ప్రతిస్పందన

పొట్టి జుట్టు, నేత చీర, కంచు కంఠం, రాశిపోసిన చురుకుదనం…!!

2001లో ‘భూమిక’ సారధిని గుర్తించడానికి ఎవరికో నేను చెప్పిన గుర్తులు.

2013… సరిగ్గా పుష్కరం తర్వాత … ‘మీరు ప్రశాంతి కదూ! భూమిక సత్యవతిగారి సన్నిహితులు…’ అని నాకు పరిచయం లేని వారు నన్ను పలకరించిన ఎన్నో సందర్భాలు. హైదరాబాద్‌లోనే కాదు జిల్లాల్లో, మండలాల్లో కూడా ఇలా

పలుకరిస్తుంటే, అప్పటి రాశిపోసిన చురుకుదనం మొక్క… వేళ్ళు, శాఖలూ, ఊడలూ విస్తరించుకుంటూ మహా వృక్షంలా ఎక్కడెక్కడి వరకు విస్తరించిందో అర్ధమై మనసు ఆర్ద్రమైంది.

‘భూమిక’ పత్రిక… ‘భూమిక’ హెల్ప్‌లైన్‌… రెండూ రెండు ధారలుగా ప్రజలందర్నీ, తెలుగేతర ప్రజల్నీ తడుపుతున్న జీవజలం. వీటి సారధి ‘భూమిక సత్యవతి’ విశ్వప్రేమ పునాదులుగా జీవితాలను పునర్నిర్మించుకుని మరోసారి ‘జీవించడం’ ప్రారంభించిన ‘సర్వైవర్స్‌’ – హింస నుంచి బయటపడి పునరుజ్జీవంతో ఆనందార్ణవాన్ని ఆస్వాదిస్తున్న ధీర మహిళలెందరో! వీరందరికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆసరా, భరోసా భూమిక. ఆ సారధిని కలిసినా, చూసినా… చివరాఖరికి తలచుకున్నా చైతన్యం ముప్పిరిగొనేది. ఒక పత్రిక ఒక సంస్థగా… ఒక వ్యవస్థగా మారడం వెనుక మూర్తీభవించిన దీక్ష, దక్షత, జీవం, జవం… ‘అమ్మూ’!!

అవును… ‘అమ్మూ’! 2013 ఫిబ్రవరి 14… శతకోటి ప్రజాగళం క్యాంపైన్‌… ఉరకలేసిన ఉత్సాహం, 60 ఏళ్ళ యువతి… అంతలోనే హైదరాబాద్‌లో జంట బాంబు పేలుళ్ళు… మృతులు, క్షతగాత్రులు… నాతో కుప్పబోసిన విషాదం… 60 ఏళ్ళ పసిపాప… ‘అమ్మూ…’ మహిళలకు, పిల్లలకు ఎక్కడ అన్యాయం జరిగినా భరించని ‘జీరో టాలరెన్స్‌’…ఇదే సిద్దాంతాన్ని ఈ రోజు ‘భూమిక వ్యవస్థ’గా మార్చగలగడం అసామాన్యం. అది విశ్వప్రేమతోనే సాధ్యం.

ఈ అపురూప వ్యవస్థలో ఒక జర్క్‌ 2014. ఆర్థిక బేలతనం… అదీ కొద్దికాలమే. సరిగ్గా అప్పుడే పరోక్షంగా భూమికతో ఉన్న నేను ప్రత్యక్ష భాగస్వామిగా మారాను. క్షేత్రస్థాయి పనిని ప్రారంభించడం… ప్రత్యక్ష అమలుకి కార్యక్రమాలు రూపొందించడం… ఒకరి తర్వాత ఒకరుగా డోనర్లు రావడం… ఊపిరి సలపని పని… ఉత్తేజకరమైన పని… ఆసక్తికరమైన పని… నూతన భాగస్వామ్యాలు… ఒకానొక సమయంలో వినమ్రంగానే తిరస్కరించాల్సినంతగా… ! కొత్త టీం… వారి సామర్ధ్యాలు, అవగాహన, భావాలు, భావజాలం – వీటిని పటిష్టపరచడం… భూమిక పాఠకులకీ కొత్తదనం అందించాలన్న తపన… ఇదో పెద్ద మలుపు!

సాహిత్యంతో పరిచయం ఉన్నా, చదవటం వరకే పరిమితమై ఉన్న నేను పత్రికని నడపడంలో భాగమవ్వగలగడం అనూహ్యమే! నివేదికలు, జీవితానుభవాలు మాత్రమే రాయగల నన్ను, సృజనాత్మక రచనలోకి నడిపించడమే కాక ఏకంగా ఒక పేజీని కేటాయించి ‘పచ్చి పసుపు కొమ్ము’ కాలమ్‌ రాయించడం అమ్మూ చేసిన సాహసం. అప్పటివరకు సహ సంపాదకురాలిగా ఉన్న నేను పాఠకుల ఆదరణతో ఈ బాధ్యతను మరింత ప్రేమగా తలకెత్తుకున్నాను. సాహిత్యకారులు, కవులు, రచయితలు, కార్టూనిస్టులు… సాహితీ సమావేశాలు, అవార్డు ఫంక్షన్‌లు, చర్చాగోష్టులు… కొత్త ప్రపంచం నన్ను అమ్మూ ద్వారా తనలో ప్రేమగా ఇమిడ్చేసుకుంది. సహజ ప్రవాహంలా జరిగిపోయిన ఈ క్రమం గుర్తు చేసుకుంటుంటే చాలా హాయిగా ఆశ్చర్యమేస్తుంది.

పుస్తకాలు, రచనలు, పిల్లలు, పూలు, చెట్లు, పిట్టలు, అడవులు, వాగులు వంకలు, సెలయేళ్ళు, ఆదీవాసీలు, మట్టిమనుషులు, దళితులు, స్త్రీలు, ట్రాన్స్‌జెండర్‌, ఉద్యమాలు, బాధిత మహిళలు, సర్వైవర్స్‌, సపోర్ట్‌ సెంటర్లు, సహాకార వ్యవస్థలు, పోలీస్‌, జ్యుడిష్యరీ… ఎన్ని… ఎన్నెన్ని కోణాలు. తన విభిన్నత, మానవత్వం, సహానుభూతి… భూమికలోనూ ప్రతిఫలిస్తాయి. అంటే… సత్య, భూమిక వేరువేరు కాదు. అందుకే అది సత్యభూమిక… తను భూమిక సత్యవతి. బహుశా దాదాపు ఈ అన్ని కోణాలు నాలోనూ ఉన్నట్లున్నాయి. అందుకేనేమో మేమిద్దరం చాలా సహజంగా కలిసిపోయాము. నేనూ భూమికలో భాగమైపోయా. భూమిక కుటుంబం నాదైపోయింది.

ఒకవైపు క్షేత్రస్థాయి పనులు, మరోవైపు ఉద్యమాలు – యాక్టివిజం, ఇంకోవైపు సాహిత్యం, రచన, పత్రిక… ఈ త్రికోణంలో నేను ఒక బిందువుగా మొదలై విశ్వశక్తిని స్వీకరిస్తూ, అమ్మూ చిటికెన వేలు పట్టుకుని సహ ప్రయాణీకురాలిగా భూమిక రజతోత్సవ పండుగలో తడిచి ముద్దవుతున్నాను.

ఈ ప్రయాణం స్వర్ణోత్సవ దిశగా ఉరకలేయడంలో నా పూర్తి శక్తిని, మనోనిష్టని, భావ సంకల్పాన్ని అమ్మూ అకుంఠిత దీక్ష, విశ్వ ప్రేమలకు జతకలిపి భూమిక పాఠకులతో కలిసి కొనసాగిస్తానని, కొనసాగించగలనని నమ్ముతున్నాను. ఇంతటి అద్భుత అనుభవాల్ని నాకూ, భూమిక సహ ప్రయాణికులకు సాక్షాత్కరింపచేస్తున్న ‘భూమిక’కి, సారధి ‘అమ్మూ’కి హృదయాంజలి… భూమిక పాఠకులకి పుష్పాంజలి… పరోక్షంగా భూమికకు దన్నుగా ఉన్న ‘పెద్ద మనస్సు’లందరికీ ధన్యాంజలి…

– పి. ప్రశాంతి, హైదరాబాద్‌

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

One Response to ప్రతిస్పందన

  1. Raja Rama MohanRao says:

    అనుభూతుల్ని పంచుతూ… అభ్యుద‌య‌వాదంతో అడుగులు వేస్తున్న ప్ర‌శాంతి గారికి అభినంద‌న‌లు. భూమిక ద్వారా మ‌హిళల్లో చైత‌న్యం తేవ‌డ‌మే కాదు…ధీర‌వ‌నిత‌లుగా తీర్చిదిద్ద‌డంలో మీ వంతు ప్ర‌య‌త్నం స‌ఫ‌లీకృతం కావాల‌ని ఆశిస్తాను. అభినంద‌న‌లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో