లాభం- నష్టం- మానవ సంబంధాల బలి

-కరుణ

నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో టైపు కూడా నేర్చుకునేదాన్ని. అప్పుడు ఖాళీగా వున్నానూ అంటే నా కాలివేళ్లూ, చేతివేళ్లూ నాకు తెలియకుండానే ‘ఎ, ఎస్,డి,ఎఫ్’లను కొడుతుండేవి. ‘నాకు’ అంటే ‘ఎన్ ఏ ఏ కె యు’ అని ఇలా ఏ పదం గుర్తొస్తే (అది తెలుగైనా, ఇంగ్లీషైనా) ఆ పదాన్ని నా కాలి, చేతి వేళ్లు టైపు చేస్తున్నట్టుగా కదిలేవి. ఇది ఒక జబ్బులా తయారవదుకదా అనే భయం పట్టుకుంది. ఒక్కోసారి చాలా చిరాగ్గా కూడా అనిపించేది. చాలా కాలానికి గానీ నా వేళ్లు అలా టైపు చేయడం మానుకోలేదు.

ఇప్పుడు అలా ప్రతి పైసా గురించి మనసులో లెక్కలు వేసుకోవడం మొదలైంది. ఇది నాలో ఎప్పటి నుండి మొదలైందీ అని గుర్తు చేసుకుంటే రమారమిగా ఫలానా అప్పటి నుండి కాబోలు అని గుర్తు పట్టినప్పటికీ ఖచ్చితంగా అప్పటినుండేనని చెప్పలేను. కానీ, నాలో వచ్చిన ఈ మార్పు యొక్క బాగోగులను ఒక సంఘటన ద్వారా తెలుసుకోగలిగాను. అప్పటికే జరగాల్సిన చాలా సంఘటనలు జరిగిపోయాయి.

మా నాన్న ఊర్లో పెత్తనాలు తప్ప ఇంటి సంగతి పట్టించుకునే వాడు కాడు. మా అమ్మ మగాడిలా కష్టపడి మమ్మల్ని పెంచింది. మా అమ్మకు దాదాపు అరవై ఐదు ఏళ్లు వుంటాయి. నాకే నలభైఐదు వచ్చాయి. మోనోపాజ్, విపరీతమైన బ్లీడింగ్‌, దానికి సంబంధించిన టెన్షన్స్‌ రావడంతో డాక్టర్‌ను సంప్రదించాం. అపరేషన్ చేసి గర్భ సంచి తియ్యాలన్నారు. దాంతో పాటే యాభ్భై అరవై వేల రూపాయలు ఖర్చవుతుందన్నారు. అప్పుడే నా గుండెల్లో రాయి పడింది. అన్ని వేలు ఖర్చు పెడితే ఏమేం సామాన్లు కొనుక్కోవచ్చో లెక్కగట్టా. సిటీకి దూరంగా ఎక్కడైనా ఫ్లాట్ కొనుక్కోవచ్చనీ అనుకున్నా. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఎన్ని వేలు అవుతాయో లెక్కగట్టా. ఇన్ని వేలు ఉత్తపుణ్యానికి ఖర్చవుతున్నాయే అని శారీరక వ్యాధి కన్నా మానసికంగా చాలా కుంగిపోయా అప్పటికప్పుడు.

తర్వాత మా వారితో కూడా యివే విషయాలు చర్చించా. ‘అయితే ఆపరేషన్ మానుకో’ అన్నారు. ‘ప్రతిదీ డబ్బు దృష్టితో చూస్తున్నావని’ మా వారు ఈ మధ్య మరీ చిరాకు పడుతున్నారు. అసలే ఆయన ఎక్కువగా మాట్లాడరు. ఈ మధ్య ముక్తసరిగా మాట్లాడుతున్నారు. నేను డబ్బు గురించి మాట్లాడేసరికి ఇలాంటి పొడిమాటలు మాట్లాడతారు. మంచీ, చెడూ ఏమైనా సలహాలు ఇవ్వద్దా? అస్సలు ఇవ్వరు. ఆయన ఏమైనా చెప్పినా నేను పట్టించుకోననుకోండి. ఆయన మాటలు వింటే సంసారం నడిచినట్లే. ప్రతీదీ డబ్బుతోనే కదండీ ముడిపడి వుంది.

“ఏంటి మీరు? ఇంత ఖర్చవుతుందే అని బాధపడ్తూ మీతో చెప్తే ఆపరేషన్ మానుకొమ్మంటారా?” అని గట్టిగానే అరిచా. కానీ కళ్ల నుండి నీళ్లు కారుతూనే వున్నాయి. మావారి నిరాదరణను నేను తట్టుకోలేను. ఈ మధ్య మనసు కూడా కంట్రోల్‌లో వుండడం లేదు. ఒకటే ఏడుపు.

మావారు లుంగీ కట్టుకుని వచ్చి బలవంతంగా కుర్చీలో కూచోపెట్టి, తనూ కుర్చీ లాక్కుని కూర్చుని “పిచ్చి అమ్మలు, డబ్బులని లెక్కలు చూసుకుంటే ప్రాణాలే పోతాయి కదా. ప్రతీది అలా డబ్బుతో లెక్కగట్టకు. దుబారాగా ఖర్చు చేసేటపుడు లెక్కలు వేసుకోవాలిగానీ తప్పని సరి అవసరంతో ఖర్చు పెట్టాల్సి వచ్చినపుడు వెనుకా ముందూ చూడొద్దు. ఆపరేషన్ చేయించుకో” అన్నారు.

సరే తప్పదుగా. అందులో నా ఆరోగ్య మాయెను. ఇతర్లదయితే ‘ఆ..డాక్టర్లు ఏదో చెప్తారు లెద్దూ. మనం పట్టించుకోవద్దు’ అని కొట్టిపారేసేదాన్నేమో. ‘స్వవిషయంలో ఎంతైనా ఖర్చు పెట్టుకోవాలి’ అని ఇంతకుముందే జ్ఞానోదయమైంది. ఒక్కసారే అరవై వేల దాకా ఖర్చు అనేసరికి మళ్లీ అజ్ఞానంలో పడిపోయి ఆలోచించా. అయితే ఇప్పుడు మళ్లొకసారి ‘గా…ట్టిగ’ జ్ఞానోదయమైంది.

“ఏవండీ, ఆపరేషన్ అంటే మరి వారం, పది రోజులు హాస్సటల్‌లో వుండాలి. ఒక నెల రోజులన్నా వండీ వార్చేవాళ్లు కావాలిగదా” అన్నాను.

“మీ అమ్మను పిలిపించు. పెద్దావిడ హాస్పిటల్‌లో వుంటది. వంట సంగతి నేను చూసుకుంటాలే” అన్నారు.

మా వారు వంట చేసి ఆఫీసుకెళ్ళడం కష్టమే. కానీ ఏం చేస్తాం? మా అత్తామామలు పెళ్లినాటికే చనిపోయారు. ఆడపడచు, ఇద్దరు మరుదులు వున్నప్పటికీ ఎవరి కాపురాలు వారివే. అందులో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుని బ్రతుకుతరాయె. అదీగాక వాళ్ళు సిటీలో కూడా లేరు, వాళ్ళొచ్చి అన్ని రోజులు హాస్పిటల్‌లో వుంటారా? నిజం చెప్పొద్దూ అడిగితే మా ఆడపడుచు తప్పక వస్తది. కానీ, ఏ మొఖం పెట్టుకు అడిగేది. డబ్బు లెక్కలు గట్టడం అలవాటైన తర్వాత వారిని మా ఇంటికి రాకుండా చేస్తిని. ఏదో… ఇప్పుడు ఈ అవసరం వచ్చిందిగానీ, లేకపోతే వారితో నాకేం పని. అమ్మో! మా ఆడపడుచును, మరుదులను ఇంటికి రానిస్తే ఇంకేమన్నా వుందా? ముఖ్యంగా మా ఆడపడుచు వస్తే మర్యాదలు చేయాలి. బట్టలనో, ఇంకోటనో ఖర్చు కావాల్సిందే. మా మరుదులకు ఏ అవసరం లేకపోతే ఎందుకొస్తారు? మా వారి దగ్గర డబ్బులో, లేదా ఇంకేదో సాయం అడగడానికి వస్తారు. మొత్తానికి సూటీపోటీ మాటలని, కించపరిచి రాకుండా చేయగలిగా. ‘వదిన ఇలా మారిపోయిందేమిటి?’ అని చెవులు కొరుక్కున్నారు, బుగ్గలు నొక్కుకున్నారు. కుంటే నాకేమిటట! మా వారికి తెలియ కుండానే ఇదంతా చేద్దామనుకున్నా. కుదర్లే. ‘కాలం కల్సొస్తే నడిచొచ్చే కొడుకు పుడ్తాడన్నట్టు’గా మొత్తానికి మా మరుదులను మావారే దూరంగా వుంచారు. అందుకు చాలా కష్టపడ్డాన్నేను. మా వారికి ఎన్నో చెప్పాల్సి వచ్చింది. సాక్ష్యం కూడా చూపాల్సి వచ్చింది. ఒకసారి మా వారికి టైఫాయిడ్ వచ్చి (నా అదృష్టం కొద్దీ) నెలరోజులు మంచాన పడ్డారు. మా మరుదులు, తోడికోడళ్లు కనీసం ఫోన్ కూడా చేయలేదు. (ఫోన్ చేసి, రాలేక పోతున్నందుకు బాధగా వుందనీ, ముఖ్యమంత్రి పర్యటనలు, ఇన్‌స్పెక్షన్ వున్నాయనీ నాతో చెప్పి, మా వారి ఆరోగ్య వివరాలు కనుక్కున్నారు. నేను ఇవేవీ మావారికి చెప్పలేదు. మీరూ చెప్పకండి.) ఇదే అదునుగా “చూసారా? మీరు ఎంత చేసారు వాళ్ళకోసం. అయినా విశ్వాసం లేదు” అనీ, “మనం సంపాయించుకుంటుంటే ఓర్వలేక పోతున్నారనీ” “డబ్బులు ఖర్చవుతాయనే మిమ్మల్ని చూడ్డానికి రాలేదనీ” చాలా చెప్పాను. నిజంగా వాళ్ళు వచ్చి చూడాలనుకుంటే నెల రోజుల్లో ఒక్క రోజు టైమ్ దొరకలేదా? ఏ కారణాలవల్లనైన గానీయండీ వాళ్లు రాలేదు. నేను దాన్నే అవకాశంగా తీసుకున్నానుకోండి.

ఇక మా ఆడపడుచును దూరం చేయడానికి చాలా కాలం పట్టింది. ఆమె ఓ పట్టాన ఎవరినీ మాటలనదు. గుంభనంగా వుంటది. ఆమెను చూస్తేనే నా మనసు రగిలి పోయేది. (ఇంతకు ముందు ఆమంటే చాలా అభిమానంగా వుండేదాన్ని.) మావారికి చెల్లెలి మీద ఎనలేని ప్రేమ. “అన్నయ్య తనకు నచ్చినవారికి డబ్బులు వెదజల్లుతాడు. డబ్బుల విషయంలో అన్నయ్యను కంట్రోల్‌లో వుంచకపోతే కష్టం” అని మా మరిది (అంటే ఆవిడ తమ్ముడి)తో అన్నదట. మా తోటికోడలు ఫోన్ చేసి (ఇంటికి రాకపోకలు లేకపోయినా ఫోన్‌లో మాత్రం వాళ్లు చేస్తేనే మాట్లాడుతా) నా చెవిన వేసింది.

ఇక చూడండి మా వారికి ఈ మాటలు మంచిగా పురి పేన్చి ఎక్కించాను. మనిషి మొదట నమ్మలేదు. తర్వాత నెమ్మదిగా మెత్తబడ్డారు. ఇక అది అదునుగా చూసుకుని “ఆవిడ మాత్రం మీకు నచ్చిన మనిషి కాదా? ఆవిడకు కూడా మీరు అప్పుడప్పుడు సాయం చేస్తూనే వున్నారు కదా” అంటూ మొత్తానికి మావారికి చెల్లెలుపట్ల విరక్తి కలిగేటట్లు చేయగలిగా. నిజంగానే మావారు నచ్చిన వారికి డబ్బు వెదజల్లుతారు. అందువల్ల నేను కూడా ఎంతో క్షోభకు గురవుతున్నాను. మా ఆడపడుచును దూరం చేయాలనుకున్నాను కాబట్టి అవే మాటలు మావారికి చెప్పా. ఆవిడ పేరు ఎత్తితేనే ‘కృతఘ్నురాలు’ అని మండి పడతారు. మొత్తానికి మావారి తరఫున వారందరికీ దూరం వుంచేసా.

ఇక మా పుట్టింటివారితో సత్సంబంధాలు కొనసాగించాలని చూసా. వాళ్లు మా కంటే కూడా ఆస్తిపరులు. ఆడపడుచును కాబట్టి అంతో ఇంతో గుంజవచ్చని అనుకున్నా. మా వదిన, మరదలు తెలివి తక్కువ వాళ్లా? నాకంటే ఈ మధ్య ఇలాంటి డబ్బులెక్కల పిచ్చి పట్టింది గానీ వారికి ముందు నుండే వుంది. ఏనాడూ వాళ్లు నన్ను తీసుకుపోయిందీ లేదు. పట్టుమని పది రూపాయల జాకెట్ (అరవై రూపాయలైతేగానీ జాకెట్ రాదనుకోండి. మాటవరుసకు చెబుతున్నా) పెట్టిందీ లేదు. అందుకనీ వాళ్లు హాస్పిటల్‌కి రారు.

ఇక నా కూతురికి చిన్నప్పటి నుండే లెక్కలు గట్టడం అలవాటు. దాన్ని రమ్మంటే గనుక – వారం రోజులపాటు నాతో పాటూ హాస్పిటల్‌లో వుంటే, ఆ వారం రోజులకి తను ఎంత నష్టపోతదో మొఖం మీదే అనేస్తది. కనీసం బాధపడ్తారని కూడా ఆలోచించదు. నేను చాలా నయం. పైకి ఎప్పుడో గానీ అనను, మనసులో మాత్రం తప్పక లెక్కలు వేసుకుంటా. నేను ఇంతకుముందు ఇలా డబ్బులెక్కలు గట్టేదాన్ని కాదు. ఆ ‘పిచ్చి’ ఎప్పటినుంచి మొదలైందో తప్పక మీతో చెప్పుకోవాలి.

సిటీకి ఏవేవో పనుల మీద వచ్చిన వాళ్లందరూ మా ఇంట్లోనే దిగేవాళ్లు. విసుక్కోకుండా వారికి వండి పెట్టేదాన్ని. వాళ్లు వచ్చినందుకు చాలా సంతోషంగా కూడా వుండేది. పాపను హాస్టల్‌లో వుంచి చదివించాము. నేనూ, మావారే కదా వుండేది. చుట్టాలొస్తే అదో సందడిగా వుండి నా మనసు ఉల్లాసంగా అనిపించేది. అమ్మాయిది కంప్యూటర్ కోర్స్ పూర్తయ్యి, దాన్ని ఓ అయ్య (డాక్టరు) చేతిలో పెట్టేసరికి కట్నం, చేతి ఖర్చులు, పెళ్లి ఖర్చులకు మొత్తం పది లక్షల దాకా ఖర్చయింది. ఉన్నది ఒక్కతే అమ్మాయి అని ఘనంగానే పెళ్లి చేసాము. దాని పెళ్లయి మూడు సంవత్సరాలు దాటిందనుకోండి.

వెనక్కు చూసుకుంటే నేనూ, మావారు, వారి ఉద్యోగం, ఇల్లూ (15 లక్షల దాకా ధర పలుకుతదంటారు), ఇంట్లో సామానూ మిగిలాయి. నాకళ్ల ముందర సంసారాలు పెట్టినవాళ్లు ఎంతేసి ఆస్తులు సంపాదిస్తున్నారు!? మేమే ఏమీ కూడబెట్టుకోలేక పోయాం. కనీసం మా వెనక ఇంత డబ్బు సంపాదించుకోలేక పోయామే అని ఎంతో దిగులుపడ్డాను. ఈ స్పృహ ముందే వుండి వుంటే మా మరుదులకు, ఆడపడుచుకు కాణీ పైసా ఖర్చు చేయనిచ్చేదాన్ని కాను, బంధువులను దరిచేరనిచ్చేదాన్నీ కాను. ఎంతో కొంత వెనకేసుకునేదాన్ని. ఫ్లాట్లన్నా కొనిపడేసేదాన్ని. అప్పుడు రేట్లు కూడా చాలా తక్కువ. ఇప్పుడు ప్లాట్ల ఆలోచనే మానుకోవాలి. అప్పుడే ఇంత తెలిసి ఛస్తే ఇప్పుడు ఈ పాట్లెందుకు. నా చుట్టూ వున్న వాళ్లను చూసి కదా నాకు తెలిసి వచ్చింది. నేనూ సంపాదన రేస్‌లోకి అడుగుపెట్టా.

మొదట ఇంట్లో పొదుపు చేయటం ఆరంభించా. ఎంత పొదుపు చేసినా రెండువేల రూపాయలకు మించి ఆదా చేయలేక పోయినా, నేను అంతగా గమనించలేదుగానీ పది, పదిహేనేండ్ల కిందికీ, ఇప్పటికీ నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగి పోయాయి. బస్ ఛార్జీల రేట్లు కూడా పెరిగిపోతుండబట్టే. పెట్రోలు, డీజిల్ రేట్లతోపాటు అన్నిటి ధరలు ఆకాశాన్నంటు తుండబట్టె. ఈ సిటీలో ఇంట్లోంచి కాలు బయటపెడితే ఖర్చే.

ఈ మూడూ, మూడున్నర సంవత్సరాల నుండే నాకు ఈ డబ్బులు లెక్కలు గట్టడం పిచ్చి పట్టిందనుకుంటా (ముందే చెప్పినట్టు ఖచ్చితంగా చెప్పలేను) నిజంగా పిచ్చే నంటారా? నాకు ఒకోసారి చాలా బాధగా వుంటది- ఈ పిచ్చి అంటుకున్న దగ్గర్నుంచి మనశ్శాంతి కరువైందని,

ఇంటికి ఎవరైనా వచ్చారంటే గుండెదడ. ఒక పూట వుంటారో, ఒక రోజు వుంటారో, రెండు రోజులుంటారో! ఒక పూటకైతే ఇంత ఖర్చు, ఒక రోజుకైతే ఇంత, రెండు రోజులకైతే ఇంత. పూట పూటకీ నా మనశ్శాంతి ఇంకా ఇంకా తగ్గిపోతది. ముందే చెప్పానుగా – నా కూతురిలా మొహం మీద అనలేను, మనసులోనే లెక్కలు వేసుకుంటానని, అయితే నా మనసులోని బాధనంతా మా వారికి చెప్తుంటా- డబ్బు ఖర్చు గురించి. అసలు ఆయన ఎప్పుడూ డబ్బు లెక్కల గురించి నన్ను ఇంతవరకూ అడగలేదు. బీరువాలో జీతం డబ్బులు పెట్టేస్తారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తీసి ఖర్చుపెట్టుకునేవాళ్లం.

నా లెక్కలు వినీ వినీ “ఇలా అయితే మనుషుల మధ్య ప్రేమాభిమానాలే ఉండవ్. డబ్బు సంబంధాలే ఉంటాయి.” అని చాలాసార్లు చాలా రకాలుగా చెప్పారు. ఆయన చెప్పినపుడు ‘నిజమే’ అనిపిస్తుంది. ‘నాకెందుకీ పిచ్చి పట్టింది? ఎలా పట్టింది? దీన్ని వదిలించుకోవాలి’ అనుకుంటాను. మావారితో కూడా అదే చెప్తాను. అతని గుండెల్లో తలపెట్టుకుని ‘ఈయన దొరకడం నా అదృష్టం’ అనుకుంటాను. తెల్లారి మామూలే.

మా వారిని కూడా నా ‘దారి’లోకి తేవాలని ప్రయత్నించాను. ఒక రోజు “ఏవండీ, రేపటి నుండి డైటింగ్‌ మొదలు పెడ్దాం” అని కాసేపు ఆగాను, మా వారు ఏమన్నా అంటారేమోనని. ఆయన ఏమీ మాట్లాడలేదు. అయితే, నేను మావారి మొఖంలోకి చూడలేదు. గమ్మున వుండేసరికి నా ప్లాన్ చెప్పడం మొదలుపెట్టాను. “పొద్దున టీ మాత్రమే. మధ్యాహ్నం లంచ్, రాత్రికి రెండు చపాతీలు, ఉదయానికి సాయంత్రానికి కలిపి ఒకటే కూర, పాలు కూడా పావు లీటరు తీసుకుందాం. లీటరు పాలెందుకూ ఇద్దరికి?” నేను చెప్పాల్సిన లిస్టంతా చెప్పాక, అన్నీ, వినీ నింపాదిగా “ఆ డైటింగేదో నువ్వే చెయ్యి” అన్నారు. “అదేంటి ఇద్దరమూ చేస్తే బాగుంటుంది” అన్నాను. “తిండిలో కూడా డబ్బులు మిగుల్చుదామా? ఆరోగ్యం పాడైతే ఇంతకు రెండింతలు డాక్లర్లకు తగలెయ్యాల్సి వస్తదీ, ఆరోగ్యమూ పాడైతది” అని సీరియస్ గానే అన్నారు. నా అహం దెబ్బతిన్న దనుకోండి.

“నేను డబ్బు ఊసెత్తానా? ఆరోగ్యానికి మంచిదనే డైటింగ్‌ చేద్దామన్నాను.”

“మంచిది. నన్ను ఇబ్బంది పెట్టకు. నేను ఎప్పటిలాగానే తింటాను” అన్నారు.

ఇక నేనేమీ మాట్లాడలేదు. మాట్లాడ్డానికి అవకాశం ఇచ్చి ఛస్తేనా. నా డైటింగ్‌ మాత్రం మావారి మీది కోపంతో ఓ నెల రోజులు పాటించా (అతి కష్టం మీద). ఆయనకు టిఫిన్‌లోకి దోసె వేస్తే తినాలనిపించేది. బంగినపళ్లి మామిడి పళ్లు కోసుకుని టి.వీ. చూస్తా తినేవారు. ‘టేబుల్ మీదే వుంటాయి. తినొచ్చు. ఆయనొచ్చి చూస్తారా ఏమన్నానా? పాపం! చూసినా ఏమనరు. నాకే అహం అడ్డొచ్చి తినేదాన్ని కాదు. నెల రోజులకు నీరసం ముంచుకొచ్చింది. ఇంట్లో పనికే అలసిపోయేదాన్ని. ఇదంతా చూసి ఇక మా వారే “చూడు విజయ, ఎలా తయారవు తున్నావు. ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? నిన్ను శాసించే వాళ్లెవరున్నారు? డైటింగ్‌ చేయడానికి నువ్వేమన్నా లావున్నావా? అనవసర పంతాలకు పోకు’ అని చెప్పారు. దెబ్బకు నా కళ్లమ్మట ఒకటే నీళ్లు. “అయ్యో! పిచ్చిదానా ఏడ్వకు. మంచిగా భోంచేయి. మనకు ఏం బాధ్యతలున్నాయి చెప్పు” అంటూ ఓదార్చారు.

ఒక రోజు మావారి క్లోజ్ ఫ్రెండ్ వచ్చారు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు వచ్చారు. సిటీకి ఏ పని మీద వచ్చినా మా ఇంట్లోనే దిగేవారు. మా అమ్మాయి పెళ్లి సంబంధం కుదిర్చింది అతనే. పెళ్లి పనులు కూడా దగ్గరుండి చూసుకున్నారు. నాలాగా లెక్కలు కట్టి చూసుకుంటే అతనివి బస్ కిరాయిలు, సెలవులు ఎన్నో ఖర్చయ్యాయి. నాకు ఈ ‘పిచ్చి’ పట్టింది కదా. అతను రెండ్రోజులున్నారు. ఇంకా ఒకటి, రెండు రోజులుండేవారేమో. పని మీద బయటకు వెళ్లాడతను. మా వారు ఆఫీసు నుండి వచ్చారు. “ఏవండీ, అన్నయ్యగారు ఎన్ని రోజులు తిష్ట వేస్తారట. రెండు పూటలా తిండీ, టీ, టిఫిన్లూ పుణ్యానికి వచ్చాయటనా. ఏ లాడ్జిలో అయినా దిగొచ్చుగా” వంటింట్లో టీ పెడుతూ అంటున్నాను. అతను ఎప్పుడు వచ్చారో తెలియదు. మావారికి కప్పులో టీ పోసుకుని తెచ్చేసరికి మావారూ, అతనూ నిలబడి వున్నారు.

అతను వెంటనే లుంగీ, బనియను, హాంగరుకు తగిలించిన ప్యాంటు, షర్టు సూట్‌కేసులో సర్దుకోవడం మొదలుపెట్టారు. మావారు అతని వెనకాలే వెళ్లి “విజయ సంగతి నీకు తెలియదారా? ఈ మధ్య దానికి డబ్బు పిచ్చి పట్టింది. ఏమనుకోకు. నీ పని అయ్యేంతవరకు ఇక్కడే వుండు. ఎంత చేసినా నీ రుణం తీర్చుకోలేం” అంటూ మావారు ప్రాధేయపడుతున్నారు.

అతను మాత్రం “నేనొచ్చిన పని అయిపొయిందిరా. సర్దుకుని పోదామనే వచ్చాను. చెల్లె ఏమన్న పరాయిదా? తను రెండన్నా నేను పడాల్సిందే, బాధపడకు” అంటూ మా వారినే ఊరడించి వెళ్తూ “వెళ్లొస్తాను విజయ” అన్నారు.

నేను ‘ఊ’ అని కూడా అనలేక పోయాననుకోండి. తల నేలవాలిపోయినట్టు అయింది.

“రోజు రోజుకు నీ పిచ్చి ముదురుతుంది. విచక్షణ అనేది మర్చిపోతున్నావు. కృతఘ్నురాలా. అతను మనకు ఎంత సాయం చేసాడు! ప్రతిఫలాన్ని ఆశించి, డబ్బు లెక్కలు చూసి చేసాడా?” అని చెడామడా తిట్టారు.

“అయినా పని అయిపోయే పోతున్నానంటున్నారుగా” అని నన్ను నేను సమర్దించుకో జూసాను. మా వారి కోపం నశాలానికి ఎక్కిందనుకోండి.

“నీలో కౄరత్వం పెరిగిపోతోంది. కనీసం నీవన్న మాటలు అతను విన్నాడనైనా సిగ్గుగా అన్పించడం లేదా? మనం బాధపడొద్దని మాటవరుసకు పనయిపోయి పోతున్నానన్నాడు. ఆ మాత్రం అర్ధం కావడం లేదా? చచ్చినపుడు డబ్బులు నీ మీద వేసుకుని పోవు. ఇలాగే తయారైతే ఎవరూ నీ గడప తొక్కరు సరికదా నీతో మాట్లాడరు” అని మండిపడ్డారు.

“ఛ. అలా అనకుండా వుండాల్సింది” అన్పించింది. కానీ ఏం చేయను. నాకు తెలియకుండానే లెక్కలు వేయడం మొదలుపెడ్తానని బాధపడ్డాను. మావారి ముందర కూడా చెప్పుకున్నాను. ఇలాంటివి చాలా సార్లే చెప్పుకున్నాను కదా. ఇక నేను మారననుకున్నారో ఏమో, నాతో మాట్లాడ్డం మానేసారు వారం రోజుల దాకా. నా మట్టుకి నాకైతే ఆ తెల్లవారే అనుకున్నాను. ‘వింటే విన్నాడు. ఇప్పుడు అతనితో మాకేం పని? అతనొస్తే ఖర్చు తప్ప. రెండు రోజుల తిండి డబ్బులు మిగిలాయి,’ అని.

మా వారు మాట్లాడపోయినా ఒక రకంగా డబ్బు సంపాదించిన విజయం నాలో తొణికిసలాడిందనుకోండి. వాళ్లు సాయం చేసారూ, వీళ్లు సాయం చేసారూ అని కూచుంటే ఈ రోజుల్లో డబ్బు కూడెయ్యలేం. అవసరం వున్నంతసేపు వాడుకోవాలి. అవసరం తీరాక నువ్వెవరో తెలియనట్టు వుండాలి. కాదంటారా చెప్పండి.

“డబ్బూ డబ్బూ అని పడి ఛస్తున్నావుగా. ఏదన్నా బిజినెస్ చేయరాదు” అన్నారు మావారు ఓ రోజు. “ఏం బిజినెస్సూ!? వాటి మెలకువలు నాకేమన్నా తెలుసా? ఏ బిజినెస్ చేసినా మోసం చేసే తెలివి, కనీసం మాటకారి తనమన్నా వుండాలి. అవేవీ నాకు తెలియవు” అన్నాను. “అది కూడా నిజమేలే. నష్టపోతే గుండె ఆగి ఛస్తావు” అన్నారు అక్కసుతో. ఇలా మా మధ్య కీచులాటలు కూడా మొదలయినవి. ఏనాడూ మేము ఒకరినొకరం మాట అనుకున్నవాళ్లం కాదు.

బంధువుల ఇళ్లకు వెళ్లడం కూడా మానుకున్న ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా బస్ కిరాయిలు, ప్రజెంటేషన్లు. అమ్మో! ఎంత ఖర్చు? ఒక వేళ తప్పనిసరై వెళ్లినా ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాను, ఎన్ని రోజులుండాలి అని లెక్కలు వేసుకుంటాను. ఒకసారి అలాగే లెక్క పెట్టుకుని మా పెద్దమ్మ కొడుకు యొక్క కూతురి పెళ్లికి వెళ్లా -కనీసం పది రోజులైనా వుండివద్దామని.

ఇప్పుడు పల్లెటూర్లలో కూడా ఒక్కరోజుతో పెళ్లి చేసేసి ఎవరిళ్లకు వాళ్లు వెళుతున్నారు. నేను నాలుగు రోజులుండేసరికి మా వదిన విసుక్కోవడం మొదలెట్టింది. అయినా నేనేమీ పట్టించుకోలేదనుకోండి. ఆరో రోజున మా వదిన అడగనే అడిగింది. “ఏమ్మా విజయా! అన్నయ్య ఒక్కడూ వండుకుని తినడం కష్టం కాదా?” అని. “ఫర్వాలేదొదినా. వండుకుంటారు, మళ్లీ మళ్లీ వస్తానా యేం” అన్నాను. అలా అంత తెలివిగా అన్నందుకు నన్ను నేను అభినందించు కున్నాననుకోండి. గడుసుతనం కూడా అబ్బుతుందని మురిసిపోయా. అప్పుడు ఏమన్లేదు మా వదిన. తెల్లారి ఉదయం టిఫిన్ పెట్టింది. తింటూ వుండగా “పందికొక్కుల్లాగా ఇంటిమీద పడి మేస్తుంటే, మాకేమన్నా గాదెలు నిండి వున్నాయా” అని కావాలనే, నేను వినాలనే పక్కింటావిడతో అన్నది. ఇక అంతే. నాకు ఉండబుద్ధి కాలేదు. వెంటనే రైలెక్కేసా. ఇంతకు ముందు సెకండ్ క్లాస్‌లో వెళ్లేదాన్ని. ఇప్పుడు జనరల్ బోగీలో ఎక్కా. ఒకటే రద్దీ, గొడవ. ఇల్లు చేరేసరికి రాత్రి పదిన్నర అవుతుంది. మావారికి అప్పుడే కునుకు పట్టినట్టుంది. కళ్లు రెపరెపలాడిస్తూ తలుపు తీసారు.

“ఏంటీ, ఇంకా మూడు రోజులుందిగా నీ బాకీ తీరడానికి” అన్నారు.

“నేనేమన్నా ఇన్ని రోజులుండాలని లెక్కలు గట్టుకుని వెళ్లానా? పెళ్ల్లయిపోయింది. నాకే విసుగనిపించింది వచ్చేసా” అంటూ మా వారి మీద విరుచుకుపడ్డా. అందులో జనరల్ బోగి మంట కూడా వుందనుకోండి. మా వారు చాలా నింపాదిగా “నువ్వేగా పది రోజులు వుండి వస్తానని వెళ్లావ్” అన్నారు. అంటే, అన్ని లెక్కలు సరిచూసుకునే అలా చెప్పాననేది మా వారికి అర్ధమైంది. ఎందుకు అర్ధం కాదూ… ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్నాంగా, నాకైతే కడుపు మండింది. “వచ్చీరాగానే ఏమిటీ మీ సాధింపు? ఎలా వున్నావు? ఏమన్నా తిన్నావా? అని పలకరింపులేవీ లేవు. అన్నీ లెక్కలు అడగడం” అంటుండగా ఏడుపూ, తారాజువ్వల్లా కోపం ఎగిసిపడ్డాయి. కుర్చీలో కూలబడ్డా.

మావారికి ఇంతకు ముందు వున్నట్లుగా నా పట్ల గౌరవం, అభిమానం తగ్గి ఆ స్థానంలో వ్యంగ్యమూ, చులకన భావమూ ఏర్పడ్డాయి. అది నాకు అర్ధమవుతూనే వుంది. తను అలా గుమ్మం దగ్గరే నిలదీసి అడగడం సరికాదనుకున్నారు కాబోలు. మౌనంగా వంటింట్లోకి వెళ్లి స్నానానికి వేడి నీళ్లు పెట్టారు. నీళ్లు కాగగానే బకెట్‌లో పోసి “విజయా! పద స్నానానికి” అంటూ బట్టలు తెచ్చిచ్చారు. స్నానానికి వెళ్లి వచ్చేలోగా అన్నం వండారు. పెరుగూ, పచ్చడి వేసుకుని అన్నం తిన్నా. పొద్దుటి నుండీ ఏమీ తిన్లేదుగా. కడుపులో ఎలుకలు పరిగెత్తాయనుకోండి.

ఈ రోజు మా వదిన అన్నదని నేను బాధపడుతున్నాను. కాకపోతే ఈవిడ మొరటుగా అన్నది. మరి నేను ఆ రోజు మావారి ఫ్రెండ్‌ను అన్నది కూడా ఇదే కదా. పైగా అతను మాకు ఎంతో సాయం చేసారు కూడా. అతనెంత బాధపడి వుంటారో! నేను ఇంతకు ముందులా మాములుగా వుంటే బాగుండు అన్పించింది. నా మనసులో చెలరేగే ఈ బాధనంతా మావారి గుండెల్లో తలపెట్టుకుని ఏడ్చి తీర్చుకోవాలనిపించింది. ఎందుకు నన్నీ దెయ్యం ఆవహించిందో!!!? ఆయన ఏదో ఆలోచిస్తూ మౌనంగా పడుకున్నారు. నా ఆలోచనలతో నేనూ పడుకున్నాను. అదేం విచిత్రమో అప్పటికి బాధపడ్తాను. ఒక నిద్ర పట్టి లేచేసరికి మళ్లీ యధాప్రకారం నా లెక్కలు లెక్కలే.

డబ్బు మీద యావ పెరిగినప్పటి నుంచి బీదవాళ్లంటే ఏహ్యభావమూ, డబ్బున్నవారి పట్ల గౌరవభావమూ ఏర్పడసాగాయి నాలో. ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకావిడ సూపర్ మార్కెట్‌లో కన్పించింది. గుర్తు పట్టి నేనే పలకరించా. అబ్బో! ఎన్ని నగలో!? ఎంత ఖరీదైన చీరో!! పలకరింపులూ అవీ అయిపోయాక మా ఇంటికి రండి అని మరీ మరీ చెప్పా. అంతగా చెప్పినా, ఆవిడ రాలేదు. ఓ రోజు మా ఇంటికి దగ్గర్లోనే వున్న గుడికి వచ్చిందావిడ. అదే రోజు నేనూ వెళ్లాను. పట్టుపట్టి మరీ తీసుకొచ్చా. అప్పటికప్పుడు బేకరీ నుంచి పిజ్జా (మావారితో) తెప్పించి పెట్టా. కూల్ డ్రింక్స్‌ తెప్పించా. ఆమె వద్దన్నా వినిపించుకోలేదు. మా వారు ఆ రోజంతా అసహ్యంగా చూసారు నన్ను. దెప్పి పొడుపుగా “ఎన్ని డబ్బులు ఖర్చయ్యాయేమిటి?” అన్నారు. “అన్నీ లెక్కలు గడతారా” అని ఎదురు ప్రశ్నించా. మనసులో మాత్రం రెండు వందలదాకా ఖర్చయిందని లెక్క వేసుకున్నా. పోతే పోనిద్దూ, అంత డబ్బున్నావిడ మనింటికి వచ్చింది. అదే పదివేలు అనుకున్నాను. పిల్లికి కూడా బిక్షం పెట్టడం మానేసిన నేను, లాభనష్టాలు బేరీజు వేసుకునే నేను ఈవిడ నాకు ఏమి చేసిందని అంత ఖర్చు పెట్టానో, అభిమానం చూపానో నాకు సరిగా అర్ధం కాదు. ఒకోసారి అంతా ఆ డబ్బు మహిమ అన్పిస్తది. అయితే ఆ రోజు మా వారు చూసిన చూపును ఇప్పటికీ మర్చిపోలేదు. బహుశా ఎప్పటికీ మర్చిపోను. అంత ఈసడింపుగా చూసారు మరి.

ఇంతకు ముందు జాకెట్లు చిరుగు పట్టగానే పక్కకు పెట్టేదాన్ని. ఇప్పుడు చేతుల కింద చిరిగిపోయినా తొడుక్కుంటున్నాను. మా వారు ఎంత చిరాకుపడ్డారో? “ఎందుకిలా తయారవుతున్నావు” అని తలపట్టుకున్నారు. ఆయన బాధ చూడలేక చిరిగిన జాకెట్లు వేసుకోవడంలేదు గానీ, నాకు బాధగా వుంది – ఇంకా ఐదారు నెలలైనా తొడిగేదాన్ని. ఓ జాకెట్ డబ్బులు మిగిలేవి అని.

ఇలా పైసా పైసా నేను ముడి పెడుతుంటే ఇప్పుడీ ఆపరేషన్‌తో ఖర్చయిపోయాయి. మావారు అన్ని లెక్కలూ చెప్పలేదుగానీ డెభ్భై వేల వరకూ ఖర్చయినట్టుంది. ఈ ఖర్చులన్నీ ఇలా అయిపోయాయా! మా అమ్మ నా ఆపరేషన్ కోసమని వచ్చిన మనిషి రెండు నెలలైనా పోతాననడం లేదు. అన్నయ్య కొత్తగూడెంలో వుంటారు. అక్కడ ఎండలకు భరించలేనని, ఈ ఎండాకాలం అయిపోయిన తర్వాత పోతానని అంటుంది. ఇంకేమైనా వుందా!? ఇంకా రెండు నెలలన్నమాట? నా గుండెలు గుబగుబలాడాయి. అది చెప్పీ, ఇది చెప్పీ మా అమ్మను మా తమ్ముడి దగ్గరికి పంపా. వాడూ ఇక్కడే సిటీలో వుంటాడుగా. పది రోజులుంచుకుని వాళ్లకు ఆస్తులు సంపాదించి పెట్టలేదని నానా మాటలూ అన్నారట. ఆ మాటలు పడుతూ పడి వుండలేనని మళ్లీ నా దగ్గరికే వచ్చింది. కొత్తగూడెంలో మా వదిన కూడా మా అమ్మను చాలా ఇబ్బంది పెడదతి. అన్నయ్య ముందరేమో మంచిగా వుంటది మా వదిన అమ్మతో.

అందుకే మా అమ్మ ఇక్కడ వుంటానంటుంది. నిజంగానే ఎండలు కూడా ఒక కారణం అనుకోండి. ఇప్పుడీ ఎండలని వుంచుకుంటే అదే అలుసుగా ఎప్పటికీ ఇక్కడే వుంటానంటే?? రాత్రంతా ఆలోచించి ‘వీల్లేదు’ అనుకున్నా. మా అమ్మతో పొద్దుటే – “అమ్మా! నువ్వు చూస్తున్నావ్‌గా. నీ కొడుకుల్లాగా నేను డబ్బులు సంపాదించు కోలేదు. ఒక మనిషి వుండటం అంటే మాటలా? తిండి ఒక్కటే కాదు గదా! స్నానాలకు, బట్టలకు సబ్బులు, షాంపులూనా? తలకు నూనెలా. రోగం రొష్టూ వస్తే నీ కొడుకులా అస్సలు పట్టించుకోరు. ఆ ఖర్చు నేను భరించలేను” అని మొఖం మీదే చెప్పా. చెప్తున్నంతసేపూ మా అమ్మ ఒకటే ఏడుపు. నాకు మనసులో బాధన్పిస్తున్నా అవన్నీ పట్టించుకుని కరిగిపోతే కుదరదు అనుకుని చెప్పాల్సినవన్నీ చెప్పా.

ఆ రోజు ఆదివారం కూడా. కూరగాయలకని వెళ్లినవారు మార్కెటంతా తిరిగీ, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పి తీరిగ్గా గానీ రారు మా వారు. వెంటనే వచ్చినట్టున్నారు. మా అమ్మతో నేను అన్న మాటలన్నీ విన్నారనుకుంటా లేదా కొన్నే విన్నారోగానీ విసా విసా వచ్చారు. కూరగాయల సంచీని కుర్చీలో పడేసారు. తను ఇంకో కుర్చీలో కూచున్నారు. కోపాన్ని చాలా నిభాయించుకుంటున్నారు కాబోలు, ఆయన మొఖం చూస్తే అలా అన్పించింది.

“నీ వల్ల నాకు ఏ లాభం వుందని నిన్ను పోషించాలి?” ఒక్కొక్క పదాన్ని ఒత్తి పలుకుతూ ఒక్కసారిగా అన్నారు.

“లాభనష్టాలు బేరీజు వేసుకున్నా మొగుడూపెళ్లాలు కాపురం చేస్తారు” అన్నాను ఉక్రోశంతో అస్సలు ఎటూ తోచకపోతేనూ. ఆయన అలా అంటారని నేను ఊహించలేదు. “మీకు వండి పెడుతున్నాను. పక్కలో పడుకుంటున్నాను” అని చెప్పాలని నోటివరకూ వచ్చి ఆగిపోయా. అలా లెక్కగడితే ఎంత యాంత్రికమైన, కృత్రిమమైన సంబంధం? అలా అనడానికి నాకే సిగ్గనిపించింది.

“తల్లులు కూడా అంతే. అన్నీ లెక్కలు చూసుకుని పిల్లలను కని, పెంచి పోషించరు. నిన్ను పెంచి, పెద్దచేసి, చదువు చెప్పించినందుకు, పెళ్లిచేసినందుకు మీ అమ్మకు లెక్కలు కట్టి డబ్బులివ్వు. ఆ… ఇవ్వూ. పెద్దావిడ చేతగాకపోయినా హాస్పిటల్‌లో ఎంతసేవ చేసింది నీకు. ఈ వయసులో కూడా కూతురని తనకు కష్టమైనా ఇష్టంగా సేవ చేసిందే. ఎవరొచ్చారు నువ్వు హాస్పిటల్‌లో వుంటే? అందరూ డబ్బుల లెక్కలేగా. ముసలావిడ మాత్రం ఎందుకు రావాలి నీ దగ్గరకు? నీ కన్నతల్లిని నాలుగు రోజులుంచుకోవడానికి లెక్కలు గడుతున్నావా? లెక్కలు. ఎప్పటికీ ఇక్కడే వుంటే మాత్రం నష్టమేముందీ? అందరూ లెక్కలు గడుతున్నారు కాబట్టే కనీసమైన మానవ సంబంధాలు లేకుండా పోతున్నాయ్. నీలాగా లెక్కలు గట్టి నేను కూడా నిన్ను పొమ్మంటే!?…. మనుషుల మధ్య ప్రేమలూ, అభిమానాలు వుండవా? అవి లేకపోతే జంతువులకన్నా హీనం మనిషి బతుకు” అని కోపాన్ని నిగ్రహించుకుంటూ “ఇప్పటికైనా మనిషిలాగా బతకడం నేర్చుకో” అని లేచి వెళ్లారు.

అవాక్కయి కుర్చీలో కూలబడ్డా. మా అమ్మ బట్టలు సర్దుకుంటుంటే “మీరు ఎక్కడికీ వెళ్లకండి. మీ అమ్మాయి ఇంతకు ముందు ఇలా లేదు. అమాయకురాలు. అది మీకు తెలుసు. దానికి కొంతకాలంగా ఈ దెయ్యం పట్టింది” అనేసి చెప్పులు వేసుకుని బయటకు వెళ్లారు.

కన్నతల్లికి పట్టెడన్నం పెట్టడానికి కూడా లెక్కలు గట్టే తత్వం, రాక్షసత్వం ఎలా చోటు చేసుకుంది నాలో? ఎందుకిలా తయారయ్యాను? తయారవుతున్నాను. నాకున్న ఈ ఇల్లు, ఇపుడు వస్తున్న ఈ డబ్బులు సరిపోవా? సరిపోతాయే! ఇంకా ఏమి ఆశించి ఈ ‘పిచ్చి’ పట్టింది? ఉన్నదానితో తృప్తిలేకనా, ఇంకా సంపాదించాలనే దురాశనా? అసలు సమాజంలోనే చాలా మంది ఇలా తయారయినారే. తయారవుతున్నారే. పొద్దున లేస్తే మీ ఇంట్లో ఏ వస్తువులున్నాయి. మా ఇంట్లో ఏమీ లేవు. ఇంకా ఏమి కొనుక్కోవాలి? మార్కెట్లోకి కొత్తవి ఏమి వస్తున్నాయి? కొనుక్కోవాలంటే డబ్బులు ఎలా కూడబెట్టాలి? అన్నీ సమకూర్చుకున్నాక ఇంకా సంపాదించుకోవాలి. ఎవరికీ నా నుండి కాణీ పైసా ఖర్చు పెట్టను, ఇతర్ల నుండి తీసుకుందాం – ఎవరిదీ మనస్తత్వం? ఏ సమాజంలోదీ తీరు? వస్తువుల ఉత్పత్తి, యాంత్రీకరణతో పాటు మనషుల మధ్య కూడా ఈ యాంత్రీకరణ ఏర్పడిందా? ‘ఎంత లాభం? ఎంత నష్టం? ఎంత మిగులు?’ ఇవేనా మనుషుల మధ్య సంబంధాలు? ఆనాడు మా అమ్మ నాగలి పట్టీ, దుక్కి దున్నీ ఎంత కష్టపడి మమ్మల్ని సాకిందీ? మమ్మల్ని చదివించిందీ!? ఈనాడు ఇలా తయారవు తామని తెలిస్తే, తనూ యంత్రంలాగా మారితే డబ్బులన్నీ కూడబెట్టుకునేదేమో. ఈ రోజున కాలు మీద కాలు వేసుకుని బ్రతికేదే కదా! చుట్టూ వున్నవాళ్లు లెక్కల బేరీజుతో మానవ సంబంధాలు కొనసాగిస్తే మాత్రం, నేను కూడా ఇలా తయారయ్యానెందుకు? బట్టల సంచీ చేతబట్టుకుని చెప్పులేసుకుంటూ “పొయ్యొస్త బిడ్డ” వస్తున్న ఎక్కిళ్లను ఆపుకుంటూ అమ్మ అనేంతవరకూ నేను గమనించనేలేదు. ఒక్కసారిగా వెళ్లి అమ్మ చేతిలో బ్యాగు లాక్కొని “అమ్మా! చిన్నప్పుడు తప్పు చేస్తే నన్ను కొట్టలేదా – తప్పు బిడ్డ అట్ల చెయ్యొద్దని, ఇప్పుడెందుకమ్మా ఏడ్చుకుంట పోతున్నవ్” అన్నాను. నాకూ ఏడుపు ఆగట్లేదు. “బిడ్డా! ఆనాడు మీరు చిన్న పిల్లలు. నా మీద ఆధారపడ్డారు. ఈనాడు నా రెక్కలుడిగినయ్. మీ మీద ఆధారపడ్డ. ఎట్లంట బిడ్డ” అంది అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ.

మా అమ్మను అమాంతం కావలించు కుని భోరున ఏడ్చేశా. “ఊకో బిడ్డా, ఊకో. ఏమైందే యిజయా? ఎందుకు బిడ్డ అట్లేడుస్తవ్? ఇప్పుడేమన్నవనీ ఊకో బిడ్డా. ఊకో” అంటూ నన్నే ఊరడించింది.

అమ్మ దగ్గరే పడుకుని ఆ రోజు రాత్రి ఎన్నో రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను. ‘ఈ వస్తు, యాంత్రిక, లాభ నష్టాల ప్రపంచంలో నన్ను నేను కాపాడు కోవాలి’ అని గట్టిగా అనుకున్నాను.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.