వేస్ట్‌ గద. అందుకని, అట్లుంది. మొత్తం సెలెక్ట్‌ చేసినంక కూడా తీసుకోలే. సోషల్‌ వెల్ఫేరు ఆఫీసునుంచి మళ్ళీ ఇక్కడ టెస్ట్‌ పెడితే కూడ మంచిగ జేసినకూడ. అప్పుడే ఇన్ఫర్‌మేషనిచ్చే దుండె. ఈ సంవత్సరం సీట్లు లేవు అని. బ్లాక్‌ల అమ్ముకున్నట్టున్నరు. అందుకే సీట్లు లేవని క్లోజ్‌ చేసిసిన్రు. ఇప్పుడిక్కడొక బాబున్నడు. ఆయనకి ఇరవై వేలిస్తే సీటిస్తా అన్నడట. చంద్రశేఖరో రాజశేఖరో ఉప్పల్‌ల ఉన్నడు. మనమెక్కడికెల్లితేవాలె. సెలెక్టయిన పిల్లల్నే తీసుకోలె. అంటే కోటా ఉన్నచోట కూడా వేరేవాళ్ళ పిల్లలు డొనేషన్లు కట్టి ఫిలప్‌ అయిపోయిన్రు. ఆ సంవత్సరం కోటా నుంచి ఒక్కర్ని తీసుకోలే. టూ ఇయర్స్‌ దాటింది. ఆఫీసులల్ల కూడా ఇట్లనే జరుగతది. యూనివర్సిటీల కూడ ఇట్లనే ఉంటుందని జెప్తడు మా ఆయన. ఎంత బాగా చదివినా ఇయ్యరట. ఫస్ట్‌క్లాసొచ్చేట్లు రాసినా సెకండ్‌ క్లాసు మార్కులు. అంతకంటె ఇయ్యరంట ఎస్‌.సి, ఎస్‌.టిలకు యూనివర్సిటీల. అంతా మంచిగున్నవాళ్ళు కమ్మాస్‌, రెడ్డీస్‌, బ్రాహ్మిన్స్‌. మన యూనివర్సిటీల ప్రాఫెసర్సు కానీ, లెక్చరర్సుగానీ వాల్లే. ఇగ వీల్లకి మార్కులేయాలంటే కింద మీద పడుతుంటరు. మార్కుల కోసం రెండుసార్లు ఎక్జామ్‌ రాసిండు మా ఆయన. ఫిప్టీఫైవో ఎంతనో ఇచ్చిన్రు. సెకండు క్లాసు మార్కులు. ఊ… ఎంత కష్టపడి ఎంత చదివినాగానీ ఏయలే. సెకండు క్లాసమార్కులే. ఎక్కడయినగాని.

మా అమ్మమ్మ వాళ్ళు బాంచెను బిడ్డా అని మాట్లాడతరు. అంతదూరం పోయి కూర్చోని మాట్లాడతరు ఎవరన్నా మాట్లాడుతుంటె. ఇప్పుడు మా నాయనమ్ముంది గద. సమ్మర్‌ హాలిడేస్‌ల పది పన్నెండు రోజులు అక్కడ పోతుంటిమి. మా పెదనాయన పిల్లలు కొంచెం పద్దెగున్నరు, వాళ్ళు పటేండ్లింట్ల జీతమున్నరు. రాత్రెప్పుడో వచ్చి పండుకుంటుండె. మళ్ళీ పొద్దున్నె ఫైపుకి లేపుతుండె మా పెద్దమ్మ. వాళ్ళస్సలు లేవకపోతుండె. ఆ పటేలొస్తుండె. వచ్చి ఏరా మల్లయ్య లేవవా ఇంకా ఎంతసేపు పండుకుంటవు. ఎంతసేపు పండుతవు అని దగ్దించినట్లు మాట్లాడతరు. వీడు సరిగ చెయ్యడు. వాడు సరిగ జెయ్యడు. అని మా పెద్దమ్మను తిడుతుండె. మా పెద్దమ్మ వీళ్ళను తిడుతుండె. పొద్దునపోయి అన్నానికి పన్నెండు ఒంటి గంట కొస్తుండె. మళ్ళీ ఎళ్ళిపోవాలె. తక్కువ జీతం, సంవత్సరానికి ఎంతనో ఇస్తరన్నమాట. వడ్లిస్తరు. అట్లన్నమాట. మళ్ళీ బావి దగ్గర అందరికి మాలోళ్ళ బావని వున్నది. ఆ బావి పక్కకి గౌండ్లోళ్ళ కల్లు కంపౌండని ఉన్నది. ఈ బావిలోనీళ్లే మంచివన్నమాట. మామాలోల్ల బావిల నీళ్ళు మంచిగున్నయి. అయితే ఆ గౌండ్లోల్లు కూడా అట్లట్లనే ఉన్నరుగద. వాల్లొచ్చి నీల్లు తోడుకుంటుండె. మనం దూరం నిలబడాలె. దూరంగుండు అటుపక్కకుండు. ఏంది అట్ల కల్సిపోతావేంది అని తిట్టటం. మేం బావికెల్లి మొహం కడుక్కుంటుంటిమి. చిన్నోల్లం గద అప్పుడు కొనాకుండేది బావి. మాలోల్ల ఇళ్ళన్ని దాటిపోవాలె. అట్ల బెదిరిస్తుండె నన్నమాట. ఇంక మా గురించివాల్లు – మా మరిది పిల్లలు పట్నంల ఉంటరు, చదువుతున్నరు, అని కొంచెం గొప్ప చెప్తుండె అన్నమాట. ఆ పట్నంల ఉండేది ఏడుండేది, ఉండాల్సిన జాగల ఉండాల మీరు ఇట్ల కలుస్తరా అనేది. కాదు బాంచెను వాల్లకుతెల్వది. అట్ల బాంచెననే మాట్లడతరు. వాల్లకు తెల్వదిగదా అని ఇట్రా అని మమ్మల్ని అటు పక్కకి జరుపుతుండెనన్నమాట మా పెద్దమ్మ వాల్లు. మాకు తెల్వక మేం మాట్లాడకుంటిమి. బావికి దగ్గర ముట్టుకొని మేం మాట్లాడుతుంటిమి. రా బిడ్డా వాల్లను ముట్టద్దు అని తీస్కపోతుండె మా పెద్దమ్మ. మా నాయనమ్మ కూడ వాల్లేదై నా కూరగాయలు పెడితే, కూరగాయలు ఎక్కువ అమ్మరు ఊల్లల్ల. వాల్ల పడ్లు కోస్తే కూరగాయలిచ్చేది. ఇంత పైనుంచేసేది. ఇప్పటికీ ఉంది మా ఊర్ల. మా ఊర్లనేకాదు ప్రతి ఒక్క ఊర్ల ఉన్నది. మా అమ్మమ్మ చిన్నపుడు ఊర్లుంది. తర్వాత మా తాత చనిపోంగనే సిటికొచ్చేసింది. పబ్లిక్‌ గార్డెన్ల పనిజేసేది. కూలిపనిజేసేది. ఇప్పుడు నాయనమ్మగానీ అమ్మమ్మగానీ, మనం ఇట్లనే పుట్టినం బిడ్డా మాలోల్లం, మాదిగోల్లం గదా మనం ఇట్లనే ఉండాలంటరు. వాల్లకేం తెల్వదు. వాండ్లు పటేండ్లు బిడ్డా వాళ్ళ దగ్గరికెళ్ళద్దు. ముట్టద్దు. కొంచెం చదువుకున్నోళ్ళు ఉంటే … ఇప్పుడు మా కులంల కూడా కొంచెం చదువుకున్నోళ్ళు ఉంటే … ఇప్పుడు మా కులంల కూడా కొంచెం చదువుకున్నోళ్ళు తక్కువే. ఎక్కువ ఎక్కడున్నరు. అంతంతనే. అయినాగానీ మల్ల కోఆపరేషనుంటే అందరం కలిసి, ఎందుకన్ననామాట అంటే కొంచెం ఎదుర్కున్నట్లుంటది. మల్ల మాదాన్ల కోఆపరేషనుండదు. ఉన్న ఇద్దరు మళ్ళీ వాళ్ల స్టయిల్సు కొడుతుంటరు. ఇప్పుడు నేనున్నను. నాకేదో డ్యూటి దొరికిందనుకుంటే సరిపోతదా. నల్గురితో మనసమస్య యిదీ అని మాట్లాడుకొని నల్గురం కల్సిఉంటే అది బావుంటుంది. వాల్లనేదానికి మనం సమాధానం చెప్పచ్చు.

ఇప్పుడు మనలో మనమే సరిగ లేమనుకో. వాల్లకేం సమాధానం చెప్తాం?….. అన్నోల్లను ఎదుర్కోలేంగద. నేను చదువుకున్న నేను మిగలిన చదువుకున్న వాల్లతోపోతే, అని కొంతమంది అభిప్రాయాలున్నయి. ఇప్పుడు నాకు కొంచెం డబ్బుంది. నేను నీతో వచ్చిన అయినా నువు నన్నొక తీరు చూస్తవు. తప్పకుంటుంది దానిలో ఫీలింగ్‌, నాకైతే అనిపిస్తుంది. నేనెంత నీచుట్టు తిరుగుతున్నగానీ, నువు దూరమే అన్నిస్తవు. దూరం దూరం జేస్తవు. అవునా కాదా? నాకన్పిస్తుంది. నా మనుసులనే అన్పిస్తది. అమ్మో వీల్లు రెడ్డీస్‌గద వీళ్ళ దగ్గరికి పోవద్దు. నాఫీలింగుంటది. వాల్లు ఆట్లనే జూస్తరనిపిస్తది. అట్లనిపిస్తే నేను పక్కకి జరిగిపోత. ఇప్పుడంతెందుకు. ఇప్పుడు ఇంగ్లీషు మీడియం చదువుకున్నోల్లు, తెలుగుమీడియంల వాళ్ళను తక్కువ జూస్తరు. ఏంటిలే అన్నట్టు. ఆ రెడ్డిపిల్ల అట్లనేజేప్తది. అందుకనే ఒక్కొక్కసారి నేను పట్టించుకోను. వాళ్ళిద్దరు ఇంగ్లీషు మాట్లాడతరు. మిగిలినవాళ్ళు తెలుగు మీడియమే కానీ వాళ్ళు బి.ఎస్‌.సి. ఇంగ్లీషు మీడియం అన్నమాట. కొంచెం నేను ఇంటరే చదువుకున్న గదా అన్పిస్తదికానీ మా మేడం మీటింగ్‌ల చెప్పినదన్నమాట. మీరంత చేసేదొకటే పని. మీరెంత చదువుకున్నా జేసినా మీరవన్నీ పెట్టుకోనే పెట్టుకోవద్దు అని అవన్నీ మంచిగ ఎక్స్‌ప్లెయిన్‌ చేసిందన్నమాట. కానీ అట్లనిపిస్తదన్నమాట. ఈ అమ్మాయిలకట్ల ఉందేమోననిపిస్తది. అడిగితే చెప్తరు. దీనికి ఇంగ్లీషులో ఏమంటరు అని అడిగితే చెప్తరు. అన్నీ కొంచెం క్లియరుగ తెలుగులో రాసుకుంట నాకర్థం కావాలె కద. నా కర్ధం కానివి నేను నా భాషలనే రాసుకుంట. అంటే ఒక్కొక్కసారి కొంచెం కసురుకున్నట్లుంటది కానీ, నేనడ్జస్టయిపోత, పోనీలే. నాకు రాదుగదా. ఎంతైనా మనం అడ్జస్టయిపోవాల.

ఇప్పుడు హెచ్‌.ఎమ్‌.టి కాలనీలో బస్తీ ఉంది. బి.సి.లదే. ఎవరొస్తరు. కుర్మోల్లు, గొల్లోల్లు. ఈ తాడిచెట్లెక్కుతారు చూడు గౌండ్లోల్లు. ఇంకా కమ్మరోల్లు, వడ్లపని జేసెటోల్లు, ఈకంసాలివాల్లు, వాల్లంత ‘బిసి’ కింద వస్తరు. రెడ్డీస్‌ రారు. బ్రాహ్మిన్స్‌, వైశ్య, వీళ్ళంతా పెద్ద కులాలు. వీల్లు కొట్లాడుకుంటే ఎవరు పట్టిచ్చుకోరు. ఇప్పుడు ఈ బిసివాళ్ళే ఉన్నారు. వీళ్ళకు షాపులున్నయి. దుకాణాలున్నయి. అయినాగానీ వాళ్ళకోసం పట్టించుకోరు వాళ్ళు. మా కోసం కొట్లాడుతున్నం మీ రెందుకు రారు. వీల్లు కూడా కోటావస్తే తీసుకుంటరు కానీ మంచిగ ఏకమై కొట్లాడరు. అది పట్టించుకోరు వాల్లు. ఆ ఎందుకులే మాకు బిజినెసుంది, మేం చేసుకుంటం అనుకుంటరు వీల్లు. మల్ల రిజర్వేషన్‌ కాడికొస్తే సీటు కావాలె అని కొట్లాడతరు. ఇప్పుడు బహుజససమాజ్‌ పార్టీల గౌరడ్లాయనున్నడండి. కానీ అయనేం పని చేయడంట. మా ఆయన చెప్తుంటడు. వీల్లు ఓల్డు సిటీ కెల్లి అందరితో మీటింగులు పెట్టటం మాట్లాడటం చేస్త. బి.సి. వాల్లే ఎక్కువ ఉన్నరు మల్ల, బస్తీలన్నమాట. వాళ్లందర్నీ ఏకంజేసి మాట్లాడి తర్వాత మా నాయకున్నెన్నుకుంటం అంటే సరే మీ నాయకుణ్ణి మీరే ఎన్నుకోండి అని చెప్పిన్రు. పనిజేయక పోయినాకానీ ఇప్పుడు బస్తీలో ఎన్నికలుంటయి కద. అప్పుడు వాల్లంతకలిసి ఈ గౌండ్లాయనే ఉండాలనేది, పనిజేయపోయినాసరె. వాల్లేంపని జేయరన్నమాట. నాలుగయిదు బస్తీలవాళ్ళు కలిసి తర్వాత ఆయనేం పనిజేయడని తీసేసిన్రు. లోపల్లోపల అనుకునేది మనం ఇన్ని కులాలున్నం. అయనొక్కడేంది. ఎందుకుండాలె అని. ఇప్పుడు ప్రొసెషన్‌కిగానీ మీటింగులకి కానీ రమ్మంటే ఎవరురారు. ఎవరిపన్లు వాల్లు చూసుకుంటరు. బి.సి. వాల్లు ఎక్కువ ఎక్కడొస్తలేరు. ఎస్‌.సి, ఎస్‌.టి.లే ఎక్కువ సపోర్టిస్తున్నారు. కొంచెం ఎక్కువే ఉన్నరు వాల్లు. చిన్న చిన్న స్టోర్పనీ, బిజినెస్సనీ కొంచెం డబ్బున్నోల్లున్నరు. ఇప్పుడు గౌండ్లోడ్లున్నరు. వాల్లు కల్లు అదీ తయారుజేస్తరు. అది వాల్లకు బిజినెస్‌. వాల్లకు డబ్బొస్తది. వాల్లకు ఫర్వాలేదు. ఇగ ఎస్‌.సి., ఎస్‌.టి.లంతపోయి తాగుతరు. వాళ్ళు కూడా తాగుతారు గానీ, వాళ్ళకెక్కువ డబ్బొస్తుంది. కుమ్మరోల్లకి కూడా స్టోర్సనీ ఉన్నయి. కుండలెక్కువ అమ్ముడుపోవులే. పల్లెటూర్లయితే మరీ కష్టం. కొంచెం భూముంటే అది చూసుకోని కుండలు కూడా చేసుకుంట బతుకుతరు. సిటీలయితే షాపులే పెడ్తున్నరు. ఇప్పుడు చాకలోల్లున్నరు. పల్లెటూర్ల ఏముంటుంది. వాల్లు ఎక్కువోల్లవి వుతుకుతరు. కానీ, మాలమాదిగలవి వుతుకుతరో లేదో నాకు తెల్వది. వుతకరు. మనమే చెరువుకెల్లి వుతుక్కోవాలి. బ్రాహ్మలవీ, కోమటోల్లవీ వాల్లవే. మా బస్తీల రెడ్డిస్‌ ఉన్నరు. కుమ్మరోల్లున్నరు. ఒకటే ఇల్లున్నది.

మా అమ్మయితే ఇంకా జమాన మనిషిలెక్క మాటల్లడతది. అంటే మా అమ్మ పెద్దమనిషి కాకముందొచ్చిందట పట్నంకు, మా అమ్మకుట్టి. మా బస్తీ ఆ హాస్టలు తప్ప ఏం తెలవవు. వట్టి బజారుకు కూడా పోయి ఏం తెచ్చుకోలే ఇప్పటి వరకు మా అమ్మ. పుట్టి డ్యూటీ చేస్తది ఇంటికొస్తది. వంట జేస్తదన్నమాట. అక్కడ జేస్తది, అంతేతప్ప ఒక బజారుకుపోయి ఒక వస్తువు తెచ్చుకుందామంటే ఇంక మేమే తోడెల్లాల. చెల్లెగానీ నేనుకానీ, మాకు కూడ కొంచెం పిరికితనమే నేర్పించిన్రు. అటుపోవద్దు బిడ్డా, అట్ల చేయద్దు అని భయపెడుతుండె. ఇంక కాలేజి కొచ్చినాకనే నేర్చుకున్నం. నేను చెప్తున్నగద అంతకు ముందు నాకేం తెలవదు. ఒక స్కూలు, ఇల్లు, ఎప్పుడన్నపోతే సికింద్రాబాద్‌ స్టేషను, సినిమానన్న తెల్వదు. టెన్త్‌క్లాస్‌లో కూడ సినిమా అన్నది తెల్వదు. ఇప్పుడు కొంచెం మా కాకలు వాల్లు చదువుకున్నరు. వాళ్ళ పిల్లల్ని చదివించిన్రు. ఇప్పుడు కొంచెం మాకు తెలిసింది. మేము చదువుకున్నం. మా నాయన పొద్దంత కష్టంజేసి పొద్దుమీకి ఇంత తిని పండుకుంటుండె. చాన కష్టం ఉండె. మల్ల కొంచెం మంచి గయినం మా పెళ్ళైనంక. మా అత్త కొంచెం పాత జమానా మనిషికద. కష్టాలంటే కష్టాలు పెట్టిందినాకు. రాత్రిపూట ఎప్పుడన్న మీటింగు కెల్లొస్తుంటి. ఒకరోజు మా అత్తనన్ను బైటనే నిలబెట్టింది. మా ఆయన్నేమో రాత్రి 12 తర్వాత వస్తడు డ్యూటిచేసి. ఆమెకేమో ఇష్టం లేదు. మా అత్త అయనొచ్చిన దాకా నన్ను బయటనే ఉంచింది. లోపల నుంచి గొళ్లెం పెట్టింది. నేనెట్ల లోపలికెల్లి పండుకోవాలె. పదకొండున్నర కొచ్చిండు. మా ఆయన నన్ను తిట్టిండు. ఎన్ని తిట్టిండో మీటింగుల కెందు కెల్తవు అని. పిల్లలు పుట్టిన తర్వాతయితే నాకు తీరికనే లేదు. అప్పటి నుంచి ఇగబోలే. కొంచెం మీరందరూ బస్తికొచ్చి మీటింగులు పెట్టి చెస్తే తెలిసింది. అయినా మా అత్త ఇప్పటికి అంటది. ఆ… మీలాటోల్లు ఏంచేస్తరు మీరు అని. మీరొచ్చి చెప్తే కూడా ఆ… ఉన్నోల్లు ఏం చెప్పినా నడుస్తది అనేటోళ్ళు బస్తిల. ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దగయిన్రు. మా అంత ఏజ్‌ వాళ్లు ఫరవాలేదు. అయినా కొంతమంది మొగొల్లకేం తెల్వదు. ఇప్పుడు నేను లీడరున్ననుకో. కాంగ్రెసుకు సపోర్టు చేస్తున్న. నేను ఇగ ఏదిజెప్తే అది. జెండాలు పట్టుకోమంటె పట్టుకుంటరు. దాని వెనుకవున్న హిస్టరీ వాళ్ళకు తెల్వదు. ఇప్పుడంత ఎస్‌.సి., ఎస్‌.టి.లే వున్నరు మొత్తం. వాళ్ళు జై బోలో అంటే జైబోలో. అసలీ పెద్దమనుషులెవ్వరు వీళ్ళేం జేస్తున్నరు అనేది తెల్వది వాళ్ళకి . కొన్ని రోజులు ఈ పార్టీలుంటరు. కొన్ని రోజులు తెలుగుదేశంల

ఉంటరు. అయినా మా బస్తోల్లు ఫర్వాలేదు. ఆలోచిస్తరు. మా బస్తికి ఎవరొస్తుండె. ఆ…. నర్సింహరెడ్డి వస్తుండె. జనతాపార్టీ నాయని నర్సింహరెడ్డి. వచ్చి కొంచెం ఆయననే నల్లలు, లైట్లు అన్నీ ఆయన్నే ఏపించిండు. ఇప్పుడు బి.హెచ్‌.పి.పార్టీ అంటే ఆయనకు బాధ. ఈ బస్తీలోల్లు బి.హెచ్‌.పి.ల చేరిన్రు. ఆయన చాల మంచాయన. మా చిన్నప్పటినుంచి మా బస్తీల తిరిగిండు. మాకు లైట్లు లేకుండె.

నల్లఉండె. చిమ్మ చీకటి దయ్యంలాగుండె. సిటీకెంత దగ్గరున్నం మేము అయిన ఆ బస్తీ సంగతెవ్వరికి తెలవలే. ఈ 15, 20 సంవత్సరాల నుంచె కొంచెం తెలవటం, బయటకు పోయిరావటంవుంది.

మా ఇల్లు సంగతి చెప్తా, మా ఇల్లమ్మేసుకున్నం. అక్కడింటోల్లు చాల మంచోల్లు. ఇంట్లకు పిలిపించుకోని మాట్లాడేది. తను ఏం కులమని అడగలె. అదొకటి మెయిన్‌ పాయింటు నాకు. వాళ్ళు బ్రాహ్మన్స్‌. కులమడగలే నన్ను. ఇల్లంతా జూపించి. అదొకటి మంచిగ నచ్చింది. ఎప్పుడో కొంచెం తోడుకోసం పోయిన పెరుగు వాళ్ళ గిన్నెలనే వేసిచ్చింది. మా కిరణ్‌ది బర్తడే అయింది. కొంచెం స్వీటు, మిక్చర్‌ ఇచ్చి పంపిన, తీసుకుంది. కొంతమంది తీసుకోరు. ఆమె మురుకులు ఇస్తే తీసుకున్న. వాళ్ళిస్తే తీసుకుంటం. మనం ఇచ్చింది తీసుకోకపోతే బాధనిపిస్తుంది. వాల్లు మంచోల్లేకానీ మేం రెంట్‌ కట్టలేమని వచ్చేసినం. ఏడువందలుండె. కట్టలేక వచ్చేసినం. ఈ ఇంటికొచ్చినం. హబ్సిగూడలో ఆమె ఫస్ట్‌ కులముడిగింది. కిందన్ని షాపులు పైన ఇల్లు. ఎనకాల పుట్టి రేకులదుంది. రెండు రూములు. అండ్లనే అన్నం మేము. ఆల్లు అడిగిన్రు ఏం కులమని. మా ఆయనొచ్చిండు ఆ రోజు ఉన్నదున్నట్టు చెప్పేయాలె. ఎక్కువెందుకు చెప్పాలె అని మేం మాలోల్లవమ్మ అని చెప్పేసిండు. ఎస్‌.సినా మీరు అంది. మీకిష్టమైతే ఇవ్వండి లేకపోతే లేదు అన్నం. ఆ…. మా ముసలమ్మున్నది. అప్పుడప్పుడు అరుస్తుంటది అన్నది. ఆ ముసలామె దిగొచ్చింది. ఇంటి పక్కోళ్ళు అందరూ నాదిక్కు వకరకంగ మొహంబెట్టి చూస్తున్నరు. ఆ ముసలామె అడుగుతుంది నువ్వెక్కడ జేస్తనమ్మ అని. ఇంకా పాతగ పురాతనంగ అడుగుతుంది. మీరింతకు ముందెక్కడున్నారు. అక్కడి నుంచెందుకు ఖాళీ జేసిన్రు. ఇట్ల చాలా అడిగింది క్వశ్చన్స్‌. వద్దులె మళ్ళా నల్ల దగ్గర అక్కడ గడబిడ అయితది. నాకు మంచిగనిపించదు అని నేను, మరి ఇగ నీయిష్టం అని ఆయన. ఫర్వాలే. మరి తక్కువకి దొరకాలంటే మరి ఇదే ఉందిగద చూద్దాం కొన్ని రోజులని ఇంకున్నం. వాళ్ళేమనరు కానీ ఓనర్సు పై నుంటరు కింద వాల్లచుట్టాలేవుంటరు. కానీ వాల్లంటరు ఒక్కామె ఉంటది దాన్లో. నీల్లు మేం పట్టుకున్నంక పట్టుకోండి అని. రెండు సార్లన్నది. అంటే నాకు నువ్వు పట్టుకున్నంకనే పట్టుకుంట గానీ ఇంక ఊకే అంటవెందుకు బాగుండదుగద అట్ల అంటే. నువు రెండు బిందెలు నేను రెండు బిందెలు పట్టుకుంటాంగద అనేస్త నేను రెండుసార్లు ఓపిక పట్టిన. మూడోసారి అనేసిన, గమ్మునూకుంద. ఇంకేమంటలేదు. మనం ఊర్కె అంటె పడ్తరని అంటరన్నమాట. మల్ల నల్ల ఊకెనే పోతుంటది. బిందెలక్కడ కడగొద్దంటది. ఇక్కడనే కడుక్కోనిపోవాలె. అక్కడ చెట్లున్నయి. అక్కడనే కడిగితే చెట్లకు పోతయి గద నీళ్ళు. అదొకరోజు చెప్పింది. సర్లే అని మా ఇంట్లనే బిందెలు కడుక్కొని పోతనన్నమాట. అట్లా వాల్లకు కాస్ట్‌ చెప్పేసేసరికి అసలు పల్కరియ్యనే పల్కరియ్యరు తెల్సా. ఎప్పుడన్నా పల్కరిస్తది. ఆ కిందున్నోల్లు వాల్లకి చుట్టాలే. అస్సలు పల్కరియ్యది. నాకస్సలు నచ్చదక్కడ. ఆడోల్లు చానిదున్నరు. మొగొల్లతోనయితే మనం మాట్లాడమనుకో. మనకి తెల్వది. మనమేం మాట్లాడతం, గద. పరిచయమే లేదు. ఒకరోజు చెప్పింది ఒక రోజు మేము 100 కాండిల్సు బల్సు పెట్టుకున్నం. ఈ బల్బు పెట్టద్దండి, కరెంటు ఎక్కువయితది అని చెప్పింది. మేము అన్నం మాకు మీటరిచ్చేయండి, మేమెంత కాలిస్తే అంత పెట్టుకుంటం అని చెప్పినం. రెంటు తక్కువ చేస్తం ఏం లేదు మాకు ఒక్క టి.వి. వుంది, ఫ్రిజ్‌ గిజ్‌ ఏమీ లేదు. ఎప్పుడన్న బట్టలు ఐరన్‌ చేస్త. పిల్లలవి చేస్త. వాళ్ళ నాయన జేసుకుంటడు. నేనయితే చేసుకోను. నీకేం ఉద్యోగం అనడిగిన్రు. నీకెట్ల వచ్చింది. వాళ్ళకు చాల ఆశ్చర్యమన్నమాట. ఇంకొకపైన ముసలామె ఉంది. ఆమొచ్చి అడుగుతుంది. పూజకి పూలు తెంపుతుంది. కిందకొచ్చి అడిగింది. ‘ఎక్కడ జేస్తున్నావమ్మా, టీచర్‌గా చేస్తున్నావా ఎక్కడన్నా’ అంటే లేదాంటీ ఇక్కడ ఎన్‌.ఐ.ఎన్‌.ల చేస్తున్నా అన్నా. ఆ! ఎన్‌.ఐ.ఎన్‌.లనా. ఎట్ల దొరికింది నీకూ అంటే, అట్లనే తెల్సినోల్లుంటే… వాల్లకేదో వీల్లకేం తెల్వది అన్నట్లు హేళన జేసేసినట్లుందన్నమాట. మా ఇంటోల్లయితే అట్లనే ఉంటరు. చాన మంచోల్లు గాదన్నమాట. అంటే అసలు మాట్లాడరు. ఆ నల్ల దగ్గరనే అట్ల మాట్లాడిన్రు. ఇంక మూగదెయ్యాల్లాగుంటరు. ఏం తెల్వదు వాల్లకి. ఖాళీ వండుకోవడం, మంచిగ తినడం ఇంట్లనే

ఉంటరు. వాళ్ళ భర్తలకి ఏదో బిజినెస్సుంది. పొద్దునబోయి రాత్రికొస్తరు. వీల్లింక ఇంటికెల్లి కాలు బయట పెట్టేది లేదు. వాల్లకేం తెలుస్తుంది. ఇంట్లో ఉన్నోలకు, అస్సలేం తెల్వది. సినిమాలక్కూడ ఎల్లరు. ఒట్టి టి.వి. సినిమాలు తప్ప ఇంకేం చూడరు. బయటలోకం తోని వాల్లకు సంబంధాలే ఉండయి. అట్లున్నరు ఈ ఇంట్ల. వాల్లేం పట్టించుకోరు. చెప్పినా ఇనెటట్లు లేరు వాల్లు. మనల్నే కసిరిచ్చుకుంటరు. మనమేం చెప్తంగద వాల్లకు. కొంచెం వాల్ల స్టేజున్న వాల్లు చెప్తె వింటరేమో మరి. ఇప్పుడు నా కాస్ట్‌ తెల్సిపోయింది. నేను చెప్తె ఇనరు వాల్లు. ‘ఆ… నువ్వేందిలే. మాకంటే తక్కువనే గద’ అని… ఇంటికొచ్చి సామాన్లంత చూసిన్రన్నమాట, మా ఇంట్లోకొచ్చినరోజే. ఏందో ఏమనుకున్నరో ఏమో, ఆ… వీల్లు మాలోల్లు గద ఇంత సామానుంటదా, అంటే ఒకటి మంచాలూ, గంచాలు ఉన్నయి గద. ఏముండద్దని వాల్లకు. అంటే, ఇట్లుంటరని వాల్లకు మైండ్‌ల ఉండిపోయింది గద. ఎస్‌.సి, ఎస్‌.టి వాల్లకు ఏం సరిగుండది. గిన్నెలు గూడ సరిగుండయిగద వండుకోవడానికి, ఉన్నది వాల్లకు మనసుల. ఇంక మాకేందంటే ఉన్నది కొంచెం సామాను. అది చూసి పరేషానయినట్లున్నరు వాల్లు. కులం చెప్తేనేమో ఇది జెప్తున్నరు. నేను మొన్ననే గాస్‌స్టవ్వు కొనుక్కున్ననన్నమాట. స్టవ్‌లమీదనే వంటజేస్తుంటి, స్టవ్వుంది. ఒక టి.వి. పోర్టబుల్‌ది చిన్నదుంది. ఇదంతుంది వీల్లకు అబ్బా అని ఒకసారొచ్చి పరీక్షగ జూసి పోయిన్రు.

ఇప్పుడు బాగ డబ్బుంది వాల్లకేం ఫికర్లుండవు. హాయిగెల్లిపోతుంటది. వాల్లకు చిన్నోల్లది మా అసాంటోల్లదస్సలు తెల్వది. ఇప్పుడు కష్టపడి పైనొచ్చినోల్లకు కష్టాలేందో తెలుస్తది. మంచిగున్నోల్లకి అసలు కష్టాలే తెల్వది, వచ్చినా తట్టుకోలేరు వాల్లు. ఆ… వీల్లు మనింట్లో పనిచేసేటోల్లు. వీల్లంతే అనుకుంటుంటరు. వాల్ల ఎన్క ఉన్న పరిస్థితులేందీ అని ఆలోచించరు. వీల్లకి కట్టుకోవడానికి బట్టలుండయి. రోజుకిరవై రూపాయల కూలి, ఇగ అండ్ల ఏంజేయొస్తది. పది రూపాయలు పెడితే గాని కిలో బియ్యం రాదు. దాంట్లనే కట్టెలు తెచ్చుకోవాలె. కూరగాయలు తెచ్చికోవాలె. వండుకోవాలె, తినాలె. ఇగ పిల్లలకి, బట్టలకేం మిగుల్తయి? పిల్లలు మాత్రముంటరు, ముగ్గురు, నల్గురు పిల్లలు. ఒక్కొక్కలకు ఎక్కువుంటరు. వీల్లందరికి కట్టుకోవడానికి బట్టలెక్కడ కొంటరు? దానికింద మోటు కష్టం చేస్తరని రాత్రిగాంగనే కొంచెం తాగుతరు. తాగుడలవాటు గూడ ఉంటది. కొంచెం ఏదేమైనగానీ తాగుతరు. పిల్లలకి కూడా తెలుస్తది. పిల్లల్ని సదివిపియ్యాలె మంచిగ చెయ్యాలె అనుకుంటె పిల్లలు సదువుకోరు. మంచి స్కూల్‌లెయ్యాలంటే డబ్బులుండవు. ప్రైవేటుల మళ్ళీ స్కూల్‌ నుంచొచ్చి చదువుకోండిరా అని చెప్పడానికి తల్లిదండ్రులకేమో చదువులుండవు. అట్ల కొంతమంది పిల్లలు పాడయితరు. ఇప్పుడు రిక్ష తొక్కేటాయనుంటడు. ఆయన కొడుకు వేసిండు స్కూల్ల. ఇంటికొచ్చిన తర్వాత అమ్మకు రాదు సదువు, నాయనకి రాదు. ఇప్పుడు మా ఇంట్లగూడ అమ్మకి రాదు, నాయనకు రాదు సదువు. ఏదో మేం కొంచెం చదువుకున్నమనుకో. ఇప్పుడు మా పిల్లలు కొంచెం మంచిగ చదువుకుంటరు. ఆమంటది. ”ఏం చెయ్యాలమ్మ పిల్లగాడు స్కూలు నుంచి వస్తాడు. ఒక్కసారన్న పలకబట్టి రాసుకోడు” అంటది. నేను చెప్పాలంటే నాకే రాదు చదువు. ట్యూషను పెట్టిపియ్యాలంటె ఇరవై రూపాయలు, ముప్పై రూపాయలు. అవ్వియ్యలేరుగద కష్టం. నలుగురు పిల్లలుంటే నాలుగిరవైలు. కనీసం బియ్యమొస్తయిగదా అని కూడా కొంతమంది చదువుకోలే.

ఇప్పుడు టీచర్లు కొంచెం మంచిగున్నోల్లే ఉంటరుగద. వాళ్ళది వాళ్ళ వీథుల కోసం, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కోసం వాటి గురించే చెప్తుండె. ఇప్పుడు బీదోల్లున్నరు వాల్ల గురించి చెప్పరు వాల్ల లెస్సన్ల అసలు టిపిక్కె తియ్యరు వాల్లు. తీసినాగానీ ఎనక బడున్నోల్లు అట్లనే వుండాలె. గట్లనే రాసుంది వాల్లకి. కాబట్టి వాల్లు వీల్ల దగ్గర కూలిపని చేసుకోని బతకాలె అని అట్ల చెప్తుండె. అంతేగానీ వీల్లను ప్రోత్సహించినట్టు పద్ధతి టీచర్లకు కూడా లేదు. నిజంగనే నేను సదువుకునేటప్పుడట్లనే వుండె. నేనిక్కడనే వెస్లి స్కూలని

ఉండె. కో-ఎడ్‌ వుంటుండె. ఆర్‌.ఆర్‌.ల్యాబ్స్‌ లోపల ఇప్పుడు లేదు. బిల్డింగు తీసేసిన్రు. అప్పుడున్న టీచర్లు గూడలేరు. కొంతమందున్నరు. అటెటో పక్కకి ఇల్లు తీసుకుని ఉన్నరు. ఇప్పుడు మా కాస్టోలున్నరు. వాల్లకోసం మొత్తం హీనంగ చెప్పినట్టు లెస్సన్స్‌. అంటే వాల్లకు ఆర్థికంగ మంచిగ లేదు అని ఆ పద్ధతిలో చెప్పకుండా మొత్తానికి హీనంగనే మాట్లడినట్టు.

ఇప్పుడు లాండు విషయానికొస్తే ఇప్పుడు ఎవరైతే గొడవ చేస్తున్నరో వాళ్ళ దగ్గరే భూములూ, హోదా అన్నీ ఉన్నయ్యి. మంచి పోస్ట్‌లల్ల ఉన్నరు. లీడర్‌షిప్స్‌. ఆ పెద్ద ఉద్యోగాలల్ల కూడ వాళ్ళే ఉన్నరు. ఇప్పుడు మా ఎస్‌.సి, ఎస్‌.టి. క్యాండిడేట్స్‌కి, ఇప్పుడు ఎవ్వరు చదువుకోలేదు. ఎప్పుడు పన్లే చేసుకోని బతికినం. చదువుకోవడానికి మా దగ్గర వీలుండదు. ఆ కొంచెమైనా రిజర్వేషనుంటే మాకు కొంత

ఉద్యోగాలొస్తయ్యని నేననుకుంటున్న. ఇప్పుడు బి.సి.లల్ల కూడా కొంతమందికే స్టోర్స్‌ అవ్వీ ఉన్నయి. దాంట్లగూడ చాల ఎనకోల్లున్నరు. అయిదారు కులాలున్నయి దాంట్ల గూడ. కుండలు చేసుకుని బతికేటోల్లు ఇప్పటికీ దానిలోనే బతుకుతున్నరు ఊర్ల. మరి వాల్లకు భూములుండయి గూడ. ఏదన్న ఒకటీ రెండెకరాలుంటె గూడ ఏ బిడ్డ పెళ్ళికో, కొడుకు పెళ్ళికో అమ్మేస్తరు. పెళ్ళి చేసేస్తరు. ఇంకేమి ఉండది వాల్లకి. కష్టం చేసి బతుకుతేనే. వాల్లు కొంచెం చదువుకుంటె, రిజర్వేషన్లుండె వాల్లకు కూడా. కొంచెం జాబొస్తుందని నేననుకుంటున్న. బి.సి.వాల్లకి ఇగ ఎస్‌.సి, ఎస్‌.టివాల్లకు ఇరవైరెండు శాతం ఇచ్చిన్రు. బి.సి.లకు ఇరవై ఏడు. దాంట్ల కొంచెం చదువుకున్నోల్లు ఎంతమందున్నరంటే ఎనిమిదన్నరనే ఉన్నరంట. చదువుకున్నవాల్లు, కొంచెం డ్యూటీ చేసెటోల్లు. నాకయితే కొంచెం రిజర్వేషన్లుంటెనే మంచిగనిపిస్తది.

మరి వీల్లడుగున్నరు రెడ్డిస్‌ వాల్లంత మరి మాకు కూడ రిజర్వేషన్లు కావలె అని. ఇప్పుడు భూమి కొన్నెకరాలుంది. వేలకువేలెకరాలుంది. వాల్ల దగ్గర పనిజెస్తెనే వీల్ల పొట్ట నిండుతది. మల్ల అప్పులిస్తరు వాల్లే. అప్పులు కట్టించుకుంటరు. తరతరాల్నించి ఆపన్లే ఉన్నయి, మరి. రిజర్వేషనులిస్తే మంచిగనే

ఉంటది. ఆలాండ్‌ పంచిచ్చినా బాగనే ఉంటది. అదికాదు. ఎవరొప్పుకుంటరు? ఉట్టి పాడుబడ్డ భూములన్ని ఎస్‌.సి., ఎస్‌.టిల కిమ్మంటెనే ఎక్కువ కులం వొల్లొచ్చి గొడవ చేస్తరుగద. చేసి న్రెక్కడో ఇబ్రహీంపట్నమో ఎక్కడో. మా ఆయన చెప్పిండు. ఎన్ని గొడవలో. ఒక్కల్లో ఇద్దరో చనిపోయిన్రు గూడ. ఢిల్లీలోనంట! పెద్ద కాస్టోల్లని బ్రాహ్మిన్స్‌ని బొందపెట్టడానికి కూడ కొన్ని వేల ఎకరాల భూముందంట. ఆ భూమి మనకిస్తరా ఎవరన్న. మనకి పుట్టిగ ఇల్లు లేనోల్లు ఎంతో మందిన్నరు గద. వాల్లకియ్యచ్చుగద. ఇవ్వరు ఆ భూమి వాల్లకుట్టిగ సమాధి చెయ్యటానికి, కాష్టం చెయ్యటానికి

ఉపయోగిస్తున్రు. ఇల్లు లేనోల్లు ఎంతో మందున్నరు. లేనోల్లకు రెండు రెండు రూములేపిస్తె బాగుంటది. ఢిల్లీలో పేదోల్లు చాలామందున్నరు. ఎస్‌.సి., ఎస్‌.టి.లు బొలెడంతమందున్నరు. వాల్లకు నిలబడ్డానికి చోటు లేదు. వాల్లకా భూమిస్తెపోతదిగద. ఇయ్యరు. ఎవరిస్తరు. ఇల్లుగట్టుకుంటరు. మంచిగ వాల్ల గుడిసె నన్న పెద్దగ జేసుకోని ఉంటరుగద. సమాధులకన్నెకరాలు ఆక్రమించుకోనుందట గవర్నమెంటు. మన గవర్నమెంటు బతికినోల్లకి ఇళ్ళులేవు. చచ్చినోళ్ళకి అంత పెద్ద సమాధి. ఎక్కడ బోయిన అట్లనే ఉన్నది. ఎప్పుడు మారతదో ఎట్లయితదో తెల్వదు. ఇప్పుడన్ని కులాలకి పెట్టేసిన్రు కొట్లాటలు. ఇప్పుడు ఎస్‌.సి., ఎస్‌.టి., బిసి.లకు బ్రాహ్మిన్స్‌కు ఈ కులాలకే కొట్లాట అవన్నీ. అంతేగద. తేడాలేం లేకుండా కులాలకు కులాలు కొట్టుకోవడం, ఫైటింగు కావడం ఇదంత గొడవలు. దీని కోసం చూస్తే కులాల కోసమే కొట్లాడి దానికోసమే అభివృద్ధి చేసినట్లవుతుంది. ఔనాకాదా. ఇప్పుడు మాకు రిజర్వేషన్‌ ఉందని బ్రాహ్మిన్స్‌, రెడ్డీస్‌, కమ్మాస్‌ వీల్లంత మాకున్న రిజర్వేషన్లు తీసేయాలని. అందరికి బంద్‌ జేసి సదువుకున్నోల్లకే ఇయ్యాలంటే వీల్లిండ్ల చదువుకున్నోల్లెవ్వరుండరు. అంత వాల్లేఉంటరు. యూనివర్సిటీల నుంచి గోల్డుమెడల్సు తీసుకున్నోల్లు, బాగా ఫస్ట్‌క్లాసుల పాసయినోల్లు వాల్లే ఉంటరు. వాల్లకే పోతయ్యి పోస్టులు. ఇగ మా అసుంట్లోల్లకి ఏమి ఉండవు. బి.సి.ల కైనా, ఎస్‌.సి.లకైనా, ఎస్‌.టి.లకైనా ఆ కోటా లేకపోతే ఇగరాదు. ఇటువంటోల్లు డ్యూటీలకే అర్హులుకారు. ఇగవాల్లు రానేరారు. ఇన్ని మార్క్సన్నా ఉన్నయి. ఇంతే పర్సంటేజితోని కొంచెం చిన్న జాబ్‌ అన్నా వస్తుంది. మా ఇన్‌స్టిట్యూటుల్నే చూడండి. నేను పోయిన కాడ్నించి ఇప్పటికి మూడుసార్ల ఎమ్‌.ఎస్‌.సి.లకు పోస్టుల పడ్డయి. పడితే ఒక్కరన్న ఎస్‌.సి., ఎస్‌.టి. కాండిడేట్లు రాలే ఆ పోస్ట్‌లకి. రెండుసార్లు, మూడుసార్లు చూసి భర్తీ చేసేస్తరుగద. మరి అంత చదువుకున్నోల్లేరి? ఉట్టి మా ఇన్‌స్టిట్యూట్‌లనే చూడండి. నా కనిపించింది మా లాబ్‌ల చదువుకున్నోల్లు లేరు. ఇప్పుడు మా వోనికి బి.యస్‌.సి. చదివాడు. ఎమ్‌.ఎస్‌.సి. చదువుదామంటె సీటురాలేదు. ఎంట్రన్స్‌ల పోయింది. సీటు దొరకలె. ఖాళీగున్నడు ఇప్పుడు. మా చినమామ కొడుకు అమ్మోల్లింట్లుంటడు. మార్కులు తక్కువున్నయి వానికి. ఇప్పుడు రానేరాలే వానికి. ఖాళీగనే ఉన్నడు. ఈ రిజర్వేషన్లు లేకపోతే వీల్లు ఇగరానేరారు పైకి. ఇప్పుడు ఎనిమిదిన్నర పర్సెంటు ఉన్నరుగద. ఇక వన్‌ పర్సెంటు, హాఫ్‌ పర్సెంటు గూడ ఉండరు. బి.సి.గాని, ఎస్‌.సి.గాని, ఎస్‌.టి.గాని రిజర్వేషను ఉంటెనే మంచిదని నేను. కాకపోతే ఒకవేళ లేదనుకో, ఇప్పుడు ఊర్ల ఆస్తులున్నవి. చాల ఎక్కువనే. ఇక్కడనేమొ డ్యూటీలున్నయి. ఊళ్ళల్లో భూములున్నయి. వేలకు వేల ఎకరాలు. ప్రతిఒక్కటి వాల్లకు ఊరినుంచే వస్తయి. ఇక్కడ పట్టి మంచినూనె, పేస్టులు, మొహానికి పెట్టుకునే పౌడర్లు, క్రీములు అవీ ఇవీ కొనడానికి వీల్ల డబ్బంత వేస్ట్‌ చేయడమేగాని, ఇక్కడ జాబుతోని అవి కొంటరు. మిగతా ప్రతి ఒక్కటి వూరినించే వస్తది. సంచులు సంచులు, బస్తాలు బస్తాలు వస్తయి. బూముల్లేనిది ఎట్లొస్తయి. మల్ల వాల్లే పెద్దోల్లయి పోతరు. వీల్లు వాల్లింట్ల పనిజేసుకుంట అట్లనే ఉండిపోతరు. ఈ రిజర్వేషను కూడా లేకుంటే చాన కష్టం. ఉండాలనే ఉంది నాక్కూడ. లేకపోతే ఇట్ల చేస్తరా. చెయ్యరు. ఇపుడు ఎక్సాంపుల్‌ లీడర్లున్నరు. వాల్ల భూములు, వాల్ల కొడుకులు, మనుమలు,

మనమరాళ్ళు వాల్లకు పుట్టబోయే పిల్లల పేరుమీద కూడా రిజిష్ట్రేషన్లున్నయి. ఏదో ఒక పేరు మీద. అవన్నీ పంచేయమంటే బీదోల్లకిస్తరా. అందరికి సమానంగ జేయమంటే చేస్తరా, ఎవ్వరు చేయరు. అది జరగని పని.

ఇప్పుడు మా ఆఫీసుల ఉన్నరు డాక్టర్లు, ఎట్లయిన కొంచెం నెగ్లెట్‌ చేసినట్లే మాట్లాడతరు. ఏదన్నా డిస్కషనొచ్చినా గానీ హీనంగ జూసినట్లు మాట్లాడతరు ఇప్పటికీ, మనమేం చేయగల్గుతం. కామ్‌ గూకోవాలె. మళ్ళీ మంచి ఎడ్యుకేటెడ్స్‌. ఇప్పుడామె డాక్టరు, ఆమెకి తెల్సు. వీల్లిట్లుంటరు. వీల్ల పద్దతిట్ల అని. అయనగాని ఆమె అట్ల గట్టిగ మాట్లాడి చెప్పేస్తది.

ఇప్పుడున్నోల్లు, ఉన్నోల్లే కొట్లాడుకుంటున్నట్టు అయింది. ఉన్నోల్లున్నోల్లే. ఎస్‌.సి., ఎస్‌.టిలెటో పోతున్నరు. బి.సి.లు కొంచెం అక్కడక్కడున్నోల్లు కొంచెం పర్వాలేదు. ఇప్పుడు దానికి తోడు వీల్లు ఇప్పుడు బి.సిలు, ఎస్‌.టి., ఎస్‌.సిలతో కల్సిపోయి ప్రొసెషనులాగ తీసి వాల్లను ప్రోత్సహిస్తే మంచిగుంటది కద. ఏదో ఒకటి అవుతుందిగద. వాల్లేంది వాల్ల బిజినెస్సులు అవే ముఖ్యంగ జూసుకుంటరు. వాల్లింటివన్నీ చూసుకోని తర్వాత ఏమన్న టైముంటే టైముకొచ్చి వీల్ల నడుగుతరు. అట్ల చెయ్యొద్దు. మొదటి నుంచీ పనిజేయాలి. ఇప్పుడు నీకున్నయి ప్రాబ్లమ్స్‌ నాకున్నయి ఇంట్ల. బి.సి., వాల్లకున్నయి. ఎస్‌.సి వాల్లకున్నయి, ఎస్‌.టి వాల్లకున్నాయి. కాకపోతే మీరు కొంచెం మంచిగుండొచ్చు. అయినాగానీ పని పనేగద. ఇప్పుడింట్లో పని నాకుంటది. ఒకటేనని, మీదోళ్ళచ్చి చేస్తరా? కిందోళ్ళస్సలే చేయరు. మనకి మనమే కాంప్రమైజ్‌ అయి పనులు చేసుకొని మళ్ళీ ఇటువంటి వాటికి రావాలె. మీటింగ్స్‌ అవీ. అది మీకు మంచిదే, మాకు మంచిదే.

ఈ ఇంటర్వ్యూ 1990 నవంబర్‌లో కె.సజయ, కె.లలిత చేశారు. ఆ సమయంలో రిజర్వేషన్ల వ్యతిరేకోద్యమం నడుస్తోంది. కులసమస్య మీద, రిజర్వేషన్లు మీద విస్త ృతమైన చర్చ నడుస్తున్న నేపథ్యంలో, దళిత స్త్రీల జీవిత అనుభవాలేమిటి, దైనందిన జీవితంలో కంటికి కనిపించకుండా వారెదుర్కొంటున్న కుల వివక్షతను వారి అనుభవాల్నుంచి అర్థం చేసుకోవటానికి ‘అన్వేషి’ సంస్థ చేపట్టిన పరిశోధనలో ఇది ఒక భాగం. దీన్ని భూమికలో ప్రచురించడానికి అనుమతించినందుక ‘అన్వేషి’ కి కృతజ్ఞతలతో….

(జులై – సెప్టెంబర్‌ 1993 భూమిక నుంచి)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో