తెగాయించిన ఆడది -ఎండుపల్లి భారతి

 

పదిమంది ఆడోళ్ళం పొలంలో పనిచేసుకొని దావంట వస్తా ఉండాము. మాకు ఊరు జేరుకోవాలంటే ఓ అరగంట పడుతుంది. ఇద్దరు ముగ్గురు వాళ్ళకు తోసిన మాటలు మాట్లాడుకుంటా

ఉండారు.

ఏమ్మాట్లుంటాయి. ఊర్లో మొగుళ్ళు మాట్లో, వాల్ల బిడ్డ మాట్లో, ఇట్లా ఏదో ఒకటి. దావ సమసల్ల కదా. నేను ఎందుకో వెనక్కి తిరిగి జూస్తే నా కనుచూపు మేర ఒక ఆడది బిడ్డనెత్తుకొని నడుసుకొని వస్తావుంది. ”ఈ బిడ్డగని మా సుశీలమ్మ కూతురేమో ఆడ వస్తావుండేది అట్లా జూడండి” అంటి. అందరూ వెనక్కి జూసి ”నిజమే ఆయమ్మే” అనిరి.

దీన్ని చేసుకున్నోడు ఒట్టి తాగుబోతు నాబట్ట తాగేది, దినమూ కొట్టేది. అది ఓర్సినన్నాల్లూ ఓరిసేది, తల యాష్ట అయినబుడు బిడ్ల పాపల్ను పిలుసుకొని పుట్నింటికి వచ్చేది. వాడు మల్ల వచ్చి మాయ మాట్లు చెప్పి తిరిగి పిలసక పోయేది. ఇదే తంతు. ఏదో సామెత ఉందే ”తిక్కనా సౌతి తిరిగేదట్లే, కోతి నాబట్ట కొట్టేదట్లే” అని ఇన్నోళ్ళకు, చూసినోళ్ళకు సర్వసాధారణం అయిపోయింది. మళ్ళీ మొగుడు కొట్టినాడేమో పాపం ఆరుగాలం దీనికి అగసాట్లే, ఎట్లాంటి నాకొడుక్కి ఇచ్చినారు అని మేము తిట్టుకుంటా ఉండగానే ఆ యమ్మి మా జతకు వచ్చేస.

”ఏమ్మే మళ్ళీ అలిగి వస్తా ఉండావా” అన్నమాటతో బరోయని ఏడ్చేస.

”యాడద్దు ఊరుకో” అని సంకలో బిడ్ని ఒకాయమ్మ ఎత్తుకునె, ఒకాయమ్మ బ్యాగు ఎత్తుకునే. ఏంటి ఆడబతుకులే ”అన్నీ అమరితేనే ఆడది లేకపోతే సాకలోళ్ళ గాడిది” అంటారు అనుకుంటూ ఆ యమ్మని మా గుంపులో కలుపుకొని నడస్తా వుండాము.

”ఎవరు మనూళ్ళో చంద్రకళ చెడి బద్రమయింది నా సవితేశ అట్లుండల్ల” అనే మా చిన్నమ్మ.

”నిజమే ఏట్లో బతకల్ల. లోకులకు బయపడి ఎన్నాళ్ళు కాపురం చేసేది. దాని గుండె దైర్నం ఎవరికుంది” అనే ఇంకోయమ్మ.

ఎద్దులు ఏటింటి పోనీ బండి బాటింటి పోనీ నీ రూటే సెపరేటు అంటుంది చంద్రకళ. నా చిన్ననాటి జతగత్తె. దాన్ని ఊరంతా మోరిసేది. ఎందుకంటే అది చానా కచ్చి ముండ. మాటగాని ఏటుగాని మింద పన్నిచ్చేది కాదు. దానిది తప్పు ఉన్నా నాదే రైటు అనేది. చిన్న పెద్ద అనేది ఎంచుకునేదే లేదు. దాని జత ఎవ్వరూ జేరేది లేదు నేను తప్ప. అదేమో నన్ను మటుకు ఏమనేది కాదు.

వాళ్ళ ఇంట్లో నలుగురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు. వాళ్ళ అమ్మ నాయిన వాళ్ళ ఓమితి కాడికి చదువు చెప్పించినారు బిడ్లకి. దీనికి సదువు అబ్బలా. దీన్ని గొడ్లు కాడికి ఏసినారు. ఆ గొడ్ల కాడ దినామూ రంపే. జత పిల్లోళ్ళను కొట్టేది. గొడ్లను పొలంలోకి వదిలేసేది. దొంగతనాలకు పోయి చెరుకులు, మామిడికాయలు, చెనిక్కాయలు లాంటి తినే వస్తువు ఏదుంటే అది తినేది. ఊర్లో అందరూ ఆయమ్మని తిట్టిపోసేది. దీనికి ఎట్లా మొగుడొస్తాడో కాని దీన్ని బాగా చినగ్గోస్తాడు. కుసుంటే ఒగేటు, లేస్తే ఒగేటు కొడతాడు. ”సగినాల పచ్చి కుడితి బాండ్లో పన్నట్టు” ఇది పడుతుంది అని అందరు తిట్టేదే. నేను ”మ్మేయ్‌ చంద్రకళా దుడుకుపాటు తగ్గించుకోమ్మే, యాల ఆ పాటు పడతావు. కన్నోళ్ళ నోర్లలో కరిగేది దేనికి” అంటే వినేది కాదు. ఊరోళ్ళు అందరూ వచ్చి వాళ్ళ అమ్మ నాయనతో ఈ పిల్ల ఈ తీరువాకు తీరింది, పెద్ద చిన్న ఎంచుకోదు అని జెప్పి మేయిచ్చేది. వాళ్ళమ్మ నేను ఏమి జేసేది, నన్ను కూడా లెక్కలేకుండా మాట్లాడుతుంది. అది వాళ్ళ అవ్వ తీరుబాకు, వాళ్ళ అవ్వ కూడా అట్లే ఉన్నింది అనేది.

ఇట్లా జరగతా ఉంటే ఒక రోజు ఎవరో పెళ్ళి జూపులకు వచ్చినారు. అది సాపు నలుపుతో బాగా ఉమ్మసంగా ఉండేది. వచ్చినోడు దీన్ని జూస్తానే ”అది నాకు కానే కావాల” అని గట్టిగా పట్టుబట్టి తిరిగినాడు. పిల్లదాని అమ్మ నాయన కడా వాడికి బాగా ఆస్తుపాస్తులున్నాయి, ఒగడే కొడుకు అని తలాకు ఒగ మాట జెప్పి ఇద్దర్ని పూన దోసి పెండ్లి చేసిరి. పెండ్లి అయిన సంవత్సరం రోజులేమో బాగున్నారు. ఒగ బిడ్డ తల్లయింది. ఆ తరువాత మొదలయింది. వాడు ఫుల్లుగా తాగేది, రోజూ కొట్టేది. ఊళ్ళో ఉండే భూములు అమ్మి తాగేసినాడు, ఇంట్లో ఉండే వస్తువులు అమ్మి తాగేది కొట్టేది మొదలుపెట్టాడు. ఒగసారి కొట్టుకున్నారంటే ఆ బిడ్ని వారం రోజులు ఆసుపత్రిలో చేర్పించాల్సిందే.

నడిజాము కాడ రంపు జరిగిందంటే ఇంపర్‌మేషన్‌ తెలస్తానే తల్లి తండ్రి ఉడో ఉడో అని పరిగెత్తాల్సిందే. ఊర్లో వాళ్ళ సాపిండ్లు అన్నీ ఇప్పుడు పలించేసినాయి. యానిగట్ల మనిషి పీనుగైపోయే! యెముకలకి మెడ ఏసుకోని ఉండాది.

దాని గురించి తెల్సినబుడల్లా నాకు బాదేసేది. ఒగనాడు తలకాయంత పగలగొట్టుకుని చావు దగ్గరికి ఎలిపోయింది. ఇట్లనే

ఉంటే బిడ్ని చంపినా చంపేస్తాడని వాళ్ళ అమ్మ నాయనా దాన్ని పుట్నింటికి పిలసకొచ్చేసిరి.

అది కూడా భయపడి అత్తింటికి పోలేదు. కొన్ని రోజులు పుట్నింటిలోనే ఉండిపోయింది. ఆ తరువాత కాపురానికి పోకుండా బిగేసింది. బిడ్లని ఆన్నే బళ్ళో జేరిసింది. పుట్నింటిలో అన్నాతమ్ములకి అక్క చెల్లికి రంపొచ్చేది. ఈ యమ్మ ముందే సురుకయింది కదా ఇదే వాళ్ళమిందకు రంపుకు పొయ్యేది. ఈ రంపులతో పుట్నిల్లు కూడా వద్దనుకుని కూలి నాలి చేసి ఆ ఊరులోనే కాసింత గవర్నమెంటు తావు జూసుకొని చిన్న ఇల్లు కట్టుకొంది. సంసారానికి కావల్సినవన్నీ తెచ్చుకునింది. బిడ్డని సదివించుకుంటూ ఉంది.

మొగుడు మల్ల ఆయమ్మ పంచన చేరినాడు. ఆయమ్మ మన్సిలో వాని మింది ఏమీ బాద పెట్టుకోలే. వాణ్ణి చేరదీసి చూసుకుంటా ఉంది. కొన్ని దినాలు మారినట్టు నటించినాడు. మల్లా వాడి విశ్వరూపం చూపించినాడు. తాగేది, చేసింది తినేది, పనుకొనేది, పనిపాట చేసేది లేదు. కాకపోతే ఆయమ్మని కొట్టేది లేదు. ఎందుకంటే అది దాని ఊరు. అయినోళ్ళు పోయినోళ్ళు ఉండారు దానికి దైర్నం వచ్చింది. అత్తగారింట్లో ఎలిపోయే మీ ఇంటికి అని కొట్టేవాడు. ఇబ్బుడు ఆ మాట అన్లేడు, కొట్టేది లేదు. కొట్టేది ఒకటి తప్పనిచ్చి మిగతా అన్ని పాడు పన్లు చేసేదే. అది వోర్సినన్నాల్ల వోరుస్తుంది. దానికి సాధ్యం కాలేదంటే పొరక్కట్ట ఎత్తుకొని నున్నగా దంచిపెట్టేది. వాని గుడ్డ గుసురు ఇసిరి బయటకు పారేసి ”ఎలిపోరా మీ ఊరికి” అనేది. వాడు గుడ్డ గుసురు సంకలో పెట్టుకొని ఎలిపోయి మల్ల మూన్నెల్లు ఆర్నెల్లకు వచ్చేది. ఆయాలకు ఆ యమ్మికి ఆ బాద మాసిపోయుంటుంది గదా అని మల్ల అవే చేష్టలు చేసినబుడు కొట్టి తరిమేది.

ఊరు వాడ ఏమనుకుంటారో అన్న బాధ, బయము దానికి లేదు. ఏమన్నా పేచీ వస్తే మొగుడ్ని అర్దరాత్రి కానీ అపరాత్రి కానీ కొట్టి తరమడమే! మొగుడు అట్లున్నాడని ఊర్లో ఏ మొగాడు గాని దాంతో పేసాడడు. దాని నోరుకి భయపడతారు. అదేమో జల్సాగా కష్టపడుకుంటుంది, తింటుంది, బిడ్ను సదివిస్తుంది.

కొంతమంది దాన్ని ఇడిసేసింది, తెగాయించింది అంటారు. కొంతమంది అది చేసేదే కరెట్టు అంటారు. అది ఎవర్నీ బట్టిచ్చుకోదు. ”పెద్దోళ్ళు అన్నే అంటారు ఉరి బోసుకోనైనా తనకంటూ జానెడు తాడుండాలని. నాకేమి! తల దాసుకోను ఇల్లుంది, కష్టపడుకోని తినను ఒల్లుంది” అంటుంది చంద్రకళ.

మాటల్లోనే ఊరొచ్చే. ఎవరిళ్ళకు వాళ్ళం బోతిమి. మా యంట వచ్చిన ఆ యమ్మి పుట్నింటికి బోయే!

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో