ఇంట్లో ప్రేమ్‌చంద్‌-8 ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్ర

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌.శాంతసుందరి

(గత సంచిక తరువాయి భాగం)
గోరఖ్‌పుర్‌లో ఉద్యోగం వదిలేశాక ఆయన మహావీర్‌ ప్రసాద్‌ పోద్దార్‌ ఇంటికి, మణిరామ్‌కి, వెళ్లారు. అ్కడుండగానే పిన్నీ వాళ్ల నాన్నకి తను ఉద్యోగం మానెయ్యటం విషయమంతా వివరంగా ఉత్తరం రాశారు. ఉత్తరానికి జవాబుగా, ”ఉద్యోగం మానెయ్యటం చాలా పొరపాటు పని చేశావు, ఐనా అది నీ ఇష్టం. నీ పెళ్లాం పిల్లల్ని నా దగ్గర వదిలేసి ఇంకేదైనా పని దొరుకు తుందేమో వెతుక్కో. ఇప్పుడే ఉద్యోగం మానేస్తే ఇక ముందు ఏం చేస్తావు?” అని రాశాడాయన.
ఆ ఉత్తరాన్ని ఆయన నాకు తెచ్చి చూపించారు. నవ్వుతూ, ”ఈ ముసలాయన తనే చాలా తెలివైన వాడినని అనుకుంటు న్నాడు. నిన్నూ, పిల్లల్నీ తన దగ్గర వదిలి, నన్ను ఉద్యోగం వెతుక్కోమని రాశాడు,” అన్నారు.
ఆ ఉత్తరం చదివి నాకు కూడా కోపం వచ్చింది. ”అవును పాపం, మనకి గంపెడు మంది పిల్లలున్నారు కదా! తిండికి మలమల మాడిపోమూ?” అన్నాను.
”ఉద్యోగం మానేసేప్పుడే నేనివన్నీ ఆలోచించాను. ఇప్పుడు వీళ్లొచ్చి నాకు ఉపదేశం ఇస్తున్నారు చూడు! అసలు జీవితమంతా ఏ పనీ చెయ్యకుండా గడిపిన ముసలాయన నేనేం చెయ్యాలో సలహా ఇస్తున్నాడు!” అన్నారు.
”అవును పాపం! పెద్ద జమీందారు కదా ఆయన! మీ కుటుంబం ఎలా బతుకుతుందా అని విచారం!” అన్నాను.
”తన విషయం చూసుకుంటే చాలు, నా కుటుంబాన్ని పోషించినంత, అనుకుంటాను. పదిహేనేళ్లప్పటినుంచే బరువు బాధ్యతలు నెత్తినేసుకోవటం నాకు అలవాటైంది, ప్రస్తుతం దేవుడి దయవల్ల నా విషయం నేను చూసుకుంటే అదే చాలు. ఒకప్పుడు ఎలా ఉండేది! మూడు కుటుంబాల బాధ్యత నామీద ఉండేది. అప్పుడు ఈయన తన బాధ్యత కూడా తీసుకోలేక పోయాడే!” అన్నారు.
”కానీ ఉత్తరం రాశాడుగా, తప్పకుండా బాధ్యత తీసుకుంటాడు లెండి!” అన్నాను.
”బహుశా ఆయనకి నా బరువంతా తన మనవడి మీద వేస్తానని భయం లాగుంది!”
”ఆయన అలా అనుకోవటంలో తప్పేం లేదుగా!”
”ఏమిటి నువ్వు కూడా చిన్న పిల్లలా ఆ మాటలు? తన బాధ్యత తానే వహించగలవాడు, తన పెళ్లాం పిల్లల బాధ్యత వహించలేడా? ఒక వేళ అలాంటి పరిస్థితే గనక వస్తే పిల్లలకి ఇంత విషమిచ్చి చంపెయ్యటమే మంచిది,” అన్నారు.
”కానీ ఆయన అలా అనుకోవటం లేదు, భయపడుతున్నాడు,” అన్నాను.
”వాళ్లు జీవితాంతం సిగ్గు లేకుండా బతికారు. వాళ్లకి ఎప్పుడూ ఆత్మాభిమానం అనేది లేదు. ఇక నేను ఉద్యోగం వదిలేశానంటే నా కలం దన్ను చూసుకునే. ఇంత వరకూ నేనెవరి మీదా ఆధారపడి పని చెయ్యలేదు, నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది. ఇక కొందరి గురించి నేను బాగా అర్థం చేసుకున్నాను, వాళ్లనించి ఏమీ ఆశించే ప్రసక్తే లేదు!” అన్నారు.
”కానీ ఆయన అన్నదాన్లో తప్పేముంది?”
”నువ్వు వాళ్లతో ఉండగలవా?”
”నేను వాళ్లని నా ఇంట్లో ఉండనిచ్చాను కదా! మరి నేను వాళ్లింట్లో ఎందుకుండకూడదు?”
”నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. నిజంగా అక్కడ ఉండగలవా?”
”ఏమిటి మీరనేది? నేను ఇంకెవరింట్లోనో ఉండదల్చుకుంటే మిమ్మల్ని ఉద్యోగం ఎందుకు మాననిస్తాను?”
”అదేగా నేను చెప్పేదీనీ.”
”ఊరికే అన్నాను లెండి!”
పోద్దార్‌ గారింట్లో మేం హాయిగా ఉన్నాం. వాళ్లూ, మేమూ ఒకే కుటుంబంలా కలిసిపోయాం. పోద్దార్‌ గారు మాకు చాలా సాయం చేశాడు. ఆయన వల్లే మా ఆయన త్వరగా కోలుకున్నారు. రోజూ పోద్దార్‌గారు పదమూడు మైళ్లు ప్రయాణం చేసి పట్నం వెళ్లేవాడు. మా ఆయన గుమ్మంలో కూర్చుని రాట్నాలు తయారు చేయిస్తూ, రాసుకుంటూ, చదువుకుంటూ ఉండేవారు.
రెణ్ణెలు అలా గడిపాక, పోద్దార్‌ గారితో కలిసి పట్నంలో రాట్నాలమ్మే దుకాణం తెరవాలనీ, అక్కడే అద్దెకి ఇల్లు కూడా తీసుకోవాలనీ నిశ్చయించుకున్నారు. ఇల్లు దొరికింది. పది రాట్నాలతో దుకాణం ప్రారంభించారు. కొందరు ఆడవాళ్లు కూడా నూలువడికే పని చేసేందుకు వచ్చేవాళ్లు. పల్లెనించి రాట్నాలు తయారై వచ్చేవి, దుకాణంలో వాటిని అమ్మేవాళ్లు.
ఒకరోజు రాత్రి ఈయన భోజనం చేసి లేచారో లేదో ఆకాశం నిండా ఎర్రటి మబ్బులు కమ్ముకున్నాయి. ”మీరు కూడా త్వరగా భోంచేసెయ్యండి, గాలివాన వచ్చేట్టుంది,” అన్నారు. కంచాలు పెట్టుకోగానే పెద్ద గాలితో వర్షం మొదలైంది. నేను పరిగెత్తుకుంటూ పిల్లల గదిలోకి వెళ్లాను, ఆయన కూడా నా వెనకే వచ్చారు. అప్పుడే వడగళ్లు పడసాగాయి. వడగళ్లు పడే సమయానికి నేను వరండాలోకి వెళ్లి, ఆయన బల్లమీదన రాసి ఉన్న కాయితాలని తీసి మంచం కింద పడేశాను. ఇంతలోకి పెంకుల్ని బద్దలు కొడుతూ వడగళ్లు ఇంట్లోకి కూడా రావటం ప్రారంభించాయి. ఆయన భయంతో, ”చూడు, రాణీ! పిల్లల తలకి దెబ్బ తగలకుండా చూసుకో!” అన్నారు. మేమిద్దరం త్వరత్వరగా పిల్లలమీద ఒక దుప్పటి, తలో చివరా పట్టుకుని, నిలబడ్డాం. పిల్లల్ని కాపాడగలం, కానీ మా సంగతో! మా ఇద్దరి తలమీదా వడగళ్లు పడసాగాయి. ”మన తలల్ని ఎలా కాపాడుకుంటాం?” అన్నారాయన.
పిల్లల్ని ఒక పెద్ద కొయ్య పలక కింద దూరమని చెప్పి ఆయనతో, ”మీరు కూడా త్వరగా దీని కిందికి దూరండి,” అన్నాను.
”నువ్వూరా!” అన్నారు. నౌకర్ని కూడా రమ్మన్నారు. మేం ఐదుగురం బోర్లా ఆ పలకకింద పడుకున్నాం. పరుపులూ, దుప్పట్లూ, అన్నీ సుబ్బరంగా తడిసిపోయాయి.
”నీకు సమయానికి ఉపాయాలు బలే తడతాయి, కానీ నాకు అలా తట్టవు. ఎందుకని? ఇవాళ నువ్వే లేకపోతే ఒకరిద్దరి తలలు బద్దలయేవే!” అన్నారు.
పిల్లల్ని నిద్రపుచ్చి, మేం వడగళ్లని చూసేందుకు బైటికొచ్చాం. నడుం లోతు వడగళ్లు పడి ఉండటం కనిపించింది. బల్లమీద కాయితాలు కనిపించకపోయే సరికి, ”నా కాయితాలన్నీ కూడా ఎగిరిపోయినట్టున్నాయి!” అన్నారు.
”లేదు మంచం కింద అన్నీ భద్రంగా ఉన్నాయి. నేను వాటిని దాచాను,” అన్నాను.
ధున్నూ చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఒకసారి, ఈయన ఏదో వ్యాసం రాసి బల్లమీద పెట్టి వచ్చారు. ధున్నూ కాస్తా దాన్ని చింపేశాడు. సిరా, కలం తీసుకుని వాడు మరో కాయితం మీద ఏదో రాయటం మొదలుపెట్టాడు. ఆయన మళ్లీ గదిలోకెళ్లి, వాడు చేస్తున్న పని చూసి, మండిపడి, వాణ్ణి ఒక చెంపదెబ్బ కొట్టారు. ”పోరా ఇక్కణ్ణించి, లేకపోతే ఇంకా దెబ్బలు పడతాయి!” అని కోప్పడ్డారు.
ధున్నూ పెట్టిన కేక లోపలున్న నాకు వినిపించింది. నేనాయన అక్కయ్యతో, ”వదినా, కొంచెం చూడరా, ధున్నూని ఆయన కొట్టారా?” అన్నాను. ఆవిడ వెంటనే పరిగెత్తుకెళ్లి పిల్లవాణ్ణి ఎత్తుకుని, ”పసివాణ్ణి ఎందుకు కొట్టావు?” అంది.
”చూడు, నా వ్యాసాన్ని చింపేశాడు. దీన్ని ఈరోజు పంపిద్దామని అనుకున్నాను. వెధవ, చింపేశాడు. ఇక ఏం పంపిస్తాను, నా మొహం?”
”పసివెధవ కదా. కావాలని చెయ్య లేదుగా! నువ్వు మాత్రం? చిన్నప్పుడు ఎంత అల్లరి చేసే వాడివి!”
”నేను వ్యాసాలేం చింపి పారెయ్య లేదు!”
”అప్పుడసలు వ్యాసాలూ అవీ ఎవరు రాశారు? రాము చెవి కొరకలేదూ నువ్వు? ఆ చెవి నీ వ్యాసం కన్నా విలువైనదేగా?”
మా ఆయన మాట్లాడలేదు.
అక్కయ్య గోణుక్కుంటూ, ”పాపం అభం శుభం తెలీని పిల్లాణ్ణి ఇంతలా కొడతారా?” అంటూ లోపలికొచ్చింది. లోపలికొచ్చి నాతో, ”మీ ఆయనకి ముక్కుమీదే ఉంటుందే కోపం?” అంది.
కొన్నాళ్లయాక బెనారెస్‌ వెళ్దామన్నాను ఆయనతో. ”అక్కడికెళ్లి ఏం చేస్తాం?” అన్నారు.
”ఇక్కడే ఉంటే ఏం లాభం? మీ పనేదో అక్కడే చేసుకోవచ్చు,” అన్నాను.
”ఇక్కడా పని చేసుకుంటూనే ఉన్నాగా?” అన్నారు.
”అక్కడ నీళ్లు మీకు పడతాయి,” అన్నాను.
ఆ తరవాత మేం లమహీకి వెళ్లాం.
లమహీ కాన్పూర్‌
బెనారెస్‌లోని లమహీకి వెళ్లింతరవాత ఆయన నెలనెలా రెండు వ్యాసాలో, కథలో రాసి నలభై రూపాయలు సంపాదించటం మొదలుపెట్టారు. ఇంకా చాలా పత్రికలకి రాసేవారు, కానీ ఇది మాత్రం ప్రతినెలా కచ్చితంగా రాసి ఇవ్వాల్సిన పని.
పొద్దున్నే లేవటం, కాలకృత్యాలు తీర్చుకుని ఏదైనా టిఫిన్‌ తినటం, తరవాత పని చేసుకోవటం. పన్నెండు గంటలకి పని ఆపి, స్నానం, భోజనం. ఆ తరవాత గంట సేపు విశ్రాంతి తీసుకుని, మధ్యాన్నం ఎండకి వేడిగా ఉండే ఆ గదిలో కూర్చుని రెండు గంటలనించీ రాసుకుంటూ చదువుకుంటూ ఉండేవారు. సాయంత్రం మళ్లీ టిఫిను, పిల్లలతోనూ, ఊళ్లో వాళ్లతోనూ కబుర్లు చెపుతూ ఆరు బైట కూర్చోవటం. ఆయన జీవితం రోజూ ఇదే రకంగా ఉండేది.
ఒకరోజు రాట్నం తయారు చెయ్యటానికి అవసరమయే కర్రల కోసం ఈయన జమీందారుని కలిసేందుకు వెళ్లారు. ”మీరు కర్ర ఇప్పించారంటే నేను రాట్నాలు తయారు చేయించి, పల్లెటూళ్లలో ఉచితంగా పంచిపెడతాను. అక్కడి జనం అప్పుడు రాట్నం ఎంత ముఖ్యమైనదో తెలుసు కుంటారు,” అన్నారు.
జమీందారుకి ఈయన ఆలోచన నచ్చింది. కర్రలివ్వటానికి ఒప్పుకున్నాడు.
ఊళ్లోని జనాన్నంతా పోగేసుకుని ఈయన కర్రలు మోయించుకొచ్చారు. నెలరోజుల పాటు వాకిట్లో ఇద్దరు వడ్రంగులు రాట్నాలు తయారు చేస్తూ ఉన్నారు. ఆ తరవాత అందరికీ తలా ఒక రాట్నం ఉచితంగా ఇచ్చారు. రాట్నాన్ని ఎలా తిప్పాలో, దారం ఎలాటిది ఉండాలో, అన్నీ ఈయన వాళ్లకి వివరంగా చెప్పారు. అలా రెండు నెలలు గడిచాయి.
ఒకరోజు ఆయన భోజనానికి కూర్చున్నారు. నేను అప్పటికప్పుడు వేడిగా రొట్టెలు కాల్చి ఈయనకి వడ్డిస్తున్నాను. తినటం ప్రారంభించారు, నెయ్యి కనబడలేదు. ”పప్పులోకి నెయ్యి వెయ్య లేదా?” అన్నారు నాతో.
”ఇంట్లో ఉంటే కదా?” అన్నాను.
వెంటనే పిన్నిని కేకేశారు. ”ఇంట్లో నెయ్యెందుకు లేదు?” అని అడిగారు.
”లేదు.”
వెంటనే కోపంగా కంచం ముందు నించి లేచిపోయారు.
అందరూ భోంచేశారు, కానీ నేను మళ్లీ వంటింట్లో అడుగు పెట్టలేకపోయాను. ఈయన ఏం తింటారు, అనే విచారం పట్టుకుంది నాకు, ఏమీ తినకుండా ఎలా ఉంటారు? వెంటనే అర్థరూపాయికి పల్లెనించి నెయ్యి తెప్పించాను, ఎండలో కూర్చుని పెసరపప్పుని నేనే స్వయంగా రుబ్బాను. పుణుకులూ, హల్వా చేశాను. వాటిని భయపడుతూ ఆయన దగ్గరికి తీసుకెళ్లాను. ”ఇప్పుడేం తినను,” అన్నారు. ”చాలా కష్టపడి ఇప్పటికిప్పుడు చేశాను, నేను కూడా ఇంకా ఏమీ తినలేదు”, అన్నాను. అలా అనేసరికి ఆయన తినక తప్పలేదు. ఆ తరవాతనించీ నేను ఎప్పటికప్పుడు ఇంటికి కావల్సిన వెచ్చాలన్నిటినీ చూసి తెప్పించేదాన్ని.
మర్నాడే మా నాన్న పోయారన్న వార్త అందింది. రెండు మూడు రోజులు తరవాత ఆయన నన్నూ వెంటబెట్టుకుని అలహాబాద్‌ ప్రయాణమయారు. అక్కడ ఏడెనిమిది రోజులున్నారు. ఆ తరవాత ఆయన కాన్పూరుకి వెళ్లిపోయారు. అక్కడ మార్వాడీ స్కూల్లో హెడ్‌మాస్టర్‌ పోస్టు ఖాళీ అయింది. ఆ స్కూలు మేనేజర్‌ ఆయన్ని ఆ బాధ్యత తీసుకోమని అన్నాడు. మీరు మా స్కూలుకి హెడ్‌మాస్టర్‌గా వస్తే చాలా బావుంటుందని అన్నాడాయన. మా ఆయన ఆ ఉద్యోగంలో చేరటానికి ఒప్పుకున్నారు. ఇది జరిగింది 1921లో. జూలై నించీ ఉద్యోగంలో చేరేట్టు నిర్ణయించారు. ఆ తరవాత ఆయన మళ్లీ అలహాబాద్‌కి వచ్చారు. ”నేను ఒక ఉద్యోగం కుదుర్చుకుని వచ్చాను. పద మనిద్దరం మళ్లీ ఒకసారి బెనారెస్‌కి వెళ్లొద్దాం,” అన్నారు నాతో.
మళ్లీ ఒకనెల అలాగే గడిచింది.
జూలై ఐదో తేదీన మేం కాన్పూరుకి ప్రయాణమయాం. అప్పుడు నేను బన్నూని కడుపుతో ఉన్నాను. ”తనని ఇక్కడే ఉంచెయ్యరాదూ?” అంది పిన్ని.
”లేదు, అలా ఉంచెయ్యలేను. ఈవిడ ఆరోగ్యం బాగాలేదు. ఏమైనా ఐతే ఎవరు చూస్తారు? ఆ తరవాత జీవితాంతం నేను ఏడుస్తూ కూర్చోవాలి!” అన్నారు.
”ఎలా అవాల్సి ఉందో అలా అవు తుంది, దాన్ని నువ్వు ఆపగలవా?” అంది పిన్ని.
”నా ఎదురుగా జరిగితే పశ్చాత్తాప పడాల్సిన అవసరం ఉండదుగా!” అన్నారు.
”అలా అయితే నువ్వు అప్పుడు నన్ను పిలుస్తావు. నేను రావాల్సిన వస్తుంది,” అందావిడ.
”అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది,” అన్నారు.
ఐదో తేదీనే ఇద్దరు పిల్లలతో మేం కాన్పూరుకి చేరుకున్నాం. అక్కడికెళ్లాక మళ్లీ నా ఆరోగ్యం పాడయింది. పనిమనిషిని పెట్టుకున్నాం, కానీ, ఆమె ఒకరోజొస్తే నాలుగు రోజులు ఎగనాం పెట్టేది. నాకు నీళ్ల విరోచనాలు పట్టుకున్నాయి. చాలా నీరసపడి పోయాను. తింటే జీర్ణం అయేది కాదు. నీళ్లగా సగ్గుబియ్యం జావ చేసుకుని తాగేదాన్ని. వంట ఆయనే చేసేవారు, అంతేకాదు, పనిమనిషి రాకపోతే అంట్లు కూడా తోమేవారు. ఒకసారి తెల్లవార్లూ నాకు విరోచనాలయాయి. తెల్లవారుజామున నాలుగ్గంటల ప్రాంతంలో నీరసంతో నేను కళ్లుతరిగి పడిపోయాను. ఆయన పరిగెత్తుకొచ్చారు. నన్ను ఎత్తుకుని మంచంమీద పడుకోబెట్టారు. నేను స్పృహ తప్పిపోయాను. నాకు మళ్లీ తెలివి రాగానే, ఆయన కళ్లనీళ్లు పెట్టుకుంటూ, ”నీకింత నీరసంగా ఉన్నప్పుడు నన్నెందుకు నిద్ర లేపలేదు?” అన్నారు.
”మీకు శ్రమ ఇవ్వటం ఎందుకని…” అన్నాను.
”అయితే చచ్చిపోయాక నీ శవాన్ని నాకు చూపించాలని అనుకున్నావా?”
”చచ్చిపోతానన్న అనుమానం ఎక్కడొచ్చింది? నీరసంగా ఉంది, పడిపోయాను.”
”చావటం ఎలా ఉంటుంది? సృృహ కోల్పోయావు కదా?”
”ఎప్పుడైనా చచ్చిపోతేకదా చావటం ఎలా ఉంటుందో చెప్పటానికి!”
”నీకన్నీ అలా హాస్యంగానే అనిపిస్తాయి.”
”అరె, ఇప్పుడు బాగానే ఉన్నాగా?”
– ఇంకా ఉంది

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో