మటుక్‌నాథ్‌లూ – మీడియా గమ్మత్తులూ

-సుధా అరోరా (అనువాదం: ఆర్. శాంతసుందరి)

కొన్నాళ్ళ క్రితం ప్రొఫెసర్ మటుక్‌నాథ్ చౌధరి ‘ప్రేమ’ అనే విషయంపై పాట్నాలో ఒక సెమినార్‌ని నిర్వహించాడు. సెమినార్ ముగిసాక శ్రీమతి ఆభా చౌధరి స్టేజెక్కి తన అభ్యంతరాన్ని తెలిపింది. తన భర్త ప్రేమ వ్యవహారాలన్నీ బట్టబయలు చేద్దామని ప్రయత్నించింది. కానీ ఒక్కరు కూడా నోరు విప్పలేదు. మీడియా గాని, వార్తా పత్రికలు గాని ఈ మాటల్ని తమ రిపోర్టులో చేర్చలేదు. ఆవిడ ఆరోపణలని ఎవరూ పెద్దగా పట్టించు కోలేదు. ఆ విషయం అంతటితో ముగిసి పోయింది.

చివరికి ఒకరోజు ఆ ఆభా చౌధరే నలుగురైదుగుర్ని వెంటపెట్టుకుని వెళ్ళి 53 ఏళ్ళ తన భర్తనీ 23 ఏళ్ళ అతని ప్రియురాలు జూలీనీ పట్టుకుని కెమెరా ముందుకు తీసుకొచ్చింది. మటుక్‌నాథ్ మొహాన మసిపూయటమే కాక జూలీ జుట్టుపట్టుకుని ఈడ్చి, పడేసి ఆభా తన బాధనీ, కోపాన్నీ వెళ్ళగక్కింది. ఈసారి ఆవిడ తీసుకున్న మార్గంలో బోలెడంత ఏక్షనుంది, సస్పెన్సూ, మెలోడ్రామా, రొమాన్సూ వున్నాయి. వెంటనే మీడియా రంగంలోకి దిగింది.

ప్రేమ అమ్ముడుపోగల వస్తువు. ప్రేమ అనే ఆలోచననీ, భావననీ బజా‌ర్‌లో అమ్మడానికి పెట్టచ్చు. ప్రతి టీవీ ఛానలూ పోటీపడి మరీ ఈ విషయాన్ని చూపించింది. బాగా మసాలా పట్టించి ప్రేక్షకులకి వినోదం కలిగించింది. ‘ఆజ్‌తక్’ ఈ వ్యవహారానికి మంచి రసవత్తరమైన శీర్షిక కూడా పెట్టింది- ‘ప్యార్ కియాతో డర్నా క్యా?’( ప్రేమించటానికి భయమెందుకు?)

ఈ వార్తని మీడియా వాళ్ళు ఏదో ప్రేక్షకులకి వినోదం కలిగించటం కోసం చూపిస్తున్న వార్తలాగా తేలిగ్గా తీసుకుంది. మీడియా దృష్టిలో వార్తలన్నీ తాత్కాలికంగా మనోవినోదం కలిగించేవే. అవి రెండు మూడు రోజుల్లో పాతబడిపోతాయని వాళ్ళ ఉద్దేశం. ఈ వార్తకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలన్నిట్నీ పక్కకి పెట్టారు. మీడియాకి ఎటువంటి సామాజిక, కుటుంబ, ఆర్థిక విషయాలతోనూ సంబంధం వున్నట్టు కనబడదు. మనో వినోదం కలిగించటం మాత్రమే తన పని అనుకుంటుంది.

వార్తల్ని అమ్మేవాళ్ళు ఒక ప్రేక్షక వర్గాన్ని కూడా తయారుచేసుకున్నారు. ఈ వర్గానికి చెందినవారు ఇటువంటి వార్తల్ని వేళాకోళంగా తీసుకుంటారు. ఇంకొక సంచలనాత్మకమైన కొత్త వార్త దొరకగానే పాతదాన్ని మర్చిపోతారు.

వార్తాపత్రికలన్నీ మీడియా వహించిన పాత్రని దుమ్మెత్తి పోసేసరికి, జూలై 23 న ఎన్‌.డి టీవీ వాళ్ళు ‘ముకాబ్లా’(ఎదిరింపు) అనే కార్యక్రమంలో ఈ సంఘటనని సీరియస్‌గా తీసుకోవటానికి ప్రయత్నించి కూడా సాఫల్యం పొందలేకపోయింది. ఎందుకంటే ఆ కార్యక్రమానికి కూడా మటుక్‌నాథ్‌నీ, అతని ప్రియురాలు జూలీని పిలిచారు గాని, శ్రీమతి ఆభా చౌధరిని పిలవలేదు.

అసలు ముందుగా మనం ఆలోచించ వలసినదేమిటంటే, ఈ పూర్తి సమస్య కేవలం వివాహేతర సంబంధం గురించి కాదు – ఎంత మాత్రం కాదు. ఒక లెక్చరర్ తన పదవినీ హోదానీ వాడుకుని అవినీతిగా ప్రవర్తిస్తాడు- తన విద్యార్థినులకు 90 శాతం మార్కులు ఇచ్చి, వాళ్ళతో శారీరక సంబంధాలు ఏర్పరుచుకుంటాడు. అప్పుడది విద్యా సంస్థల్లో లైంగిక దౌర్జన్యానికీ, పక్షపాతానికీ సంబంధించిన సమస్య అవుతుంది. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవలసి వుంటుంది. ఈ సమస్యకి రెండో ముఖం కూడా వుంది- ప్రొఫెసర్ల దుర్మార్గం అటుంచి, కొందరు విద్యార్థినులు కూడా తాము కోరినది సాధించటానికి తమ శరీరాలని నిచ్చెనలుగా వాడుకుంటారు. కొన్ని సంస్థల్లో ఇలా చెయ్యటం కన్నా వేరే మార్గం లేకపోవటం కూడా ఒక సమస్యే. పురుషాధిక్య సమాజంలో తమ ప్రతిభకీ, మేధస్సుకీ తగిన ఉద్యోగాలు దొరకాలంటే ఇవన్నీ చెయ్యవలసి వస్తుంది. ఎన్నోసార్లు తాము కోరినది పొందటం కోసం శరీరాన్ని సాధనంగా వాడటానికి స్త్రీలు అలవాటు పడిపోవటం కూడా చూస్తాం. ఈ క్రమంలో వాళ్ళు ఎందరో మటుక్‌నాథ్‌లను తయారుచేస్తారు.

మటుక్‌నాథ్ భార్య తన హక్కుకోసం చేసిన పోరాటాన్నీ, చట్టాన్నీ పోలీసుల్ని తనకి సహాయపడమని కోరటం గురించీ ఎంతోమంది స్త్రీలు ఆమెని పొగిడారు. కానీ ఆవిడ ఈ విషయాన్ని ఇంకా మర్యాదగా, శాంతంగా కూడా నలుగురి ముందుకీ తీసుకొచ్చి వుండచ్చు. భర్తకి విడాకులకి నోటీసు పంపి, తన హక్కులకోసం అతన్ని దబాయించి అడిగి వుండవచ్చు. భర్త ప్రియురాలిని కెమెరా ముందు జుట్టుపట్టుకుని ఈడ్చి పడదొయ్యటం సరైన పద్ధతి కాదు.

1975 తరువాత మనదేశంలో మహిళా సంఘాలు చేసిన ఉద్యమాల్లో కట్నం చావులూ, గృహ హింస, ఆఫీసుల్లో లైంగిక వేధింపులూ, సమాన కూలీ మొదలైన వాటిని చేబట్టారు. 1980 లో జరిగిన ‘స్త్రీలకు అధికారం కలిగించే ఉద్యమం’ లో పెద్ద ఎత్తున పాటలూ, పోస్టర్లూ, నినాదాలూ తయారు చేశారు. పాటల్లో ‘అగ్ని, జ్వాల, నిప్పురవ్వ’ అనే మాటలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఆయుధాల ఉపమానాలు కూడా పాటల్లో చాలాసార్లు వినిపించాయి. మహిళా సంఘాలని డాలుతోనూ, కవచంతోనూ పోలిస్తే స్త్రీల ఐకమత్యాన్ని ఖడ్గంతో పోల్చారు. శక్తి స్వరూపిణి దుర్గ చిత్రాలని అన్నిచోట్లా ప్రదర్శించారు- ఒక చేతిలో తెగిన మగవాడి తల వుంది. కొన్ని చిత్రాల్లో తమపై లైంగిక అత్యాచారం చేసే మగవాళ్ళని మార్షల్ ఆర్ట్ ఫోజుల్లో ఎదుర్కొంటున్నట్టు స్త్రీలని చిత్రించారు. హింసకి సమాధానం హింసే అన్న సందేశం ఇచ్చే చిత్రాలే ఇవన్నీ. స్త్రీలు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని తమపై హింస జరుపుతున్న పురుషుల్ని ఎదుర్కోవాలన్నదే న్యాయమైన పద్ధతి అని వాళ్ళు భావించారు. 1980 తరువాత కొన్ని కుగ్రామాల్లోనూ, ఊళ్ళలోనూ వ్యభిచరించే మగవాళ్ళ మొహాలకి మసిపూసి గాడిదలమీద వీధుల్లో ఊరేగించారు. ఇలా హింసకి ప్రతిహింసే సమాధానం అనేదాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. ఈనాటికీ ఎన్నో స్త్రీ సంఘాలు ఇటువంటి వాటికి ఎదురుచెప్పవు.

ఎటువంటి హింసైనా హింసనే పుట్టిస్తుంది. తరువాత ఏర్పడిన స్త్రీ సంస్థలు ఇది తప్పనీ, ప్రమాదకరమనీ తెలుసుకున్నాయి. అయినప్పటికీ గోధ్రాలో జరిగిన మారణహోమంలో మర్యాదస్తుల కుటుంబాలకి చెందిన స్త్రీలు రోడ్డుమీదికి వచ్చి ఎంతో ఉత్సాహంగా ఆ నరమేధంలోనూ, హింస లోనూ, పాలు పంచుకోవటం అందరం చూశాం. షాబానో కేసులో దీని తాత్కాలిక ప్రభావం కనిపించి స్త్రీల సామూహిక ఉద్యమాలని జాతి, మతం పేరిట విడగొట్టటం కూడా చూశాం. ఈనాటికీ హిందూ ముస్లిమ్ స్త్రీలు వేరుపడి దాని ఫలితాలని అనుభవిస్తూనే ఉన్నారు.

ఇక అసలు విషయానికొద్దాం- ఎలా చూసినా ఆభా చౌదరి చేసిన పనిని మనం సమర్ధించలేం. అలా కాక నింపాదిగా ఆమె తన అభ్యంతరాన్ని తెలిపి వుంటే ఇంకా ఎంతోమంది ప్రేక్షకులు ఆమెని సమర్థించి వుండేవారు. కానీ ఆమె అలా ప్రవర్తించి వుండకపోతే ఆ కేసు ఇంత ప్రచారం పొందేది కాదు. ఏ కోర్టుకో, పోలీస్ స్టేషన్‌కో వెళ్ళి వుంటే ఆమె మాటలు ఎవరైనా పట్టించుకుని వుండేవారా? ఎంతమంది ఈ సంగతి అసలు విని వుండేవారు? కెమెరా ఎదురుగా లేకపోతే చౌధరి అలా చేతులు జోడించి దీనంగా కనబడేవాడా? తన మొహానికి మసి పూస్తుంటే ఊరుకునేవాడా? జూలీ కిమ్మనకుండా తన్నులు తినేదా? మరి అదే మీడియా చేసే గారడీ! విషయాలని అది ఉన్నది ఉన్నట్టు చూపించదు!

ప్రస్తుత కాలంలో అన్నీ అతివేగంగా జరిగిపోతూ వున్నాయి. మనం ఒక సామాజిక-నైతికత లేని అరాచకమైన సమాజంలోకి దూసుకుపోతున్నాం. ముఖ్యంగా తలెత్తేది పెళ్ళైన ఆడదాని పరిస్థితీ, హక్కులూ ఏమిటనే ప్రశ్న. హక్కులనేవి చట్టానికి సంబంధించినవి, పరిస్థితి సామాజిక సమస్య.

వందేళ్ళ భారతదేశపు మధ్య వర్గం చరిత్రని తిరగేస్తే స్త్రీల సామాజిక పరిస్థితి మూడు దశల్లో మన ముందుకొస్తుంది-

మొదటి దశలో స్త్రీకి ఒక అస్తిత్వం అంటూ వుండేది కాదు, చదువు సంధ్యలు లేక పరాధీనగా వుండేది. ఆమె పిల్లల్ని కనే యంత్రం మాత్రమే. తన శరీరం మీదే తనకి హక్కులేదు, కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో ఆమె జోక్యం క్షమించరాని నేరం. ఇరవై నాలుగ్గంటలూ చాకిరీ చేస్తూ, తన ఆరోగ్యం గురించి కూడా ధ్యాసలేకుండా జీవితాంతం మొగుడూ, పిల్లలే లోకంగా బతికేది. ఇక మొగుడి పక్కన, నలుగురిముందు, కూర్చోవటం కూడా తప్పే. గుంజకి కట్టిన పశువులా అదే జీవితం అలవాటైపోయి, ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చినా తాడు తెంపుకుని పోవాలన్న ఆలోచనే రాదు ఆమెకు.

విడాకులనేవి ఇటువంటి మధ్యవర్గపు కుటుంబాలలో ఎన్నడూ చూడం. అటు మరీ పాతకాలం ఆడవాళ్ళలాగ అన్నీ సహిస్తూ పడి వుండనూ లేక, వివాహ బంధాన్ని వదలనూ లేక, వుండటానికింత చోటూ, తినడానికింత తిండీ వుంది. పిల్లలున్నారు, అనుకుని నోరుమూసుకుంటారు. తమ భర్తల ప్రేమ వ్యవహారాలను చూసీ చూడనట్టూ , వీలైనంత వరకూ కప్పిపుచ్చుతూ, బతుకుతూంటారు.

తరువాత యంత్ర రంగంలోనూ సాంకేతిక రంగంలోనూ కొంత ప్రగతి సాధించాక, స్త్రీలకి చదువు సంధ్యలు అబ్బి చైతన్యం వచ్చింది. వాళ్ళకి కూడా ఉద్యోగావకాశాలు లభించసాగాయి. డబ్బు విలువ తెలిసొచ్చింది. ఆర్థిక స్వాతంత్య్రమూ వ్యక్తిత్వ వికాసమూ లభించాయి. పరాయి పురుషులు అంత ‘పరాయి’ గా అనిపించటం మానేశారు. కానీ ఈ దశలో కూడా నైతికత అనేది స్త్రీ శరీరంతోనే ముడిపెట్టబడింది. ఈ దశలోనే దాన్ని ఎదిరించటం కూడా ప్రారంభమయింది.

మూడో దశలో బహిరంగ విపణి (ఓపెన్ మార్కెట్), పెద్ద పెద్ద నగరాల్లో జీవితం, ప్రపంచమంతా ఒక పెద్ద గ్రామంగా మార్చే జ్ఞానం బాగా చదువుకుని అన్ని వ్యవహారాలూ తనంత తానే నిర్వహించుకోగల చురుకైన స్త్రీని సృష్టించాయి. స్త్రీ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. పురుషాధిక్య సమాజాన్ని సవాలు చెయ్యాలన్న బలమైన కోరికలకి ఒక రూపం వచ్చింది. పెళ్ళి అనే కాంట్రాక్టు బలహీనమైపోయే తరుణం ఇది. ఒక్క రాత్రికి పరిమితమయే ‘డిస్పోజబుల్’ సంబంధాలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ‘లివ్-ఇన్’ సంబంధాల యుగం వచ్చింది. దీన్ని కూడా ‘ప్రేమ’ అనే అంటారు, కానీ దీని ఆయుష్షు రెండు వారాల నుంచీ రెండేళ్ళకన్నా ఎక్కువ వుండదు. స్త్రీలు తండ్రిపేరు చెప్పకుండా పిల్లల్ని కని పెంచే రోజులివి. మరింక నైతికవిలువ లెక్కడున్నాయి? ఇవాళ మనం మటుక్‌నాథ్- ఆభా- జూలీ విషయంలో చూస్తున్న వివాహ వ్యవస్థ మరలు ఎప్పుడో వదులైపోయాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సినది, పెళ్ళి అనే బంధం సరిగ్గా పని చెయ్యనట్లయితే, “విడాకులు” అనే వెసులుబాటుకి కొత్త నిర్వచనం చెప్పటం ఒక మంచి సమాజం చెయ్యవలసిన పని కాదా? అని.

ఈనాటి “యూజ్ అండ్ థ్రో” సిద్ధాంతాన్ని పాటించే వినియోగదార్లతో నిండిన సమాజంలో ప్రతి వస్తువుకీ ఎక్స్‌పైరీ డేటు వుంటుంది- మానవ సంబంధాలకి కూడా. వివాహ సంస్థ ఒక్కటే ఎక్స్‌పైరీ డేటు అయిపోయిన తరువాత కూడా ఒక సగటు ఆడదాని బలహీనమైన భుజాలమీద మోపబడి వుండి, సమాజం దృష్టిలోనూ, లోకం దృష్టిలోనూ, ఒక్కోసారి పిల్లల పేరుకూడా, సామాజిక రక్షణ పేరిటా, సౌకర్యాల పేరిటా, ఆర్థికంగా ఆధారపడటం పేరిటా కాళ్ళీడుస్తూ వుంటుంది. గృహిణులు, పగిలిపోయి, రంగు వెలిసిపోయిన చీరల్ని పారవేయకుండా పైగా అవే తమ శరీరానికి హాయిగా వున్నాయని చెప్పటంలాగే వుంటుంది ఆ వైవాహిక జీవితం కూడా!

అందుకే మటుక్‌నాథ్ ప్రియురాలు ఎంతో ధైర్యంగా, “పెళ్ళి ఎవరిక్కావాలి? వీళ్ళు పెళ్ళి చేసుకున్నారుగా, మరి దాని ఫలితం మీరందరూ చూస్తూనే వున్నారుగదా?” అనగలిగింది. కానీ ఆమె కూడా మంగళ సూత్రం ధరించాలని ఎంతో ఆత్రుత పడు తోందనేది వేరే సంగతి! ఆ మంగళ సూత్రం మెడలోపడి, ప్రేమ ఏమాత్రం లేని దాంపత్యంలో ఇద్దరు పిల్లల్ని కన్నాక, ఇక ఇటువంటి మాటలు ఆమెకూడా మాట్లాడలేదు!

ఇటువంటి వివాహేతర సంబంధాలు కొత్తగా మనం చూడటం లేదు. ఎప్పట్నించో ఉన్నవే. మునుపు వీటిని దాచిపెట్టేవారు. కుటుంబంలోని ఒకరిద్దరు పెద్దవాళ్ళకి మాత్రం తెలిసేవి. ఆ కాలం అన్నీ దాచిపెట్టే కాలం. ఈరోజుల్లో అంతా బట్టబయలే- ఎక్స్‌ప్రెషన్ అండ్ ఎక్స్‌పోజర్ యుగం. మటుక్‌నాథ్ ఎంతో గర్వంగా, “అవును, నేనీమెని ప్రేమిస్తున్నాను!” అని చెప్పగలిగాడు. కామాన్ని ఒప్పుకోవటం కష్టం, ప్రేమనేది దైవత్వంతో కూడుకున్నది! దాన్ని ఒప్పుకోవటానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది?

ఆభా తన భర్త ప్రతి విద్యార్థినితోనూ ఇలాగే ప్రవర్తిస్తాడని చెప్పింది. అలా తనకి లొంగిన అమ్మాయిలకి మార్కులు ఎక్కువ వేస్తాడనీ, ఎవరైనా అల్లరిచేసి గోలచేస్తే కాళ్ళు పట్టుకుంటాడనీ చెప్పింది. మటుక్‌నాథ్‌కీ జూలీకీ వున్న ఈ కామ సంబంధాన్ని మీడియా ఆమోదించింది. డాక్టరుకీ నర్సుకీ, ఆఫీసరుకీ సెక్రటరీకీ, ప్రొఫెసరుకీ విద్యార్థినులకీ మధ్య ప్రేమ వుండటం అనేది మనం సాధారణంగా చూస్తూనే వుంటాం అంది.

మటుక్‌నాథ్, జూలీ ప్రేమ అనే శిలువకి వేలాడదీయబడ్డారు. ఇద్దరి మొహాల్లోనూ నీచత్వం, పొగరుతో బాటు మీడియా వాళ్ళ ప్రేమని ఆమోదించటం వల్ల, ఒకరకమైన ఆత్మవిశ్వాసం కూడా వుంది. ప్రేమ గొప్పదనం గురించి ఇద్దరూ ఎన్నో డైలాగులు చెప్పారు!

మీడియా కల్పించుకోకపోయినట్టయితే, ప్రేమ అనే శిలువ మీద ఇద్దర్నీ వేలాడదీసి వుండకపోతే, ఈ పాటికి మటుక్‌నాథ్ ఇంకో అమ్మాయి వెంట పడేవాడే. జూలీ మటుక్‌నాథ్ చేత తన పిహెచ్‌డి థీసిస్ రాయించుకుని ఇంకో యువకుణ్ణి వెతుక్కుని వెళ్ళిపోయేది. పైగా మటుక్‌నాథ్ ఇంటిని తను త్యాగం చేసి కాపాడానని కూడా చెప్పి వుండేది. కానీ ఇప్పుడు వాళ్ళ శారీరక సంబంధం బట్టబయలయింది. మీడియా ధర్మమా అని ఒక తాత్కాలిక సంబంధం శాశ్వత బంధంగా గౌరవాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరూ విడిపోదామనుకున్నా మీడియా, మహేష్‌భట్, లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళని విడిపోనివ్వరు!

మటుక్‌నాథ్, జూలీ ఇకమీదట వ్యక్తులు మాత్రమే కాదు, విద్యా సంస్థల అథోగతికీ, నైతిక విలువలు దిగజారిన సంస్కృతికీ, వ్యక్తిగతంగా తమ బాధ్యతా రహిత ప్రవర్తనవల్ల, విశృంఖలత్వానికీ, పొగరుబోతుతనానికీ ప్రతీకలు.

వీధివీధికీ మటుక్‌నాథ్‌లు మనకి కనిపిస్తారు. వీళ్ళ పెళ్ళాలతో వచ్చిన చిక్కేమిటంటే, నిండా మునిగేదాకా వాళ్ళు అన్నీ భరిస్తూ వుంటారు. ఎప్పుడో ఒకప్పుడు భర్త తన తప్పు తెలుసుకుని వెనక్కి రాకపోతాడా అని ఎదురు చూస్తూ కూర్చుంటారు. ఆర్థిక స్వాతంత్య్రమూ, చదువు సంధ్యలూ లేని ఆభా చౌధరి వంటి స్త్రీలే కాదు, బాగా చదువుకుని, తమ కాళ్ళమీద తాము నిలబడగలిగి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలది కూడా ఇదే పరిస్థితి. కానీ మటుక్‌నాథ్‌లు ఎప్పుడూ రెండు నావల్లో ప్రయాణం చేస్తూ వుంటారు. ఒక కాలు ఎప్పుడూ ఇంట్లోనే, రెండో కాలి కింది నావలు మట్టుకు తరుచు మారుతూంటాయి!

వివాహం అనేదాన్లో బాధ్యత, నమ్మకం, కట్టుబడి వుండటం అనేవి అంతర్భాగంగా వుంటాయి. వీటిని లెక్కచెయ్యనివాళ్ళు వివాహం చేసుకోకుండా వుండటమే ఉత్తమం. జీవితాంతం ఒంటరిగా వుండదల్చుకుంటే ఎంతమందితో సంబంధం పెట్టుకున్నా అభ్యంతరం వుండదు. కానీ మగాడు అలా చెయ్యడు. వివాహబంధం వుంటూ కూడా ఆ బంధాన్నించి స్వేచ్ఛ కావాలని ఆశిస్తాడు. మగవాడు పలాయనవాది. ప్రతి మగవాడిలోనూ ఒక బుద్ధుడు వుంటాడు! అదేమిటని అడిగితే జవాబు చెప్పటం కూడా అతనికి ఇష్టం వుండదు. కానీ సమాజంలో వుంటూ ఇటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పకుండా తప్పించుకోవటం సాధ్యం కాదు.

అసలు ప్రేమకీ బాధ్యతకీ చుక్కెదురు లాగ కనిపిస్తుంది! పూర్తిగా ప్రేమలో మునిగిన వాడికి బాధ్యతలాంటి తుచ్ఛమైన విషయాలు పట్టించుకునే టైముండదు. మగవాడు పిల్లల బాధ్యత వహించకుండా చేతులు దులుపుకుని పోగలడు, కానీ స్త్రీకి తన కడుపున పుట్టిన పిల్లల బాధ్యతే అన్నిటికన్నా ముఖ్యం. ఒక స్త్రీ హృదయంలో ప్రేమ పుట్టి పెరిగేది పూర్తిగా విభిన్నమైన స్థాయిలో. భర్త, పిల్లలూ, చివరికి తన ఇంటిగోడలు సైతం ఆమెకి ప్రీతి పాత్రమౌతాయి. 50 ఏళ్ళ ఆడదానికి భర్తని ఆకర్షించటం, పొగడటం, ముద్దులు కుడవటం, అతని అహంకారాన్ని తృప్తిపరచటం, అనేవి ముఖ్యమైన పనుల లిస్టులో వుండవు. మరి అటువంటి భార్యని వదిలి ఆ భర్త బైట ప్రేమకోసం పాకులాడితే తప్పేమిటి, అని కొందరు ప్రబుద్ధులు అడగచ్చు. 23 ఏళ్ళ అమ్మాయి 53 ఏళ్ళవాణ్ణి ప్రేమించటానికి సిద్ధంగా వుంటే మరి అతను ఆ ముసలి తొక్కునే ఎందుకు అంటి పెట్టుకుంటాడు? ముడతలుపడి పీక్కుపోయిన అతని భార్య మొహం అసలు చూశారా, మీరు? అనచ్చు.

భార్యలు ప్రియురాళ్ళలాగ ప్రేమించరు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎన్నో పనులుంటాయి- నీళ్ళు వచ్చే టైములో నీళ్ళు పట్టి పెట్టుకోవాలి, వంటింటి తూములో నీళ్ళు పోవటం లేదు, వానకి గదిలోకి నీళ్ళొస్తున్నాయి, ఫాను సరిగ్గా తిరగటం లేదు, గ్యాస్ సిలిండర్ లీక్ అవుతోంది, స్విచ్చి ముట్టుకుంటే షాక్ కొడుతోంది, పిల్లల్ని ట్యూషన్కి రెడీచేసి పంపాలి- ఇవికాక ఇంకా ఎన్నో! ఇల్లు సవ్యంగా వుంచటానికి ఒక ఆడదానికి ఎంత శక్తినీ సమయాన్నీ వెచ్చించాల్సి వస్తుందో అనేది ఎవరికీ పట్టదు. ఏమయ్యా మటుక్‌నాథ్! ఇటువంటి పనులతో సతమతమయే భార్యలకి ప్రేమించటానికి టైమెక్కడ వుంటుంది, చెప్పు! కానీ పాపం అమాయకురాళ్ళైన భార్యలకి, భర్తలకి కావలసింది అసలు సిసలు ప్రేమ కాదనీ, ప్రేమించినట్టు నటించటమనీ తెలీదు, పాపం.

ప్రేమించటానికి కావలసినంత టైముండేది ఈ ప్రియురాళ్ళకే. వాళ్ళకి ఇల్లూ వాకిలీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫేషియలూ, బ్లీచీ వగైరా చేయించుకోవటానికి కావల్సినంత టైముంటుంది. ప్రేమించటం అనేది వాళ్ళ కెరియ‌ర్‌లో ఒక భాగం, అంతే. ఈ ‘ప్రేమించటం’ అనే పనిముట్టుతో వాళ్ళు తమ పనులన్నీ సాధించుకోగలుగుతారు.

అవకాశం దొరికినప్పుడు ఇటువంటి అవినీతికరమైన ప్రేమ సంబంధాలు సమకూర్చుకున్నవారిని తప్పుచేశానన్న భావన కుంగదీస్తుంది. దీనివల్ల ఆ వ్యక్తులు తాము ఎవరినీ ఖాతరు చెయ్యక్కర్లేదన్నట్టుగా విర్రవీగుతూ బాధ్యతలన్నిటినీ అవతలికి నెట్టేస్తారు. 50 ఏళ్ళ భార్యకి ప్రియుణ్ణి వెతుక్కోమని సలహా యిస్తారు. పిల్లలు బాధపడతారేమోనని గాని, తమ గురించి ఏమనుకుంటారో అనిగాని ఆలోచించరు. మటుక్‌నాథ్ భార్యా, పిల్లలూ ఎంతో నష్టపోతున్నారు.

మటుక్‌నాథ్ పబ్లిగ్గా తన ప్రేమాయణాన్ని ఒప్పుకుంటే ఇప్పుడిక ఆభా చౌధరి ఏం చెయ్యాలి? 28 ఏళ్ళు అతనితో కాపురం చేసింది. ఇప్పుడు ఉన్నట్టుండి , నీకు స్వేచ్ఛ ఇచ్చాను, ఈ బంధాన్ని తెంచుకుని నీ దారిన నువ్వు పో! అంటే ఆ స్వేచ్ఛని ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఆమెకి తెలియని పరిస్థితి. పంజరం తలుపు తెరిచినా రెక్కలు కత్తిరించిన పక్షిలా అక్కడే పడి వుంటుంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక మగాడికి ఎప్పటికప్పుడు కొత్త ప్రియురాళ్ళు కావాలి. మరి ఒక స్త్రీ జీవితం ఒకే మగాడి దగ్గర ఎందుకు ఆగిపోతుంది? ముందుకు ఎందుకు వెళ్ళదు? గత సంవత్సరం నఫీసా జోసెఫ్, (మిస్ ఇండియా) గీతాంజలి (నవీన్ నిశ్చల్ భార్య) చదువుకుని వుండి, మేధా సంపత్తి వుండీ, సమాజంలో కొద్దో గొప్పో పేరు ప్రతిష్టలు సంపాదించి కూడా ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవలసి వచ్చింది? నఫీసా ప్రియుడు పెళ్ళిచేసుకోనని అనేసరికి ఆత్మహత్య చేసుకుంది. గీతాంజలి భర్త డైవర్స్ పేపర్లు పంపించాడని ఫేనుకి ఉరేసుకుంది. అసలు అప్పుడే వాళ్ళ జీవితాలకి నిజమైన ఛాలెంజి. తమ జీవితాలకి వాళ్ళు వేరే ఏదైనా ధ్యేయం కల్పించుకోవలసింది. అసలు ఆభా చౌధరిలాంటి సగటు గృహిణులు కూడా భర్త బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే వాళ్ళనే అంటిపెట్టుకుని వుండకుండా వేరే మార్గాలు ఎన్నుకోవాలి. పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోని భర్తని పట్టుకు వేలాడటం శుద్ధ దండగ.

తాజా కలం-

ఈ లోకంలో మటుక్‌నాథ్‌లు ఎక్కడ చూసినా కనిపిస్తారు. ఇందుగలడందులేడని సందేహము వలదు! రచయితల్లో, కళాకారుల్లో, ఆఫీసర్లలో, సినీరంగంలో, విశ్వవిద్యా లయాల్లో… అంతటా వీళ్ళే! సమాజం, మీడియా వీళ్ళకి ‘ప్రేమ గురువు’ అనే బిరుదునిచ్చి, పూల దండలతో వీళ్ళకి సన్మానం చేసినంత కాలం, వీళ్ళు పుట్టగొడుగుల్లాగ పుట్టుకొస్తూనే వుంటారు. వీధుల వెంట తిరుగుతూ కోతుల్నీ, ఎలుగుబంట్లనీ ఆడించే వాళ్ళలాగ, మీడియా వాళ్ళు టీవీల్లో చూపించే ఈ ‘ ఆటల్ని’ కూడా చూస్తూనే వుంటాం.

మటుక్‌నాథ్‌ని సస్పెండ్ చేసినట్టు ఈ మధ్యనే వార్త వచ్చింది. ఉద్యోగం ఊడలేదు కదా? భయం లేదు! ఎలాగో ఒకలాగ మళ్ళీ పనిలో చేరతాడు.

అందుకే అతని కామానికి తప్పనిసరి అయి ఇష్టం లేకుండా బలైన అమ్మాయిలు ధైర్యం చేసి ముందుకొచ్చి అతని అసలు రూపం బైట పెట్టాలి – అది వాళ్ళ నైతిక బాధ్యత. దీనివల్ల అతని అసలు స్వరూపం అందరికీ తెలియటమే కాక, ఇంకా విద్యాసంస్థల్లో అటువంటి వాళ్ళుంటే , వాళ్ళు కొంచెం భయభక్తులతో మెలుగుతారు.

కనీసం ఈ మటుక్‌నాథ్‌ని తాత్కాలికంగానైనా సస్పెండ్ చేశారు. మరి సమాజంలో అన్ని రంగాలలో పేరు ప్రతిష్టలు పొంది, సన్మానాలూ సభలూ చేయించుకుంటూ, తమకి వచ్చిన అవార్డులన్నిటినీ అద్దాల బీరువాల్లో అందంగా అమర్చుకుని, కులాసాగా కులుకుతున్న ఎంతోమంది మటుక్‌నాథ్‌ల సంగతేమిటి? రాతల్లో ఎంతో ఉదాత్తత చూపించే వీళ్ళ జీవితాలు ఇంత భయంకరంగా ఎందుకున్నాయి? రచయిత లూ, కళాకారులూ నడిపే ప్రేమాయణాలని సమాజం ఎలా కట్టుదిట్టం చేస్తుంది?

దురదృష్టం ఏమిటంటే, ఈ పరిస్థితి మారకపోగా, ఆధునిక స్త్రీకి దేహ స్వాతంత్య్రం అనే లైసెన్స్‌ ఇచ్చాక ఇది ఇంకా వికృతమైన రూపాలని సంతరించుకుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో