ఓ లచ్చవ్వ

జనగామ రజిత
1958 ఏప్రిల్‌ 14న హన్మకొండలోని ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అనిశెట్టి రజిత, వరంగల్‌లోని ప్లాటినమ్‌ జూబ్లి స్కూల్‌లో తన ప్రాథమిక విద్యనభ్యసించింది. హైస్కూల్‌విద్యకి ఫాతిమా స్కూల్‌లో చేరిన రజిత ఆ పాఠశాల నిర్వహించిన వివిధ సాహిత్య పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నది. రేడియోలో ప్రసారమయ్యే కవిసమ్మేళనాలు విని శ్రీశ్రీ, దాశరథి, సినారె, ఆరుద్ర, జాషువా, కరుణశ్రీ వంటి కవుల కవిత్వం చదివే ఆ క్రమంలో కవిత్వ రచనను ప్రారంభించింది.
అనిశెట్టి రజితకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉంది. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల నుండి స్త్రీవాద దళితవాద ఉద్యమాలన్నింటితో ఆమె నడిచింది. ప్రజారాజకీయ చైతన్యంలో ఆధిపత్య స్వభావాలకు దూరంగా బతుకుతున్నది. రాజకీయ చైతన్యంతో కవిత్వం రాస్తున్నది. తన కవిత్వంలో అనేక సామాజిక సందర్భాలను నమోదు చేసింది.
పసితనంలో కవిత్వానికి శ్రీకారం చుట్టినా, తనదైన శైలిలో ఒక పరిణతి చెందిన తెలంగాణ కవయిత్రిగా, సాహిత్య వేదికపైకి అరంగేట్రం చేసింది మాత్రం ”గులాబీలు జ్వలిస్తున్నాయి” (1984) అనే కవితా సంపుటి ప్రచురణతోనే. దానిలో స్త్రీ చైతన్యానికి సంబంధించిన కవితలు ఉన్నాయి. 1997లో ”నేనొక నల్లమబ్బునౌతా” అనే కవితల సంపుటి ప్రచురించారు. దానిలో పీడితుల చైతన్యం ఉంది. నోరులేని జీవాలైన స్త్రీలు, దళితుల బాధలను అనుభవాలను కళ్ళారాచూసిన రజిత, కవితల రూపంలో తన ఆక్రోశాన్ని వెళ్ళగ్రక్కింది. 1999లో ‘చెమటచెట్టు’ అనే కవితా సంపుటిని, 2002లో ‘ఉసురు’ తెలంగాణా ప్రజల వెతలకు సంబంధించిన అంశాలతో ప్రచురించి ప్రజాకవి కాళోజికి అంకితం ఇచ్చింది.
2005లో తెలంగాణాప్రాంత కరువు ప్రపంచీకరణ దుష్ప్రచారాలు, రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు సంబంధించిన అంశాలతో ”గోరంత దీపాలు” ”నన్హే-ఓ నన్హే” (నానిలు), దస్తఖత్‌ (హైకులు)లు సంపుటాలు ప్రచురించింది. ‘అమ్మ త్యాగాలు’, ‘మనిషి కోసం’, ‘బహుముఖాలు’, ‘మదర్స్‌డేలు’ వచ్చినా రోజురోజుకి తల్లులు అనాథలు అవుతున్నారని ‘అమ్మ సంస్కరణదినం’ కవితాతో సంప్రతిని ప్రకృతి-ప్రేమలు, ధ్వంసమైన మానవవిలువల్ని ప్రస్తావిస్తూ ‘అనగనగా కాలం’-కవితా సంపుటిని ప్రచురించింది. కరీంనగర్‌ జిల్లా, గంగాధర మండలం ఒద్వారం గ్రామ సర్పంచ్‌ కవ్వంపల్లి లచ్చవ్వను మగకుల దురహంకారులు దొంగ సంతకాలు ఒర్తించి, లక్షలు మింగిందని హింసించిన నేపధ్యంలో 1998లో వ్రాసిన ‘ఓలచ్చవ్వ’ కవిత్వంను, దీర్ఘకవితగా మలచి 2005లో ‘ఓలచ్చవ్వ’ అనే శీర్షికతో ప్రచురించింది.
2006లో తన స్వయం అనుభవాల నేపథ్యంలో నుంచి ”మట్టిబంధం’ అనే కథా సంపుటిని, 2007లో ప్రాపంచిక అంశాలలో విభిన్నమైన పరిచయాలలో ఆమె కవిత్వానికి, కథలకు తెలంగాణ జీవితం, భాష, జనజీవాలనిచ్చాయి. ఆమె కవిత్వంలో తెలంగాణ భాష విస్తృతంగా వాడారు. ఉదాహరణకు : బేరిపోయి, గార్వం, సోపతి, సోయి, సుత, గాల్లే, తేర్గ వంటి తెలంగాణ పదాలు నుడికారులు, జాతీయాలు కన్పిస్తాయి.
రజిత ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగిగా వుంటూనే ఇటు దళిత బహుచన స్త్రీల ప్రయోజనాల కొరకు అటు తెలంగాణ రచయితల వేదికకు పనిచేస్తున్నది. ‘ఓలచ్చవ్వ’ అనే ఈ దీర్ఘకవితలో స్త్రీ-అణచివేతను అందులోను దళిత బహుజన స్త్రీ-అణచివేతను గొంతెత్తి నిరసించింది రజిత. ఒద్యారం గ్రామ సర్పంచ్‌ లచ్చవ్వను మగకుల దురహంకా రులు హింసించిన వార్త రజితలో ఆక్రోశాన్ని ఆవేశాన్ని కలిగించి కవిత రూపంగా బయటికి వచ్చింది. విస్తృతంగా వ్రాసిన రజిత సాహిత్యం నుండి ఓలచ్చవ్వ దీర్ఘకవితను ప్రత్యేకంగా అధ్యయనం చేయటం ఈ ప్రసంగ పత్ర ఉద్దేశ్యం.
కట్టెలపొయ్యి ముంగుటకుండల గింజడికేసి
పొగసూరుకుంట నిర్రనిల్గీ ఆడ్ది గద్దె మీనకూసుంటే
గద్దెలసోంటి మొగోల్లకు నిమ్మలంగుంటాదె అవ్వ?
అని స్త్రీకి నాయకత్వం నామమాత్రం అసలు పెత్తనం మగవాల్లదే అంటుంది – రజిత. ఆమెది దళిత స్త్రీవాదం, మహోన్నతమైన మాతృస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ దళిత బహుజన స్త్రీ సామాజిక సాధికారాన్ని సాధించాలనే తిరుగుబాటు వాదం, స్త్రీ సాధికారత అంటూ ప్రభుత్వం స్త్రీలకు రాజ్యాధికారం కోసం రిజర్వేషన్లు కల్పించటం హర్షదాయకమే కాని ఈ 33% రిజర్వేషన్‌ను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన స్త్రీలను తమ కుటిల ఆధిపత్యంతో తోలుబొమ్మలుగా చేసి, పరోక్షంగా పురుషుడే అధికారం చెలాయిస్తున్న వర్తమాన సంధర్భంలో ఒక దళిత స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుంది ఓ లచ్చవ్వ కవిత ద్వారా రజిత చూపించింది.
ఇలా సమాజంలో స్త్రీ అందులో దళిత స్త్రీ పైగా నిరక్షరాస్యురాలైన స్త్రీ అయిన ‘లచ్చవ్వ’ అనే వాస్తవ వ్యక్తిని కేంద్రంగా చేసుకొని రజిత సమాజంలోని స్త్రీలను చైతన్యపరుస్తూ ‘ఓ లచ్చవ్వ’ దీర్ఘకవిత వ్రాసింది. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో 24 ఖండికలు – ఒక స్త్రీ ఎలా అణచివేతకు గురవుతుంది, సమాజంలో స్త్రీకి గల స్థానం ఏమిటి అందులో దళిత స్త్రీ పరిస్థితి ఏమిటో ఆమె ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వాటిని ఎలా ఎదుర్కోవాలో సూచిస్తూ వ్రాయటం జరిగింది. రెండవ భాగంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా లచ్చవ్వ ఎదుర్కొన్న సమస్యలపట్ల పరిస్థితులపట్ల సానుభూతిని, సహానుభూతిని ప్రకటిస్తూ తిరుగుబాటుకు ప్రేరేపించింది.
ఈ కంప్యూటర్‌ యుగంలో సైతం మనిషికి – మనిషికి మధ్య కులం అనే కొలబద్ద నిర్ణయించిన దూరాలు అణుమాత్రమైన తగ్గని తీరును నిరసిస్తూ –
కులానికి, కులానికి
వెలివాడలంతదూరం
అంటితే అపచారమంతదూరం
జన్మంత ఆ దూరం భారం
అంటుంది రజిత. ఇలా కులవివక్షకు చోటిస్తున్న సమాజాన్ని ప్రశ్నించమని ఉద్భోదిస్తుంది. వామనుడి పాదంలా తమను అధఃపాతాళానికి అణగద్రొక్కిన వర్ణవ్యవస్థ రూపకర్తలను నిలదీయమంటూ
రాతలు రాసిన బ్రహ్మనడుగు
బ్రహ్మపుత్రులైన బాపనయలనూ
పండితోత్తములనూ అడుగు – అని బాధితులను ప్రేరేపిస్తుంది.
కులం తలరాత అంటూ సర్ధుకుపోయే దళితులను చైతన్యపరుస్తూ
దానాలు మనయే
బలిదానాలు మనమే
అని ఈ వర్ణవ్యవస్థతో దళితులు ఎలా దోచుకోబడుతున్నారో వివరిస్తుంది రజిత. ఒక కులం వారు ఇంకొక కులం వారిపై అధికారం చెలాయించి అణగద్క్రొటాన్ని నిరసిస్తూ.
భారతదేశమంటే ఏందవ్వ
………………………..
ఇక్కడ కులం మీద కులం
ఏనుగె ఎక్కితొక్కుతది
మనిషి మీద కులం
జులుం జేస్తది.
అని పనికిమాలిన కుల వ్యవస్థను ఎద్దేవా చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి భారతీయుని జీవితాన్ని కులం శాపిస్తుంది. ఇదే విషయం స్పష్టం చేస్తూ
మనిషి పుట్టకముందే
కులం పుడ్తది
పుట్టినంక ఆ కులం
మనిషిని వేటాడుతుంది.
అంటూ మనిషిపై కులం యొక్క దుష్ప్రభావాన్ని ఎండగడుతుంది. ఒకవేళ కులం ఉచ్చుల్లోంచి బయటికి వచ్చి ఏ అధమ జాతివాడైన విద్యనభ్యసిస్తే వాడిని బతికి బట్టకట్టనివ్వదు ఈ సమాజం అని వాపోతుంది.
చదువుమాట తీస్తే నేరం
చదువు బాట పడ్తే ద్రోహం
శంభూకుని తల తెగిందందుకే
ఏకలవ్యుని బొటనేలు కోసిందందుకే అని చరిత్రను తవ్విపోసింది. ఇలా అజ్ఞానాంధకారంలో సుడులు తిరుగుతున్న పంచముల తలరాతలు తరాలు మారినా మారలేదు అంటుంది. నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో కింది వారు అవమానాలపాలు అవుతూ శారీరకంగా, మానసికంగా గాయపడుతున్న స్థితిని
మన మానాలను అవుమానించే
అగ్రకులపు మాటలు
దెబ్బలు గాయాలు – అన్న మాటల్లో చెప్పింది.
మూతికి ముంత కట్టుడు
నడుముకు తాటాకు కట్టుడు
వాళ్ళ గాలికి నేలకు శుద్ధంటూ దళితులకు జరిగిన అవమానాల పట్ల ఆగ్రహం వెళ్ళగక్కింది. ఇక స్త్రీ విషయంలో వివక్ష ఇంకా తీవ్రస్థాయిలో వుంటుంది. ఒక ఉన్నత కులానికి చెందిన స్త్రీ పరిస్థితి కాస్త మెరుగు ఎందుకంటే తాను స్త్రీగా మాత్రమే వివక్షకు గురవుతుంది. కాని ఒక దళిత మహిళ, ఆమె స్త్రీ అయినందుకు మాత్రమే కాక అందులోను దళితురాలైనందుకు అదనపు వివక్షను ఎదుర్కోవాలి.
ఆడోళ్ళు అంటరానోళ్ళే లచ్చవ్వ.
అంటూ స్త్రీల నిస్సహాయతను చూపిస్తుంది. ఒక స్త్రీ అందునా దళిత స్త్రీ సమాజంలో ఎదుర్కొనే సమస్యలు అన్ని ఇన్ని కావు అని చెబుతూనే.
బతుక్కు చావుకు లంకె
నీటికి తట్టుకు లంకె
కులం తక్కువ ఆడదానికి
దరిద్రానికి లంకె.
అంటూ ఒక దళిత స్త్రీ అధికారంలోకి రావటం ఎంత దుర్లభమో తెలియజేస్తూ
మనకు గొప్పలు వోదాలెక్కడియి
పేరు కీర్తులెక్కడియి
పిల్సి పీఠలెవరేస్తరు
రోజుసచ్చిరోజు బత్కుడగాద
గాడ్దిశాకిరి కుక్కకావలి. అంటూ – దళిత స్త్రీ జీవితం నిరంతర చాకిరిలో నుగ్గయిపోవటాన్ని సూచించింది.
జుర్రుకుంటున్నారు
లొట్టలేసుకుంట మన శ్రమను నంజు కుంటున్నారు.
అని దళిత స్త్రీలు శ్రమ దోపిడికి గురికావటాన్ని నిరసించింది. ఇటువంటి జీవితాన్ని చీత్కరిస్తూ
ధూత్తెరి! ఏం బత్కులు
అటు పసురాలం గాకపోతిమి
ఇటు మన్సులల్ల కలువనీయకపోయిరి.
అంటుంది రజిత. ఇలా ఎన్నాళ్ళు? అందుకే తమ తరతరాల న్యూనతల్లోనుంచి బయటికి రావాలని ప్రోద్భలం ఇస్తుంది. అలాగే వర్ణాశ్రమ కట్టుబాట్లు, బిడియం అనే ఊబిలోనుండి దళిత స్త్రీ బయటికి వచ్చి, తమకు జరిగే అన్యాయాలను ఎదిరించాలని ఉద్బోద చేస్తూ – కవయిత్రి అంటుంది కదా!
ఇగోలచ్చవ్వా
ముందుకు నడువే అవ్వా
పాతాళం నుండి చీల్చుకచ్చే
గడ్డపారలం మనం
………………….
నిప్పుకణికలం మనం
దయిద్దాం దయిద్దాం
ఇలా మహిళాలోకాన్ని తిరుగుబాటు బాటలోకి ప్రేరేపిస్తుంది. వారిలో నిద్రాణగా ఉన్న ఉద్వేగాల్ని, కోపాగ్నిని రగిలిస్తూ తమకు జరిగే అన్యాయాలపై సివంగిలా దాడిచేసి పారద్రోలమంటూ…
”ఢమక్‌ ఢమక్‌ ఢమక్‌
జాంబవతివై అడుగుతాయి
అరుంధతివై పొలికెకెయ్యి
చండాలికవయి చెలరేగు”
అంటుంది రజిత. ఇంతవరకు అబలలు, ఇప్పుడు సబలలు కావాలి. ఇంతవరకు వంటింటి కుందేలు, పురుషుని చేతిలో మరబొమ్మ, ఒక ఆటవస్తువు – ఇప్పుడు ఆ పరిస్థితికి స్వస్తిచెప్పి కదనరంగాన కాలిడమని చెబుతుంది. స్త్రీ-పురుష సమానత్వం సాధించాలంటే రణం తప్పనిసరి.
గుడ్లనీల్లు కుక్కుంట బెంగటిల్లినోల్లు
కొంగులు నడుములకు చుట్టిన్లు
మెట్నలు తాపులు గుతపలు గూటాలు
తాల్లురాల్లు కత్తులు కొడువల్లు
పట్టుకుని దమ్ములగ్గబట్టి
జగడానికి వస్తున్నరు. – అని దళిత బహుజనుల ఊరేగింపును మన కళ్ళముందు నుండి నడిపించుకుపోతుంది రజిత. ఇలా స్త్రీలందరు ఏకమైతే సమాజంలో భూకంపం వచ్చినట్లే. ఎందుకంటే అనాదికాలంగా వేళ్ళూనిన పురషసామ్రాజ్యం ప్రకంప ిస్తూంది. మూలాలు పాతుకుపోయిన వేళ్ళుకదుల్తాయి అంటుంది రజిత. ఏదేమైనా పోరాడమంటుంది. విజయమో వీరస్వర్గమో పోరాటంలోనే తేల్చుకోమంటూ
ఒంటూపిరి పానం పోతేంపోతది
లేకుంటే పోతది బాంచెతనం
మని చరిత్రను రాస్తది
పామరి… రామరి…
అని పోరాటానికి పిపిలీకల్లాంటి స్త్రీలదండును సన్నద్ధం చేస్తుంది. అదే ఉద్వేగంలో అంతులేని ఆత్మవిశ్వాసంతో తనకు జరిగిన అన్యాయాన్ని నిలదీయని తలవేలిని వెలివేయమంటూ లచ్చవ్వకు ధైర్యం నూరిపోస్తుంది.
గిదెవలిరాజ్జమే అవ్వ లచ్చవ్వ
నువ్వు సర్సంచువైనా ఇంకేదైనా సుత
గాకులాలు కుతకుత ఉడుకయానె లచ్చవ్వ.
అంటూ అట్టడుగు వర్గాలవారు ఏ అధికారంలో ఉన్నగాని వారికి అంటిన కులం అనే వర్గాన్ని తుడుచుకోలేక పోతున్నారు. ఇందుకు కారణం భారత సమాజంలో పేరుకుపోయిన కులం అనే మష్టు. దీనికి తోడు ఆ అధికారంలో ఉన్నవారు దళితస్త్రీ అయితే – వారిని కించపర్చి, కిందికి దించేవరకు ఈ పురుషాధిక్య సమాజానికి నిద్రపట్టదు అంటూ –
మనం కుర్సీలెక్కి కూసుంటె
గాల్ల నెత్తురు కాగికాగి కసిమీరదానె లచ్చవ్వ
కట్టెల పొయ్యి ముంగట కుండల గింజలుడికేసి
పొగసూరకుంట నిర్రనీత్గి ఆడ్దిగద్దె మీనకూసుంటె
గద్దలసొంటి మొగోల్లకు నిమ్మలంగుటాదె అవ్వ.
అని ఈ పరిస్థితి తనొక్కదానిది మాత్రమే కాదనీ, స్త్రీజాతి మొత్తానిది అని, సమిష్ఠిగా ఎదుర్కొనవలసిన సమస్య అని రజిత సూచించింది. మహిళలకు సాధికారత కల్పిస్తామంటూ ఢంకా భజాయించి చెప్పే అధికారులు, పురుషులు, స్త్రీ అధికారాన్ని మాత్రం జీర్ణించుకోలేరు. స్త్రీకి స్వతంత్య్ర మెక్కడిది అని ప్రశ్నిస్తారు.
మనం ఊల్లేలితే అవ్వ! ఊరుకుంటారె – అంటే పురుషుల అధికారదాహాన్ని, ఆధిపత్య స్వభావాన్ని నిరసిస్తుంది. ఒక స్త్రీ తానెవరైనా సరే అన్యాయం పాలైనప్పుడు తనకు చేయూతనిచ్చే వారెవరూ ఉండరు. పైగా ఆమెను నిందించేవారే ఎక్కువగా వుంటారు.
సదువురాని నీతోటి సంతకాలు ఒత్తింది
……………………….
నువ్వుపైసలు మింగలేదని లబ్బదెబ్బ మొత్తుకుంటూ
నీకు సాయంగ ఎవరు రాకపోయిరి
నెత్తినోరు గొట్టుకోని ఏడుత్తాయె
గీ కువ్వారపు నాకొడుకులు పగులబడి నవ్వుతాండ్లే అవ్వ.
నీకొంప జప్తు చేసి నిన్ను బజాట్ల పడేస్తననిరి తల్లి
…………………………
నువ్వు దళిత తల్లివే అవ్వ – అంటూ అందుకే ఈ పురుషాధిక్య సమాజంపై తిరగబడమని తనను అన్యాయంగా నిందించిన వ్యవస్థను నిలదీయమనీ చెబుతుంది. అపనిందను కడిగేసుకోమని, ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోని దోషులను – కారకులను నిలదీయమని వెన్నుతట్టి చెబుతూ-
”ఇక మనం సరాయించుకోవాల్నె
గాల్ల మొకాలమీన ఊంచుకుంట
ఉరుములురుమే నల్లమబ్బుతునకోలిగే
ఊరంత వానగొట్టి కడిగేసుకుంట
కర్రమబ్బుల దండై కదలాల్నె లచ్చవ్వ”
అంటూ యుద్ధభూమికి రండని స్త్రీజాతికి పిలుపునిస్తుంది. ఎప్పుడు ఇంటికి పట్టిన బూజు దులిపే స్త్రీ అనుక్షణం కుళ్ళిపోతున్న సమాజపు బూజులు దులపాలని, స్త్రీని చైతన్యపరుస్తుంది. స్త్రీల సాధికారత వాస్తవార్ధంలో ఆచరణలోకి రావాలంటే స్త్రీలు దాటాల్సిన గడపలు, చేయాల్సిన పోరాటాలు ఎన్ని వున్నాయో ‘ఓలచ్చవ్వ’ కవిత శక్తిమంతంగా చెప్పగలిగింది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.