అసలు నేనెలా వుండాలి?

-బంగార్రాజు

‘నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి’ ఈ కవితని తెలుగులో ఇటీవలే చదివాను. ఇంతకు ముందు ఇంటర్‌నెట్‌లో ఎవరో మెయిల్‌గా పంపితే చదివాను కాని తెలుగులో చదివినపుడు ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగినట్లయింది. కళ్ళల్లో సన్నటి నీటిపొర కమ్మింది. గుండెను పిండేయడం అంటే ఇదేనేమో! గృహ హింస విశ్వరూపాన్ని ఆవిష్కరించిన ఈ కవిత రాసిందెవరో తెలియకపోవడం ఎంత దురదృష్టం. హింసకు బలైపోయిన ఒక స్త్రీ శవం నాకీరోజు పూలు కానుకగా వచ్చాయని, ఆ పూలు ప్రేమగా కాక, శవాన్ని కప్పే పూలని చెప్పడం, అతన్ని వదిలేయగల ధైర్యాన్ని ముందే చేసివుంటే నాకీరోజు పూలు కానుకగా వచ్చేవే కావని చెప్పడం చాలా వేదనని కల్గించింది. నిజమే నాకెపుడూ అన్పిస్తుంటుంది. ఈ ఆడవాళ్ళెందుకు ఇంత హింసని భరిస్తారు? ప్రకృతిలో బతికే ఏ ప్రాణి కూడా చిన్న దెబ్బ పడినా తిరగబడుతుంది. ఎంత బలహీనమైన ప్రాణి అయినా దెబ్బ నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తుంది. మరి ఈ ఆడవాళ్ళెందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయరు? చదువు రాని, సంపాదన లేని, మొగుళ్ళమీద ఆధారపడే స్త్రీలు గతిలేక భరిస్తుండొచ్చు. చదువుకుని సంపాదిస్తున్న ఆడవాళ్ళెందుకు తిరగబడరు అన్పిస్తుంది నాకు?

ఒక్కోసారి మగవాడిగా పుట్టినందుకు, జనాభాలో సగం మందిని కాల్చుకుతినే జాతిలో నేనూ ఉన్నందుకు నాకు చాలా సిగ్గుగా అన్పిస్తుంది. శరీరం మీద దెబ్బ పడడం అనేది ఎంత భయానక అనుభవమో నాకు తెలుసు. చిన్నపుడు స్కూల్‌లో చదువుకునేటపుడు మా మాష్టారు ఓసారి నన్ను చితక్కొట్టారు. అబ్బో! దెబ్బల బాధ వర్ణించడం నావల్ల కాదు. అలాంటి దెబ్బలని ఆడవాళ్ళు రోజూ భరిస్తారు. కిక్కురుమనకుండా దెబ్బల బాధని ఓర్చుకుంటూ బాత్రూమ్ లో ఏడుస్తుంటారు. ఎవరో ఎందుకు? మా నాన్న పీకల్దాకా తాగి మా అమ్మను మానసికంగా, శారీరకంగా చాలా హింసించేవాడు. మా పెద్దక్కని మా బావ చాచి చెంపమీద కొట్టేవాడు. తిరిగి కొట్టిన స్త్రీని నేనింతవరకు చూడలేదు. ఎందుకు మగవాళ్ళు ఇంత కౄరంగా బతకడానికి ఇష్టపడతారు? రేపు పెళ్ళి చేసుకుని నేనూ అలాగే ప్రవర్తిస్తానా? భార్యని కొట్టకపోతే మగాడికిందికి రానా? మా అన్నయ్య, మా వదిన చాలా ప్రేమగా వుంటారు. మా అన్నయ్య వదినని తిట్టగా, కొట్టగా నేనెపుడూ చూళ్ళేదు. నాన్న అన్నయ్యని చవట అని తిడతాడు. వదిన సామాజిక సేవలో మునిగి ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. మీటింగులని, ఉపన్యాసాలని రాత్రి, పగలు బయటే వుంటుంది. పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని చవట అని అమ్మ కూడా అంటుంది. నాన్న కొడితే గుడ్లనీరు కక్కుకుంటూ ఏడ్చే అమ్మ, అన్నయ్య, వదినల అవగాహనని అర్థం చేసుకోలేకపోతోంది. ఇదంతా నాకు చాలా గందరగోళంగా వుంటుంది. కానీ శరీరం మీద దెబ్బలు వేయడాన్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితిలోను అంగీకరించలేను. కొట్టి, కొట్టి చంపేయడం మాత్రం ఘోరం, దారుణం. అదీ తనను నమ్మి, తనతో కలిసి బతుకుతున్న భార్యని అంత ఘోరంగా హింసించడానికి మనసెలా ఒప్పుతుందో! ఏమో! హింసాయుతంగా బతకడం, హింసకి పాల్పడడం ‘మగతనం’ కింద చెలామణి అవ్వడం దారుణమన్పిస్తుంది నాకు. పహిల్వానుల్లా కండల్ని పెంచి వాటిని ప్రదర్శించడం, చివరికి ఆ కండలు ఆడవాళ్ళని కొట్టడానికి ఉపయోగించడం – మా నాన్న నా అవతారం చూసి ఒరేయ్! బడుద్ధాయ్! నువ్విలా ఏడుమల్లెల ఎత్తుంటే ఏ ఆడదిరా నిన్ను లెక్క చేస్తుంది అని తిట్టడం- కండలు పెంచి ప్రదర్శించే సినిమా హీరోలని అమ్మాయిలు ఆరాధించడం ఇదంతా నాకు గందరగోళంగా అన్పిస్తుంది. అసలు నేనెలా వుండాలి? మా నాన్నలాగానా? మా బావలాగానా? మా అన్నలాగానా? నేనెలా వుండాలో ఎవరైనా చెబితే బావుండు. నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి కవితలోని మొగుడిగా మాత్రం నేను ఎప్పటికీ వుండను. దెబ్బ బాధ తెలిసినోడిని. నేను దెబ్బ వేసే సంస్కృతికి మాత్రం లోబడను. నేను ఈ విషయాలు ఎవరితోనైనా మాట్లాడితే బావుండునన్పిస్తుంది. నా ఫ్రెండ్స్‌కి చదవమని ఇస్తే ఏంట్రోయ్ ‘ఫెమినిస్ట్’ వైపోతావా ఏంటి కొంపదీసి అంటూ వెక్కించారు. ఫెమినిస్ట్ లంటే ఎవరసలు? ఫెమినిజం అంటే ఏమిటి? ఆడవాళ్ళ మీద అమలయ్యే హింస గురించి మాట్లాడితేనే ఫెమినిస్ట్‌నై పోతానా? నా ఫ్రెండ్స్‌ ఆడవాళ్ళ గురించి ఎంత వల్గర్‌గా మాట్లాడతారో నాకు తెలుసు. వాళ్ళ ముందు నుంచి అమ్మాయి వెళ్ళిందంటే చాలు ఎంత అసహ్యకరమైన వర్ణనలు చేస్తారో! నేను ఎపుడైనా వారించినా “వీడేంటిరా ఇలా చెడి పోతున్నాడు” అని రివర్స్ మాట్లాడతారు. నేను ఎలా ప్రవర్తించాలో నాకర్ధం కావడం లేదు. ఇంట్లో మా నాన్న, బయట నా ఫ్రెండ్స్‌ మగాడంటే రఫ్‌గా, ఆడవాళ్ళని కాల్చుకుతినేలా ఉండాలని బోధిస్తుంటే, నాకేమో అలా వుండాలని లేదు. అందుకే నాకు ఆ కవిత చదివితే కళ్ళల్లో నీళ్ళుబికాయి. నేనిలాగా ఉండలనుకుంటున్నాను. ఇలా రాయడం కూడా మొదటి సారే. నా భావాల్ని విప్పి మీతో పంచుకున్నందుకు నాకు చాలా హాయిగా, రిలీఫ్ గా వుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో