మానవత్వం పరిమళించే మధురవాణి

ఓల్గా
కన్యాశుల్కం మొదటి కూర్పు 1892లో వస్తే రెండవ కూర్పు 1909లో గురజాడ తెలుగు సాహిత్యానికి వెలలేని కానుకగా సమర్పించాడు. ఈ మధ్యలో ఉన్న పదహారు సంవత్సరాలలో జరిగిందేమిటి? గురజాడ మరింత లోతుగా సమాజాన్ని అర్థం చేసుకున్నాడు. మానవీయ కోణాలనేకం దర్శించాడు. ”ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుందనే” ఆలోచన చేసే దిశగా ప్రయాణం సాగిస్తున్నాడు. అలాంటి సమయంలో, సమాజాన్ని గురించి ఒక మహారచయిత క్రాంత దర్శనం చేస్తున్న శుభ సమయంలో మధురవాణి సద్యో యవ్వనంతో జన్మించింది. అత్యద్భుత మానవత్వంతో చిరునవ్వులు విరజిమ్ము కుంటూ, కపట సమాజాన్ని పరిహసిస్తూ, ఆ ద్వంద్వ విలువలను చూసి పగలబడి నవ్వుతూ, అందరినీ ఆడిస్తూ, అందరితో ఆడుకుంటూ రసాలసాలమై ఎదిగింది. ఆమె ఎదుగుదల, పరిణిత చూసి ఆమె తండ్రి గురజాడ సైతం అబ్బురపడ్డాడు. మొదటి కూర్పులో మధురవాణిని సృష్టిస్తున్నప్పుడు ఆ పాత్ర పట్ల గురజాడకు అంత ఘనమైన అభిప్రాయమేమీ లేదు. ఆ పాత్ర గురించి చెబుతూ ”వర్ణింపరాని హేయమైన నడవడి గలది. ఆ పాత్రకు ఎట్టి వన్నెచిన్నెలూ లేవు. నాటకం రచిస్తున్న కొద్దీ మధురవాణి మీద నాకున్న దృక్పథం మారుతూ వచ్చింది. మధురవాణి పాత్రంటే నేనే ముచ్చట పడుతున్నాను” అన్నాడాయన. రచయితకే ముచ్చట గొలిపిన మధురవాణి వందేళ్ళనుండీ తెలుగు వారి మనసులను దోచుకుంటూనే ఉంది. అప్పటి మనుషులపై మధురవాణి చూపిన అవ్యాజ మానవీయ ప్రేమకు బదులుగా తెలుగు పాఠకుల ప్రేమవర్షం వంద సంవత్సరాలుగా ఆమెపై కురుస్తూనే ఉంది.
మధురవాణి భోగం కులంలో పుట్టి వృత్తి చేసుకునే వ్యక్తి. సంగీత సాహిత్యాలతో పరిచయం ఉంది. తల్లి పెంపకంలో సుశిక్షితురాలై మంచివారి ఎడల మంచిగాను, చెడ్డవారి ఎడల చెడ్డగానూ ప్రవర్తించమన్న తల్లిమాటలను విలువైన మాటలుగా గుర్తుంచుకున్నది. ఐతే చాలాసార్లు, ముఖ్యంగా స్త్రీలకు సహాయపడే సందర్భాలలో ఆమె తనపట్ల చెడ్డగా ఉన్నవారి పట్ల కూడా మంచిగానే ఉన్నది. తల్లి మాటలకు తన వివేకాన్ని కూడా జోడించి మానవ సంబంధాలలో ఎంత సున్నితంగా, అదే సమయంలో ఎంత ఆత్మగౌరవంతో ఉండవచ్చో మనకు నేర్పింది. మానవత్వం, ఆత్మగౌరవం, కార్యసాధన సామర్ధ్యం, చతురత, హాస్య ప్రియత్వం, కత్తుల వంటి విమర్శలను పువ్వుల వలే విసరగల నేర్పు, ఎదుటివారు తనను అనుమానిస్తున్నారని తోస్తే గొంతు నులమకుండానే వారికి ఊపిరాడకుండా చేయగల శక్తి – తనను తాను కాచుకోగల ఒడుపు – యిలా ఎన్ని జీవ లక్షణాలనో నింపుకున్న సజీవమైన పాత్ర మధురవాణి.
కన్యాశుల్కం నాటకంలో ఆమె పలికిన మొదటి వాక్యం ”మొగవాడికయినా ఆడదానికయినా నీతి ఉండాలి”. ఇక్కడ నీతి వఖళిజీబిజిరిరీశిరిబీవ నీతి కాదు. ఆ మాటకు అర్థం ఒక పద్ధతికి కట్టుబడి ఉండాలని. ఆ కట్టుబడి ఉండటంలో ఆడ, మగ తేడా ఉండకూడదని. తన వద్దకు వచ్చే మగవాళ్ళ నీచత్వాన్ని అనునిత్యం చూస్తున్న మధురవాణి స్త్రీ పురుషుల మధ్య ఉన్న తేడానే మగవారి నీచత్వానికి మొదటి కారణంగా భావించిందా? మగవారు అనుసరించే ద్వంద్వ విలువల వల్లే సమాజం భ్రష్టమవుతుందని భావించిందా? ఎందుకంటే నాటకం మొత్తం మీద మధురవాణి తాను నీతిగా ఉన్నానని పదే పదే చెబుతుంది. వేశ్యలు అవినీతిపరులనీ సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నారనీ పెద్ద ఉద్యమమే లేవదీసిన రోజులవి. యాంటినాచా? ప్రోనాచా? అనే ప్రశ్న ప్రతి పురుషుడూ ఎదుర్కొంటున్న రోజులు. ”యాంటినాచ్‌”గా ఉండటమంటే మహానీతి మంతులుగా ఉండటమని సంస్కర్తలు తల పోస్తున్న రోజులు. కందుకూరి వీరేశలింగం పంతులుగారూ, రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు వంటి సంస్కర్తలు భోగం వృత్తిని వ్యతిరేకిస్తూ వేశ్యల గాలి కూడా సోకకుండా బతకటమే నీతి అని తమ ఆచరణతో ప్రతిపాదిస్తున్న రోజులు. ఆ రోజుల్లో పుట్టిన మధురవాణి తాను నీతిమంతురాలినని సగర్వంగా ప్రకటించు కుంటుంది. ఎదుటి వ్యక్తి తన మాటలు గుర్తించే వరకూ కొరడా పట్టుకు కొట్టి చెబుతుంది. మధురవాణి కన్యాశుల్కంలో మాట్లాడిన రెండవ, మూడవ వాక్యాలు ”వేశ్య అనగానే అంత చులకనా పంతులు గారూ? సానిదానికి మాత్రం నీతి ఉండొద్దా?
ఈ మాటలు మధురవాణి ఒక్క రామప్ప పంతులుతోనే మాట్లాడలేదు. తన మాటలు వింటున్న ప్రేక్షకులందరితో, చదువుతున్న పాఠకులందరి ముందూ ఈ ప్రశ్నలు ఉంచింది. ఆమె రంగం మీదికి వచ్చిన మూడు నిమిషాలలోపు వేసిన ప్రశ్నలివి. మధురవాణి పాత్ర స్వభావం ఏమిటో, ఎలా రూపుదిద్దుకుంటుందో సూచించే మాటలు.
ఆ సన్నివేశం సగం నడిచే సరికి మధుర వాణి మరొక మాట తన గురించి చెప్పు కున్నది.”నేను డబ్బు కక్కుర్తి మనిషిని కాను.”
లోకంలో వేశ్యల గురించి ఉండే అభిప్రాయం, నమ్మకం, డబ్బు కోసమే వాళ్లు ఎన్ని పనులైనా చేస్తారని, నీతిలేని పనులు చేస్తారని.
మధురవాణి నాటకమంతా ఆ రెండు నమ్మకాలను వమ్ముచేయదలచింది. ఆమె తానున్న ప్రతి రంగంలోనూ నీతి గురించి డబ్బు గురించి మాట్లాడింది. తాను నీతిమాలిన మనిషిని కాననీ, డబ్బుకాశించి మాత్రమే బతికే దానిని కాదనీ పదేపదే చెప్పింది. ఆమె చుట్టూ ఉన్న మనుషు లందరూ నీతిలేని వాళ్ళు. డబ్బు కక్కుర్తి మనుషులు. కానీ లోకం దృష్టిలో వాళ్ళు మంచి కులంలో పుట్టి, బాగా చదువుకుని, ఆనాటి సంప్రదాయాలనూ, ఆచారాలను పాటించే పురుషోత్తములు. మధురవాణి చెప్పే వరకూ సౌజన్యారావు పంతులికి కూడా గిరీశం సంగతి తెలియదు. అతన్ని నిజంగానే జంటిల్మన్‌ అని, నెపోలియన్‌ ఆఫ్‌ యాంటినాచ్‌ అనీ నమ్మాడు. కులం వల్ల, వృత్తి వల్ల మనుషులను అంచనా వేయరాదనే సంగతి కన్యా శుల్కం నాటకంలో పరోక్షంగా మధురవాణి పాత్రతో ప్రతిపాదించిన గురజాడ ఆ తర్వాత రాసిన కవితలో చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని ప్రకటించాడు.
”మంచి చెడ్డలు ఎంచి చూడగ
రెండే కులములు మనుజులందున
మంచి యన్నది మాల అయితే
మాలనేనగుదునోయ్‌”
మధురవాణి పాత్ర సృష్టించే క్రమంలో, ఆమె తల్లి గురించి ప్రస్తావించే సందర్భంలో మంచి చెడ్డల గురించి లోతుగా ఆలోచించే అవకాశం గురజాడకు కలిగింది. పదిహేనేళ్ళు ఆలోచించాడు. కన్యాశుల్కం రాశాక కలిగిన స్పష్టతతో ధీమాగా మంచి చెడ్డలను కులం నుంచి వృత్తి నుంచి విడదీసి తనకేర్పడిన నూతన దృష్టిని తన కవిత్వం ద్వారా ప్రకటించాడు.
మళ్ళీ మధురవాణి దగ్గర కొద్దాం – మళ్ళీ ఆమె పాత్ర ప్రవేశించిన మొదటి రంగాన్ని చూద్దాం.
గిరిశం రాగానే మాట్లాడిన మాట మరొక కొరడా దెబ్బ. గిరీశం ”పరువైన ఆడది నీ ఇంటికెందుకొస్తుంది?” అని ఆమెను చులకన చేస్తే
”పరువైన మొగాళ్ళొచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళెందుకు రాకూడదు” అంటూ మళ్ళీ స్త్రీ పురుషుల ద్వంద్వ విలువలను నిల దీస్తుంది. ఆ తర్వాత కాసేపటికే పూట కూళ్ళమ్మ గిరీశాన్ని వెతుక్కుంటూ వస్తుంది. మధురవాణి అంటే ఆమెకేం గౌరవం లేదు. తన గౌరవాన్ని తానే కాపాడుకోలేని అమాయకురాలు. గిరీశానికి డబ్బంతా ఇచ్చి మోసపోయింది. అలాంటి పూటకూళ్ళమ్మకు మధురవాణిని గౌరవించాలని ఎలా తెలు స్తుంది. వచ్చి రచ్చ చేసి ”ఎక్కడ దాచా వేమిటి?” అని అడిగితే.
మధురవాణి ఆత్మగౌరవ ప్రకటన, లోకజ్ఞాన ప్రకటన ఒకే సమయంలో చేస్తుంది.
”నాకు దాచడం ఖర్మవేఁవిఁ? నేను మొగనాల్ని కాను. వెధవ ముండనీ కాను. నా యింటికొచ్చేవాడు మహారాజు లాగా పబ్లిగ్గా వస్తాడు”.
మొత్తం ఆనాటి కుటుంబ వ్యవస్థ మీద ఒక వేటువేసి మరీ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది.
అప్పటి కుటుంబాలలో వితంతువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో మనకు సాంఘిక చరిత్ర, సాహిత్య చరిత్ర కూడా చెబుతాయి.
వీరేశలింగంగారు వితంతు వివాహాలు జరపటానికి అంత ఉద్యమం చేయటానికి కూడా వితంతువులను శాంతిగా బతకనీయని ఆ పరిస్థితే కారణం. ఆయన తన స్వీయ చరిత్రలో రాసిన దాని ప్రకారం ”వ్యభిచార భ్రూణహత్యాదుల కవకాశములేక బాల వితంతువులు తమ ద్వితీయ వల్లభులతో” సుఖంగా ఉంటే చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ఆయన పూనుకుని వితంతు వివాహాలు చేయటం మొదలు పెట్టాడు. వితంతువులకు కుటుంబంలో రక్షణ లేదు. శాంతిలేదు. వారు ఇంట్లో మగవారికీ లొంగవలసి వస్తుంది. ఒక్కోసారి ఇష్టానుసారంగానో, బలవంతం గానో బైటి మగవాళ్ళతోనూ సంబంధాలు పెట్టుకోవలసి వస్తుంది. ఈ కారణంగా గర్భాలు రావటం, వాటిని తీయించు కోవటం, ఆ సమయం దాటిపోతే కాశీనో రామేశ్వరమో వెళ్ళి అక్కడ పిల్లల్ని కని, అక్కడి మిషనరీ సంస్థలలో వదిలి రావటం యిదంతా మన కుటుంబాలలో వితంతు స్త్రీల సాంఘిక చరిత్ర. ఈ చరిత్ర అమాన వీయంగా ఉందని, దానిని మారుద్దామని వీరేశలింగం పంతులుగారూ, రాజ్యలక్ష్మమ్మ గారు తమ జీవితంలో అనేక వ్యయప్రయా సలకోర్చి, సంఘ బహిష్కారాన్ని సహించి వితంతు వివాహాలు జరిపించారు. 19వ శతాబ్దంలో వితంతువుగా తన అనుభవాలు రాసిన బెంగాల్‌ మహిళ హైమావతీసేన్‌ మాటల్లో చెప్పాలంటే ”హిందూ సమాజమా, సిగ్గుతో చచ్చిపో, నీ వైభవం ఎంతో గొప్పది… నేనింకా చిన్నపిల్లనే. ఐనా తలిదండ్రులకు నా మీద ఉన్న బాధ్యతలనన్నిటినుంచీ బైటపడేశాను. నా పరాధీన బతుకు కోసం నా భర్త అన్నగార్లకు బానిసయ్యాను. ఈ లేతవయసులో గుప్పెడు మెతుకుల కోసం ఇతరుల కోరికలకు బానిసనవ్వటాన్ని ఆమోదించటమెలాగో నేర్చుకుంటున్నాను.”
ఇదీ పరిస్థితి. రహస్యంగా సాగే ఆ సంబంధాల విషాదాన్ని మధురవాణి ఒక హాస్య సందర్భంలో తన ఆత్మగౌరవ ప్రకటన కోసం చెప్పీ చెప్పనట్లు చెప్పింది. కుటుంబ స్త్రీల రహస్య జీవనంలోని హేయత కంటే తన వృత్తి గౌరవ ప్రదమైందని ఆత్మవిశ్వాసం తో ఆ మాటల్ని పలికింది.
మొదటి అంకంలో పరిచయమైన ఆమె తత్త్వం – నీతిని పాటించటం, డబ్బు మాత్రమే ప్రధానం కాదనుకోవటం, ఆత్మగౌరవంతో నిలబడటం యివి నాటకమంతా పరుచుకుని నాటకాన్ని కొత్తదారుల వెంట నడిపించాయి. మధురవాణి స్త్రీ జన పక్షపాతాన్ని, సాటి స్త్రీలతో సహానుభూతిని కూడా గురజాడ మనకు హాస్య ధోరణిలో పరిచయం చేస్తాడు. పూటకూళ్ళమ్మకు చురక వేసిన మధురవాణి ఆమెను ఉట్టి చేతులతో వచ్చిన పనికానీయకుండా బైటికి పంపదలచు కోలేదు. మాటలతో ఆమెను ఉడికిస్తూనే కనుసన్నలతో గిరీశం రావఁప్పంతులు దాగివున్న చోటును చూపించింది. పూటకూళ్ళమ్మ తననెలా చూస్తేనేం – మధురవాణికేం తక్కువ? పాపం పూటకూళ్ళమ్మ – ఆమెకు ఏదో విధంగా సహాయపడకపోతే మధురవాణిలోని మానవత్వం ఊరుకుంటుందా? సమాజంలో పూటకూళ్ళమ్మకు విలువలేకపోవచ్చుగాక. మధురవాణి మంచి మనసులో పూటకూళ్ళమ్మ పరిస్థితి గురించి సానుభూతి ఉంది. ఆమెను ఈ గతికి లాగిన మర్యాదా పురుషోత్తముల మీద కోపమూ ఉంది. ఆ రెంటినీ సరసంగా నవ్విస్తూ తీర్చుకోగలిగిన అవకాశమూ వచ్చింది. ఆ అవకాశాన్ని మధురవాణి సద్వినియోగం చేసి నాటకాన్ని రక్తికట్టించింది. మొదటి అంకంలోనే స్త్రీల పరస్పర సహకారం మగవాళ్ళ దుష్టత్వాన్ని దెబ్బకొట్టగలదని మధురవాణి నిరూపించింది. స్త్రీల పరస్పర సహకారం అనేది ఆదర్శమైతే ఆ ఆదర్శాన్ని నాటకమంతా ఆచరించి చూపింది మధురవాణి. తోటి స్త్రీలకు, వారు తనకు పరిచితులైనా అపరిచితులైనా, తనను చులకనగా చూసినా, తూలనాడినా సహాయపడటాన్ని తన సహజ గుణంగా చేసుకున్న మధురవాణి ఆ సుగుణంతోనే నాటకాన్ని నడిపించింది.
మళ్ళీ తృతీయాంకంలో గాని మధురవాణి మనకు కనిపించదు. తృతీయాంకం తర్వాత ఆమె విశ్వరూపం మనకు క్రమంగా ఆవిష్కృతమవుతుంది. తృతీయాంక ప్రారంభంలోనే ఆమె రావప్పంతులు టక్కరి, మోసగాడని గ్రహిస్తుంది. వ్యక్తుల గుణగణాలెలా ఉన్నా ఆమె వృత్తికి అంత సంబంధం లేదుగానీ రావప్పంతులు తన దగ్గర ధనం ఉందని చెప్పిన విషయం గురించి కూడా ఆమెకు సందేహం వస్తుంది. అది ఆమె జీవనానికి సంబంధించిన సమస్య. దాని గురించి ఆలోచించకపోతే మొదటికే మోసం. ఐతే దానితోపాటు మధురవాణి లుబ్ధావధాన్లు పెళ్ళి ఆపాలని ప్రయత్నిస్తుంది. అప్పటికి కరటకశాస్త్రి వచ్చి ఆమెను తన మేనగోడలి పెళ్ళి ఆపటంలో సహాయ పడాలని అర్థించలేదు. ఐనా మధురవాణి రావప్పంతులుతో లుబ్ధావధాన్లు పెళ్ళి ఆపించ మని పట్టుబడుతుంది. ”లుబ్ధావధాన్లకు పెళ్ళెందుకు కుదిర్చారు?” ”ఆ ముసలాడికి పెళ్ళెందుకు?” ”ఈ పెళ్ళి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను” ఇలా తన వ్యతిరేకత తెలియచెబుతూ రావప్పంతులు ఎంత కథ అల్లి ఈ పెళ్ళి చేస్తున్నాడో బైటికి లాగుతుంది. మీనాక్షితో మధురవాణికి స్నేహం ఉన్న సంగతి తర్వాతి రంగంలోగాని బైటికిరాదు. బహుశా ఈ పెళ్ళి సంగతి చెప్పి ఎలాగైనా మాన్పించమని మీనాక్షి మధురవాణిని అడిగి ఉండవచ్చు. మధురవాణి స్నేహ ధర్మాన్ని పాటించి ఉండవచ్చు.
బ్రాహ్మల జాతకాల్లో మోసం రావప్పంతులు నోటితోనే చెప్పిస్తుంది. అది మోసం కాదు లౌక్యం” అనీ, ”నమ్మిన చోట చేస్తే మోసం, నమ్మని చోట చేస్తే లౌక్యమని” రావప్పంతులు చెప్పినదాన్ని ఒప్పుకోకుండా
”తాను చేస్తే లౌక్యం. మరొకడు చేస్తే మోసం అనరాదా? అబద్ధానికి అర్థమేమిటి?” అని తన వివేకాన్ని, లోకజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది.
రావప్పంతులి దుర్బుద్ధిని ఊహించి అతనెందుకు ఈ పెళ్ళి తలపెట్టి ఉంటాడో చెప్తుంది. ”పెళ్ళి కూతుర్ని యిలాకా చేసుకుని దాంద్వారా ముసలాడి మూటా ముల్లా లాగేస్తారు. యంత సత్యకాలపు దాన్నయినా ఆ మాత్రం ఊహించుకోగల్ను. లేకపోతే నేయంత బతిమాలుకున్నా ఈ పెళ్ళి తప్పించకపోవడవేఁవిఁ?” రావప్పంతులు లుబ్ధావధాన్ల మూటాముల్లే లాగేస్తే మధురవాణికి ఆర్థికంగా లాభమేగాని నష్టంలేదు. ఐనా ఆ పెళ్ళి తప్పించమని బతిమాలు కుంటుంది. ఎందుకు? కేవలం మానవత్వంతోనే కదా –
రావప్పంతులు లుబ్ధావధాన్ల కూతురు మీనాక్షిని గురించి చెప్పి మీనాక్షి చెడి పోకుండా కాపలా కాయిటానికి ఈ పెళ్ళి కూతురుంటుందని చెప్పినపుడు కూడా మీనాక్షిని వెనకేసుకొస్తుంది గానీ, అమ్మలక్క ల్లాగా ”అలాగా. మీనాక్షి అలాంటిదా? నే ఎరగనే” అంటూ మాట్లాడదు.
”మీనాక్షి ప్రవర్తన బాగుంది కాదంటూ మీరే చెప్పాలి? మీ కంటపడ్డ ఏ ఆడదాని ప్రవర్తన తిన్నగా ఉంటుంది?” అంటూ రావప్పంతుల్ని సరసంగా చివాట్లు పెట్టి మీనాక్షిని దగ్గరకు తీసుకుంటుంది. లుబ్దావధాన్లు పెళ్ళి తప్పించే యత్నం, మీనాక్షిమీద సానుభూతి ఈ రెండూ నాటకం చివరిదాకా మధురవాణి నిలుపుకుంది. ఈ రంగంలో కూడా డబ్బు గురించి మధురవాణి మాట్లాడుతుంది. రావప్పంతుల్ని వదిలి మరో కొమ్మ పట్టుకోవాలని నిర్ణయించుకున్నా కూడా.
”నాకు డబ్బు గడ్డిపరక. మీ భూవుఁలు రుణాక్రాంతవైఁనాయని అప్పట్లో నాకు తెలిసుంటే మీ దగ్గర రెండొందలూ పుచ్చుకుందునా? మీరు ఖర్చు వెచ్చాలు తగ్గించుకుని సంసారం బాగు చేసుకోకపోతే నేను మాత్రం వొప్పేదాన్ని కాదు. ఫలానా పంతులుగారు ఫలానా సాన్నుంచుకుని బాగుపడ్డారంటేనే నాకు ప్రతిష్ట. మా ఇంటి సాంప్రదాయం యిది పంతులు గారు. అంతేగాని లోకంలో సాన్లమచ్చని వూహించ కండి.” అంటూ తాను అందరిలాంటి దాన్ని కాదని చెప్పింది. తన ఇంటి సాంప్రదా యాన్ని గర్వంగా చెప్పింది. తనకేది ప్రతిష్టో స్పష్టత ఉంది మధురవాణికి. ఆ ప్రతిష్టను చివరి దాకా నిలబెట్టుకుంది. అనేక సందర్భాలలో తనకు డబ్బు ప్రధానం కాదని తేల్చి చెప్పింది.
ఆ తర్వాత రంగంలో కరటక శాస్త్రి మధురవాణి దగ్గరకు వస్తాడు. వచ్చీరాగానే బొక్కబోర్లా పడి తలబొప్పి కట్టించుకుంటాడు. మధురవాణిని కొన్నాళ్ళు గిరీశం చేరదీశాడని ఆమె చెబితేనే విని కరటకశాస్త్రులు తన మేనల్లుడికి చదువు చెప్పే నిమిత్తం వచ్చిన గిరీశానికి పెందలాడే ఉద్వాసన చెప్పాలంటాడు.
మధురవాణి ”నా దగ్గరకు వచ్చినవాడల్లా చెడిపోయినాడో? నా దగ్గిరకు మీరు రాకుండా అవరోధం కలిగిందని యిప్పుడే డిప్పీ కలెక్టరుగార్ని తిట్టారే. ఆయనకంటే మీ న్యాయం యేం బాగా వుంది? నా దగ్గరకు వచ్చినందుకు మీ భార్యగారు ముందు మిమ్మల్ని పట్టుకుని తరమ వలసింది. తనకి రొట్టా ఒహడికి ముక్కానా?” అని కరటకశాస్త్రుల్ని కడిగేస్తుంది. చివరకు ఆడవేషంలో ఉన్న కరటక శాస్త్రులు శిష్యుడు మహేశంతో లుబ్దావధాన్లు పెళ్ళి జరిపించటానికి ప్లానంతా సిద్ధమయ్యాక, మధురవాణి సిద్ధాంతికి, మీనాక్షికి డబ్బాశ చూపిస్తే సహకరిస్తారని కరటకశాస్త్రులుతో చెబుతుంది. కరటకశాస్త్రి అత్యుత్సాహంతో మధురవాణికి కూడా డబ్బాశ చూపించ బోతాడు. మధురవాణి వెంటనే కరటక శాస్త్రుల ధోరణి ఆపి డబ్బు గురించి తన ఉద్దేశం చెబుతుంది.
”వృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట్ల ద్రవ్యాకర్షణ చేస్తానుగాని, మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్నా అని తలిచారా? మీ తోడబుట్టుకి ప్రమాదం వచ్చినపుడు నేను డబ్బుకి ఆశిస్తానా?” ప్రతిసారీ తనను తాను నిరూపించుకోవాల్సి రావటం మధురవాణికి బాధగానూ, విసుగ్గానూ ఉండే ఉంటుంది. కానీ సమాజం దున్నపోతైనప్పుడు అందునా కదలని ముసలి దున్నపోతైనపుడు మధురవాణి దానిని విసుగూ విరామం లేకుండా పదేపదే పొడుస్తూ ఉండవలసిందే. సమాజాన్ని పొడిచే పని మధురవాణి విసుగులేకుండా నాటకం చివరి వరకూ చేస్తూనే ఉంది. ఆ తర్వాత రావప్పంతులు దగ్గర ఈ కరటక శాస్త్రులు, ఆ పెళ్ళి కూతురూ తనకిష్టం లేనట్టు ఎంత బాగానో నటించి, దొంగ అలకలన్నీ ప్రదర్శించి రావప్పంతులు ముఖం మీద సిరాపోసి గాని శాంతించదు.

జీవితంలోని కపటత్వాన్ని కర్కశత్వాన్నీ ఎదుర్కోటానికి మధురవాణి లేదా గురజాడ హాస్యం కంటే మించిన సాధనం లేదను కున్నారు. రెండేదార్లు. గుండెలు పగిలేలా ఏడ్చి ఎదుట వాళ్ళను చంపటమో తను చావటమో చెయ్యాలి. లేదా ‘ఔరా ఈ మనుషులు’ అని వారి వెధవాయిత్వానికి నవ్వుకుంటూ, వాళ్ళ వెధవాయిత్వాన్ని వాళ్ళకే తెలియజెప్పి నవ్విస్తూ, కీలెరిగిన వాతలు పెడుతూ వారితో ఆడుకోవాలి. ఈ రెండు దార్లలో మధురవాణి రెండోదారి ఎంచుకున్నది. మనం గుండె పగిలేలా ఏడవాల్సిన సందర్భాల్లో కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. చచ్చి ఏం సాధిస్తావు. నవ్వుతూ బతికి చాతుర్యంతో చెయ్యదలిచింది సాధించుకోమని చెప్పింది. తిట్టవలసిన వాళ్ళను వాళ్ళ ముఖంమీదే తిట్టింది. పైగా వాళ్ళ నీతులు వాళ్ళకే చెప్పి ”వూరందరితో హాస్యవాడితే మీరు ఒప్పరు గాబట్టి అంచేతనే కుక్కన్నా, పందన్నా మిమ్మల్నే అనాలిగాని మరొకర్ని అనగూడదే” అంటూ రావప్పంతుల్ని తిట్టడం సరైందని అతని చేతనే ఒప్పిస్తుంది. ఇక ఆ రంగంలో గిరీశం ఉత్తరంతో రావప్పంతుల్ని మధురవాణి ఆడుకున్న తీరు పరమాద్భుతం. మధురవాణి నవ్వు…. ఇంకే రచయితైనా ఏ సాహిత్య ప్రక్రియలోనైనా యింత సహజంగా తన కథానాయిక చేత నవ్వించాడా? ఆమె నవ్వు మనకు అంటుకుని మనకు కడుపునొప్పి వచ్చేలా చేయగలిగాడా? మధురవాణి ఒక్కతే ఇంత తెలుగు సాహిత్యంలో పిసరంత క్రుత్రిమత్వం లేకుండా నవ్వింది – నవ్వించింది. హాస్యరసం ఈ రంగంలో పండినట్టు మరింకోచోట పండిన దాఖలా లేదు. అచ్చమైన అచ్చతెలుగు హాస్యం. లొటిపిట, గాడిదల పేరుతో రావప్పంతుల్ని గిరీశం ప్లెయిన్‌గా తిడితే – దానితో మధురవాణి చేసిన హాస్యం ఎంత మధురమో కదా – గాడిద ప్రస్తావన మళ్ళీ మళ్ళీ తెచ్చి నవ్విస్తుంది. విరగబడి నవ్వుతుంది. బాగా నవ్వితే ఆరోగ్యమంటారు గదా – పొద్దున్నే పార్కొల్లోకి వెళ్ళి నవ్వుతుంటారు గదా – అదేమీ అక్కర్లేదు. కన్యాశుల్కం నాటకం పక్కనుంచుకొని చతుర్థాంకం తీసి చదివితే చాలు శారీరక, మానసిక ఆరోగ్యాలన్నీ చక్కబడతాయి. మధురవాణి మంచి వైద్యురాలు. తియ్యని మందులిచ్చి రోగాలు కుదిర్చే సొగసైన వైద్యురాలు.
పంచమాంకంలో మధురవాణి రెండు రంగాల్లో ఉంటుంది. ఒక రంగంలో పేకాట ఆడుతూ పెద్దగా మాట్లాడదు. మహేశం పెళ్ళికూతురి పాత్ర చాలించి కంటె మధురవాణికిస్తే, మహేశానికి దాసరి వేషం వేసి పంపుతుంది. ఈ లోపల ఆ కంటె కోసం రావప్పంతులు లుబ్దావధాన్ల నడిగి, మీనాక్షిని పెళ్ళడతానని ఆశపెట్టి మరీ కంటె ఆచూకీ కోసం ఆరాలు తీస్తాడు. ప్రయోజనం లేక యిక మధురవాణినే బతిమాలు కుందామని బయల్దేరి వస్తాడు. మీనాక్షి పెళ్ళి చేసుకోమని వెంటబడుతుంది. మధురవాణి రావప్పంతులు అరిచి గీపెట్టినా తలుపు తియ్యదు. మీనాక్షి గొంతువిని, రావప్పంతులు మీనాక్షిని కిందపడెయ్యటం చూసి మధురవాణి అతన్ని చివాట్లు పెడుతుంది.
”ఆడదాని మీద నా చెయి జేసు కుంటారు? యేమి పౌరుషం? అబద్దవాఁడక అన్నమాట నిలబెట్టుకోండి. యేం? కులం తక్కువా? రూపం తక్కువా? ఆమె బ్రతుకు భ్రష్టు చెయ్యనే చేశారు పెళ్ళాడి తప్పుదిద్దుకోండి. ఆవిణ్ణి పెళ్ళాడి వొస్తేనే నేను తలుపు తీస్తాను”.
ఇలా మనిషిని సత్యం కోసం నిలదియ్య గల పాత్ర కన్యాశుల్కంలో మరింకొకటి లేదు మధురవాణి తప్ప.
మీనాక్షి రావప్పంతులు అన్న మాటలు చెబితే ఆమెను సమర్థిస్తూ ”అవస్యం పెళ్ళాడవలసిందే. పెళ్ళాడకపోతే నువ్వు మాత్రం వూరుకొంటావూ? దావా తెస్తావు – పంతులు గారికి దావాలంటే సరదానే” అని మార్గోపదేశం చేస్తుంది. మంగళహారతి తెస్తానని లోపలికి వెళ్తుంది.
ఇక షష్టాంకంలో లుబ్దావధాన్లను రక్షించటానికి మధురవాణి పూనుకోవాల్సిన ఘట్టం. కరటక శాస్త్రి వచ్చి ఆ పని చెయ్యమని అడుగుతాడు. దానికి మధురవాణి దగ్గరకు చేరిన కంటె ఇవ్వమని అడుగుతాడు. ఆ కంటె సౌజన్యారావు పంతులుగారికి ఇస్తే చిక్కుముడి వీడుతుందని చెబుతాడు. కంటె తిరిగి తనకు వస్తుందా అని మధురవాణి అనుమానపడటం సహజమే. దానికి కరటక శాస్త్రులు, సౌజన్యారావు పంతులు మంచితనాన్ని గురించి, అతని సహజ స్వభావమైన పరోపకారాన్ని గురించి చెబుతాడు. మధురవాణికి ఆయనను చూడాలని అనిపిస్తుంది. ఆయన వేశ్యలను చూడరంటాడు కరటకశాస్త్రులు. మధురవాణి కంటె ఇవ్వటానికి సిద్ధపడి తెచ్చి యిస్తూ ”వస్తువు జారిపోతేనో” అన్న మాట మీద జరిగే సంభాషణలో కరటక శాస్త్రులు అంటాడు.
”ఎంతసేపూ డబ్బు, డబ్బేనా? స్నేహం వలపూ అనేవి ఉంటాయా?” అని. ఎన్నిసార్లు మధురవాణి స్నేహధర్మంగా సహాయం చేసినా కరటక శాస్త్రికి బుద్ధిరాదు – ఐనా ఓపికగా తన పరిస్థితి వివరిస్తుంది మధురవాణి.
”స్నేహం మీలాటి వారి చోట అందు చేతనే కష్టపడి ఆర్జించిన కంటె మీపాలు చేస్తున్నాను. మా తల్లి చూస్తే భవిష్యం ఉంచునా? యిక వలపో? బతుకనేది వుంటే వలపు వన్నె తెస్తుంది. అంగడివాడికి మిఠాయి మీద ఆశా, సానిదానికి వలపూ మనసులోనే మణగాలి కొద్దికాలం వుండే యవ్వనాన్ని జీవనాధారంగా చేసుకున్న మా కులానికి వలపు ఒక్కచోటే…”
”బంగారం మీద. శృంగారం వన్నె చెడిన దగ్గిరనుంచి, బంగారం గదా తేటు తేవాలి. ఆ బంగారం మీకు ధారపోస్తూ ఉన్నపుడు నా స్నేహం ఎన్ననేల?” అని సహనంతో, సామరస్యంతో, స్పష్టతతో కరటకశాస్త్రికి బోధించినట్లు చెబుతుంది. ఐనా కరటక శాస్త్రికి బుద్ధిరాలేదు. మధురవాణి మళ్ళీ సౌజన్యారావు పంతులుని చూడాలని వుందంటే ఆ సహాయం మటుకు చెయ్యలేనంటాడు.
మధురవాణిని తీసికెళ్తే ”నిన్నూ నన్నూ యింట్లోంచి కఱ్ఱపుచ్చుకుంటాడు” అంటాడు.
మధురవాణికి యింక సహనం పోతుంది. తన సహేతుకమైన కోపం, ప్రశ్నించే తత్వం బైటికి వస్తాయి. తన సహాయం తీసుకుంటూ తనను నీచంగా చూసే వారిని సహించని ఆత్మగౌరవం ఆమెలోంచి పెల్లుబికి వస్తుంది. కరటక శాస్త్రికి వడ్డించాల్సినవి వడ్డిస్తుంది. ద్వంద్వనీతిని ప్రశ్నిస్తుంది.
”కొత్త సంగతి వొకటి యీనాటికి నాకు తెలిసింది. సృష్టికల్లా వన్నెతెచ్చిన మధురవాణి అనే వేశ్యాశిఖామణి గిరీశంగారి వంటి కుక్కల పొత్తుకే తగివున్నది గాని, సౌజన్యారావు పంతులు గారి వంటి సత్పురుషులను చూడడముకైనా అర్హత కలిగి వుండలేదు. …. తమలాంటి పండితోత్తములు మాత్రం కార్యావసరత కలిగినప్పుడు వూరూ వాడా వెతికి, మధురవాణి దగ్గర లాచారీ పడవచ్చును.”.
ఇంత కడిగినా కరటక శాస్త్రి మనసులో మాలిన్యం పోదు. మధురవాణిని వేశ్యగా తప్ప మనిషిగా చూడని అమానుషత్వం వదలదు. డిప్టీ కలెక్టర్‌ మధురవాణి అంటే మనసు పడుతున్నాడు గాబట్టి అతన్ని వలలో వేసుకుని ఈ కేసు నుంచి తప్పించ మంటాడు. మధురవాణి దానికి ఒప్పుకోదు. ”యిటుపైని వూరకుక్కలనూ, సీమ కుక్క లనూ దూరంగా ఉంచటానికి ఆలోచిస్తు న్నాను” అంటుంది.
ఐనా కరటకశాస్త్రి తన ప్రాణం కాపాడు కోటానికి మధురవాణిని ఎంత అవమానించ టానికైనా సిద్ధంగా ఉన్నాడు. డిప్టీ కలెక్టరు దగ్గరకు తన పని కోసం పోననేసరికి, డిప్టీ కలెక్టరు ”హెడ్డు కనిస్టీబు పాటి చేశాడు కాదా?” అని వంకర మాట మాట్లాడతాడు. మధురవాణి మండిపోతుంది.
”పట్నం వొదిలి పల్లెటూరు రాగానే మీ దృష్టిలో పలచనైతినేమో? హెడ్డును నౌఖరులా తిప్పుకున్నాను గాని అధికం లేదే? ఆ నాలుగు రోజులూ సర్కారు కొలువు మాని అతడు నా కొలువు చేశాడు. అతడి సాయం లేకపోతే, మీరు ఆ వూరి పొలిమేర దాటుదురా? యీ దాసరి దాటునా? లోకం అంతా యేమి స్వప్రయోజనపరులూ” అని లోకానికీ తనకూ ఉన్న తేడాను చెప్పకుండానే చెబుతుంది. ఇంత చెప్పినా ఎలాగైనా డిప్టీ కలెక్టరుని చూడమనే మాట మానడు కరటకశాస్త్రి. ”సౌజన్యారావు పంతులు ఈ మాట వింటే సంతోషిస్తారు కాబోలన్నా” అతను పట్టించుకోడు. కంటె యిచ్చేసి ఒక్కసారి డిప్టీ కలక్టర్ని చూడమనే పాటే పాడుతాడు. భరించలేని మధురవాణి అతన్నిక వెళ్ళమని అంటుంది.
ఇక విజయం చెయ్య”మంటూ వెళ్ళిపొమ్మని చేతితో సంజ్ఞ చేస్తుంది. వీలిశి ళితిశి అన్నదన్నమాట.
వేశ్యల లైంగికత్వాన్ని, భార్యల లైంగికత్వాన్ని కంట్రోలు చేసినట్లు చెయ్యలేరు గాబట్టి కరటక శాస్త్రికి వెళ్లక తప్పదు. ‘వీలిశిళితిశి’ అన్న తర్వాత ఊరుకోవచ్చగదా – వెళ్ళనివ్వవచ్చుగదా. మధురవాణిలోని మానవత్వం అలా చెయ్యనివ్వదు. వెళ్ళే మనిషిని వెనక్కు పిలిచి చెప్పవలసినవి చెబుతుంది. కరటకశాస్త్రుల శిష్యుడిని గురించి జాగ్రత్తలు చెప్పి కరటక శాస్త్రులకు పెట్టవలసిన వాటిలో మిగిలినవి వుంటే అవి కూడా తినిపించిగాని పంపించదు. అంతకుముందే కరటకశాస్త్రుల్ని పందికొక్కు అననే అన్నది. ఇప్పుడిక ”బ్రాహ్మలలో ఉపదేశం లావు, ఆచరణ తక్కువా?” ”బ్రాహ్మలు కాగానే, దేవుడి కంట్లో బుగ్గిపొయ్యలేరు అనుకుంటాను” ”చిత్ర గుప్తుడికి లంచం ఇవ్వగలరా? అతడి దగ్గరికి మధురవాణిని పంపి, చేసిన పాపాలు అన్నీ తుడుపు పెట్టించడానికి వీలువుండదు కాబోలు’ అనేసరికి యిక మళ్ళీ వీలిశి ళితిశి అని చెప్పకుండానే కరటక శాస్త్రులు వెళ్ళొస్తానని చెప్తాడు.
మధురవాణి మళ్ళీ విరగబడి నవ్వు తుంది. ఈ పిచ్చిబ్రాహ్మల అల్పత్వాన్ని చూసి అసహ్యించుకోకుండా నవ్వగలిగిన ధీరత్వం మధురవాణికి ఎక్కడినుంచి వచ్చింది అని మనం ఆశ్చర్యపోతాం.
కరటకశాస్త్రి ”తలవాయగొట్టింది” అనుకుంటూ వెళ్ళిపోతాడు.
అందరి సంగతులూ చూసిన మధుర వాణికి యిక సౌజన్యారావు పంతులే మిగిలాడు. సాహసానికి, బుద్ధిచాతుర్యానికి తక్కువలేదు. ఇంక ఆగటందేనికి? సరాసరి సౌజన్యారావు పంతులు ఇంటికి మారు వేషంలో వెళ్ళిన మనిషి ఆయన్ని సూటిగా రంగంలోకి దింపింది. ఆయన యాంటీనాచ్‌ అని స్వయంగా ఆయన చేత చెప్పించాక ”వేశ్యలను పాటకు పిలవకపోతే వాళ్ళు బతకడం యెలాగండి” అని అడిగింది. ఎంతమందో ఆ కులపు స్త్రీలు వీరేశలింగం గారినీ వెంకటరత్నం నాయుడుగారినీ అడగాలనుకున్న ప్రశ్నని మధురవాణి అడిగేసింది. బెంగుళూరు నాగరత్నమ్మ, జెట్టి తాయమ్మల వంటి దేవదాసీలు తరవాత కాలంలో రాజకీయ చర్చగా మొదలుపెట్టిన ప్రశ్నను మధురవాణి ముందుగానే అడిగింది. సౌజన్యారావు పంతులు ”పెళ్ళి చేసుకుంటే సరి” అన్నాడుగానీ గిరీశం గారి లాంటి వారిని పెళ్ళాడాలా అని మధురవాణి అడిగితే ”రేపో నేడో ఆయన్ను ఒక పవిత్రమైన వితంతువును పెళ్ళికానై యున్నారు గదా, వేశ్యను పెళ్ళాడతారా” అని మందలించ బోయాడు. పైగా ”గిరీశంగారులాంటి గొప్పవారు అట్టి అపవిత్రమైన పనికి ఇయ్య కొనరు” అని కూడా అని తనంత తాను చిక్కుముడిలో యిరుక్కున్నాడు. ఎవరినైనా ఇరుకున పెట్టి నవ్వుకోందే మధురవాణి ఊరుకుంటుందా?
గొప్పవాళ్ళు వేశ్యలను ఛీ అని తిరస్కరిస్తే పెళ్ళి చేసుకోవాలనుకున్న వేశ్యలకు కోరదగిన వరులు దొరకటం ఎలా? ఎవరైనా సరే అని ఏ పనికి మాలినవాడినైనా చేసుకోవాల్సిందేనా?
వీరేశలింగం గారు చేయించిన వితంతు వివాహాలకే ఈ ఛాయిస్‌ లేదు. దానిమీద గురజాడ చలంలు తర్వాతి కాలంలో విమర్శ పెట్టారు. అంతగొప్ప కార్యానికి పూనుకున్న మహానుభావుడి మీద విమర్శ – తప్పదు. విమర్శ లేనిదే ముందుకి పోలేం. వీరేశలింగంగారి మీద ఎంత గౌరవమున్నా గురజాడ విమర్శను తీసుకోలేకపోతే వితంతువులకీ, వేశ్యలకూ మరో రొంపి తప్ప చక్కని బాట దొరకదు.
సౌజన్యారావు పంతులు తన అశక్తతను ఒప్పుకోక తప్పలేదు. ”యీ సంగతి యింకా నేను బాగా ఆలోచించలేదు – వేశ్యలు విద్యలు నేర్చి, యితర వృత్తుల వల్ల సత్కాలక్షేపము చెయ్యరాదా?” అని తప్పించుకో బొయ్యాడు. మధురవాణి అలా తప్పించుకోనిస్తుందా? ”అలా చేస్తే తమవంటివారు వాళ్ళని వివాహమవు దురా?” అని సూటిగా అడిగేసింది. డొంకతిరుగుళ్ళు దొంగదారులు సంసారు లకు గానీ మధురవాణి వంటివారికి తెలియవు. ఇంకా సూటిగా ”వేశ్యజాతి చెడ్డ కావచ్చును, గాని తాము సెలవిచ్చినట్లు చెడ్డలో మంచి వుండకూడదా? మంచి ఎక్కడవున్నా గ్రాహ్యం కాదా?” అని అడిగితే ఏం చెబుతాడు పాపం సౌజన్యారావు పంతులు? మంచి ఎ్కడున్నా గ్రాహ్యమే నని మాటమార్చి ఆమె వచ్చిన పనేమిటని అడిగాడు.
మధురవాణి లుబ్దావధాన్లు కేసులో సహాయం చెయ్యగలిగిన వ్యక్తి ఒక వేశ్య అనీ, సహాయానికి ప్రతిఫలంగా పంతులుగారినే కోరుతోందని చెప్పింది. సౌజన్యారావు పంతులు పాపం చిక్కులో పడ్డాడు. ”మన్మధుడిననా నన్ను వలచింది” – అంటే మధురవాణి ”మీరు మంచివాళ్ళని” కావచ్చు అంటుంది.
సౌజన్యారావు పంతులు ఈ లోకమంత రూఢీగా చెప్తాడు ”సానిదానికి మంచితో పని వుండదు” అని. నలుపు తెలుపు మాత్రమే చూడగలిగిన సంస్కర్తల మాటే ఆయన నోట వచ్చింది.
తర్వాత ఆయనతో కాసేపు మాటలాట లాడి మధురవాణి తన నిజస్వరూపం చూపిస్తుంది. ఆయన కోపానికి భయపడక ”చెడ్డలో కూడ మంచి ఉండొచ్చు – కాక మంచి చెడ్డలు ఎంచెవారెవరు?” అని ఎంతో విలువైన మాట మాట్లాడుతుంది.
రాత్రివేళ వేశ్య తన యింట్లో, అందునా పడకటింట్లో వుందనే గాభరా తప్ప సౌజన్యారావుపంతులుకు ఈ విలువైన మాటలు మనసుకెక్కలేదు. చివరికి తెరిపినపడి లుబ్దావధాన్లకు సహాయపడ మంటే, కనీసం ముద్దన్నా లేనిదే తనవల్ల పని జరగదంటుంది. వెయ్యి రూపాయలిస్తా నన్నా కాదని ముద్దు కావాలనే మధురవాణి సౌజన్యారావు పంతులుకి అర్థమే కాదు. బహుచిత్రంగా తోస్తుంది. చేసేదిలేక ఒప్పు కుంటాడు.
మధురవాణి రహస్యం మూట విప్పు తుంది. మహేశమే లుబ్దావధాన్లు పెళ్ళాడిన పిల్ల అనీ, కరటక శాస్త్రులే గుంటూరు శాస్త్రులనీ – రహస్యం విప్పి పబ్లిగ్గా ఫీజడుగుతుంది.
అప్పటికి సౌజన్యారావు పంతులు కొంచెం మనిషవుతాడు. సంస్కర్తననే అహంభావం – తనకు తెలియకుండానే తనలో వచ్చికూచున్న అహంభావం – మధురవాణి మానవత్వం ముందు తలవంచుతుంది.

”నీవు సొగసరివి. ముద్దు చేదని కాదు. వ్రతభంగం కదా అని దిగులు” అని సాదాసీదా మనిషిలా మాట్లాడతాడు. ముద్దుపెట్టుకోటానికి ముందుకి వంగి సిద్ధమవుతాడు. అప్పటికే ”నువ్వు ఏ తగవెలా తీర్చమంటే అలాగే చేస్తానని భయంగా ఉందని” మధురవాణిలోని సామర్ధ్యాన్ని గుర్తించక తప్పలేదాయనకు.
కానీ మధురవాణి ఆత్మగౌరవం ముందు అందరూ తలవంచాల్సిందే. ముద్దు వద్దని తిరస్కరించే ఛాయిస్‌ తాను తీసుకుని సౌజన్యారావుపంతులు మీద విజయం సాధించింది. అది మన మామూలు దృష్టికి కనిపించే విషయం. మధురవాణి కాక మరొకరైతే ముద్దు పెట్టుకోనిచ్చే వారేమో. మధురవాణి గుండె మరింత గట్టిది. లోతైనది. తనంటే యిష్టమో, ప్రేమో, గౌరవమో లేకుండా, తన కులవృత్తిని అసహ్యించుకునే సౌజన్యారావు పంతులిని ముద్దుపెట్టుకోవటం తనకు మాత్రం ఏం గౌరవం ? తన తెలివైన మాటలకూ, తను చేసే సహాయానికీ లొంగాడు గాని సౌజన్యారావు పంతులు తన వృత్తిని గౌరవించడని తెలియనంత అమా యకురాలు కాదు మధురవాణి. అందువల్ల ఆ ముద్దుకు సౌజన్యారావు పంతులు అంగీకరించటమే తన గెలుపుకు గుర్తుగా తలచి తన ఆత్మగౌరవాన్ని కాపాడు కుంది. ఐతే తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇతరులను అవమానించే అహంకారి కాదు మధురవాణి. గిరీశాన్ని, రావప్పంతుల్నీ కూడా మన్నించిన ఆమె సౌజన్యారావు పంతులు పట్ల తన తిరస్కారాన్ని మోటుగా ప్రదర్శించి ఆయనను అవమానించదు. ”చెడని వారిని చెడగొట్టవద్దంది నా తల్లి” అని చెప్పి మంచి తన దగ్గరే ఉంచుకుని సౌజన్యారావు పంతులు విశ్వసించే పవిత్రతను ఆయనకే మిగిల్చింది. సౌజన్యారావు దృష్టిలో ఆయనకు మహోపకారం చేసింది. ఆ సన్నివేశం చదువుతుంటే ఆమె ఔన్నత్యాన్ని చూసి ఆనందంతో, ఆమె ఆత్మగౌరవానికి అబ్బు రంతో కళ్ళవెంట నీళ్ళొస్తాయి. మధురవాణి పాదాలకు యావత్తు మానవజాతీ సమస్కరించాల్సిన క్షణాలవి. ఆమె మీద ప్రేమతో హృదయం పులకిస్తుంది. అంత గొప్పగా మధురవాణి పాత్రను తీర్చిదిద్దిన గురజాడపట్ల మన మనసుల్లో గొప్ప గౌరవం కలుగుతుంది.
ఇంత గొప్పగా మధురవాణి పాత్రని గురజాడ ఎలా రూపుదిద్దారు – మన తెలుగు సాహిత్యానికి యింత మహాదృష్టం కల్పించాలని ఆయనకెలా తోచింది – ఆయనకు తప్ప ఎవరికి తోస్తుంది. ఆయన ప్రేమ దృష్టి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే – గురజాడ తన పాత్రచిత్రణా పద్ధతి గురించి ఒకచోట ఇలా అంటారు.
”చిన్నతనంలో బొమ్మలాట నేర్చి ఉండుటచేత లోకమనే రంగంలో చిత్రకోటి రీతులను ఆటాడే మనుష్యలనే పాత్రముల సొగసును కనిపెట్టడము నాకు అలవాటైనది. సొగసు లేని మనిషే ఉండడు. స్నేహము, ప్రేమా అనేవి అనాది అయిన్నీ, ఎప్పటికీ సరికొత్తగా ఉండే రెండు వెలుగులను నరుని మీద తిప్పి కాంచితే వింత వింత సొగసులు బయలుదేరుతవి. అసూయ అనే అంధకారంలో అంతా ఏకనలుపే.”
ఏక నలుపుని తీసి స్నేహం, ప్రేమలనే రజత సువర్ణకాంతులకు మాటలాడటం నేర్పిరి. మధురవాణిని మన తెలుగువారికి మంచి చెడ్డలు తెలియజెప్పేందుకు సృష్టించారు గురజాడ.
నాటకం చివరిలో సౌజన్యారావు పంతులు మధురవాణికి భగవద్గీతను యిస్తాడు. శ్రీకృష్ణుడనే స్నేహితుడు గీతలో దొరుకుతాడని చెబుతాడు. మధురవాణి కొంటెతనంగా ”శ్రీ కృష్ణుడు యాంటినాచ్‌” కాదాండి అని అడుగుతుంది. చెడ్డలో ఉన్న మంచిని నేనని మధురవాణి చెప్పే మాటలు అర్థమయ్యాయో లేదో గాని మళ్ళీ ”చెడ్డవారిని మంచివారిగా చేసే పుస్తకం” అంటాడు. మధురవాణి ఆ పుస్తకం తీసుకుంటుంది. సౌజన్యారావు పంతులుకు ఆమెను మరింత సంస్కరించాలనిపించింది.
సంస్కరింపబడవలసిందెవరో ఆయన మాటలు చదివితే మనకు సందేహం కలుగుతుంది. మధురవాణిని అంతసేపు చూసి, ”చెడనివారిని చెడగొట్ట వద్దని మా అమ్మ చెప్పింది” అనే మాటలు విని కూడా, ఆమె తల్లి వల్లనే తనకు వ్రతభంగం కాలేదని, బ్రతికిపోయానని తెలిసి కూడా ఈ మాట మాట్లాడతాడు. ”నువ్వు మంచిదానివి. యెవరో కాలు జారిన సత్పురుషుడి పిల్లవై వుంటావు. ఈ వృత్తి మానలేవో? స్థితి లోపమా?” కాలుజారినవాడు సత్పురుషుడు. సత్పురుషులు రూపొందించిన వ్యవస్థలో తన కులవృత్తి తను చేసుకునే మధురవాణి మంచితనం ఆ సత్పురుషుడి వల్ల రావలసిందే గాని కన్నతల్లి వల్ల గానీ, వాళ్ళ విద్య, లోకజ్ఞానం, స్వభావం వీటి పరిణామాల వల్ల గానీ రాదన్నమాట. సౌజన్యారావు పంతులు వంటి సంస్కర్తల మనస్సుల్లో ఈ భావం ఉన్నంతకాలం వెలుగు మీద చీకటి నీడ పడుతూనే ఉంటుంది. వెలుగును కప్పే చీకట్ల పట్ల ఎంతటివారైనా జాగరూకత వహించకపోతే ఒక మామూలు గాడిలో పడి ఏక నలుపుకు దగ్గరయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని గురించిన హెచ్చరిక సౌజన్యారావు పంతులు మాటల నుంచి మనం అర్థం చేసుకోకపోతే తర్వాతి కాలంలో గురజాడ రాసిన కవిత్వం ”మంచియన్నది మాల అయితే మాల నేనవుదును” అర్థం చేసుకోవటం కష్టం. కన్యాశుల్కం నాటకం (రచనలో) మానవ స్వభావాలను లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఆ రచన వల్ల మరింత మానవీయంగా మారి ఆ తర్వాత కవిత్వ రచనలోకి మళ్ళారు గురజాడ.
మధురవాణి తన జన్మ కారకుడైన అనామక సత్పురుషుడి గురించి సౌజన్యారావు పంతులుతో వాదన పెట్టుకోలేదు. ఆమె ఎంత మంచి మనిషి అంటే తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే తనకు ఈ సమాజంయిచ్చిన వృత్తి అంత సజావైనది కాదనే విషయం కూడా సంకోచం లేకుండా చెబుతుంది.
”నా వృత్తి యొక్క హైన్యత గుర్తెరుగు దును. సత్ఫురుషుల దయ సంప్రాప్తమైన తరువాత దుర్వృత్తి యేల వుంటుంది” అని తన భవిష్యత్‌ గురించిన ఆలోచనను సూచనప్రాయంగా తెలియజేస్తుంది.
మధురవాణి తర్వాత ఏం చేస్తుందో మనకు తెలియదు గానీ ఏం చెయ్యాలనే కోరిక ఆమె మనసులో ఉందో ఆమె స్పష్టంగా చెప్పింది.
ఆమె ఒక పతివ్రత కావాలనుకోలేదు. మాతృమూర్తి కావాలనుకోలేదు. శ్రమ పడకుండా – ఇంటి చాకిరి కాని శ్రమ చేయకుండా బతకాలని అనుకోలేదు. శ్రమ చేసి జీవించటం వల్లనే భద్రత దొరుకుతుందని భావించింది.
షష్ఠాంకంలో కరటకశాస్త్రి మధురవాణి తల్లిని, ఆమె పెంపకాన్ని వాటివల్ల వృద్ధి అయిన మధురవాణి విద్యా సౌందర్యాలను ప్రశంసించినపుడు మధురవాణి తన మనసు విప్పిచెప్పింది.
”కాపు మనిషినై పుట్టి, మొగుడి పొలంలో వంగమొక్కలకూ, మిరప మొక్కలకు దోహదం చేస్తే, యావజ్జీవం కాపాడే తనవాళ్లన్న వారు వుందురేమో” అంటుంది.
కేవలం ఇంటికి, ఇంటి చాకిరికీ పరిమితమవటం వల్ల స్త్రీలకు సరైన భద్రత దొరకటం లేదని ఆమెకు తన చుట్టూ వున్న స్త్రీలనూ, వారి నిస్సహాయ స్థితిని చూస్తే అర్థమై ఉండాలి. అందుకే పొలం పని చేయాలని ఆమెకు కోరిక కలిగింది. సౌందర్యాన్ని ఆధారం చేసుకుని బతికే మధురవాణి శ్రమ జీవనంలోకి సౌందర్యాన్ని, భద్రతనూ కూడా గుర్తించింది. అందుకే ఆమె చూపు తీక్షణమైనది లోతైనది అనిపిస్తుంది. అది తర్వాత జన్మ సంగతి. ఈ జన్మలో ఆమె ఎన్నో మంచి పనులు చేస్తుందనే గట్టి నమ్మకం ‘కన్యాశుల్కం’ నాటకం మనకు కల్పిస్తుంది. బెంగుళూరు నాగరత్నమ్మ, ముత్తులక్ష్మీరెడ్డి వంటివారు మధురవాణికి భిన్నరీతులలో వారసులుగా నిలిచారు.
మధురవాణి భగవద్గీతను హృదయానికి ఆనించుకుని సౌజన్యారావు పంతులుకు నమస్కరించి శలవు తీసుకుంటుంది. సౌజన్యారావుపంతులు మధురవాణికి భగవద్గీత ఇవ్వటంలోని ఆలోచన ఏమైవుంటుంది? కేవలం ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగించ టానికేనా? దానికి యింకే పుస్తకమైనా యివ్వొచ్చు కదా. ఆధ్యాత్మ రామాయణం యివ్వొచ్చు. సావిత్రీ సత్యవంతుల కథ యివ్వొచ్చు. యుద్ధ వాతావరణంలో మానవజాతి ధర్మాన్ని గురించి ప్రవచించిన పుస్తకాన్ని మధురవాణికి సౌజన్యారావు పంతులు – లేదా ఆయన ద్వారా గురజాడ ఎందుకిచ్చాడు. భగవద్గీత అనేక సందర్భాలలో అనేక సంకేతాలను, సందేశాలనూ ఇస్తుంది. గురజాడ మధురవాణికి ఏ సందేశాన్ని ఇవ్వాలని ఉద్దేశించి ఉంటాడు?
యుద్ధరంగంలో, ఎదుట మోహరించి ఉన్న బలగాలను చూసి అర్జునుడు అక్కడున్న వారంతా తన తండ్రులు, తాతలు, అన్నలు, తమ్ములు, గురువులు, బంధువులు, వారిపై యుద్ధం చేసి సాధించేదేమిటని ధనుర్బాణాలు కిందపడవేసిన సందర్భంలో కృష్ణుడు గీతోపదేశం చేస్తాడు. దానికెన్ని వ్యాఖ్యానా లుండనీ, లోతులుండనీ సందర్భం అది. సూటియైన సందేశం – అధర్మం చేస్తున్నది స్వజనమైనా అధర్మనిధనం చేయటం మానవ కర్తవ్యమనేదే. అర్జునుడ్ని కార్యాచరణలోకి దింపటమే శ్రీ కృష్ణుని ముఖ్యోద్దేశం. మధురవాణిని అలాంటి కార్యాచరణ చేయమని పరోక్షంగా చెబుతున్నాడా? – ఆమె అప్పటికి సుబ్బ పెళ్ళిని ఆపి, మీనాక్షిని ఆదుకుని, లుబ్దావధాన్లను రక్షించి రకరకాల కార్యాచరణలు చేస్తున్నది.
అలాంటి పనులు రాబోయే కాలంలో స్త్రీలందరూ చేస్తే తప్ప గురజాడ చెప్పిన మాట ”ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖించట”మనే పని జరగదు. ఐతే స్త్రీలు కార్యాచరణలోకి దిగితే ముందుగా యుద్ధం చేయవలసింది తమ వారితోనే – తమ తండ్రులు, తల్లులు, అన్నలు, తమ్ములు, భర్తలు వీరివల్ల అణచివేత జరుగు తున్నప్పుడు, తమ పట్ల వారు అధర్మంగా, అన్యాయంగా ప్రవర్తిస్తున్నప్పుడు స్త్రీలు వాళ్ళతో ఏదో ఒక స్థాయిలో యుద్ధం చేయక తప్పదు. తమ వాళ్ళమీద ఆ యుద్ధం చేయలేక తాము హతమైపోయే స్త్రీలున్నప్పుడు వారికి భగవద్గీత కంటే మంచి నేస్తం, ధైర్యాన్నిచ్చి వెన్నుతట్టే నేస్తం ఎక్కడ దొరుకుతుంది?
గురజాడ మధురవాణి ద్వారా స్త్రీలోకానికి భగవద్గీతలోని ఈ సందేశాన్ని యిచ్చాడని అనుకుంటే ఆయన క్రాంత దర్శిత్వం, మార్గదర్శకత్వం ఎంత అమూల్యమైనవో అనిపిస్తుంది. ”అడుగుజాడ గురజాడది – అది భావికి బాట – మనలో వెధవాయిత్వం – మరిపించే పాట” అన్న శ్రీశ్రీ మాటలు మరింత బాగా అర్థమవుతాయి.
గురజాడ ఎంతో స్నేహంతో ప్రేమతో కన్యాశుల్కంలో మధురవాణి పాత్రను మలిచారు. మధురవాణే కాదు కన్యాశుల్కంలో మిగిలిన స్త్రీ పాత్రలు కూడా మంచివే. అబలలు, అమాయకులేమో గాని వాళ్ళ చెడ్డవాళ్ళుకాదు. స్త్రీ పాత్రలన్నీ పిత్రుస్వామ్య సమాజపు అణచివేతకు గురైనవే. పురుషాహంకారం కింద నలిగిపోతున్నవే. వారంతా ఆ వ్యవస్థపై తమ అసంతృప్తినీ, ఛీత్కారాన్నీ, ధిక్కారాన్నీ ఏదో ఒక స్థాయిలో వినిపించినవారే. కన్యాశుల్కం పేరిట ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలని తపించిన స్త్రీలు వాళ్ళు. అగ్నిహోత్రావధాన్లు భార్య వెంకమ్మ తన రెండో కూతురు సుబ్బి పెళ్ళి ఆపాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. పెద్ద కూతురు బుచ్చెమ్మకు జరిగిన అన్యాయం సుబ్బికి జరగకూడదని ఆరాటపడుతుంది. ఈ విషయంలో సహాయపడకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటానని అన్న కరటకశాస్త్రిని ప్రాధేయపడుతుంది. ఊరికే మాట అనటమే కాదు ఆ పెళ్ళి జరగటానికి వీల్లేదని భర్తతో పోట్లాడి నిజంగానే నూతిలో దూకింది. తన ప్రాణత్యాగంతోనైనా కూతురు పెళ్ళి తప్పితే అంతే చాలంది. ఎవరికీ ఎదురు చెప్పని బుచ్చెమ్మ కూడా చెల్లి పెళ్ళిని వ్యతిరేకించి తండ్రితో చివాట్లు తిన్నది. చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో తను గిరీశంతో లేచిపోతేనన్నా తన చెల్లి పెళ్ళి తప్పిపోతుందని ఆలోచించి ఆ సాహసం చేసింది. మీనాక్షి కూడా శిష్యుడి రహస్యాన్ని బైటపడనీయకుండా దాచింది. ఈ సమాజం మీద బదులు తీర్చుకోటానికి ఒక అవకాశం దొరికితే స్త్రీలందరూ ఏకమవుతారనిపిస్తుంది ‘కన్యాశుల్కం’ చదివితే.
వాళ్ళు మామూలు స్త్రీలే కావచ్చు. బలహీనతలతో, అవలక్షణాలతో ఉన్నవాళ్ళే కావొచ్చు. కానీ తమ బతుకుల్ని బాగు చేసుకోవాలని ఆరాటపడే అమాయకులు వాళ్ళు. మొత్తానికి కన్యాశుల్కంలోని స్త్రీలందరి సమష్టి కృషి వల్లనే సుబ్బి పెళ్ళి ఆగింది. బుచ్చెమ్మకు చదువుకుని వ్యక్తిత్వం సంపాదించుకునే అవకాశం కలిగింది.
సమాజంలో పెద్ద మనుషులుగా, తీర్పరులుగా, ధనవంతులుగా, సంస్కర్తలుగా, న్యాయవాదులుగా పేరు తెచ్చుకున్న పురుషుల క్రౌర్యాన్నీ, లోభాన్నీ, కపటత్వాన్ని, పరిమితజ్ఞానాన్ని చిత్రించిన గురజాడ, లోకం చేత మోసగత్తెలుగా, తెలివిహీనులుగా, బలహీనులుగా, చపలురుగా, లోభులుగా పరిగణించబడే స్త్రీలలో ఈ లోకం చూడలేని సుగుణాలను ఆవిష్కరించటంతో మానవులను అర్థం చేసుకునేందుకు ఒక కొత్త దృష్టిని ఇచ్చాడు. దానితో మన చూపే మారిపోతుంది. ప్రపంచాన్ని స్త్రీల దృష్టి నుంచి కూడా చూడాలనే ఆలోచన కలుగుతుంది.
వృత్తిరీత్యా సమాజంలో అందరికీ చులకనై అందరిచేతా అసహ్యించుకోబడే వేశ్యను పాత్రగా తీసుకుని మధురవాణిగా మలచి అద్భుతంగా, మానవత్వానికే మహా ప్రతీకగా ప్రతిష్టించారు. నాటకంలో అతి మంచి పాత్ర సౌజన్యారావు పంతులికి కూడా మధురవాణి మంచితనం ముందూ, ఆమె మాటల్లోని చమత్కార మాధుర్యం ముందూ, వ్యంగ్య వైభవం ముందూ తలవంచక తప్పలేదు. సమాజంలోని ఒక వికృత ఆచారం కన్యాశుల్కం. మరొక వికృతం వ్యభిచారం. ఒకటి వివాహ వ్యవస్థ లోపలిది. మరొకటి వెలుపలిది. రెండూ నాణేనికున్న రెండు వైపులు. రెండింటిలోనూ హింసకూ, అణచివేతకూ, దోపిడీకి గురయ్యేది స్త్రీలే. ఆ స్త్రీలు ఆ హింస నుంచి బైటపడాలంటే ఒకరికొకరు సహకరించుకోవాలి. పురుషుల మధ్య సహకారం సోదరత్వ భావనలను గ్లోరిఫై చేసే సమాజం స్త్రీల మధ్య సహకారాన్ని సోదరీ భావననూ ప్రచారం చేయదు. వారిని విభజించి పాలిస్తుంది. ఆ విభజనలలో ఒకటి వివాహ సంబంధం లోపలున్న స్త్రీలకూ, బైటవున్న స్త్రీలకూ మధ్య జరుగుతుంది. పతివ్రతలూ, గృహిణులు ఒకవైపు, వేశ్యలూ, వ్యభిచారులు ఒకవైపు ఉంటారు. ”మంచికీ చెడ్డకీ నడుమ కంచుగోడలు” యేర్పడిపోతాయి. ఆ కంచుగోడలను పగులగొట్టుకుని ఒక స్నేహ వారధిని నిర్మించుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తూ మధురవాణిని మనముందు నిలిబెట్టారు గురజాడ. కుటుంబంలో స్త్రీలు అనుభవించే హింసనూ, అణచివేతనీ, వేశ్యావృత్తిలో స్త్రీలకుండే కొద్దిపాటి స్వేచ్ఛనూ, వారికబ్బే తెలివితేటలను, సృజనాత్మకతను చిత్రించి సమాజంలో స్త్రీల గురించి సామాన్యంగా వుండే అభి ప్రాయాలను తల్లకిందులు చేశారు. సవాలు చేశారు. ఆ సవాలు చేయటంలో ఎంత సౌందర్యం, ఎంత ప్రేమ, ఎంత స్నేహం!
కన్యాశుల్కం ఆచారానికి బలైపోయిన బుచ్చెమ్మనూ బలికాబోతున్న సుబ్బినీ, వేశ్యయైన మధురవాణి రక్షించటమే కన్యాశుల్క నాటక సారాంశం. అణచివేతకు గురైన స్త్రీలు ఒకరికొకరు తోడైతే ఆ అణిచివేత నుండి బైటపడగలరనే ఆశను కల్పించింది మధురవాణి. తనకు పేర్లుకూడా తెలియని, ఎన్నడూ చూడని సుబ్బికి, వెంకమ్మకి, బుచ్చెమ్మకి – సహాయం చెయ్యాలనే ఆలోచన ఆమెలోని మానవత్వానికి అనివార్యంగా అవ్యాజంగా కలిగిన ఆలోచనే. మధురవాణి నీతి గలిగిన మనిషి, చాలా దయ గలిగిన మనిషి. ఆమె దయకు పాత్రం కాని మనిషి కన్యాశుల్కంలో ఎవరున్నారు? మరొక మంచి పాత్ర ‘అసిరి’ తప్ప. రావప్పంతుల్ని తప్ప అందరినీ ఆమె క్షమించిందేగాని శిక్షించలేదు. వారి బలహీనతలకు నవ్వు కుందేగాని చీదరించుకోలేదు. ”ఏక నలుపుని” చూడటం చేతకాని అచ్చమైన మానవురాలు మధురవాణి.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

One Response to మానవత్వం పరిమళించే మధురవాణి

  1. వీరేశలింగం, చలం గార్లు భోగం వృత్తిని వ్యతిరేకించడం గురించి ఈ వ్యాసంలో వ్రాసాను http://sahityaavalokanam.net/?p=211

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.