సీత జడ – ఓల్గా

కుచ్చులు కుచ్చులుగా రాలిపోతున్న జుట్టునంతా పోగు చేసి కాలికింద కదలకుండా పెట్టుకుంది సీత. దువ్వెనతో దువ్వుకున్నప్పుడల్లా ఇంత జుట్టు రాలిపోతోంది. తలమీద ఉన్న పిడికెడు వెంట్రుకలు ఎంత ప్రియంగా ఉన్నాయో కాలి కింద నలుగుతున్న వెంట్రుకలు అంత అప్రియంగా ఉన్నాయి. అరవయ్యేళ్ళ సీతకు నెల రోజుల క్రితం పెద్ద జబ్బు చేసింది. క్రమంగా ఒంట్లో కాస్త బలం చిక్కుతోంది గానీ జుట్టు మాత్రం మిగలకుండా రాలిపోతోంది. పాయలు పాయలుగా ఊడి నల్లని దువ్వెనలో వెండి తీగల్లా మెరుస్తున్న ఆ జుట్టును చూస్తుంటే సీత మనసులో ఆరాటం పుట్టుకొచ్చింది. ఆ జుట్టు తన ప్రాణమైనట్లూ, ఆ ప్రాణం పోతుంటే తను చూస్తూ ఉండాల్సి వచ్చినట్లూ, నిస్సహాయంగా కన్నీళ్ళతో కూచుండిపోయింది. ఆ జుట్టుని గురించిన జ్ఞాపకాలు, ఆ జుట్టు చుట్టూ పెరిగిన భ్రమలు, భ్రమతలు సీత మనసులో అల్లకల్లోలం రేపుతున్నాయి.

ఊహ తెలిసేసరికే తన జుట్టు చాలా ముఖ్యమైనదని సీతకు అర్థమైపోయింది. అసలు సీతకు తను ఆడపిల్లననే స్పృహ మొదటిసారిగా జుట్టువల్లే కలిగింది. నల్లగా పట్టుకుచ్చులా రోజురోజుకీ పెరుగుతున్న ఆ జుట్టును అతి శ్రద్ధగా పోషణ చేసేది సీత తల్లి. రకరకాల ఆకులూ, పువ్వులూ ఎండబెట్టేది. వాటిని కొబ్బరి నూనెలో వేసి కాచేది. దానిని రోజూ సీత వెంట్రుకలకు కుదుళ్ళకంటా పట్టించేది సీత తల్లి. తలంటే రోజు ఆమె హడావుడి చెప్పనలవి కాదు. వంటాముదం తలకు అంటి గంటసేపున్న తర్వాత కుంకుడు పులుసుతో రుద్దేది. ఆ తర్వాత సాంబ్రాణి పొగవేసి ఆరబెట్టి నెమ్మదిగా చిక్కు తీసేది. ఆ రోజు మల్లెపూలో, జాజిపూలో తలలో పెట్టకుండా ఉండేది కాదు. జడలో పువ్వులు పెట్టి ‘ఆడదానికి తలకట్టే సింగారం’ అని నడినెత్తిన ముద్దు పెట్టుకునేది. తల్లి ఆర్భాటంవల్లా, చుట్టుపక్కల వారు తన జుట్టుకు ఇచ్చే గుర్తింపు వల్ల సీతకు తనంటే తన జుట్టే అనిపించేది.

అయితే ఒక్కోసారి సీతకు జుట్టంటే చాలా చిరాకేసేది. ప్రతి పనికీ అడ్డంపడే జుట్టును కత్తిరించి పారెయ్యాలనిపించేది. వేసవి కాలంలో బోడిగుళ్ళతో తిరుగుతున్న అన్నయ్యలను చూస్తే సీతకు తను కూడా గుండు చేయించుకుని తిరగాలనిపించేది. గుండు చేయించుకుంటే రోజూ పొద్దున్నా, సాయంత్రం అమ్మ చేతిలో తన తల పెట్టనవసరం లేదు. ఆ నొప్పి, బాధా తప్పుతుంది. ఆటలకు పిలవగానే పరిగెత్తిపోవచ్చు. అమ్మ నున్నగా తలదువ్వి జడవేసేదాకా ఆగనవసరం లేదు. ”చింపిరి జుట్టేసుకుని వీథులెంట బయల్దేరావా” అని అప్పుడెవరూ తిట్టరు. ఆదివారం, ఆదివారం పేలు దువ్వించుకోవడానికి ప్రాణం పణంగా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈర్పెన తీసుకుని అమ్మ తన వెనకాల కూర్చుంటే సాక్షాత్తూ యముడే అమ్మ రూపంలో వచ్చాడనిపించేది. తన ఖర్మకాలి తల్లో ఈపు ఆ పాటికే చచ్చి ఉంటే ఇక ఆ బాధ పగవాడికి కూడా వద్దనిపించేది.

ఇన్ని రకాల ఊహలతో ఓనాడు సీత తన కోరిక తల్లిముందు బయటపెట్టింది. తల్లి ”ఇవ్వేం పిదపకాలం బుద్దులే, ఆడపిల్లవి ముచ్చటగా జడ వేసుకుని పువ్వులు పెట్టుకోక మగరాయుడల్లే గుండు చేయించుకుంటావా” అని చివాట్లేసింది. మగరాయుడు గొప్పవాడూ అతని గుండు గొప్పదైతే, ఆ గొప్పగుండు తనెందుకు చేయించుకోకూడదో మగరాయుడిగా ఎందుకుండకూడదో సీతకు అర్థం కాలేదు.

పదేళ్ళన్నా రాని సీత భయం గొలిపే దృశ్యం చూసిందోనాడు. పక్కింటి డాక్టరుగారింట్లో పనిమనిషి దొంగతనం చేసిందట. ఆ పదహారేళ్ళ పిల్ల తల నున్నగా గీసి సున్నపు బొట్లు పెట్టి పంపించారు. కొట్టలేదు, పోలీసులకు పట్టివ్వలేదు. ఆ అమ్మాయి గుండెలవిసేలా ఏడుస్తూ వాళ్ళింటికి వెళ్ళిపోయింది. సున్నపు బొట్లతో వెక్కిరిస్తున్నట్లున్న గుండు మీద రెండు చేతులూ పెట్టుకుని ఏడుస్తూ బజారంట నడుస్తున్న ఆమెను చూస్తే సీతకు కూడా ఏడుపొచ్చింది. దొంగతనం చేస్తే తిట్టరాదా, కొట్టరాదా, జైల్లో వేయించరాదా గుండు చేయించడమెందుకు అని సీత కోపంగా పక్కింటి వాళ్ళను తిట్టుకుంది. ఆ రాత్రి పడుకునే ముందు నలిగిపోతాయని జడలో మల్లెపూలు తీసి కండువాలో చుడుతుంటే ఆ పనమ్మాయే గుర్తొచ్చింది. ఎవరూ చూడకుండా దుప్పటి నిండా కప్పుకుని చాలాసేపు ఆ అమ్మాయి జుట్టు కోసం ఏడ్చింది సీత.

సీత ఎనిమిదో క్లాసు నుంచి మిషనరీ స్కూల్లో చదివింది.

స్కూల్లోకి రాగానే ఎదురైన నన్‌లను చూసి విస్తుపోయింది. జాలిపడింది. వాళ్ళ మావయ్య చచ్చిపోతే అత్తయ్య జుట్టు తీయించుకున్న విషయం సీతకు గుర్తే కాని మొగుడు చస్తేనే జుట్టు తీస్తారనుకుంది. మరి వీళ్ళకు పెళ్ళి కాలేదుగా ఎందుకు గుండు చేసుకున్నారో సీతకు అర్థం కాలేదు. తోటి అమ్మాయిలంతా ఆ విషయం గురించి మాట్లాడుకునేవారు.

‘వీళ్ళు జుట్టు తీయించుకుంటారెందుకు?’

‘పెళ్ళి చేసుకోరుగా అందుకు’

‘పెళ్ళి చేసుకోకపోతే జుట్టు తీయించుకోవటం ఎందుకు?’

‘పెళ్ళికీ జుట్టుకీ సంబంధం ఏమిటి?’

‘జుట్టు లేకపోతే కోరికలు రావట’

‘కోరికలేమిటి – ఏం కోరికలు’

‘పూలు పెట్టుకోవాలని, పెళ్ళి చేసుకోవాలనీ, పిల్లల్ని కనాలనీ కోరికలు రావటం’

‘పెళ్ళిరోజు పూలజడ వేసుకోవటం కుదరదుగా అందుకని ఇక పెళ్ళెలా చేసుకుంటారు’

సీతకు తన జుట్టుమీద భక్తి శ్రద్ధలు పెరిగాయి –

తన జుట్టును ప్రేమగా నిమురుకుని

‘ఈ జుట్టు ఉంటే కోరికలుంటాయి. లేకపోతే ఉండవు. అమ్మో’ అనుకుంది.

‘అది కాదు లేవోయ్‌ – జుట్టు ఉంటే అందంగా కనపడతారట. అందంగా కనపడకూడదట వాళ్ళు’

‘ఎందుకని’

‘ఏమో…’

‘జుట్టు లేకపోయినా మన ఇగ్నేషియన్‌ అమ్మగారు ఎంత బాగుంటారు? జుట్టున్న వాళ్ళకన్నా బాగుంటారు’. ”ఔను ఔన”ని అందరూ ఆ మాటని ఏకగ్రీవంగా అంగీకరించారు.

సీత పదో తరగతికి వచ్చేసరికి ఆమె జడలమీద ఇంట్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలయింది. ఆ వ్యతిరేకతకు ప్రారంభకురాలు సీత నాయనమ్మ. ”పిల్ల పెద్దదైంది. తాడిలా పెరుగుతోంది. రేపో మాపో పెళ్ళిచేయాలి. ఇంకా ఆ రెండు జడలేమిటి?” అని పోరు పెట్టేది. తల్లి కూడా వంతపాడేది. సీత మొదట ఇష్టపడలేదు. ఆరు నెలల క్రితమే సీత తన జుట్టును తన చేతుల్లోకి తీసుకుంది. తల్లి బిర్రుగా బిగించి జుట్టు పైకి దువ్వి రెండు చెవుల పక్కగా జడలు వేసి కొసకు రిబ్బను వేసి మడిచి పైకి కట్టేది. ఆరు నెలల క్రితం సీత టీచరొకావిడ సీత జడలు చూసి ముచ్చటపడి ఆ బిగుతు జడలు విప్పించి జుట్టు పైకి ఎగదువ్వకుండా కిందకు దువ్వి కాస్త ఒదులుగా రెండు జడలు వేలాడేలా వేసింది. రిబ్బన్లు తీసేసింది. ఆ జడలు చూసి ఇంట్లో అందరూ వెక్కిరించారు, నవ్వారు. నానా గోలా చేశారు. సీత ఏడ్చి గొడవ చేసి అలాగే జడలు వేసుకుంటోంది. ఇప్పుడిక ఆ రెండు జడలు మానెయ్యమని అన్ని వైపుల నుంచీ ఒత్తిడి మొదలయింది. ఆ జడని అందరూ ప్రత్యేకంగా చూస్తుంటే గర్వపడేది. జుట్టుకి శ్రద్ధగా పోషణ చేసేది. ఎంత శ్రద్ధ తీసుకున్నా, ఎన్ని చిట్కాలు ఉపయోగించినా తమ జుట్టు పెరగడం లేదని తోటి పిల్లలు కొందరు బాధపడుతుంటే వినోదంగా చూసేది. అయితే సీత జుట్టుని బొత్తిగా లెక్కచెయ్యని స్నేహితురాలు సుభద్ర ”జుట్టుంటే ఏమిటి – లేకపోతే ఏమిటి… అసలు జుట్టెందుకు. జుట్టు కింద ఉన్న మెదడు ముఖ్యం. నువ్వు ఆ మెదడంతా జుట్టు గురించి ఆలోచించడానికి, జుట్టుని రక్షించుకోవడానికి ఉపయోగిస్తున్నావు. జుట్టుని మర్చిపోయి ఇంక దేని గురించయినా ఆలోచించు” అనేది. సుభద్ర జుట్టు భుజాలు దాటదు. అందువల్ల అసూయతో అలా మాట్లాడుతోందని అనుకునేది సీత.

సీత నిజంగానే జుట్టు గురించే ఆలోచిస్తూ స్కూల్‌ ఫైనల్‌ తప్పి పెళ్ళి చేసుకుంది. పెళ్ళి కొడుకు తన జుట్టు చూసి ముగ్ధుడయ్యాడనుకుంది సీత, అయ్యాడు కూడా. మొదటి మూడు నెలలూ శాయశక్తులా పొగిడాడు. రాను రానూ సీత జడ రకరకాల పనులకు అడ్డం వస్తోందని గ్రహించి విసుక్కోవడం మొదలెట్టాడు. సీతతో కలిసి ఎక్కడికి బయల్దేరాలన్నా సీత జడకు ఒక అరగంట టైము కేటాయించాలి. జుట్టు పోషణ కోసం సీత తీసుకునే జాగ్రత్త వల్ల కూడా అతనికి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ‘కాస్త జుట్టూడితే ఏమవుతుంది? అసలు సగానికి కత్తిరించెయ్యరాదూ’ అంటూ సీతకు కళ్ళ నీళ్ళు తెప్పించేవాడు. కొన్నాళ్ళకు అతను సీత జుట్టును పట్టించుకోవడం మానేశాడు. అది సీత గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటూనే ఉండేది.

సీతకు ముప్ఫయ్యేళ్ళ వయసప్పుడు సీతనూ, ఇద్దరు కొడుకుల్నీ వదిలి అతను మరణించాడు. సీతకు భర్త చనిపోగానే నాయనమ్మ గుర్తొచ్చింది. నాయనమ్మ తన జుట్టుని ఉండనిస్తుందా అన్న అనుమానంతో సీత వణికిపోయింది. నాయనమ్మ పెద్ద పంచాయతీనే నడిపింది. ఐనా సీత అన్నలు ఆమె మాట సాగనివ్వలేదు. ఈ చర్చలు జరుగుతున్నప్పుడు సీతను పరామర్శించడానికి సుభద్ర వచ్చింది. ‘ఆడదానికి జుట్టే అందం, జుట్టే ముఖ్యం అనేవాళ్ళు భర్త చనిపోగానే జుట్టు తియ్యాలంటారు. సహజంగా వచ్చిన జుట్టును సాంఘిక సంబంధాల కారణంగా తియ్యాలనటం, ఉంచాలనటం చాలా పిచ్చితనం’ అంది. సీతకు ఆ మాటలు చాలా నచ్చాయి. సుభద్ర కూడా ‘నీకు భర్తంటే ప్రాణమో కాదో నాకు తెలియదు కానీ జుట్టంటే ప్రాణమని తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు తీయించకు’ అని చెప్పింది.

సీతకు జుట్టు మిగిలింది కానీ దానికి చేసే పోషణ పూర్తిగా పోయింది. సీత జుట్టునిపుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. తల నూనెలు తయారు చెయ్యటం లేదు. పూలు తేవటం లేదు. కళావిహీనమైన జుట్టు మాత్రం ఒత్తుగానే ఉంది. ఒక్కోసారి భర్త జ్ఞాపకాలు సీతకు పిచ్చెక్కించేవి. ప్రేమగా తనను ముద్దులాడి కౌగిలించుకునే భర్త గుర్తొచ్చి శరీరమంతా అతని కోసం తపనపడేది. అప్పుడు సీతకు ‘జుట్టు కత్తిరించుకుంటే కోరికలుండవు’ అని చిన్నప్పుడు చెప్పుకున్న మాటలు గుర్తొచ్చేవి. అవి నిజం కాదని తెలిసినా ఈ జుట్టు తీయించుకుని కోరికల పీడ ఒదిలించుకుందామా అని ఆవేశంగా అనుకునేది. వెర్రిగా జుట్టు పీక్కుని ఏడ్చేది.

సీత తలంటుకునే ముందు నూనె పెట్టుకోవటం కూడా వదినలకు కంటగింపు అయిపోయింది. తమ కంటే పెద్ద జుట్టు సీతకుండటం కూడా వారికి కంటగింపుగానే ఉండేది. క్రమంగా సీత జడ వాళ్ళ కంటికి పాముకంటే ప్రమాదకరంగా కనపడసాగింది. ‘ఇంకెన్నాళ్ళు వాలు జడ వయ్యారం. ముడేసుకోరాదూ’ అని మూతి తిప్పడం మొదలెట్టారు. జడ మానేసి ముడి వేసుకున్న రోజున సీతకెందుకో ఆగకుండా దుఃఖం వచ్చింది. తన యవ్వనపు రోజులు గుర్తొచ్చో, అది పోతోందనే బాధో, యవ్వనం పోయింది ఒప్పుకోమని నలుగురూ బలవంతపెట్టిన తీరుకో, ఎందుకో గానీ సీత తనలో తనే కుళ్ళి ఏడ్చింది.

కొడుకులిద్దరి క్రాఫులూ చూసినప్పుడల్లా తనకో కూతురైనా పుట్టి ఉండకూడదా అనుకునేది. ఓసారి ఆ మాట పైకే అంటే సుభద్ర తిట్టింది. ‘నీకో కూతురుంటే దాని ప్రాణం కూడా జుట్టులోనే ఉండేలా చేసేదానివి. అది కూడా నీలానే తయారయ్యేది’ అంది. సుభద్ర తనకున్న నాలుగు వెంట్రుకల్నీ కత్తిరించి ఇంచుమించు క్రాఫుగానే చేసింది. ఆమె ఇప్పుడు పంతులమ్మ అయ్యింది. కూతురికి జడే వేస్తోంది. సీతకు కోపం వచ్చి ‘మరి నీ కూతురికి జడే వేస్తున్నావేం’ అని అడిగింది. ‘ఇప్పుడు ఆడపిల్లలకు క్రాఫులు పెంచడం ఫ్యాషనయింది. పిల్లల దృష్టంతా బాబ్డ్‌ హెయిర్‌ మీదో, పోనీటెయిల్స్‌ మీదో ఉంటోంది. అందుకని నా పిల్లలకు పెద్దయ్యేదాకా జడవేసి తర్వాత క్రాఫ్‌ చేయిస్తా’ అంది సుభద్ర.

సుభద్రకు తలతిక్క అనుకుంది సీత.

కానీ సుభద్రకు కూడా తెలియదు తన జుట్టు గురించి ఎంత పట్టించుకోకుండా ఉండాలన్నా కుదరటం లేదని, ఆడదాని జుట్టు ఎట్లా పెంచాలో అన్నది నిర్ణయించేది కొన్ని సాంఘిక శక్తులే కానీ ఆడవాళ్ళు కాదని.

క్రమంగా సీత మేనగోడళ్ళు ఎదుగుతున్నారు. జుట్టు రక్షించుకునేందుకు వాళ్ళు ఉపయోగిస్తున్న పద్ధతులు వేరుగా ఉంటున్నాయి. పదిహేను రోజులకొకసారి షాపుకెళ్ళి కత్తిరించుకొస్తారు. రెండు రోజులకొకసారి షాంపూతో తలస్నానం చేస్తారు. నెలకో రకం షాంపూ మారుస్తారు. కోడిగుడ్డు, పెరుగు, నిమ్మకాయలు… వాళ్ళ జుట్టుకు పట్టించని పదార్థం లేదు. వదినలు ఆ పిల్లలకు సహకరిస్తూనే ఉన్నారు. ఈ షాంపూల వ్యవహారం జుట్టు కత్తిరింపుల వ్యవహారం సుభద్రకు తెలుస్తుందేమోనని అడిగింది. ‘ఆడవాళ్ళ జుట్టు పెరగటం ఏమోగానీ కోట్ల రూపాయల వ్యాపారం మాత్రం జరుగుతోందే సీతా. జుట్టు ఊడితే సవరాలవాడి వ్యాపారం పెరుగుతుంది. మనకు జుట్టు మీద భ్రమలు పెరిగేకొద్దీ వాళ్ళ వ్యాపారం పెరుగుతుంది. నన్నడిగితే ఆడవాళ్ళందరూ క్రాఫులు చేయించుకుని ఈ షాంపూలు, సవరాల వ్యాపారాన్ని దివాళా తీయిస్తేనే గానీ ఆడవాళ్ళ కష్టాలు తీరవు’ అంది. ‘సుభద్రకు జుట్టంటే కసి మాత్రం పోలేదు. ఏం చేస్తుంది పాపం. చిన్న జుట్టు’ అనుకుంది సీత.

ఇంతలో ఆ ఇంట్లో పెద్ద సమస్య ఒకటొచ్చి పడింది. రెండో అన్నయ్య కూతురికి పలచగా మీసాలూ, గడ్డమూ మొలవటం మొదలయింది. మొదట ఆ పిల్లని అందరూ ఎగతాళి చేశారు. ఆ పిల్ల రెండు రోజులు అన్నం మానేసి ఏడ్చింది. ఏడవటమే కాదు అంతకు ముందు ఆ పిల్ల కళ్ళల్లో, ముఖంలో ఉండే కాంతి, ఉత్సాహం, చురుకుదనం అన్నీ పోయాయి. ఏదో పెద్ద దిగులు మబ్బులా ముఖమంతా పరుచుకుంది. క్రమంగా ఆ పిల్ల తల్లిక్కూడా దిగులు పెరిగింది. ఎన్నో మందులు వాడి చూశారు ఫలితం లేకపోయింది. తన జీవితం నాశనమైందని ఆ పిల్ల ఏడుస్తుంటే ఓదార్చే వారే లేరు. ఔను పాపం అని జాలిపడ్డారు. అవతల మగపిల్లలు గడ్డాలూ, మీసాలతో గర్వంగా తిరుగుతున్నారు. ఈ పిల్ల అవి ఒదిలించుకోలేక చచ్చిపోతోంది. ఏం పాపం చేసిందో ఎందుకని వచ్చాయో అని సీత జాలిపడింది. తెల్లబడిపోతున్న తన జుట్టు చూసుకొని కొన్నాళ్ళు బాధపడింది. వదినలు ముగ్గురూ కలిసి వాళ్ళ జుట్టుకి రంగు వెయ్యాలా, ఏం చెయ్యాలని చర్చించుకునేవారు. సీత జుట్టు తెల్లబడటమే మంచిదన్నట్లు పట్టించుకునేవారు కాదు. తను తప్ప మరెవరూ దిగులు పడకుండానే సీత జుట్టు తెల్లబడిపోయింది.

ఇవాళ నెలరోజుల జబ్బు తర్వాత జుట్టంతా రాలిపోతుంటే సీతకు అన్నీ గుర్తొచ్చాయి. అమ్మ రాసే నూనెలు, ఆముదం, కుంకుడు పులుసు, మల్లెపూలు, పెళ్ళినాటి పూలజడ, జడకుచ్చులు, భర్త పోయాక జుట్టు తీస్తారనే భయం, తియ్యరని తెలిసాక నిశ్చింత, అప్పటినుంచీ ఉన్నా లేనట్టయిన జుట్టు, పూలకూ, పోషణకూ నోచుకోని జుట్టు, ఇప్పుడు రాలిపోతున్న జుట్టు…

అన్నీ కళ్ళముందు గాలికెగురుతున్న ముంగురుల్లా అల్లల్లాడాయి.

”ఈ జుట్టు నా ఇష్టంతో పెరిగిందా, నా ఇష్ట ప్రకారం పెరిగిందా? నా జుట్టుని పోషించుకోవటంలోనూ, నిర్లక్ష్యం చెయ్యటంలోనూ ఎంతమంది పెత్తనం చేశారు. ఆడదాని జుట్టు మీద ఇన్ని ఆంక్షలూ, నియమాలూ, పెత్తనాలూ ఎందుకొచ్చాయి. ఆడదాని జుట్టునింత గట్టిగా పట్టుకున్న సమాజం ఆడదాన్ని ఇంకెంత గట్టిగా పట్టుకుంటుంది. ఆ పట్టులోంచి తప్పించుకోకుండా ఈ జుట్టులా పండి బలహీనమై రాలిపోవటమేనా… ఈ పట్టు నుంచి ఈ పెత్తనం నుంచి తప్పించుకుంటే!…ఈ ఆంక్షలు లేకపోతే ఏమయ్యేది, నేనేమయ్యేదాన్ని”.

ఈ ప్రశ్నలు చాలా అస్పష్టంగా సీత మనసులో మెదులుతున్నాయి.

Share
This entry was posted in దారి దీపాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.