ఒక వర్షం-ఒక దుఃఖం

-మూలం: సారా జోసెఫ్ (అనువాదం- డా. దేవరాజు మహారాజు)

మిట్ట మధ్యాహ్నం అనుకోకుండా అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. ప్రారంభమే కుండపోతగా వుంది.

ఆమె పడమటి గది తలుపులు గబగబా వేసేసింది. కిటికీ తలుపులు లాగేసింది. ఒక కిటికీ రెక్క మాత్రం తెరచి, వర్షపు ఉధృతాన్ని గమనించసాగింది. దూరంగా పడమటి కొండల్లోంచి ఉరకలెత్తుతున్న నీటి ప్రవాహ వేగం మంద్ర స్థాయిలో వినిపిస్తోంది.

రెండు చేతులతో గుండెల్ని అదిమి పెట్టుకుని “ఓరి దేవుడా! నేను ఇట్లా ఎప్పుడేడుస్తానూ? గుండెలు పగిలేలా, ఉరుములు మెరుపులతో కంపించి పోయేట్లు ఎప్పుడేడుస్తాను?- అనుకుంది. కిటికీ ఇనుప చువ్వలకు బుగ్గల్ని ఒత్తిపట్టి నిస్సహాయంగా ఓసారి వెనక్కి తూలి, మళ్ళీ కిటికీ అరుగు ఎక్కి, తల మోకాళ్ళకు ఆనించి కూర్చుంది.

ముందు గదిలో ఆమె భర్త ఓ పాత ఈజీ ఛై‌ర్‌లో వాలిపోయి, పేపర్ చదువుతున్నాడు. బాగా మబ్బులు పట్టి ఆకాశం నలుపెక్కగానే అతను లేచి లైట్ వేసుకున్నాడు. వర్షపు జల్లుకు తడిసిపోతున్న పరదాని, డోర్ మ్యాట్‌ని పట్టించుకోకుండా తలుపులు వేసేసాడు. గాలివేగానికి, వర్షపు జోరుకు పరదా తడిచి ఎగిరి పడుతూనే వుంది. పరదా చిలికే నీటికి పుస్తకాలు తడిచి పోతాయేమోనని…. ఆమె సోఫా దగ్గర కింద పరిచిన పుస్తకాలు, మాగజైన్లు తీసి బుక్ షెల్ఫ్‌లో సర్దింది. అతను మళ్ళీ పేపరు పుచ్చుకుని కూర్చున్నాడు. వెనక్కి విశ్రాంతిగా ఒరిగాడు. ఈలోగా పిల్లలు చిత్తుకాగితాలేవో తెచ్చుకుని, ఆయన పక్కనే కూర్చుని పడవలు తయారు చేశారు. ఆయన్ని మాటిమాటికీ తడుతూ “నాన్నగారూ… తలుపు తీయండి!” అంటూ మారం చేయసాగారు. “ఊఁ…ఊఁ… అనడమే గాని, ఆయన పేపర్లోంచి బయట పడలేదు. “ఓసారి తలుపు తీయండి” – అని చిన్నారి తనయుడు ఆయన చొక్కా పట్టుకు లాగాడు. కాగితపు పడవను చొక్కాలోకి దోపాడు. అటూ ఇటూ ఊపాడు.

“పడవలా ఇంకేమన్నానా? బయట ఎంత వర్షం పడుతుందో కనబడడం లేదూ? తడిచారంటే జ్వరం వస్తుంది” అతను పేపర్లోంచి దృష్టి మరల్చకుండానే సంభాషణ కొనసాగించాడు. కోపంగా చెప్పాల్సింది చెప్పాడు. చిన్నారి తనయుడిక్కూడా కోపం వచ్చింది. ఏడిస్తే పనేమైనా జరుగుతుందా అన్నట్టు, అతను అక్కవైపు భావ గర్భితంగా చూశాడు. ఏం ఫరవాలేదు కాసేపు ఆగు అన్నట్టు ఆమె కళ్ళతోనే సమాధానం చెప్పింది. తమ్ముడు చేసిన పడవలాగా కాకుండా ఆమె మరింత జాగ్రత్తగా మరో మంచి పడవ చేయడానికి ప్రయత్నిస్తోంది. చేతి వేళ్ళ మధ్య కాగితం సరిగా మడతలు వేస్తూ, గోటితో అంచులు రాస్తూ, సొగసైన పడవ తయారీలో నిమగ్నమైపోయింది. తమ్ముడు కాసేపు అక్క పనితనాన్ని పరీక్షగా చూశాడు. కాని వెంటనే చికాకు పడ్డాడు. ‘కాసేపైతే వర్షం కాస్తా ఆగిపోతుంది అప్పుడా కత్తిపడవ, సుత్తి పడవ ఎక్కడేసుకుంటావూ?’ -అని విసుక్కున్నాడు.

“అక్కా పడవ” అన్నాడు.

“ఆగు ఒక్క నిమిషం” – అంది చిన్నారి అక్క. చడీ చప్పుడు లేకుండా అక్కా తమ్ముళ్ళిద్దరూ కిటికీ గ్రిల్ ఎక్కి, చేతులు బయటికి చాపి ఇంటిముందున్న నీళ్ళలోకి పడవల్ని విసిరేశారు. తమ్ముడి పడవ నీళ్ళలో అటూ ఇటూ ఊగి కదలకుండా నుంచుంది. అక్క పడవ హాయిగా ప్రవాహంలో కొట్టుకుపోయింది.

“చూశావా! నీకు పడవ చేయడం కూడా రాదు. అది అక్కడే ఎలా నిలబడిందో చూడు” అంది అక్క.

“మీరిద్దరూ ఆ కిటికీలోంచి ఇలా రండి. తడిచిపోతారు” – అని అన్నాడు వాళ్ళ నాన్న…. పేపర్లోంచి మొహం తిప్పకుండానే.

“చెప్పొద్దు” అన్నట్టు సంజ్ఞ చేస్తూ తమ్ముడు కిటికీ గ్రిల్‌కి అలాగే అతుక్కుని వుండిపోయాడు కాసేపు. వర్షం మరింత ఉధృతం అయినట్లు జల్లు పెద్దగా శబ్దం చేస్తూ పడుతుంది. పడమటి ఆకాశంలో బరువైన మేఘాలు కదులుతున్నాయ్. దట్టమైన నీటితెర ఏదో కప్పేసినట్లు దూరపు కొండలు కనబడడం లేదు. వర్షం ఆ ఇంటి ఇల్లాలిని నిస్సహాయురాలిని చేసినట్లుగా వుంది. అక్కడ చెయ్యడానికి ఏముందనీ? ఆమె తనని తాను ఓదార్చుకుంది. అయినా నేనెందుకు బాధపడుతున్నాను? ఎందుకు? ఎందుకు? ఆమె తనని తాను ప్రశ్నించుకుంది. తనలో ఏదో తెలియని వ్యధ, వెలితి, ఒంటరితనం?

ఉన్నఫళాన సపోటా చెట్టు కొమ్మనుండి ఒక చిన్న పక్షిగూడు రాలిపడింది. చెట్టు మొదట్లో సుళ్ళు తిరుగుతున్న నీటిలో అది గిరగిరా తిరిగి కొట్టుకుపోయింది. పక్షి పిల్ల చచ్చిపోతుందేమో అని ఆమె వెంటనే తలుపు తెరచి ఇంటి ముందు ఖాళీ స్థలంలోకి పరుగెత్తింది. నీటిలో కొట్టుకుపోయే గూటిని వెతికి పట్టుకుంది. మురికి నీళ్ళన్నీ ఆమె కాళ్ళమీద పడ్డాయి. పక్షిపిల్ల నీళ్ళలో తడిసి వణుకుతోంది. దానికింకా రెక్కలైనా రాలేదు. ఆమె ఎందుకో నిరాశకు గురైంది. తీవ్రమైన మనస్తాపానికి గురైంది. ఆమెలో కూడా విసుగు, విషాదం సుళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. పైన సపోటా చెట్ల కొమ్మలకు నిస్సహాయంగా ఊగుతూ కనిపించిన పక్షి గూళ్ళను చూసినప్పుడు-

“ఏమిటీ ఏమైంది నీకు? అలా వర్షంలో ఎందుకు తడుస్తున్నావ్” – అని భర్త గుమ్మంలో నిలబడి కోపంగా అన్నాడు.

“అమ్మా! వర్షంలో తడిచిపోతున్నావే” అన్నాడు చిన్నారి తనయుడు. అంతకంటే మంచి అవకాశం దొరకదని వాడు మెల్లగా తండ్రి కాళ్ళ మధ్యలోంచి బయటకు జారుకున్నాడు. అంతకుముందు కిటికీలోంచి విసిరేసిన పడవను పునరుద్దరించి మళ్ళీ ప్రవాహంలో వేశాడు. అది అప్పటిదాకా నీళ్ళలో బాగా నాని వుంది గనక, ఒక పేపర్ ముద్దలా కొట్టుకుపోయింది.

“పిచ్చి పడవ చేస్తే తేలుతుందా యేం”- అని అంది వాడి అక్క. వాడు ఉక్రోషంతో, కోపంతో అక్కని వెక్కిరించాడు. దానికి ప్రతి చర్యగా తనూ ఏదో చెయ్యాలి అన్నట్టు – “నాన్నగారూ వాడు చూడండి. వర్షంలో ఎలా తడుస్తున్నాడో… తలంతా పచ్చి ముద్దయిపోయింది కూడా” అని కూతురు తండ్రికి ఫిర్యాదు చేసింది.

“తడవనీ… అదిగో వాళ్ళమ్మ తడుస్తోంది కదా? అందుకే వాడూ వెళ్ళాడు”

ఆమెకు ఎక్కడో దెబ్బ తగిలినట్లయి కొడుకు వైపు పరుగెత్తింది. ఒకచేత్తో పక్షి గూడు పట్టుకుని, మరో చేత్తో వాడిని కోపంగా లోపలికి తోసింది. “వర్షంలో తడవకు వెళ్ళు! లోపలికి వెళ్ళు”. అని అంది. తల్లిలో వచ్చిన ఆకస్మికమైన మార్పును వాడు ఊహించుకోలేకపొయ్యాడు. “అందరూ నన్నే అంటారు” అని బుంగమూతి పెట్టాడు.

“ఏమిటీ? నువ్వు ఇంట్లోకొస్తావా? అలాగే తడుస్తావా?” అని అడిగాడు అతను భార్యను.

“రాను. ఇలాగే తడుస్తాను” అందామె కచ్చగా.

“అయితే సరే. వాడూ అంతే” – అంటూ లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు.

“అమ్మ ఎందుకలా చేస్తోంది?” అని అడిగింది కూతురు తండ్రిని.

“ఏమో మరి. నువ్వే అడుగు ఎందుకో?” అని అంటూ “పిచ్చి చాలా రకాలుగా వుంటుందిరా! అందులో మీ అమ్మది చాలా ప్రత్యేకమైంది” అని అన్నాడు.

ఆమె కూతుర్ని తీక్షణంగా చూసి, కొడుకును దగ్గరికి లాక్కుంది. “పిచ్చి సన్నాసీ… నువ్వెందుకురా వర్షంలో తడవటం? జ్వరం వస్తే నువ్వే కదా బాధపడాలి” – అంటూ తల తుడిచింది.

కొద్దిసేపటి తర్వాత పొలాల నుండి ఊళ్ళోకొస్తున్న ఆడ కూలీలు వారి ఇంటి ప్రహారీ గోడ పక్కనే నిలబడ్డారు. వారి తాటాకు గొడుగుల మీద వర్షం పెద్దగా చప్పుడు చేస్తోంది. తన భార్య వర్షంలో నిలబడి వుండడాన్ని వాళ్ళు చూస్తున్నందుకు అతను విసుక్కున్నాడు. “పద్మా! లోపలికి రా” – అన్నాడు మెల్లిగా.

ఆమె ప్రతిస్పందించలేదు-

అతని వైపు కూడా చూడలేదు.

పక్షి గూడుని హృదయానికి హత్తుకుని అలాగే వర్షంలో నిలబడింది. పిచ్చి వర్షంలో పిచ్చిగా తడిసింది. దారిన పోయే వాళ్ళు ఒక్కొక్కరూ ఒక్కోసారి చోద్యమేమిటా అన్నట్లు చూసుకుంటూ వెళుతున్నారు. అతను తగ్గు స్వరంతో “ష్ ష్- నిన్నే!!” అని గద్దించాడు. పళ్ళు బిగబట్టి “ఒళ్ళు మదమెక్కిందా?” అని గుడ్లురిమాడు.

ఆమె గుండె మండిపోయింది-

ద్వేషం, అసహ్యం, గుప్పుమన్నాయి-

చేతిలోని చిన్నారి పక్షిని పిడికిట్లో బిగించింది. గట్టిగా నలిపేసింది. దాని లేత ఎముకలు పటపట మనడం కూడా వినిపించింది. ఏదో ఒక పైశాచిక ఆనందం…!

అది భరించలేక అతను భళ్ళున తలుపేసుకున్నాడు.

చిన్నారి పక్షి రెండు మూడు సార్లు కొట్టుకుని, ఆమె చేతిలో ప్రాణం వదిలింది. కనుగుడ్లు తేలేసింది. అకస్మాత్తుగా ఆమెలో ఏదో భయం ఆవహించింది. చచ్చిన పక్షిని గడ్డిలోకి విసిరేసింది. కొద్ది సేపట్లోనే సపోటా చెట్టుమీదున్న పక్షులన్నీ కిందికి వచ్చి, చచ్చిపోయిన పక్షి చుట్టూ చేరాయి. వాటి ఈకలన్నీ తడిసి ముద్దయ్యాయి. వాటి అరుపులు వర్షం చప్పుడును మించి పోయాయి. ఆమె చేతికి అంటుకుపోయిన తడి ఈకలు, ఆమె ఒక హంతకురాలని గుర్తు చేస్తున్నట్లుగా వున్నాయి. ఆ ఆలోచనతో చలించిపోయి, ఆమె చేతులు రుద్దుకుంది. పక్షులు ఆమె చుట్టూ చేరి అరవడం ప్రారంభించాయి. ఆమె తన తప్పిదాన్ని గుర్తు చేసుకుని బాధపడింది. అసలు ఆమె చెయ్యదలుచుకున్నది అదికాదు. ఏదో చెయ్యాలనుకుని ఏదో చేసేసింది. రెండు చేతులతో కొద్దిసేపు ముఖం దాచుకుంది. వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్లు కొడుకును దగ్గరికి లాక్కుంది. కొద్దిసేపటి క్రితం కోపంగా అరిచిన వాడినే ఇప్పుడు మళ్ళీ ప్రేమగా దగ్గరికి లాక్కుంది. పిచ్చిదానిలా ఇంటివైపు పరుగెత్తి గుమ్మానికి ఒరిగిపోయింది. ఆ పరుగెత్తడంలో రెండు మూడు సార్లు కింద పడబోయి నిలదొక్కుకుంది. తడిసి ముద్దయిన చీరలోంచి, తల వెంటుకల్లోంచి, నీరు కారిపోతూ వుంది. రెక్కలు తడిసిన పక్షులకు, బట్టలు తడిసిన ఆమెకూ పెద్ద తేడా లేదు. గజగజ వణికి పోవడంలో కూడా భేదం లేదు.

“ఊఁ… అయ్యిందా? బాగైందా?” అతను హేళనగా అరిచాడు. ఆమె లోలోపలే ఏదో గొణుక్కుంది. వీడికోసం ఓపిక పడుతున్నాను. లేకపోతే నీ బెదిరింపులు ఎవరికీ? అన్నట్లు మనసులో ఏవేవో అనుకుంది. తలుపు తెరవమని బిగ్గరగా అరవాలనుకుంది. కాని గొంతు సహకరించలేదు. ఎంతో ప్రయత్నం మీద “తలుపు తెరవండీ… ప్లీ…జ్!” అని అంది. ఆ స్వరం సన్నగా బలహీనంగా, నిస్సహాయంగా వుంది. వర్షపు హోరులో ఆ మాట పెద్దగా వినిపించను గూడా లేదు. అయినా ఆమె ఏమంటోందో అతనికి పూర్తిగా అర్థమైంది.

అతను తలుపు తెరచి ఓ క్షణం గుమ్మంలో నిలబడ్డాడు. “ఈ మొడితనం, తలబిరుసూ ఆడదానికి శోభించవు” అని అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆమె అతనికి జవాబు చెప్పలేదు. ఆ మాటను పట్టించుకున్నట్లు కూడా లేదు. లోపలి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని, తల తుడుచుకుంది. చంటాడికి కూడా ఒళ్ళు తుడిచి, బట్టలు మార్చింది. ఆటలు ఆడి అలసిపోయి వున్నాడు కాబోలు, వాడు వెంటనే నిద్రపోయాడు.

ఆమె వాడి పక్కనే కూర్చుని చాలాసేపు వాడి ముఖంలోకి చూసింది. వంగి ముద్దు పెట్టుకుందామని అనుకుంది. కాని, ఎందుకో హఠాత్తుగా వెనక్కి తగ్గింది. వాడి ముఖం పరిచయం లేని ముఖంగా అనిపించింది. “ఏమైంది నాకూ? నాలో ఎందుకింత విషాదం? ఎందుకింత వేదన? ఎందుకింత ఒంటరితనం?”

వాళ్ళమ్మాయి కూడా మెల్లగా ఆ గదిలోకి వచ్చింది. ఆ చిన్నారి ముఖం దిగులుగా వుంది. తను నలిపి పారేసిన పక్షి గుర్తుకొచ్చింది. తన కూతురు ముఖంలోని అమాయకత్వం, సున్నితత్వం ఆ చిన్నారి పక్షిలో కూడా వుండే వుంటాయి. కూతుర్ని గబుక్కున దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుంది. “పాపా! నువ్వు కూడా పడుకో” అంది సౌమ్యంగా. ఆ పిల్ల బిక్కు బిక్కుగా తల్లిని చూస్తూ… తన మంచం మీద పడుకుంది. కానీ, తల్లి ముఖంలోకి అనుమానంగా చూస్తూనే వుంది. “ఎప్పటికైనా నువ్వు అర్థమవుతావా అమ్మా!” – అన్నట్టు వుందా చూపు. పిల్లలిద్దరికీ దుప్పటి కప్పి ఆమె వాలు కుర్చీలో వాలిపోయింది.

పిల్లలు- నష్ట జాతకులు. నేను వీరికి తల్లిని కాకుండా వుండాల్సింది. నేను వీరిని ప్రేమించడం లేదా? నిజమే-ప్రేమించట్లేదు కాబోలు. ఓరి దేవుడా? నీవైనా చెప్పు నేను వీళ్ళని ప్రేమిస్తున్నానో లేదో. అయినా నువ్వు చెప్పేదేమిటీ? నేను వీళ్ళని ప్రేమిస్తున్నాను. నా కన్నా, నా జీవితం కన్నా అధికంగా ప్రేమిస్తున్నాను. కాని వీళ్ళకి నాకన్నా మంచి తల్లి వుండాల్సింది. ఎంత ముద్దొస్తారు పాపం? కాని… నా మనసు నిజమే చెబుతోందే? నేను వీళ్ళని మనస్ఫూర్తిగానే ప్రేమిస్తున్నాను- అనుకుంటూ ఆమె ఇద్దరి బుగ్గల్ని నిమిరింది. ముద్దాడింది. అమాయకంగా నిద్రపోతున్న వాళ్ళ ముఖాలు పక్షి గూటిని జ్ఞాపకం చేశాయి. చంటి వాడి మెడ తిప్పేసినట్లు, పాప ఎముకలు పటపటా విరిచేసినట్లు!! ఒక్క క్షణం గజగజ వణికిపోయి నిస్పృహతో చేతులు నలుపుకుంది. ఏదో భయంకరమైన ఊహ.

ముందు గదిలో ఆమె భర్త పాప్ మ్యూజిక్ వింటున్నాడు. అతనికి ఇష్టమైన ఆ లయ, బీట్… ఆ ధ్వనులు ఆమెకు అసహ్యం. అతడు కావాలనే తనను గేలిచేస్తున్నాడని ఆమెకు అనిపించింది ఆ క్షణం-

నాకింకా శక్తి లేదు. ఓపిక లేదు. ఓరి భగవంతుడా! నన్నెందుకింకా పరీక్షిస్తావూ? నన్నెందుకింత ఒంటరిని చేశావూ?

ఆమె పిల్లల వైపు చూసింది. వాళ్ళు పరాయి వాళ్ళలాగా అనిపించారు. తనకు తానే పరాయిదైపోయినట్లు నిలువునా కుప్పకూలిపోయింది.

ఒక్కసారి ఊహించని వర్షంలా ఆమె కళ్ళనుండి జోరుగా నీళ్ళు కారాయి. వుండి వుండి వచ్చే ఉరుములా ఆమె పెద్దగా ఆక్రోషించింది…

ఆమె ఏడ్చింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

5 Responses to ఒక వర్షం-ఒక దుఃఖం

 1. Pavani Bodanapati says:

  చెత్త కథ

 2. ఇక స్త్రీ పడే మానసిక వేదన, ఆ ఘర్షణ మీకు చెత్తలా కనిపిస్తుందంటె ఒక విషయం గుర్తుకు వస్తుంది, ‘ ఆడదానికి ఆడదే ఎంతటి శతృవని’

 3. Anonymous says:

  ఆవునా నాకు తెలియదులె

 4. Anonymous says:

  చెత్త కథ

 5. Anonymous says:

  ఆమె యెందుకు యెదుస్థుంది?భర్త నచ్చలెదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో