పేరుపాలెం బీచ్ టు పేరంటపల్లి సాహితీ యాత్ర

‘పరవశంలో ముంచిన పాపికొండల యాత్ర’ పేరుతో నేను రాసిన వ్యాసానికి వచ్చిన ప్రతిస్పందన ఫలితమే రెండోయాత్ర. నేననుభవించిన అద్భుత ఆనందాన్ని, ఉల్లాసాన్ని నా మిత్ర రచయిత్రులందరికీ పంచాలనే తపనే నన్నీ సాహసం చేయించింది. లేకపోతే ‘భూమిక’లాంటి బుల్లి సంస్థ ముప్ఫై మందితో మూడురోజుల పర్యటనను ఆర్గనైజ్ చెయ్యగలగడం సాధ్యమయ్యేది కాదు. అయితే అందరం కలిస్తే ఏమైనా చెయ్యగలమనే గుండెనిబ్బరంతో, అందరం ప్రయాణ ఖర్చుల్ని భరించుకుంటే భూమిక భోజన, వసతి ఖర్చుల్ని భరించగలుగుతుందని ఉత్తర పావురాన్ని ఎగరెయ్యగానే, తిరుగు టపాలో వచ్చిన లెక్కలేనన్ని ఉత్తరాలు నాకు బోలెడంత సంతోషాన్నిచ్చాయి. యిది ఎవరికోసమో చేస్తున్న ప్రాజెక్టు కాదని, మనకోసం, మన ఖర్చుతో, మనం ఏర్పాటు చేసుకుంటున్న క్యాంప్ అని స్పష్టం చెయ్యడం జరిగింది. ఇంక అడ్డేముంది. చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. ప్రయాణానికి ముందు నేనొకసారి వెళ్ళి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకొచ్చాను. అయితే నర్సాపురం చిన్న పట్టణం. అందరికీ విడివిడిగా రూమ్లివ్వడం లాంటివి కష్టమని, అందరం కలిసి ఒకేచోట వుండాల్సి వస్తుందని మళ్ళీ ఉత్తరం రాయగానే ‘‘ఏం ఫర్వాలేదు మాకేమీ అదనపు సౌకర్యాలక్కరలేదు’’ అంటూ మళ్ళీ సంకేతాలొచ్చాయి. ముప్ఫైమంది కేంప్కి రావడానికి సిద్ధమయ్యారు. చికెన్ గున్యా దెబ్బతో ముగ్గురు డ్రాప్ అయ్యారు. ఇరవై ఏడుమందితో మా ప్రయాణం 15 రాత్రి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మొదలైంది. ప్రయాణపు వివరాలన్నీ లోపలి పేజీల్లో వున్నాయి కాబట్టి నేను వాటి జోలికెళ్ళకుండా అసలు ఈ ప్రయాణపు ఉద్ధేశ్యం గురించి రాయాలనుకుంటున్నాను.

2005 జనవరిలో ‘స్పారో’ ఆర్గనైజ్ చేసిన రచయిత్రుల కేంప్‌కి నేను హాజరయ్యాను. దేశం నలుమూలల్నుండి వచ్చిన డెబ్భై మంది రచయిత్రుల్ని కలుసుకున్నాను. ఆ కేంప్ ఒక సెలబ్రేషన్లాగా సాగింది. రచయిత్రుల రచనల సెలబ్రేషన్. ఆటలు, పాటలు, ప్రకృతిలోకి నడకలు, అలలతో స్నేహాలు, సూర్యోదయ సూర్యాస్తమయ వీక్షణాలు, నవ్వులు, తుళ్ళింతలు, కేరింతలతో ఖషీద్ బీచ్ మార్మోగిపోయింది. నాలో గొప్ప సంతోషాన్ని నింపింది ఖషీద్ క్యాంప్. ఈ స్ఫూర్తితోనే నేను తెలుగు రచయిత్రుల కేంప్‌కి శ్రీకారం చుట్టాను. మార్చి నెలలో మరో మిత్రబృందంతో పాపికొండల యాత్ర చేసిరావడంతో రచయిత్రుల కేంప్ కూడా అక్కడే ఏర్పాటు చెయ్యాలని అనుకున్నాను. ఇదంతా నాకు తలకు మించిన భారమని తెలుసు. అయినా సరే చెయ్యాలి. చేసి తీరాలి అనే పట్టుదలే నన్ను ముందుకు నడిపించింది. భూమిక సిబ్బంది సహకారం కూడా నన్నీ సాహసానికి పురికొల్పింది. రెండు నెలల ప్లానింగ్. ఎందరెందరో మితృల, బంధువుల సహకారం, కోర్టు సిబ్బంది సేవాభావం, శ్రీ వై.ఎన్ కాలేజీవారి ఆత్మీయ ఆదరణ, నేను చదువునేర్చిన బి.జి.బి.ఎస్ ఉమన్స్ కాలేజీవారి అద్భుత ఆతిధ్యం, ఇంతమంది సహృదయుల సహకారంతోనే నేను ఈ క్యాంప్‌ను రక్తి కట్టించగలిగాను. రాజమండ్రిలో మిత్రుడు శ్రీధర్ ఒక గంట వ్యవధిలో చేసిన ఏర్పాట్లు అద్భుతం. అనితరసాధ్యం. తన నానమ్మ అద్దేపల్లి వివేకానందాదేవి రచయిత్రి అయినందుకు, తన ఇంటికొచ్చిన సాహితీమూర్తుల పట్ల ఆయన కన్పరిచిన శ్రద్ధ, ఆత్మీయత అందరినీ అబ్బురపరిచింది. నా పుట్టింట్లో, నా వూరిలో, నా బంధువులతో పాటు, చెట్లు, పిట్టలు, తోటలు అన్నీ గుండె తెరిచి రచయిత్రులను ఆహ్వానించాయి. నా ప్రాణమైన సీతారాంపురం రచయిత్రుల జ్ఞాపకాల్లో నిలిచిపోవడం నాకెంతో గర్వకారణం.

‘కలవడం, కలబోసుకోవడం’ అనే ప్రధాన ఉద్ధేశ్యంతో నేను ఈ క్యాంప్‌ను మొదలుపెట్టినా, రచయిత్రుల మధ్య చక్కటి స్నేహవారధిని నిర్మించాలన్నదే నా ఉద్దేశ్యం. ఒకరిపట్ల మరొకరికి సుహృద్భావం, ఒకరి కష్టం పట్ల మరొకరి స్పందన ఇంకా ఎన్నో అంశాలు కూడా ఇందులో వున్నాయి. ప్రపంచీకరణ పట్ల లోతైన అవగాహన, పోలవరం ప్రాజెక్టు పర్యవసానాలు, ముంపు, ముంపువాసుల సమస్యలు, రచయిత్రులు ఐక్యం కావాల్సిన ఆవశ్యకత, భూమిక పట్ల బాధ్యత ఇంకా ఎన్నో విషయాల గురించి సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. కొన్ని ఆచరణలోకొస్తున్నాయి కూడా. నేను ఆశించిన ఫలితం వచ్చిందా అంటే వచ్చిందనే చెప్పాలి. సామూహిక నిర్ణయాల ఆచరణ కోసం కొంతకాలం ఆగాల్సిందే. వేచి చూడాల్సినవి కూడా వున్నాయి. మొత్తానికి పేరుపాలెం బీచ్ టు పేరంటపల్లి క్యాంప్ సూపర్ సక్సెస్ అయ్యిందని రచయిత్రులందరూ ముక్తకంఠంతో చెప్పడం, టోకుగా అందరూ నన్ను ప్రేమించెయ్యడం, టన్నుల కొద్దీ ప్రేమని పొందిన నా జీవితం ధన్యమైనట్లుగా నాకన్పిస్తోంది. నా బాధ్యతని మరింత పెంచినట్లుగా కూడా నాకన్పిస్తోంది.

ఈ కేంప్ విజయంలో సహకరించిన రచయిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భూమిక సిబ్బంది ప్రసన్న, మంజుల, లక్ష్మి, సుమలతల సహకారం లేకుంటే ఈ కేంప్ నిర్వహణ సాధ్యమయ్యేది కాదు. వై.ఎన్ కాలేజి సెక్రటరీ డా|| చినిమిల్లి సత్యనారాయణగారికి, నారాయణరావు గారికి, మహేశ్వరి గారికి, వై.ఎన్ కాలేజి ప్రిన్సిపాల్ గారికి, బి.జి.బి.ఎస్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు లెక్చరర్లకు, నా తమ్ముళ్ళు ప్రసాద్, కృష్ణప్రసాద్లకు, నాగమణికి, శ్రీధర్లు, నా అక్క కొడుకు శ్రీనుకి అందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు. మమ్మల్ని కంటికి రెప్పగా చూసుకున్న శ్రీ వై.ఎన్ కళాశాల సిబ్బంది, నర్సాపురం, రాజమండ్రి, కొవ్వూరు, కోర్టు సిబ్బందికి ధన్యవాదాలు. చివరగా నా వెన్నంటి వుండి అన్నింట్లోను తానై మసలిన నా ప్రియనేస్తం గీతకి మరింత స్నేహం తప్ప ఇంకేమివ్వగలను.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

One Response to పేరుపాలెం బీచ్ టు పేరంటపల్లి సాహితీ యాత్ర

  1. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భూమిక కు అభినందనలు. అంతే ఉత్సాహంగా పాల్గొని ఓ సాహితీ సమూహంగా ఏర్పడటం చక్కటి పరిణామం. వివరంగా అనుభవాలని పంచు కున్న రచయిత్రులందరినీ చూసి ఈర్ష్య పడుతున్నాను.

    ఇతరత్రా జరుగుతున్న సాహితీ కార్యక్రమాల్లో, సాహితీ సమూహాల్లో రచయిత్రులకు సరయిన భాగం దొరకట్లేదనేది నేను వ్యక్తిగతంగా అంగీకరిస్తాను. తెలుగు సాహితీ లోకంతో నాకు ఈ మధ్యనే ఏర్పడ్డ అతి కొద్ది పరిచయంతో ఈ మాట అంటానికి సాహసిస్తున్నాను.

    అదే సందర్భంలో ఓ చిన్న సూచన. ఓ రచన పట్ల విమర్శ చేసేటప్పుడు రచన చేసింది ఆడ, మగ అని చూసి చేయాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవడం మనందరికీ మంచిది. నేను గొరుసు జగదీశ్వర రెడ్డి కథలో గాని, ఖదీర బాబు కథలో గాని లోపాలని ఎంత ధైర్యంగా వాళ్ళకే చెప్తానో, అంతే చనువు నాకు ప్రతిమ గారి కథో, చంద్రలత గారి కథో చదివినప్పుడు కూడా వుండాలని కోరిక. ఇప్పుడు లేదని కాదు. మన మెవ్వరం ఈ గీత దాటకుండా చూసుకుందామ ని మాత్రమే…

    అక్కిరాజు భట్టిప్రోలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.