మానవహక్కులు-మహిళలు-ప్రజాస్వామికత -అనిశెట్టి రజిత

‘మహిళల హక్కులూ మానవ హక్కులే’ అనే నినాదం ఏనాటిది. శ్రద్ధగా ఆలకించి, అర్థం చేసుకుని, ఎవరు అమలు చేస్తున్నారీ భావాన్ని. ఒకరి ఆధిపత్యం వల్ల ఒకరు తక్కువతనంలోకి నెట్టబడడం. అది పురుషాధిక్యత వల్ల స్త్రీలు చిన్నచూపుకు గురి కావడం, మానవ హోదాకు దూరం చేయడం. ఆధిక్యత నోటిమాట వల్ల ఏర్పడదు. కర్రపెత్తనంతోనే సాధ్యమవుతుంది. ఆ కర్ర పెత్తనం, హింసా ప్రయోగం పేరు ‘అణిచివేత’.

తరతరాలుగా స్త్రీ-పురుష అసమానత్వం సామాజిక అసమతుల్యతకు మూలంగా ఉంటూ వస్తున్నది. ఏమిటా అసమానత్వాలు? నోబెల్‌ బహుమతి గ్రహీత ప్రొఫెసర్‌ అమర్త్యసేన్‌ ప్రకారం ”కుటుంబ వస్తు సముదాయంలో, వనరుల్లో స్త్రీ పురుషులు, ఎవరు ఎంత పరిమాణాన్ని వినియోగించుకుంటున్నారు అని గాక, మానవ జీవనానికి అత్యంత సహజమైన, కీలకమైన, ఆరోగ్యప్రదమైన, గౌరవప్రదమైన జీవనశైలి, సృజనాత్మక శక్తుల వికాసం, వాటిని పొందడంలోని తారతమ్యాలను పోల్చి చూడడం ద్వారా స్త్రీ, పురుషుల మధ్యనున్న అసమానతలను అర్థం చేసుకునే వీలుంటుంది. తరచి చూస్తే స్త్రీ-పురుష అసమానత్వం అనేది వారు అనుభవించే స్వాతంత్య్రాల భిన్నత్వంగా గోచరిస్తుంది”.

1990లో డా||అమర్త్యసేన్‌ హార్వర్డులో లేమాంట్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు ”మోర్‌ దేన్‌ హండ్రెడ్‌ మిలియన్‌ ఉమెన్‌ ఆర్‌ మిస్సింగ్‌” అనే వ్యాసంలోనూ, 1995లో ”ఇనీక్వాలిటీ రీ ఎగ్జామిన్డ్‌” అన్న గ్రంథంలోనూ స్త్రీ-పురుష అసమానత్వాలను స్త్రీలపై అనాదిగా సమాజం చేస్తున్న హత్యాకాండ మూలాలకూ, కారణాలకూ సంబంధించిన అంశాలను చర్చించారు. సమాజం ఏదైనా అది అభివృద్ధి చెందిన సమాజమైనా స్త్రీకి పురుషునితో సమానమైన స్థానం లేకపోవడం ”ఇనీక్వాలిటీ”గా, కుటుంబ వనరుల వినియోగంలో స్త్రీకి పురుషునిలా అవకాశాలు లేకుండా తొక్కిపెట్టబడడం ”డిప్రైవేషన్‌”గా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.

తమ బాధలకు మూలకారణాలు తెలుసుకోవడం స్త్రీలకు ఎంత అవసరమో, పురుషాధిక్యతా భావంవల్ల స్త్రీలే కాదు, ముఖ్యంగా పురుషులూ ఎంత నష్టపోతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం దిశగా ఆంగ్లభాషేతర సాహిత్యం అధికంగా రావాల్సిన అవసరం ఉంది. కేవలం చట్టాలు రూపొందించడం వల్ల అసమానత్వం నిర్మూలన జరగదని గత శతాబ్ద కాలచరిత్ర నిరూపించింది. పురుషుల్ని చైతన్యవంతం చేయడంతోపాటు వారి సహకారం వల్లే అది సాధ్యమవుతుంది.

ఐక్యరాజ్యసమితి ః

1948 నుండీ ఐక్యరాజ్యసమితి ప్రతి ఏడాదీ చర్చలు, ప్రకటనలు, సర్వేలు, నివేదికల ద్వారా కుటుంబం అనే యూనిట్‌ ద్వారా వ్యక్తులందరికీ సమాన అవకాశాలు, గుర్తింపు, గౌరవం లభించాలనీ, అందుకోసం అన్ని దేశాల్లో కృషి జరగాలని పదే పదే గుర్తుచేస్తూనే ఉంది. కానీ జవాబుదారీ తత్వాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత ఆయా దేశాల సమాజాలదే. స్త్రీలకు రాజ్యాంగాలు కల్పించిన హక్కులు అప్పుడే ఆచరణాత్మకం అవుతాయి. 1967లో ఐక్యరాజ్యసమితి మహిళల పట్ల వివక్షను, నేరాలను ఖండిస్తూ సమగ్రమైన ప్రకటన చేసింది. ఐ.రా.స. ఆమోదించిన నివేదిక ప్రకారం ‘మహిళల హక్కులే మానవ హక్కులు’ అనేది ప్రధాన అంశం.

అన్ని దేశాలూ స్త్రీ, పురుషులకు సమాన హక్కులను కలిగిస్తూ ప్రతి వ్యక్తీ హుందాగా జీవించే వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉండాలి. మహిళల పట్ల వివక్ష కారణంగా అన్ని రంగాల్లో స్త్రీలు సమానంగా పాల్గొనలేకపోతున్నారు. అందువల్ల మహిళాభివృద్ధి జరగడంలేదు. దానికి కొనసాగింపుగానే దేశాభివృద్ధికీ, సంపూర్ణ మానవ వికాసానికీ ఆటంకం కలుగుతోంది. అందువల్ల మహిళలకు సమాన అవకాశాలు ఏర్పర్చక తప్పదు.

రాజ్యాంగంలో సమాన హక్కుల సిద్ధాంతాన్ని పొందుపర్చాలి. మానవ గౌరవానికి భంగం కలిగించే అసమాన హోదా, వివక్ష, స్థాయిని దిగజార్చే ప్రయత్నమేదైనా తప్పేనని ఐక్యరాజ్యసమితి 1వ అధికరణంలో పేర్కొంది. అధికరణం 2 లో అమలులో ఉన్న చట్టాలు, ఆచారాలు, నిబంధనలు, సంప్రదాయాలు ఏవైనా కానీ మహిళల సమానస్థాయికి భంగకరంగా ఉన్నట్లయితే వాటిని రద్దు చేసి కొత్త సూత్రాలను రూపొందించాలి. ఐ.రా.స. ప్రతిపాదించిన ఈ అంశాలను వివక్షను అంతమొందించేందుకు అన్ని దేశాలు ఆచరణలోకి తీసుకురావాలి.

రాజ్యాంగం-పురుషాధిక్యత ః

మనకు రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులూ ఉన్నాయి. అంతర్జాతీయ ఒప్పందాలన్నింటినీ భారతదేశం ఆమోదించింది. ఆచరణలో మాత్రం ఇంకా దిక్కులు చూస్తూ, పగటిపూటే చుక్కల్ని లెక్కించే పనిలో పడి మైమర్చిపోయి ఉంది. అంటే అంతర్జాతీయంగా అన్ని సదస్సులకు హాజరవుతూ, అన్ని తీర్మానాలను ఆమోదిస్తూనే మహిళల హక్కుల ఉల్లంఘనలు జరుగుతుంటే మాత్రం నిలువరించడంలో చేతులెత్తేస్తోంది.

స్త్రీలపట్ల ఘోరమైన నేరాలు జరుగుతుంటే పౌర సమాజం ఆందోళనలో, అలజడిలో పడి కొట్టుకుంటుంటే ప్రభుత్వం మాత్రం సంక్షేమం గొంతు నొక్కి అంతా చల్లబర్చే ప్రయత్నంలో విజయం సాధిస్తోంది.

అప్పుడూ, ఇప్పుడూ స్త్రీ జీవించే హక్కు కోసం, స్వేచ్ఛ, భద్రతల కోసం, ప్రైవసీ కోసం, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం సంఘర్షణా పథంలో కదం తొక్కవలసిన పరిస్థితే ఉంది.

దశాబ్దాలు దాటి శతాబ్దాల్లోకి చేరుకున్నా మహిళ మాత్రం ఇంకా సామాజిక న్యాయం కోసం వేచి చూస్తూనే ఉంది. మహిళలను రాజకీయ అధికారానికి దూరం చేయడంలో మన రాజకీయం గొప్పగా గెలుస్తోంది. స్త్రీలకు వ్యక్తిగతమే లేదు, అంతా రాజకీయమే. రాజకీయాలే మగవాడ్ని అగ్రభాగాన, ఆధిక్యతన నిలబెట్టాయి. స్త్రీని మాత్రం అమానుషంగా, కుట్రపూరితంగా అణగదొక్కాయి.

ప్రపంచమంతా నిరాఘాటంగా, నిర్లజ్జగా పురుషాధిక్యత రాజ్యమేలుతోంది. హింసల్ని క్రీడలుగా చేసుకుని ఏలుతోంది. స్త్రీలు మాత్రం అంధకారంలో బందీలుగా, బలిపశువులుగా అణగారిపోయి నికృష్టంగా జీవిస్తున్నారు. సమాజంలోని వనరులు మొదలుకొని అవకాశాలు, అందలాలు అన్నీ పురుషునికే దాసోహం అంటున్నాయి.

ఇదంతా చీకటి కోణం. ఒక యదార్థమైన అంధకార ఆవరణం. ఎన్నాళ్ళీ చీకటి రాజ్యం? గిట్టనివారన్నట్లుగా సదస్సులు, సమావేశాలు, తీర్మానాలు మహిళల తలరాతలు మార్చవని నమ్మే కాలంలోనే ఉన్నామా మనం? మహిళలు ఇంకా ఆటబొమ్మలేనా?

బీజింగ్‌ సదస్సు ః

అసలు మహిళలు ఒక చోట చేరి తమ జీవిత సమస్యలను చర్చించుకోవడం, అరాచకాలను గర్హిస్తూ గళగర్జనలు చేయడం, స్త్రీలు ప్రపంచాన్ని తమకళ్ళతో వీక్షించే వైనం అన్నీ చీకటి కుహరాల నుండి బయటపడే పెనుగులాటకు నాంది కాదా. 1995 ఆగస్టులో చైనా దేశం బీజింగ్‌ నగరానికి 50 మైళ్ళ దూరంలో ఉన్న హుయారూలో జరిగిన మహిళా సదస్సు మహిళల్లో సమైక్యతను, సంఘటనా సామర్థ్యాన్నీ, సమస్యల పట్ల అవగాహనను పెంచడానికి నిదర్శనంగా నిలుస్తుంది. పదిరోజుల ఆ సదస్స సంరంభమంతా పర్వదినాలను తలపింపచేసింది. వేలసంఖ్యలో స్త్రీలు ఒక దగ్గర చేరి వందలాది వర్క్‌షాప్‌లు, గోష్ఠులు, చర్చలు, వాదనలతో సమాజంలో పెరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన జరిపారు.

మతఛాందసులను, అణుపరీక్షలను, అహంభావ యుద్ధాలను, మరెన్నో అనుచితమైన అంశాల పట్ల తమ వ్యతిరేకతను తెలుపుతూ తమ హృదయవేదనలను పంచుకున్నారు, వారి ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నారు. ప్రపంచశాంతికి అచ్చమైన దూతల్లా, ప్రతినిధుల్లా సదస్సుకు హాజరైన మహిళలు తమ ఆకాంక్షను లోకానికి చాటారు. 190 దేశాలకు చెందిన 50 వేల మంది మహిళలు ఈ సదస్సుతో యావత్ప్రపంచం చూపును తమవైపు తిప్పుకున్నారు. హింసారహిత సమాజం సాధ్యం చేసేందుకు పిడికిలి బిగించారు. నిరాయుధీకరణ, ప్రపంచశాంతి పునాదిగా బీజింగ్‌ ప్రకటన వెలువడింది. సమత, సామాజిక న్యాయం దిశగా పయనం కట్టారు ప్రపంచ పీడిత మహిళా సమూహాలు.

వియెన్నా తీర్మానాలు ః

1968లో టెహ్రాన్‌లో ఐక్యరాజ్యసమితి మానవహక్కులపై అత్యంత కీలకమైన సదస్సును ఏర్పాటు చేసింది. తర్వాత 25 సం||లకు మళ్ళీ 1993లో వియెన్నాలో మానవ హక్కుల సదస్సు జరిగింది. అది ప్రపంచ మహిళలందరూ తమను తాము అభినందించుకునే సంవత్సరం. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే ఆనందకరమైన రోజది. మహిళల హక్కులను మానవ హక్కులుగా పరిగణిస్తూ మహిళల కడగండ్లు సమసిపోయే ఆశను, నమ్మకాన్ని కలిగించిన సదస్సు అది. వియెన్నా తీర్మానాల్లో ఒకటి అంతర్జాతీయ మహిళా న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం, రెండోది ప్రత్యేక పరిశీలనా సంస్థను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా స్త్రీలపై జరుగుతున్న నేరాలను అధ్యయనం చేయడం. 1993లో స్త్రీల హక్కుల కోసం పోరాడడమనే అంశం అన్ని దేశాలకు తక్షణ కర్తవ్యంగా మారినటువంటి విశేషం జరిగింది.

1975 నుండి 1985 వరకు ఐక్యరాజ్యసమితి మహిళా దశాబ్దంగా పాటించింది. దీనివల్ల మహిళా సమస్యలను పట్టించుకుని నిర్మూలించే కృషి పెరిగింది. లింగ వివక్షను, హింసను, మానవహక్కులను కాలరాసేవిగా గుర్తించాలని 117 దేశాలకు చెందిన 2,15,000 మంది ప్రతినిధులు వియెన్నా సదస్సులో కోరారు. దీని ఫలితంగా వియెన్నా సదస్సులో సంచలన తీర్మానం చేయడం జరిగింది. కలిసి నడిస్తే కాలం కలిసి రాకేం చేస్తుందని సందేశమిచ్చింది. వియెన్నా సదస్సు నాటినుండే మరింత గట్టిగా, పెద్దగా మహిళా ప్రపంచం ‘మహిళల హక్కులు – మానవ హక్కులే’ అని మారుమ్రోగేలా నినాదాలిస్తోంది. ఈ భూగోళంపై స్త్రీలు కన్నీరు కార్చని ఖండమే లేదు. కానీ స్త్రీలు ఒకరికొకరుగా ఒక్కటిగా కలిసి నడిస్తే తమ రక్త కన్నీటి ప్రవాహాల నుండి బయటపడగలరు.

సమానత్వం – ప్రజాస్వామ్యం ః

సమానత్వం, సమాన హక్కులు అని మనం కోరుతున్నదీ, డిమాండ్‌ చేస్తున్నదంతా ప్రజాస్వామికత వల్ల మాత్రమే సాధ్యమయ్యేవి. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యతే ముఖ్యమంటుంది. ప్రజాస్వామ్యత ప్రణాళికల్లో, ప్రభుత్వ విధానాల్లో లిఖించబడి ఉంటుంది కానీ సమాజంలో ఎక్కడా దాని జాడ కనిపించదు. కుటుంబ, సమాజ, రాజ్య వ్యవస్థల్లో అన్నింటా కుల, వర్ణ, వర్గ, జెండర్‌ స్వామ్యమే తప్ప సమస్వామ్యం ఆనవాళ్ళుండవు. మరి ప్రజాస్వామ్యమనేది లేని పరిస్థితుల్లో అంతా నిష్ఫలితమే కదా! ప్రజాస్వామ్యాన్ని ముందుగా మనం ఎలా గుర్తించాలి? అది కేవలం ప్రజల మధ్యన సఖ్యతగానో, జాలిగానో, విశ్వాసం ఉండడంగానో కాదు గుర్తించబడేది. ఇతరుల పట్ల సమానత్వ భావం, సత్ప్రవర్తన, సరైన ఆలోచనా విధానం తప్పనిసరిగా ఉండడంవల్ల, అవసరమైన కఠినమైన కట్టుబాట్లు లేకుండా ఉండడమనేది ప్రజాస్వామ్యానికి అవసరం. వివక్షలు, వర్గభేదాల వల్ల ప్రజాస్వామ్యమనేది నిర్వీర్యమవుతుంటుందని బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ అన్నారు. మానవ హక్కులనేవి మానవ విలువలతో, సమానత్వంతో కలిసిపోయి ఉండాలనీ, అవి స్వేచ్ఛగా అనుభవంలోకి రావాలనీ 1948లోనే యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అంతర్జాతీయ తీర్మానాలు పేర్కొన్నాయి.

పేద ప్రజలకు జ్ఞానం అందినప్పుడు, కుల మత వర్గాలకు అతీతంగా వనరుల సమాన పంపకం జరిగినప్పుడు, ఆడా మగా, పేద ధనిక అంతరాలు లేకుండా చేయగలిగినప్పుడు, ఒక భద్రతైన వాతావరణం శాంతి భావనలకు జన్మనిచ్చినప్పుడు, ప్రత్యేకించి ప్రజాస్వామ్యం గురించి ముచ్చటించుకునే అవసరం లేకుండా పోతుంది, నాగరికత మానవీయంగా మారుతుంది.

1995-2004 వరకు మానవ హక్కుల విద్య దశాబ్దంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 1) సమితి నిర్దేశించిన సూత్రాలు, ప్రాథమిక స్వేచ్ఛలు, మానవ హక్కుల పట్ల గౌరవాన్ని పెంపొందించడం, 2) మానవ వ్యక్తిత్వపు సర్వతోముఖ వికాసం, గౌరవం 3) ప్రజల మధ్య పరస్పర అవగాహన, సహనం, స్త్రీ పురుష సమానత్వం, మైత్రీ భావాలను పెంపొందించుకోవడం 4) స్వేచ్ఛాయుత సమాజంలో వ్యక్తులందరూ సమర్థవంతంగా పాల్గొనేలా ప్రోత్సహించడం 5) శాంతిని కాపాడే కార్యకలాపాల్ని ప్రోత్సహించడం.

ఙఙఙ

మానవజాతి యొక్క సుదీర్ఘ చరిత్రలో, మానవ సమాజం సాధించిన పరిణామాల్లో ‘ప్రజాస్వామ్యం’ ఒక మహాద్భుతమైన విప్లవం. కానీ అదే చరిత్రలో దాన్ని అన్వయించుకోలేక అణగదొక్కుతూ అంతరింప చేయడం, ఊరికే కంటితుడుపుగా ప్రజాస్వామ్య జపం చేయడం మానవజాతి చేసిన, చేస్తున్న ఘోరమైన తప్పిదం. హక్కుల పరిరక్షణలోనే ఒక కవచంగా ప్రజాస్వామ్యం ఉంటుంది. ఎటువంటి హింసకూ గురికాకుండా ఆనందంగా జీవించే హక్కును ఎప్పటికి సాధిస్తాము? ఎటువంటి విచక్షణ, ఆటంకం లేకుండా ఈ దేశ మూలవాసులు, ఆదివాసీలు, మహిళలు మానవ హక్కుల్నీ, ప్రాథమిక స్వేచ్ఛల్నీ పరిపూర్ణంగా ఎప్పుడు పొందగలరు? ఈ ప్రజల మానవ హక్కుల పట్ల, ప్రాథమిక స్వేచ్ఛ పట్ల వ్యతిరేకమైన ఒత్తిడులు, బలప్రయోగాలు ఆగేదెన్నడు?

ప్రతి మనిషి సాటి మనిషిని గౌరవిస్తే అది వారి మానవహక్కులను ప్రేమించినట్లే. స్వేచ్ఛకు ప్రాథమిక పునాదిగా మనకు సహజసిద్ధమైన హక్కులున్నాయని గుర్తించడమే. అదేవిధంగా ఆదివాసీలు, మూలవాసులు తాము నివసిస్తున్న రాజ్యం పరిధిలోనే తమ జీవన విధానాలు, ఆర్థికాభివృద్ధి, ఆస్తిత్వం, సాంప్రదాయ కూటములపై తమకే నియంత్రణాధికారం ఉండాలని కోరుకుంటారు. వారి ప్రాథమిక స్వేచ్ఛలకు, మానవ జీవన హక్కులకు భంగం కలగకుండా ఉండాలి.

మన దేశంలో మనందరికీ తెలిసిన పౌరాణిక ఇతిహాస గాథలున్నాయి. వాటికి చరిత్రలో ప్రాధాన్యతలూ ఉన్నాయి. ఆ గ్రంథాల్లోని కథలననుసరించి ఎన్నో నీతులూ ప్రచారంలో ఉన్నాయి. బహుశా వాటిల్లో పాటించిన పవిత్ర సంస్కృతి ప్రభావం వల్లనే నేటి మన భారతీయ సమాజంలోని కొన్ని విలువలు, భావజాలాలు కూడా బలంగా వ్యాప్తిలో ఉండి ఉండవచ్చు కూడా. సీతను రాముడు శీల పరీక్షకని రెండుసార్లు అగ్నిప్రవేశం చేయమన్నాడు. ధర్మానికి ప్రతీకగా చెప్పుకునే యుధిష్ఠరుడు (ధర్మరాజు) జూదంలో సతి ద్రౌపదిని పణంగా పెట్టాడు. మహా మహా పెద్దలున్న కురుసభలో ఒక స్త్రీని వస్త్రాపహరణం చేయబూనారు రాజ్య మదాంధులు. తండ్రి మాట కోసం పరశురాముడు తల్లి రేణుకాదేవి తలను నరికాడు. మోహించానన్నందుకే కోపించిన లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోసి కురూపిగా చేసి అహంకారం చూపాడు. ఇంకా నాటి నుండీ నేటి వరకూ ఎన్ని సంఘటనల్ని, దుశ్చర్యల్ని చెప్పుకుంటూ ఉండాలి?

ఙఙఙ

తొలుత స్త్రీ సర్వ స్వతంత్రురాలు, గుంపుల గణాల నాయిక, సమాజపు ఏలిక. ఆ తర్వాత ఆమె ప్రాణమున్న ఒక వినియోగపు యంత్రం, భోగ్య వస్తువు, మగవాడి సొంత ఆస్తి. తర్వాత ఇక బానిసే, క్రమేణా రెండవ శ్రేణి మనిషి, మరింత దిగజారి చివరి శ్రేణి ప్రాణి. ఇదంతా ఒక దిగజారిన హీనమైన చరిత్ర పారాయణం.

స్త్రీ శ్రమను వేణ్ణీళ్ళకు చన్నీళ్ళు తోడు అనే అభిప్రాయం ఒకప్పటిది. ఆధునిక భావనలు వ్యాపించిన సమాజంలో ఇప్పుడామె ఒక స్వతంత్ర అస్తిత్వం. దయ చూపవలసిన దీనురాలు కాదు. ఆమే దయామయి. ఉత్పత్తి రంగంలో తనకు తానే సాటి. మానవ మనుగడను పునరుత్పత్తితో కొనసాగింపజేసే పునఃసృష్టి శక్తి.

మహిళా చేతనం, మహిళాభ్యుదయం లేని సమాజం జవజీవాలు లేక నిర్జీవంగా పడి ఉంటుంది. సగం మానవజాతి సంకెళ్ళలో బందీగా ఉండి అవిద్య, అజ్ఞానంలో ఉంటే ఆ వ్యవస్థ ఊబిలో దిగబడిపోయినట్లే ఉంటుంది. పితృస్వామ్య, కులస్వామ్య చట్రాలను విరగ్గొట్టి సమస్వామ్యం స్థాపించుకోలేని మన సమాజం పగలే కారుచీకట్లలో తచ్చాడుతుంటుంది. కాగితాలకు, కల్లబొల్లి ప్రవచనాలకు, ఉపన్యాసాలకు పరిమితమైన మానవాభ్యున్నతి, మానవాభివృద్ధి, ప్రజాస్వామ్యత ఆచరణలోకి రాకపోతే ఆ సమాజానిదిక అథోగతే.

‘మహిళల హక్కులూ మానవ హక్కులే’ అన్న భావనకు ప్రాణం పోసి కాపాడుకునే చైతన్యం కోసం మళ్ళీ ఒకసారి 10 డిసెంబర్‌న అంతర్జాతీయ మానవ హక్కుల రోజున పునరంకితం అవుదాం! మనోవికాసంతో మానవ హక్కుల మహోద్యమానికి కార్యశూరులవుదాం!

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.