తెలుగు దళిత కవిత్వం – దళిత స్త్రీలపై లైంగిక వేధింపులు – పుత్తూరు వాణి

నేటి సమాజంలో స్త్రీలకు జరిగే అన్యాయాల్లో ఎక్కువ భాగం దళిత స్త్రీలపైనే జరుగుతున్నాయి. దళిత స్త్రీలు అన్ని రంగాల్లో అన్యాయాలకు, అత్యాచారాలకు, అవమానాలకు, అవహేళనలకు గురవుతున్నారు. దళిత స్త్రీలు అన్ని రంగాల్లోనూ ఈ నాటికీ అణగదొక్కబడుతూనే ఉన్నారు. ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా దళిత స్త్రీ ఆక్రందనే. దళిత స్త్రీలు కుల, మత, లింగ, రాజకీయ వివక్షలన్నింటికీ గురవుతున్నారు.

కుటుంబ హింస నుండి, సామాజిక హింస నుండి తనను తాను రక్షించుకోవడానికి, తనపై జరుగుతున్న భౌతిక, మానసిక దాడుల నుండి బతికి బయటపడడానికి దళిత స్త్రీ నిరంతరం అగ్రకుల సమాజంతో, పురుష సమాజంతో పోరాటం చేస్తూనే ఉంది. అగ్రకుల పురుషుల కామానికి దళిత బాలిక నుండి బాలింత వరకూ బలైపోయారని దళిత కవిత్వంలో కవులు, కవయిత్రులు పేర్కొన్నారు.

‘మంకెనపూవు’ అనే కవితలో చల్లపల్లి స్వరూపరాణి దళిత బాలిక బాధను తెలిపారు. దళితులకు చదువుకోవాలనే కోరిక ఉన్నా చదువుకోవడానికి నాడు అగ్రకులస్థుల పెత్తనం, ఎదిరింపు ఆటంకాలుగా ఉండేవి. చదువుకుంటే నాలుక కోసేసేవారు. అందువల్ల దళితులు ఏళ్ళ తరబడి చదువుకు దూరమైపోయారు. తర్వాత చదువు కోసం హాస్టల్‌ బడిలో చేరినపుడు బయటే కాక అక్కడ ఉండే వార్డెన్‌ కూడా కామంతో, ఆకలిగా చూసే చూపులకు, వేధింపులకు దళిత బాలిక తట్టుకోలేక తన శరీరాన్ని గుప్పిట్లోకి తీసుకుని విసిరి పారేయాలనిపించిందని స్వరూపరాణి వివరించారు..

”ఏళ్ళ తరబడి దూరమైన చదువు కోసం / హాస్టల్‌ బడికి చేరువయినపుడు

అక్కడ కూడా, / వార్డెన్‌ గాడి ఆకలి చూపుల్ని తట్టుకోలేక

ఒంటిని గుప్పెట్లోకి తీసుకుని / దూరంగా విసిరేయాలనిపించింది”

”మంకెనపూవు” అనే కవితలో స్వరూపరాణి దళిత స్త్రీ ఆవేదనను ఈ విధంగా వర్ణించారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో దళిత స్త్రీలు పురుషులతో సమానంగా కూలీ నాలీ కెళ్ళి కష్టపడుతుంటారు. దళిత స్త్రీ డబ్బుల కోసం పొలంలోకి పనికెళితే కామంతో కళ్ళు మూసుకున్న దొరలు ఆమె శ్రమను దోచుకోవడమే కాకుండా ఆమె శీలాన్ని కూడా దోచుకోవాలని కాపు కాచుకుని ఉంటారని, అలాంటప్పుడు ఆమెకు విత్తనంలాగా భూమిలో పాతుకుపోవాలనిపిస్తుందని వివరించారు.

”కూలీ డబ్బుల కోసం పొలం పనికెళ్తే / అక్కడ కామందు చెమటతో పాటు

నన్ను కూడా దోచుకోవాలని కాపేసినపుడు / నన్ను నేను విత్తనంగా భూమిలో పాతుకుపోవాలనిపించింది”

”వెత” అనే కవితలో మద్దూరి నాగేష్‌బాబు దొరలచేత పరాభవించబడిన దళిత స్త్రీని గురించి ప్రస్తావించారు. దొర దళిత స్త్రీని పత్తిచేలో పురుగులేరే కూలి పనికని పిలిచాడని, ఆమెను పురుగులా తొలిచాడని, రచ్చకు లాగి తన జీవితం నాశనం చేశాడని ఆమె చెప్తుంది. మరొకసారి సాయంత్రం చీకటిపడే సమయాన తనను కాటేయడానికి పాములా కోరలు చాచాడని, పత్తి చేలలో ఆమెను పరాభవం చేస్తుంటే ఏ దేవుడూ అడ్డుపడలేదని బాధపడుతుంది.

”వాడున్నాడే ఆ దొర / పత్తి చేలో పురుగులేరడానికి కూలిపనికని పిలిసి

పురుగై నన్ను తొలిచి ఆగం చేసిండయ్యా / నా బిడ్డలమీద పెమాణం జేసి సెబుతున్నా బాబు

పైటేళ

పొలవంతా నీడలు జాస్తున్న జామున

వాడు నా మీదకి కోరలు చాచిండయ్యా

పత్తి చేల మధ్య వాడు నన్ను పరాభవం జేస్తుంటే

ఏ దేవుడూ అడ్డు పడలేదు అయ్యలారా”

”బానిస” అనే కవితలో జి.విజయలక్ష్మి అప్పులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న పత్తి రైతు భార్య, ఆసామి వేధింపులకు గురైందని పేర్కొన్నారు. పోషిస్తాడనుకున్న భర్త ఆమెను చివరివరకూ చూసుకోకుండా మధ్యలోనే చనిపోతాడు. భర్త చనిపోయాడని, అతను మళ్ళీ తిరిగి రాడని ఆ దళిత స్త్రీని తన మంచంమీద పరుపుగా అవ్వమని ఆసామి వేధిస్తాడని, ఆమె బతుక్కి చీడ పట్టిందని జి.విజయలక్ష్మి వివరించారు.

”బుక్కెడు బువ్వ పెడతాడనేకునేవాడు గుప్పెడు బూడిదయ్యాడు

చీడ పట్టింది చేసుకు కాదురా నా బతుక్కి

పోయినోడు తిరిగి రాడని

మీ రునం కింద పండె మంచం కింద పరుపు నవమంటారా”

”ఎండిన చర్మంపై వార్త” అనే కవితలో ఎ.దుర్గాప్రసాద్‌ అత్యాచారానికి బలైన ఓ దళిత స్త్రీని గురించి ప్రస్తావించారు. ఒక దళిత స్త్రీని అగ్రకుల పురుషుడు పది మంది మనుషుల మధ్య మానభంగం చేస్తున్నా ఎవ్వరూ అడగలేదని, స్పందించలేదని కవి పేర్కొన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా దళిత స్త్రీకి అవమానం, ఆత్మగౌరవం ఎందుకని చిరిగిన మానానికి డబ్బులు పడేస్తాం ఏరుకోమని అన్నా అది మామూలు వార్తేనని ఎవరిలోనూ స్పందన లేదని కవి బాధపడ్డారు. చీరను చించి అవతల పడేసినట్లు ఆమెను అత్యాచారం చేశారని అన్నారు.

”దాంది ఉత్త మానమేననా…?/ చిరిగిన చీరలాంటిది చించి అవతల పారేయొచ్చనా?

పదిమందిలో పడేసి చెరుస్తున్నా / ఏ చేతులూ పిడికిళ్ళెత్తలేదు

నీకు అవమానమేమిటి? ఆత్మగౌరవమేమిటి? / చిరిగిన మానమేగా డబ్బులు పడేస్తాం ఏరుకో! అన్నా

అది మామూలు వార్తే”

”వెత” అనే కవితలో మద్దూరి నగేష్‌బాబు కామంతో కళ్ళుమూసుకున్న దొరలు పెళ్ళయిన దళిత స్త్రీని కూడా విడిచి పెట్టరని అన్నారు. దొరను సుఖపెడితే ఆమెకు ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటానని పెళ్ళయిన దళిత స్త్రీని దొర అడిగిన తీరును కవి ప్రస్తావించారు. కూడు, గుడ్డ ఉంటే ఆమె అందం ముందు సినీ నటులు కూడా బలాదూరేనని, ఆమె దొరను సుఖపెడితే ఆమెను

ఉంచుకుని ఏదీ తక్కువ కాకుండా చూసుకుంటానని, ఒకసారి ఊఁ అని ఒప్పుకుంటే మునిగిపోయేదేమీ లేదని దొర ఆమె పేదరికాన్ని అవకాశంగా తీసుకుని ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని లైంగిక హింసకు గురైన దళిత స్త్రీని గురించి ఇక్కడ కవి పేర్కొన్నారు.

”కూడూ గుడ్డా ఉంటే

సిల్మా యాక్టర్లు కూడా నా ముందు బలాదూరేనంటయ్యా

ఒక్కసారి నేను ”ఊఁ” అంటే

ఒరిగిపోయేది ఏమీ లేదంట

బాగా సుకపెడితే

వాడు నన్ను ఉంచుకుంటడంటయ్యా

ఏదీ తక్కువ గాకుండా సూసుకుంటడంట”

”వెత” అనే కవితలో మద్దూరి నగేష్‌బాబు దొరచేత అత్యాచారానికి గురైన పచ్చి బాలింతరాలైన దళిత స్త్రీ గురించి పేర్కొన్నారు. ఆమె రెండు చేతులు జోడించి దండం పెట్టి మానం తప్ప మరే దిక్కు లేనివాళ్ళమని బతిమలాడుకున్నా దొర ఆమెను వదిలిపెట్టలేదు. కానుపు జరిగి పది రోజులు కూడా దాటని పచ్చి బాలింతరాలినని ఒళ్ళంతా పచ్చిపుండులా ఉందని, కనీసం బాలింతలకు నడుముకు కట్టే గుడ్డయినా విప్పలేదని, తల్లిలాంటి దాన్నని, చెల్లి లాంటిదాన్నని కాళ్ళు, గడ్డాలు పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చినా రాయిలాంటి దొర మనసు కరగలేదని కవి తెలియజేశారు.

”అప్పటికీ రెండు చేతులూ జోడించి / దణ్ణవెట్టి వేడుకున్నానయ్యా మానం తప్ప మరే దిక్కు లేనోళ్ళమని

బతిమలాడుకున్నాను / కానుపై పది రోజులన్నా దాటని / పచ్చి బాలింతరాల్ననీ

ఒళ్ళంతా పచ్చిపుండు లాగుందనీ / కనీసం నడి కట్టయినా ఇప్పలేదనీ

నీ తల్లిలాంటి దాన్ననీ / నీ సెల్లెలాంటి దాన్ననీ

కాళ్ళూ గడ్డాలు పట్టి కన్నీరెట్టుకున్నానయ్యా / రాళ్ళు కరుగుతాయా నాయనా!”

”అణగారిన మహిళల్లారా” అనే కవితలో దళిత స్త్రీలు కూలికెళితే వారి శ్రమను దొరలు దోచుకుంటారని, అగ్ర కులస్తుల వల్ల జరిగే అత్యాచారాలు, మానభంగాలను ఎదుర్కోలేక దళిత స్త్రీ క్షణమొక నరకంగా బతుకును వెళ్ళదీస్తోందని నంది వెలుగు ముక్తేశ్వరరావు పేర్కొన్నారు.

”కూటికి లేని దళిత మహిళలు

కూలికెళితే దొరల దోపిడీ

అత్యాచారం మానభంగములు

నిత్యం నీకు క్షణమొక నరకం”

దళిత స్రీలు నేడు విద్యావంతులై ఉన్నత పదవుల్లో ఉన్నా, ఉద్యోగాలు చేసుకుంటున్నా, ఎక్కడో ఒక చోట అత్యాచారానికి, లైంగిక వేధింపులకు, హింసకు బలవుతూనే ఉన్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించినట్లయితే మళ్ళీ అలాంటి తప్పులు జరిగే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. రాజకీయ అండదండలు ఉన్నా, ఏ మంత్రి కొడుకైనా, ఏ ధనవంతుడి కొడుకైనా తప్పును తప్పుగానే గుర్తించి వారికి కఠిన శిక్ష వేయాలి. అందుకు పోలీసు రక్షణ శాఖకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఇవ్వాలి. ఇకనైనా ఈ లైంగిక దాడులను ఆపి దళిత స్త్రీలను ప్రభుత్వం ఆదుకోవాలి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.