బానూ ముష్తాక్‌ – స్త్రీల హక్కు స్థాపన కథలు

రాజేశ్వరి దివాకర్ల
కన్నడ ముస్లిం కథా రచయి త్రులలో బానూ ముష్తాక్‌, స్త్రీల హక్కులను స్థాపించే దిశలో మహత్తర మైన రచన లను కావించారు.

 స్త్రీల ఆస్తి హక్కు, ఇస్లాం నియమాచారాలకు వక్రభాష్యం చెప్పే పురుషులను ప్రశ్నించే హక్కు, పిల్లల జీవన భత్యానికి భర్త ఆదాయంలో భాగాన్ని అడిగే హక్కు, ఇత్యాది చట్ట సమ్మతమైన హక్కులను మహిళలకు కలిగించాలని బానూ తమ కథల్లో గట్టి ప్రయత్నం కావించారు.
బానూ ముష్తాక్‌ వృత్తిరీత్యా న్యాయ వాది. ఆమె కర్నాటక, హసన్‌ జిల్లాలో నివసిస్తుంది. 1954వ సంవత్సరంలో జన్మించిన బానూ ముష్తాక్‌ వృత్తి ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ, సామాజిక కార్యకర్తగా స్త్రీలలో చైతన్యానికీ, జాగృతికీ తమ రచనల ద్వారానూ, క్రియాశీల కార్యాల ద్వారానూ కృషిని కావిస్తున్నారు. బానూ ముష్తాక్‌, మరొక ప్రసిద్ధ ముస్లిం కన్నడ రచయిత్రి సారా అబూబకర్‌ గారితో కలసి ‘ముస్లిం స్త్రీలు సినిమాలను చూడకూడదు’ అన్న ఫత్వాకు ఎదురు తిరిగి మత పెద్దలను ప్రశ్నించారు.
బానూ ముష్తాక్‌ గారి నవల ‘హసీనా’ చలనచిత్రంగా రూపొందింది. ‘హసీనా’ అత్యుత్తమ కుటుంబ సంక్షేమ కథా చిత్రంగా జాతీయ స్థాయి బహుమానం పొందింది. బానూ ముష్తాక్‌ ‘హెజ్జె మూడిదహాది’ (అడుగువేసినదారి), బెంకి మళె (అగ్ని వర్షం), ఎదెయ హణతె(హృదయ దీపం) అనే కథాసంపుటాలను వెలువరించారు. వీరి హెజ్జెమూడిద హాది ఏడు కథల సంపుటం. అందులో రాహిలఎంబ కన్వె కథె (రాహిల అనేకన్యకథ) సరిద కార్మోడ (తొలగిన కారుమబ్బు) ”శాహిన్త మహల్‌న కల్లు చప్పడిగళు” (శాహిస్త మహల్‌ రాతిపలలు) అనేవి ముస్లిం సంవేదనలను ప్రతిబింబి స్తాయి.
‘రాహిల ఎంబ కన్య కతె’ లో ప్రధాన పాత్ర రాహిల. ఆమె పేదరికంలో మగ్గిన మహిళ. రాహిల వ్యక్తిత్వానికి ముగ్ధుడైన ప్రసాద్‌ అనే హిందూ యువకుడు ఆమెను వరిస్తాడు. వివాహం చేసుకోవాలని ముందు కొస్తాడు. కాని రాహిల మతం, కుటుంబ గౌరవం మొదలైన వాటికి కట్టుబడి అతనిని నిరాకరిస్తుంది. తన జాతి మతాలు వేరని ఆమె తనను వలచిన వాడిని దూరం చేసుకుంటుంది. తదుపరి తన మతంవాడైన అంగవికలుడు, షౌకత్‌ను వివాహమాడాలను కుంటుంది. కాని ఆమె ఇంట్లో వాళ్ళెవ్వరూ, ఆ వివాహాల్ని గురించి పట్టించుకోరు. ఇంతలో షౌకత్‌కు మరొక చోట నిక్కా జరుగుతుంది. ఇలా షౌకత్‌కు, ప్రసాద్‌కు దూరమై ఇద్దరినీ కోల్పోయి తను తీసుకున్న నిర్ణయానికి తానే నష్టపోతుంది. ఈ కథలో రచయిత్రి  ‘తనకు తానే వరుడు వలచి వచ్చినా సంప్రదాయ చట్రంలోంచి బయట పడలేక అదృష్టాన్ని కోల్పోయిన ముస్లిం యువతుల దీని స్థితిని గురించి’ చెప్పదలచు కుంది. మత బంధనాలను తెంచుకోలేని రాహిల ఆంతరంగిక సంఘర్షణను రచయిత్రి వాస్తవంగా చిత్రించారు.
‘సరిద కార్మోడ’ (తొలగిన నల్లమబ్బు) కథలో కూడా స్త్రీ అణచివేత కనిపిస్తుంది. కాని ఇందులో కొంత విప్లవం జరిగి, పురుష స్వభావంలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ఒకే ఆవరణలో విడివిడి కాపురా లుంటున్న అన్నదమ్ముల కథ ఇది. వారు తమ సంసారాలతో వేరుగా ఉంటున్నా వారందరి విధుల మీద పెత్తనమంతా పెద్దన్నయ్య చేస్తుంటాడు.
ఈ కథలోని పాత్ర ‘నవాబు’ ‘జబీనా’ ను వివాహం చేసుకుంటాడు. అతడు టాక్సీని నడుపుతూ రోజూ అనేక జంటలు సరదాగా స్వచ్ఛందంగా వ్యవహరించడం చూస్తుం టాడు. తాను కూడా తన భార్య జబీనాతో అలా స్వేచ్ఛగా విహరించాలని తలుస్తాడు. బుర్ఖా పద్ధతిని వ్యతిరేకించే అతడు సౌందర్యం ఉన్నది కనులారా చూసి ఆనందించడానికే అని తలచిన సౌందర్యారాధకుడు.
నవాబు భార్య జబీనా అందమైన కేశరాశిని కలిగి ఉంటుంది. ఆమెకున్న పొడవాటి అందమైన జుట్టును చూసి ‘నవాబు’ పెద్దన్నయ్య భార్య అసూయపడి, ‘జబీనా’ మీద అపనిందలు వేస్తుంది. భర్తతో లేనిపోనివన్నీ కల్పించి చెప్తుంది. భార్య మాటలు విని ‘నవాబు’ను పెద్దన్నయ్య, జబీనాను గురించి హెచ్చరిస్తాడు. ఒకసారి ‘జబీనా’ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆ సమయాన్ని అదునుగా తీసుకుని పెద్దన్నయ్య ‘నవాబు’కు మళ్ళీ పెళ్ళి చేయాలని పథకం వేస్తాడు. కాని భార్య అందాన్ని ఆరాధించే నవాబుకు ఈ తతంగం ఇష్టం ఉండదు. సరిగ్గా నిక్కా సమయానికి ‘ఈ నిక్కా నీకు సమ్మతమేనా అని మౌల్వీ అడిగిన ప్రశ్నకు, వెంటనే ”యహ్‌ నిక్కా మైనే ఖుబూల్‌ నై కియా” దీనికి నేను సమ్మతించను అని నవాబు గట్టిగా తన ప్రతిక్రియను వ్యక్తం చేస్తాడు. ఈ విధంగా స్వతంత్రతను చూపడమే కాకుండా అన్న సర్వాధికార ధోరణిని ధిక్కరిస్తాడు. ఈ కథలో భౌతికమైన రూపం వల్ల జబీనాకు కలిగిన కష్టాలను రచయిత్రి లైంగిక పరామర్శతో నిరూపిం చారు. జబీనా రూపమే ఆమె గెలుపుకు కారణమైన అంశాన్ని కూడా రచయిత్రి అంతర్లీనం కావించారు. కుటుంబంలో పెద్దన్నయ్య నిరంకుశత్వాన్ని ధిక్కరించిన నవాబు అంతరంగ పరిణామాన్ని కూడా బానూ గాఢమైన తీర్పుతో పరిష్కరించారు. ఈ కథలో నవాబుకు భార్యపట్ల గల చెదరని ప్రేమ పురుష ప్రవృత్తిలోని నూతన అంశాన్ని ఆవిష్కరిస్తుంది.
ఇక ‘శాయిస్త మహల్‌న కల్లు చప్పడిగళు’ కథలో ఇఫ్తికార్‌ అహ్మద్‌ ప్రేమ అనే నాటకంతో స్త్రీలను మోసగిస్తాడు. బయటకెంతో పవిత్రునిలా నటిస్తూ లోలోపల మాయలను పన్నుతుంటాడు. పైపైకి తన భార్య అయిన ‘శాయిస్త బాభీ’ని ప్రశంసిస్తూ, ఆమెనొక ఆటబొమ్మలా ఆడిస్తుంటాడు. ‘శాయిస్త బాభీ’ అమాయకమైన గృహిణి. సేవా మనోభావం కలిగినది. ఆమెను కేవలం కాముక దృష్టితో చూచే ఇఫ్తికార్‌, ఆమె అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సంతానాన్ని కనే యంత్రంలా మారుస్తాడు. చివరకు శాయిస్తా చనిపోతుంది. మరో నిక్కా చేసుకున్న ఇఫ్తికార్‌ కొత్త భార్యను గురించి తన స్నేహితుడైన ‘ముజాహిద్‌’తో తాను రెండవ నిక్కా చేసుకున్నది కేవలం పిల్లల సంరక్షణ కోసమేనని చెప్తాడు. కాని ముజాహిద్‌కు వాడి గుట్టు తెలుసు. అందుకనే వ్యంగ్యంగా ”ఔనౌను,” ఈమె పిల్లల్ని బాగా చూసు కుంటుంది. ఆ విషయం తెలుస్తూనే ఉంది కదా! ఇఫ్తికార్‌ నువ్వేం చేసినా చెల్లుతుంది. కాని ‘శాయిస్త’ ముందు చెప్పిన కపట డైలాగులు మాత్రం ఈమె ముందు చెప్పకు. నీవు ‘శాయిస్త మహల్‌’ను కట్టించకపోయినా ఫరవాలేదు. ఆమె గోరి చుట్టూ రాతిపలకల్ని వేయించి బందోబస్తు చేయించు. ఒకవేళ నీవు శాయిస్త మీద చూపించిన ప్రేమ తీక్షణత్వాన్ని ఆమె కనుక మరచిపోకపోతే ఆమె లేచి వచ్చేసే ప్రమాదం ఉంది. అప్పుడు నీకు చాలా కష్టం అవుతుంది.. అంటాడు. ఇలాంటి ఇఫ్తికార్‌ పురుషబుద్ధిని నిరూపించడమే ఈ కథా వృత్తాంతం. ఈ కథలో బానూ గారు ఇస్లాం సంప్రదాయంలో మితిమీరి పిల్లల్ని కనడం, దాని మూలంగా స్త్రీకి కలిగే భౌతిక పీడన, అధిక సంతానాన్ని తప్పించలేని పరిస్థితులు, స్త్రీల నిస్సహాయతలను దయనీయంగా చిత్రించారు.
బానూగారి రెండవ కథా సంకలనం ‘బెంకిమళె’లో కేవలం తమ హక్కులను గురించి తెలియక అణచివేతకు గురియైన స్త్రీలే కాకుండా, వాటిని తెలుసుకుని తమ గొంతు విప్పి మాట్లాడే యువతులు కనిపిస్తారు. పురుషుల ఆలోచనలకు విరుద్ధంగా తమ ఆశయాలను వారు తెలుపుతారు. ఈ కథలన్నీ స్త్రీ పాత్ర ప్రాధాన్యమున్నవి కాకపోయినా, వీటిని చదివాక మన మనస్సుల్లో మిగిలేవి, తమలోని సుగుణంతో మనను ఆకట్టుకునే స్త్రీ పాత్రలే. మరొక విశేషం ఏమిటంటే ఈ రచయిత్రి తమ కథల్లో పరంపరాగతంగా వస్తున్న ‘స్త్రీకి స్త్రీయే శత్రువు’ అన్న నానుడిని రూపుమాపి, సాటి స్త్రీ కష్టాన్ని తీర్చే మహిళా పాత్రలను సృష్టించారు. ఆ పాత్రలు పరస్పరం చూపిన సోదరీ బాంధవ్యం ఎంతో ఉదాత్తమైనది.
బానూ ముష్తాక్‌ గారు ‘బెంకిమళె’ (అగ్నివర్షం) అన్న కథలో పిత్రార్జితంలో ఆడపిల్లకు కూడా హక్కు ఉందన్న అంశాన్ని తెలియజేస్తారు. ‘శరీయత్‌’లో ధర్మప్రకారం తండ్రి ఆస్తిలో కూతురుకు కూడా పాలుందని రాసి ఉంది. కాని నిజానికి ఆ హక్కు స్త్రీలకు వంచితమైంది. ఈ కథలో తండ్రి ఇచ్చి వెళ్ళిన ఆస్తిని అడగడానికి స్త్రీ భయపడు తుంది. ఆమె భర్త మాటలను ఒప్పజెప్పిన చిలుకలా కనిపిస్తుంది. ఎటువంటి గతీలేని సోదరికి భాగాన్నివ్వాలన్న కనీస మానవత్వం కూడా  చూపని  పురుషుల  ముందు                 మత గ్రంథం చెప్పిన మాట వెనక్కి జారు కుంటుంది.
ముస్లిం సముదాయంలో బహుపత్నీ త్వం అందరూ అంగీకరించిన విషయం. పురుషులకున్న ఈ హక్కుతో పాటు వారికి కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. కాని ధనవంతులు, ధర్మపెద్దలు, మొత్తానికి పురుష జాతి అంతా హక్కులను మాత్రం ప్రచారం చేసి, వాటిని తమ స్వార్ధానికి ఉపయోగించు కుని, బాధ్యతలను జనుల దృష్టికి తేవటం లేదనే విషయాన్ని బానూ ముష్తాక్‌ ‘కరినాగరగళు’ (నల్లత్రాచులు) కథలో చెప్పారు. తామనుసరిస్తున్న మత గ్రంథంలో పేర్కొన్న కొరతలేవీ తనకు లేకపోయినా తనను విడిచి భర్త మరొక వివాహం చేసుకోడం అపరాధం అనే ఆలోచన ‘ఆశ్రఫా’కు ‘జులేఖా’ వల్ల కలుగుతుంది. అతడు మరొక వివాహం చేసుకున్నా ‘శరీయత్‌’ ప్రకారం ఇద్దరినీ పోషించవలసిన బాధ్యత వాడికుంది. జీవిత భత్యాన్ని భర్త నుండి పొందవలసిన హక్కు తనకుందని ఆశ్రఫా తెలుసుకున్నాక, న్యాయాన్ని ప్రశ్నించే నిర్ధారణకు వస్తుంది. ఇలా ఆశ్రఫా మొదట తనకున్న హక్కులను గురించి తెలియని అమాయకురాలవడం, అందువల్ల నిస్సహ యంగా ఉండడం, తదుపరి వాటిని తెలుసు కుని ప్రశ్నించే స్థాయికి ఎదగడం అన్న పరిణామాలను రచయిత్రి తెలియజేసారు.
‘బెంకిమళె’లోని కథలు సంతానోత్పత్తి క్రియపై స్త్రీ కుండవలసిన స్వేచ్ఛ స్వాతంత్య్రా లను కూడా తెలుపుతాయి. సంప్రదాయ చట్రంలో స్త్రీకి ఆమె దేహం మీద ఎటువంటి నియంత్రణా ఉండదు. గర్భం, ప్రసవం వంటివి ఒకదాని తదుపరి మరొకటి ఆమెను నలిపి వేస్తుంటాయి. ఇటువంటి కష్టాలకు మతవిశ్వాసం కూడా తన వంతు మంట రగుల్చుతుంది. ‘జన్నత్‌’ దొరుకుతుందో లేదో కాని ఈ ప్రసవం, బాలెంతతనాల నరకం నుంచి విముక్తి దొరికితే చాలుననుకుని, సంతాన నిరోధక శస్త్రచికిత్సను పొందాలని ‘అమీనా’ ‘కరినాగరగళు’ కథలో తీర్మానించు కుంటుంది. అమీనా లాంటి పాత్రల ప్రాతి నిధ్యంతో ముస్లిం స్త్రీల గళాన్ని విప్పిస్తారు బాను ముష్తాక్‌. ఇలా ముస్లిం స్త్రీలు స్వేచ్ఛాభావాలను పూనడం ఒక ఐతిహాసిక మైన విషయమేనని భావించాలి. ముస్లిం స్త్రీలకు మెల్లమెల్లగా మొదట రాళ్ళను, ముళ్ళను దాటి అడుగువేసే పద్ధతి నేర్పి భావితరాల యువతులకు సుగమమైన మార్గాన్ని చూపాలన్న ధ్యేయాన్ని బానూ తను సృష్టించిన పాత్రల ద్వారా నిరూపిస్తారు.
 బానూ తన కథల్లో పురుషుల, స్త్రీల ఆలోచనలు భిన్నంగా ఉంటాయని, ఆ భేదాన్ని స్పష్టం చేశారు. పురుష జగత్తు అధికారం కోసం జనప్రియత కోసం, అహంతో నిరంతరం తహతహలాడుతుంది. స్త్రీ జగత్తు వ్యక్తిగత సంబంధాల కోసం, ఆత్మీయత, ప్రేమలకోసం అలమటిస్తుంది అన్న మూలాంశం ఈ సంపుటంలోని కథల్లో వ్యక్తమౌతుంది. బెంకిమళె కథల్లో ముతవల్లిసాబ్‌, కరినాగర కథలో యాకూబ్‌, ముతవల్లి పాత్రలు, అదే కథలో అరీఫ్‌, జులేఖా, వసీమ్‌ల పాత్రలు పై ప్రవర్తనలకు నిదర్శనమౌతాయి.
 ‘కరినాగర’ కథలో ‘నీవు భిక్షను కాదు న్యాయాన్నడుగు. న్యాయం ఎవ్వరికి దొరుకుతుందో తెలుసా..? జుట్టు పట్టుకుని అడిగేవాళ్ళకు మాత్రమే దొరుకుతుంది అని జులేఖా అంటూ… ‘ఆ ముతవల్లి అనేవాడిని చెప్పుదెబ్బకొట్టి అడుగు’ అంటూ జులేఖా ఆశ్రఫాకు తెలివిని కలిగిస్తుంది. ఈ మాట ముస్లిం సమాజ వికృత రూపాన్ని, స్త్రీలు విజయం పొందాలంటే కావలసిన సాధనాలేమిటి? సిద్ధతలేమిటి? అన్న విషయాన్ని కూడా నిరూపిస్తాయి.
 ‘బెంకిమళె’ కథా సంకలనంతో కొన్ని స్త్రీ పాత్రలు తమ హృదయైశ్వర్యంతో తళతళలాడుతాయి. ‘బెంకిమళె’ కథలో తన ఆడబిడ్డ కోసం పరితపించిన అరిఫా, అర్ధరాత్రి మసీదులో కూచున్న ఆశ్రఫాకు చీకటిమాటున నుంచుని రొట్టి నివ్వడానికి యత్నించిన అమీనా, ‘కరినాగరగళు’లో చనిపోయిన శిశువును మసీదులోనే విడిచి వచ్చిన ఆశ్రఫాను, పిల్లలను ఆదుకున్న వీధి మహిళలు, శవాలకు శాస్త్రబద్ధంగా స్నానం చేయించే ‘గస్సాలిన్‌’ వృత్తిని చేస్తున్న ‘మరియమబీ’ ఆకలిని గుర్తించి ఆదుకున్న వంటమనిషి, చిరిగిన చీరను విప్పి తన చీరను కట్టుకోమన్న ఆదమ్‌ సాబ్‌ భార్య, ‘కెంపులుంగీ’ కథలో పేదపిల్లలకోసం ఏర్పాటుచేసిన ‘ఖత్ర’ జరిగిన తీరును చూసి, వాళ్ళకోసం ఆతురతను చూపి తన పిల్లాడికి వచ్చిన బట్టల్లోనే ఒక్కదాన్ని తీసి దానం చేసిన రజియా, ఇలా అనేకమంది స్త్రీల ఔదార్యం మనకు కనబడుతుంది. వాళ్ళందరూ సహాయం చేసించి తమ చుట్టాలకు పక్కాలకు కాదు. కనీసం తెలిసినవాళ్ళకైనా కాదు. వాళ్ళు కేవలం తోటిమనుషులకు సాయం చేసినవాళ్ళు. ఇలాంటి హృదయ సంస్కారం చదువుల కంటె గొప్పదని రచయిత్రి చెప్పదలచారు.
 బానూ ముష్తాక్‌ గారి కథల్లో స్త్రీలందరూ శ్రమజీవులు. తమ పొట్టకూటికోసం పాచిపనులు, కూలినాలి చేసుకుని జీవించే స్త్రీలు, కుటుంబ జంజాటంలోనే నిరంతరం మునిగిపోయిన వాళ్ళు, ఇత్యాదిగా వైవిధ్యమయంగా కనిపిస్తారు. వీరు మొట్టమొదటిసారిగా శవాలకు స్నానం చేయించే ‘గస్సాలిన్‌’ స్త్రీని ‘దేవరు మత్తు అపఘాత’ (దేవుడు మరింత అపఘాతం) అన్న కథలో పరిచయం చేసారు. ఈ స్త్రీలందరూ కాకున్నా కొందరైనా ధైర్యం కలిగి తదితరులను అన్యాయానికి విరుద్ధంగా పోరాటానికి తయారుచేయడం, స్త్రీలు ఒకరి బాగును మరొకరు కోరుకోడం వంటివి గమనించదగిన అంశాలు. ‘కరినాగరగళు’ కథలో జులేఖా అరీఫాలో జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది. ఆమెలో పోరాటాగ్నిని రగులుస్తుంది. మసీదులో జరిగిన అన్యాయాలను సందుగొందుల్లోంచి భయం భయంగా చూస్తున్న స్త్రీలలో అరీఫా ప్రతిఘటన కొత్త శక్తిని కలిగిస్తుంది. ఎవరిని చూసి ఇంతకు మునుపు ముసుగు సరి చేసుకుని వెళ్ళేవారో, వారినే మాటలతో ఎదిరించే ధైర్యాన్ని చూపుతారు. ఇలాంటి స్త్రీ సంఘటిత చైతన్యం బానూ గారి కథల్లో ఒక కొత్త ప్రయోగం బానూ ముష్తాక్‌ స్త్రీవాద లేఖకి, తమ వర్గ సముదాయంలోని వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా చిత్రిస్తూనే, లోటుపాట్లను వేలెత్తి చూపుతారు, సారా గారు మళయాళీ నేపథ్యంలోంచి వచ్చిన ముస్లిం మహిళగా, తాను పుట్టిన కాసరగూడు తీరప్రాంతంలోనే బడుగు ముస్లిం మహిళల వ్యధలను గాథలుగా చిత్రించారు. బానూగారు అందుకు విరుద్ధంగా కన్నడదేశంలో ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబ జీవితాన్ని గురించి, స్త్రీల జీవన ప్రమాణాలను గురించీ, ఆసక్తికరంగా నిబద్ధంగా చిత్రించారు. కాని వీరిద్దరూ కూడా ముస్లిం స్త్రీలు ఎదుర్కొనే సమస్యలకు మతగ్రంథాల ద్వారానే పరిహారం చూపడానికి యత్నించారు. ‘హక్కు దార మొరెయిట్టల్లి బెంకి సురిదీతు’ అన్నది ధార్మిక వాక్యం. ‘హక్కుదారుడు గొంతెత్తితే అగ్ని వర్షిస్తుంది’ అన్నట్టుగా ‘న్యాయాన్ని కలిగించు లేదా దాని పరిణామాన్ని అనుభవించు’ అని స్త్రీ దాడి చేస్తుంది. ఈ సూత్రం బానూగారి కథాసంపుటాల్లో స్త్రీల హక్కు స్థాపన చేయిస్తాయి.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో