ఒక్కటైతేనేమి?

ఇంద్రగంటి జానకీబాల
క్రిందటిసారి ఒకే ఒక పాటగానీ, రెండు మూడు పాటలు గానీ వ్రాసి శాశ్వితమైన కీర్తిని సంపాదించుకున్న సినిమా వులగురించి మాట్లాడుకున్నాం కదా! అదేవిధంగా ఒక్కపాటపాడి, ఒక్క సినిమాకి సంగీతం చేసి, మంచి పేరు సంపాదించుకున్న వారు కూడా వున్నారు. కృషి చేయడం, అది ఫలించటం, అందరికీ నచ్చడం, పేరు ప్రతిష్టలు రావడం అనే అంశాల గురించిన ఆర్గుమెంటు వుండదు. ఏకళలోనైనా పట్టుదలతో చిత్తశుద్ధితో పనిచేయడానికి ఆ కళాకారుడికి, కళాకారిణికి ఒకకాలం వుంటుంది. అప్పుడది తప్పక రాణింపుకొస్తుంది..
1955లో విడుదలైన ‘సంతానం’ సినిమాకి సంగీతం నిర్వహించిన వారు సుసర్ల దక్షిణామూర్తి. ఈయన చక్కని సంగీతజ్ఞులు. అప్పటికే ఆయన ‘సంసారం’ లాంటి సినిమాల ద్వారా పేరొచ్చిన సంగీత దర్శకులు. అప్పట్లో బొంబాయి హిందీ సినిమా సంగీత ప్రపంచంలో అగ్రస్థానంలోవుండి అద్భుతమైన పాటలు పాడిన లతామంగేష్కర్‌ చేత తెలుగులో ఒక పాట పాడించాలని ఆయనకి బలమైన కోరిక కలిగింది. నిర్మాతలు కూడా సహకరించి ఆమె చేత ఒక పాట పాడించాలనీ, ఆమె వచ్చి తెలుగులో పాడటం తమకి అదృష్టమని భావించారు. లత కూడా ఎంతో ఉత్సాహంగా పాడేందుకు అంగీకరించారు. అన్నీ సవ్యంగా జరిగి లతామంగేష్కర్‌ ‘నిదురపోరా తమ్ముడా! నిదురపోరా తమ్ముడా! అంటూ గానం చేశారు. ఈ పాటను రచించింది పినిశెట్టి శ్రీరామ్మూర్తి. లతామంగేష్కర్‌ పాడతారనే ఆనందంలోనైతేనేమి, మన ప్రతిభ చాటుకోవాలనే పట్టుదలతోనైతే నేమి, కవి అద్భుతమైన పాట వ్రాశారు. దానికి తిరుగులేని ట్యూన్‌ సమకూర్చారు సంగీత దర్శకులు.- అప్పట్లో లతా ఎంత శ్రుతైనా అవలీలగా పాడతారన్న ఆనందం వుండేది. అందుకే ‘జాలి తలచీ- కన్నీరు తుడిచే- దాతలే కనరారే-‘ అనే చరణంలో ఆమెగొంతుని పై స్థాయిలో పలికించి ఆంధ్రాలను మురిపించారు. ఈ పాట ఎంతగా జనాదరణ పొందిందో చెప్పడానికి మాటలు చాలవు. ఆ తర్వాత మళ్ళీ లతామంగేష్కర్‌ తెలుగులో మరేం పాటలూ పాడలేదు. అంటే చాలాకాలం తర్వాత ఇళయరాజా ‘ఆఖరి పోరాటం’ లో ఆమెచేత 80ల తర్వాత పాడించారు. కానీ అవన్నీ వేరు. లతా పాడిన తెలుగుపాట నిదురపోరా తమ్ముడా! మాత్రమే-, ఈ పాటను జూనియర్‌ శ్రీరంజని మీద చిత్రీకరించారు. ఒక్క పాటతోనే తెలుగువారు లతామంగేష్కర్‌ని మరువలేరు. అది తెలుగు సినిమా పాటల పాలిట స్వర్ణయుగం. ఎవరు ఏదిముట్టుకున్నా బంగారమే. లత తెలుగు అర్థం చేసుకుని పాడిన విధానం ఆమె ప్రతిభకు తార్కాణం.
పాతాళభైరవి సినిమా అప్పట్లో పండితుల్ని, పామరుల్నీ ఎంతగానో అలరించిన సినిమా- కథ- మాయలు- మంత్రాలు ఆసక్తిని కలిగిస్తూనే అందులోని సంగీతం ఆంధ్రులనుర్రూత లూగించింది. ముఖ్యంగా పాటలు అందరి పెదవుల మీద అల్లలాడి పోయాయి- ఎంతఘాటు ప్రేమయో- కలవరమాయెమదిలో కనీసం హమ్‌ చెయ్యనివారుండరు.
ఘంటసాల- లీల పాడిన యుగళగీతాలేకాదు. తోటరాముడు మాయల ఫకీరు మాయలో చిక్కుకుని అతని వెంటబడి పోతున్నప్పుడు ‘ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు- అయ్యో! పాపం పసివాడు’ అనే నేపధ్యగీతం ఎరుగని వారుండరు. ఈ పాట పాడినవారు పి.జె. వర్మ-, విచిత్రమైన, లావైన కంఠంతో ఒక ప్రత్యేకత గల స్వరంతో ఆయన పాడినతీరు అందర్నీ ఎంతగానో ఆకర్షించింది. ఈ పాటలో ‘వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమంతో కోరుకునీ’- అనంగానే వచ్చే హమ్మింగు ఘంటసాల పాడటం గమనించ తగ్గవిషయం. ఘంటసాల గొంతులో ఆ రాగం కథ మొత్తానికి గొప్ప స్ఫూర్తినిచ్చింది. తర్వాత వర్మ (ఆ గాయకుడు) పెద్దగా ప్లేబ్యాక్‌ పాడినట్టు కనిపించరు. ఒక వేళ పాడినా- ఆయన పేరు చెప్తే- ‘ప్రేమ కోసంమై వలలో పడెనే పాపం పసివాడు! అంతే-
రేలంగి వెంకట్రామయ్య, గొప్ప హాస్యనటులు. ఆయన ముఖం తెరమీద కనబడగానే జనం ముందుగా నవ్వేసేవారు. ఆ తర్వాత ఆయన పాత్ర నటనా మొదలయ్యేవి. రేలంగి గొప్పగాయకుడేం కాదు. ఏదో కొద్దిగా, చిన్నగా, హాస్యాన్ని పలికించే గొంతు తోనే పాడ గలిగే శక్తి వున్నవారు. ఆయన పాతాళభైరవి సినిమాలోనే తనకు తానే ‘వినవే బాల – నా ప్రేమగోల’ పాడారు. ఈ పాటదృశ్యం ప్రేక్షకులు నవ్వు దొంతరల మధ్య ఆహ్లాదంగా చూసేవారు. రేలంగి అనగానే ఈ పాట తప్పకుండా గుర్తు కొస్తుంది. ఆయన విజయావారి సినిమాల్లోనే మూడు నాలుగు పాటలు పాడారు. రేలంగికి ఎక్కువగా ఘంటసాల ప్లేబ్యాక్‌ పాడారు. ఏది ఏమైనా రేలంగి పాడిన, ధర్మంచెయ్‌ బాబూ సీతారాం- సీతారాం’ అంటూ మిస్సమ్మ (విజయావారి)లో పాడినప్పటికీ-, ఆయన పాడిన వినవే బాల – నా ప్రేమగోల సూపర్‌ హిట్‌ పాట-
రాను రాను తెలుగు సినిమా పాట ఒక నిర్దిష్టమైన రూపాన్ని కోల్పోవడం వల్ల, ఎవరు పాడారు? ఎవరు ట్యూన్‌ చేశారు? అవే ప్రశ్నలు లేకుండా పోయాయి. ఇంకా రచయితలే అక్కడక్కడ మంచి పాటలు వ్రాయాలని తాపత్రయ పడుతున్నారు. అయితే వారు వ్రాసిన పాటల్లోని మాటలు మనకి అర్ధమయ్యే విధంగా సంగీతం సమకూరితే ఒక్కపాటైనా ఆ రచయితకి తృప్తి కలిగిస్తుంది.

Share
This entry was posted in పాటల మాటలు. Bookmark the permalink.

2 Responses to ఒక్కటైతేనేమి?

 1. kusumakumari says:

  వర్మ గాయకుడు-అని,నాకు ఇప్పటి దాకా తెలీనే లేదు.”ఘంటసాల గొంతు,తొలి రోజులలో అలాగే ఉన్నది కాబోలును!”అనుకున్నాను,జానకి బాల గారూ!
  “ఆఖరి పోరాటం”లో లతా పాట ఉన్నదని కూడా,మన గమనికలోనికి రాలేదంటే,ఆపాతమధురముల ఘనతను ఏమని వర్ణించ గలమండీ!
  “నిదుర పోరా తమ్ముడా!…….”లతామంగేష్కర్ స్వర ప్రజ్ఞ ను నిరూపిస్తూ,ఆంధ్రులకు అందించిన
  ఆణి ముత్యం.
  సుసర్ల దక్షిణా మూర్తి సంగీత రచనను చేసారని,తెలుసును,కానీ,పినిసెట్టి శ్రీరామమూర్తి రచన,అని బోధ పరుచుకోనే లేదు.
  ఈ కోణములో,(మొదటి వాళ్ళు)ఈ పాట “లిమ్కా రికార్డు”లకు చేర గలిగితను,స్థాయినీ కలిగి ఉన్నది.

 2. Rohiniprasad says:

  వి.జె.వర్మ పెళ్ళిచేసిచూడులో పోవమ్మా బలికావమ్మా అనే పాట కూడా పాడారు. దక్షిణామూర్తిగారు మొదట సుబ్బరామన్ సంగీతదర్శకత్వంలో మనుచుగా తా ఖుదా తోడై అనే పాటను సత్యం, ఘంటసాలలతోబాటు పాడారు. సంసారంలో సోలో పాట కూడా. ఆయనింకా జీవించే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో