ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్ర

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌.శాంతసుందరి
(గత సంచిక తరువాయి)

అప్పట్లో ధున్నూ చంటిపిల్లవాడు. రెండు నెలలుగా నేను నీళ్ల విరోచనాలతో బాధపడుతూ ఉన్నాను. తిండి తినలేకపోయే దాన్ని, మరి పిల్లాడికి పాలెలా వస్తాయి? డాక్టర్లు కూడా నన్ను పిల్లవాడికి పాలివ్వద్దనీ, అలా ఇస్తే నా ఆరోగ్యం దెబ్బ తింటుందనీ అన్నారు. అందుకని సేరున్నర పాలు కొనుక్కునే వాళ్లం. అందులో కొంత పిల్లవాడికీ, కొంత పెరుక్కీ సరిపోతుందని అనుకున్నాం. నేను మజ్జిగ మాత్రమే తాగేదాన్ని. కానీ అనుకున్నదొకటి అయందొకటీ! అందులో అర్థసేరు పిన్ని తీసుకుని తన కొడుక్కోసం విడిగా ఉంచేసేది. మిగిలిన పాలలో కొంత ఆయనకి తాగటానికి ఇచ్చేదాన్ని, ఇంకా చిన్నపిల్ల, మా అమ్మాయి కూడా, పాలు తాగేది. ఇక పసివాడికి అర్థసేరుతో రోజంతా సద్దుకోవాలి. పోనీ పాలు ఎక్కువ కొందామా అంటే ఉన్న సంపాదన సరిపోదాయె. అందుకని పిల్లవాడికి సగ్గుబియ్యం జావ చేసి పట్టేదాన్ని. దాంతో వాడికి రక్తవిరోచనాలు పట్టుకున్నాయి.
ఒకరోజు పాలవాడు రాగానే ఆయన గిన్నె తీసుకుని వెళ్లబోయారు. ”ఇంక పిల్లలకి మాత్రమే పాలు కొంటున్నాం, ఇంట్లో ఇంకెవ్వరికీ అక్కర్లేదు”, అన్నాను.
1916లో మా ఆడబడుచు పిల్లలతో వచ్చింది, ఇద్దరమ్మాయిలు ఆవిడకి. రాగానే వాళ్లకి ఫ్లూజ్వరం వచ్చింది. ఇక ఈయన వాళ్ల సేవలో పడిపోయేవారు, చీకట్నే లేవటం, కుంపటి రాజెయ్యటం, హుక్కా పీలుస్తూ కషాయం తయారు చెయ్యటం, కాలకృత్యాలు తీర్చుకున్నాక, నాకూ, వాళ్లక్కకీ పందుంపుల్లలు అందించటం, పిల్లల మొహాలు కడగటం, ఇవన్నీ తనే చేసేవారు.
ఈ పనులన్నీ చేసి ముగించాక వంట ప్రారంభించేవారు. అమ్మాయికి ఒంట్లో బావుంటే తనే వంట చేసేది. జ్వరం వస్తే మట్టుకు దానివల్ల అయేదికాదు. వంట చేశాక జ్వరంతో ఉన్నవాళ్లకి బత్తాయి పళ్ల రసం తీసి ఇవ్వటం కూడా ఆయన డ్యూటీయే! తాంబూలం బీడాలు కట్టి నా డబ్బాలో పెట్టి, ధున్నూని ఎత్తుకుని స్కూలుకెళ్లేవారు. మధ్యాన్నం పన్నెండు గంటలకి వచ్చి భోజనం చేసి, పిల్లలిద్దరిచేతా పాలు తాగించి, మళ్లీ ధున్నూని తీసుకుని స్కూలుకెళ్లి సాయంకాలం గాని ఇంటికొచ్చేవారు కాదు.
రాత్రి పిల్లలిద్దర్నీ చెరోపక్కా పడుకోబెట్టుకుని నిద్రపోయే వారు. ధున్నూ పక్కతడిపేస్తే, ఈయన బట్టలు కూడా తడిసేవి. లేచి బట్టలు మార్చుకుని, పక్క బట్టలు కూడా మార్చేవారు. రాత్రి పూట పిల్లలు లేచి ఏడిస్తే వాళ్లని భుజాన వేసుకుని నిద్ర పుచ్చేవారు. అసలు కోపమంటే ఏమిటో తెలీదాయనకి, అంత ఓర్పు!
మూడోపిల్లవాడు పాలుతాగే పసివాడిగా ఉన్నప్పుడు పెద్ద పిల్లలిద్దరి బాధ్యతా పూర్తిగా తనే తీసుకున్నారు. మూడో పిల్లవాడికి పదకొండు నెలలప్పుడు అమ్మవారు సోకింది. డాక్టర్‌ని పిలవమని ఆయనతో అన్నాను. గబగబా తనగదిలోకి వెళ్లి, వైద్యానికి సంబంధించిన పుస్తకమేదో తిరగేసి మళ్లీ నా దగ్గరకొచ్చారు, ”వీడు దక్కేట్టు లేడు!” అన్నారు ఏడుపు గొంతుతో.
”ముందు డాక్టర్ని పిలుచుకు రండి!” అన్నాను.
”అలాగే, పిలుచుకొస్తాను, కానీ నాకేం నమ్మకం లేదు!” అన్నారు.
మళ్లీ నన్ను ఓదారుస్తూ, ”చావు బతుకులు మన చేతుల్లో ఉన్నాయా చెప్పు! ఏం చెయ్యగలం?” అన్నారు.
వెంటనే పిన్నికి టెలిగ్రాం పంపారు. ఆవిడ పుట్టింటికెళ్లింది. రెండ్రోజుల్లో వచ్చింది. ”పాపనీ, ధున్నూనీ తీసుకుని నువ్వు విడిగా ఒక గదిలో ఉండు. వాళ్లకి అంటుకోకుండా చూసుకోవాలి. అసలు వాళ్లు ఇంకెక్కడన్నా ఉంటే, మరీ మంచిది!” అన్నారు ఆవిడతో.
”లేదు, అమ్మవారున్నప్పుడు ఇంట్లోంచి బైటికిపోకూడదు,” అందావిడ. ఆవిడా పిల్లలూ విడిగా ఉండసాగారు.
పసిపిల్లవాడు పదకొండోరోజు కళ్లు తేలేశాడు. వాడి ఒళ్లు చల్లబడసాగింది. డాక్టర్‌ వచ్చి లాభం లేదు, మనసు రాయి చేసుకోమని చెప్పాడు. రాత్రి వాడు చనిపోయిన సమయంలో నేనూ, ఆయనా మాత్రమే వాడి దగ్గర ఉన్నాం. ఆయన్ని కూడా దూరంగా ఉండమని చెప్పాలనిపించింది నాకు.
నా చెయ్యిపట్టుకుని లేపి, ఇవతలికి తీసుకొచ్చి, ”ఎందుకేడుస్తావు? పదకొండు నెలలే వాడితో మనకి రుణానుబంధం అనుకో! బతికినన్నాళ్లూ వాడికీ సుఖం లేదు, మనకీ సుఖం లేదు. ఎప్పుడూ ఏదో ఒక సుస్తీయే కదా! నేనింక బతికే ఉన్నా కదా, అసలు నేనొక్కడినే నీవాడిని!” అన్నారు.
ఆరోజు రాత్రంతా నాతో పాటు జాగారం చేస్తూ, నా పక్కనే ఉన్నారు. పొద్దున్నే పసివాడి శవం వెళ్లిపోయాక వాడి వస్తువులన్నీ కాల్చేశారు. తరవాత గదిని ఫినాయిల్‌తో శుభ్రంగా కడిగించారు. అక్కడ హోమం వేయించారు. ఆ తరవాత ఆ గదికి తొమ్మిది నెలల పాటు తాళం వేసి ఉంచేశారు. తన చేత్తోనే తాళం వేసి, తాళం చెవి బైట పారేశారు. వాడి వస్తువులేవీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడ్డారు.
ఇంతలో ఆయనకే బాగా జబ్బుచేసింది, 1930లో. ఆ విషయం తన ఆత్మకథలో రాసుకున్నారు. జబ్బు పడిన కొత్తలో జలచికిత్స మొదలుపెట్టారు. దాంతో పొట్ట ఇంకా పెరిగింది. అప్పుడప్పుడు పొట్టలో నొప్పి కూడా వచ్చేది. మందంటే ఆయనకి తగని భయం. మందులు వేసుకునే వారు కాదు. స్కూల్లో పడక్కుర్చిలో పడుకునే ఉండేవారు. ఇంట్లో సాహిత్య రచన అలాగే కొనసాగేది.
రెండు నెలల తరవాత నేను మానాన్నకి ఉత్తరం రాస్తూ ఈయనకి ఒంట్లో బాగుండటతం లేదని తెలియజేశాను. జబ్బేమిటో కూడా రాశాను. ఉత్తరం అందగానే మా నాన్న, మా అన్నయ్య (వకీలు)ని పంపించారు. అన్నయ్య వచ్చి వెంటనే బైలుదేరమనీ, విడిగా ఉండటానికీ, వైద్యానికీ ఏర్పాట్లన్నీ అక్కడ నాన్న చేశారనీ చెప్పాడు.
”బాబూ, చాలా మందులు మింగా నయ్యా! ఇంకా ఎన్ని మింగమంటావు?” అన్నారు మా ఆయన.
”లేదు బావగారూ, నాతో రావల్సిందే. నాన్న మరీమరీ చెప్పి పంపారు.”
”నేను రానోయ్‌! ఆ మందులిచ్చే డాక్టర్ని కావాలంటే ఇక్కడికి రమ్మను. కావాలంటే నువ్వు కూడా ఇక్కడే ఉండిపో!”
”మీకు అక్కడ ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అలహాబాద్‌ నించి ఇక్కడికి డాక్టర్‌ని తీసుకురావటమంటే మాటలా? ఎలా కుదురుతుంది, మీరే చెప్పండి! పైగా ఈ ఊరు నాకు కూడా బొత్తిగా కొత్త.”
”నేను బాగానే ఉన్నానని మీ నాన్న గారికి చెప్పు!”
పాపం, అన్నయ్య ఇంకేమీ చెయ్యలేక వెనక్కి వెళ్లిపోయారు. ఎనిమిది రోజుల తరవాత మళ్లీ నాన్న పంపించారంటూ వచ్చాడు. కానీ మళ్లీ ఈయన మొండిగా, పెడసరంగా జవాబు చెప్పారు.
ఒకసారి మా ఇంట్లో పైనున్న మంచాన్ని కిందికీ, కిందున్న మంచాన్ని పైకీ మార్చాల్సివచ్చింది. ”చిన్నా (ఆయన తమ్ముడు) వస్తే కాస్త ఈ పనిచెయ్యమని చెప్పు, వాడు చేస్తాడు,” అని బైటికెళ్లి పోయారు. మరిది వచ్చాడు. మంచాల సంగతి చెప్పాను. ”అన్నయ్య వచ్చాక ఆయనే పెట్టుకుంటాడు,” అన్నాడు. నాకు చాలా బాధేసింది. నేనే పైకీ కిందికీ తిరిగి మంచాలని మార్చాను. నాకు అప్పుడు ఒంట్లో కూడా బాగాలేదు. ఆయన స్కూలునించి రాగానే మంచాలు మార్చి ఉండటం చూసి, ”ఎవరు మార్చారు?” అని అడిగారు. ”ఈ ఇంట్లో అందరికన్నా ఆరోగ్యంగా ఉన్న మనిషిని, నేనే మార్చాను!” అన్నాను. ”ఎందుకలా తొందర పడ్డ్డావు? నేను వచ్చి ఆ పని చేసి ఉండేవాణ్ణిగా?” అన్నారు.
నాకు కోపం ముంచుకొచ్చింది, ”అన్ని పనులూ మీరే చెయ్యాలా? ఈ చిన్నచిన్న పనులు కూడా వీళ్లు చెయ్యలేరా?” అన్నాను.
”బలవంతపెట్టి ఎలా చేయించగలం? ఎవరిష్టం వాళ్లది!”
”అవును అందరూ ఒళ్లలవకుండా సుఖంగా ఉండాలని చూసేవాళ్లే. మీరు, నేనూ కూడా పనులు మానేసి కూర్చుంటే, పనులు వాటంతటవే అవుతాయా? కుటుంబం, కలిసి ఉండటం, అంటే ఎవరికి చాతైన పని వాళ్లు చేసుకోవాలి కదా!
”బలవంతంగా ఎవరిచేతా ఏమీ చేయించలేం.”
నాకు చాలా చిరాకేసింది, ”అయితే మీరే ఎల్లకాలం ఇలా నలిగిపోతూ ఉండండి! నాకేమిటి?” అన్నాను.
చలికాలం. స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చెయ్యటానికి వచ్చాడు. ఒక రోజంతా ఇన్‌స్పెక్టర్‌ వెంటే ఉండి మా ఆయన స్కూలంతా చూపించారు. మర్నాడు కుర్రాళ్లు బంతాట ఆడుకుంటున్నారు. అందుకని మా ఆయన స్కూలుకి వెళ్లలేదు. సెలవరోజుకదా అని ఇంట్లోనే ఉండిపోయారు. గుమ్మంలో పడక్కుర్చీ వేసుక్కూర్చుని వార్తాపత్రిక చదువుకుంటున్నారు. ఇంటికెదురుగా ఉన్న వీధిలోంచి ఇన్‌స్పెక్టర్‌ కారులో వెళ్తున్నాడు. ఈయన లేచి నిలబడి సలాం చేస్తారని ఎదురు చూశాడు.కానీ ఈయన లేచి నిలబడను కూడా లేదు. అది గమనించిన ఇన్‌స్పెక్టర్‌ కారుని కొంత ముందుకు పోయాక ఆపించి, తన బంట్రోతుని పంపాడు.
బంట్రోతు వచ్చి ఇన్‌స్పెక్టర్‌గారు పిలుస్తున్నారని చెప్తే ఈయన లేచి వెళ్లారు.
”చెప్పండి, ఎందుకు పిలిచారు?” అని అడిగారు ఈయన.
”నీకు పొగరెక్కువ లాగుంది. నీ ఆఫీసర్‌ నీ ఇంటిముందునించి వెళ్తూంటే లేచి సలాం చెయ్యాలని తెలీదా?” అని అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.
”నేను స్కూల్లో ఉన్నంతసేపు మాత్రమే మీ కింద పనిచేసే నౌకర్ని. ఆ తరవాత నా ఇంట్లో నేను కూడా రాజునే!” అన్నారు మా ఆయన.
ఇన్‌స్పెక్టర్‌ వెళ్లిపోయాడు. ఈయన తనని ఇన్‌స్పెక్టర్‌ అవమానించినందుకు అతనిమీద కేసు పెట్టచ్చా అని స్నేహితులని అడిగారు. స్నేహితులు వదిలెయ్యమని సలహా ఇచ్చారు. కానీ ఈ సంఘటన ఆయన్ని చాలా రోజుల వరకు బాధ పెడుతూనే ఉంది.
ఐదో నెల నేను ఎప్పుడూ ఇచ్చే పాతిక రూపాయలతో బాటు మరో ఎనభై రూపాయలిచ్చి జమ చేసి రమ్మన్నాను. ”ఇవెక్కడివి?” అని అడిగారు.
”నెల ఖర్చులోంచి దాచిపెట్టాను. అవి ఇంట్లో ఎందుకు?”
”అలా అయితే నువ్వు దాచుకున్నావు కాబట్టి ఇది నీ డబ్బే,” అన్నారు.
”అయితే మీరు సంపాదించే డబ్బంతా నాదే! మీరు ఏరోజైనా ఒక్కపైసా పొదుపు చెయ్యగలిగారా?”
”సరే, ఇలాతే, జమ చేసి వస్తాను.”
వాళ్ల పిన్నికి మేం మాట్లాడుకుంటున్న డబ్బు విషయం నచ్చలేదు, ”ఏం, ఆ డబ్బు నేనేమైనా తీసిపెట్టుకుంటున్నానా?” అంది.
”అలా అని నేనెక్కడన్నాను? డబ్బులు మిగిలాయి, ఇంట్లో ఎందుకని అన్నానంతే. అవసరమైనప్పుడు తెచ్చుకోవచ్చుగా!” అన్నాను.
కానీ ఆవిడ మనసు నొచ్చుకుందని అర్థమైంది.
సాయంత్రం ఆయన ఇంటికొచ్చాక, ”ఏయ్‌, నిజం చెప్పు! ఎలా అన్నిటినీ చక్కదిద్దుకొస్తున్నావు?” అన్నారు.
”సరుకులు తెచ్చేదెవరు, మీరే కదా? ఇంటికి ఎంత ఖర్చవుతోందో మీరో లెక్క వెయ్యండి. ఇప్పుడు పళ్లు కొనే ఖర్చు కూడా తోడయింది. ఇంతకు ముందే ఖర్చు తక్కువగా ఉండేది,” అన్నాను.
”నిజం చెపుతున్నాను, నాకు అసలు సంపాదించే డబ్బు సరిపోదేమో అని ఎప్పుడూ విచారమే. కానీ నువ్వు అన్నీ చక్కగా చూసుకుంటున్నావు, ఇంక నేను హాయిగా ఉండచ్చు.”
ఆ తరవాతనించీ ఆయన సరుకులు కొని తెచ్చినప్పుడల్లా ఎవరో పరాయి మనిషిలాగ అణా పైసలతో సహా నాకు లెక్క చెప్పేవారు. ఒక్క పైసా మిగిలినా నా చేతికిచ్చేసేవారు.
తనకి ఎక్కణ్ణించైనా డబ్బు వచ్చినా వెంటనే నా చేతికిచ్చేవారు. డబ్బుకి లెక్క చెప్పమని నన్నేనాడూ అడగలేదు.
ఇక తిండి విషయంలో ఏం పెడితే అది మాట్లాడకుండా తినటమే తప్ప, నోరు తెరిచి, నాకిది కావాలి అని ఎప్పుడూ అడగలేదు. ఒకవేళ ఆయనకి ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించి, అది నాకిష్టం లేకపోతే, అసలు తినేవారు కాదు.
నా మాటకి చాలా విలువిచ్చేవారు. జీవితంలో ఏ పనీ కూడా ఆయన నా సలహా తీసుకోకుండా చెయ్యలేదు.
ధున్నూ పసివాడుగా ఉన్నప్పుడు డాక్టర్‌ నా పాలు వాడికి ఇవ్వద్దని అన్నాడని చెప్పా కదా? అప్పుడు ఈయన, ”మన పాకీపని చేసే ఆమెచేత పట్టించు. లేకపోతే ధున్నూ నీరసపడి పోతాడు,” అన్నారు.
”ఒద్దు, కుదరదు,” అన్నాను.
”ఏమయింది? పాలు పట్టిస్తే తప్పేమిటి? పసివాడి విషయంలో కూడా నీకు పట్టింపులా?”
”పసిపిల్లల మీద తాగే పాల ప్రభావం చాలా ఉంటుంది. ఆమె పాలు వీడికి పడతాయో లేదో! వీడికి ఎనిమిది నెలలు, పాకీ మనిషి ఈ మధ్యనే కన్నది. ఇద్దరు పిల్లలకీ ఆమె పాలు సరిపోవద్దు?” అన్నాను.
”అయితే ఏం చేద్దామంటావో, నువ్వే చెప్పు.”
”మేకపాలు పట్టచ్చు.”
ఆయన ఒక మేకని తెప్పించారు. పిల్లవాడికి పాలు తాగించాల్సి వచ్చినప్పుడల్లా ఆయనే స్వయంగా పాలు పితికేవారు, వేళకాని వేళైనా సరే.
కానీ ధున్నూ రాక్షసి పిల్లవాడిలా, పాలసీసాకి ఉండే పీకని కొరికి పారేసేవాడు. నేను చెమ్చాతో నోట్లో పాలు పోయటానికి ప్రయత్నిస్తే, చెమ్చానీ, ఒక్కోసారి నన్నూ పడేసేవాడు! తెగ మసుల్తూ ఉండేవాడు. ఇక లాభం లేదని సగ్గు బియ్యం జావచేసి కొద్ది కొద్దిగా పెట్టేదాన్ని.
గొల్లవాళ్ల దగ్గర్నించి మళ్లీ ఒక సేరు పాలు తెప్పించసాగాం. పిన్ని పసివాడికి అవసరమని కూడా చూడకుండా తనకోసం అర్థసేరు తీసుకునేది. నాకు చాలా కోపం వచ్చింది, ”ఈ రోజునించీ ముప్పాతిక సేరు మాత్రమే తెప్పిస్తున్నాను, ధున్నూ ఒక్కడికోసం” అన్నాను.
”అయితే మరి అమ్మాయికో? దానికి అక్కర్లేదా?” అన్నారాయన.
”తెచ్చే పాలు ధున్నూకే చాలటంలేదు. సగ్గుబియ్యం ఉడికించి పాలతో పాటు నీళ్లు కూడా కలపాల్సి వస్తోంది. మీకేం, చెప్తారు!” అన్నాను.
”నిన్ను డాక్టర్‌ పెరుగు తినమన్నాడు కదా?”
”లేదు…. డాక్టర్‌ నన్నింత విషం మింగమన్నాడు!”
”విషం తింటే ఇంకేం, అంతా అయిపోయినట్టే!”
కొన్నాళ్లకి పిన్నికి దగ్గు పట్టుకుంది. వంటపని ఈయన పాల పడింది. ”నీ పెళ్లాం చేత చేయించకూడదా? నువ్వెందుకు చేస్తున్నావు?” అంది పిన్ని ఆయనతో. అయితే ఆవిడ జబ్బు రహస్యం ఇదన్నమాట! మూడురోజులు మా ఆయనే వంట చేశారు. పిన్ని భోజనం చెయ్యలేదు. మూడోరోజు భోజనం చేసి ఈయన పడుకుంటే వచ్చి, ”అబ్బాయికి టెలిగ్రామివ్వు. వచ్చి నన్ను తీసుకెళ్లమను,” అందావిడ.
”ఎక్కడికెళ్లాలని?” అన్నారాయన.
”వాడిని వచ్చి నన్ను లమహీకి తీసుకెళ్లమని చెప్పు,” అందావిడ.
”ప్రస్తుతం చేతిలో మందులు కొనేందుకు కూడా డబ్బులేదు. ఎనిమిది నెలల పసిగుడ్డు పరిస్థితి ఎలా ఉందో చూస్తు న్నావుకదా! పైగా చిన్నా మొన్ననే వెళ్లాడు. వాడి ప్రయాణానికే పాతిక రూపాయలు ఖర్చయాయి. ఇవేమీ నీకు పట్టలేదు. అంతగా వెళ్లాంటే ఒక బెనారెస్‌ కుర్రాడున్నాడు, వాడిని తోడుతీసుకుని వెళ్లు,” అన్నారు. (ఇంకా ఉంది.)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.