ఫీమెల్ యూనక్

– పి. సత్యవతి

“ఏప్రిల్ యాష్లే” పుట్టింది మగ పుట్టుకే. అతని శరీర నిర్మాణం అంతా పురుష శరీర నిర్మాణమే. అయితే వచ్చిన చిక్కేమిటంటే అతనికి పురుషుడిగా వుండడం ఇష్టం లేదు. స్త్రీగా బ్రతకాలని చచ్చేంత కోరిక. అట్లా అని స్త్రీల పట్ల వ్యామోహమూ లేదు. పోనీ స్వలింగ ప్రేమ అంతకన్నా లేదు. అతని గోలంతా ఏమిటంటే తను స్త్రీ కావాలి. సుకుమారమైన వలువలు ధరించాలి. నగలూ వగలూ కావాలి. మొహానికి మేకప్ వేసుకోవాలి. స్త్రీలు ధరించే ఫర్కోట్లు ధరించాలి. పురుషుని కౌగిట్లో రక్షణ పొందాలి. భద్రంగా బ్రతకాలి. ఈ కోరికలతో అతను వేగిపోయాడు. పిచ్చెక్కిపోయాడు. ఒక్కొక్కసారి స్త్రీలాగా దుస్తులు ధరించేవాడు. ఈ తీవ్రమైన కోరికని తట్టుకోలేక ఆత్మహత్యకి కూడా ప్రయత్నించాడు. చివరికి కాసబ్లాంకాలో అతనికి ఒక వైద్యుడు అభయమిచ్చాడు. అతని పురుషాంగాన్ని కోసివేసి ఆ స్థానంలో యోనిని నిర్మిస్తానన్నాడు. విపరీతమైన హార్మోన్ ట్రీట్మెంట్ ద్వారా అతని మొహం మీద వెంట్రుకలు మొలవకుండా నిరోధించారు. చిన్న చిన్న వక్షోజాలు కూడా మొలిపించారు. గర్భధారణ శక్తి అయితే వుండదు గానీ స్త్రీగా కొనసాగవచ్చని చెప్పారు. పొంగిపోతూ ఇంగ్లండ్ వచ్చింది.”ఏప్రిల్ యాష్లే”… శిరోజాలు పెంచింది. అందంగా హుందాగా, తనని తనే సమ్మోహన పరిచే విధంగా తయారయింది. మోడలింగ్ చేసింది. అంతవరకూ బాగానే వుంది. అయితే ఒక దుర్ముహుర్తాన డబ్బూ, హోదా వున్న ఆర్ధర్ కార్బెట్ని పెళ్ళి చేసుకుని ‘స్త్రీ’ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. అక్కడే అసలు సంగతి బెడిసి కొట్టింది. ఆమెలో శృంగార వాంఛ కలగలేదు. వివాహం జయం కాలేదు.

“న్యాయం ప్రకారం “ఆమెకు” విడాకులు అయిపోయాయి. ఏప్రిల్ సంగతి పక్కన పెడదాం. స్త్రీల లైంగికతకి “మూస పాత్రలే నిర్వచనమైతే వారికి జరిగేది కూడా ఇదే. వాంఛారహితమైన శారీరక సంబంధానికి తల వొగ్గే స్త్రీల పరిస్థితి కూడా ఇదే. ఏప్రిల్ కూడా స్త్రీయే. స్త్రీ లైంగికత పొందలేని స్త్రీ. మనం దానిని కోల్పోయిన స్త్రీలం. ఏప్రిల్ మన సోదరి మన నష్టానికి సంకేతం”

సెకండ్ వేవ్ ఫెమినిష్ట్ సాహిత్యంలో చెప్పుకోవాల్సిన గ్రంధాలలో ముందుండేది జర్మెన్ గ్రీర్ వ్రాసిన “ద ఫీమేల్ యూనక్” అందులో గ్రీర్ మాటలివి.

స్త్రీల లైంగికత గురించి విసృతంగా చర్చించిన ఈ పుస్తకం ఎప్పటికీ కాలానుగుణ్యత కోల్పోదని చదివితే తెలుస్తుంది. “యూనక్” అంటే నపుంసకుడు. పుంస్త్సం లేని వాడని చెప్పుకుంటాం. పుంస్త్సానికి సరిపోయే స్త్రీ లింగ పదమేమిటో నాకు దొరకలేదు. లైంగికత కోల్పోయిన స్త్రీ అంటాను. మానవ సహజసిద్ధమైన లైంగిక వాంఛలకి చిన్నప్పటి నుంచీ సంకెళ్ళు వేసుకున్న వ్యక్తిగా చివరికి లైంగికతనే కోల్పోయిన వ్యక్తి.

మొదటినించీ ఆమెని “స్త్రీ” గా తయారు చేయడంలో జండర్ వహించిన పాత్ర ఆమె సహజ శక్తులని, వాంఛల్నీ చిదిమేసి, ఆమెనొక సుకుమార, సుందర శిల్పంలా, ఒక యంత్రంలా మలిచింది. తన శక్తి యుక్తుల్ని తిరిగి పొందగలిగితేనే గానీ ఆమె పరిపూర్ణ మానవిగా స్వతంత్య్ర జీవిగా బ్రతకలేదు.

చదువూ, సంపాదనా రాజకీయ పౌరహక్కులూ, ఎంత అవసరమో, స్త్రీకి తన లైంగికతను తాను గుర్తెరగడమూ అంతే అవసరం అని గ్రీర్ వాదించి వొప్పిస్తుంది.

1970 లో మొదటిసారి వెలువడిన ఈ పుస్తకం అప్పటిలో ఎంతో సంచలనం సృష్టించింది. ఎన్ని ప్రశంశలో అన్ని తీవ్ర విమర్శలనెదుర్కుంది. తరువాత అనేక పునర్ముద్రణలు పొందింది.

1999 లో ముద్రించిన ఎడిషన్కి ఆమె వ్రాసిన ముందు మాటలో ఇలా అంటుంది… “ఇరవై సంవత్సరాల క్రిందట నేను స్త్రీలకి వ్యక్తులుగా జీవించే స్వేచ్ఛ కావాలని ఆకాంక్షించాను. వ్యక్తిత్వం అంటే హూందా తనం, నిజాయితీ, ఉదాత్తత, సమస్థ జీవనవాంఛలు కలిగి వుండడం… పరిగెత్తడానికి, మాట్లాడడానికి, అరవడానికి, తనకి సౌకర్యం కలిగించే భంగిమలో కూర్చోడానికి, మనం నిలబడిన నేలను, నీటిని, సకల జీవుల్ని ప్రేమించడానికి, నేర్చుకోడానికి, బోధించడానికి స్వేచ్ఛ కలిగి వుండాలని, క్షుద్బాధలు లేని ప్రపంచంలో, భయంలేని జీవితం మనకి కావాలని కోరుకున్నాను.

వాక్ స్వాతంత్య్రం, మన నమ్మకాలపై మనకి నమ్మకం గల జీవిత విధానాన్ని అభిలషించాను. కానీ, ఇంకా అనేకమంది స్త్రీలు క్షుద్భాధ భరిస్తూనే వున్నారు. ఏదో ఒక భయంతోనే బ్రతుకుతున్నారు. ఇంకా హింసకి గురౌతూనే వున్నారు. మూగవేదన అనుభవిస్తూనే వున్నారు. మతమో మరొకటో ఏవో సంకెళ్ళతోనే వున్నారు. ముసుగుల వెనక మగ్గుతున్నారు. నేనప్పుడు ఈ పుస్తకంలో పేద మహిళల్ని గురించి చర్చించలేదు. ఎందుకంటే అప్పటికింకా వారిని నేను సన్నిహితంగా చూడలేదు. పేద మహిళలు ఏదైతే స్వేచ్ఛ అని భావిస్తున్నారో ఆ సంపన్న మహిళల అధీనత గురించి వ్రాశాను.

1989-90లలో కమ్యూనిజం పతనం పేద స్త్రీల జీవితాలను అతలాకుతలం చేసి అదఃపాతాళంలోకి విసిరేసింది. పిల్లల పరిరక్షణ, పెన్షన్లు, వైద్య సౌకర్యాలు, ఉద్యోగ భద్రత అన్నీ పోయాయి. వారు పనిచేసే వైద్యశాలలు, విద్యాలయాలు మూతపడ్డాయి. కానీ ఎవరూ నోరు తెరవలేదు. వారికి వాక్ స్వాతంత్య్రం వుంది, కానీ వాక్కే లేదు. అత్యవసర సేవలు కొనుక్కునే స్వతంత్య్రం వుంది, కానీ కొనుక్కోవడానికి డబ్బే లేదు. అతి పురాతన ప్రయివేటు సేవ అయిన వ్యభిచారం చేసే స్వతంత్రం వుంది. వినిమయ సంస్కృతితో శారీరక, మానసిక, ఆత్మిక వ్యభిచారం చేసే స్వతంత్య్రం వుంది. ఆకలితో మాడే స్వతంత్య్రం వుంది. అడుక్కునే స్వతంత్య్రం వుంది. ఇప్పడిదాకా మనం ప్రపంచంలో ఫీమేల్ యూనక్లు వుండకూడదని, వారు లేని ప్రపంచాన్ని సృష్టించాలని ఆశపడ్డాం. కానీ ఇప్పుడామె సర్వాంతర్యామి. ఎక్కడ నీలిరంగు జీన్స్ప్యాంట్లు, కోకాకోలాలుంటాయో, ఎక్కడ రంగులు, లిప్స్టిక్లుంటాయో, ఎక్కడ ఎత్తుమడమల జోళ్ళు, బ్రాసరీలుంటాయో, అక్కడక్కడ ఆమె వుంటూనే వుంటుంది.

ప్రపంచీకరణ, వ్యాపార వినిమయ సంస్కృతి స్త్రీ జీవన సారాన్ని పీల్చి పిప్పి చేసి ఎంత అశక్తురాల్ని చేస్తోందో ఆవేదనతో చెప్పింది. దానికి ఇంతకాలం జండర్ కండిషనింగ్ ఎట్లా దోహదం చేసిందో ఆవేదనతో చెప్పింది జర్మేన్.

ఈ పుస్తకాన్ని ఆమె అయిదు అధ్యాయాలుగా విభజించింది. స్త్రీ శరీరం, ఆత్మ, ప్రేమ, ద్వేషం, విప్లవం.

“స్త్రీ తన లిబిడో నుంచీ, నైపుణ్యాల నుంచీ తప్పించబడింది. ఉదాహరణకి సేద్యం చేసే యజమానికి బాగా ఉపయోగపడ్డం కోసం, ఆ సేద్యానికి ఉపయోగించుకునే జంతువుల్ని నిర్వీర్యం చేస్తారు. అప్పుడవి పొగరు తగ్గి చెప్పినట్లు నడుచుకుంటాయన్న మాట. అట్లాగే స్త్రీల క్రియాశీలతనీ, శక్తినీ తుంచివేశారు. స్త్రీలు నాజూకుతనం ముసుగుతో తమ జీవశక్తిని త్యాగం చేశారు” అంటుంది. ఈ పుస్తక సారాంశాన్ని విపులంగా చెప్పుకునే ముందు ఆమె గురించి తెలుసుకోవాలి గదా!

జర్మేన్ గ్రీర్ ఆస్ట్రేలియాలో 1939 లో జన్మించింది. ఆంగ్ల సాహిత్యంలో షేక్స్పియర్ సుఖాంత నాటకాల మీద పరిశోధన చేసి అనేక విశ్వవిద్యాలయాలలో ఆచార్య పదవి నిర్వహించింది. నిష్కర్షగా, నిర్మొహమాటంగా మాట్లాడ్డం, సంచలనాత్మక వ్యాఖ్యలు చెయ్యడం బాగా అలవాటు. 1970 లో ఈ పుస్తకం వెలువడ్డ తరువాత ఆమె అనేక రచనలు చేసింది. సెక్స్ అండ్ డెస్టినీ, డాడీ వుయ్ హార్డ్ లీ న్యూయూ, ద హోల్ వుమన్ మొదలైనవి. ప్రపంచంలో విస్తుృతంగా పర్యటించింది. బంగ్లాదేశ్ , భారతదేశాలకు కూడా వచ్చింది. సెకండ్ వేవ్ ఫెమినిజంలో గట్టిగా వినిపించిన గొంతు. ఇంక ఫీమేల్ యూనక్లో ఆమె చర్చకు పెట్టిన అంశాలను గురించి చెప్పుకుందాం…
(సశేషం)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.