రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు – పర్యావసానాలు – పరిష్కార మార్గాలు

కొమర్రాజు రామలక్ష్మి
(భూమిక వార్షిక వ్యాస పోటీలలో మొదటి బహుమతి పొందిన వ్యాసం)

మహిళలు, పిల్లల పట్ల హింస తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన. ప్రతి ముగ్గురు మహిళల్లోనూ ఒకరు బాధితులు కావడం శోచనీయం.
– నికోల్‌ కిడ్‌మన్‌
(యునిఫెమ్‌ గుడ్‌విల్‌ అంబాసడర్‌)
ప్రపంచ జనాభాలో సగానికిపైగా మహిళలున్నారు. ప్రపంచంలో జరిగే పనిలో మూడింట రెండువంతుల పనిని వీరే చేస్తున్నారు. అయినప్పటికీ పురుషులతో సమంగా వ్యవహరించగల అధికారం మహిళలకు లేదు. వారు మానవహక్కులను అనుభవించే పరిస్థితులు లేవు. స్వేచ్ఛగా, గౌరవప్రదంగా జీవించడానికి వారికి అవకాశాల్లేవు. మహిళలు అనేకరకాలుగా శారీరక, మానసిక హింసకు – దానిలో భాగంగా అనేక రకాల దాడులకు గురవుతున్నారు.
మనదేశంలో, మన రాష్ట్రంలో మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిసరాలకు తాము ప్రభావితులవుతూ, పరిసరాలను ప్రభావితం చేస్తూ జీవనగమ్యాలను చేరుకోవడానికి ఆదినుండి ఆధునికకాలం వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అన్ని విధాలుగా వివక్షతకు, దోపిడీకి బలవుతున్నారు. దీనిలో భాగమే రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులు. ఎందుకీ విధంగా జరుగుతున్నదని పరిశీలించాల్సిన అవసరమున్నది.
ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎట్లాంటి సామెతలు వాడుకలో ఉన్నాయో గమనిస్తే, కుటుంబం, సమాజం ప్రవర్తించే తీరు వారినెంత మనస్తాపానికి గురిచేస్తుందో, ఈ నేపధ్యంలో అసమానతలు మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు ఏ విధంగా మూలమవుతున్నాయో అర్థమవుతుంది. ఉదా : స్పెయిన్‌లో సామెత – గాడిదకు, ఆడదానికి దెబ్బలు బాగా పడుతూ ఉండాలి. అప్పుడే అది చెప్పినట్లు వింటుంది. ఒక ఇంగ్లీషు సామెత ప్రకారం – కుక్కనూ, భార్యనూ, వాల్‌నట్‌ చెట్టునూ ఎంత కొడితే అవి అంత బాగుపడతాయి. రష్యన్‌ సామెత – తనను కొట్టని భర్తను భార్య ప్రేమించవచ్చు కానీ గౌరవించదు. భార్య నేను కొన్న గుర్రం లాంటిది, దానిమీద నేను స్వారీ చేస్తాను, కొరడాతో ఇష్టమొచ్చినట్లు కొడతాను – ఇదొక చైనా సామెత. కొన్ని గిరిజన జాతులలో పెళ్ళినాడు పెళ్ళికొడుకు భార్యను లాంఛనప్రాయంగా కొట్టాలట. ఇక మన దగ్గర – ఆడదానికి, బర్రెగొడ్డుకు దెబ్బలు పడుతూ ఉండాలి, భార్య వంట ఇంటి కుందేలు లాంటివెన్నో – ఇవన్నీ మహిళలను ఎంత చులకనగా చూసే విధంగా ఉన్నాయో పై భావజాలాన్ని బట్టి తెలుస్తుంది. నాటినుండి నేటివరకు తరతరాలుగా కొనసాగుతున్న ఆ భావజాలమే మనదేశంలో, మన రాష్ట్రంలో కూడా మహిళలపై దాడులకు ప్రధాన నేపధ్యమని భావించక తప్పదు. ఎక్కడయినా ఒకటే వేదన, రోదన. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుండే వివిధ రకాల బాధలను ఎదుర్కొంటున్నారు. ఎవరితో అయితే స్వేచ్ఛగా, సంతోషంగా జీవించాలో అక్కడే వాళ్ళ చేతనే దెబ్బలు తింటున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. ఫలితంగా శారీరకంగా, మానసికంగా హింసను అనుభవిస్తున్నారు.
తల్లిగర్భంలో పిండంగా అవతరించినప్పటినుండి, మరణించే వరకు హింసలో భాగంగా అనేక రకాలుగా దాడులకు గురవుతూ మానసికంగా వేదనను అనుభవిస్తూ దేవుడు తమ నుదుటన అంతే రాశాడు, అనుభవించాల్సిందే అని సరిపెట్టుకోవడం మన మహిళలకు అలవాటయిపోయింది. అందువల్లనే అనేక ప్రాణాపాయాలను మౌనంగా భరిస్తున్నారు. సమాజంలో కుటుంబ పరువు పోకుండా ఉండాలని చేసే ప్రయత్నంలో భాగంగా వాస్తవాలను దాచిపెడు తున్నారు. సర్దుబాటుతత్వాన్ని ప్రకటిస్తున్నారు. ఈ కారణాలను ఆసరా చేసుకొని అనేక అకృత్యాలు కొనసాగుతున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం – తల్లి కడుపులో ఉన్నది ఆడశిశువు అనేది అంగ నిర్ధారణ ద్వారా ఋజువయితే గర్భస్రావ ప్రయత్నం జరగవచ్చు. ఒకవేళ బతికితే బాల్యంలో ప్రవేశించాక చిన్నవయసులో పెళ్ళి అనే వలయంలో చిక్కుకోక తప్పడం లేదు. అంతేకాదు అత్యాచారాలకు గురికావడం కూడా తప్పడం లేదు. తరువాత యవ్వనంలో ప్రేమ పేరుతో మోసపోవడం కూడా మనం చూస్తున్నాం. వింటున్నాం. ప్రేమంటే చావడం – కాదంటే చంపడం అనేది నేడు సర్వసాధారణ మయింది. మన రాష్ట్రంలో ప్రేమ పేరుతో జరిగే హింసలో భాగంగా విద్యార్థినులు, మహిళలపై అనేక విధాలుగా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ రకమైన దాడులు రాష్ట్రం, వర్గం, కులం, ప్రాంతం అనే భేదం లేకుండా సర్వత్రా వ్యాపించి భయాందోళనలకు గురి చేస్తున్నాయి. పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు అధికం అయ్యాయి. పసిపిల్లలపై సైతం అత్యాచారం చేయ ప్రయత్నించడం, విద్యార్థినులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం ప్రతినిత్యం సభ్యసమాజాన్ని వేధిస్తున్న సమస్య.
ప్రేమోన్మాదంతో, అనుమానమనే వ్యాధితో రెచ్చిపోయి కత్తితో నరకడం, బ్లేడుతో కోయడం, యాసిడ్‌ పోయడం, ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడం, భయపెట్టి, బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నించడం, చంపడం, ఆత్మహత్యలకు పురికొల్పడం మన కళ్ళముందు ప్రతి నిత్యం కనిపిస్తూ సమాజంలో అశాంతిని, ఆందోళనను సృష్టిస్తున్నాయి. వీటికి తోడు పిల్లలలో, యువతలోని భావోద్వేగాలను పెడదారి పట్టిస్తున్న అతిబలమైన ప్రచార సాధనం మీడియా అని చెప్పక తప్పదు. అనుకున్నది సాధించడానికి కుట్రలు, కుతంత్రాలను సృష్టించి వాటిని ప్రేక్షకుల నరనరాల్లోకి ఎక్కించి, మెదళ్ళలోకి జొప్పించి, స్వార్ధం, సంకుచితత్వాన్ని పెంచి పోషిస్తున్న మీడియా వలన కూడా విలువలు పతనమవుతూ ఈ అమానుష చర్యలు కొనసాగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
పెళ్ళి తరువాత జరిగే వరకట్నం హత్యలు, ఆత్మహత్యలకు అంతే లేకుండా పోయింది. జీవితంపై కోటి ఆశలతో, కొత్త కాపురం గురించి కలలు కంటూ అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లలు అత్తింటివారి అత్యాశకు, ఫలితంగా బలవన్మరణాలకు గురికావడం కూడా చాలా మామూలయింది.
వృద్ధాప్యంలో సైతం మహిళలే ఎక్కువగా అవమానాలకు, నిరాదరణకు గురవుతున్నారనేది యదార్ధం. వారికి శారీరక రోగాలతో పాటు మానసికంగా బాధలు తప్పడం లేదు.
ఒక సర్వే ప్రకారం ప్రతి 54 నిమిషాలకు ఒక రేప్‌, ప్రతి 26 నిమిషాలకొక అవమానం, ప్రతి 43 నిమిషాలకొక కిడ్నాప్‌, ప్రతి గంట 42 నిమిషాలకొక వరకట్నం మరణం, ప్రతి 33 నిమిషాలకొక హింసాత్మకచర్య, ప్రతి 51 నిమిషాలకొక మాటలతో వేధింపు వంటి హింసాత్మక సంఘటనలు మనదేశంలో జరుగుతున్నాయి. 68.3 శాతం హింసాత్మక చర్యలు మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ రాష్ట్రాలలో జరుగుతున్నాయి. ఈ సంఖ్య కేవలం చట్టం దృష్టిలోకి వచ్చింది మాత్రమే. హత్యలు, ఆత్మహత్యలు, కాల్చి చంపడం వంటి చర్యలన్నీ మహిళలపట్ల కొనసాగుతున్న దాడులు, వేధింపులకు నిదర్శనాలు. ముఖ్యంగా దళిత మహిళలు అత్యాచారాలకు, పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. ఇదంతా నిత్యజీవితంలో హింసగా పరిగణించవచ్చు.
అధిక జనాభా ఉన్న దేశాలలో మహిళలు తమ ఆరోగ్యప్రదమైన జీవితకాలంలో ఐదు శాతాన్ని హింస అత్యాచారాలను అనుభవించడం వల్ల కోల్పోతున్నట్లు ప్రపంచ బ్యాంకు అంచనాలు తెలియజేస్తున్నాయి. ఈ పరిస్థితినుండి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని మినహాయించడానికి వీలులేదు. పురుషాధిపత్య సమాజం చేసే నేరాలకు, లైంగిక తప్పిదాలకు, మగవారి ఆనందానికి బలి అవుతున్నది మహిళలే. పురుషుల తప్పుల కారణంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో హెచ్‌.ఐ.వి. సోకి, ఎయిడ్స్‌ వ్యాధి బారిన పడి విమర్శలకు గురవుతున్నారు. మరణిస్తున్నారు. చిన్నచూపు చూడబడి, నిరాదరణకు గురవుతూ వేదనను అనుభవిస్తున్నారు.
ప్రభుత్వం 1998 సంవత్సరాన్ని మహిళలు-మానవహక్కుల సంవత్సరంగా, 1999 సంవత్సరాన్ని మహిళల పట్ల హింసలేని సమాజం కోసం అనీ, 2007 సంవత్సరాన్ని స్త్రీలు-పిల్లలపై హింసకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించడం అని ప్రకటించింది. అంతేకాదు 2005 గృహహింస నిరోధక చట్టం కూడా ఆచరణలోకి తేబడింది. అయితే ఇవేవీ మహిళలపై ముఖ్యంగా మనరాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఏ మాత్రం అరికట్టలేకపోతున్నాయనే చెప్పవచ్చు. చట్టాల్లో చోటుచేసుకున్న లొసుగులు, వ్యయప్రయాసలను తట్టుకోలేమనే అభిప్రాయం, అవినీతి, జాప్యం నేరస్తులను కఠినంగా శిక్షించలేకపోతున్నాయని, అందువల్లనే మహిళలపై దాడులు మళ్ళీమళ్ళీ పునరావృతమవుతున్నాయని భావించవచ్చు. ఇంతటి అనారోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతున్న బాలబాలికలు ఎట్లాంటి సంక్షోభానికి, సంఘర్షణలకు లోనవుతారో, ఒత్తిడిలను తట్టుకోలేక ఎంతటి మానసిక క్షోభకు గురవుతారో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. అంతేకాడు సమాజాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మహిళల పట్ల కొనసాగుతున్న నిర్లక్ష్య ధోరణిని ఖండించాల్సిన విషయం.
ఒక దినపత్రిక ప్రకారం ఒక (గత) సంవత్సర కాలంలో 989 మంది మహిళలు వివిధ రకాల హింసలకు గురయ్యారు. 50 మంది మహిళలు రేప్‌కు గురయ్యారు. 14 మంది వరకట్నం హత్యలకు గురికాగా, 35 మంది వరకట్నం మరణాల బారిన పడ్డారు. 497 మంది వేధింపులకు గురయ్యారు. 14 మంది పురుషులు భార్య ఉండగానే రెండవ వివాహం చేసుకున్నారు. 217 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. 74 మంది మహిళలు ఆత్మహత్య చేసుకోవడానికి పురుషులు కారణమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాసిడ్‌ దాడి (వరంగల్‌లో) ఈ కోవలోదే.
మరొక దినపత్రిక ప్రకారం 2007 సంవత్సరంలో వరకట్నం చావులు 54 అయితే 2008 సంవత్సరంలో 33, 2007 సంవత్సరంలో వరకట్నం హత్యలు 11 కాగా 2008 సంవత్సరంలో 14, 2007 సంవత్సరంలో వరకట్నం వేధింపులు 585 అయితే 2008 సంవత్సరంలో 458, 2007లో అత్యాచారం కేసులు 54 కాగా, 2008లో 60. ఇవన్నీ (రెండు దినపత్రికల సమాచారం) ఒక్క వరంగల్‌ జిల్లాలో పోలీసు రికార్డులలో నమోదైన కేసులు మాత్రమే. లెక్కలోకి రాక, నమోదేకాని కేసులు ఇంకెన్నో. ఇట్లాంటి సమాచారం రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో కూడా ఉంటుందని పరిగణించవచ్చు. అయితే ఇక్కడ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ మహిళలపై హింసలో భాగంగా ఎన్ని దాడులు జరిగాయి లేదా జరుగుతున్నాయి అనే సంఖ్యాపరమైన గణాంకాలకన్నా అసలీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి. వీటి ప్రభావం సమాజం యొక్క ఆరోగ్యంపై ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. వీటి తక్షణ పరిష్కార మార్గాలేమిటి అనేది ప్రధానంగా చర్చించి, విశ్లేషించుకోవలసిన అవసరమెంతైనా ఉన్నది.
కుటుంబంలో, సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష, మహిళలంటే ఉంటే చులకనభావం, కేవలం మహిళల కోసమే రూపొందించిన కుటిల నీతులు, సంప్రదాయాల పేరుతో మహిళలకు వేసే సంకెళ్ళు, తరతరాలుగా కొనసాగుతున్న భావజాలం, పుత్రుడికిచ్చే ప్రాధాన్యత, మహిళల శక్తి సామర్ధ్యాలను తక్కువ అంచనా వేయడం, అన్ని రంగాలలో పురుషులతో సమానమైన ప్రతినిధ్య అవకాశాలు లేకపోవడం, అబలత్వాన్ని ఆపాదించడం వంటి అనేక అంశాలతో పాటు మహిళలను సంతానోత్పత్తి కేంద్రాలుగా మాత్రమే పరిగణించడం, స్వంత ఆస్తిగా భావించడం కూడా మహిళలపై దాడులు జరగడానికి, కొనసాగడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతున్నాయని చెప్పవచ్చు.
ఇక మహిళలపై జరుగుతున్న దాడుల వల్ల ఎదురయ్యే పర్యవసానాలనేకం. హింసలో భాగంగా కొట్టే దెబ్బల వలన చర్మం గీరుకుపోవడం, కొన్ని సందర్భాలలో తెగి గాయం కారడం జరుగు తుంది. ఎముకలు విరిగే ప్రమాదమున్నది. నెత్తురు గడ్డ కట్టవచ్చు. కాల్చడం, కొరకడం, కత్తితో గాట్లు పెట్టడం వలన శరీరంపై మచ్చలు ఏర్పడవచ్చు. అంగవైకల్యం ఏర్పడవచ్చు. యాసిడ్‌ దాడి వల్ల అవయవాలు కాలి తిరిగి పనిచేయలేకపోవచ్చు. మరణాలు జరగవచ్చు, రూపం మారిపోవచ్చు. ఇతరత్రా జరిపే దాడుల వల్ల తలనొప్పి, కడుపులో నొప్పి, ఇన్‌ఫెక్షన్‌ సోకడం, నిద్రలేమి, ఆకలి లేకపోవడం జీవితాంతం బాధిస్తాయి. ఈ విధమైన శారీరక అనారోగ్యంతోపాటు భయం, ఆందోళన, అలసట, అనాసక్తత వంటి లక్షణాలతో మానసిక అనారోగ్యం ఏర్పడవచ్చు. అందువల్ల కుటుంబంలో, సమాజంలో తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించలేకపోవచ్చు. మానభంగానికి గురైనవారు కొన్ని సంవత్సరాలపాటు మెంటల్‌షాక్‌లో ఉండే అవకాశముంటుంది. అవాంఛిత గర్భధారణ వల్ల ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదముంది. ఈవ్‌ టీజింగు, ర్యాగింగు, కిడ్నాప్‌లకు గురయిన వారు తీవ్రమైన మానసిక ఒత్తిడి నెదుర్కొంటూ బంగారు భవిష్యత్తును కోల్పోవలసి వస్తుంది. ఇలాంటివారు స్వతంత్రంగా జీవించలేరు. నిర్ణయాలు తీసుకోలేరు. తమ సహజమైన శక్తిసామర్ధ్యాలను కోల్పోతారు. వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. వీటన్నింటి ప్రభావం మహిళల శ్రమశక్తితో నిండిన కుటుంబాలపై, తద్వారా సమాజంపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. నైతిక విలువలు మరింత దిగజారుతాయి. ఫలితంగా సమాజంలో దౌర్జన్యాలు, అరాచకాలు మరింత ప్రబలుతాయి. సమాజమంతా అనారోగ్యకరంగా మారి భావితరాలవారికి అయోమయాన్ని సృష్టిస్తుంది. మమత, మానవత్వం కరువవుతాయి. ఆత్మీయత, అనురాగం అనే మాటలు అర్థాన్ని కోల్పోతాయి. నేరాలు, దాడులు మరీమరీ ఎక్కువవుతాయి.
ఇట్లాంటి ప్రభావాలకు లోనుకాకుండా మంచి ఆరోగ్యకరమైన సమాజం నిర్మించబడాలంటే రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రతి ఒక్కరమూ నడుం బిగించాలి. మనం చైతన్యవంతమవుతూ తోటివారిని చైతన్యపరచగలగాలి. అందుకు కొన్ని పరిష్కార మార్గాలను చూద్దాం :
పరిష్కార మార్గాలు :
1) కుటుంబంలో బాలబాలికల మధ్య వివక్షలేని పెంపకం కావాలి.
2) తల్లిదండ్రుల ఆలోచనాదృక్పథంలో మార్పు రావాలి.
3) మనిషంటే ‘అతడే’ కాదు ‘ఆమె’ కూడా అనే భావన అందరిలో రావాలి.
4) ఇంటిపని కుటుంబ సభ్యులందరూ పంచుకోవాలి.
5) మహిళలకు చట్టసభలలో తగిన భాగస్వామ్యం కల్పించాలి.
6) మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారిని చట్టం కఠినంగా శిక్షించే విధంగా ఉండాలి.
7) తల్లిదండ్రులతోపాటు పిల్లలకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు మానవతా విలువలను బోధించాలి.
8) సమాజాన్ని పెడదారి పట్టిస్తున్న మీడియాను అందరూ వ్యతిరేకించాలి.
9) మద్యం, మత్తుపదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలి.
10) ప్రభుత్వ పథకాల అమలులో చిత్తశుద్ధిని ప్రదర్శించాలి.
11) ఆడపిల్లలు న్యూనతాభావాన్ని వీడి ఆత్మస్థయిర్యాన్ని అలవరచుకోవాలి.
12) మహిళలంతా ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలి.
13) మహిళా సమస్యల పట్ల అవగాహన కల్పించే అంశాలను పాఠ్యాంశాలలో చేర్చాలి.
14) మహిళలపై దాడులను నిరసించే మహిళా సంఘాల, స్వచ్ఛంద సంస్థల ఉద్యమాలకు వాటిపట్ల స్పందించే వారంతా తమ మద్దతునివ్వాలి.
15) కులం, మతం, వర్గం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా మహిళలంతా ఏకం కావాలి.
16) మహిళా సమస్యల పట్ల అధ్యయనాలు మరింత విస్తృతం కావాలి.
వీటన్నింటితో పాటు మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల స్పందించడం, నిలదీయడం ఒక సామాజిక బాధ్యతగా అందరూ గుర్తించగలిగితే, మనసున్న మనుషులుగా, తమలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించగలిగితే, మహిళలపై హింసలేని సమాజం కావాలనే తపన ప్రతి ఒక్కరిలో వస్తే సమత, మమత – మానవతతో కూడిన సమాజనిర్మాణం సాధ్యమవుతుంది. ఆ శుభతరుణం త్వరలోనే ఆసన్నమవుతుందని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. ఎందుకంటే ”గతానుభవాలు ఎట్లాంటివైనా ఆశలెప్పుడూ నిత్యనూతనమే కదా!”

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో