వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత

 

అది వందేళ్ళ క్రితం తెలంగాణ సమాజం. ఒక దిక్కు నిజాం రాజు నిరంకుశ పాలనతో నిజాం ప్రైవేట్‌ సైన్యమైన రజాకార్ల అరాచకాలు తెలంగాణ గ్రామాల్లో దోపిడీ దౌర్జన్యాలు కొనసాగిస్తుండగా, గ్రామ దేవతలైన దొరల ఆగడాలూ, వారి గడీల్లో జరిగే అత్యాచారాలకు అంతులేకుండా ఉన్న కాలం.

దొరల గడీల్లో నిమ్న కులాలు, పేద కుటుంబాల ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చి వాళ్ళను లైంగిక బానిసలుగా (ఆడబాపలుగా) ఉపయోగించుకునేవారు. ఆ గడీలోని మగవాళ్ళు, ఆ ఇంటికి వచ్చిపోయే మగవాళ్ళు చెరబట్టిన ఆ స్త్రీల పట్ల లైంగిక దోపిడీ, దౌర్జన్యాలు చేసేవాళ్ళు. ఆ నిరుపేద చదువులు లేని స్త్రీలకు వేరే గత్యంతరం లేదు. తప్పించుకునే అవకాశం లేదు. ఎక్కడికి పోవాలో, ఎక్కడ రక్షణ పొందాలో తెలియదు. నిర్బంధంగా ఆ హింసలను భరించేవారు. యువకులను వ్యవసాయం, తమలాంటి పేదలపై దౌర్జన్యం చేసే గుండాగిరి లాంటి దుష్టమైన పనులకు బానిసలుగా వాడుకునేవాళ్ళు. అంతా వెట్టి చాకిరీ, శ్రమ దోపిడీ.

నోరులేని మూగ గొడ్లలా ప్రజలు మనిషితనపు అస్తిత్వాన్ని కోల్పోయి, మానవ గౌరవం లేని, మానవ హక్కులు తెలియని దుర్భరమైన దారిద్య్రంలో శవ ప్రాయమైన బతుకులు వెళ్ళదీసేవాళ్ళు.

ఆనాటి సమాజాన్ని యథాతథంగా చిత్రించిన దాశరథి రంగాచార్య యదార్థ నవల ‘చిల్లర దేవుళ్ళు’.

కరణం దొరల దగ్గర ఉన్న ఆడబాపకు పుట్టిన రంగమ్మతో దొరల దగ్గర గుమాస్తాగా పనిచేస్తున్న చెరుకు రంగారావు అనే వ్యక్తి పెళ్ళి తంతు లేకుండా సహజీవనం చేశాడు. వారికి ఐదుగురు సంతానం. నాలుగవ సంతానంగా కమలమ్మ జన్మించారు. ఆనాటి వ్యవస్థలో అగ్రకులాలైన రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, కరణం, కోమట్లు, చిన్న కులాల్లోని ఆడపిల్లల్ని కొనుక్కొని వారితో పెళ్ళి తంతు లేకుండానే లైంగిక సహజీవనం చేసేవాళ్ళు. వారికి కలిగిన పిల్లలకు తండ్రి వైపు ఇంటి పేరు పెట్టుకోవడానికి కూడా దొరలకు

భయపడేవాళ్ళు.

ఇలాంటి క్రూరమైన సమాజం గురించి వాస్తవాలు తెలుసుకుంటే మనకు స్పార్టకస్‌, రూట్స్‌, టామ్‌మామ ఇల్లు, ఇంకా రష్యన్‌ విప్లవానికి ముందున్న సమాజాన్ని చిత్రించిన ప్రపంచ ప్రఖ్యాత మాక్సిమ్‌ గోర్కి ‘అమ్మ’ నవలలోని ఎన్నో సంఘటనలూ, దృశ్యాలూ స్ఫురిస్తాయి.

1946వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ వీర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ప్రకటించింది. నీచమైన, నికృష్టమైన బతుకులీడుస్తున్న పేద యువతీ యువకులు ఆ పోరాటంలోకి వెళ్ళారు.

వారికి చదువులు తెలియదు. ప్రాపంచిక పరిణామాల జ్ఞానమే లేదు. వెనకా ముందూ ఏ అండా, ఏ బలమూ లేదు. కేవలం కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు వేలాది మంది యువతీ యువకులు ఆ పోరాటంలో అజ్ఞాత దళ సభ్యులుగా చేరారు.

వరంగల్‌ జిల్లా నెల్లికుదురు మండలంలోని నేనాల గ్రామానికి చెందిన కమలమ్మకు మర్రిపెడ మండలంలోని కిర్లంచర్ల గ్రామానికి చెందిన చెన్నబోయిన ముకుందంతో తన 9వ ఏట పెళ్ళి జరిగింది. ఆమె ఇద్దరు అన్నలూ సాయుధ పోరాటంలోకి వెళ్ళిపోయారు. తన 17వ ఏట ఆరు నెలల పిల్లవాడిని తన ఆడబిడ్డకు అప్పగించి ఆమె కూడా అజ్ఞాతంలోకి వెళ్ళింది.

దళ సభ్యులతో కలిసి గంజీ జావ కాచుకుని తాగుతూ పార్టీ నిర్దేశించిన పనులు చేసింది కమలమ్మ. క్యాంపులు మారుతూ మైళ్ళకొద్దీ అడవుల్లో నడుస్తూ ఖమ్మం, మానుకోట, గార్ల జాగీర్లు తిరిగింది. ఆ సమయంలోనే ఉద్యమంలో ఉన్న మల్లు స్వరాజ్యం, అచ్చమాంబలను కలుసుకుంది.

ఆమె పాటలు పాడుతూ ప్రజా కళాకారిణిగా రూపుదిద్దుకుంది. అజ్ఞాత దళ సభ్యురాలిగా వైజ్ఞానిక దళంలో పనిచేసింది. శిక్షణ తీసుకొని గాయపడిన కామ్రేడ్లకు ఇంజక్షన్లు ఇవ్వడం, ప్రాథమిక చికిత్సలు, సేవలూ చేయడం చేసేది. పార్టీ సర్క్యులర్లనూ రాసేది.

ఆ రోజుల్లో గ్రామ రక్షణ, ఆత్మ రక్షణ దళాలు చేతికి ఏది దొరికితే అది ఆయుధంగా చేసుకొని కారప్పొడి జాడీలు, వడిసెల

రాళ్ళు చేతబట్టి రజాకార్లనూ, పోలీసులనూ ఎదుర్కొనేవి. దళ సభ్యులు అన్ని రకాల శిక్షణలూ పొందాల్సి వచ్చేది.

కమలమ్మ అజ్ఞాత జీవితంలో మరో మగ శిశువుకు జన్మనిచ్చింది. పిల్లవాడు ఆరు నెలల ప్రాయంలో ఉన్నప్పుడు దళ సభ్యుల ప్రాణాలకు ప్రమాదమని ఎక్కడైనా వదిలిపెట్టి రమ్మని నాయకులు ఆదేశించారు. మరో కామ్రేడ్‌ సాయంతో రెండు రోజులు నడిచిపోయి ఇల్లందు (బొగ్గుట్ట) ప్రాంతంలో ఒక కోయ కార్మికునికి పసివాడ్ని ఇచ్చేసి ఏడ్చుకుంటూ తిరిగొచ్చి దళాల్లో కలిసింది ఆ తల్లి.

అణగారిన జాతి జనుల విముక్తి కోసం నాటి పోరాటంలో ప్రజలు చేసిన త్యాగాలు అంతులేనివి. కన్న పసిపిల్లలను సైతం వారు త్యాగం చేశారు. 90 ఏళ్ళు దాటిన వయస్సులో ఆమెను నాటి దళ జీవితం గురించి ఎవరు, ఎప్పుడు మాట్లాడించినా తాను ఒదిలేసి తిరిగి చూడకుండా వచ్చేసిన తన కన్నబిడ్డను తల్చుకొని భోరున విలపించడం హృదయ విదారకంగా ఉండేది.

1951లో సాయుధ పోరాట విరమణ అనంతరం హైదరాబాద్‌ స్టేట్‌ను స్వాధీనం చేసుకున్న యూనియన్‌ సైన్యాలు విప్లవకారులను కనిపిస్తే కాల్చేస్తున్న దశలో అజ్ఞాత విప్లవ దళాలు బయటి ప్రపంచంలోకి రాకుండా అజ్ఞాతంగానే ఉండిపోయారు.

1952 తర్వాత బయటి ప్రపంచంలోకి వచ్చి బతుకుపోరులో క్రొత్తగా తమ ప్రయాణం కొనసాగించారు కమలమ్మ, అప్పన్న (ముకుందం)లు. విప్లవ జీవిత పంథా కొనసాగిస్తూనే తమ ఐదుగురు పిల్లలను ప్రజా కళాకారులుగా తయారుచేశారు. మహిళా సంఘాలకు, అనేక కార్మిక సంఘాలకు నాయకులుగా పనిచేశారు.

పీడిత ప్రజల విముక్తి కోసం సాగిన ఆ మహత్తరమైన రైతాంగ సాయుధ పోరాటంలో స్త్రీలెందరో తమ కౌమార్య, యవ్వనాల్ని ధారపోసి పనిచేశారు. అత్యంత కష్టతరమైన అజ్ఞాత జీవితాన్ని గడిపి తమ యోధత్వాన్ని నిరూపించుకున్నారు.

తమకు ఉద్యమం త్యాగశీలతనూ, క్రమశిక్షణనూ నేర్పిందనీ, పార్టీలో స్త్రీల పట్ల గౌరవంగా ఉండేవారనీ, తప్పులు చేసిన వారికి కఠిన శిక్షలు ఉండేవనీ కమలమ్మ చెప్పారు. చేసిన పని చాలా కష్టమైనదీ, కఠినమైనదీ అయినా ఎప్పుడూ వృధా పోదనీ, పనిలో మజా

ఉన్నదంటారు.

హీనాతిహీనమైన వ్యవస్థ కోరల్లోంచి సాహసోపేతమైన ప్రజా పోరాట ఉద్యమకారిణిగా ఎదిగిన ఆ అసమాన్య ధీరోదాత్తమైన మహిళ వీరోచిత చరిత్ర చిరస్థాయిని పొందుతుంది. వర్తమాన సమాజంలోని ఉద్యమకారులకూ, మహిళా ఉద్యమాలకూ దిక్సూచిగా

ఉంటుంది కమలమ్మ 90 ఏళ్ళ సంపూర్ణ జీవిత గమనం.

స్త్రీలపరంగా చరిత్ర నిర్మాణానికి సందేశాత్మక స్ఫూర్తినిస్తుంది ఆమె బతుకు పయనం. ”స్త్రీ శక్తి సంఘటన” బృందం వారి అన్వేషణ, పరిశోధనలో వెలికివచ్చిన ‘మనకు తెలియని మన చరిత్ర’లో సి.హెచ్‌. కమలమ్మ, సుగుణమ్మ, చిట్యాల అయిలమ్మ, ప్రియంవద, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, ప్రమీలాతాయి, ఎరుకల గండెమ్మ, సూర్యావతి, పెసర సత్తమ్మ, సాలమ్మ, లలితమ్మ, వజ్రమ్మ, రజియాబేగంలు ఆ సమూహంలోని కొందరు పోరు వనితలు మాత్రమే.

ఆధునిక భారతదేశంలో ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలిగా, మానవ హక్కుల కార్యకర్తగా, సంస్కరణ ఉద్యమాలతో నవలోకపు ద్వారాలు తెరిచిన వీరాంగన సావిత్రీబాయి ఫూలే అస్తమించిన మార్చి 10న ఆమెను సంస్మరించుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే 11 మార్చి 2018న కమలమ్మ చివరి శ్వాసను వదిలారు. ఆమె కంచుకంఠంతో పాడిన పాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆమెలాంటి వీరవనితలు ఆశించిన సామ్యవాద సమాజం ఏర్పడేంత వరకు ఆ పాటలు ప్రవచిస్తూ ఈ వ్యవస్థకు చైతన్య స్పృహ కలిగిస్తూనే ఉంటాయి. ఎత్తిన శ్రామిక వర్గపు ఆశయాల జెండాను కడవరకూ ఎత్తిపట్టిన నిబద్ధత ఆమెది. ఓరుగల్లు గడ్డమీద ఆమె తొలితరం విప్లవాల పురిటి బిడ్డ. కాకతి రుద్రమ ధీరత్వం, అడవి బిడ్డలు సమ్మక్క-సారక్కల జాతి పౌరుషం, వీరత్వం కలబోసిన వీరనారీ శిరోమణి, త్యాగాలు చాలు పోస్తూ కష్టాల కడలినీదిన ‘ఒక తల్లి’ చెన్నబోయిన కమలమ్మ సాహసం, త్యాగం చిరస్మరణీయం! ఆమెకు మన నీరాజనాలు!

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

One Response to వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత

  1. అనిసెట్టి రజిత గారికి రెడ్ శాల్యూట్ తో … ఈరోజు చాలాతలనొప్పిగా ఉంది సైట్ విసిట్ చేసి(Abudhabi Oil and gas sector) చైర్ లో కూర్చొని ఆలోచిస్తూ భూమిక చదువవుదామని ఆన్లైన్ లో భూమికా site ఓపెన్ చేశా .. మొదలు మీ రచనలో భాగమైన గౌరి లంకేశ్ గురించి చదివి మల్లి రోల్ చేయగా “వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ” చదువడం మొదలెట్టాను … uff omg ..17 వయసులో చిన్నపిల్లను వొదిలేసి దళం లో .. ….. మల్లి. రెండవ బిడ్డను వొదలటానికి 2 రోజులు నడిచి వెళ్లి మల్లి వెనక్కి తీరిగి చూడకుండా వెళ్లి దళం లో చేరినది ……. నాకళ్ళలో నీళ్లు సుడిగుండ్రాలుగా రాలుతున్నవి … చాల ఏడ్చేసాను … పీడిత తాడిత ప్రజల కొరకు ఎందరో ఎందరో పోరాట తల్లులు తమ సర్వస్వాన్ని దారపోశారు …
    నేను 8 క్లాస్ లో ఉన్నపుడు ( జాయింట్ సెక్రటరీ గ ఎన్నికయ్యాను) వేసవి సెలవులో అప్పటి సీఎం కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ జరుగుతుంది ప్రతి ఊరి కి వెళ్లి ప్రతి ఒక్కరి సంతకాన్ని సేకరిస్తున్నాం , జగిత్యాల తాలూకా లో ఒక చిన్నగ్రామానికి వెళ్ళాను అక్కడ ఒక ముసలమ్మా ( పూరిగుడిసె – కళ్ళు కనపడవు ) బయట ఉడుస్తుంది, మేము వెళ్లి సంతకాన్ని తీసుకొన్నాకా అయ్యా !! నాకొడుకు డాక్టర్ చదువడానికి వెళ్ళింది బిడ్డే ఎప్పుడొస్తాడో అని ఎదిరిచూస్థున్న అని అనేసరికి ..అక్కడ ఉన్నవాళ్లందరికి కళ్ళలో నీళ్ళొచ్చేసాయి .(ఎందుకంటేయ్ ఆ అమ్మకొడుకు డాక్టర్ చదివేటపుడు దళం లో చేరాడు ఆలా పనిచేస్తూ ఎన్కౌంటర్ లో చనిపోయాడు- ఒక్కడే కొడుకు ఎవరూ లేరు కనిపించి కనపడక వండుకుంటుంది) .. థాంక్స్ అక్క మీ ద్వారా ఆరోజు ను గుర్తుచేసుకున్నాను ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో