గది లోపలి గోడ

అబ్బూరి ఛాయాదేవి
 కవిగా సాహిత్యరంగ ప్రవేశం చేసి, ఇప్పుడు కథకుడిగా కూడా సాహిత్య ప్రస్థానం చేస్తున్న శ్రీ పలమనేరు బాలాజి సహృదయుడు, సంస్కారి, కష్టజీవుల సమస్యలపట్ల సదవగాహన ఉన్న రచయిత.
 బాలాజి ప్రథమకథా సంపుటి అయిన ఈ ‘గదిలోపలి గోడ’ కథాసంపుటిలో 19 కథలున్నాయి. వాటిలో సగం వరకూ సమాజంలో వివిధ ప్రాంతాల్లో వివిధ కులాల మధ్యా, వర్గాల మధ్యా జరుగుతున్న సంఘర్షణల గురించీ, పేదవారికీ, నిమ్న కులాల వారికీ జరుగుతున్న అన్యాయాల గురించీ, వారిలో కొందరిలో వస్తున్న చైతన్యం గురించీ రాసిన కథలు, తక్కిన కథల్లో చాలావరకు కుటుంబంలోనూ, సమాజంలోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాసినవి.
 మానవీయతకీ అమానవీయతకీ తేడా ఏమిటో కళ్ళకి కట్టినట్లుగా చూపించేకథ – ఒక అమానవీయుడి నోటితో చెప్పించిన కథ ‘కొందరలా’ – ప్రయోగాత్మకంగా ఉంది.
 ‘అదృశ్యమవుతున్న జాతి’ అనే కథలో కథానాయకుడు తన స్నేహితుడితో అంటాడు – ”… అంతరించిపోతున్న అరుదైన జాతుల్లో మనం కూడా వున్నాం రా. మనిషి తాలూకు స్వేచ్ఛ, ప్రేమ, మానవత్వం అంతరించిపోతున్నాయి…” అని!
 కుల వివక్ష గురించీ, దైవభక్తితో కులాలన్నీ ఒకచోటికి చేరే ఆచారం గురించీ రాసిన కథ ‘మునిదేవర’ ”ఎవరో పై కులపోళ్ళు కింది కులాల్ని నీచంగా చూస్తారంటే అది వేరే విషయం. ఎస్‌.సి.లు, ఎస్‌.టి.లు, బి.సి.లు కూడా వెనుకబడిన సాటికులపోళ్ళని తక్కువగా చూడ్డం మంచిదేనా?”… ”మా కులం ఇదని గొంతు విప్పి చెప్పుకోవటం కూడా అదేదో తప్పు చేస్తున్నట్లు భయపడి పోతావుంటాం కాలేజీల్లో. మీరంతా మారాలన్నా, మీరు మాత్రమే కాదు, అందరూ మారాల”. అనే సందేశాన్నిస్తుందీ కథ.
 ఒక దళితుడు పంచాయితీ సర్పంచ్‌ అయినా, అతన్ని ఆ ఊరిపెద్ద ఎంత నీచంగా చూస్తాడో, అతను దళితులకు అన్యాయం జరిగి చర్య తీసుకోబోతూంటే ఆ దళితుడు ధైర్యంగా ఎదురు తిరగాలని ఎలా నిశ్చయించుకుంటాడో సూచన ప్రాయంగా చెప్పిన కథ ‘చప్పుడు’. అతను తిరుగబాటు చేశాక జరిగే పరిణామాలగురించి మరో కథ రాయొచ్చు. అదే అసలు కథ అవుతుంది!
 ”రాజకీయ నాయకులు కూడా తప్పు చెయ్యాలంటే భయపడే విధంగా వ్యవస్థ తయారైన రోజు అట్లాంటి నాయకుల కథ కూడా ముగిసిపోతుందండి. అంతవరకూ మీరందరూ అన్యాయానికి వ్యతిరేకంగా నిర్విరామంగా పోరాటం చెయ్యాల్సిందే…” అని ఒక పాత్ర ద్వారా సూచిస్తాడు రచయిత ‘ధర్నా’ అనే కథలో.
 ఈ రోజుల్లో కాన్వెంట్‌ స్కూళ్ళలో టీచర్లు పిల్లల్ని శిక్షించే విధానం ఎంత కఠినంగా, అమానుషంగా ఉంటుందో, దాని వల్ల పిల్లలూ, వాళ్ళు తల్లిదండ్రులూ ఎంత మానసిక క్షోభకి గురి అవుతున్నారో చెప్పిన కథ ‘బడికి వెళ్ళే దారి’.
  నగరంలో ఆధునిక జీవన వేగంలో మధ్య తరగతి మనిషి పడే యాతన గురించి ఆలోచనాత్మకంగానూ, కొన్నిచోట్ల అధివాస్తవికంగానూ రాసిన కథ ‘రోడ్డు దాటిన వాడు’.
 అడవిలో ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్ళకి ఏనుగులజాడని పట్టిచ్చే కొలువు చేసే వాడి ‘జాడ’ తెలియజేయమని అతని భార్య చంటిబిడ్డ తల్లి ఎంత వేడుకున్నా వినిపించుకున్న వాళ్ళు లేరు. ఆశ చంపుకోలేక ఆమె భర్త కోసం వెతుకుతూనే ఉంది అని చెప్పిన కథ ‘జాడ’.
 స్త్రీల సమస్యల పట్ల అవగా హనతో, వారి పట్ల సానుభూతితో మంచి కథలు రాశాడీ రచయిత.
 పురుషాధిపత్యం గురించి విమర్శలతో, స్త్రీల హక్కులపట్ల చైతన్యంతో స్త్రీవాదం ప్రారంభమై దాదాపు మూడు దశాబ్దాలవుతున్నా, స్త్రీలు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ, గృహ నిర్వహణ బాధ్యతలు కొనసాగిస్తున్నా, చదువుకున్న పురుషుల్లో కూడా ఇంకా ఎంతోమంది కర్కోటకులు ఉంటూనే ఉన్నారనీ, స్త్రీల అవస్థలు తరగడం లేదనీ బాలజీ రాసిన ‘అంతర్దర్శనం’ వంటి కథలు నిరూపిస్తాయి. ‘అంతర్దర్శనం’ కథకి ఎవికె ఎఫ్‌ అమెరికా కథల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. ఈ కథలోని భర్త గురించి భార్య ఆలోచనలు – ”అతడి పనులు అతడు చేసుకున్నా తనకెంతో సమయం ఆదా అయ్యేది”, … ”తన పి.ఎఫ్‌ లోన్‌తో కొన్న బైక్‌ భర్త… ఒక్కడికే పరిమితమైపోయింది. దాంతో తనకూ, బండికీ మధ్య ఏర్పడిన అనుబంధం ఏదో తెగిపోయినట్లని పించింది.”… ”పెళ్ళి అయిన తరువాత డ్రెస్‌లు వేసుకోవటం బాగా లేదని సురేష్‌ తేల్చి చెప్పేసిన రోజు తను పొందిన బాధ అంతా ఇంతా కాదు.” …. ”తను ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మొగుడికి కచ్చితంగా లెక్కలు చెప్పాలని తెలుసు.”…. ”పెండ్లయిన తర్వాత తన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెల్లతో, బంధువులతో, ఆఖరికి తన స్నేహితులతో అప్పటి వరకూ ఏర్పడిన అనుబంధాలు ఎట్లా అదృశ్యమయ్యాయో ఆలోచిస్తూంటే, తాను కోల్పోయింది ఏమిటో తెలిసివస్తున్నట్లు అనిపించసాగింది.”
 ఆమె పని చేస్తున్న స్కూల్లో అటెండెంట్‌గా పనిచేస్తున్న లక్ష్మమ్మని ఒక సందర్భంలో, మొగుడు వదిలేస్తాడని భయపడుతున్నావా అని అడిగినప్పుడు, లక్ష్మమ్మ ”నా తిండి నేను తింటూ వుంటాను, నా బతుకు నేనే బతుకతా వుండాను, పోతే పోనీ, అట్లాంటి మొగుడికి భయపడాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. కాళ్ళూ చేతులు ఆడినంతకాలం నాకు బతుకు గురించి భయం లేదు అయివోరమ్మా!” అని చెప్పిన సమాధానం వినగానే కథానాయికకీ, ఆమె సహోద్యోగినికీ- ”ఇద్దరి కళ్ళలో ఏదో మెరుపు తళుక్కుమందిట”. ఇంకా ఆ లక్ష్మమ్మ వంటి వారి నుంచి స్ఫూర్తి పొందే స్థితిలోనే ఉన్నారా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న భార్యలు!! అని ఆశ్చర్యం కలుగుతుంది.
 ఈ సంపుటిలోని  మొదటి కథ స్త్రీ పరంగా ఉత్తమపురుషతో రాసిన కథ ‘సంకోచం’. స్త్రీలు ఉద్యోగం చేస్తున్నా, ఆర్థిక స్వాతంత్య్రం గాని, ఇంటి ఖర్చుల విషయంతో నిర్ణయాధికారంగాని లేకపోవడం ఇంకా ఎందరో స్త్రీల విషయంతలో కొనసాగుతోందని చెప్పడానికి ఈ కథ నిదర్శనం. భార్య ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోని కర్కోటకులైన భర్తలున్నారని ఎవరైనా స్త్రీవాద రచయిత్రులు రాస్తే, వారిని పురుషద్వేషులుగా ముద్రవేస్తారు చాలా మంది పాఠకులూ, రచయితలూ కూడా. భర్తకి ఎదరుతిరిగినట్లూ, తన హక్కులకోసం పోరాడినట్లూ రాస్తే, వారిని కుటుంబ విచ్ఛిత్తికి దారి తీసేవారుగా పరిగణిస్తారు. ఆఫీసులో ఉద్యోగినులు చీటికీ మాటికీ బాత్‌రూమ్‌కి వెడుతూంటే, తోటి ఉద్యోగులు విపరీతంగా చూడటం, స్త్రీలు బాత్‌రూమ్‌ వంక పెట్టి పని ఎగ్గొడుతున్నట్లూ, సమయం వృథా చేస్తున్నట్లూ భావించడం కూడా జరుగుతూ ఉంటుందనీ, అందుకే ఉద్యోగినులు మంచి నీళ్ళు ఎక్కువగా తాగడానికి సంకోచిస్తారనీ బాలాజి వంటి సహృదయుడైన రచయిత రాయడం హర్షించదగినదే. అయితే, ఎంతసేపూ స్త్రీలు పురుషాధిపత్యం వల్ల బాధ పడుతున్నట్లూ, ఎదిరించి భర్తలకు దూరమవుతున్నట్లూ రాస్తారేగాని, పురుషుల్లో సరియైన మార్పు వస్తున్నట్లు చూపించే కథలు స్త్రీవాద భావాలున్న పురుషులు ఎవరూ రాయడం లేదు అంతగా. అంటే, ఇంక పురుషాధిపత్యం ఎన్నటికీ పోదా?! పురుషుల్లో మార్పు రాదా?! స్త్రీలు కష్టాలు భరిస్తూనో, పోరాడుతూనో ఉండవలసిందేనా?! స్త్రీవాద ఉద్యమం కొనసాగ వలసిందేనా?!
 ‘కౌంటర్‌’ అనే కథలో ఉద్యోగం చేసే ఆధునిక గృహిణి జీవితంలోని రెండు సమస్యలు చిత్రింపబడ్డాయి. ఒకటి, బ్యాంక్‌ కౌంటర్‌ దగ్గరికి వచ్చే క్లైంట్స్‌లో ఒకళ్ళిద్దరు ఉద్యోగిని చేతివేళ్ళని స్పృశించడానికి చేసే ప్రయత్నాలు చిరాకు కలిగించడం, రెండవది, జీతం అంతా భర్త చేతికి అప్పగించవలసి రావడం, భర్త జీతం గురించి అడిగే హక్కు భర్యకి లేకపోవడం. కౌంటర్‌ దగ్గరకొచ్చి వెర్రివేషాలు వేసే యువకుణ్ణి గడుసుగా శిక్షించగలిగింది గాని, భర్తతో సర్దుకు పోవడం ఒక్కటే మార్గం అనుకుంటుంది. భర్త కూడా పాఠం నేర్చుకునేలా ఏదైనా చేసినట్లు రాసి ఉండాల్సింది రచయిత.
 ఈ సంపుటిలోని ఆఖరి కథ ‘గది లోపలి గోడ’- సంపుటి శీర్షిక కూడా ఆ కథకి పెట్టిన శీర్షికే. ఇది కూడా బహుమతి పొందిన కథ. ఇది కూడా ఒక స్త్రీ ఉత్తమ పురుషలో చెప్పినట్లు రాసిన కథ. ఎంత నిస్పృహతో నిండిన జీవితాన్నైనా ఆనందకరంగా మలచుకోవడం మన చేతుల్లోనే ఉంది, ఎంత కఠినమైన రాతి నుంచైనా తేమని వెలికి తీయడం అసాధ్యం కాదు అని చూపించే ఆశాపూరితమైన కథానిక ఇది. బావుంది. అయితే, తన ఆనందం కోసం భర్తపైన మానసికంగా ఆధారపడటంకన్న, అసలు మానసికమైన గోడల్ని సృష్టించుకోకుండా, నిస్పృహకి చోటివ్వకుండా జీవించడం ఎలాగో అర్థం చేసుకుంటే, ఆ ‘సంతృప్తి’ స్వీయశక్తితో ఎప్పటికప్పుడు ఊరుతూ ఉండే జల అవుతుంది. తనలోనే కాక, తన చుట్టూ ఉన్న వారిలో సంతోషాన్ని నింపుతుంది.
 మానవ సంబంధాల పట్ల సదవగాహనతో మంచి కథలు రాసిన పలమనేరు బాలాజికి అభినందనలు. పురుషుల ఆలోచనల్లో మార్పు తీసుకు రాగల మంచి కథలు ఇంకా రాస్తారని ఆశిస్తున్నాను.
(గదిలోపలి గోడ, పలమనేరు బాలజి. పవిత్ర, ప్రణీత ప్రచురణలు, 2009. 148 పేజీలు. ధర : రూ.60/-. ప్రతులకు : కె.ఎన్‌. జయమ్మ, 6-219, గుడి యాత్తం రోడ్‌, పలమనేరు – 517 408, చిత్తూరు జిల్లా   అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు.)

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో