సరికొత్త దృశ్యం

– నంబూరి పరిపూర్ణ

బి.కాం. ఫైనలియర్లో వున్న సుజాతకు చదువు తప్ప మరే లోకంతోనూ పన్లేదు. ఫస్టు క్లాసు ఓ లెక్కలోది గాదామెకు.

అంతకు మించిన మెరిట్ మార్కుల్తో పాసవ్వాల్సిందే.

తండ్రి రంగనాధరావు పి.డబ్ల్యులో సెక్షనాఫీసరు. సంపాదన పరిమితమే అయినా సంతానం చదువుల గూర్చిన శ్రద్ధ అపరిమితం. పిల్లలు సైతం చదువుల్లో దిట్టలు. చక్కని స్వంతిల్లు. హాయిగా పచ్చగా సాగిపోతోంది సంసారం.

ఓరోజు అతని అక్కకొడుకు ప్రకాష్ అకస్మాత్తుగా వచ్చి, వచ్చిన మరునిమిషం నించీ తమ కుటుంబ సమస్యల్ని మేనమామకు ఏకరువు పెట్టసాగాడు.

మేనల్లుడి దీనస్థితి, సహాయమర్థిస్తున్నతీరు రంగనాథరావును కదిలించివేశాయి.

వెంటనే ఓ మంచి ట్యుటోరియల్ కాలేజీలో మేనల్లుడిని చేర్పించి, రకరకాల ఫీజులన్నీ చెల్లించేసి, శ్రద్ధగా చదువు, మంచి ప్రయోజకుడివవ్వు అంటూ వెన్నుతట్టాడు రంగనాధరావు. మేనత్త సావిత్రమ్మ కూడా మిక్కిలి ఆదరంగా అన్నీ అమర్చిపెడుతోంది.

ప్రకాష్ కూడా తనకున్న మంచి కలుపుగోలు స్వభావం వల్ల కొద్ది రోజులకే ఇంట్లో ఒకడైపోయాడు. ఇంటి తాలూకు రకరకాల బిల్లులు, నెలవారీ చెల్లింపులతో పాటు, బయటకెళ్ళి చేసుకురావాల్సిన పనులన్నీ తను చేస్తూ మామయ్య అభిమానాన్ని చూరగొంటూ, ఇంటికవసరమైన సరుకుల్ని, ఎప్పుడేది అవసరమైతే ఆ వస్తువునూ వెంటనే తెచ్చిపెడుతూ అత్తయ్య ఆదరణనూ కూడా పుష్కలంగా సంపాదిస్తున్నాడు ప్రకాష్.

అతనికున్న మరో లక్షణం హాస్యచతురత. హాస్యము, చమత్కారమూ జోడించిన మాటతీరుతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగల ప్రకాష్కి, మరదలు సుజాత అభిమానాన్ని పొందడంగానీ ఆమెతో చనువు పెంచుకోవడం గానీ సులువైన పనులయినాయి. బావ తనని ఆటలు పట్టిస్తూ హాస్యాలాడుతోంటే సరికొత్త ఆనందమేదో కలుగుతోంది ఆమెకి. ప్రతి ఉదయం ఆమెను స్కూటర్మీద తీసికెళ్ళి బస్టాండులో దింపివస్తున్నాడు. అప్పటి ముచ్చట్లు ఇద్దరి మధ్య మరింత చనువునీ, సన్నిహితత్వాన్ని పెంచసాగాయి.

ఆ ఆదివారం సహ ఉద్యోగి గృహ ప్రవేశానికి కుటుంబ సమేతంగా హాజరయ్యే సన్నాహంలో వున్న తండ్రితో “రేపు నాకు మంత్లీ టెస్టుంది నాన్నా! చదువుకోవాలి’ అని చెప్పి ఇంట్లోనే ఆగిపోయింది సుజాత.

ఉదయాన్నే స్పెషలు క్లాసుకని వెళ్ళి లంచ్ టైముకు తిరిగొచ్చాడు ప్రకాష్. భోజనాలయ్యాక టీ.వీ ముందు చేరారిద్దరూ.

“సుజాతా”! బావ మెత్తని పిలుపుతో తలదిప్పిచూచింది సుజాత. కానీ తనవంక చూస్తూ నవ్వడం తప్ప మరో మాట లేదు ప్రకాష్ నోటినుంచి. మళ్ళీ కొద్ది సేపటికి అదే పిలుపు.

“ఏంటి బావా! పిలుస్తున్నావు, ఏం చెప్పకుండా చూస్తున్నావు. ఏం కావాలి?”

“ఏం వద్దు. నువ్వు కోపగించుకోనంటే ఒకటి చెబుతా. అది… అదేంటంటే… నాకు నువ్వుంటే చాలా యిష్టం. నీ చదువు తీరు, నీ నడవడి తీరు, నీ అందం అన్నీ ఎంతిష్టమో! నీలాంటి మరదల్ని ఏ బావ ప్రేమించకుండా వుండగలడు చెప్పు. నువ్వు నాకు తోడైతే ఎంతటి శిఖరాల్నయినా యిట్టే అందుకోగల్ను. కాదన్నావూ అందకారపు లోయే గతి! నేనేమవ్వాల్సిందీ నిర్ణయించాల్సింది నువ్వే” అది జాలిగా, మరదలి కళ్ళలోకి చూస్తూ అర్థించాడు ప్రకాష్.

బావ మాటలు సుజాత గుండెల్ని ఒక్కసారిగా ఝల్లుమనిపించాయి. భయంతో, మరోవైపు ఏదో పులకరింతతతో శరీరం ఒణకసాగింది. తనకు మాత్రం బావంటే ఎంత యిది! ఎంతిష్టం! తన మాటలు, తన సన్నిధి, ఎంత హాయినిస్తాయి తనకు! అతడంటే తన గుండెల్నిండా కూడా ప్రేమ వుందని ఎలా చెప్పడం!… బావ ముఖాన్ని కన్నులెత్తి చూచే శక్తిలేక కంపిస్తున్న అరచేతిని అతని చేతిలో పెట్టి గట్టిగా పట్టుకుంది సుజాత.

ఒక్కసారిగా యిరువురి గుండెలు పారిజాత పరిమళాలతో గుబాళించాయి.

***
ఆ రోజు ఏదో పండుగ శెలవు. చెల్లి చరితతో పాటు విశ్రాంతిగా వరండాల్లో కూర్చుని బావ పేల్చే వరుస జోకులు వింటూ పడీ పడీ నవ్వుతోంది సుజాత.

“సుజీ ! నిన్ను నాన్న పిలుస్తున్నారమ్మా!” అంది సావిత్రమ్మ లోపల్నించి. సుజాత హాల్లోకొచ్చి తండ్రిముందు నుంచుంది. సోఫా అటు పక్కకి జరుగుతూ కూచోరా తల్లీ. ఏంటి విశేషం. భలే నవ్వుతున్నారు. ఎలా సాగుతోంది చదువు- యాన్యువల్ పరీక్షలు దగ్గర పడుతున్నాయిలా వుంది”- అని అడిగాడు రంగనాధరావు. “బానే సాగుతోంది నాన్నా! వారం తరవాత ప్రిపరేషన్ హాలిడేస్ యిస్తారట”.

ఈ బి.కాం అవ్వగానే ఎం.కాం. ఆ తరవాత ఎం.సి.యే. అదే గదూ నీ టార్గెట్.

“కానీ… నువ్వు యిదివరకు మల్లే చదవడం లేదనీ, ఎప్పుడూ ఏదో ఆలోచనలో వుంటున్నావనీ అమ్మ చెప్పింది. అందుకు ఆమెతో పాటు నేనూ చాలా బాధపడుతున్నాను. ఎందుకలా వుంటున్నావు. నిజమే కదూ మీ అమ్మ మాట?”

ఔను కాదనకుండా మౌనం వహించింది సుజాత.

“చూడమ్మా! నీ గోల్ చేరాలంటే మరే ఆలోచననీ నీ బుర్రలోకి రానియ్యగూడదు” అని కాసేపు మాటలకు వెతుక్కుంటూ ఆగి – “మొన్నీమధ్య మీ బావతో అంత అతి చనువూ, గంటలకొద్దీ కబుర్లేమిటని మీ యమ్మ నీమీద కేకలేయడం, మీ మధ్య వాదం పెరిగి, బావనే చేసుకుంటానని నువ్వనడం జరిగిందట. మధ్యలో, వున్నట్టుండి ఏమిటీ పెళ్ళి ఆలోచన? అదీగాక నీకెందులో సాటి అని వాణ్ణి పెళ్ళాడాలనుకుంటున్నావు?”

సుజాత గతుక్కుమంది. అయినా ఏం జవాబివ్వకుండా శూన్యంలోకి చూస్తోంది. వచ్చి చదివించమని ప్రాధేయపడ్డాడు. మనిషిని చెయ్యమని అర్థించాడు. అందుకు పూర్తిగా తోడ్పడుతున్నాం మనం. బుద్ధిగా చదువుకోక పెళ్ళీ ప్రేమా అని నీకెక్కించడమేంటి? నీ అన్న శ్రీధర్కి ట్యూషననేది తెలుసా అసలు! దీక్షతో చదవబట్టే గదూ బి.టెక్ డిస్టింక్షన్తో పాసయి, యింత గొప్ప హోదాకొచ్చాడు! నువ్వూ చెల్లీమాత్రం ఏం తక్కువ. ఈ ప్రకాష్ గాడు తాచెడ్డకోతి సుమా!

తండ్రి ఆవేదనకు కూతురిలో ఏ స్పందనా లేదు. అసహనంగా కాసేపు కూర్చుని “నాన్నా! నాతో కంబైన్డ్ స్టడీకి నా క్లాసుమేటు వచ్చే టైమవుతోంది. వెళ్తామరి” అంటూ కదిలివెళ్ళింది.

మునుపెన్నడు లేని నిర్లక్ష్యం, లెక్కలేనితనం. ఆవేశంతో కుతకుతలాడ్తూ ప్రకాష్ని కేకబెట్టి పిలిచాడు. గంభీరంగా వచ్చి మామకెదురుగా కూర్చున్నాడు ప్రకాష్. వెంటనే సూటిగా విషయంలోకొస్తూ “ఏరా! ఏంటి సంగతి? మా అక్క ముఖం చూచి ఏదో చదువుకుని బాగు పడతావని దగ్గరికి దీసినందుకు చదువు గాలికొదిలి మా పిల్లకి ప్రేమ బోధలకి పూనుకున్నావా? నువ్వు మాకు చేస్తున్న మేలు- దాని చదువు పాడు చెయ్యడమా?”- గద్దించాడు రంగనాధం.

అదురు బెదురనేదేం లేదు ప్రకాష్లో. “నేనేదో బోధించి, సుజాత చదువు చెడగొడుతున్నానని అనుకోడం వట్టి అపోహ. మేనత్త మేనమామ పిల్లలు గాబట్టి చనువుగా, సరదాగా వుంటాం. ఏముంది యిందులో?”

“అంతటే ఆగావా- ప్రేమ పాఠాలు నేర్పి, పెళ్ళికి దారేస్తున్నావట గదా?”

“బావా మరదళ్ళు దగ్గరవడానికి – పాఠాలతో పనేముందు. బంధుత్వం మాట అలా వుంచితే లోకంలో ఎవరు ఎప్పుడు, ఎవర్నిష్టపడతారో ఎలా చెప్పగలం. ప్రేమ, యిష్టం – వీటికి హద్దులు, కొలతలు వుంటాయా?”

“చదువులో గాక తర్కంలో డిగ్రీ వచ్చేలా వుంది నీకు. ఈ మాట ఒకటి విను. సుజాత నిన్ను పెళ్ళాడ్డమన్నది వట్టి భ్రమ. ఇప్పటికయ్యింది చాలు. ఇంక మా ఇంట్లో నీకు స్థానం లేదు. మరో గూడు చూచుకుని తక్షణం వెళ్ళు ఇక్కడినించి” ఆదేశించాడు రంగనాధరావు.

మర్నాటినించీ, దగ్గర్లోనే ఓ బ్యాచిలర్సు రూములో మకాము బెట్టాడు ప్రకాష్. సుజాతను కాలేజీకెళ్ళి వస్తున్న వేళల్లో కలుసుకుందుకు వీలు చిక్కుతోందిప్పుడు.

సంవత్సర పరీక్షలు ముగిసి వేసవి శలవల్ని సుజాత ఇంటనే వుండి గడుపుతూ వుండడంతో బావ మరదళ్ళ ‘ములాకత్’ లు వీలవ్వకపోయినా, సుజాత స్నేహితురాలింటి ఎడ్రసుకు ప్రేమలేఖలు వస్తుండడం వల్ల ప్రేమ గాఢతను మరింతగా ఆస్వాదిస్తున్నారు. షాపింగుకనో, మార్కెట్టుకనో మరదలు వచ్చినప్పుడు బావతో కలవడం ఏమంత కష్టం!

***
“పెద్దన్నయ్య అవసాన స్థితిలో వున్నాడుగాబట్టి, వెంటనే చివరిచూపుకు రావలెను” అన్న టెలిగ్రాముతో, వెంటనే భార్యా సమేతంగా స్వంతూరుకు వచ్చాడు రంగనాధరావు.

ఇంటి జ్యేష్ట పుత్రుడు శేషగిరిరావు. టీచరుగా, చిరుద్యోగం చేస్తూనే తమ్ముళ్ళ నాదుకున్నాడు. చదివించాడు. ఆలస్యంగా కలిగిన సంతానంలో ఆఖరి పిల్లల చదువులు రిటైర్మెంటు నాటికి కూడా పూర్తవ్వలేదు.

రంగనాధరావు వచ్చి తీవ్ర ఆయాసంతో కింద మీదవుతున్న అన్నగారి స్థితి చూచి చలించిపోయాడు. తక్షణం టాక్సీ మాట్లాడి, జిల్లా కేంద్రానికి తీసుకెళ్ళి, బాగా పేరున్న స్పెషలిస్టుకు చూపించాడు. అడ్వాన్సుడు బ్రోంకైటిస్గా గుర్తింపబడింది జబ్బు. నెల్లాళ్ళ పాటు వాడవలసిన మంచి మందులు, టానిక్కులు వ్రాసి, శ్రద్ధగా వాడాలని మరీ మరీ చెప్పి, ఇంటికి తిరిగి వెళ్ళి వాడమని ఆదేశించాడు డాక్టరు.

మందులు చక్కగా పనిజెయ్యడం, తమ్ముడు, మరదలు అత్యంత ఆదరణతో సపర్యలందించడంతో, నాలుగు రోజులకే ఆయాసం పూర్తిగా తగ్గి, ప్రాణం తేలికపడింది పెద్దాయనకు. త్వరత్వరగా కోలుకుంటున్న అన్నగారికి తమ్ముడితో మాటామంతి సాగించే ఓపిక ఏర్పడింది.

“తమ్ముడూ ఈమధ్య ఒక సంగతి తెలిసింది. ప్రకాష్గాడు నీదగ్గరుంటున్నాడట నిజమేనా? ఎందుకుంచుకున్నావు ఆ బద్మాష్ని?”

రంగనాధరావుకి మిక్కిలి ఆశ్చర్యం కలిగింది. వాడు బద్మాష్ అని అన్నయ్యకెలా తెలిసింది! “వాడొచ్చి, ఆర్నెల్లుగా మనింట్లో వుంటున్న మాట నిజమే. వాడి వ్యవహారాలు, పోకిళ్ళ తీరు ఏమాత్రం బాగుండక బయటికి పొమ్మంటే పోయాడులే. అదిసరే నీకెలా తెలుసు వాడు బద్మాష్ గాడని?”

“మహ బాగా తెలుసు నాకు. ముందుగా తిష్టవేసింది నా దగ్గరేగా! రెండేళ్ళనాడు, అకస్మాత్తుగా వచ్చాడిక్కడికి. కొద్ది రోజుల్లో బ్యాంకు ఆఫీసరుద్యోగంలో చేరబోతున్నాను, చేరేముందు ఒకసారి మిమ్మల్నందర్నీ చూచి వెళదామనిపించి వచ్చానన్నాడు. తిరిగి వెళ్ళే యత్నమేమీ కనబడలేదు. బ్యాంకు జాబు ఆర్డర్సు యిదిగో వస్తున్నాయి. అదిగో వస్తున్నాయి అని చెబుతూ, ఆర్నెల్ల పాటు యిక్కడే గడిపి చివరకు ద్రోహానికి ఒడిగట్టాడా స్కౌండ్రల్!” అని చెబుతూ ఓ నిమిషమాగి తుపుక్కున ఉమ్మేసి తిరిగి మాట కొనసాగించాడు.

మనమ్మాయి రాధ బి.యస్సీ పాసయి, బి.యిడికి అప్లయి చేస్తోందప్పుడు. ముదురుతున్న అనారోగ్యం, నన్ను ఆమె పెళ్ళి కోసం తొందరపడేట్టు చేస్తోంది. రాధకేమో పెళ్ళి యిష్టం లేదు. త్వరగా బి.యిడి చేసి, ఉద్యోగంలో చేరాలని వుంది. ఎంత ప్రయత్నించినా సీటు దొరకడం దుర్లభ మయ్యింది. పెయిడ్ సీటు కొనే శక్తి మనకి లేకపోయె. అయితే రాధ ఏవిధంగా ప్రయత్నించి సాధించిందో గాని మన పక్క ఊళ్ళో కొత్తగా పెట్టిన కాన్వెంటు స్కూల్లో టీచరుగా చేరిపోయింది. నెలకు వెయ్యి రూపాయలు తెస్తూ నాకు కుడిభుజం అయ్యింది. ఇంటి పరిస్థితి మెరుగవుతున్నప్పటికీ పిల్ల పెళ్ళి బెంగ మాత్రం కుంగదీస్తూనే వుంది నన్ను. కట్నాలు లక్షలకెగబాకుతూ నాబోటి సగటు మనుషుల్ని ఎంత భయపెట్టేదీ యితరులకేం తెలుసు!

అలాంటి స్థితిలో వుండగా కొండంత ధైర్యమిచ్చాడు నాకు ప్రకాష్. “మామయ్యా! బి.కాం అయిపోగానే రకరకాల బ్యాంకు టెస్టులు వ్రాసి అన్నీ పాసయ్యాను. అన్ని బ్యాంకుల వెయిటింగు లిస్టుల్లో నా పేరుంది. ఏదో ఒక బ్యాంకు అపాయింట్మెంటు ఆర్డర్సు తప్పకుండా వస్తాయి. వచ్చే ఏడు రాధకి బి.యిడి సీటు నేనే సంపాదించి పెడతాను. అదైపోతే – గవర్నమెంటు టీచరు పోస్టు సంపాదించడం కూడా ఏమంత కష్టం గాదు. ఇకపోతే నేను రాధను బాగా యిష్టపడే నీ మేనల్లుడిని. మీరు యిష్టపడితే కట్నం పైసా అడక్కుండా తనను పెళ్ళి చేసుకుంటాను. ఆమె పెళ్ళి గురించి నువ్వు ఎంతమాత్రం దిగులు పడద్దు”. వాడిచ్చిన ఆ వాగ్దానం నా చింతనంతా మాయం జేసి, మనసుకు శాంతినీ స్థిమితాన్నీ యిచ్చింది.

“రాధకు కూడా ఎంత సంతోషం కలిగిందో! వేల జీతమొచ్చే బ్యాంకు ఆఫీసరవుతాడు మా బావ, తననిష్టపడి పెళ్ళి చేసుకుంటానంటున్నాడు. ఏం కొదవ నాకు అనుకుంది. ఇద్దరి నడుమ చనువు పెరుగుతోంది క్రమంగా. వాడు ప్రేమగా, చొరవగా రాధనడిగి జీతం రాగానే కొంత మొత్తాన్ని పాకెట్మనీ అంటూ తీసుకోడం మొదలైంది. ఎప్పుడైనా ఇంటి ఖర్చు ఎక్కువై పిల్ల యివ్వలేనప్పుడు గట్టిగా డిమాండు చేసి మరీ తీసుకుంటున్నాడు”.

“తండ్రిని మించిన జులాయి వీడు. కాబోయే ఆఫీసరునన్న , భర్తనన్న ధీమా ప్రదర్శిస్తూ డబ్బు లాగడం మొదలెట్టాడన్నమాట జిత్తులమారి వెధవ! మరి తరవాతేం జరిగింది?” రంగనాధం ఆతృతగా అడిగాడు అన్నగార్ని.

“ఏముంది ఎన్నాళ్ళకీ బ్యాంకు ఉద్యోగం జాడలేదు. రాను రాను తన సంపాదన మీద అతడి పట్టు బిగుస్తున్న సంగతి అర్థమవుతోంది రాధకి. నెమ్మదిగా అతడి మాటల మీద నమ్మకం సడలిపోతున్నది. ఏదో నాటకమాడుతున్నాడన్న గ్రహింపు కలిగింది. దాంతో నెలనెలా చెల్లించే మొత్తానికి ఫుల్స్టాపు పెట్టింది. దాంతో వాడు మండిపడుతూ “ బ్యాంకు పోస్టింగు ఆర్డర్సు ఏదో కారణం వల్ల రావడం ఆలస్యమైనంత మాత్రాన నీక్కాబోయే భర్తను ఖాతరు చెయ్యడం లేదు ఎంతహంకారం నీకు?” అంటూ రంకెలేశాడు.

రాధకి నిబ్బరం, ధైర్యం ఎక్కువ గదా తగినట్టుగానే జవాబిచ్చింది.

“తిన్నగా రానివ్వు మాటలు. నీ బ్యాంకు టెస్టులూ, ఉద్యోగాలూ అంతా బూటకమే. నీబోటి అబద్దాలకోరుల్ని, తేరసొమ్ముకు ఆశపడే వాళ్ళని పెళ్ళాడే గతి నాకొద్దులే” అన్నదట.

తరవాత జరిగిందంతా నాకు చెప్పి “అతన్ని చచ్చినా చేసుకోను. అంతేగాదు ఏం తొందరొచ్చిందిప్పుడు నా పెళ్ళికి? అవకాశాన్ని బట్టి పి.జి చేస్తా, కాదనకు నాన్నా!” అంటూ బతిమాలింది బిడ్డ.

“ఇక్కడి వాడి నాటకాల గురించి మాకు రవ్వంతయినా కబురు చెయ్యలేదెందుకు? మాకే మాత్రం తెలిసినా గుమ్మంలోకి రానిచ్చేవాణ్ణా వాడ్ని?” అవేదనతో అన్నాడు రంగనాధం.

“తెలపకపోవడం తప్పేరా తమ్ముడూ! ఉసూరుమని నిట్టూర్చడం తప్ప మరేమీ తర్కించలేదు తమ్ముడుగాని, మరదలు గానీ.

మర్నాడు తిరిగి ఇంటికి బైలుదేరుతూ అన్నయ్య చేతిలో ఐదువేలుంచి, మందులు క్రమంగా వాడమని చెప్పి, జరిగింది పీడకలనుకుని, ధైర్యంగా వుండమని రాధను ఓదార్చారు పిన్నీ చిన్నాన్న.

***
ఇల్లు చేరుకున్న రంగనాధరావు దంపతులకు ఆతృతగా వుంది ప్రకాష్ గురించి తెలుసుకున్నవన్నీ కూతురికి విడమరిచి చెప్పి, అతడి నిజస్వరూపమిది అని బోధపరచాలని. అబద్దాల కథలతో పెద్దనాన్ననీ, రాధక్కనీ నమ్మించి, బాగా వాడుకుని, చివరకు అక్కకు ఎంతలాంటి దుర్మార్గానికి ఒడిగట్టిందీ వివరించి “మనసులోంచి వాడి తలపు పూర్తిగా తొలగించి చదువు మీద, నీ భవిష్యత్తు మీద లగ్నం చెయ్యమ్మా” అని అర్థించారు సుజాతను.

“అంతా అర్థమయ్యింది, యికమీద చదువు దప్ప మరో ఆలోచన పెట్టుకోను” అని మాటిచ్చింది సుజాత అమ్మకీ, నాన్నకీ.కానీ వారం తరవాత ఆ పిల్లకి బావ మళ్ళీ కలల్లో కనబడి, ముచ్చట్లు చెప్పి మురిపించసాగాడు. దాంతో యిచ్చిన మాట గాలికొదిలి చాటుగా అతన్ని కలవడం మొదలైంది. అమ్మాయి కదలికలన్నీ తండ్రికర్థమై “ సుజీ ! ఏమిటి మళ్ళీ యిది? కనపడ్డ ప్రతీ పిల్లమీద ప్రేమ ఒలక బోస్తుంటాడు వీడు. నీతి నియమం లేని తిరుగు బోతని తెలుసుకుని కూడా ఎందుకు మళ్ళీ వాణ్ణి కలుసుకుంటున్నావు? ఏం మాటలు నీకు వాడితో?” గద్దించి అడిగాడు రంగనాధ రావు.

తండ్రితో వాదించి, సానుకూలం చేసుకుందామన్న పట్టుదల తలెత్తింది సుజాతలో. “నాన్నా! బావ తెలిసీ తెలియని యువ వయసులో తప్పటడుగు వేసి వుండచ్చు. తమ పొరబాట్లు చేదు అనుభవాలతోనే మనుషులు చక్కబడచ్చు. ఇప్పుడు బావకి నామీదున్న ప్రేమలో నిజాయితీ తప్ప, కపటమనేది లేదు- కొంచెం కూడా. ఆ సంగతి వేరే ఎవరికీ అర్ధమవ్వదు”.

ఈ రీతి కుతర్కంతో – సుడిగుండంలో స్వయంగా పడేట్టుగా వుంది కూతురు అని చాలా భయపడి, ఢిల్లీ నుంచి కొడుకుని రప్పించి వ్యవహారమంతా వివరించి, చెల్లిని మార్చే పని అప్పగించాడు తండ్రి. ముందు అన్నయ్య, తరవాత మేనమామలు, బంధువులు, ఎన్ని విధాల బోధించి కూడా సుజాత మనసు మార్చలేకపోయారు.

అందరితో ఒకేమాట సుజాతది “ఇది నా స్వంత విషయం. ఎవరూ జోక్యం చేసుకోకండి. పెళ్ళయ్యాక బావను ఎలా మార్చుకుంటానో మీరే చూద్దురు గాని” మింగుడు పడని మరో విచిత్ర వార్త! ఫైనలియర్ పరీక్షలయిపోయాక పెద్దాళ్ళు పెళ్ళికి ఏర్పాట్లు చేస్తే మంచిదే. లేదా మేం యిద్దరమే వెళ్ళి రిజిష్టరు మేరేజి చేసుకుంటాం. అని సుజాత అంటున్నట్లు ఇరుగు పొరుగులు, బంధువుల ద్వారా విని దిగ్భ్రాంతికి లోనవ్వక తప్పలేదు తల్లిదండ్రులకు. పిల్లతో అంతపనీ చేయించగలడు వాడు. ఈ ఇంటి మొదటి శుభకార్యం, ఇంటి ముందుగాక, బయటెక్కడో జరగడమేంటి? వీల్లేదు, బొత్తిగా కుదర్దలా. తమ చేతుల మీదగానే ఘనంగా జరుపుతారు. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులవ్వనీ!

ఫైనలియర్ పరీక్షలకు కష్టపడి చదివిన సుజాత సంతృప్తిగా అన్నీ వ్రాసి ముగించిన కొద్దిరోజులకు పెళ్ళి ఏర్పాట్లన్నీ ఘనంగా చేసి యావన్మంది బంధుమితృల సమక్షంలో కూతురు పెళ్ళి అతి వైభవంగా జరిపారు తల్లిదండ్రులు.

***

నవదంపతులు కొత్త ఇల్లు వెదుక్కుని, కొత్త కాపురం ప్రారంభించారు. సుజాత ఫస్టు క్లాసులో పాసయినట్టు – పరీక్ష ఫలితాలు తెలిపాయి. అవి నింపిన ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంతో ఓ ఫైనాన్సు కంపెనీలో ఉద్యోగం సంపాదించిందామె. తన పలుకుబడితో అల్లుడికి కూడా ఒక ఫార్మస్యూటికల్లో ఉద్యోగమే యించాడు రంగనాధం. దంపతులిద్దరూ చెరింత తెచ్చుకుంటూ సంసారం హాయిగా సాగించసాగారు.

ఏడాదిన్నరకు “పల్లవి” కి తల్లయ్యింది సుజాత. పసిపాప అమ్మమ్మకీ, తాతయ్యకీ అందిస్తున్న ఆనందానికి అవధుల్లేవు! మనవరాల్ని అతి మురిపెంగా సావిత్రమ్మ పెంచుతుండడం తో రెండు నెలలవ్వగానే కంపెనీ డ్యూటీకి తిరిగి వెళ్ళి వస్తోంది సుజాత. నెలకో రీతిగా బంతిలా ఒళ్ళు చేస్తూ, మురిపిస్తున్న పల్లవి పగలంతా అమ్మమ్మతో, రాత్రులు అమ్మనాన్నలతో గడుపుతోంది.

మారే కాలం కొన్ని జీవితాలకు సరికొత్త రంగులద్దవచ్చు. కొన్నిటికి ఉన్న రంగుల్ని వెలిసిపోగొట్టొచ్చు. సుజాత సంసారంలో కొత్తదనం తగ్గుతూ, బాధ్యతల భారం పెరగసాగింది. ఒకపక్క రకరకాల ఇంటిపన్లు, మరోపక్క ఉద్యోగ బాధ్యతలు అన్నీ ముఖ్యమే. ఏడాది పాటు మాత్రమే భార్యా భర్తలు తమ సంపాదనలు కలబోసుకు సంసారాన్ని నడిపారు. పద్ధతి క్రమంగా మారుతోంది. జీతమందగానే నెల వెచ్చాలు మొత్తం తెచ్చేస్తుంది సుజాత. ప్రకాష్ మాత్రం మునుపటిలాగా భార్య చేతికి జీతమివ్వకపోగా, వచ్చినట్టే చెప్పడం లేదు. రెణ్ణెల్లు చూచి, భార్య అడిగితే తల్లిదండ్రులకెంతో అవసరం వచ్చి అటు పంపాల్సి వచ్చిందని అన్నాడు. ప్రతి నెలా అదేమాట. ఒక్క తన జీతంతోనే ఇల్లు ఎలా నడపాలో తెలియడం లేదు సుజాతకు. కానీ అతన్నించి వస్తున్న లిక్కరు సువాసనలవల్ల కొత్త సంగతులు బోధపడుతున్నాయామెకు.

ఓరోజు ఆమెతో “ ఈ ఏడు మిరప్పంటకి ధరపలక్క పోయినేటి బ్యాంకులోను కట్టలేకపోతే ఇంటి జప్తుకు నోటీసిచ్చారట. అర్జంటుగా ఇరవై వేలు సర్దమని ఫోను జేశాడు నాన్న” అనిచెప్పి భార్య ముఖంలోకి చూచినప్పుడు రూపాయి సైతం నిల్వలేనప్పుడు అలా తనవంక చూచేమి లాభం అనుకుంది సుజాత.

వారం తరవాత మళ్ళీ ఎత్తాడు డబ్బు ప్రస్తావన. తన పెద్ద చెల్లికి బి.యిడి సీటు గవర్నమెంటు కోటాలో దొరకలేదట. పెయిడ్ సీటుకు తక్షణం నలభైవేలు కట్టాలి గాబట్టి ఎక్కడైనా చూచి పంపమని వాళ్ళమ్మ కబురు పంపిందట. ఉన్నఫళంగా ఎక్కడ దొరుకుతుంది అప్పు. కొంచెం మీ నాన్ననడిగి తీసుకొస్తే ఆపదకడ్డు పడుతుంది సుజాతా అన్నాడు ప్రకాష్. తండ్రినడిగి తేవడం అస్సలు యిష్టంలేదు సుజాతకు. ఇంతలో ఏదో ఆఫీసు పనిమీద ఊరినించి వచ్చిన పినమామగారి అబ్బాయి ద్వారా తెలిసింది అక్కడ పంటల ధర బాగున్నట్టూ, ఎడ్యుకేషను లోనుతో బి.యిడి సీటు సంపాదించినట్టూ. ఈ సంగతేం తెలియని ప్రకాష్ మళ్ళీ మొదలెట్టాడు. “సుజాతా ! అప్పుకోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాను. ఎక్కడా పుట్టలా. మరిక మీ నాన్న నడక్క తప్పదు. ఓ నలభై వేలు అడిగి తెస్తే నెలకింతని యిచ్చేద్దాం. నువ్వడిగితే కాదనడు మామయ్య” ఎంతో అనునయంగా, అర్థింపుగా అడిగాడు ప్రకాష్?

“బావా! నేను అర్ధాంతరంగా చదువు ఆపేసి పెళ్ళి చేసుకోవడం, పైగా ఈ సంబంధం చేసుకోవడం నాన్నకి బొత్తిగా యిష్టం లేదు. ఆయన్ని ఏమాత్రం ఖాతరు చెయ్యని నేను డబ్బివ్వమంటూ ఎలా చెయ్యి చాపను? నీకొచ్చేదంతా పంపుతూ కూడా, యింక అప్పులు చేసి కూడా పంపాలా? ఇంటి గొడవలూ నా ఉద్యోగ గొడవలూ చాలునాకు. యితరంగా మరేం తగిలించకు”.

“అంటే ఇంటి కోడలికి ఆ యింటి యిబ్బందులు పట్టవా? భర్త మాటకి విలువివ్వని ఎలాంటి లెక్కలేనితనం!” ప్రకాష్ కళ్ళు ఎర్రజీరల్ని చిమ్మాయి.

“లెక్కలేకపోవడం గాదు. డబ్బివ్వమని మాత్రం మావాళ్ళనడగను” మాటసగంలో వుండగానే ఆమెను ఒంగదీసి బలంగా గుద్దాడు ప్రకాష్.! నిర్ఘాంతపడి చూస్తుండగా మళ్ళీ చెంపలమీద ఛెళ్ళున చరిచాడు. సుజాత చెల్లి చరిత సరిగ్గా అప్పుడే మెట్లెక్కి పైకి వస్తున్నట్టు గమనించి, మళ్ళీ కొట్టడానికి ఎత్తిన చేతిని దింపేశాడు.

సుజాత దుఃఖాన్ని , అవమానాన్ని మింగి చెల్లి చంకలో వున్న పల్లవిని చేతుల్లోకి తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకోగా, దిగులుగా, బెంగగా అక్కముందు కూర్చుంది చరిత.

***
ప్రేమ కాదు భ్రమ. వివాహం, దాంపత్య జీవితం – ఎండమావిగా మారడం తప్ప సుఖమేమి యిస్తున్నది తనకు! సుజాత దినచర్యంతా నిర్లిప్తంగా, యాంత్రికంగా సాగుతోంది. తన బాధల్నీ, సమస్యల్ని కన్నవాళ్ళకి చెప్పుకునే స్థితి లేదు.

మరో రోజు చరిత పెళ్ళి కుదిరిందని తెలిసి ప్రకాష్. “ మీ చెల్లికిచ్చే కట్నంలో సగమైనా నాకివ్వమని చెప్పు మీ నాన్నతో. రాద్ధాంతం చెయ్యకుండా యిస్తే సరి. లేదా ఊరుకునేది లేదు తెలిసిందా?” నివ్వెరపోయిందామె. ఇంతకాలం జరిగాక బావ ఈ రీతిగా డిమాండు చెయ్యడం! డబ్బులొచ్చే సులువు మార్గాలని ఎంత చక్కగా కనిపెడతాడు!

“మా అమ్మవాళ్ళు మన పెళ్ళికసలు ఒప్పుకున్నారా? నా యిష్టాన్ని కాదనలేక, అయిష్టంగానే గదా చేసింది. అప్పటి నీ స్థితేంటి, చదువెంత? అండర్ గ్రాడ్యుయేటువి. పైగా ఏమైనా ఉద్యోగమా? పోనీ యిప్పటికైనా అయిందా డిగ్రీ? ఎలాగో ప్రయత్నించి ఉద్యోగం సంపాదించి పెట్టాడు నాన్న. అంతమాత్రం చాలదా? అర్దంతరంగా, మన అర్హతేంటో ఆలోచించకుండా ఈ కట్నం డిమాండేంటి యిప్పుడు?”

“నేనంటే ఎంత చులకనే నీకు? ఐతే ఎందుకు చేసుకున్నావు? నీ వాళ్ళందరూ హైక్లాసులో వుంటే నేనొక గతిలేని వానిగా మిగలాలి. అదేగదా నీ ఉద్ధేశం?”

“ఇప్పటికీ నీమీద ప్రేమ, ఆత్మీయభావం తప్ప చులకన దృష్టిలేదు నాకు. ఇద్దరం అడుగులో అడుగుకలిపి, కష్టపడితే పైకి ఎదుగుతాం తప్పకుండా. కాకపోతే స్వయంగా ఎన్నుకున్న మన జీవనరీతిని, మన అర్హతల్ని వాస్తవ రూపంలో అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి తప్ప మరెవరి వల్లో బాగవుతామనుకోవడం తప్పు”.

ఆపుతావా మరిక తర్కాన్ని? మొగుడు చెప్పిన మాటినవు. దానికి చేదోడుగా నిలబడవు. ఒట్టి మొండి రాస్కెల్వి. అలాంటప్పుడు నాతో కలిసుండడమెందుకు? పో బయటికి! గెటవుట్! ఎంత పొగరు- ఎంత తలబిరుసుతనం!

“అనుకోవాలేగాని పోవటమెంతసేపు?”

మగ అహంమీద ఎంత గట్టిదెబ్బ గొట్టింది!! మూలవున్న కర్ర సర్రున లాగి, సుజాతను గొడ్డును బాదినట్టు బాది, ఎగరొప్పుతూ మెట్లుదిగి వీధిలోకెళ్ళిపోయాడు.

***

ఏ ముఖంతో వెళ్ళాలి పుట్టింటికి! అయినా తప్పలేదు సుజాతకు. జరిగిందేమిటో కూతురి నోటివెంట విని, ఖిన్నులయి -”అమ్మా! అక్కడికెళ్ళద్దు. మా దగ్గిరే వుండు. నువ్వు మాకు బరువుగాదు. నువ్వు లేనప్పుడుగాని తెలిసిరాదు వాడికి నీ విలువేంటో” అన్నాడు కన్నవాళ్ళు.

ఇంతలో అనుకోని విధంగా చరిత పెళ్ళి ఆగిపోయింది.

రంగనాధం దంపతులకు రెండవసారి మరో రూపంలో తగిలిన తీవ్ర ఆఘాతం! బాధను తట్టుకోగలిగినంత తట్టుకున్నాక మనకు తెలియని ఏదో మేలు కోసమే యిలా జరిగింది అనుకుని స్వస్థపడ్డారు. పెళ్ళి ఆగిపోయిందని కించిత్తు విచారించకపోగా గొప్పవరంలా అనుకుంది చరిత. తల్లినీ తండ్రినీ బ్రతిమాలి, ఒప్పించి, పి.జి కోర్సులో చేరింది.

ఈ పెళ్ళి యిలా తప్పిపోయి, తన పథకాన్ని పాడు చేస్తుందనుకోలేదు ప్రకాష్. ఏదో ఉపాయంతో సుజాతని రప్పించుకోక పోతే లాభం లేదు. “మీరిద్దరూ కలిసి వచ్చేయండి; అత్యవసరం” అన్న కొడుకు కబురందుకుని మర్నాడే వచ్చి వాలారు ప్రకాష్ అమ్మానాన్నలు. జరిగిందంతా తెల్సుకున్నారు. రంగనాధరావును కలిసి అనేక క్షమాపణలు చెప్పి, పొరబాటంతా తమవాడిదేనని ఒప్పుకుని కోడల్ని పంపవలసిందని వేడుకున్నారు. రంగనాధం మెత్తబడక తప్పలేదు. మేనత్త బుజ్జగింపులతో సుజాత కూడా రాజీపడింది. దంపతులు తిరిగి కలుసుకున్నారు.

భార్యలేని సమయంలో యిష్టానుసారం తాగుతూ గడిపాడు ప్రకాష్. అదే బాణీ సాగుతోంది యిప్పుడు కూడా. తాగొస్తున్నాడు తగాదాకు కూర్చుంటున్నాడు. మీ బాబునడిగి డబ్బెందుకు తేవు అంటూ బూతుల్లోకి దిగుతున్నాడు. అతడి వాగుడు వినీ వినీ మరిక పట్టించుకోవడం గానీ, లెక్కచెయ్యడంగానీ మానుకుంది సుజాత.

ప్రకాష్ కొత్త ఆలోచనతో భార్యను లొంగదీసుకుందుకు కొత్త పద్ధతి వెదికాడు.

“మీ ఆఫీసులో రోజూ ఆ కుర్రాడితోనే కలిసి లంచ్ చేస్తావట. హోటలుకీ, షాపింగుక్కూడా ఆ ఫోకిల్లాగాడితో కలిసి వెళ్తుంటావట. మీ అటెండరు నాకంతా చెబుతూనే వున్నాడు. కొత్త రుచి ముందు పాత మొగుడెలా పనికొస్తాడు? అందుకే నీ కంటికి గడ్డి పరకనైపోయానే రండా!” – పళ్ళు నూరుతూ భీకరంగా మీదికొస్తున్న మొగుణ్ణి బలంగా వెనక్కి నెట్టగానే మత్తుతో ఊగుతూ వెల్లకిలబడి లేచి నించునే యత్నం చేసినా లాభం లేకపోయింది.

“ఒరే! నువ్వు కూసేదే నిజమనుకున్నా డబ్బు సంపాదనకు అదొక తేలిక మార్గమే గదరా! ఇకనించి నాకోరేటు బెట్టి మగాళ్ళను తీసుకొచ్చి డబ్బు గుంజుకుంటూ వుండు… రంకులాడిపెళ్ళాం నీ దగ్గిరే ఎట్టా వుంటుంది చెప్పు. ఈ నిమిషంనించీ నీకూ నాకూ సరి! ఇక నీ ముఖం చూణ్ణు!” గొల్లున ఏడుస్తున్న పల్లవిని చంకనేసుకుని, బాణంలా బయటికి దూసుకుపోయింది సుజాత.

***
అవమాన ఆక్రోశాల్తో వీధిలోకైతే వచ్చింది గానీ, ఎక్కడ ఏ మజిలీకి చేరుకోవాలో తెలియడం లేదు సుజాతకు. పుట్టింటికి చేరదగినట్టుగా వుందా తన స్థితి! ఎలా అడగ్గలదు ఆశ్రయమివ్వమని!

గుండె దిటవు చేసుకుని తన తన క్లాసుమేటు, ప్రాణస్నేహితురాలు ‘విద్య’ వద్దకెళ్ళింది. తన పెళ్ళి, తనిష్టపడ్డ మేనబావతో జరిగిన్నాటినించి, యిప్పటివరకు సాగించిన దుర్భర జీవితాన్ని నేస్తం కళ్ళముందుంచింది సుజాత. నివేదన పూర్తయినాక యిలా అర్థించింది. “విద్యా! మా అమ్మానాన్నల ఆశ్రయాన్ని కోరగల యోగ్యత ఏమాత్రం లేదు నాకు. వాళ్ళిచ్చినా పుచ్చుకునేది లేదు. అంచేత ఎలానైనాసరే మీ తల్లిదండ్రుల్ని ఒప్పించి ఇంటివెనుక పోర్షన్ని అద్దెకిప్పించి పుణ్యం గట్టుకో. నీ దగ్గరా, మీ ఇంట్లోనూ, మరెక్కడా దొరకని అండదండలు లభిస్తాయన్న నమ్మకం వుంది నాకు”

స్నేహ సౌజన్యాలకీ, క్లాసు ఫస్టు ర్యాంకరుగా తెలివి తేటలకీ, కాలేజీలో పేరుపొందిన ఆత్మీయురాలు సుజాత. హఠాత్తుగా పెళ్ళి వలలో చిక్కుకోవడం, బతుకు అల్లకల్లోలం చేసుకోడం నాలుగేళ్ళపాటు నరకయాతనలను భవించడం ఏమిటిదంతా! కదిలిపోయి కన్నీరు పెట్టుకుంది విద్య. తల్లిదండ్రులకు బాగా నచ్చజెప్పి సుజాతకు తమవెనుక పోర్షను యిప్పించి ఆదుకుంది.

చీకటి ఖైదు నించి, వెలుగు నిండిన బయలులోకి అడుగుబెట్టిన హాయి కలిగింది సుజాత మనసుకు.

ఇంటికొచ్చి తమతో, తమ మధ్య వుండమని తల్లి సావిత్రమ్మ, తండ్రి రంగనాధరావు మరీ మరీ బ్రతిమాలినా వినిపించుకోకుండా యిలా అంది సుజాత. “నాన్నా! మీరెన్ని విధాల బోధించారు యితను మనకు తగ్గవాడు గాదనీ, చేసుకోవద్దనీ. కోరి, స్వయంగా వేటగాడి వలలో పడ్డ మూర్ఖురాలిని. దయతో పరిస్థితులే నన్ను బయటపడేశాయి. ఉద్యోగముంది గాబట్టి నాకేం ఢోకా లేదు. నేను సృష్టించుకున్న సమస్యల్ని నేనే స్వశక్తితో ఎదుర్కొని పరిష్కరించుకోవాలి. నన్ను నాకు వదిలేయండి”

కూతురి ధృఢ నిర్ణయాన్ని కాదనలేక పోయారు తల్లిదండ్రులు.

***

సుజాత ఒంటరిగా వుంటూనే, ధీమాగా బ్రతకడాన్ని ప్రకాష్ సహించలేకపోతున్నాడు. మొగుడన్నాక తిడతాడు, కొడతాడు తిరిగి దగ్గరకు తీసుకుంటాడు. పెళ్ళాలు ఈ రకంగా బరితెగించి పోవటమేనా? ఇదివరకూ గొడవలు పడ్డారు. తిరిగి కలుసుకుంటూ వున్నారు. భార్య సాంతంగా దూరమవ్వడమిప్పుడే. సంపాదించి, చక్కగా సంసారం దిద్ది, సమస్తమూ అమర్చి పెడుతుండేది. అలాంటి దర్జా యిప్పుడేది తనకు. అసలు పెళ్ళామనేదుంటేనే గదా పెత్తనం సాగేది! పెళ్ళాం నించి పొందుతుండే సపర్యలు, శరీరసుఖం వాటి మాటేమిటి?

పిచ్చెక్కుతోంది ప్రకాష్కి. మాటమాటకూ సుజాత పనిజేస్తున్న కంపెనీకెళ్ళి ఇంటికి వచ్చేయ్యమంటున్నాడు. తను రానని ఖచ్చితంగా అనడం, యితడు పిచ్చి బూతులు తిట్టడం మాత్రమే గాక ఎం.డీకి ఫోన్లుచేసి “మీ దగ్గర చేస్తున్న సుజాతనే నా భార్య చెడు తిరుగుళ్ళకి అలవాటు పడి, నాకు దూరంగా వుంటోంది. దాన్ని ఉద్యోగం నించి వెంటనే తొలగించకపోతే మీ లేడీ స్టాఫంతటినీ చెడగొట్టి తీరుతుంది” అంటూ హెచ్చరికలకు దిగాడు. మూడేళ్ళపైగా సుజాత ప్రవర్తననీ, సమర్థతనీ బాగా ఎరిగున్న మేనేజిమెంటు మొదట్లో పలికినా, తరువాత అతని కంఠం వినగానే ఫోను పెట్టేస్తున్నారు. అతన్ని కంపెనీకి సైతం రానివ్వకుండా కట్టుదిట్టం చేశారు.

మరిక ప్రకాష్లో కక్ష, క్రౌర్యం ప్రకోపించకుండా వుండేదెలా! సుజాత బస్సుకోసం నిలబడి చూస్తున్నప్పుడూ, బస్సు దిగి నడిచొస్తున్నప్పుడూ వెనకసీటున వచ్చి వీపుమీద గుద్దులు గుద్ది, రెప్పపాట్లో మాయమవుతున్నాడు . ఒకసారి ఓ షాపుచాటున నక్కి రాళ్ళు గురిపెట్టి విసురుతుంటే చుట్టూ వున్న వారు అతన్ని పట్టేసి శక్తికొద్దీ దేహశుద్ధి జరిపారు.

అందుకు సిగ్గుపడ్డంపోయి, ఉన్మాదిగా మారాడు. ఒకనాడు షాపులో మందులు కొనుక్కుని మెయిన్ రోడ్డెక్కుతున్న సుజాతను హఠాత్తుగా అడ్డగించి, బూతులు కూస్తూ, తన్నడానికి కాలెత్తాడు. దాన్ని చటుక్కున రెండు చేతుల్తో పట్టేసి, బలంగా, గట్టిగా మెలిదిప్పింది సుజాత. మరు నిమిషంలో తన కుడికాలిని నిటారుగా చాపి, గుండెలమీద ఒక్క తన్ను తన్నింది. బాధతో విలవిల్లాడుతున్న ప్రకాష్ మీదికి మళ్ళీ లంఘించి పిడికిళ్ళతో భుజాల మీద, తొడలమీద సమ్మెటపోట్లు పొడిచి హూనం హూనం చేసింది.

రోడ్డున పోతున్న జనమంతా గుంపుగట్టి ఎవడో రౌడీ వెధవ ఆడమనిషి జోలికెళ్ళి ఆమె చేతిలో తన్నులు తింటున్నాడనుకుంటూ, వినోదంగా, ఆనందంగా విడ్డూరపడి చూడసాగారు. “శహభాష్! ఎంతబాగా తన్నుతోందిరా- వెధవ బుద్ది దెచ్చుకుని, జన్మలో ఆడవాళ్ళ వెంట పడగూడదు బాబో అనుకునేలాగ! మామూలు తన్నులు గావు యివి. కనబడ్డంలా! కరాటే దెబ్బలు, అవే గుద్దులు. ఇదివరకెన్నడు గానీ, ఎవ్వరుగానీ చూచి ఎరగని ఈ కొత్త దృశ్యాన్ని అబ్బురంగా తిలకించుతూ, అభినందనలు కురిపిస్తున్నారు జనాలు.

ఆడవాళ్ళలో అందునా తన భార్యనుకున్న మనిషిలో యింతటి వీరావేశం! ఇల్లాంటి సరికొత్త దృశ్యాన్ని కలనైనా ఊహించగలిగాడా ప్రకాష్!!

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

5 Responses to సరికొత్త దృశ్యం

 1. Anonymous says:

  చాలా బాగున్నది

 2. Anonymus says:

  చాలా బాగున్నది
  నాకు బాగా నచ్చింది

 3. Anonymous says:

  ముగింపు చాలా బాగుంది.

 4. Anonymous says:

  చాల బాగుంది

 5. Anonymous says:

  చాల బాగున్నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో