అద్దంలోంచి శ్రీశ్రీగారిని

ఇంద్రగంటి జానకీబాల
శ్రీశ్రీ అంటే ఉద్యమం – శ్రీశ్రీ అంటే విప్లవం. శ్రీశ్రీ అంటే విషాదం, దుఃఖం, వేదన, ఆవేదన – లోకం బాధ శ్రీశ్రీ బాధ అని నానుడి వుండనే వుంది. అయితే ఒకే భావ వ్యక్తీకరణకి కట్టుబడి వుండే తత్వం కాదు శ్రీశ్రీది. అందుకే ఆయన మహాకవి.
ఎలాంటి భావాన్నైనా అంతరంతరాల్లోంచి అవలీలగా పలికించగల ప్రతిభాశాలి, అందుకే శ్రీశ్రీ సినిమాకవిగా అత్యున్నతమైన స్థానంలో నిలబడ్డారు.
విప్లవ నినాదాలు, ఉద్యమ ప్రబోధాలకే శ్రీశ్రీ పరిమితం కారు. ఆయనలోని మరో పార్శ్వం సినిమా పాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రకృతి, ప్రేమ, దిగులు, బెంగ శ్రోతల్ని కంటతడిపెట్టించిన సందర్భాలెన్నో.
డబ్బింగు సినిమాతోనే ఆయన తెలుగు సినీరంగ ప్రవేశం చేశారు. నీరా అవుర్‌ నందా అనే హిందీ సినిమాను ‘ఆహుతి’ అనే తెలుగు సినిమాగా రూపుదిద్దడంలో శ్రీశ్రీ తన సహజసిద్ధమైన ప్రతిభతో ముందుకొచ్చారు. ఆ సినిమాకి మాటలు, పాటలు ఆయనే వ్రాశారు. అసలు డబ్బింగు చిత్రాలకు ఒరవడి పెట్టింది శ్రీశ్రీయేనని చెప్పాలి.
గాంధారి గర్వభంగం – ‘జింబోనగర ప్రవేశం’
హనుమాన్‌ పాతాళ విజయం -
‘సంపూర్ణ రామాయణం’ లాంటి హిందీ సినిమాలను తెలుగులోనికి అనువదించారు. ఆ పాటలు వింటూ వుంటే డబ్బింగు పాట అనిపించకుండా ఒరిజినల్‌ అనిపిస్తుంది.
పాటలు వ్రాయడంలోనైనా, మాటలు వ్రాయడంలోనైనా ఒక ప్రత్యేకతను, ఒక కొత్తదనాన్ని చూపించటం ఆయన లక్షణం.
శ్రీశ్రీలోని విప్లవాన్ని, ఉద్యమ నినాదాల్నీ పక్కనపెట్టి ఆయన వ్రాసిన లలితమైన, సున్నితమైన పాటల్ని చూస్తుంటే ఆ మనిషి, ఈ మనిషి వేరు అనిపిస్తుంది. స్వేచ్ఛగా తన భావాన్ని చెప్పడమేగానీ, ఏ భావజాలచట్రంలోనూ ఇరుక్కుపోయే స్వభావం శ్రీశ్రీది కాదేమోననిపిస్తుంది.
ప్రకృతి అందాలు చూసి పులకించిపోయే ఒక యువతి హృదయాన్ని ఈ పాటలో సున్నితంగా, సొగసుగా ఆవిష్కరించారు.
”తెలియని ఆనందం – నాలో కలిగినదీ ఉదయం -
పరవశమై పాడే నా హృదయం -”
ఈ పాట మాంగల్యబలం సినిమాలోనిది. సంగీతం మాష్టర్‌ వేణు సమకూర్చగా పి. సుశీల పాడారు. అలాగే శ్రీశ్రీ ఆరాధన చిత్రంలో ‘వెన్నెలలోని వికాసమే – వెలిగించెద నీ కనుల’ అంటూ వ్రాశారు.
శ్రీశ్రీ వాడిన ప్రతీపదమూ ఎంత మెత్తగా సున్నితంగా మధురంగా వుంటుందో ఈలాంటి పాటలు విన్నప్పుడు అర్థమవుతుంది. ఆరాధన సినిమాకి ఎస్‌.రాజేశ్వరరావు సంగీతం కూర్చారు. ఈ పాట సుశీల పాడారు.
ఇలాంటి ఊహలు కూడా శ్రీశ్రీ చేస్తారా అనేలాంటి కొన్ని సంసార పాటలున్నాయి. మాంగల్యబలం సినిమాలో చిన్నపిల్లలు బొమ్మలపెళ్ళి చేసుకుంటూ పాడే పాట ‘హాయిగా ఆలుమగలై-కాలం గడపాలీ’-. ఈ పాటనిండా కొత్త పెళ్ళికూతురికి నీతులు చెప్పడమే. ఆమె అత్తవారింట్లో ఏ విధంగా మసలుకోవాలో చెప్పడమే-, చివరి చరణంలోని పంక్తులు చూస్తే – ఎంత సంప్రదాయ సిద్ధంగా ఈ పాట కవి వ్రాశారు! అని ఆశ్చర్యం వేస్తుంది.
ఇది సినిమాపరమైన, పాత్రోచితమైన గొప్పపాటగా చెప్పక తప్పదు.
వేయిగుండెల్ని కరిగించగల పదబంధాలు ఆయనకి కరతలామలకం-,
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు-,
నీ కోసము కన్నీరు నించుటకు-,
అని డా|| చక్రవర్తిలో వ్రాస్తే – అది విని గుబులుపడనివారు వున్నారంటే అది అబద్ధమే.
మనసున మనసై – బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమూ – అదే స్వర్గము.
మనసు అనగానే అందరూ ఆత్రేయగారిని తల్చుకుంటారు. కానీ అంతకు పదిరెట్లు ఎక్కువ శ్రీశ్రీ మనసు.
అదే విధంగా జీవితసత్యాన్ని అతిసామాన్యుడికి కూడా మనసులో నాటుకుపోయేలా వ్రాయడం శ్రీశ్రీకి వెన్నతోపెట్టిన విద్య.
అగాధమౌ జలనిధిలోనే ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగునదాగీ సుఖమున్నదిలే – అంటారు.
ఇది ‘వెలుగునీడలు’ సినిమాలోనిది. దీనికి పెండ్యాలవారు సంగీతం కూర్చగా, ఘంటసాల వెంకటేశ్వరరావు గొప్పగా పాడిన పాట యిది.
”నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ”
ఇది ‘ఆరాధన’ చిత్రంలో ఘంటసాల పాడిన పాట-, దీనికి సంగీతం ఎస్‌.రాజేశ్వరరావు. అయితే ఈ పాట ట్యూన్‌ మక్కీకిమక్కీ బెంగాలీ పాటను తీసుకు తయారుచేశారు. ట్యూన్‌ బెంగాలీదైనా శ్రీశ్రీ వ్రాసిన పాట మాత్రం అచ్చుతెలుగుపాట. ఇంత రొమాంటిక్‌ సాంగు శ్రీశ్రీ ఎలా వ్రాశారు? అన్నవారూ వున్నారు.
నా రాణి కనులలోనే – ఆనాటి ఈ కలలుదాగే – అంటూ అత్యంత శృంగారం పలికిస్తారు-,
పెనుచీకటాయె లోకం – చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమా – విధియే పగాయె-
మాంగల్యబలంలోని ఈ పాటలోని మాటలే శూలాల్లా మనసులో గుచ్చుకుంటాయి – ‘చెలరేగే’ – ‘విషమాయే’ – విధియే – ‘పగ’ నిజంగా నాయికానాయకుల మనోవేధన శ్రోతలకు బెంగ కలిగేలా వ్రాసిన పాట యిది.
కొన్ని పాటలు ముచ్చటించుకున్నామని, అవే శ్రీశ్రీ పాటలని సరిపెట్టుకోలేం – ఎన్ని భావాలు, ఎన్ని బాధలు-, ఎన్ని ప్రబోధాలు- ఎన్ని విప్లవనాదాలు- సముద్రాన్ని బుడిగి చెంబులో పట్టి ఇదే సముద్రం అంటే ఎలా?
(1) పాడవోయి భారతీయుడా (2) ఎవరో వస్తారని (3) చీకటిలో కారుచీకటిలో (4) కళ్ళలో పెళ్ళిపందిరి (5) వినుము చెలీ తెలిపెదనే (6) ఏమని పాడెదనో (7) ఎవరివో నీవెవరివో (8) ఉన్నవారికే అన్ని సుఖాలు (9) బొమ్మను చేసి (10) తూరుపు సిందూరపు (11) నీమీద మనసాయరా (12) ఓహో మోహనరూపా (13) కలకల విరిసి (14) చల్లని రాజా ఓ చందమామా (15) దేశము మారిందోయ్‌ (16) ఓ రంగయో (17) జయమ్ము నిశ్చయమ్మురా (18) పయనించే మన వలపుల (19) ఆకాశవీథిలో అందాల జాబిలి (20) భూమికోసం -
ఇలా వ్రాసుకుంటూపోతే శ్రీశ్రీ పాటల లిస్టు ఆగేది కాదు – ఇవే గొప్ప పాటలు, మంచి పాటలు అని అర్థం కూడా కాదు. ఇంకా ఎన్నో పాటలున్నాయి.
ఒకసారి ఒక రికార్డింగులో ‘శ్రీశ్రీ గారు, శ్రీశ్రీ గారు’ అంటూ వినిపించి అటుచూశాను. పాట రికార్డు చేసే ఇంజనీర్‌ పక్కన కూర్చుని ఏదో మాట్లాడుతున్నారు-, అదే శ్రీశ్రీ గార్ని నేను మొదటిసారి చూడటం అదీ అద్దంలోంచి-. అప్పటికే నేను మహాప్రస్థానం చదివి- అందులోని గీతాలు – ‘చూడు చూడు నీడలు’ – గగనమంతా నిండి స్నేహితులు దగ్గర పాడిపాడి వున్నాను. ఆ తర్వాత చాలా సభల్లో ఆయన్ని చూసినా, ఆ అద్దంలోంచి నేను చూసిందే నాకిప్పటికీ గుర్తుండిపోయంది

Share
This entry was posted in పాటల మాటలు. Bookmark the permalink.

3 Responses to అద్దంలోంచి శ్రీశ్రీగారిని

 1. ఈ ఆర్టికిల్ చదువుతున్నంతసేపూ అద్దం లోంచి చందమామను చూస్తున్నంత హాయిగా అనిపించింది.
  శ్రీశ్రీ అనగానే ఎర్రబావుటా నిగనిగలు, విప్లవ జ్వాలల భుగభుగలే గుర్తుకొస్తాయి. అట్లాంటి శ్రీశ్రీ ఇంతటి ఆర్ద్రతతో , ఆర్తితో , ఆత్మీయతతో , ప్రేమతో మనసును పరవశింపజేసే పాటలు రాశారంటె ఆశ్చర్యంగా వుంది.
  పెను చీకటాయే లోకం, ఓహొ మోహన రూపా, చల్లని రాజా ఓ చందమామా, హాయిగా ఆలూ మగలై కాలం గడపాలీ వంటి పాటలు వందలసార్లు విన్నప్పటికి అవి శ్రీశ్రీ రాసినట్టే తెలియదు.
  జయమ్ము నిశ్చయమ్మురా … పాట ఆయన రాసింది కాదేమొ అని ఇంకా సందేహం.
  ఏమైనా వీటన్నింటినీ అర్జంటుగా సేకరించి శ్రీశ్రీని తలచుకునంటూ మళ్ళీ వినాలనిపిస్తోంది.

 2. Anonymous says:

  ఆయన రాసిందే ………శ్రీ శ్రీ ……..గురించి ఏమి చెప్పలెము

 3. subbarao says:

  శ్రీ శ్రీ పాటలు బ్రహ్మండంగా వ్రాశారు …. సాహిత్య పరంగా చాలా బాగుంటాయి….అలాంటి పాటలు మళ్ళే మళ్ళీ
  రావు. – కె .సుబ్బారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>